Tuesday, January 6, 2026

Saddhi Kuti Mangalavaramu Katha - సద్దికూటి మంగళవారం కథ

సద్దికూటి మంగళవారం కథ

ఒక రాజుకూతురు బ్రాహ్మణునికూతురు చద్దికూటి మంగళవారము నోము పట్టిరి. బ్రాహ్మణుని కూతురు వారంవారం ముత్తయిదువను పెట్టుకొని తొలినాడు అస్తమయవేళ కూర, పప్పు, చారు, అన్నం వండి మూత పెట్టుకొని ప్రొద్దున్నే వంటి మీద నీళ్లుపోసుకొని కథ చెప్పి అక్షతలు వేసుకొని ముత్తయిదువకు పెట్టి తాను తిని ముత్తయిదువులకు దక్షిణ తాంబూలము యిచ్చెను. అలా యేడాది అయిన తరువాత పదముగ్గురు పేరంటాండ్రకు యధావిధిగా దక్షిణ తాంబూలములిచ్చి ఉద్యాపనము చేసికొనెను. 

రాజు కూతురికి దరిద్రము వచ్చెను. ఆమె దరిద్రమును భరింపజాలక అడవికివెళ్ళి తిరుగుచుండగా పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమై “ఏమమ్మా! ఇలా వచ్చినావు? అని యడిగిరి. తినుటకు అన్నము, కట్టుటకు బట్టలేక దరిద్రముచే బాధపడుచు ఈలాగువచ్చినాని ఆమె చెప్పెను. అప్పుడు పార్వతీ పరమేశ్వరులు

నీవు చద్దికూటి మంగళవారముల నోముపట్టి యది యుల్లంఘన చేసినావు. ఆ కారణముచేత నీకీ దరిద్రబాధ సంభవించినది. నీవు తిరిగి యింటికి వెళ్లి ఆ నోముపట్టి యధావిధిగ ఉద్యాపనము చేసికొన్న యెడల నీ బాద పోవునని చెప్పి యదృశ్యులైరి. 

అప్పుడామె యింటికివెళ్ళి నోముపట్టి యేడాది ప్రతివారము ముత్తయిదువకు పెట్టి ఏడాది అయిన తరువాత యుద్యాపనము చేసికోగా దరిద్రబాధ పోయెను.

ఉద్యాపనము: పదముగ్గురు పేరంటాంద్రకు తలయంటి నీళ్లుపోసి పదమూడు డబ్బులు, దక్షిణ తాంబూలము పదమూడు రవికల గుడ్డలు పెట్టి తొలినాడు అస్తమయమువేళ వంటచేసి మూతపెట్టి చద్దివేళ ప్రొద్దునే ముత్తయిదువులకు భోజనము పెట్టి పదమూడు మూకుళ్లలో ఈ చద్దిపెట్టి పదముగ్గురకు వాయనము యివ్వవలయును. 

కథలోపమైనను, వ్రతలోపము కాకూడదు. భక్తితప్పినను ఫలము తప్పదు.

No comments:

Post a Comment

Narada Muni encouraged Prajapati Daksa's second group of sons (the Savalasvas/Shabalashva) by awakening their natural affinity for their brothers (the Haryasvas) - నారదుండు శబళాశ్వులకు నివృత్తి మార్గంబు నుపదేశించుట

నారదుండు శబళాశ్వులకు నివృత్తి మార్గంబు నుపదేశించుట ఈ విధంగా ఘోరతపస్సు చేస్తున్న శబలాశ్వులను మోక్షపథగాములుగా చేయడానికి నారదుడు ఇదివరకటిలాగే వ...