Thursday, December 19, 2024

తిరుప్పావై 5వ పాశురం

తిరుప్పావై ఐదవ పాశురము


శ్రీ గురుభ్యోనమః

జై శ్రీ కృష్ణ

ప్రియ భగవత్ బంధువులారా!


నీళాతుంగ స్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం
పారార్థ్యం స్వం శ్రుతి శత శిర స్సిద్ధ మధ్యాపయంతీ!
స్వోచ్ఛిష్టాయామ్ స్రజినిగళితమ్ యా బలాత్కృత్య భుంక్తే
గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః


ప్రియ భగవత్ బంధువులారా!

మాయనై మన్ను వడమదురై మయిందనై
తూయ పెరునీర్ యమునై తురైవనై
ఆయర్ కులత్తునిల్ తోన్రుమ్ మణి విళక్కై
తాయై క్కుడల్ విళక్కమ్ శెయిద దామోదరనై
తూయోమాయ్ వందునామ్ తూమలర్ తూవిత్తొళుదు
వాయినాల్ పాడి మనత్తినాల్ శిన్దిక్క
పోయ పిళై యుమ్ పుగుదరువా నిన్రనవుమ్
తీయినిల్ తూశాగుమ్ శెప్పేలో రెంబావాయ్ 

ఇప్పుడు ఈ పాశురం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం

పరమాత్మ యొక్క ఐదు స్వరూపాలను మొదటి 5 పాశురములలో ఆండాల్ తల్లి చెప్తుంది. అసలు తిరుప్పావై లో ఎంత గంభీరమైన, లోతైన అర్థాలున్నాయో చూడండి….


వేదమనైత్తుక్కుం విత్తాగుం అయైన్దు 
మయిన్దుం అరియాద మానిడరై
వైయం శుమప్పుదుమ్ వమ్బు (కోదై తమిళ్)

అంటే అనంతమైన వేదములు వున్పప్పటికీ; బీజం ఎలాగైతే ఉంటుందో.. అలాగే పెద్ద వృక్షం ఉందనుకోండి.. దానికి మూలం ఏమిటి.. బీజం అంటే విత్తనం. ఆ మహా వృక్షానికి కాయలుంటాయి, పళ్ళుంటాయి, కొమ్మలుంటాయి. ఆకులుంటాయి. ఇన్ని ఉండడానికి కారణం ఏమిటి?.. ఆ చిన్న విత్తనం. ఆ మహా వృక్షానికి మూలం.. చిన్న విత్తనం మాత్రమే. అదేవిధంగా అంత గొప్పదైన వేదమనే మహా వృక్షానికి బీజం అనే విత్తనమే ఈ తిరుప్పావై. అంటే చూడండి ఈ తిరుప్పావైలో ఎంత గొప్పవైన రహస్యాలు, అర్థాలు ఉన్నాయో.

గోదా గోపిక పిలుపును అందుకున్న గోపికలు అందరూ కూడా ఒక చోట చేరారు.ఒక గోపిక అంటుందట ఇలా.

శ్రేయాంసి బహు విఘ్నాని
భవంతి మహతామపి

ఎంతవారికైనా ఒక మంచి పని చేద్దాం అనుకున్నప్పుడు ఎంత పెద్ద వారికైనా, గొప్పవారికైనా కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. అదే భగవంతుడు వారికి పెట్టిన పరీక్ష. మన వ్రతానికి మొదటి ఆటకం మనం తెలిసీ తెలియక చేసిన ఎన్నో జన్మల పాపాలే. చేసిన పాపములకు ప్రాయశ్చిత్తం చేసుకుని మరల ఆ పాప కర్మల జోలికి పోకుండా ఉంటేనే ఈ వ్రతానికి ఫలితం దక్కుతుంది. ఆ భగవంతుని అనుగ్రహం కలుగుతుంది అని ఒక గోపిక చెప్పింది. ఇంకొక గోపిక అంటుందట, అవునర్రా! నిజమే, అది చెప్పింది నిజమే. శ్రీరామ పట్టాభిషేకానికే విఘ్నం వచ్చింది. ఇక ఆ విధి ముందు మనం ఎంతటివారం. 

అవశ్యమను భోక్తవ్యమ్ 
కృతం కర్మ శుభా శుభం 

పుణ్యం చేసిన వారు కానీ, ఆ పని చేసినవారు కానీ ఆ కర్మల యొక్క ఫలితాలను తప్పకుండా అనుభవించి తీరవలసిందే. అసలు కర్మ అంటే ఏమిటి? అని అడిగిందిట ఒక గోపిక. 

అందులో ఒక గోపిక ఇలా అన్నిందంట. ఏమిన్ని? కర్మ అంటే మనం చేసే పనే కాదు, ఆలోచన కూడా ఒక కర్మే.

1. సంచిత కర్మ 2. ప్రారబ్ధ కర్మ 4. ఆగామి కర్మ. 

1. సంచిత కర్మ:- ఎన్నో జన్మలలో చేసింది. ఇది ఒక వేటగాడు తన అమ్ముల పొదిలో భద్రపరిచిన బాణం లాంటిది. అంటే మనకు అవసరమైనప్పుడు తీసుకోవచ్చు.

2. ప్రారబ్ద కర్మ:- ఈ జన్మలో ఈ శరీరంతో మనం మేల్కొని ఉన్నప్పుడు గాని, నిద్రించినప్పుడు గాని, కలగంటున్నప్పుడు గానీ అంటే మూడు అవస్థలు, (జాగ్రతావస్థ, సుషుప్తావస్థ, స్వప్నావస్థ) ఈ మూడూ కూడా మనం అనుభవించడానికని కేటాయించిన పుణ్య, పాప కర్మలు. ఇది వేటగాడు వేసిన బాణం లాంటిది. ఫలితం అనుభవించక తప్పదు. 

3. ఆగామి కర్మ:- అంటే ఏమిటి. ఈ జన్మలో చేసుకున్నది, వచ్చే జన్మలో అనుభవించాల్సి ఉంటుంది. ఇది వేటగాడి చేతిలో వేయడానికి సిద్ధంగా ఉన్న బాణం లాంటిది. బాగా పండిన కర్మలను తీసి భగవంతుడు ఏడు జన్మలకు కేటాయిస్తాడు. పోనీ పుణ్యం ఎక్కువ చేస్తే పాపం నశిస్తుందా? అబ్బే అదేం కుదరదు, దేని లెక్క దానిదే. పాప కర్మ, పుణ్య కర్మ రెండూ దేనికది పోవాల్సిందే. అబ్బా ఎంత చిక్కో చూడండి.

ఇప్పుడు ఇంకో తెలివిగల గోపిక చూడండి ఎలా చెబుతుందో. (ఇదంతా నేను చెప్తున్నది కాదండి.) 

ఆ గోదా గోపిక.. ఆ గోపికలందరినీ ఒక దగ్గర చేర్చి స్నానానికి వెళ్ళాలని అంటే ఆ శ్రీ కృష్ణ పరమాత్మ దర్శనం చేద్దామని బయలుదేరే ముందు జరిగిన సంభాషణ.

క్షీయంతే చాస్య కర్మాణి
తస్మిన్ దృష్టే పరావరే 

అంటే ఆ పరమాత్మను దర్శించగానే కర్మలన్నీ విడిపోతాయట. ఈ విషయం ఉపనిషత్తులు చెప్తున్నాయని మన పెద్దవాళ్ళు చెప్పడం వల్ల తెలుసుకున్నాం కదా. ఆ మాటలను విని మన ప్రవర్తనను తీర్చిదిద్దుకుని భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రులు అవుదాం. అప్పుడు సంచిత కర్మలు నిప్పులో వేసిన దూది లాగ నశిస్తాయి. ఆగామి కర్మలు తామరాకుమీద నీటిబొట్టులాగా మనకంటవు. అయితే ప్రారబ్ధకర్మ మాత్రం అనుభవించి తీరవలసిందేనా? అని ఒక గోపిక నిరాశ చెందింది. అప్పుడు గోదాగోపిక అంటుందట, శరణాగతి పొందిన వాళ్లు నిరాశ పడనవసరం లేదు.

శ్రీమన్నారాయణుడే దిక్కు అని పూర్తిగా నమ్మిన వాళ్ళం. ప్రారబ్ధాన్ని కూడా భగవంతుడు మన చేత సుఖంగా అనుభవించినట్లు చేస్తాడు. అందులో ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఇక్కడ మనకు ఒక అనుమానం రావచ్చు. గోపికలు అమాయకులు, చదువు లేని వారు కదా! మరి వారికి అంత జ్ఞానం ఎక్కడ వచ్చింది అని. నంద వ్రజంలో గర్గుడు, సాందీపుడు మొదలైన పెద్దలు, గురువులు ధర్మశాస్త్రాలను చెబుతున్నప్పుడు వాళ్ళు వినడంచేత అంత పాండిత్యం వచ్చింది.ఇప్పుడు గోదాగోపిక అంటుంది. ఈ వ్రతం సాగడానికి కర్మలు తొలగి, వారు కోరిన ఫలితాన్ని పొందడానికి సులభంగా ఒక ఉపాయాన్ని ఈ పాశురములో చెబుతుంది.

మాయనై మన్ను వడమదురై మయిందనై

మాయనై ఆయన మాయావి అట. ఎవరూ! మన చిన్ని కృష్ణుడు, గోపాలకృష్ణుడు, ఆ శ్రీకృష్ణపరమాత్మ. మన్ను వడమదురై మన ఉత్తర భారతదేశంలో గల మధురలో జన్మించిన మయిందనై ధీశాలి, ధైర్యవంతుడు, వీరుడు, శూరుడూనట.

తూయ పెరునీర్ యమునై తురైవనై

నిర్మలమైన, పరిశుద్ధమైన నీటితో కూడుకున్న యమునా తీరంలో ఆయన విహరించేవాడు. ఈత కొట్టేవాడు. యమునా తరంగాల మీద జలక్రీడలాడే ప్రభువట.

అయర్ కులత్తునిల్ తోన్రుం మణి విళక్కై

యదువంశంలో, గోపాల కులంలో మణిదీపం వంటి వాడట.

తాయై క్కుడల్ విళక్కం శెయిద దామోదరనై

యశోదాదేవి గర్భాన్న జన్మించి ఆమెకు కీర్తి తెచ్చాడు. ఆయన సమస్త గుణాలు పరిపూర్ణంగా ప్రకాశించింది శ్రీకృష్ణావతారంలోనే. యశోదదేవి ఆయన్ని రోటికి కట్టి వేసింది. ఈ పాశురంలో గోదాదేవి శ్రీకృష్ణుడి లీలల్ని ఊహించుకుని ఆనందిస్తుంది. తన్మయం చెందుతుంది. ఈ పాశురంలో కృష్ణ మాయ దోబూచులాడుతుంది. పసిబిడ్డగా ఉన్నప్పుడే పూతన వంటి రాక్షసుని మట్టుపెట్టాడు. ఆయన్ని మట్టుబెట్టడానికి వచ్చిన రాక్షసుల అంతు చూశాడు. అలాంటి బాలగోపాలుడి అల్లరి, గోపకాంతల గగ్గోలు భరించలేక ఆయన నడుముకి తాడు కట్టి రోటికి కట్టి వేసింది. యశోద తల్లి మాత్రమే కాదు, భక్తురాలు కూడా. ఆమె భక్తికి ఆ కృష్ణుడు బందీ అయిపోయాడు. దామం అంటే తాడు. నడుము చుట్టూ కట్టడం వల్ల ఆయన దామోదరుడు అయ్యాడు.

తూయోమాయ్ వందునాం తూమలర్ తూవిత్తొళుదు
వాయినాల్ పాడి మనత్తినాల్ శిన్దిక్క
పోయ పిళై యుమ్ పుగుదరువా నిన్రనవుమ్
తీయినిల్ తూశాగుమ్ శెప్పేలో రెంబావాయ్ 

అలాంటి దామోదరుడి దగ్గరికి మనం ఏకాగ్రతతో, పరిశుద్ధంగా, పవిత్రమైన హృదయంతో వెళ్ళి పువ్వులను సమర్పించి పూజ చేయాలి. అప్పుడు మన బంధాలు, సంసారబంధాలు కూడా తొలగిపోతాయి. ఇంతవరకు మొదటి 5 పాశురాలలో గోపికలను శ్రీ గోదా గోపిక వ్రతానికి సిద్ధం చేసింది. ఇక రేపటి నుంచి శ్రీ వ్రతం ప్రారంభమవుతుంది.


ఆండాల్ తిరువడిగళే శరణం


Wednesday, December 18, 2024

తిరుప్పావై 4వ పాశురం

తిరుప్పావై 4వ పాశురం

శ్రీ గురుభ్యోనమః

జై శ్రీ కృష్ణ

ఆండాళ్ తిరువడిగలే శరణం

ప్రియ భగవత్ బంధువులారా!

నీళాతుంగ స్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం
పారార్థ్యం స్వం శ్రుతి శత శిర స్సిద్ధ మధ్యాపయంతీ!
స్వోచ్ఛిష్టాయామ్ స్రజినిగళితమ్ యా బలాత్కృత్య భుంక్తే
గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః

తిరుప్పావై 4వ పాశురం

ఆళి మళైక్కణ్ణా! ఒన్రు నీ కైకరవేల్
ఆళియుళ్ పుక్కు ముగన్దు కొడు ఆర్తేరి
ఊళి ముదల్ వన్ ఉరువం బోల్ మెయ్ కరుత్తు
పాళియన్ దోళుడై పర్పనాబన్ కైయిల్
ఆళిపోల్ మిన్ని, వలంబురిపోల్ నిన్ రదిరిందు
తాళాదే శాంగ (శారంగ) ముదైత్త శరమళై పోల్
వాళ వులగనిల్ పెయిదిడాయ్ నాంగళుమ్
మార్గళి నీరాడ మగిళిందేలో రెంబావాయ్

ఇప్పుడు ఈ పాశురం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం

ఆండాళ్ తల్లి గోపికలతో కలసి వ్రత స్నానం ఆచరించడానికి బయలుదేరుతుంది. మరి అందరూ స్నానం చేయాలంటే మంచి నీరు ఉండాలి కదా! దేవతలు ఏ భగవంతుని అయితే ప్రార్థిస్తారో మనం కూడా ఆ భగవంతుడిని ప్రార్థిస్తే అదే దేవతలు మనల్ని కూడా అనుగ్రహస్తారు. ఇక్కడ గోదాదేవి మహా భక్తురాలు. ఈ పాశురంలో గోదాదేవి వరుణ దేవుని ఆజ్ఞాపిస్తుంది ప్రార్ధిస్తుంది. ఏమని....

గంభీరమైన స్వభావం కలిగిన ఆళి మళైక్కణ్ణా!

ఓ వరుణ దేవా! ఓ మేఘమా! వానదేవుడా!

ఓ పర్జన్యదేవా! మా మీద దయతో రావయ్యా!

ఎప్పుడూ కంటే ఎక్కువగా మాకు వర్షాలు కురిపించు. వర్షాలు కురిసినప్పుడు చెరువులు, కాలువలు, నదులు, సముద్రాలు అన్నీ నిండుతాయి. అప్పుడు ఆనందంగా అందరూ స్నానం చేయవచ్చు. పరమాత్ముని అనుగ్రహం వల్ల నీకు ఒక మంచితనం ఉంది ఏమిటది?. నీకు అన్ని సమానమే. అందరూ సమానమే నువ్వు చెరువులోనీ కురుస్తావు. మురికి కాలువలో కురుస్తావు. జంతువుల మీదా, చెట్ల మీదా, పుట్ల మీదా కూడా కురుస్తావు. భక్తుల మీదా, రాజు మీదా, అందరిమీదా కురుస్తావు. నీకు అలాంటి తేడాలేమీ లేవు. నీకు అందరూ ఒకటే, అందరూ సమానమే

ఒన్రు నీ కైకరవేల్

చేతులు ముడుచుకొని కూర్చోవద్దు. నీ యొక్క గొప్పతనం చూపించు.

అళియుళ్ పుక్కు ముగన్దు కొడు ఆర్తేరి

సముద్రంలో మధ్యలో, లోతుగా ఉన్న చోట... ఎక్కువ నీరు ఉంటుంది కదా! ఆ నీరంతా తృప్తిగా, కడుపునిండా తాగేసి మీదకు వెళ్ళిపో. ఎలా వెళ్తావ్ నీరంతా తాగిన తర్వాత చాలా బరువుగా ఉంటావు కదా! మెల్లిగా వెళ్ళాలి (గర్భిణీ స్త్రీ మేడ మెట్లు ఎక్కినప్పుడు ఎంత జాగ్రత్తగా ఎక్కుతుందో) నువ్వు కూడా సముద్రంలో నీరు తాగేసి అలా ఆకాశం పైకి వెళ్ళు. అలా మీదకు వెళ్లి గర్జించు. మెరుపులు మెరిపించు, ఉరుములు గర్జించు. నువ్వేమిటో నిరూపించుకో. వర్షం కురిపించు.

ఊళి ముదల్ వన్ ఉరువం బోల్ మెయ్ కరుత్తు

మనకు తెలుస్తాయి కదా! మేఘాలు చూస్తే నీటి మేఘాలా! మామూలు మేఘాలా! అని.మామూలు మేఘాలు అయితే తెల్లగా, సాధారణంగా ఉంటాయి. కానీ నీటితో ఉన్న మేఘాలు అయితే నల్లగా, బరువుగా, మెల్లగా కలుగుతాయి.పరమాత్మ శరీరం లాగ మేఘాలు నల్ల పడాలి. అప్పుడే మనకి వర్షం కురుస్తుంది.

పాళియన్ దోళుడై పర్పనాబన్ కైయిల్

పరమాత్మ కుడి చేతిలో విష్ణు చక్రం ఏ విధంగా అయితే మెరుస్తుందో... నీ మెరుపుల కాంతి కూడా అలా ఉండాలి. ఆ పరమాత్మ ఎలా ఉంటాడట, విశాలమైన, సుందరమైన బాహువులు కలిగి ఉంటాడట. ఆయన యొక్క విశాలమైన బాహువుల్లాగా నువ్వు కూడా విశాలంగా దేశమంతా వర్షం కురిపించు. కృష్ణుడి యొక్క రంగు లాగా నీలంగా మారిపో. మేఘానికి మెరుపులు, గర్జన సహజమే. కానీ గోపికలు అవి కూడా కృష్ణుడితో పోలుస్తున్నారు. వాళ్ల యొక్క అనుభవం అంతా కృష్ణుడు. కూర్చుంటే కృష్ణుడు. నిల్చుంటే కృష్ణుడు, తింటే కృష్ణుడు, పడుకుంటే కృష్ణుడు. అంతా కృష్ణ మయమే.

ఆళిపోల్ మిన్ని, వలంబురిపోల్ నిన్ రదిరిందు
తాళాదే శాంగ (శారంగ) ముదైత్త శరమళై పోల్
వాళ వులగనిల్ పెయిదిడాయ్ నాంగళుమ్
మార్గళి నీరాడ మగిళిందేలో రెంబావాయ్

ఆయన ఎడమ చేతిలో శంఖం గర్జించినట్లు నువ్వు ఉరుములతో అలా గర్జించాలి. ఒక మనిషి కడుపు నిండా అన్నం తిన్న తర్వాత.. బ్రేవ్ మని ఎలాగైతే త్రేలుస్తాడో… నువ్వు కూడా అలాగే గర్జించాలి.శ్రీ మహా విష్ణువు యొక్క సారంగం అనే విల్లు నుంచి వెలువడిన బాణ వర్షం లాగా నువ్వు వర్షించాలి. కుంభవృష్టి కురిపించాలి. అప్పుడు మేము మార్గశిర స్నానం చేసి సంతోషంగా ఈ వ్రతాన్ని ప్రారంభిస్తాం.

భగవంతుడిని మనం భక్తితో కొలిస్తే మనసా వాచా కర్మణా భగవంతుడిని ఆరాధిస్తే... దేవతలు ఏ విధంగా అయితే భగవంతుని ముందు వినయంగా ఉంటారో... అప్పుడు భక్తులు చెప్పింది దేవతలు కూడా వింటారు. భక్తుల ఆజ్ఞల్ని పాటిస్తారు. గోదాదేవి అంత భక్తురాలు కాబట్టే వాన దేవుని ఆజ్ఞాపిస్తుంది. ఒక విధంగా అర్ధిస్తుంది. మనం భగవంతున్ని మేఘం రంగులా భావించకూడదు. మేఘాన్ని భగవంతుడి రంగుతో పోల్చాలి. పూర్వం కొంత మంది ఆళ్వారులు తమ పాశురాల్లో నారాయణున్ని మేఘంతో పోల్చి స్తుతిస్తారు. కానీ అందుకు విరుద్ధంగా ఆండాళ్ తల్లి మేఘాన్ని నారాయణుడితో పోల్చింది. ఆమె దృష్టిలో భగవంతుడే ఉపమానం. అంటే ఆయన దేనితోనీ పోల్చ లేనివాడు. అంతే కదా భగవంతున్ని దేనితోనూ పోల్చలేము. ఈ పాశురంలో గురువు యొక్క స్వరూపాన్ని, గుణాన్ని మనకి గోదాదేవి చెప్తుంది. ఇప్పుడు మేఘానికి, గురువుకి గల పోలికలు చూద్దాం. మేఘం సముద్రంలో ఉన్న ఉప్పు నీళ్లు తాగుతుంది. మనకి మంచి నీటిని వర్షిస్తుంది. అలాగే సత్ గురువు కూడా కష్టమైనటువంటి వేదం యొక్క అర్ధాన్ని సులభంగా చేసి మనకి వినిపిస్తాడు. మేఘం ఎడారి, పొలము, పల్లం, మెట్టు అన్న తేడా లేకుండా అంతటా సమానంగా వర్షిస్తుంది. అలాగే గురువు కూడా... తక్కువ వాడూ, ఎక్కువ వాడూ, గుణవంతుడు, గుణం లేని వాడు అని ఏమి చూడకుండా అందరికీ సమానంగా జ్ఞానాన్ని అందిస్తారు. దేశాటన చేస్తూ అందరికీ జ్ఞానాన్ని బోధిస్తాడు. మేఘం మనకి వర్షాన్ని ఇచ్చినప్పుడు రిటర్న్ గిఫ్ట్ ఆశించదు.

అదే విధంగా గురువు కూడా ప్రతిఫలాన్ని ఆశించరు. మేఘం తనలో ఉన్న నీరంతా ఒక్క చుక్కకూడా మిగల్చుకోకుండా మనకు ఇచ్చేసి.. అది వెల వెల పోతుంది. అలాగే గురువు కూడా విద్యనంతా ఇచ్చి.. అయ్యో శిష్యులకి ఇంకా ఏమీ ఇవ్వలేకపోయేనే అని విచారిస్తాడు. అలాగే వర్షం పడినప్పుడు మనం గ్లాస్ పెడితే గ్లాస్ లో పడతాయి. బింది పడితే బిందిలోకి వస్తాయి. మనం పట్టుకున్న పాత్రను బట్టి వస్తాయి. అలాగే గురువు చేసిన బోధ కూడా మన అర్హతను బట్టి వస్తుంది. మేఘం నీటితో నిండుగా ఉన్నప్పుడే మనకు వర్షం వస్తుంది. అలాగే మనకి భగవదనుగ్రహం పూర్తిగా ఉన్ననాడే గురువు శిష్యుణ్ణి తరింపజేస్తాడు. ఈ పాశురంలో మనం నేర్చుకోవాల్సింది ఒకటుంది. అసూయ లేకుండా ఒకరి సంతోషాన్ని చూసి.. మనం కూడా సంతోషించడమే ఈ వ్రత ఉద్దేశ్యం. వర్షం మనకే కాకుండా అందరికీ పడాలి. అంతే కాదు నలుగురితో కలిసే ఏ మంచి పనైనా చేయాలి. సుఖదుఃఖాలు పంచుకోవాలి. అందుకే వ్రత స్నానం చేయడానికి అందరూ కలిశారు. మొదట్లో గోదాదేవి ఈ వ్రతం చేస్తానంటే ఊరి పెద్దలు అంగీకరించలేదు. కానీ తర్వాత భగవంతుని అనుగ్రహం వల్ల పెద్దవాళ్లు అంగీకరించినందు వల్ల గోదాదేవి, మిగతా గోపికలు ఈ వ్రతం చేయడానికి చేయడానికి సిద్ధపడ్డారు. భగవంతుని అనుగ్రహం ఉంటే ఏదైనా జరుగుతుంది. అందుకే భగవత్తత్వం ఐదు విధాలుగా ఉంటుందని చెప్తారు. తిరుప్పావై మొదటి పాశురం నారాయణుడి యొక్క పర తత్వాన్ని బోధిస్తుంది. రెండవ పాశురము వాసుదేవుడు యొక్క వ్యూహ తత్వాన్ని, మూడవ పాశురం వామనావతారం యొక్క విశిష్టతను, నాలుగో పాశురం అంతర్యామి తత్వాన్ని, శ్రీ మహా విష్ణువు యొక్క చిహ్నాలు శంఖం, చక్రం, ధనస్సు వీటిని ఆండాళ్ తల్లి ఆవాహన చేస్తుంది.


ఆండాల్ తిరువడిగళే శరణం


Tuesday, December 17, 2024

తిరుప్పావై మూడవ పాశురము

తిరుప్పావై మూడవ పాశురము

శ్రీ గురుభ్యోనమః

జై శ్రీ కృష్ణ

ఆండాళ్ తిరువడిగలే శరణం

ప్రియ భగవత్ బంధువులారా!

నీళాతుంగ స్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం
పారార్థ్యం స్వం శ్రుతి శత శిర స్సిద్ధ మధ్యాపయంతీ!
స్వోచ్ఛిష్టాయామ్ స్రజినిగళితమ్ యా బలాత్కృత్య భుంక్తే
గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః

ఇది చాలా మంగళకరమైన పాశురం. ఇది విశేష పాశురం. దీనిని అనేక సందర్భాల్లో చదువుతూ ఉంటారు. విశేష పాశురం అంటే ఏమిటంటే మనకి మొదటి పాశురం విశేష పాశురం తిరిగి ఈ మూడో పాశురం విశేషం. అంటే రోజూ లాగా.. ఒక పొంగలి మాత్రమే నివేదన చేసి ఊరుకోకుండా... ఒక తీపి పదార్థాన్ని, రెండు మూడు ఆరగింపులను కూడా నివేదించడం, విశేష పాశురం రోజు మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు పాశురాన్ని చూద్దాం

ఓంగియులగళన్ద వుత్తమన్ పేర్పాడి
నాంగళ్ నమ్పావైక్కు చ్చాత్తి నీరాడినాల్
తీంగిన్ఱి నాడెల్లాం తింగళ్ ముమ్మారి పెయిదు
ఓంగు పెరుం శెన్నలూడు కయలుగళ 
పూంగువళై ప్పోదిల్ పొరివణ్డు కణ్-పడుప్ప
తేంగాదే పుక్కిరుందు శీర్ త్తములై పట్రి - వాంగ
కుడం నిఱైక్కుం వళ్ళల్ పెరుంబశుక్కల్
నీంగాద శెల్వం నిఱైందేలోర్ ఎమ్బావాయ్

ఈ పాశురం యొక్క అర్థం చూద్దాం.

ఈ మూడవ పాశురం లో వామనావతారం గురించి చెప్తారు. గోదాదేవికి వామనుడు అంటే ఇష్టం. ఎందుకంటే ఆమెకు శ్రీకృష్ణుడు అంటే చాలా ప్రీతి. శ్రీకృష్ణుడు యొక్క అందానికి ఆ తల్లి మయమర్చిపోయింది. అదేవిధంగా ఆ బాలవామనుడు కూడా ముద్దుగా ఉంటాడు కదా! బాలకృష్ణుడు ఎంత అందంగా ఉంటాడో.. అలాగే బాల వామనుడు కూడా అంతే అందంగా ఉంటాడు కాబట్టి గోదాదేవికి వామనావతారం అన్నా చాలా ఇష్టం. ఇది ఆశీర్వచన పాశురం. ఎక్కడ ఏ శుభకార్యం జరిగినా ఈ విశేష పాశురాన్ని పెద్దలు చదువుతారు. పాడి, పంట సమృద్ధిగా ఉండాలని పెద్దలు మంగళాశాసనం చేస్తారు. పాడిపంటలు రెండూ సమృద్ధిగా ఉంటే అదృష్టం.

శుభప్రదమైన వామనావతార కధ ఈ పాశురంలో వస్తుంది. బలి చక్రవర్తి భక్తుడు. దాన కర్ణుడు. కానీ అహంకారి. ఆయన అహంకారాన్ని తొలగించాలనే ఉద్దేశంతో శ్రీమహావిష్ణువు వామనుడు అయ్యాడు. ఒకసారి బలి చక్రవర్తి ఇంద్రుడితో యుద్ధానికి వెళ్లి ఓడిపోయాడు. అప్పుడు ఇంద్రుడిని ఎలాగైనా సరే ఓడించాలి అన్న అభిలాషతో.. విశ్వజిత్ యాగం చేసి సర్వశక్తులు పొంది.. మరల ఇంద్రుడి పై దాడి చేస్తాడు. ఇంద్రుడ్ని ఓడించి స్వర్గాన్ని ఆక్రమిస్తాడు. అప్పుడు ఇంద్రుడు మొదలైన దేవతలందరూ వచ్చి విష్ణువుతో మొరపెట్టుకొన్నారు. అప్పుడు విష్ణువు కశ్యపుడు - అదితి దంపతులకు కుమారుడిగా వామనుడై జన్మించాడు. బలిచక్రవర్తి చేస్తున్న అశ్వమేధయాగానికి వామనుడు వెళ్లి బలిచక్రవర్తిని మూడు అడుగుల భూమిని దానం చేయమని అడుగుతాడు. పొట్టిగా ఉన్న బ్రాహ్మణుడిని, అతనిలో ఉన్న తేజస్సు చూసి.. బలి చక్రవర్తి గురువైన శుక్రాచార్యుడు (ఆయన రాక్షసులు అందరికీ గురువే) దానం ఇవ్వద్దని బలిచక్రవర్తిని కోరతాడు. అతను సాక్షాత్తు విష్ణువే అని చెప్తాడు బలి చక్రవర్తికి. అప్పుడు బలి చక్రవర్తి శుక్రాచార్యుడితో.. గురువర్యా! సాక్షాత్తు శ్రీమహావిష్ణువు వచ్చి నన్ను దానం అడిగితే లేదు అని ఎలా అనగలను. ఆయన చేయి కింద, నా చేయి పైన ఉన్నప్పుడు అంతకంటే జీవితానికి అదృష్టం ఏముంటుంది అని ఆయన భార్య అయిన వింద్యావళితో కలిసి మూడు అడుగులు దానం ఇచ్చి మోక్షాన్ని పొందుతాడు.

ఇప్పుడు ఈ పాశురం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం..

ఓంగియులగళన్ద వుత్తమన్ పేర్పాడి

ఓ! గోపికలారా! వామనావతారంలో విష్ణుమూర్తి బలిచక్రవర్తిని మూడడుగుల దానం అడిగి మూడు లోకాలు కొలిచేశాడు. ఇంతింతై వటుడింతై అన్నట్లుగా పెరిగి పెరిగి మూడు లోకాలు కొలిచేశాడు. గోపికలు వామనావతారం ని ఇష్టపడటానికి కారణం ఏమిటి?

సాధారణంగా జీవులు ఏదైనా పెరగడానికి ఇష్టపడతారు కానీ తరగడానికి ఇష్టపడరు. ఈ అవతారంలో భగవంతుడు పెరుగుతాడు. అందుకని గోపికలు ఈ అవతారం అంటే ఇష్టపడతారు. భగవంతుడు కరుణామయుడు. భక్తుల కోసం ఎంత కిందకైనా దిగడానికి ఇష్టపడతాడు.

కానీ భగవంతుడు భక్తుడు కోసం ఆ రెండు హేయమైన పనులకోసం కూడా సిద్ధపడ్డాడు.ఇంద్రుని కోసం వామనుడిగా, ఒక బిచ్చగానిగా వచ్చాడు. అక్కడ చూడండి భారతంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి రధసారధిగా ఉన్నాడు. ఆయనకు ఏమి అవసరం ఉంది అంటే! ఇక్కడ అర్జునుడు భక్తుడు. అందుకే ఆయనకోసం సారధి అయ్యాడు.

కృష్ణుడు రాజ వంశంలో జన్మించి గోపికలను కాపాడటానికి గోపాలుడు అయ్యాడు. పాలు పితికే వాడయ్యాడు. అది ఆయన గొప్పతనం. భక్తుల మీద ఉండే ప్రేమ. తర్వాత ఇందులో ఇంకో రహస్యం కూడా ఉంది. వామన అవతారంలో వామనుడి తల్లిదండ్రులు అదితి కశ్యపులే.. శ్రీకృష్ణావతారంలో శ్రీ కృష్ణుడి తల్లిదండ్రులు దేవకీ వసుదేవులు. గోపిలకి  కృష్ణుడికి వామనునికి బేధం తెలీదు అనే ఉద్దేశంతోనే వామనావతారాన్ని కీర్తిస్తున్నారు.

దీనిలో అంతరార్థం చూద్దాం..

వామనుడు అడిగిన మూడు అడుగులలో రహస్యం ఏమిటంటే.. శ్రీకృష్ణుడు భగవద్గీత తొమ్మిదవ అధ్యాయం 27 వ శ్లోకంలో ఇలా చెబుతాడు అది మీ అందరికీ తెలిసిందే.

 యత్ కరోషి యదశ్నాసి 
యజ్ఞుహోషి దదాసి యత్
యత్ తపస్యసి కౌంతేయ
తత్ కురుష్వ మదర్పణమ్

ఏపనైతే చేస్తున్నావో, దేనినైతే తింటున్నావో, ఏ హోమాన్నైతే చేస్తున్నావో, దేన్నైతే చేస్తున్నావో, ఏ తపస్సైతే చేస్తున్నావో ఓ అర్జునా! ఆ ఫలితాలని నాకు సమర్పించు.

ఈ మూడు పాదాలలో చెప్పినవే వామనుడు అడిగిన మూడు అడుగులు. అర్జునుడు ద్వారా శ్రీకృష్ణుడు సర్వ జీవకోటిని ఉద్దేశించి చెప్పాడు. అటువంటి పురుషోత్తముని ప్రార్ధన చేస్తే

నాంగళ్ నమ్పావైక్కు చ్చాత్తి నీరాడినాల్

ఈ తిరుప్పావై వ్రతం పేరుమీద మనం ఉదయాన్నే స్నానం చేస్తే..

తీంగిన్ఱి నాడెల్లాం తింగళ్ ముమ్మారి పెయిదు

నెలకు మూడు వానలు కురిసినట్లయితే కరువుకాటకాలు ఉండవు. ఈతి బాధలు ఉండవు. సుఖంగా ఉంటాం. ఈతి బాధలంటే.. ఈతి బాధలు 6 ఉంటాయట. అవేమిటంటే అతివృష్టి, అనావృష్టి, ఎలుకలు, చిలకలు, మిడతలు(చీడలు), దుష్ట ప్రభుత్వం ఇవి అన్నీ తొలగిపోతాయట. 

ఓంగు పెరుం శెన్నలూడు కయలుగళ

వామనుడు లాగా వరిచేలు కూడా అంత ఎత్తుకు పెరుగుతాయి. అలా ఎదిగిన వరిచేల మధ్య నీటిలో చేపలు తుళ్ళి తుళ్ళి ఆడతాయిట. 

పూంగువళై ప్పోదిల్ పొరివణ్డు కణ్-పడుప్ప

కలువపువ్వుల్లో తేనె సమృద్ధిగా ఉంటుంది. ఆ తేనెను తుమ్మెదలు తాగి మత్తుగా నిద్రపోతాయట.

తేంగాదే పుక్కిరుందు శీర్ త్తములై పట్రి - వాంగ
కుడం నిఱైక్కుం వళ్ళల్ పెరుంబశుక్కల్

గోపాలబాలకులు పాలు పితకడానికి పశువుల కొట్టంలో ప్రవేశించి స్థిరంగా కూర్చుంటారట. వారి ప్రమేయం లేకుండా, వారు ఏమీ చేయకుండానే, అంటే పాలు పితికే ముందు ఆ దూడని తీసుకువచ్చి ఆవు దగ్గర పాలు తాగించి ఆ తర్వాత పాలు పితుకుతారు. కానీ ఇక్కడ అవేం చేయకుండానే వాళ్ళు పాల గిన్నెల్ని తిన్నగా తీసుకువచ్చి ఆ ఆవు దగ్గరకు వచ్చి ఆ పొదగు క్రింద పెడతారట. పొదుగులు ఎలా ఉంటాయట బలిష్టంగా ఉంటాయట. ఆ గిన్నె అక్కడ పెట్టగానే, పొదుగుల క్రింద పెట్టగానే ఏదో వర్షం వచ్చినట్టు పాలు ధారగా ఆ పొదుగుల నుంచి గిన్నెలోకి వస్తాయట.ఎన్నో కుండలతో పాలిస్తాయట ఆ గోవులు.

నీంగాద శెల్వం

మనము ఈ వ్రతాన్ని చేసినట్లయితే ఎన్నో సంపదలు వస్తాయి. ఎంతో ఐశ్వర్యం లభిస్తుంది. ఇలాంటి పవిత్రమైన వ్రతాన్ని చేసి మనం శుభాలు పొందుదాం. 


ఆండాల్ తిరువడిగళే శరణం


TRIPURA SUNDARI ASTAKAM - త్రిపుర సుందర్యాష్టకం

 త్రిపుర సుందర్యాష్టకం

కదంబవనచారిణీం  మునికదంబకాదంబినీం
నితంజితభూధరాం  సురనితంబిన్నీసేవితామ్| 
నవాంబరుహలోచనామభిన్నవాంబుదశ్యామలాం
త్రిలోచనకుటుంబినీం  త్రిపురసుందరిమాశ్రయే || 1 || 

కదంబవనవాసినీం కనకవల్లకీధారిణీం
మహార్హమణిహారిణీం ముఖసముల్లసద్వారుణీమ్| 
దయావిభవకారిణీం విశదరోచనాచారిణీం
త్రిలోచనకుటుంబినీం  త్రిపురసుందరిమాశ్రయే || 2 || 

కదంబవనశాలయా కుచభరోల్లసన్మాలయా
కుచోపమితశైలయా గురుకృపాలసద్వేలయా| 
మదారుణకపోలయా మధురగీతవాచాలయా
కయాపిఘననీలయ కవచితావయంలీలయా || 3 || 

కదంబవనమధ్యగాం కనకమండలోపస్థితాం
షడంబురుహవాసినీం  సతతసిద్ధసౌదామినీమ్| 
విడంబితజపారుచిం వికచచంద్రచూడామణీం
త్రిలోచనకుటుంబినీం  త్రిపురసుందరిమాశ్రయే || 4 || 

కుచాంచితవిపంచికాం కుటిలకుంతలాలంకృతాం
కుశేశయనివాసినీం కుటిలచిత్తవిద్వేషిణీమ్| 
మదారుణవిలోచనాం మనసిజారీసమ్మోహినీం
మతంగమునికన్యకాం మధురభాషిణీమాశ్రయే || 5 || 

స్మరేత్ప్రథమపుష్పిణీం రుధిరబిందునీలాంబరాం 
గృహీతమధుపాత్రికాం మదవిఘుర్ణనేత్రాOచలామ్| 
ఘనస్తనభరోన్నతాం  గలితచూలికాం శ్యామలాం
త్రిలోచనకుటుంబినీం  త్రిపురసుందరిమాశ్రయే || 6 || 

సకుంకుమవిలేపనామలక చుంబికస్తూరికాం
సమందహాసితేక్షణాం సశరచాపపాశాంకుశామ్| 
అశేషజనమోహినీమరుణమాల్య భూషాంబరాం 
జపాకుసుమభాసురాం  జపవిదౌస్మరామ్యంబికామ్ || 7 || 

పురందరపురంధ్రికాచికురసైరంధ్రికాం
పితామహపతివ్రతా పటుపటీరచర్చారతాం| 
ముకుందరమణీమణీలసదలంక్రియాకారిణీం
భజామి భువనాంబికాం సురవధూటికాచేటికామ్ || 8 || 

 || ఇతి శ్రీమచ్ఛంకరాచార్యవిరచితా త్రిపుర సుందర్యాష్టకం || 

Monday, December 16, 2024

తిరుప్పావై రెండవ పాశురము

తిరుప్పావై రెండవ పాశురము

శ్రీ గురుభ్యోనమః

జై శ్రీ కృష్ణ

ఆండాళ్ తిరువడిగలే శరణం

ప్రియ భగవత్ బంధువులారా!

నీళాతుంగ స్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం
పారార్థ్యం స్వం శ్రుతి శత శిర స్సిద్ధ మధ్యాపయంతీ!
స్వోచ్ఛిష్టాయామ్ స్రజినిగళితమ్ యా బలాత్కృత్య భుంక్తే
గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః


ఈ రెండవ రోజు 2వ పాశురం

మనం మొదటి పాశురంలో.. మనకి మోక్షాన్ని ప్రసాదించేవాడు ఆ పరమాత్మ ఒక్కడే అని తెలుసుకున్నాం.

నారాయణే నమక్కే పరై తరువాన్ 

ఆ నారాయణుడు ఒక్కడే మనకు మోక్షాన్ని ప్రసాదించేవాడు. మనం ఆ పరమాత్మని పొందాలంటే ఆయన నామాన్ని జపిద్దాం. అందరూ కలిసి వెళ్లి ఆయన దర్శనం చేద్దాం. అని చెప్పుకున్నాం. ఇప్పుడు రెండో పాశురం చూద్దాం. రెండో పాశురములో ఈ వ్రతం చేయడానికి కావలసిన విధి విధానాలు, చెయ్యవలసినవి, వదలవలసినవి ఆండాళ్ తల్లి మనకు చెబుతుంది.

వైయత్తు వాళ్వీర్గాళ్ నాముమ్ నమ్బావైక్కు
చ్చెయ్యుమ్ కిరిశైగళ్ కేళీరో పార్కడలుళ్
పై యత్తు యిన్ర పరమనడిపాడి
నెయ్యుణ్ణోమ్ పాలుణ్ణోమ్ నాట్కాలే నీరాడి
మైయిట్టెళుదోమ్ మలరిట్టు నాముడియోమ్
శెయ్యాదన శెయ్యోమ్ తీక్కురళై చ్చెన్రోదోమ్
ఐయ్యముమ్ పిచ్చైయుమ్ ఆన్దనైయుమ్ కైకాట్టి
ఉయ్యు మారెణ్ణి యుగన్దేలో రెమ్బావాయ్. ! || 2 ||

ఇప్పుడు ఈ పాశురం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం

వైయత్తు వాళ్ వీర్గాళ్ - 

ఓ భాగ్యవంతులారా! దుఃఖముతో కూడుకున్నటువంటి ఈ సంసారం లో కూడా ఆనందాన్ని అనుభవిస్తున్న అదృష్టవంతులారా! ఈ లోకం దుఃఖమయం కదా!, ఆనందం ఎక్కడిదీ అంటే.. ఎప్పుడైతే మీ మనసు ఆ పరమాత్మ వైపు మళ్ళిందో.. అప్పుడే మీరు ఆనందంతో ఉన్నట్టు లెక్క. సాక్షాత్తూ ఆ శ్రీకృష్ణ పరమాత్ముడే భూమ్మీద అవతరించాడు. ఏ విధంగా మీరు మీ పాపములను పోగొట్టుకుని భగవంతుని చేరగలరో ఆ విధానాన్ని తెలుసుకోండి.

నామం నం పావైక్కు

నోము చేయడానికి అంటే ఈ వ్రతం చేయడానికి కావలసినటువంటి విధానాలు చెప్తాను వినండి.

శెయ్యుం కిరిశైగళ్ - కేళీరో

వినండి ఏం చేయాలో చెప్తాను. ఏమర్రా వింటున్నారా! వినండి.

పాఱ్కడలుళ్ పైయత్తు యిన్ర పరమన్ అడిపాడి

పాల సముద్రంలో శేష శయ్యపై యోగ నిద్రలో నిద్రిస్తున్నటువంటి ఆ స్వామి యొక్క, ఆ పురుషోత్తముని యొక్క చరణాలమీద, పాదాలమీద పాడండి. మీకు ఎంత బాగా వస్తే, ఎంత చక్కగా పాడగలిస్తే అంత చక్కగా పాడండి. పాడుతూ వ్రతం చేయడానికి వెళదాం రండి. ఆయన పాల సముద్రం పై ఉండగానే.. ఆయన గురించి పాడితే.. అక్కడే ఆ తల్లి కూడా, ఆ లక్ష్మీదేవి కూడా ఆ స్వామి పాదాలను వత్తుతూ ఉంటుంది. కనుక ఆ సమయంలో చక్కగా పాడితే ఆ తల్లి అనుగ్రహం కూడా మనకి కలుగుతుంది. లక్ష్మీదేవి దగ్గరే ఉంటాడు కాబట్టి అప్పుడే మనకు స్వామి దొరుకుతాడు. ఇప్పుడు మనం అందరం కలిసి ఆ శ్రీ కృష్ణ నామాన్ని పాడుదాం. 

నెయ్యుణ్ణోమ్ పాలుణ్ణోమ్ నాట్కాలే నీరాడి

బిడ్డ అడిగింది ఏదైనా సరే తల్లి ఇవ్వకపోతే ఆ పిల్లవాడు ఎలాగైతే మారాం చేస్తాడో, అలుగుతాడో అలాగే మేము నెయ్యి తినము, పాలు తినము అంటుందట ఆ తల్లి. పాలు తినడం ఏమిటండీ! మరీ విడ్డూరం కాకపోతే; గొల్లలు కదండీ. వాళ్ళ మనసు నిండా కూడా కృష్ణ పరమాత్మ నిండి ఉన్నాడు కాబట్టి వాళ్ళు ఏం మాట్లాడుతారో, ఏమి చేస్తారో కూడా వాళ్ళకు తెలీదు. మనం పండగ వస్తే పాలు, నేతితో కలిపి పిండి వంటలు చేసుకుంటాం కదా! అంచేత స్వామి మాకు కనిపించే వరకు కూడా మేము పిండి వంటలు తినము. నెయ్యి, పాలు, పాల పదార్థాలు ఏవి కూడా వాడము అని చెప్తుందట ఆండాల్ తల్లి. 

మైయిట్టు ఎళుదోం మలరిట్టు నామ్ ముడియోమ్

అంటే మేము కళ్లకు కాటుక పెట్టుకోం, తలలో పూలు ముడుచుకోం అని అంటుంది. ఎందుకట భగవంతుడు తనకు దూరంగా ఉన్నప్పుడు, మన మీద అనుగ్రహం లేనప్పుడు, మనకి ఏ విషయాల్లోనీ కూడా ఆసక్తి ఉండదు. 

శెయ్యాదన శెయ్యోం  తీక్కుఱళై శెన్రు ఓదోమ్

ఏది చేయాలో అది చేస్తాం. ఏది చేయకూడదో అది చెయ్యం. పెద్దలు చెప్తారు కదా మనకు ఏ పని చేస్తే మంచిదో, ఏ పని చేస్తే చెడ్డదో. అందుకే పెద్దలు చెప్పిన దార్లోనే నడుస్తాం. ఎవరి మీద చాడీలు చెప్పం. లేనిపోనివి చెప్పం.

ఆయముం పిచ్చెయుం ఆందనైయుం కైకాట్టి

దానధర్మాలు చేస్తాం. పేదలకు అన్నదానం చేస్తాం. జీవితంలో శక్తికి మించి తోడివారి సుఖానికి పాటుపడదాం. అంతా నాదే, నా కోసమే అన్న భావన పోవాలి. అంతా వాడిదే. వాడి కోసమే మనం.. అన్న భావన పెంచుకోవాలి. సర్వం విష్ణుమయం జగత్ అని అనుకుంటే అప్పుడు ఈ జగత్తులో నీదంటూ ఏమీ ఉండదు. దానధర్మాలు పుచ్చుకునేవారు తృప్తి చెందే వరకు ఇయ్యాలి. (మనకి అవకాశం ఉంటే). పెద్దలను గౌరవిస్తాం. పండితులను సన్మానిస్తాం. ఇలా ఎన్నెన్నో పెద్దలు చెప్పిన అన్ని రకాలయినటువంటి మంచి పనులు చేస్తాం అని చెప్తున్నారు ఈ రెండో పాశురంలో. 

ఉయ్యుమాఱ్ ఎణ్ణి ఉగన్దు ఏలోర్ ఎమ్బావాయ

ఈ వ్రత విధానాన్ని తెలుసుకొని వ్రతాన్ని ప్రారంభించండి. ఈ రెండవ పాశురములో మనకి 9 నియమాలు చెప్పారు. అవేంటో ఒక్కసారి పరిశీలిద్దాం.

1. మనం చేయవలసింది పాలసముద్రంలో యోగనిద్రలో ఉన్న ఆ పరమాత్మ యొక్క పాదాలను కీర్తించడం 

2. బ్రహ్మ ముహూర్తంలో లేచి స్నానం చేయడం.

3. తిరువారాధన 

4. ప్రసాదంలో తప్ప.. పాలు నెయ్యి తీసుకోకుండా ఆహార నియమాలు పాటించడం

5. కంటికి కాటుక పెట్టుకోకుండా ఉండటం 

6. తలలో పువ్వులు పెట్టుకోకుండా ఉండడం. 

7. పెద్దలు చెప్పిన మంచి పనులు చేస్తాం 

8. ఎదుటి వారిపై అదేపనిగా చాడీలు చెప్పం. ఆత్మస్తుతి, పరనింద పనికిరావు. సీతాదేవి కూడా తాను లంకలో పడిన బాధలు రామునికి ఎప్పుడూ చెప్పుకోలేదట.

9. దాన, ధర్మాలు చేయ్యడం.


ఆండాల్ తిరువడిగళే శరణం


Sunday, December 15, 2024

THIRUPAVAI MEANING - తిరుప్పావై మొదటి పాశురం

తిరుప్పావై మొదటి పాశురం

శ్రీ గురుభ్యోనమః

జై శ్రీ కృష్ణ

ఆండాళ్ తిరువడిగలే శరణం

ప్రియ భగవత్ బంధువులారా!

నీళాతుంగ స్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం
పారార్థ్యం స్వం శ్రుతి శత శిర స్సిద్ధ మధ్యాపయంతీ!
స్వోచ్ఛిష్టాయామ్ స్రజినిగళితమ్ యా బలాత్కృత్య భుంక్తే
గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః


ప్రియ భగవత్ బంధువులారా!


ఇప్పుడు మొదటి పాశురం

1. పాశురం

మార్గళిత్తింగళ్ మదినిఱైంద నన్నాళాల్ ,
నీరాడ ప్పోదువీర్! పోదుమినో నేరిళైయీర్!
శీర్ మల్గుO  ఆయ్‍ ప్పాడి శెల్వచ్ శిరు  మీర్ కాళ్!
కూర్వేల్ కొడున్   తొళిలన్ నందగోపన్ కుమరన్ ,
ఏరారందకణ్ణి యశోదై యిళం శింగం ,
కార్మేనిచ్చెఙ్గణ్  కదిర్ మది యంబోల్ ముగత్తాన్,
నారాయణనే నమక్కే పఱై తరువాన్ ,
పారోర్ పుగళప్పడిన్దు  ఏలోర్ ఎమ్భావాయ్ ॥ 1 ॥

ఇప్పుడు ఈ పాశురం యొక్క అర్థాన్ని చూద్దాం.

మార్గళిత్తింగళ్ మదినిఱైంద నన్నాళాల్

ఇది ఎంతో పవిత్రమైన మార్గశిర మాసం మది నిఱైంద నన్నాళాల్ అంటే ఎంతో చక్కని చల్లని వెన్నెల రాత్రులు. పండు వెన్నెలట. వెన్నెల రాత్రులు తో కూడుకొని ఉందట ఈ మార్గశిర మాసం.

నీరాడ ప్పోదువీర్! పోదుమినో నేరిళైయీర్!

స్నానం చేద్దాం అనే సంకల్పం ఉన్నవాళ్లు రండి. ఓ చిన్న పిల్లలారా, ఓ కన్నె పిల్లల్లారా! రండర్రా అందరూ స్నానం చేయడానికి వెళదాం. అనిది గోదాదేవి గోపిక తో తన స్నేహితులైన గోపికలను పిలుస్తుందట. గోదాదేవి తన స్నేహితులను స్నానం చేయడానికి పిలిస్తుంది అంట. స్నానం అంటే మనం రోజూ, నిత్యమూ చేసే స్నానం కాదు. మనం చేసేది బాహ్య స్నానం. మన శరీరంపై వున్న మలినాన్ని తొలగించడానికి మాత్రమే.కానీ ఇక్కడ గోదాదేవి చెప్పే స్నానానికి అర్థం వ్రత స్నానం. ఈ వ్రత స్నానము మన అంతఃకరణ శుద్ధి కోసం. మనల్ని పవిత్రులను చేస్తుంది. మన మనసులను శుభ్రపరుస్తుంది.

శీర్ మల్గుం ఆయ్ ప్పాడి శెల్వచ్ శిరు మీర్ కాళ్!

సిరులు పొంగిపొరలే వ్రేపల్లె గోపిక లారా! చక్కని ఆభరణములు ధరించిన పడతులారా!

శెల్వచ్ శిరు మీర్ కాళ్!

అంటే ఆభరణాలు ధరించిన వారు అని అర్థం. రేపల్లెలోనట ధనధాన్యాలకి అంతు లేదట. విళ్లకి రత్నాలు, మణులు, మాణిక్యాలు కుప్పలుగా పోసి అమ్ముతారట. గోదాదేవి అంటుందట రకరకాల ఆభరణాలు ధరించిన రమణులారా! నందగోపుని భవనానికి వెళ్లి ఆ చిలిపి కృష్ణుని, చిన్ని కృష్ణుని కలుసుకుందాం రండి. అంటే రేపల్లెలో సిరులు పొంగిపొర్లుతాయట. అంటే సంపదలు రేపల్లెలో నిండుగా అంట. అలాంటి రేపల్లెలో జన్మించినటువంటి యుక్తవయసులో ఉన్న పడుచు పిల్లల్లారా! ఇప్పుడు వ్రత స్నానం చేయడానికి వచ్చే పిల్లలు అందరూ కూడా గోపికలందరూ కూడా పదహారేళ్ల పడుచుపిల్లలే. అలాంటి యువతుల్లారా, మేలి ఆభరణాలు ధరించిన మేల్బంతులారా! రండి రండి అని పిలుస్తుందట గోదా గోపిక.

అదేంటండీ స్నానానికి వెళుతూ ఆభరణాలు వేసుకోవడం ఏమిటీ ! నగలు వేసుకొని స్నానానికి వెడతారా ఏమిటి! ఎవరైనా మరీ గొప్ప కాకపోతే, అంటే ఇక్కడ నగలు, ఆభరణములు అంటే భక్తి, జ్ఞాన, వైరాగ్యాలే వారికి ఆభరణాలట.

కూర్వేల్ కొడున్ తొళిలన్ నన్దగోపన్ కుమరన్

చిన్ని కృష్ణుడు నందగోపుని భవనంలో ఉన్నాడు. ఆ భవనానికి స్వయంగా నందుడే ఒక వేలాయుధాన్ని అంటే పదునైన బల్లెం పట్టుకొని కాపలాగా ఉన్నాడట. ఎందుకు? ఎవరైనా రాక్షసులు మారువేషాల్లో వచ్చి చిన్ని కృష్ణుడికి హాని తల పడతారేమో అని భయం. గతంలో కూడా పూతన, శకటాసురుడు మొదలైన రాక్షసులు వచ్చి కృష్ణుడికి హాని తలపెట్టబోయి వాళ్లే మరణించారు. వాళ్లే బ్రతికి తిరిగి వస్తారో లేకపోతే కొత్త వాళ్ళు ఎవరైనా హాని తలపెట్టడానికి వస్తారో అని భయంతో తానే స్వయంగా కాపలాగా ఉన్నాడు. అలాంటి భవనంలోకి తామెలా వెళ్లి కృష్ణుని కలుస్తారు?

ఏరారందకణ్ణి యశోదై ఇళమ్ శింగం

శ్రీకృష్ణుడు అతి సుందరమైన కళ్ళతో ఉన్న యశోదా దేవి ఒడిలో పడుకొని సింహం పిల్లలాగా (ముద్దుల బాల సింహం) దుముకుతూ గంతులేస్తూ ఉన్నాడట. యశోదా దేవిని ముప్పుతిప్పలు పెడుతున్నాడట. కానీ అలాంటి అల్లరి కృష్ణుడు అక్కడ నంద భవనంలో నందుడి దగ్గర అయితే బిక్క మొఖం వేసుకొని భయంతో అమాయకంగా ఉంటాడట. ఇక్కడైతేనో యశోదాదేవి దగ్గరైతే చలాకీగా ఉంటాడట.

కార్మేనిచ్చెజ్గణ్ కదిర్ మది యంబోల్ ముగత్తాన్

మన గోపికలు శ్రీకృష్ణుడి రూపాన్ని, స్వభావాన్ని వర్ణిస్తున్నారుఅట. కారు మేఘాల్లాగ ఆయన నీల మేఘ శ్యాముడట.తామరలవంటి ఆయన రెండు కళ్ళు కూడా సూర్యచంద్రులట. అందమైన ముఖమట. అదేమిటండి సూర్యుడు చంద్రుడు కళ్ళు ఏంటండి. మనం ఆ పరమాత్ముని విశ్వరూపాన్ని దర్శిస్తే అప్పుడు మనకు తెలుస్తుంది ఏమిటా సూర్యుడు చంద్రుడు రెండు కళ్ళు ఏమిటన్నది….

భగవద్గీత పదకొండవ అధ్యాయం విశ్వరూపసందర్శనయోగం లో 19 వ శ్లోకంలో చెప్పారు.

అనాదిమధ్యాంత మనంతవీర్యమ్
అనంతబాహుం శశిసూర్య నేత్రం
పశ్యామి త్వాం దీప్తహుతాశవక్త్రం
స్వతేజసా విశ్వమిదం తపంతమ్

నీవు ఆదిమధ్యాంతరహితుడవు. అంటే నీకు తుది మొదలు లేదు.అపరిమిత శక్తి శాలివి. ఎన్నో భుజాలు కలవాడివి. సూర్య చంద్రులే నేత్రములుగా కలవాడివి.అగ్ని వలె నీ మొఖం వెలుగుతుంది. నీ తేజస్సు వల్లే ఈ లోకాలన్నీ వేడిగా ఉన్నాయి. అన్నీ నేను చూస్తున్నాను. అని అర్జునుడు చెప్తున్నాడు శ్రీకృష్ణుడితో.

ఒక్క మాట ఇక్కడ భగవంతున్ని గోదాదేవి ఎలా వర్ణన చేస్తుందో చూడండి.

నారాయణనే నమక్కే పఱైతరువాన్

ఆ నారాయణుడే, ఆ శ్రీకృష్ణుడే వ్రతం చేయదలచిన మనకి పర అనే వాద్యాన్ని ఇచ్చే వాడట. అంటే ఇక్కడ పర అంటే మోక్షం అని అర్థం చేసుకోవాలి. మనకి ఇహ, పరాలను ఇచ్చేవాడు ఆ శ్రీ కృష్ణుడే. అంటే ఆ నారాయణుడే. మనకి మోక్షాన్నిచ్చే వాడు ఆ పరమాత్మేనె కదా. ఆ పరమాత్మను కలవాలి మోక్షాన్ని పొందాలి అంటే తను ఒక్కర్తే వెళ్లి ఆ శ్రీకృష్ణుడ్ని కలుసుకొని మోక్షాన్ని పొందొచ్చు అన్ని చెప్పుతున్మ్నారు. మరి అందరిని ఎందుకు పిలవడం అంటే ఏదైనా ఒక మంచి పని చేసినప్పుడు ఒకరు వెళ్లి చేసే కంటే పది మందితో కలిసి వెళ్లి చేస్తే ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది. అందులో ఆ గోపికలు ఎవరు? ఎన్నో వేల మంది గోపికలు శ్రీ కృష్ణుని దర్శనం కోసం వెళుతున్నారట వారంతా చాలా కృష్ణునికి భక్తులట. వారు వారి గత జన్మలలో యక్షులు, మొదలైన వారు ఆ జన్మలలో భగవంతుని దర్శనం చేసుకోలేక, మోక్షాన్ని పొందలేక ఆ పరమాత్మ దూరంగా ఉండడం చేత మళ్లీ తిరిగి గోపికలుగా ఇప్పుడు జన్మ తీసుకొని అంతా కలిసి ఆ శ్రీకృష్ణుని, ఆ పరమాత్మని చూడటానికి తాపత్రయపడుతున్నారట.

ఆ తల్లి ఆ గోదాదేవి తనను ఒక గోపికగా భావించడమే కాకుండా అలా గోపిక లాగా అంటే ఒక గొల్ల పిల్ల లాగా తయారై, గోపికలు చీర కట్టుకొని కుడి పైట వేసుకుంటారట. అప్పుడు గోదాదేవి కుడి పైట వేసుకొని, తల ముడి వేసి ఎడమ వైపుకు కొప్పు పెట్టుకుంది. ఆ కొప్పుకి పూలదండ పెట్టుకొని ఆ పూల తోటలో గల బావిలో తన నీడను చూసుకొని అబ్బ ఎంత బాగుందీ పూలదండ అనుకొని ఆ పూలదండనే స్వామికి సమర్పించేదట. అప్పుడు స్వామితో ఇలా అన్నిందన్ట నా స్నేహితురాల్లని గోపికలుగా భావించి, ఈ ఆలయాన్ని నందగోపుని భవనం గా భావించి ఈ వ్రతాన్ని ఆచరించిందట.

మొత్తం సుమారుగా 5 లక్షల మంది గోపికలు రేపల్లె నుంచి రేపల్లె చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా బయలుదేరుతున్నారట. ఆ కృష్ణ పరమాత్మ దర్శనం కోసం. గోదాదేవి ఆ వటపత్రసాయిని అడుగుతుందట. నాకు ఎలాగైతే మోక్షాన్ని ప్రసాదించావో అదేవిధంగా నీ భక్తులకు, నిన్ను శరణాగతి పొందిన వారికి కూడా మోక్షాన్ని ప్రసాదించాలి సుమా! అని ఆ పరమాత్మని వేలుపెట్టి చూపించి మరీ అడుగుతుందట.

పారోర్ పుగళప్పడిన్దు ఏలోర్ ఎమ్బావాయ్.

అంటే ఆ పరమాత్మని చూద్దామనుకునే వారందరూ కూడా ఆయన్ని ప్రార్థన చేయడానికి, స్తోత్రం చేయడానికి ఈ వ్రతం చేయడానికి రండి. అందరం కలిసి ఈ వ్రతం చేసి తరిద్దాం అని పిలుస్తుందట ఆ గోదాదేవి.

ఇక్కడ ఇంకో గమ్మత్తయిన విషయం ఏమిటంటే ఏలోర్ ఎంబావాయ్ అన్నది మనకి ప్రతి పాశురం లో కూడా ముప్పై పాశురాల్లో కూడా చివరగా ఒక మకుటం లాగా వస్తుంది. మనకి చూడండి సుమతీ శతకం, వేమన శతకం చూసినట్లయితే ఆఖర్లో ప్రతి పద్యానికి విశ్వదాభిరామ వినురవేమ, లేదంటే -గదరా సుమతీ అని వస్తుంది కదా అలాగన్నమాట.

మీరందరూ వస్తే కలిసి వెళ్లి శ్రీవ్రతాన్ని చేద్దాం అని అర్థం. మరి ప్రతి రోజూ మనం అని 30 రోజులు, 30 పాశురాల్లో కూడా పారాయణం చేద్దాం అని చెప్పిందట. మోక్షాన్ని పొంది ఎప్పుడు వీళ్ళు అనే ప్రశన్న మనకి వచింది కదా? అంటే నిరంతరము కృష్ణుడితో గడపడమే స్నానం గా భావించాలి.


ఆండాల్ తిరువడిగళే శరణం


MANI DWEEPA VARNANA - మణిద్వీప వర్ణన

మణిద్వీప వర్ణన


మహాశక్తి మణిద్వీప నివాసినీ
ముల్లోకాలకు మూలప్రకాశినీ ।
మణిద్వీపములో మంత్రరూపిణీ
మన మనసులలో కొలువైయుంది ॥ 1 ॥

సుగంధ పుష్పాలెన్నో వేలు
అనంత సుందర సువర్ణ పూలు ।
అచంచలంబగు మనో సుఖాలు
మణిద్వీపానికి మహానిధులు ॥ 2 ॥

లక్షల లక్షల లావణ్యాలు
అక్షర లక్షల వాక్సంపదలు ।
లక్షల లక్షల లక్ష్మీపతులు
మణిద్వీపానికి మహానిధులు ॥ 3 ॥

పారిజాతవన సౌగంధాలు
సూరాధినాధుల సత్సంగాలు ।
గంధర్వాదుల గానస్వరాలు
మణిద్వీపానికి మహానిధులు ॥ 4 ॥

భువనేశ్వరి సంకల్పమే జనియించే మణిద్వీపము ।
దేవదేవుల నివాసము అదియే మనకు కైవల్యము ॥

పద్మరాగములు సువర్ణమణులు
పది ఆమడల పొడవున గలవు ।
మధుర మధురమగు చందనసుధలు
మణిద్వీపానికి మహానిధులు ॥ 5 ॥

అరువది నాలుగు కళామతల్లులు
వరాలనొసగే పదారు శక్తులు ।
పరివారముతో పంచబ్రహ్మలు
మణిద్వీపానికి మహానిధులు ॥ 6 ॥

అష్టసిద్ధులు నవనవనిధులు
అష్టదిక్కులు దిక్పాలకులు ।
సృష్టికర్తలు సురలోకాలు
మణిద్వీపానికి మహానిధులు ॥ 7 ॥

కోటిసూర్యుల ప్రచండ కాంతులు
కోటిచంద్రుల చల్లని వెలుగులు ।
కోటితారకల వెలుగు జిలుగులు
మణిద్వీపానికి మహానిధులు ॥ 8 ॥

భువనేశ్వరి సంకల్పమే జనియించే మణిద్వీపము ।
దేవదేవుల నివాసము అదియే మనకు కైవల్యము ॥

కంచు గోడల ప్రాకారాలు
రాగి గోడల చతురస్రాలు ।
ఏడామడల రత్నరాశులు
మణిద్వీపానికి మహానిధులు ॥ 9 ॥

పంచామృతమయ సరోవరాలు
పంచలోహమయ ప్రాకారాలు ।
ప్రపంచమేలే ప్రజాధిపతులు
మణిద్వీపానికి మహానిధులు ॥ 10 ॥

ఇంద్రనీలమణి ఆభరణాలు
వజ్రపుకోటలు వైఢూర్యాలు ।
పుష్యరాగమణి ప్రాకారాలు
మణిద్వీపానికి మహానిధులు ॥ 11 ॥

సప్తకోటిఘన మంత్రవిద్యలు
సర్వశుభప్రద ఇచ్ఛాశక్తులు ।
శ్రీ గాయత్రీ జ్ఞానశక్తులు
మణిద్వీపానికి మహానిధులు ॥ 12 ॥

భువనేశ్వరి సంకల్పమే జనియించే మణిద్వీపము ।
దేవదేవుల నివాసము అదియే మనకు కైవల్యము ॥

మిలమిలలాడే ముత్యపు రాశులు
తళతళలాడే చంద్రకాంతములు ।
విద్యుల్లతలు మరకతమణులు
మణిద్వీపానికి మహానిధులు ॥ 13 ॥

కుబేర ఇంద్ర వరుణ దేవులు
శుభాల నొసగే అగ్నివాయువులు ।
భూమి గణపతి పరివారములు
మణిద్వీపానికి మహానిధులు ॥ 14 ॥

భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధులు
పంచభూతములు పంచశక్తులు ।
సప్తృషులు నవగ్రహాలు
మణిద్వీపానికి మహానిధులు ॥ 15 ॥

కస్తూరి మల్లిక కుందవనాలు
సూర్యకాంతి శిల మహాగ్రహాలు ।
ఆరు ఋతువులు చతుర్వేదాలు
మణిద్వీపానికి మహానిధులు ॥ 16 ॥

భువనేశ్వరి సంకల్పమే జనియించే మణిద్వీపము ।
దేవదేవుల నివాసము అదియే మనకు కైవల్యము ॥

మంత్రిణి దండిని శక్తిసేనలు
కాళి కరాళీ సేనాపతులు ।
ముప్పదిరెండు మహాశక్తులు
మణిద్వీపానికి మహానిధులు ॥ 17 ॥

సువర్ణ రజిత సుందరగిరులు
అనంగదేవి పరిచారికలు ।
గోమేధికమణి నిర్మితగుహలు
మణిద్వీపానికి మహానిధులు ॥ 18 ॥

సప్తసముద్రములనంత నిధులు
యక్ష కిన్నెర కింపురుషాదులు ।
నానాజగములు నదీనదములు
మణిద్వీపానికి మహానిధులు ॥ 19 ॥

మానవ మాధవ దేవగణములు
కామధేనువు కల్పతరువులు ।
సృష్టి స్థితి లయ కారణమూర్తులు
మణిద్వీపానికి మహానిధులు ॥ 20 ॥

భువనేశ్వరి సంకల్పమే జనియించే మణిద్వీపము ।
దేవదేవుల నివాసము అదియే మనకు కైవల్యము ॥

కోటి ప్రకృతుల సౌందర్యాలు
సకల వేదములు ఉపనిషత్తులు ।
పదారురేకుల పద్మశక్తులు
మణిద్వీపానికి మహానిధులు ॥ 21 ॥

దివ్యఫలములు దివ్యాస్త్రములు
దివ్యపురుషులు ధీరమాతలు ।
దివ్యజగములు దివ్యశక్తులు
మణిద్వీపానికి మహానిధులు ॥ 22 ॥

శ్రీ విఘ్నేశ్వర కుమారస్వాములు
జ్ఞానముక్తి ఏకాంత భవనములు ।
మణినిర్మితమగు మండపాలు
మణిద్వీపానికి మహానిధులు ॥ 23 ॥

పంచభూతములు యాజమాన్యాలు
ప్రవాళసాలం అనేక శక్తులు ।
సంతానవృక్ష సముదాయాలు
మణిద్వీపానికి మహానిధులు ॥ 24 ॥

భువనేశ్వరి సంకల్పమే జనియించే మణిద్వీపము ।
దేవదేవుల నివాసము అదియే మనకు కైవల్యము ॥

చింతామణులు నవరత్నాలు
నూరామడల వజ్రపురాశులు ।
వసంతవనములు గరుడపచ్చలు
మణిద్వీపానికి మహానిధులు ॥ 25 ॥

దుఃఖము తెలియని దేవీసేనలు
నటనాట్యాలు సంగీతాలు ।
ధనకనకాలు పురుషార్ధాలు
మణిద్వీపానికి మహానిధులు ॥ 26 ॥

పదునాలుగు లోకాలన్నిటి పైన
సర్వలోకమను లోకము కలదు ।
సర్వలోకమే ఈ మణిద్వీపము
సర్వేశ్వరికది శాశ్వత స్థానమ్ ॥ 27 ॥

చింతామణుల మందిరమందు
పంచబ్రహ్మల మంచముపైన ।
మహాదేవుడు భువనేశ్వరితో
నివసిస్తాడు మణిద్వీపములో ॥ 28 ॥

భువనేశ్వరి సంకల్పమే జనియించే మణిద్వీపము ।
దేవదేవుల నివాసము అదియే మనకు కైవల్యము ॥

మణిగణఖచిత ఆభరణాలు
చింతామణి పరమేశ్వరిదాల్చి ।
సౌందర్యానికి సౌందర్యముగా
అగుపడుతుంది మణిద్వీపములో ॥ 29 ॥

పరదేవతను నిత్యముకొలచి
మనసర్పించి అర్చించినచో ।
అపారధనము సంపదలిచ్చి
మణిద్వీపేశ్వరి దీవిస్తుంది ॥ 30 ॥

నూతన గృహములు కట్టినవారు
మణిద్వీపవర్ణన తొమ్మిదిసార్లు ।
చదివిన చాలు అంతా శుభమే
అష్టసంపదల తులతూగేరు ॥ 31 ॥

శివకవితేశ్వరి శ్రీచక్రేశ్వరి
మణిద్వీప వర్ణన చదివిన చోట ।
తిష్టవేసుకుని కూర్చొనునంట
కోటిశుభాలను సమకూర్చుటకై ॥ 32 ॥

భువనేశ్వరి సంకల్పమే జనియించే మణిద్వీపము ।
దేవదేవుల నివాసము అదియే మనకు కైవల్యము ॥

Sri Gayatri Sahasra Nama Stotram - శ్రీ గాయత్రి సహస్ర నామ స్తోత్రమ్

శ్రీ గాయత్రి సహస్ర నామ స్తోత్రమ్ నారద ఉవాచ: భగవన్సర్వధర్మజ్ఞ సర్వశాస్త్రవిశారద । శ్రుతిస్మృతిపురాణానాం రహస్యం త్వన్ముఖాచ్ఛ్రుతమ్ ॥ 01 ॥ సర...