Sunday, January 25, 2026

Magha Puranam 8 - మాఘ పురాణం 8 యమలోక విశేషములు

మాఘ పురాణం - 8 వ అధ్యాయం

యమలోక విశేషములు

మృగశృంగుని పట్టుదల చేతను, యముని కటాక్షము చేతను ఆ మువ్వురు కన్యలు నిద్రనుండి మేల్కాంచినటుల లేచి, వారు యమ లోకమందు చూచిన వింతలు, విశేషాలను వారి తల్లిదండ్రులకు తెలియపరిచిరి.

యమలోక మందలి జీవులు తమ పాప పుణ్యములనుబట్టి శిక్ష లనుభవించుచున్నారు. ఒక్కొక్క పాపి తాను చేసిన పాపకర్మల కెంతటి కోఠిన శిక్షల ననుభవించుచుండునో ఆ ముగ్గురు కన్యలు తమ తల్లిదండ్రులకు వివరించిరి, ప్రతి పంపిణీ ఎఱ్ఱగా కాల్చిన ఇనుప స్తంభానికి కౌగలింప జేయుదురు. సలసల కాగిన నూనెలో పడవేయుదురు. విషకీటకములున్ననూతిలో త్రోసి వేయుదురు, తలక్రిందులుగా వ్రేలాడగట్టి క్రింద మంటపెట్టుదురు, మరికొన్ని పాపజీవులను శూలాలతో పొడిచి, చిత్రహింస పెట్టుదురు, అని చెప్పుసరికి వారి తల్లిదండ్రులు భయపడి వణకిపోయిరి.

అప్పుడా కన్యలు వారిని ఓదార్చి "మీరు బయపడకుడు. ఆ నరక బాధనుండి బైటపడు ఉపాయ మొక్కటేయున్న ది, ప్రతి మానవుడు ఇహమందు సుఖముల ననుభవించి పరమందు ముక్తిని పొందుటకు మాఘమాసమందు నదీస్నానముచేయుట తనకు తోచిన దానములు ధర్మములు, జపతపములు యిత్యాది పుణ్యకార్యములు చేయుటవలన నంతకుముందు చేసియున్న పాపములన్నియు పటాపంచలై నశించుటయేగాక, స్వర్గలోక ప్రాప్తి పొందవచ్చును. గాన మాఘమాస స్నానఫలము అంత ప్రసిద్ధమయినది.

మాఘమాసమందు నదీస్నానమాచరించి నిష్కల్మష హృదయముతో ఆ శ్రీమన్నారాయణుని పూజించి శక్తికొలది దానము చేసిన, కోటి క్రతువులు చేసినంత ఫలితము కలుగును. మాఘమాస 
మంతయు పురాణపఠనము చేసినను, లేక వినినను, శ్రీహరి దయకు పాత్రులగుదురు గాన మీరు భయపడవలసిన పనిలేదు. నరక బాధలనుండి బైటపడుట, కంతకంటే సులభమార్గము మరియొకటి లేదు” అని వారి తల్లిదండ్రులకు వివరించిరి.

Shuka Syamala Devi - శ్యామల నవరాత్రులలో ఎనిమిదవ రోజు శుక శ్యామలా దేవి

శుక శ్యామలాదేవి

శ్యామల నవరాత్రులలో ఎనిమిదవ రోజు శుక శ్యామలా దేవి రూపంలో అమ్మవారిని పూజిస్తారు.
ఆమె వాక్కుకు, జ్ఞానానికి, మాధుర్యానికి అధిదేవత. చిలుక వర్ణంలో, మధురమైన మాటలు, సృజనాత్మకత, మరియు విద్యాసామర్థ్యాన్ని ప్రసాదిస్తుంది. శ్యామల నవరాత్రులలో ఈ రూపం పూజింపబడుతుంది.

శుక అంటే సంస్కృతంలో చిలుక అని అర్థం. శ్రీ శుక శ్యామల తానే చిలుకలుగా ఉనికిలో ఉన్న రూపం. చిలుకలను పోలిన శ్యామల చర్మం రంగు మనకు కనిపిస్తుంది. బ్రహ్మండ పురాణం ప్రకారం దేవి మంత్రిణి (శ్యామల) యుద్ధభూమికి వెళ్ళే ముందు తన చేతిలో ఒక చిలుకను ఎగురవేసింది.

శ్రీ శుక శ్యామల దేవి (రాజ శ్యామల దేవికి ఒక రూపం) అంటేనే జ్ఞానం మరియు యుద్ధ తంత్రాల కలయిక. ఇక్కడ 'శుక' అంటే చిలుక. పురాణాల ప్రకారం, దేవి చేతిలో ఉండే చిలుక కేవలం ఒక పక్షి మాత్రమే కాదు, అది సాక్షాత్తు ధనుర్వేదానికి (యుద్ధ శాస్త్రానికి) రూపం. యుద్ధ విద్యలకు సంబంధించిన ఉపవేదం 'ధనుర్వేదం'. ఆ విద్యే ఒక వ్యక్తి రూపంలో (లేదా పక్షి రూపంలో) వచ్చి దేవి చెంత చేరిందని అర్థం. ఇక్కడ శుకుడు (చిలుక) ఆ విద్యకు ప్రతీక.

ఆ విద్యే మూడు తలలు, నాలుగు చేతులతో విల్లు మరియు బాణాలు పట్టుకొని వున్న దివ్య పురుషుడి లాగా మారింది. ధనుర్వేదానికి మూర్తీభవించిన వ్యక్తి లాగా (చిలుక) కనిపిస్తాడు, అతను దేవికి నమస్కారం చేసి రెండు దివ్యమైన ధనుస్సులు మరియు అక్షయ తునీరం (అనంతమైన బాణాలను కలిగి ఉన్న బాణ సంచిని) అందిస్తాడు,

ఆ విధంగా శ్యామల చేతిలోని చిలుకలన్నీ వివిధ విద్యలుగా ఉంటాయి . భగవతి మాతంగికి చిలుకలంటే చాలా ఇష్టం. ఎందుకంటే కాళిదాసు కూడా తనకు ఎంతో దగ్గరగా ఉండే తన పెంపుడు చిలుకలతో ఆడుకుంటూ ఎప్పుడూ ఆనందంగా ఉంటుందని వివరిస్తాడు. చిలుక గురువు నేర్పిన విధంగా విద్యను పునరావృతం చేయడానికి ఒక విద్యార్థి యొక్క వాక్ ప్రసంగం మరియు విధేయత మరియు నైపుణ్యాన్ని సూచిస్తుంది, అందువల్ల శుక శ్యామలా దేవి వాక్ శక్తి మరియు అన్ని విద్యలను నేర్చుకోవడంలో ఆమె గురు మూర్తి, శుకుడు ఈ దేవి దగ్గరే విద్యనభ్యసించాడు.

శుకుడు పండితులలో గొప్పవాడు. అతను రాజావశ్యం, గర్వభంజనం మరియు శుద్ధ వాక్సిద్ధి మరియు జ్ఞానాన్ని ఇచ్చేవాడు.

శ్యామల సిద్ధ ఉపాసకులు సాధన, హోమము మొదలైనవాటిని చేసినప్పుడు దేవి ఉనికిని చాటుతూ చిలుకలు దగ్గరకు వస్తాయి.

చిలుక పలికే మాటలు ఎంత వినసొంపుగా ఉంటాయో, ఈ దేవిని పూజిస్తే మన మాట తీరు (వాక్ శక్తి) అంత ప్రభావవంతంగా మారుతుంది. మనం నేర్చుకున్న విద్యను ఇతరులకు అర్థమయ్యేలా చెప్పే నైపుణ్యాన్ని ఈమె ప్రసాదిస్తుంది. ఈ దేవిని కేవలం దేవతగానే కాకుండా, విద్యను నేర్పే ఒక గురువుగా భావిస్తారు. ఆమె తన శిష్యులకు (భక్తులకు) చిలుక ఎంత సులభంగా మాటలు నేర్చుకుంటుందో, అంత సులభంగా కష్టమైన విద్యలను కూడా నేర్పిస్తుంది.

ఈ శుక శ్యామల దేవి ఉపాసన చేసేవారికి లోకాన్ని వశం చేసుకునే శక్తి (రాజా వశ్యం), ఎదుటివారి అహంకారాన్ని అణిచివేసే ధైర్యం (గర్వ భంజనం), మాట్లాడే ప్రతి మాట నిజమయ్యే వాక్సుద్ధి (వాక్సిద్ధి) మరియు అపారమైన జ్ఞానం లభిస్తాయి.

శ్యామలాదేవికి నిత్యపూజాతో పాటు మాతంగి శ్యామల అష్టోత్తరం, శ్యామల షోడశోపచార నామాలతో కుంకుమార్చన చేసుకోవాలి. వీలైన వారు మాతంగి యొక్క స్తోత్రాలు, హృదయ కవచం, సహస్రనామాలు మొదలగువాటిని పారాయణ చేస్తు పూజలు చేసుకోవాలి.

ఎరుపు రంగు పూవులతో అమ్మవారికి అలంకరణ చేసి , పాయసాన్ని ప్రసాదంగా నివేదించాలి..వీలైతే ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించాలి.

Saturday, January 24, 2026

Magha Puranam 7 - మాఘ పురాణం 7 మృగశృంగుడు యమునిగూర్చి తపమాచరించుట

మాఘ పురాణం - 7 వ అధ్యాయం

మృగశృంగుడు యమునిగూర్చి తపమాచరించుట

ఆ విధంగా ఏనుగునకు శాపవిమోచనమైన తరువాత మరల మృగశృంగుడు కావేరీనదిలో దిగి అకాలమృత్యువు వాతబడిన ఆ ముగ్గురు కన్యలను బ్రతికించు నిమిత్తం యమధర్మరాజును గురించి తపస్సు చేయ నారంభించినాడు.

నిశ్చల మనస్సుతో తదేకదీక్షతో  యమునిగూర్చి ధ్యానించుచుండగా మృగశృంగుని కఠోర దీక్షకు  యముడు సంతసించి ప్రత్యక్షమయి "మృగశృంగా నీ కఠోర
దీక్షకు, పరోపకార పరాయణతకు
నేనెంతయు సంతసించితిని, నాగురించి ఇంత
దీక్షతో ఎవ్వరూ తపమాచరించి వుండలేదు, నీకేమి కావలయునో కోరుకొనుము, నీ యభీష్టం నెరవేర్చెదను” అని యముడు పలికెను.

ఆ పలుకులు విని మృగశృంగుడు కన్నులు తెరచిచూడగా = యముడు తన యెదుట నిలబడియున్నాడు. వెంటనే "చేతులు జోడించి "మహానుభావా! ఎంతటి తపశ్శాలురకైనను దర్శనమివ్వని మీరు నాబోటి సామాన్యునికి మీదర్శనమిచ్చుట నాపూర్వజన్మసుకృతము తప్ప వేరు కాదు. ఆకాలమరణమునకు పాల్పడిన ఆ ముగ్గురు కన్యలను బ్రతికించి నన్ను నంతృప్తునిజేయుడు” అని ప్రార్ధించెను.

మృగశృంగుని పరోపకార బుద్ధికీ, దయార్ద్ర హృదయమునకు యముడు సంతోషించి, అతని కోరిక ప్రకారము ఆ ముగ్గురుకన్యలకు ప్రాణదానము చేయనెంచి "మృగశృంగా! నీ భక్తికి మెచ్చితిని. నీ పరోపకారబుద్ధి నన్నాకర్షించినది. నీకు జయమగుగాక" అని యముడు దీవించగాా-

మహాపురుషా! మిమ్ము సంతోషపెట్టుట సామాన్యమైనది కాదు మిమ్ము స్తోత్రము  చేసినవారికి, స్తోత్రము విన్నవారికి జరామరణములు కలుగవు, అట్టివారికి అన్ని విధముల శుభములు కలుగు నటుల అనుగ్రహింపుము అని ప్రార్థించగా-

“అటులనే నీ కోరిక సఫలమగుగాక” యని యమధర్శరాజు దీవించి యదృశ్యుడ య్యను,


Sri Sarika Syamala Devi - శ్యామల నవరాత్రులలో యేడవ రోజు శ్రీ సారికా శ్యామలా దేవి

శ్రీ సారికా శ్యామలా దేవి

శ్యామల నవరాత్రులలో యేడవ రోజు 'శ్రీ సారికా శ్యామలా దేవి' రూపంలో అమ్మవారిని పూజిస్తారు. ఈ రోజున ప్రత్యేకంగా జ్ఞానాన్ని, వాక్చాతుర్యాన్ని ప్రసాదించే శక్తిగా శ్యామలాదేవిని ఆరాధించడం విశేషం. ఈమె సాక్షాత్తు లలితా త్రిపురసుందరి ముఖ్య సలహాదారు అయిన రాజశ్యామల (మాతంగి) యొక్క అంగ దేవత. ఈ సమయం మాఘమాసంలో అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. 

కళలు, సంగీతము, నృత్యము వీటిలో ప్రావీణ్యము పొందటానికి,
 ఆకర్షణ శక్తి, భోధన శక్తి, ఏకసంథాగ్రాహ్య శక్తి వీటిని ప్రసాదించే మాత సారికా శ్యామలా దేవి.

దేవి తన హస్తాలలో చిలుక, తామర పువ్వు, వరి కంకి, పాశం, అంకుశం, కలశం మరియు సారిక పక్షిని ధరించి, దివ్యమైన వీణను వాయిస్తూ భక్తులకు దర్శనమిస్తుంది. సారికాంబిక జ్ఞానానికి మరియు వాక్కుకు అధిదేవత. సకల విద్యలు, శాస్త్ర నైపుణ్యం మరియు బుద్ధి చాతుర్యాన్ని ప్రసాదించే కరుణామయి సారిక దేవి. సారికా శ్యామలా దేవి అనుగ్రహంతో ఏ విద్యలో నానైనా, ఏ వృత్తి లో నైనా మనం ఉతీర్ణులము కాగలము. 

శ్యామల నవరాత్రులలో 7వ రోజు (మాఘ శుక్ల సప్తమి). ఈ రోజు బెల్లంతో చేసిన పదార్థాలను నైవేద్యంగా సమర్పిస్తారు.

ఈమె అరవై నాలుగు కళలకు (64 కళలు) మరియు సమస్త సృజనాత్మక విద్యలకు మూల కారణం. సంగీత, సాహిత్య, నృత్య కళలలో ప్రావీణ్యం పొందాలనుకునే వారు ఈమెను ఆశ్రయిస్తారు. ఈ రోజు విద్య, కళలు మరియు వాక్కులో నైపుణ్యం కోసం చేసే పూజ.

ముదురు శ్యామల వర్ణంతో చేతిలో కమలాని పట్టుకొని, చంద్రుని శిరము పై దాల్చి, ముదురు రంగు వస్త్రాలు ధరించి ఉంటుంది. మాత ధరించే ముదురు రంగు వస్త్రాలు అనంతమైన శున్యుమును సూచిస్తుంది.

సంస్కృతంలో 'సారిక' అంటే మైనా పక్షి. పక్షులు ఎంత సహజంగా పాడతాయో, దేవి కూడా తన భక్తులకు అంత సులభంగా, సహజసిద్ధంగా సర్వ విద్యా జ్ఞానాన్ని అనుగ్రహిస్తుంది.సారిక అనే పదానికి 'తీగ వాయిద్యపు వంతెన' అని కూడా అర్థం. అందుకే ఈమె సృష్టిలోని అన్ని శబ్దాలకు, సంగీతానికి మరియు నాదానికి స్వరూపంగా వెలుగొందుతోంది.

సారిక అనగా సన్నని తీగ వాయిద్యము అనగా వీణ ను ధరించి ఉంటుంది. వీణకు వొకవైపు రామచిలుకలు కూర్చొని ఉంటాయి. ఆమె సృష్టి యొక్క అన్ని శబ్దముల స్వరూపము. ఆమె సకల సప్త స్వరముల స్వరూపము.

ఈమెను శారద, వాగీశ్వరి అని కూడా పిలుస్తారు. మాతంగి మరియు సరస్వతి దేవిల కలయికగా ఈమె భక్తులకు జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది.

ముదురు శ్యామల వర్ణంలో ప్రకాశించే ఈ దేవి, అనంతమైన స్పృహకు మరియు నిర్మలమైన జ్ఞానానికి ప్రతీక. ఈమెను పూజించడం వల్ల వాక్శుద్ధి మరియు మేధాశక్తి లభిస్తాయి.


సారికా శ్యామలా దేవి స్తోత్త్రం
శ్యామాం కరాంభోరుహకేళి లగ్నాం!
సోవాతంసాం స్తుతిపాఠమగ్నం 
విద్యాళిహృద్యాం విశదా ముపాసే!
శారీం చతుష్షష్ఠికళా స్వరూపాం 
చతుష్షష్ఠికళారూపాం విద్యాం హృది విరాజితాం!
శ్రావయంతీం కరే దేవీం శారికాదేవతాం భజే!!

సారికా శ్యామలా దేవి మంత్రం : 
'ఓం నమోభగవతే శారికే సకల కళాకోవిదే దేవి భోధయ భోధయ స్వాహా!'

అదే సమయంలో, సాధారణ నవరాత్రులలో ఏడవ రోజు కాళరాత్రి దేవిని పూజిస్తారు, ఇది భయాన్ని తొలగించి, రక్షణ కల్పిస్తుంది. 

శ్యామల నవరాత్రులు దేవీ శ్యామలాదేవిని (రాజశ్యామల) ప్రసన్నం చేసుకోవడానికి జరుపుకునే అరుదైన ఉత్సవాలు.




Soubhagya Shayana Vratam - సౌభాగ్యశయన వ్రతం

 సౌభాగ్యశయన వ్రతం


మత్స్యరూపంలో వున్న నారాయణుడు నారద మహర్షికి అత్యంత పుణ్యప్రదమైన సౌభాగ్యశయన వ్రతం గురించి ఇలా బోధించాడు.

వ్రతకథ : నారాద! పూర్వం ప్రళయకాలంలో అన్ని లోకాలు దగ్ధమైపోయాయి. అయితే ఆయా లోకాలలో వున్న అన్ని భూతాల సౌభాగ్యాలు ఒక్కటిగా చేరి వైకుంఠానికివెళ్ళి శ్రీమహావిష్ణువు వక్షస్థలంలో నిలిచాయి. తిరిగి చాలాకాలం తరువాత పునః సృష్టి ప్రారంభమైంది. లోకంలో పురుషాహంకారం అంతా ఆవరించింది. దాని ప్రభావంతో బ్రహ్మ విష్ణువులకి పోటీ ఏర్పడింది. నేను
గొప్పంటే? నేను గొప్ప అని వాదులాడుకోసాగారు. అప్పుడు వారిద్దరి మధ్యలో లింగాకృతితో ఒక మహాజ్వాల ఏర్పడింది. ఆ లింగజ్వాల వేడికి శ్రీ మహావిష్ణువు వక్షస్థలంలో నిలిచిన “సౌభాగ్యం” కరిగి ఒక ముద్దగా మారి బైటికి వచ్చింది. అది ఎగిరి భూమి మీద పడబోతుండగా బ్రహ్మ మానస పుత్రుడైన దక్షుడు దాన్ని పట్టుకుని తినేసాడు. ఆ సౌభాగ్యాన్ని భక్షించిన ప్రభావంతో దక్షుడి
శరీరం అపూర్వమైన లావణ్యంతో తేజస్సుతో ప్రకాశించింది. 

దక్షుడు సౌభాగ్యాన్ని పట్టుకుని తినేటప్పుడు ఆ ముద్దలోని కొన్ని చుక్కలు నేల మీదపడి ఓషధులుగా మారాయి. అవి. 
1.చెఱకు 
2.యవల నుండి తయారుచేసే చక్కర అనగా యవలు 
3.జాజికాయ 
4.ధనియాలు
5.విరిగిన ఆవుపాలు 
6.కుంకుమపువ్వు 
7.బొబ్బర్లు 
8.ఉప్పు 
ఈ ఎనిమిది వస్తువుల్ని సౌభాగ్యాష్టకం అంటారు. దక్షుడు సౌభాగ్యాన్ని పానం చేసిన తరువాత
సౌభాగ్యవతి అయిన కుమార్తె జన్మించింది. ఆమే సతీదేవి. ఆమె ఎంతో లలితంగా లావణ్యంగా వుంటుంది కాబట్టి ఆమే లలిత. పరమేశ్వరుడు ఆ సతీదేవిని వివాహం చేసుకున్నాడు. సతీ దేవి సౌభాగ్యంతో పుట్టింది కాబట్టి ఆమెని ఆరాధించిన వారికి సౌభాగ్యం కలుగుతుంది.

వ్రతవిధానం : వసంతమాసం ప్రారంభంలో అనగా చైత్ర శుక్ష తృతీయ తిధినాడు ఉదయంపూట నువ్వుల పిండితో నూనెతో అభ్యంగనం చేసుకుని శుచిగా స్నానం చేయాలి. ఈ తిథినాడే  పరమేశ్వరుడు లలితాపరమేశ్వరి అయిన సతీదేవిని వివాహం చేసుకున్నాడు. అందువల్ల ఈ తిథినాడు, శ్రీ లలితాపరమేశ్వరుల ప్రతిమని స్థాపించి వాటికి విధి విధానంగా షోడశోపచార పూజచేయాలి.

పూజావిధి :

1. పాటలాయై నమః - శివస్యదేవ్యాశ్చ పాదౌ పూజయామి
2. జయా
యై-శివాయచ నమః - గుల్ఫే పూజయామి
3. భవానై- త్య్రంబకాయ నమః - జంఘే పూజయామి
4. విజయా
యై-భద్రేశ్వరాయ నమః - జానునీపూజయామి
5. వరదాయై-హరికేశాయ నమః - ఊరూం పూజయామి
6. ఈశానాయై-శంకరాయ నమః - కటిం పూజయామి
7. కాళిన్యై-శూలపాణయే నమః - కుక్షి ద్వయం పూజయామి
8. మంగళాయై-మంగళేశాయ నమః - ఉదరం పూజయామి
9. ఈశాన్వై - సర్వాత్మనే నమః - కుచద్వయం పూజయామి
10. రుద్రాణ్యై-వేదాత్మనే నమః - కంఠం పూజయామి
11. అనంతా
యై-త్రిపురఘ్నాయ నమః - కరౌ పూజయామి
12. కాలానలప్రియాయై- త్రిలోచనాయ నమః - బాహూం పూజయామి
13. సౌభాగ్యభవా
యై-సౌభాగ్య భవనాయ నమః - భూషణాని పూజయామి
14. స్వాహాస్వధా
యై-ఈశ్వరాయ నమః - ముఖం పూజయామి
15. అశోక మధువాసిన్యై-అశోకమధువాసినే నమః - ఓష్ఠౌ పూజయామి
16. చంద్రముఖప్రియాయై- స్థాణవే నమః - ఆస్యం పూజయామి
17. అఖిలాంగ్యై-అర్ధనారీశ్వరాయ నమః - నాసికాం పూజయామి
18. లలితా
యై-ఉగ్రాయ నమః - భ్రువౌ పూజయామి
19. వాసవ్యై - శర్వాయ నమః - అలకాన్‌ పూజయామి
20. శ్రీకంఠనాధాయై-శివాయ నమః - కేశాన్‌ పూజయామి
21. భీమోగ్ర సమరూపిణ్యై - సర్వాత్మనే నమః - శిరః పూజయామి

ఈ విధంగా లలితా - పరమేశ్వరుల్ని పూజించిపైన తెలిపిన సౌభాగ్యాష్ట ద్రవ్యాలని వారికి నైవేద్యంగా సమర్పించి ఉత్తర పూజ చేయాలి. తరువాత గోశృంగం (ఆవుకొమ్ము) ఉంచిన నీటిని త్రాగి ఉపవాసం వుండి నేల మీదే నిద్రించాలి.

మర్నాడు ఉదయం అనగా చవితినాడు స్నానం, జపంచేసి, మంచి వస్త్రాలతో, ఆభరణాలతో బ్రాహ్మణ దంపతుల్ని పూజించి, లలితా పరమేశ్వరుల ప్రతిమల్ని సౌభాగ్యాష్టక ద్రవ్యాల్ని “శ్రీలలితా పరమేశ్వరః ప్రీయతాం” అని పఠిస్తూ వారికి దానం చేయాలి. ఈ విధంగా ఒక సంవత్సరం పాటు ప్రతినెల తదియనాడు ఈ వ్రతాన్ని చేయాలి.

ఈ వ్రతాన్ని ఆచరించేవారు ప్రతినెలా ఏ విధమైన ఆహారం తీసుకోవాలి, దానంచేసేటప్పుడు ఏ మంత్రాన్ని చదవాలి అంటే?

1. చైత్రమాసంలో గోశృంగంలోని నీటిని ఆహారంగా తీసుకుని దానం చేసేడప్పుడు 
'లలితా ప్రీయతాం' అనే మంత్రాన్ని చదవాలి. 
2. వైశాఖ మాసంలో గోమయాన్ని ఆహారంగా తీసుకుని 'విజయా ప్రీయతాం' అనే మంత్రాన్ని దానం చేసేడప్పుడు పఠించాలి.
3. జ్యేష్ట మాసంలో మందారపూలని ఆహారంగా తీసుకుని 'భద్రాప్రీయతాం' అనే మంత్రాన్ని చదవాలి. 
4. ఆషాఢ మాసంలో బిల్వషత్రాల్ని ఆహారంగా తీసుకుని 'భవానీ ప్రీయతాం' అనే మంత్రాన్ని పఠించాలి. 
5. శ్రావణ మాసంలో పెరుగుని ఆహారంగా తీసుకుని 'కుముదా ప్రీయతాం' అనే మంత్రాన్ని పఠించాలి. 
6. భాద్రపదమాసంలో ధర్ఫోదకాన్ని ఆహారంగా తీసుకుని 'శివాప్రీయతాం' అనే మంత్రాన్ని పఠించాలి.
7.ఆశ్వయుజమాసంలో పాలని ఆహారంగా తీసుకుని 'వాసుదేవీప్రీయతాం' అనే మంత్రాన్ని పఠించాలి.
8.కార్తీక మాసంలో మీగడ పెరుగుని ఆహారంగా తీసుకుని 'గౌరీ పీయతాం' అనే మంత్రాన్ని చదవాలి. 9. మార్గశిరమాసంలో గోమూత్రాన్ని ఆహారంగా తీసుకుని 'మంగళాప్రీయతాం' అనే మంత్రాన్ని
చదవాలి. 
10.పుష్యమాసంలో నేయిని ఆహారంగా తీసుకుని 'కమలా ప్రీయతాం' అని పఠించాలి. 
11. మాఘమాసంలో నల్లనువ్వుల పొడిని ఆహారంగా తీసుకుని 'సతీ ప్రీయతాం' అనే మంత్రాన్ని పఠించాలి. 
12. ఫాల్గుణమాసంలో పంచగవ్యాన్ని ఆహారంగా తీసుకుని 'ఉమా ప్రీయతాం' అనే మంత్రాన్ని
చదువుతూ దానం ఇవ్వాలి.

పన్నెండు మాసాలలో లలితా పరమేశ్వరులని వరుసగా 
1.మల్లి
2.అశోకం 
౩.తామర 
4.కడిమి 
5.కలువ 
6.మాలతి 
7. కుబ్దకం (గొజ్జంగి)
8. కరవీరం (ఎర్రగన్నేరు) 
9.రెలు 
10. వాడగన్నేరు 
11.కుంకుమపువ్వు
12.ప్రీంకణం ఈ పూలతో పూజించాలి

వ్రత ఉద్యాపనం : ఈ విధంగా విధివిధానంగా పన్నెండు నెలలపాటు వ్రతాన్ని చేశాక చివరిమాసంలో తాము పూజించిన లలితా - పరమేశ్వరుల ప్రతిమని, దానంచేసే వస్తువుల్ని ఒక కొత్త మంచం మీద వుంచి దాన్ని బ్రాహ్మణ దంపతులకే దానమివ్వాలి. అలాగే యథాశక్తి మరి కొంతమంది బ్రాహ్మణ దంపతులకి వస్త్రాల్ని, ఆభరణాల్ని, ఆవుల్ని దానం చేయాలి. ధనం వున్నవారు దానానికి లోభించకూడదు. అహంకలిగించకూడదు.

వ్రతఫలం : భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరించిన వారికి సకల శుభాలు కలుగుతాయి. వారు కోరుకున్న కోరికలన్నీ తీరుతాయి. కీర్తి ప్రతిష్టలు ఆయురారోగ్యాలు కూడా లభిస్తాయి. ఈ దివ్య వ్రతాన్ని వరుసగా పన్నెండు సంవత్సరాలు గానీ, పద్దెనిమిది సంవత్సరాలు గానీ చేసినవారు పదివేలకల్పాల వరకూ దేవతలచేత సేవలందుకుంటూ కైలాసంలో నివసిస్తారు.

ఈ సౌభాగ్యశయన వ్రతాన్ని చదివిన వారికి, వినిపించినవారికీ విద్యాధరత్వం, స్వర్గలోక నివాసం లభిస్తాయి. పూర్వం బ్రహ్మదేవుడు, కార్తవీర్యార్దునుడు వరుణుడు, నంది ఈ వ్రతాన్ని ఆచరించారు.

స్త్రీల వ్రత కథలు

Friday, January 23, 2026

Vasya Matangi - శ్యామల నవరాత్రులలో ఆరవ రోజు వశ్య మాతంగి

శ్యామల నవరాత్రులలో ఆరవ రోజు వశ్య మాతంగి

శ్యామల నవరాత్రులలో ఆరవ రోజు వశ్య మాతంగి రూపంలో అమ్మవారిని పూజిస్తారు. మాతంగి అనేది శ్యామల లేదా మాతంగి విద్యలో అన్ని దేవతలకు సాధారణ పేరు ఎందుకంటే ఆమె ఋషి మాతంగుడుని తన తండ్రిగా మరియు మొత్తం మాతంగ ప్రజలను తన ప్రియా జనంగా భావించడం ద్వారా ఆ నామంతో పిలవబడుతోంది.

ముఖ్య వశ్య విద్యాది దేవత కారణంగా ఆమెను మహా వశ్యకారి, వశ్యామాతంగి అని పిలుస్తారు. ఆమె వశ్య, సమ్మోహనాది సిద్ధికి దేవత.సాధకులు తమను తాము ఎల్లప్పుడూ సాధనలో స్థిరంగా ఉంచుకోడానికి  సహాయం చేస్తుంది. సాధనపై దృష్టి పెట్టడానికి కావలసిన స్థితిని కలుగజేస్తుంది.

ఆమె చేతిలో పాషా, అంకుశం, ఖడ్గము, ఖేతం లేదా దండం వంటి వాటిని పట్టుకొని ఉంటుంది. వశ్య మాతంగి అన్ని సిద్దులు మరియు అభిష్టాలను ఇచ్చే దేవత. శీఘ్ర సిద్ది ఫల ధాయిని. ఈమెను దక్షిణ మరియు వామా చార పద్దతులలో పూజిస్తారు.

శ్యామలాదేవికి నిత్యపూజాతో పాటు మాతంగి శ్యామల అష్టోత్తరం, శ్యామల షోడశోపచార నామాలతో కుంకుమార్చన చేసుకోవాలి. వీలైన వారు మాతంగి యొక్క స్తోత్రాలు, హృదయ కవచం, సహస్రనామాలు మొదలగువాటిని పారాయణ చేస్తు పూజలు చేసుకోవాలి.

ఎరుపు రంగు పూవులతో అమ్మవారికి అలంకరణ చేసి , పాయసాన్ని ప్రసాదంగా నివేదించాలి. వీలైతే ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించాలి.




Ashtottara Shata Shakthi Peetha Stotram - అష్టోతరశత (108) శక్తిపీఠ స్తోత్రం

అష్టోతరశత (108) శక్తిపీఠ స్తోత్రం

వారాణస్యాం విశాలాక్షీ నైమిషే లింగధారిణీ ।
ప్రయాగే లలితాదేవీ కాముకా గంధమాదనే ॥ 01 ॥

మానసే కుముదా నామ విశ్వకాయా తథాஉ౦బరే ।
గోమంతే గోమతీ నామ మందరే కామచారిణీ ॥ 02 ॥

మదోత్కటాచైత్రరథే జయంతీ హస్తినాపురే ।
కాన్యకుబ్జే తథా గౌరీ రంభా మలయ పర్వతే ॥ 03 ॥

ఏకామ్రకే కీర్తిమతీ విశ్వా విశ్వేశ్వరీ తథా ।
కర్ణికే పురుహస్తేతి కేదారే మార్గదాయికా ॥ 04 ॥

నంద్యాహిమవతః పృష్టే గోకర్ణే భద్రకాళికా ।
స్థాణీశ్వరే భవానీ తు బిల్వకే బిల్వపత్రికా ॥ 05 ॥

శ్రీశైలే మాధవీ దేవీ భద్రా భద్రేశ్వరీ తథా ।
జయా వరాహశైలే తు కమలా కమలాలయే ॥ 06 ॥

రుద్రకోట్యాం తు రుద్రాణీ కాళీ కాలంజరే తథా ।
మహాలింగే తు కపిలా కర్కోటే మంగళేశ్వరీ ॥ 07 ॥

శాలిగ్రామే మహాదేవీ శివలింగే జలప్రియా ।
మాయాపుర్యాం కుమారీతు సంతానే లలితా తథా ॥ 08 ॥

ఉత్పలాక్ష్మీ సహస్రాక్షే హిరణ్యాక్షే మహోత్పలా ।
గయాయాం మంగళా నామ విమలా పురుషోత్తమే ॥ 09 ॥

విపాశాయా మమోఘాక్షీ పాటలా పుణ్యవర్ధనే ।
నారాయణీ సుపార్శ్వే తు త్రికూటే భద్రసుందరీ ॥ 10 ॥

విపులే విపులా నామ కల్యాణీ మలయాచలే ।
కోటవీ కోటితీర్ధేతు సుగంధా మాధవీ వనే ॥ 11 ॥

కుబ్జామ్రకే త్రిసంధ్యా తు గంగాద్వారే హరిప్రియా ।
శివకుండే శివానందా నందినీ దేవికా తటే ॥ 12 ॥

రుక్మిణీ ద్వారవత్యాం తు రాధా బృందావనే తథా ।
దేవకీ మధురాయాంతు పాతాళే పరమేశ్వరీ ॥ 13 ॥

చిత్రకూటే తదా సీతా వింధ్యే వింధ్య నివాసినీ ।
సహ్యాద్రే ఏక వీరా తు హరిశ్చంద్రే తు చంద్రికా ॥ 14 ॥

రమణా రామతీర్దే తు యమునాయాం మృగావతీ ।
కరవీరే మహాలక్ష్మీ రమాదేవీ వినాయకే ॥ 15 ॥

ఆరోగ్యా వైద్యనాథే తు మహాకాళే మే హేశ్వరీ ।
అభయా పుష్ప తీర్థే తు అమృతా వింధ్య కందరే ॥ 16 ॥

మాండవ్యే మాండవీ దేవీ స్వాహా మేహేశ్వరే పురే ।
వేగవే తు ప్రచండాஉథ చండికాஉమర కంటకే ॥ 17 ॥

సోమేశ్వరే వరారోహా ప్రభాసే పుష్కరావతీ ।
దేవమాతా సరస్వత్యాం పారాஉవారే తటే స్థితా ॥ 18 ॥

మహాలయే మహాపద్మా పయోష్ణ్యాం పింగళేశ్వరీ ।
సింహికా కృతశౌచే తు కార్తికేయే తు శంకరీ ॥ 19 ॥

ఉత్సలాஉవర్తకే లోలా సుభద్రా సింధు సంగమే ।
ఉమా సిద్ధవనే లక్ష్మీ రనంగా భరతాஉశ్రమే ॥ 20 ॥

జాలంధరే విశ్వముఖీ తారా కిష్కింధ పర్వతే ।
దేవదారు వనే పుష్టి ర్మేధా కాశ్మీర మండలే ॥ 21 ॥

భీమా దేవీ హిమాద్రౌ చ తుష్టి ర్విశ్వేశ్వరే తథా ।
కపాల మోచనే శ్రద్దా మాతా కాయాஉవరోహణే ॥ 22 ॥

శంఖోద్దారే ధ్వని ర్నామ ధృతిః పిండారకే తథా ।
కాలా తు చంద్రభాగాయా మచ్చోదే సిద్ధిదాయినీ ॥ 23 ॥

వేణాయా మమృతా దేవీ బదర్యా మూర్వశీ తథా ।
ఔషధీ చోత్తర కురౌ కుశద్వీపే కుశోదకా ॥ 24 ॥

మన్మథా హేమకూటే తు కుముదే సత్యవాదినీ ।
అశ్వత్థే వందనీయా తు నిధి ర్వైశ్రవణాஉలయే ॥ 25 ॥

గాయత్రీ వేదవదనే పార్వతీ శివసన్నిధౌ ।
దేవలోకే తథేంద్రాణీ బ్రహ్మాస్యే తు సరస్వతీ ॥ 26 ॥

సూర్యబింబే ప్రభా నామ మాతౄణాం వైష్ణవీ తథా ।
అరుంధతీ సతీనాం తు రామాసు చ తిలోత్తమా ॥ 27 ॥

చిత్తే బ్రహ్మకళా నామ శక్తిః సర్వశరీరిణామ్‌ ।
ఏత ద్భక్త్యామయా ప్రోక్తం నామాஉష్టశత ముత్తమమ్‌ ॥ 28 ॥

అష్టోత్తరం చ తీర్థానాం శత మేతదుదాహృతమ్‌ ।
యో జపేత్‌ శ్రణుయాద్వాపి సర్వపాపైః ప్రముచ్యతే ॥ 29 ॥

Numerology - Number 5 - న్యూమరాలజీ - 5వ సంఖ్య

న్యూమరాలజీ - 5వ సంఖ్య గ్రహము : బుధుడు.. జన్మదిన తేదీ సంఖ్య:- 5, 14, 23 జనవరి నుండి డిసెంబరు నెలలలో ఏ నెలలో నైనాసరే 5, 14,23 ఈ తేదీలలో పుట్టి...