Monday, January 13, 2025
గోదా కళ్యాణం
గోదా కళ్యాణం
సకల శుభకరం గోదా కళ్యాణం వీక్షణం..
సాధారణంగా సీతా రామ కళ్యాణమని, శ్రీనివాస కళ్యాణమని ఇలా ఎన్నో కళ్యాణోత్సవాలు జరుపుకుంటుంటాం. గోదా రంగనాథుల కళ్యాణానికి ఒక వైలక్షణ్యం ఉంది మిగతా కళ్యాణాలతో పోల్చితే. శ్రీనివాసుని కళ్యాణోత్సవంలో స్వామికి వైభవం, సీతారామ కళ్యాణంలో కూడా స్వామికే వైభవం కానీ గోదా రంగనాథుల కళ్యాణంలో వైభవం అంతా అమ్మ గోదాదేవికే. ఎందుకని ?
ఎందుకని అంటే రెండు కారణాలు. గోదాదేవి అద్భుతమైన వ్రతాన్ని ఆచరించి, ఆ ఆచరించిన దాన్ని మన దాకా ఆచరించేట్టుగా చేసింది అందుకే "పాడియరుళవల్ల పల్-వళై యాయ్" అని అంటుంటాం కదా. తాను ఆచరించిన దాన్ని ఎంతో కాలం దాక ఆచరించగలిగేట్టుగా ప్రబంధాన్ని అందించింది. అది గోదా దేవి గొప్పతనం. ఇది వరకు ఇలాంటి వ్రతాన్ని గోపికలు చేసారు కానీ వారు తరువాతి వారికి ఏమి అందించలేదు శ్రీకృష్ణుని అనుభవాన్ని పొంది ఊరుకున్నారు తప్ప. సీతమ్మ రామచంద్రుణ్ణి వివాహమాడి ఊరుకుంది, పద్మావతి అమ్మవారు శ్రీనివాసున్ని వివాహమాడి ఊరుకుంది, కానీ గోదాదేవి ఒక్కో పాటలో మనం ఏంతెలుసుకోవాలి, ఎలా తెలుసుకోవాలి, ఎలా ఆచరించాలో చెప్పింది. సీతమ్మ కానీ పద్మావతి అమ్మవారు కానీ భగవంతుణ్ణి తనవంటి కదిలే రూపంలోనే వివాహ మాడారు వారి అవతారాల్లో. కానీ గోదా దేవి మనవకన్యగా ఉంటూ విగ్రహ స్వరూపుడైన రంగనాథున్ని వివాహమాడింది. తన ఆచరణతో విగ్రహ స్వరూపుడైన భగవంతుణ్ణి కదిలేట్టు చేసుకుంది. ఇది కదండి గొప్ప అంటే. మన ఎదురుగుండా కనిపించే విగ్రహాన్ని, అది దైవమని విశ్వసించి, మనం చెప్పినట్లుగా మనం పిలిచినట్లుగా అది కదలగలుగుతుంది పలకగలుగుతుంది అనే విశ్వాసాన్ని ఆండాళ్ తల్లి నిరూపించి చూపించింది. "ఉలగనిల్ తోత్రమాయ్ నిండ్ర శుడరే తుయిలెరాయ్", అంది అమ్మ అంటే "లోకంలో కంటికి కనిపించేట్టుగా విగ్రహరూపంలొ ఉండే భగవంతుడా! ఆ విగ్రహ రూపంలో నీ ప్రభావము అనుపమానము, అసమానము అని విశ్వసిస్తున్నాను" అని చెప్పి భగవంతుణ్ణి కదిలేట్టు చేసింది..
మూడు పనులు చేసి విగ్రహరూపంలొ ఉండే భగవంతుణ్ణి కదిలేట్టు చేసింది. అవి "కృష్ణమ్ ఉద్భోధ్య", "కృష్ణమ్ అధ్యాపయంతి" మరియూ "కృష్ణమ్ బలాత్కృత్య భూంక్తే". ఆయన ఏమి ఉలకకుండా పడుకుంటే మేల్కొల్పింది. చిన్న పిల్లవాడికి బెత్తం చూపి పాఠం చెప్పినట్లుగా, మనల్ని బాగుచేయడానికి, మనం తెలుసుకోవలసిన విషయాలని మనకి ఆయన ఎట్లా తెలిసేట్టు చేయాలో ఆయనకి పాఠాలు నేర్పింది. అంతే కాదు స్వామి విగ్రహరూపంలో ఉన్నా ఆయన్ని నిర్బందించి, బంధించి, ఆయన్ని పొందింది. అందుకే ఎక్కడో శ్రీవిల్లిపుత్తూరులో ఆంఢాళ్ ఉంటే, శ్రీరంగంలో ఉన్న స్వామి స్పందించి అర్చకులని, రాజుని అమ్మని తీసుకురమ్మని ప్రేరేపించి రప్పించుకున్నాడు. విగ్రహంలో ఉన్న స్వామితో వివాహమని తెలియగానే జనాలు తండోపతండాలుగా తరలి వచ్చి ఆశ్చర్యపోయినందుకే ఆ వీదికి చిత్రవీది అనే పేరు ఏర్పడిపోయింది. తరువాత వీది ఉత్తరవీది, అక్కడ ఉన్న స్వామి అమ్మని వివాహమాడి గోదాదేవిని తనలో చేర్చుకున్నాడు. మానవకన్యగా ఉన్న ఆండాళ్ తల్లిని ఉత్సవ మూర్తిగా మలచి తానూ ఉత్సవ మూర్తిగా కలిసి ఉన్నాడు శ్రీవిల్లిపుత్తూరులో, అమ్మ ఆదేశాన్ని బట్టి..
అమ్మ రామచంద్రుని ఇలవేల్పుఅయిన శ్రీరంగనాథున్ని వివాహమాడటంతో సీతారాములకే ఇలవేల్పు అయ్యింది. సీతారాములకి తరువాతి కాలంలో అవతరించినా వారికి ఇలవేల్పు అవడం అమ్మ గొప్పతనం..
మకర జ్యోతి దర్శనం
మకర జ్యోతి దర్శనం
మకర సంక్రాంతికి
శబరిమలలో జ్యోతి దర్శనానికి ఏంటి సంబంధం..?
మకర సంక్రాంతి అయ్యప్ప స్వామి జ్యోతి రూపంగా భక్తులకు దర్శనం ఇచ్చే శ్రీ అయ్యప్ప స్వామి వారి జన్మవృత్తాంతము క్లుప్తముగా అందరికి అర్థమయ్యే విధంగా సూక్ష్మగా తెలియజేయడం జరిగింది..
అమృతము కొరకు దేవతలు రాక్షసులు కలిసి క్షీరసాగారమును, మంధర పర్వతమును కవ్వముగా చేసి వాసుకి అను సర్పమును తాడుగా చేసి మధించు సమయమున ముందుగా ఉద్భవించిన హాలహలమును ( విషం ) చూసి భయబ్రాంతులై అందరూ పరుగులు తీస్తుండగా అది చూసిన పరమేశ్వరుడు ఆ విషాన్ని మ్రింగి ఆ వేడిని తట్టుకోలేక తన కంఠమందు బంధించి గరళకంఠుడై నాడు. అందులకు సంతోషించిన దేవ,దానవులు మరల క్షీరసాగారమును మధించగా అమృతభాండము లభించినది..
ఆ అమృతము కొరకు దేవూళ్ళు,రాక్షసులు వాదులాడుకుని యుద్ధమునకు సిద్ధ పడతారు. అప్పుడు జగన్మాత ఆదేశము మేరకు శ్రీ మహావిష్ణువు అతిలోక సౌందర్య వంతురాలైన జగన్మోహిని అవతారమున ప్రత్యక్షమై రాక్షసులను మాయా మోహంబున బంధించి అమృత భాండమును దేవతల కందించి వెళ్ళుచుండగా ఆ అతిలోక సుందరి మోహిని రూపలావణ్యమును చూసిన పరమేశ్వరుడు మోహ పడతాడు..
మోహిని రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు వయ్యారము ఒలకబోసి పరమేశ్వరుని చూసి లోక కళ్యాణార్ధం శివుని మొహానికి కవ్విస్తాడు. ఆ హరిహరుల గాఢపరిష్వంగంలో జాలువారిన శ్వేత బిందువుల కలయిక వలన నల్లని శరీరఛాయతో ఉగ్రరూపధారియై ఉద్భవించిన కుమారుడు జన్మించెను. అది తెలుసుకున్న బ్రహ్మదేవుడు ఆ పసిబాలునికి హరిహరసుతుడను నామకరణము చేసెను. తల్లి అయిన మోహిని ( శ్రీహరి ) తన కంఠమందున్ను మనిహారమును తీసి బాలుని మెడలో వేసి మణికంఠుడని, తండ్రి అయిన పరమేశ్వరుడు సకల భూతాలపైన ఆధిపత్యమును ప్రసాదించి భూతనాధుడని పిలిచారు. శివకేశవుల తత్వమున ఉత్భవించిన హరిహరసుతుడు సర్వధర్మములను శాసించుచూ ధర్మశాస్తాగా ఖ్యాతి గడించెను..
అలా అండగా మహిషాసురిని అకృత్యాలను భరించలేని దేవతలు జగన్మాతను శరణు వేడిరి. ఆ తల్లి ఆశీర్వాదముతో శ్రీలక్ష్మీ , సరస్వతి, పార్వతి దేవతల నుండి ఉద్భవించిన శక్తి స్వరూపిణి దుర్గాదేవి మహిషాసురుడనే రాక్షసుని సంహరించెను. తన సోదరుని మరణవార్త విని భరించలేని మహిషి ప్రతీకారము తీర్చుకొనుట కొరకు ముల్లోకములను అల్లకల్లోలము చేయుటకు నిశ్చయించుకొని తనకు మరణము లేని వరము పొందుటకు బ్రహ్మదేవుని గురించి ఘోరమైన తపస్సు చేసెను..
మహిషి తపస్సుకు మెచ్చి బ్రహ్మ ప్రత్యక్షమై నీ కోరికను తెలియజేయమనగా మహిషి తనకు చావులేని వరమును ప్రసాదించమనెను. అందులకు బ్రహ్మదేవుడు నీ కోరిక సమంజసమైనది కాదు అది ఆ హరిహరాదులకు కూడా సాధ్యము కాదని తిరస్కరించగా అప్పుడు మహిషి చింతించకుండా ఆ హరిహరులకు కుడా సాధ్యపడదని మీరే సెలవిస్తిరి కావున వారిద్దరికి జన్మించిన మానవుడు భూలోకములో నాపై జయించునట్లుగా వరమడిగెను..
అందుకు సమ్మతించిన బ్రహ్మదేవుడు సరే అని వరమిచ్చెను. ఆ మహిషి హరిహరులకు సంగమముతో బాలుడు జన్మించునా! జన్మించినను భూలోక మందు ఎలా జన్మించును! అది ఎలా సాధ్యమగును? అయినను ఇద్దరు పురుషులకు శిశువు ఎలా పుడతాడు? అయినా నేను ఈ లోకముము వదిలి నేనెలా భూలోకమునకు వెల్లెదను అని భావించి తన అజ్ఞాతముతో మహిషి ముల్లోకములను అల్లకల్లోలము చేయసాగెను. మహిషి పెట్టె బాధలు భరించలేని దేవతలు దేవేంద్రునీతో కలిసి పరమశివుని వద్దకు వెళ్లి వారి బాధలను చెప్పుకుంటారు..
వారి మొర విని పరమేశ్వరుడు భూలోకమున జన్మించమని భూతనాధునికి ఆజ్ఞాపించెను. తండ్రి మాటలను శిరోధార్యముగా భావించిన భూతనాధుడు సమ్మతించెను. ఇంతలో మహిషి ఆగడాలను అరికట్టేందుకు మన్మధుని ప్రయోగించి మన్మధ బాణాలను వదిలి మహిషిని మొహపరవశము చేశాడు, అలానే దత్తాత్రేయుడు కూడా మగ మహిషముగా మారి కామవాంఛలకు లోబడ్డ మహిషిని లోబరచి భూలోకమందున్న అలుదానది తీరమునకు తీసుకొని పోయి కామకేళి విలాసముతో మైమరపించుచుండెను..
కేరళదేశము నందు పందళ రాజ్యమును పరిపాలించు రాజశేఖర పాండ్యుడనే రాజు ఉండేవాడు. అతడు పరమ శివభక్తుడు, ఆయన భార్యా సాధ్వీమణి కూడా శ్రీ మహావిష్ణు భక్తురాలు, వారికి చాలా కాలము వరకు సంతానము కలుగలేదు. అందుకోసం ఆ దంపతులు నిరాశ చెందకుండా ఎన్నో నోములు, వ్రతములు, పూజలను జరిపించిన సంతానము కలుగలేదని బాధపడక భగవంతుని పూజలు మాత్రము మానలేదు..
ఒకనాడు రాజశేఖర పాండ్యుడు పంబానదీ తీర అడవి ప్రాంతములోని క్రూరమృగముల బాధపడలేక తన పరివారమును వెంటబెట్టుకొని వేటకు వెళ్ళాడు, అంతలో పంబానదీ తీరమున సర్పము నీడలో ఏడుస్తున్న బాలుని చూసి ఆశ్చర్యపడి ఆనందముగా బాలుని ఎత్తుకుని ఆ భగవంతుని వర ప్రసాదముగా భావించి, ఆ బాలుని తీసుకుని తన భార్యా మహారాణికి అప్పగించి . జరిగి విషయం తెలియజేస్తాడు. ఆమె మహా ఆనందముగా బాలుని ఎత్తుకుని అక్కున చేర్చుకొని ఆనంద పరవశురాలవుతుంది. ఆ బాలుని కంఠములో మణిహారము దివ్యకాంతులు వెదజల్లుతున్న ఆ బాలునికి మణికంఠుడని నామకరణము చేసి ఆ దంపతులు అల్లారుముద్దుగా పెంచుకొనుచున్నారు.ఆ మణికంఠుడు అడుగు పెట్టిన మహత్యమో ఏమో కాని మొత్తానికి పందల రాజ్యము సుభీక్షముగా మారుతుంది. అదే కాక పందళరాణి కూడా గర్భము దాల్చి ఒక కుమారున్ని ప్రసవింస్తుంది. ఆ దంపతుల ఆనందానికి అవధులు లేవు. మణికంఠునికి ఐదు సంవత్సరాలు రాగానే అక్షరాభ్యాసము చేయించి విద్యాభ్యాసమునకు గురుకుల ఆశ్రమమునకు పంపిస్తారు. అక్కడ మణికంఠుడు తక్కువ కాలములోనే సకల విద్యలు అభ్యసించి సకల శాస్త్రపారంగతుడై గురుదక్షిణగా గురు పుత్రునికి మాటను మరియు దృష్టిని ప్రసాదించెను. ఇంతలో ప్రజలను భయభ్రాంతులు చేస్తున్న 'వావరు' అనే అను బందిపోటు దొంగను ఎదుర్కొని అతనిని మణికంఠుడు ఓడించి తన భక్తునిగా మార్చి స్నేహితునిగా చేసుకొనెను..
మణికంఠుడు దినదిన ప్రవర్ధమానమై దివ్యకాంతులు వెదజల్లుతున్న మణికంఠుని చూసి ఓర్వలేని మహామంత్రి సింహాసనము తనే అధిష్టించునేమో అనుకొని ఎలాగైనా తనని తప్పించాలని అనేక పన్నాగాలు చేస్తాడు. మహారాణి వద్దకు పోయి తమ సొంత కుమారుడు ఉండగా ఎక్కడో దొరికిన అనామకుడికి సింహాసనము అధిష్టించి యువరాజుగా పాలించే అర్హత లేదు అనే నెపంతో రాణిగారికి తన పన్నాగపు బుద్దితో మనస్సు మార్చేస్తాడు. చెప్పుడు మాటలు విని స్వార్ధంతో ఆలోచిస్తుంది. మహారాణి ఆజ్ఞతో మణికంఠునికి అనేక కష్టాలు పెట్టిస్తారు..
కేరళ రాజ్య మాంత్రికులచే మహామంత్రి అనేక ప్రయోగములు చేయించగా పరమేశ్వరుడు అడ్డుకుని మణికంఠుని కాపాడేవాడు. అంతటితో చాలక మహామంత్రి విష ఆహారమును పెట్టిస్తాడు దానిని శ్రీహరి పంపిన గరుత్మంతుడు విషాన్ని తీసి అమృతమును చిలికించి కాపాడి వెళ్ళాడు. మణికంఠుని వదిలించుకొనుటకు ఏ కుతంత్రములు ఫలించుటలేదని నిరాశ నిస్పృహలకు లోనై చివరి ప్రయత్నంగా మహారాణికి శిరోవేదన మొదలయినది అని నాటకమాడి పరీక్షించుటకు వచ్చిన రాజవైద్యులు ప్రలోభాలకు గురై మహామంత్రి మాటలు విని అప్పుడే ప్రసవించిన పులిపాలు తెస్తే దానితో వ్యాధి నయమగును అని చెబుతారు..
ప్రసవించిన పులి ఎదుట నిలబడగల వారెవ్వరు యని మహారాజు చింతాక్రాంతుడైతాడు. పులిపాలు తెచ్చి పెంచిన తల్లిదండ్రుల ఋణమును తీర్చుటకై మణికంఠుడు ఆజ్ఞ అడుగగా మహారాజు కృంగిపోతాడు. పట్టువదలని మణికంఠుడు మరీ మరీ బ్రతిమాలి అడగగా మహారాజు పరిస్థితుల దృష్ట్యా సరే అనక తప్పలేదు. పులిపాల కొరకు బయలుదేరిన మణికంఠునికి పందళరాజు ఎత్తిన ఇరుముడిని తలపైదాల్చి చేతిలో విల్లమ్ములు ధరించి వస్తున్న మణికంఠునికి అడవి దారిలో దేవేంద్రుడు ఎదురై స్వామి యొక్క జనన వృత్తాంతమును తెలిపెను..
మహిషి ఆగడాలు మితిమీరిపోయాయి, సంహరించుటకు తగిన సమయము ఆసన్నమైనదని సెలవిచ్చాడు. అందుకు మణికంఠుడు దేవేంద్రుడికి మరియు దేవతలకు అభయమిచ్చి అలుదానదీ తీరము వైపు పయనమై అక్కడ దత్తాత్రేయుడు మగమహిష రూపము చాలించి దేవలోకమునకు వెళ్ళెను. తన చెలికాడు ఎచటకు వెళ్ళాడో తెలియని మహిషి రంకెలు వేయుచు వెదుకుచుండెను. ఆ సమయంలో నారదమహర్షి మహిషికి ఎదురై నిను సంహరించుటకు బాలుడు వస్తున్నాడని చెప్పి వెళ్ళిపోయెను. ఆ మాట వినగానే మహాఉగ్రురాలై మహిషి కరుడు గట్టిన రాక్షతత్వంతో జూలు విదిలించి స్వామిని మానవ మాత్రుడుగా తలచి ఎదుర్కొనెను. వారిరువురి మధ్య ఘోరమైన యుద్ధము జరిగినది. మణికంఠుడు తన రెండుచేతులతో మహిషిని లేవనెత్తి గిరగిర త్రిప్పుతూ అలుదానది తీరమున పడవేస్తాడు..
మహిషిలో నుండి శాపవిమోచము పొందిన లీలావతి ప్రత్యక్షమై స్వామి వారిని వివాహము చేసుకోమని ప్రార్థించెను. అందుకు స్వామివారు సమ్మతించక ఈ జన్మలో నేను నిత్య బ్రహ్మచారినై సకల మానవాళికి రక్షకుడనై ఉండెదను, కాబట్టి నేను నిన్ను వివాహము చేసుకోలేను అని మణికంఠుడు చెప్పగా అపుడు లీలావతి స్వామి వద్దకు పోయి మీ కోసమై పరితపించిన నా సంగతి ఏమిటి స్వామీ! అని అడుగగా మణికంఠుడు... దేవీ నీవు కుడా నా ప్రక్కనే మాళిగాపురోత్తమ్మగా వెలసి నాతోపాటు నీవు కుడా పూజలను అందుకొని నా దీక్ష చేసి శబరి కొండకు వచ్చిన స్వాములను భాదించక కాపాడి ఉండమని సెలవిచ్చెను..
మంజుమాతాదేవి స్వామితో అంటుంది మన వివాహము సంగతి తేల్చండి అని అడుగుతుంది అపుడు దేవీ! మొదటిసారి మాలధరించి కన్నెస్వామిగా 41 రోజుల దీక్షచేసి ఇరుముడి తలపై పెట్టుకుని నా సన్నిధికి ఎప్పుడైతే కన్నేస్వాములు రారో ఆ సంవత్సరం మనము వివాహము చేసుకుందామని స్వామివారు మంజుమాతకు మాట ఇస్తాడు..
మహిషి సంహారము జరిగినందుకు ఆనందముతో దేవతలు ఉండగా దేవేంద్రుడు స్వామివారి వద్దకు వెళ్ళి స్వామి! మీరు మీ తల్లి గారికి కావలసిన పులిపాల కొరకు వచ్చిన సంగతి మరిచారు అని గుర్తుచేసి ఇంద్రుడే పులిగా మారి స్వామి వారిని తనపై కూర్చోబెట్టుకొని దేవతలందరూ పులిపిల్లలుగా మారి వెంటరాగా మణికంఠుని పందళ రాజ్యం చేరుతాడు. అక్కడ ప్రజలు అందరూ భయభ్రాంతులై ఉండగా పందళరాజు ఎదురువచ్చి ఆనందముతో మణికంఠుని కౌగిలించుకొని నాయన మణికంఠ నీవు సామాన్యుడవు కాదు దైవాంస సంభూతుడివి మా తప్పులు మన్నించి మహారాణి, మహామంత్రితో కలిసి చేసిన కుతంత్రములను మన్నించి రాజ్యభారమును స్వీకరించమని ప్రార్థించెను.మణికంఠుడు అంగీకరించక ఆ రాజ్యభారము తమ్ముడు రాజరాజనుండుకి ఇవ్వండి. నా అవతారము పరి సమాప్తి అవుతుంది. మీ అనుమతి కొరకు వచ్చితిననగా మహారాజు, మహారాణి మరియు ప్రజలంతా శోక సముద్రములో మునిగిపోయారు. పందళరాజు అయ్యా నీ పట్టాభిషేకము కోసము చేసిన ఆభరణములైన స్వీకరించమనగా మహారాణి అప్పా మా తప్పులు మన్నించి మా వద్దనే ఉండమని అర్థింస్తుంది వారి ఆవేదనను గమనించిన మణికంఠుడు వారి అభీష్టము మన్నించి తల్లిదండ్రులైన మీరు చాలా చక్కగా నన్ను ఆదరించి అయ్యా + అప్పా అని పిలిచి కన్నకొడుకుగా చుసుకున్నందుకు అయ్యప్పగా అందరితో పిలవ బడతాను..
నేను ఒక బాణము సంధిస్తాను అది ఏ స్థలములో లభిస్తుందో ఆ స్థలంలో నా కొరకు ఆలయమును నిర్మించండి. ఆ ఆలయమునకు ముందు పద్దెనిమిది సిద్ధులకు సాంకేతముగా మెట్లతో నిర్మించినచో ప్రతీ మకర సంక్రాంతి పర్వదిన మకర నక్షత్ర జ్యోతి రూపముతో మీతో పాటు నా భక్తులకు దర్శనమిస్తాను. ఆ సమయములో మీరు నా కోసమై చేయించిన ఆభరణములు నియమ నిష్టాగరిష్టులై తీసుకొని వచ్చి పదునెట్టాంబడిని దాటి నా సన్నిధిలో నన్ను అలంకరించి నన్ను దర్శించిన వారికి ఆయురారోగ్య అష్ట ఐశ్వర్య ప్రదాతనై వారికి జీవస్ముక్తిని ఇవ్వగలనని చెబుతాడు..
అయ్యప్పస్వామి చెప్పిన విధంగా భక్త శబరికి మోక్షమిచ్చుటకు పంపానది తీరాన శబరి తపస్సు చేసిన స్థలము ఎంచుకొని ఆ స్థలానికి శబరిమలై అని పిలుచుకుంటూ అదే చోట ఆలయమునకు ముందర పదునెనిమిది మెట్లతో పందళరాజు రాజశేఖర పాండ్యుడు ఆలయాన్ని నిర్మించారు. నాటి నుండి నేటి వరకు ప్రతీ మకర సంక్రాంతి దినమున సాయంకాలము సమయమున జ్యోతి స్వరూపముగా స్వామివారు తన భక్తులకు దర్శనమిచ్చి కలియుగ ప్రత్యక్ష దైవమై విరాజిల్లుతున్నాడు అయ్యప్ప స్వామి..
భోగి పండుగ
భోగి పండగ
ఈ భోగి పండుగ ఎలా వచ్చింది ? భోగి మంట , భోగిపళ్ళ వెనుక దాగిన రహస్యాలు ఏమిటి ?
పెద్ద పండుగగా జరుపుకునే మూడు రోజుల సంక్రాంతి పండుగలో మొదటి రోజును మనం భోగి పండుగగా జరుపుకుంటాం
దక్షిణాయనంలో సూర్యుడు రోజు రోజుకి భూమికి దక్షిణం వైపుగా కొద్ది కొద్దిగా దూరమవుతూ దక్షిణ అర్ధగోళంలో భూమికి దూరం అవడం వలన భూమిపై బాగా చలి పెరుగుతుంది. ఈ చలి వాతావరణాన్ని తట్టుకునేందుకు ప్రజలు సెగ కోసం భగ భగ మండే చలి మంటలు వేసుకునేవారు, ఉత్తరాయణం ముందు రోజుకి చలి విపరీతంగా పెరగడం ఈ చలిని తట్టుకునేందుకు భగ భగ మండే మంటలు, దక్షిణాయనంలో ప్రజలు తాము పడిన కష్టాలను, బాధలను అగ్ని దేవుడికి ఆహుతి చేస్తూ రాబోయే ఉత్తరాయణంలో సుఖసంతోషాలను ఇమ్మని కోరుతూ వేసే మంటలు భోగి మంటలు అంటారని మన అందరికి తెలిసింది. మరైతే ఈ పండుగ రోజున భోగి మంటలు ఎందుకు వేస్తారో వాటి పురాణం మరియు "శాస్త్రీయ కారణాలు" తెలుసు కుందాం..
"భుగ్" అనే సంస్కృత పదం నుండి భోగి అనే పదం వచ్చింది. భోగం అంటే సుఖం.
"పూర్వం ఈ దినమే శ్రీ రంగనాధ స్వామి లో గోదాదేవి లీనమై భొగాన్ని పొందిందని దీని సంకేతంగా భోగి పండగ ఆచరణలోకి వచ్చిందనేది మన పురాణ గాద.. శ్రీ మహా విష్ణువు వామన అవతారం లో బలి చక్రవర్తిని పాతాళం లోకి తొక్కిన పురాణ గాద మనందరికీ తెలిసిందే అయితే తరువాత బలి చక్రవర్తికి పాతాళ రాజుగా ఉండ మని, ప్రతి సంక్రాంతికి ముందు రోజున పాతాళం నుండి భూ లోకానికి వచ్చి ప్రజల్ని ఆశిర్వదించమని వరమివ్వడం జరిగిందట. బలిచక్రవర్తి రాకను ఆహ్వానించడానికి భోగి మంటలు వేస్తారని మన పురాణాలలో చెప్పబడింది. కృష్ణుడు ఇంద్రుడికి ఒక పాఠం నేర్పుతు గోవర్ధన పర్వతం ఎత్తిన పవిత్రమైన రొజు ఇదే. శాపవశంగా పరమేశ్వరుని వాహనమయిన బసవన్నని భూమికి పంపించి రైతుల పాలిట దైవాన్ని భూమికి దిగి వచ్చిన రొజు ఇదే అనేవి కూడా పురాణాల గాధ."
సాదారణంగా అందరు చెప్పేది, ఇది చలి కాలం కనుక వెచ్చదనం కోసం మంటలు వేస్తారని. కానీ నిజానికి భోగి మంటలు వెచ్చదనం కోసం మాత్రమే కాదు, ఆరోగ్యం కోసం కూడా. ధనుర్మాసం నెలంతా ఇంటి ముందు పెట్టిన గొబ్బెమ్మలను పిడకలుగా చేస్తారు. వాటినే ఈ భోగి మంటలలో వాడుతారు. దేశి ఆవు పేడ పిడకలని కాల్చడం వలన గాలి శుద్ధి అవుతుంది. సుక్ష్మక్రిములు నశిస్తాయి. ప్రాణ వాయువు గాలిలోకి అధికంగా విడుదల అవుతుంది. దాని గాలి పీల్చడం ఆరోగ్యానికి మంచిది. చలికాలం లో అనేక వ్యాదులు వ్యాపిస్తాయి. ముఖ్యంగా శ్వాసకు సంబంధించిన అనేక రోగాలు పట్టి పిడిస్తాయి. వాటికి ఔషదంగా ఇది పని చేస్తుంది. భోగి మంటలు పెద్దవిగా రావడానికి అందులో రవి, మామిడి, మేడి మొదలైన ఔషద చెట్ల బెరడ్లు వేస్తారు. అవి కాలడానికి ఆవు నెయ్యని వేస్తారు. అగ్ని హోత్రంలో వేయబడిన ప్రతి 10 గ్రాముల దేశి ఆవు నెయ్యి నుంచి 1 టన్ను ప్రాణవాయువు (oxygen) ను విడుదల చేస్తుంది. ఈ ఔషద మూలికలు ఆవు నెయ్యి, ఆవు పిడకలని కలిపి కాల్చడం వలన విడుదల అయ్యే గాలి అతి శక్తివంతమైంది. మన శరీరం లోని 72,000 నడులలోకి ప్రవేశించి శరీరాన్ని శుభ్ర పరుస్తుంది. ఒకరికి రోగం వస్తే దానికి తగిన ఔషదం ఇవ్వవచ్చు, అదే అందరికి వస్తే అందరికి ఔషదం సమకూర్చడం దాదాపు అసాధ్యం. అందులో కొందరు వైద్యం చెయించుకొలేని పేదలు కూడా ఉండవచ్చు.ఇదంతా ఆలోచించిన మన పెద్దలు అందరు కలిసి భోగి మంటల్లో పాల్గొనే సంప్రదాయాన్ని తెచ్చారు. దాని నుండివచ్చే గాలి అందరికి ఆరోగ్యాన్ని ఇస్తుంది. కులాలకు అతీతంగా అందరు ఒక చోట చేరడం ప్రజల మద్యన దూరాలను తగ్గిస్తుంది, ఐక్యమత్యాని పెంచు తుంది. ఇది ఒకరకంగా అగ్ని దేవుడికి ఆరాధనా, మరోరకంగా గాలిని శుద్ధి చేస్తూ వాయుదేవునికి ఇచ్చే గౌరవం కూడా..
కాని మనం ఫాషన్, సృజనాత్మకత పేరుతో రబ్బరు టైర్లను పెట్రోలు పోసి తగల బెట్టి, దాని విష వాయువులను పిలుస్తూ, కాలుష్యాన్ని చేస్తూ మన ఆరోగ్యాన్ని తగలేసుకుంటున్నాం. పర్యావరణాన్ని నాశనం చేస్తునం. ఉన్న రోగాలే కాక కొత్త రోగాలని తెచ్చుకుంటున్నాం. ఇక భోగి మంటల్లో పనికిరాని వస్తువులని కాల్చండి అని వింటుంటాం. పనికి రాని వస్తువులు అంటే ఇంట్లో ఉండే ప్లాస్టిక్ కవర్లు, వైర్లు లాంటివి కావు..
ఇక్కడ మనం చరిత్రకి సంబంధించిన ఒక విషయం గుర్తుకు తెచుకోవాలి. మన భారతదేశం లో ఉన్న జ్ఞాన సంపదను నాశనం చేస్తే కాని భారతదేశాని ఆక్రమించుకోలే మనుకున్న బ్రిటిషు దండుగులు, భోగి మంటల్లో పాత సామాన్లు తగల బెట్టాలనే నెపంతో అమాయక ప్రజలు ఎన్నో వందల సంవత్సరాలుగా వారసత్వంగా కాపాడుకుంటూ వస్తున్నఅతి ప్రాచిన తాళపత్ర గ్రంధాలను భోగి మంటల్లో వేసి కల్పించేసారు. నిజానికి భోగి మంటల్లో కచాల్సింది పాత వస్తువులని కాదు , మనలోని పనికి రాని అలవాట్లు, చెడు లక్షణాలు. అప్పుడే మనకున్న పీడ పోయి మానసిక ఆరోగ్యం, విజయాలు వస్తాయి..
భోగి పళ్ళను పోయడంలోని అంతరార్దం తెలుస్సుకుందాం
భోగి రోజున భోగి పళ్ళు పేరుతో రేగి పళ్ళను పిల్లల మీద పోస్తారు. రేగి చెట్టుకు బదరీ వృక్షం అనే సంస్కృత పేరు. రేగి చెట్లు, రాగి పండ్లు శ్రీమన్నారాయణ స్వామి ప్రతి రూపం. ఇది సూర్యునికి ప్రీతిపాత్రమైన ఫలం. సూర్యుని రూపం, రంగు, పేరు కలిగిన రేగుపళ్ళతో నాణేలను కలిపి పిల్లల తలపై పోస్తారు. వాటిని తల పై పోయడం వలన శ్రీ లక్ష్మి నారాయణుల అనుగ్రహం మన పిల్లల ఫై ఉంటుంది అని, పిల్లలకి ఉన్న దిష్టి తొలగి పోయి వారి ఎదుగుదలకు తోడ్పడుతుందని మన పెద్దల విశ్వాసం..
మన బాహ్య నేత్రాలకి కనిపించని బ్రహ్మ రంద్రం మన తల పై భాగంలో ఉంటుంది. ఈ భోగి పండ్లను పోయి ఆ బ్రహ్మరంద్రాన్ని ప్రేరేపితం చేస్తే, పిల్లలలు జ్ఞానవంతులు అవుతారు. రేగు పండ్లు సూర్య కిరణలలోని ప్రాణశక్తి ని అధికంగా గ్రహించి, నిల్వ ఉంచుకుంటాయి కనుక వీటిని తల మీద పోయడం వలన వీటిలోని విద్యుచ్చక్తి, శరీరం ఫై, ఆరోగ్యం ఫై ప్రభావాన్ని చూపించి మంచి ఫలితాలు ఇస్తాయి. అందువలనే పిల్లలకి భోగి పండ్లు పోసి ఆశీర్వదిస్తారు..
మన ప్రతి సంప్రదాయం వెనుక అనేక అర్దాలు, అంతర్దాలు, రహస్యాలు ఉంటాయి. అవి తెలియకపోయినంత మాత్రం చేత ఆచార, సాంప్రదాయాలను ముఢనమ్మకలు అనుకోవడం మూర్ఖత్వం. వాటి విలువలను తెలుసుకొని చేసుకుంటే అవి మనకి మార్గదర్శకులు అవుతాయి.
Sunday, January 12, 2025
తిరుప్పావై - ఇరవై తోమిదవ పాశురము
తిరుప్పావై - ఇరవై తోమిదవ పాశురము
శ్రీ గురుభ్యోనమః
జై శ్రీ కృష్ణ
జై శ్రీమన్నారాయణ
నీళాతుంగ స్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం
పారార్థ్యం స్వం శ్రుతి శత శిర స్సిద్ధ మధ్యాపయంతీ!
స్వోచ్ఛిష్టాయామ్ స్రజినిగళితమ్ యా బలాత్కృత్య భుంక్తే
గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః
ప్రియ భగవత్ బంధువులారా!
ఈ రోజు ధనుర్మాసం 29 వ రోజు.
ఈ పాశురంలో గోపికలు.. శ్రీ కృష్ణ పరమాత్మ ని ఈ విధంగా ప్రార్థిస్తున్నారు...మార్గశీర్ష మాసంలో గోపికలు తమ పెద్దల అనుమతిపై వర్షం కోసం చేసిన వ్రతమే.. ఈ ధనుర్మాస వ్రతము. పెద్దల సంతృప్తి కోసం తాము స్నానవ్రతాన్ని ఆచరిస్తామని, ఆ వ్రతమునకు పఱ అను వాద్యము కావలెనని.. బయలుదేరి శ్రీకృష్ణుని చేరి ఆ పఱ ను ఇచ్చి, తమచేత ఆ వ్రతమును పూర్తిచేయించి, దాని ఫలముగా అలంకారములను, పరమాన్న భోజనములు చేయింపుము అని శ్రీకృష్ణుని ప్రార్థించారు. అప్పుడు శ్రీకృష్ణుడు తన మనసులో 'ఈ గోపికలు పఱ అంటున్నది మామూలు పఱ కాదు. వీరు ఇంకేదో కోరుకుంటున్నారు.. వారే చెప్తారులే - అని తాను మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడు. అప్పుడు గోపికలు 'అయ్యో ! మన ఆర్తీ, తొందర ఇతనికి తెలియడం లేదే అని భావించి తమ కోరికను శ్రీకృష్ణునికి తెలిపి నిత్యకైంకర్యమును - ఫలమును నీవే సమకూర్చవలెనని ఈ పాశురమున గోపికలు చెప్తున్నారు.
ఈ పాశురాన్ని చదువుదాం.
శిత్తమ్ శిఱుకాలే వన్దున్నై చ్చేవిత్తు, ఉన్న
పొత్తామరైయడియే పోత్తుమ్ పొరుళ్ కేళాయ్
పెత్త మ్మేయ్ త్తుణ్ణు కులత్తిల్ పిఱన్దు నీ
కుత్తేవ లెంగళై క్కొళ్ళామల్ పోకాదు
ఇత్తై ప్పఱై కొళ్వా నన్రుకాణ్, గోవిందా!
ఎత్తైక్కు మేళేళుపిఱవిక్కుమ్, ఉన్దన్నో
డుత్తోమే యావో మునక్కే నామాళ్ శెయ్ వోమ్
మత్తై నంగామంగళ్ మాత్తేలో రెంబావాయ్ || 29 ||
ఈరోజు ఆండాల్ తన వెంట ఉన్న గోపికలతో, తను ఏం కోరి వచ్చిందో నిరూపించిన రోజు. మనవాళ్లు మేం పరిశుద్ధులమై వచ్చాము అని గతంలో కూడా రెండు సార్లు చెప్పారు. మేము ఏ ఇతర ఫలితాలు కోరి రాలేదు. ఏ ఉపాయాలు కూడా వాళ్ల దగ్గర లేవని నిన్న చెప్పారు. ఈ రోజు స్వామి ముందర తమ ఆర్తిని ఆవిష్కరిస్తున్నారు. మేము రావడం సాధన కాదు. మా ఆర్తిని చూసైనా అనుగ్రహించాలని నీకు అనిపించడం లేదా! అని అంటున్నారు.
శిత్తమ్ శిఱుకాలే అంటే ఇంకా చీకటి తొలగని తెలతెలవారే సమయంలో మేము నీ దగ్గరికి వచ్చాము. మాలో ఆర్తిని పెంచింది నీవే కదా! మాకు జ్ఞానం కలగాలని ఎంతో కాలం నుంచి నీవు ప్రయత్నిస్తున్నా మాకు ఇన్నాళ్ళకి ఈ జ్ఞానం కలిగింది. ఇది నీవు చేసిన కృషే కదా!ఉన్నై చ్చేవిత్తు అన్నీ నువ్వే చేసినవాడివి.
శబరి లాంటి వారి దగ్గరికి నీవే స్వయంగా వెళ్లి వాళ్లను అనుగ్రహించావు.కానీ ఇప్పుడు మేం చేయవలసి వస్తుంది. మేము నిన్ను సేవిస్తున్నాం. మాకు ఉన్న జ్ఞానంతో మేము ఒక్కసారి మేము నీ వాళ్ళమే అని చెప్పగలిగితే చాలు.
ఉన్ పొత్తామరై యడియే పోత్తుమ్
పద్మములవంటి నీ దివ్య పాదములకు మంగళం పాడుతున్నాం.
(ఈ లోకంలో అద్భుతమైన పురుషార్థం కోసం వాడికున్న కొంత ఆస్తి చూసి, వాడే నాయకుడని వాడి చుట్టూ తిరుగుతూనే వుంటారు జనం. ఎంత అమాయకం! ఎంత ఆశ్చర్యమో కదా)
"సమస్త జీవులకు నాథుడు, పురుషోత్తముడు ఆయనే కదా! ఆయనే మూడు లోకాలనూ నడిపేవాడు. చేతులు కట్టుకుని ఒక్కసారి మనసులో నేను నీ వాడిని అని స్మరిస్తే చాలు ఆయన పరమపదాన్ని ఇస్తాడు" అని కులశేఖరాల్వార్ చెప్పినట్లుగా మేము నీ పాదాలను పాడడానికి వచ్చాం అని చెప్పారు.
కానీ పరమాత్మ ఏమి వినిపించుకోనట్లుగా, ప్రేమతో, తదేకంగా వారినే చూస్తున్నాడు.
పోరుళ్ కేళాయ్ నిన్ను ఎందుకు స్తోత్రం చేస్తున్నామో వినవయ్యా! అని ఆయనను తట్టి చెబుతుంది గోదాదేవి.
పెత్తమ్ మేయ్ త్తుణ్ణుం కులత్తిల్ పిఱన్దు
మొదట పశువులను మేపి, అవి తిన్నాక గానీ మేం తినేవాళ్ళం కాదు. నీకు మా సంగతి తెలియదా! మరి నువ్వేం చేస్తున్నావ్ ? మాకు మీ సేవే ఆహారం. అది మాకు లభించిన తర్వాతే కదా నీవు ఆహారం తినాలి.
నీ కుత్తేవల్ ఎంగలై క్కోళ్ళామల్ పోగాదు
నీ ఆంతరంగిక సేవకి మమ్మలను స్వీకరించాల్సిందే!
"ఏవో వ్రత పరికరాలు కావాలని అడిగారు కదా ఇదిగో" అని అక్కడ పెట్టాడు పరమాత్మ.
ఇత్తై పఱై కోళ్వాన్ అన్ఱు కాణ్ ఇవి కాదు. కేవలం మాట పట్టుకొనే చూస్తావా! మా మనసులో ఏముందో నీకు తెలియదా! అని అడిగారు గోపికలు.
నాకేం తెలీదు నేను మీ గొల్లలలో ఒక్కడినే కదా!అన్నాడు శ్రీకృష్ణుడు.
ఎత్తైక్కుం ఎల్లప్పటికీ ఈ కాలం ఆ కాలంలో కాదు సర్వకాల సర్వావస్థల యందు…ఏళేర్ పిఱవిక్కుమ్ ఏడేడు జన్మలలో కూడా ఉన్దన్నోడుత్తోమే యావోం నీతో సంబంధమే కావాలి. పరమపదంలో ఉన్న సరే మాకు నీ సంబంధమే కావాలి.
ఉనక్కే నాం ఆట్చెయ్ వోం
మత్తై నం కామంగళ్ మాత్త్
కేవలం నీ ఆనందం కోసమే మేము సేవ చేయాలి. మా సేవ ఆ విధంగానే అంకితమై ఉండాలి. తెలియక ఏమైనా లోపం ఉంటే అది నీవే సరిదిద్దాలి. మా పై భారం వెయ్యొద్దు.
ఇలా వ్రతం ఆచరించిన అందరికీ ఫలితం లభించింది. శ్రీకృష్ణ సాన్నిధ్యం లభించింది దీనికి సహకరించిన వారికి కోరినవన్నీ లభించాయి ఈ రోజే పురుషార్ధం పొందిన రోజు.
ఈరోజు స్వామి గోదాదేవిని రప్పించుకొని మానవ కన్యగా ఉన్న ఆమెను తాను విగ్రహ రూపంలోనే వివాహం చేసుకున్నాడు.
గోదాదేవి తాను కోరిన వైభోగాన్ని పొందిన రోజుని భోగి అంటారు.
ఈ రోజు 29వ.పాశురంతో మన తిరుప్పావై వ్రతం పూర్తి అయింది.
గోపికలు ఆనాడు ఆచరించినటువంటి కాత్యాయనీ వ్రతాన్ని మన గోదాదేవి కూడా ఆచరించి...గోపికలు ఆనాడు శ్రీ కృష్ణభగవానుని పొందినట్లు గోదాదేవి కూడా ఈనాడు శ్రీ రంగనాధుని పొందింది. గోదాదేవి వ్రతం పూర్తి చేసే సమయానికి శ్రీరంగం నుండి ఆ శ్రీరంగనాథుడు శ్రీవిల్లిపుత్తూరు నుండి తన అంతరంగ భక్తులను ఆండాల్ తల్లిని తీసుకురమ్మని పంపించారు. ఆ కబురు విన్న వెంటనే విష్ణుచిత్తుడు తన శిష్యుడైన వల్లభరాయుడుతో ఆండాల్ తల్లిని తీసుకొని శ్రీరంగానికి బయలుదేరాడు. అప్పుడు ఆ శ్రీరంగనాథుడు ఆండాల్ తల్లిని తనలో చేర్చుకున్నాడు. అందుచేత గోదా శ్రీ రంగనాథ కళ్యాణదివసం అని మన భోగి పండక్కి భోగి అని పేరు వచ్చింది. భోగం అంటే ఆ పరమాత్మని అనుభవించడమే. ఈ వ్రతం మనకి అన్ని విధాలా మంచి ఫలితాలనిస్తుంది. అందరూ ఆచరించదగినటువంటిది ఈ వ్రతం. మనం ఈ వ్రతాన్ని ఆచరించలేకపోయినా కనీసం ఈ ముప్పై పాశురాలను రోజూ మనం అనుసంధానం చేసినట్లైతే వ్రతం చేస్తే వచ్చే ఫలితం వస్తుంది.
ఆండాల్ తిరువడిగళే శరణం
Saturday, January 11, 2025
తిరుప్పావై - ఇరవై ఎనిమిదవ పాశురము
తిరుప్పావై - ఇరవై ఎనిమిదవ పాశురము
శ్రీ గురుభ్యోనమః
జై శ్రీ కృష్ణ
జై శ్రీమన్నారాయణ
నీళాతుంగ స్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం
పారార్థ్యం స్వం శ్రుతి శత శిర స్సిద్ధ మధ్యాపయంతీ!
స్వోచ్ఛిష్టాయామ్ స్రజినిగళితమ్ యా బలాత్కృత్య భుంక్తే
గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః
ప్రియ భగవత్ బంధువులారా!
ఈ రోజు ధనుర్మాసం 28 వ రోజు.
ఈరోజు ఈ పాశురంలో గోపికలు తమ అమాయకత్వాన్ని కృష్ణుడికి చెప్పి శరణు కోరుతున్నారు.
"దివ్యాభరణాలు అలంకరించుకొని, నూతన వస్త్రాలు ధరించి, పరమాత్మతో కలిసి పరమాన్నం తిందాం" అని గోపికలు కోరారు.
"అంతటి ఉన్నతమైన ఫలాన్ని అందుకోవడానికి మీకు ఉన్న అర్హతలు ఏమిటో చెప్పండి" అన్నాడు పరమాత్మ ఈ పాశురంలో.
కఱవైగళ్ పిన్ శెన్రు కానమ్ శేరుందుంబోమ్
అఱివొన్రు మిల్లాద వాయ్ కులత్తు, ఉన్దన్నై ప్పిఱవి పెఱుందనై పుణ్ణియమ్ నాముడైయోమ్
కుఱైవొన్రు మిల్లాద గోవిందా! ఉన్దన్నోడు
ఉఱవేల్ నమక్కి ఇంగొళిక్క ఒళియాదు
అఱియాద పిళ్ళైగళోమ్, అంబినాల్ ఉన్దన్నై
శిఱు పేరళైత్తనవుం శీఱి యరుళాదే
ఇఱైవా నీతారాయ్ పఱై, యేలో రెంబావాయ్ || 28 ||
ఈ పాశురం యొక్క భావం చూద్దాం..
"ఓ! కృష్ణా! మేము అవివేకులం. స్వామీ! మేము బ్రతకడం కోసం తెల్లవారగానే చద్ది అన్నం తిని, పశువులను తీసుకొని అడవికిపోయి, వాటిని మేపి సాయంకాలానికి తిరిగి వస్తాం. ఆవులను, గేదెలను కాచుకునే గొల్ల పిల్లలం. వివేకం ఏమాత్రము లేనివారము. అజ్ఞానులము. మా అదృష్టం కొద్దీ నువ్వు మాకులంలో జన్మించావు. నీకూ మాకూ ఉన్న బంధం తెగిపోయింది కాదు. తెగనిది. త్రెంచలేనిది. అందుకే మా గోపికల కులం ధన్యమైంది. నీతోడి సహవాసమే మాకు అదృష్టము."
"నందనందనా! మాకు మర్యాద ఏమాత్రము తెలియక చనువుతో చిన్నచిన్న పేర్లతో కృష్ణా! గోవిందా! ఒరేయ్! ఏరా! సఖుడా! నేస్తమా! అని పిలిచాము. కోపగించుకోవద్దు తండ్రీ! వైకుంఠం నుంచి మమ్మల్ని ఉద్ధరించడానికి దిగివచ్చిన నువ్వు మా మీద దయ ఉంచి 'నిత్యకైంకర్యం' అనే పురుషార్థాన్ని అనుగ్రహించు" అని వేడుకుంటున్నారు.
"హే భగవాన్! లోక సహజంగా అందరూ అడిగే వాటినే మేము కూడా కోరుతున్నామని నీకు అనిపించవచ్చు, కానీ మేము త్రికరణ శుద్ధితో నిన్ను అర్థించేది నీ శాశ్వత కైంకర్యభాగ్యం మాత్రమే" అని చెప్పుకున్నారు.
భగవంతుడు ప్రసన్నుడై, తన విభూతిని దర్శింపచేసి వారిని కృతార్థులను చేశాడు.
తాము సర్వేశ్వరుడైన కృష్ణుణ్ణి ఒక గొల్ల బాలుడిగా భావించి, చిన్నప్పట్నుంచి చనువు తీసుకొని, అతడితో వ్యవహరించిన తీరుకు గోపికలు మరల మరలా క్షమాపణలు కోరుతున్నారు.
ఓ! గోపాలకృష్ణా! నీవు పరిపూర్ణుడవు అని తెలియక, గాఢమైన ప్రేమ భావంతో, అభిమానంతో, నీ పట్ల చనువుగా ఉన్నాం. కుడిచేతికి, ఎడమచేతికి తేడా తెలియని వాళ్ళం. మేము నీ పట్ల తెలియక చేసిన అపరాధాలను మన్నించి, మేము నీ పాదపద్మాలను చేరుకునే దారి చూపించు. నిన్ను శరణు వేడుతున్నాం అని ప్రార్థన చేశారు.
ఆండాల్ తిరువడిగళే శరణం
Subscribe to:
Posts (Atom)
Haridra Pasupu Ganapathi Pooja - (హరిద్రా) పసుపు గణపతి పూజ
శ్రీ పసుపు గణపతి పూజ. పూర్వాంగం ॥ అస్మిన్ హరిద్రాబింబే శ్రీ మహాగణపతిం ఆవాహయామి, స్థాపయామి, పూజయామి ॥ ప్రాణప్రతిష్ఠ ఓం అసునీతే పునరస్మాసు చక్...
-
సూర్య ద్వాదశ నామాలు ధ్యేయః సదా సవితృమండలమధ్యవర్తీ నారాయణః సరసిజాసన సన్నివిష్టః । కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటీ హారీ హిరణ్మయవపుః ధృతశంఖచక్రః ...
-
నిత్య పారాయణ శ్లోకాలు స్తోత్రాలు నవ గ్రహ స్తోత్రం సుబ్రహ్మణ్యాష్టకం ఆదిత్యహృదయం కనకధారా స్త్రొత్రమ్ దుర్గాసప్తశ్లోకీ శ్రీ సరస్వతీ కవచం తోటకా...
-
శ్రీ దేవీ భాగవతము నవమ స్కంధములోని శ్రీ సరస్వతీ కవచం ఓం శ్రీం హ్రీం సరస్వ త్త్యై స్వాహా -శిరో మే పాతు సర్వతః । ఓం శ్రీం వాగ్దేవతాయై స్వాహా -ఫ...