Tuesday, June 9, 2026

The Kadamba tree, a favorite of the gods - దేవతలకు ఇష్టమైన కదంబ వృక్షం

దేవతలకు ఇష్టమైన కదంబ వృక్షం

హైందవ సంస్కృతిలో కదంబ వృక్షానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఈ కదంబ మొక్కను రుద్రాక్షాంబ అని కూడా అంటారు. దక్షిణాదిలో జగజ్జనని అమ్మవారిని కదంబవాసి అని అంటూ పూజలు చేస్తారు. ఇక హనుమంతుడి పుట్టుకకు మూలం ఈ వృక్షం.

అంతేకాదు కృష్ణుడు, గోపికల చీరలను దాచింది ఈ చెట్టుపైనే. ఈ కదంబ వృక్షం, భగవద్గీత, మహాభారతంలో కూడా ఈ మొక్క గురించి ప్రస్తావన వుంది. కదంబ వృక్షం చాలా పెద్దది. దీని పుష్పాలు గుండ్రంగా బంతి వలె అందంగా ఉంటాయి.

వీటిని లలితాదేవి పూజలో ప్రముఖంగా ఉపయోగిస్తారు. ఈ కదంబవృక్షానికి పురాణాల్లో రెండు రకాల పేర్లు ఉన్నాయి. ఉత్తరభారతం లో దీన్ని కృష్ణవృక్షమనీ, దక్షిణభారతం లో పార్వతీ వృక్షమనీ అంటారు. ఈ వృక్షానికి కృష్ణుడికీ మంచి అనుబంధం ఉంది. రాధాకృష్ణుల ముచ్చట్లు ఈ వృక్షం నీడలోనే జరిగాయంటారు. అందుకే కృష్ణవృక్షం అంటారని పురాణాలు చెబుతున్నాయి.

దక్షిణాదిలో అమ్మవారిని 'కదంబవనవాసిని' అంటారు. కదంబ వృక్షానికి 'ఓం శక్తిరూపిణ్యై నమః' అనే మంత్రంతో పూజ చేసినట్లైతే రోగనివారణ జరుగుతుందని చెబుతారు పండితులు చెప్పుతున్నారు.

గ్రహదోషాలు తొలగించు కోవడానికి అమ్మవారి స్వరూపమైన కదంబవృక్షానికి పసుపు, కుంకుమలు, పూలతో అర్చన చేయాలని, అలా పూజ చేసిన తర్వాత పెరుగన్నాన్ని పార్వతీదేవికి నివేదించాలి.

హనుమంతుడి పుట్టుకకు మూలం కదంబం. అంతేకాదు, సాక్షాత్తు పార్వతీ స్వరూపం ఈ వృక్షం. దక్షిణాదిలో అమ్మవారిని 'కదంబవనవాసిని' అనీ, అలాగే నేటి మీనాక్షి అమ్మవారి ఆలయం ఉన్న ప్రాంతమే కదంబవనం అంటారు. ఏది ఏమైనా అన్నాచెల్లెళ్ళు 'నారాయణా నారాయణి' లకూ, ఈ వృక్షానికీ చాలా సంబంధం ఉందని చెబుతారు.

Varaha Lakshmi Narasimha Swamy Temple, Simhachalam, Visakhapatnam - వరాహ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం, సింహాచలం, విశాఖపట్నం

వరాహ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం, సింహాచలం, విశాఖపట్నం

భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి చెందిన వరాహ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం సమీపంలో ఉన్న సింహాచలం కొండలపై ఉంది.

ఇది ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం నగరానికి సుమారు 11 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక చిన్న కొండ (సింహాచలం) పై ఉంది.

సింహాద్రి అప్పన్నకు చందనోత్సవం
'పాహీ! శ్రీమన్నారాయణ!' అని ప్రహ్లాదుడు పిలవగానే, గరుత్మంతుడిపై నుంచి ఒక్క ఉదుటున కిందకు దూకడంతో స్వామివారి పాదాలు పాతాళంలోకి దిగబడ్డాయి. అందుకే వరాహ నారసింహుడి పాద దర్శనం భక్తులకు లభించదు.

ప్రహ్లాదుడి తదనంతరం కాలక్రమంలో వరాహ నారసింహకృతి మట్టిపుట్టలో నిక్షిప్తమైంది. ఆ తర్వాత కొంతకాలానికి పురూరవ చక్రవర్తి తన పుష్పక విమానంలో ఊర్వశితో కలిసి ప్రయాణిస్తుండగా ఆ విమానం సింహగిరిపైకి వచ్చేసరికి ఉన్నట్టుండి ఆగిపోతుంది. ఊర్వశి తన దివ్యదృష్టి ద్వారా ఈ కొండ అత్యంత మహిమాన్వితమైనదని పురూరవ చక్రవర్తికి వివరిస్తుంది.

ఆ రాత్రికి అక్క డే బస చేయడంతో...స్వామివారు కలలో కనిపించి తాను ఇక్కడే కొలువై ఉన్నానని ఉత్సవం చేయాలని కోరాడు. పురారవ చక్రవర్తి ఎంత వెతికినా ఫలితం ఉండదు.

రెండో రోజు మళ్లీ కనిపించిన స్వామివారు తాను 12 అడుగులున్న పుట్టలో ఉన్నానని చెబుతాడు. అలా స్వామివారి విగ్రహాన్ని వెలికితీసి వైభవంగా చందనోత్సవం నిర్వహించినట్టు చెబుతారు.

స్వామి 12 అడుగుల పుట్టలో వచ్చినందుకు గుర్తుగా ఉత్సవం తదుపరి దశల వారీగా 12 మణుగుల చందనాన్ని సమర్పిస్తూ వస్తున్నారు.

పురూరవుడితో పునరుద్ధరణ జరిగిన చందన సేవ ఏటా అక్షయ తృతీయనాడు వైభవంగా సింహాద్రిపై కొనసాగుతోంది.

ఆలయ ప్రత్యేకతలు:
నిజరూప దర్శనం ఏడాదికి ఒక్కరోజే: ఇక్కడ స్వామివారు వరాహ మరియు నరసింహ (సింహం-మనిషి) రూపాల కలయికగా ఉంటారు. స్వామివారి ఉగ్రరూపాన్ని చల్లబరచడానికి ఏడాది పొడవునా చందనం పూతతో కప్పి ఉంచుతారు.

అక్షయ తృతీయ:
ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ తదియ (అక్షయ తృతీయ) రోజున మాత్రమే ఈ చందనాన్ని తీసివేసి, స్వామివారి అసలు రూప (నిజరూప) దర్శనాన్ని భక్తులకు కల్పిస్తారు.

కప్ప స్తంభం: ఆలయంలో ఉన్న 'కప్ప స్తంభం' చాలా ప్రసిద్ధి చెందింది.

శిల్పకళ: ఈ ఆలయం ఒడిశా (కళింగ) మరియు ద్రావిడ నిర్మాణ శైలుల అద్భుత కలయికతో నిర్మించబడింది.

Sri Kurmanatha Swamy Temple, Srikurmam, Srikakulam, Andhra Pradesh - శ్రీ కూర్మనాథస్వామి దేవాలయం, శ్రీకూర్మం, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్

శ్రీ కూర్మనాథస్వామి దేవాలయం, శ్రీకూర్మం, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్లోని అత్యంత విశిష్టమైన పుణ్యక్షేత్రాలలో శ్రీ కూర్మనాథస్వామి దేవాలయం ఒకటి. శ్రీమహావిష్ణువు దశావతారాలలో రెండోదైన కూర్మావతారం (తాబేలు) రూపంలో పూజలందుకునే ఏకైక క్షేత్రం ఇది.

ముఖ్యమైన విశేషాలు:
ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, శ్రీకాకుళం జిల్లాలోని శ్రీకూర్మం అనే గ్రామంలో ఉంది. ఇది శ్రీకాకుళం నగరానికి సుమారు 13 కిలోమీటర్ల దూరంలో ఉంది.

ఏకైక కూర్మ క్షేత్రం: ప్రపంచంలోనే కూర్మావతారంలో ఉన్న విష్ణుమూర్తికి ఉన్న ఏకైక ఆలయం ఇది.

రెండు ధ్వజస్తంభాలు: సాధారణంగా ఏ ఆలయానికైనా ఒకే ధ్వజస్తంభం ఉంటుంది. కానీ, ఈ ఆలయానికి తూర్పు, పడమర దిక్కులలో రెండు ధ్వజస్తంభాలు ఉండటం ఒక పెద్ద విశేషం.

పశ్చిమాభిముఖమూర్తి: ఇక్కడి స్వామివారి విగ్రహం పశ్చిమ ముఖంగా (పడమర వైపు) ఉంటుంది.

రెండు వైపులా తోకలు: గర్భగుడిలోని మూలవిరాట్ (కూర్మనాథుడు) శిలారూపంలో ఉండి, తోక భాగం పశ్చిమంగా, తల భాగం తూర్పుగా ఉంటుంది.

క్షేత్ర పురాణం: కృతయుగంలో శ్వేతచక్రవర్తి అనే రాజు భార్య విష్ణుభక్తురాలు. ఆమె ఏకాదశి వ్రతం చేస్తుండగా రాజు ఆమెను సమీపించగా, ఆమె స్వామివారిని ప్రార్థిస్తుంది. అప్పుడు గంగ ప్రవహించి వారి మధ్య దూరాన్ని పెంచుతుంది. రాజు పశ్చాత్తాపంతో తపస్సు చేయగా, శ్రీమహావిష్ణువు కూర్మావతారంలో ఇక్కడ ప్రత్యక్షమయ్యాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ ఆలయ ప్రాంగణంలో ఉన్న కోనేరును శ్వేతపుష్కరిణి అని పిలుస్తారు.

Disti Gummadikaaya - దిష్టి గుమ్మడికాయ

దిష్టి గుమ్మడికాయ

ఇంటి ముందర గుమ్మడికాయ కట్టడం అనగానే మనందరికీ గుర్తొచ్చేది కేవలం "దిష్టి" (నరఘోష) మాత్రమే. కానీ, మన పెద్దవాళ్లు ఏ ఆచారం పెట్టినా దాని వెనుక ఒక బలమైన శాస్త్రీయ, ఆధ్యాత్మిక మరియు ఆరోగ్య కారణాలు ఉంటాయి.

గుమ్మడికాయ కట్టడం వెనుక ఉన్న అసలైన విశేషాలు:

1. శాస్త్రీయ కారణం (ఎయిర్ ప్యూరిఫైయర్ లాంటిది)
గుమ్మడికాయకు గాల్లో ఉండే కాలుష్యాన్ని, బ్యాక్టీరియాను మరియు వైరస్లను పీల్చుకునే అద్భుతమైన శక్తి ఉంది. ఇంటి గుమ్మానికి కట్టిన గుమ్మడికాయ, ఆ దారి గుండా ఇంట్లోకి వచ్చే గాలిని శుద్ధి చేస్తుంది. అది క్రమంగా కుళ్ళిపోతోంది అంటే అర్థం, ఇంట్లోకి రావాల్సిన చెడు బ్యాక్టీరియాను లేదా నెగెటివ్ ఎనర్జీని అది తనలోకి లాగేసుకుంది అని.

2. మానసిక శాస్త్రం (Psychology)
ఎవరైనా కొత్తవాళ్లు లేదా ఈర్ష్యా భావం ఉన్నవాళ్లు మన ఇంటికి వచ్చినప్పుడు, వారి మొదటి చూపు నేరుగా మన ఇల్లు లేదా మన వస్తువులపై పడకుండా, గుమ్మానికి వేలాడుతున్న ఆ పెద్ద గుమ్మడికాయపై పడుతుంది.

దీనివల్ల వారి నుంచి వచ్చే మొదటి చూపులోని తీవ్రత (ఆ నెగెటివ్ వైబ్రేషన్) ఇళ్లపై పడకుండా ఆ కాయ గ్రహిస్తుంది. దాన్నే మనం దిష్టి తగలకుండా ఉండటం అంటాం.

3. ఆధ్యాత్మిక కారణం (మహా లక్ష్మి నివాసం)
శాస్త్రాల ప్రకారం గుమ్మడికాయను సాక్షాత్తు "సాత్విక బలి" గా భావిస్తారు. పూర్వకాలంలో నెగెటివ్ ఎనర్జీలు పోవడానికి జంతు బలులు ఇచ్చేవారు. కానీ, సనాతన ధర్మంలో జీవహింస తప్పు కాబట్టి, జంతువుకు ప్రత్యామ్నాయంగా గుమ్మడికాయను బలి ఇవ్వడం (పగలగొట్టడం) లేదా గుమ్మానికి కట్టడం అలవాటు చేశారు.

గుమ్మడికాయలో లక్ష్మీదేవి నివాసం ఉంటుందని నమ్ముతారు. అందుకే కొత్త ఇల్లు కట్టినా లేదా వ్యాపార సంస్థల్లోనైనా దీనికి పూజ చేసి కడితే సిరిసంపదలు కలుగుతాయని నమ్మకం.

నియమాలు: ఈ గుమ్మడికాయను సాధారణంగా అమావాస్య, మంగళవారం, లేదా శనివారం నాడు కట్టడం మంచిది.

దీనిని గుమ్మం మధ్యలో కాకుండా, ఇల్లు లేదా షాపు ప్రధాన ద్వారానికి ఇరువైపులా లేదా పైభాగంలో వేలాడదీయాలి.

కూష్మాండ దేవి

Matsyavatara Sri Vedanarayana Swamy Temple, Nagalapuram, Tirupati District - మత్స్యావతార శ్రీ వేదనారాయణ స్వామి ఆలయం, నాగలాపురం, తిరుపతి జిల్లా

మత్స్యావతార శ్రీ వేదనారాయణ స్వామి ఆలయం, నాగలాపురం, తిరుపతి జిల్లా

ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఏకైక మరియు అత్యంత ప్రసిద్ధ మత్స్యావతార దేవాలయం శ్రీ వేదనారాయణ స్వామి ఆలయం. దీనిని నాగలాపురం మత్స్య జయంతి ఆలయం అని కూడా పిలుస్తారు.

ఆలయం యొక్క ప్రత్యేకతలు:
ఈ ఆలయం భారతదేశంలోనే చాలా అరుదైనది. మహావిష్ణువు దశావతారాలలో మొదటిదైన మత్స్యావతారం (చేప రూపం) లో ఇక్కడ పూజలందుకుంటారు స్వామి.

గర్భగుడిలో స్వామివారి రూపం:
ఇక్కడ ఉన్న విగ్రహం చాలా విలక్షణమైనది. స్వామివారి శరీరం పైభాగం మానవ రూపంలో (విష్ణుమూర్తిగా చతుర్భుజాలతో), కింది భాగం చేప (మత్స్యం) రూపంలో ఉంటుంది. స్వామివారి వెనుక వైపు దేవేరులైన శ్రీదేవి, భూదేవి అమ్మవార్లు ఉంటారు.

సూర్య పూజ / సూర్య కిరణాల అద్భుతం :
ఈ ఆలయంలో జరిగే అతిపెద్ద అద్భుతం సూర్య కిరణాలు స్వామివారిని తాకడం. ప్రతి సంవత్సరం మార్చి నెలలో (తెలుగు పంచాంగం ప్రకారం ఫాల్గుణ శుద్ధ ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి రోజుల్లో) సూర్య కిరణాల ఉత్సవం జరుగుతుంది.

మొదటి రోజు: సూర్య కిరణాలు రాజగోపురం గుండా ప్రవేశించి స్వామివారి పాదాలను తాకుతాయి.
రెండవ రోజు: కిరణాలు స్వామివారి నాభి (బొడ్డు) భాగాన్ని తాకుతాయి.
మూడవ రోజు: కిరణాలు నేరుగా స్వామివారి ముఖాన్ని (శిరస్సును) అభిషేకిస్తాయి.

ఆలయ చరిత్ర:
పురాణ గాథ: సోమకాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుని వద్ద నుండి వేదాలను దొంగిలించి సముద్రంలో దాచేస్తాడు. అప్పుడు మహావిష్ణువు మత్స్యావతారం ఎత్తి, ఆ రాక్షసుడిని సంహరించి వేదాలను రక్షించి తీసుకొస్తాడు. వేదాలను తెచ్చినందుకు గాను ఇక్కడ స్వామివారిని వేదనారాయణ స్వామి అని పిలుస్తారు.

నిర్మాణం:ఈ ఆలయాన్ని విజయనగర సామ్రాజ్య చక్రవర్తి అయిన శ్రీకృష్ణదేవరాయలు తన తల్లి నాగలాంబ జ్ఞాపకార్థం నిర్మించారు. అందుకే ఈ ఊరికి నాగలాపురం అనే పేరు వచ్చింది. ఈ ఆలయ శిల్పకళ విజయనగర శైలిలో అద్భుతంగా ఉంటుంది.

ఈ 
ఆలయం నాగలాపురం, తిరుపతి జిల్లా (గతంలో చిత్తూరు జిల్లాలో ఉండేది) ఉంది.

మార్గం: ఇది తిరుపతికి సుమారు 70 కిలోమీటర్ల దూరంలో, మరియు చెన్నైకి దాదాపు 85 కిలోమీటర్ల దూరంలో ఉంది. తిరుపతి నుండి బస్సు లేదా టాక్సీ ద్వారా ఇక్కడికి సులభంగా చేరుకోవచ్చు.

Monday Lord Shiva - సోమవారం - పరమశివుని ఆరాధన

సోమవారం - పరమశివుని ఆరాధన

సోమవారం రోజున పరమశివుని  పూజించడం సహజం. సోమవారం రోజును "సోముని రోజు"గా భావిస్తారు. ఇక్కడ "సోమ" అంటే చంద్రుడు. చంద్రుడు పరమశివుడి జటాజూటంపై స్థానం పొందినవాడు కాబట్టి ఈ రోజు శివారాధనకు అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు.

పురాణల ప్రకారం, దక్షప్రజాపతి శాపం వల్ల చంద్రుడు తన కాంతిని కోల్పోయి క్షీణించసాగాడు. అప్పుడు చంద్రుడు పరమశివుని కోసం కఠిన తపస్సు చేశాడు. శివుడు ప్రసన్నమై చంద్రుణ్ని తన తలపై ధరించి శాప ప్రభావం తగ్గించాడు. అందుకే శివుడికి "చంద్రశేఖరుడు" అనే నామం వచ్చింది.

చంద్రునికి ప్రత్యేకించి ఆలయం లేనందున శివుని ఆరాధించడం ఆనవాయితీగా వస్తోంది. అంతేకాదు సోమ అనే శబ్దాన్ని స+ఉమ అని విడగొడితే ఉమాసహితుడు అనే అర్థం వస్తుంది.

ఉమాసహితుడైనవాడు అంటే పార్వతీపతి అంటే శివుడు. ఆ విధంగా సోమవారం శివునికి ప్రత్యేక దినంగా రూపాంతరం చెందింది. స్కాందపురాణంలో సోమవార వ్రతమహిమ ఉంది. ఈ రోజున శివుడు ఉమాసహితుడై భక్తులను అనుగ్రహిస్తాడు.

సోముడంటే కుబేరుడు అనే అర్థం కూడా ఉంది. ఐశ్వర్యం ఈశ్వరాదిచ్ఛేత్.. ఈశ్వరుడు ఐశ్వర్యదాయకుడు. శివుని ఆరాధించిన కుబేరుడు ఐశ్వర్యవంతుడైన రోజు కనుక ఈ రోజును సోమవారం అని పిలుస్తున్నారని పెద్దలు చెప్పారు.

సోమవారం రోజున శివారాధన చేస్తే, మనశ్శాంతి, దోష నివారణ, ఆరోగ్యం, ఐశ్వర్యం కోరికల సిద్ధి కలుగుతాయని భక్తుల విశ్వాసం.


సోమవారం శివునికి ఏ విధంగా పూజ చేయాలి:
శివారాధనకు సోమవారం విశిష్టమైనది. మిగిలిన రోజులకన్నా సోమవారం రోజు శివయ్యను ఆరాధిస్తే శివానుగ్రహం శ్రీఘ్రంగా లభిస్తుందని భక్తుల విశ్వాసం. స్కంద పురాణం ప్రకారం పరమ శివుడు తన శిరస్సున సోముడు అంటే చంద్రుని ధరిస్తాడు కాబట్టి సోమవారం శివారాధనకు శ్రేయస్కరమని తెలుస్తోంది.

దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఎన్ని మందులు వాడినా ప్రయోజనం లేకుంటే సోమవారం రోజు ఆవు పాలు, నల్ల నువ్వులు శివయ్యకు సమర్పించాలి. అనంతరం మహా మృత్యుంజయ మంత్రాన్ని 11 సార్లు జపించాలి. ఇలా 11 సోమవారాలు చేస్తే శివయ్య అనుగ్రహంతో అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి.

ఎన్ని ప్రయత్నాలు చేసినా వివాహం కుదరని వారు సోమవారం రోజు సూర్యోదయం సమయంలో కుంకుమ కలిపిన జలంతో శివలింగానికి అభిషేకం చేసి శివునికి ఎండుద్రాక్ష నైవేద్యంగా సమర్పించాలి. ఇలా 11 సోమవారాలు చేస్తే త్వరగా వివాహం అవుతుంది.

ప్రతి సోమవారం 'ఓం నమః శివాయ' అనే పంచాక్షరీ మంత్రాన్ని 108 సార్లు జపించడం వలన చేసే ప్రతి పనిలోనూ విజయం లభిస్తుందని శాస్త్రవచనం.

పార్వతీదేవి కూడా శివుడి అనుగ్రహం పొందడానికి సోమవారం వ్రతం చేసిందట. ద్వాపర యుగంలో శ్రీ కృష్ణుడు, అర్జునుడు కూడా సోమవారం వ్రతం చేసి దివ్య శక్తులను పొందినట్లు ఉంది. అందువల్ల ఈ కలియుగంలో కూడా సోమవారం శివుడికి పూజ చేయడం వల్ల కోర్కెలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం.

సోమవారం శివుడికి అభిషేకం చేయడం వల్ల పూర్వ జన్మలో చేసిన పాపాలు తొలగిపోతాయట. ప్రస్తుత జీవితంలో మనశ్శాంతి కలుగుతుందట. బాధలు పోయి సుఖ సంతోషాలు లభిస్తాయని పండితులు చెబుతున్నారు.

Thursday, June 4, 2026

Tuesday Subrahmanya Swamy - మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి

మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి

పార్వతీపరమేశ్వరుల తనయుడైన సుబ్రహ్మణ్య స్వామి సకల శుభకారకుడు. సర్వ దోష నివారకుడు. ఈ స్వామిని తొమ్మిది వారాల పాటు నియమనిష్టలతో ఆరాధిస్తే కుజ దోషాలు పోతాయి. ముఖ్యంగా కుజుడు వివాహం, సంతాన కారకుడు. కాబట్టి వివాహం ఆలస్యమయ్యే వారు, సంతానం కోసం ఎదురు చూసే వారు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తే శీఘ్రంగా వివాహం అవుతుంది, చక్కని సంతానం కలుగుతుంది.

క్షీరాభిషేకం: ఆ స్వామికి ముందుగా మన సంకల్పం చెప్పుకుని ఎవరు వివాహం లేదా సంతానాన్ని కోరుకుంటున్నారో వారి పేరు, జన్మ నక్షత్రం మీద మంగళవారం నాడు సుబ్రహ్మణ్యునికి క్షీరాభిషేకం జరిపిస్తే మంచిది. 

కుజ గ్రహానికి ఎరుపు రంగు సంకేతం కాబట్టి సుబ్రహ్మణ్య స్వామికి ఎరుపు రంగు వస్త్రం, ఎర్రని పూలు, ఎర్ర చందనం, దానిమ్మ పండు వంటివి నైవేద్యంగా సమర్పిస్తే మంచిది.

ఇలా తొమ్మిది మంగళవారాలు జరిపించిన అనంతరం వచ్చే కృత్తికా నక్షత్రం రోజున కానీ, శుద్ధ ష్షష్ఠి రోజున శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి కల్యాణం జరిపించుకుంటే సకల దోషాలు పోయి అనుకున్న పనులు నెరవేరుతాయి.

అలాగే సమీపంలో ఉన్న ఏ దేవాలయంలోనైనా నాగ ప్రతిష్ఠ ఉంటే ముఖ్యంగా రావిచెట్టు కింద నాగ ప్రతిష్ఠ ఉన్నట్లయితే ఇక్కడ కూడా ప్రతి మంగళవారం క్షీరాభిషేకం చేస్తే సుబ్రహ్మణ్యుని పూజించిన ఫలితమే వస్తుంది. సుబ్రహ్మణ్యుని విభూతి ధరించడం వలన సకల గ్రహ దోషాలు, పీడలు తొలగిపోతాయి.

Haridra Pasupu Ganapathi Pooja - (హరిద్రా) పసుపు గణపతి పూజ

శ్రీ పసుపు గణపతి పూజ. పూర్వాంగం ॥ అస్మిన్ హరిద్రాబింబే శ్రీ మహాగణపతిం ఆవాహయామి, స్థాపయామి, పూజయామి ॥ ప్రాణప్రతిష్ఠ ఓం అసునీతే పునరస్మాసు చక్...