భీష్మాష్టమి
భీష్మ అష్టమి ఉపవాసం చాలా పవిత్రమైనది, ఫలవంతమైనది. ఈ రోజు తమ పూర్వీకులకు మరియు భీష్మునికి తర్పణం విడుస్తారు.
మాఘ మాసంలోని శుక్ల పక్షంలోని ఎనిమిదవ రోజుని మోక్షతిథి లేదా నిర్వాణ తిథి అంటారు. ఈ తిథి నాడు భీష్ముని స్మరణార్థం నువ్వులు, నీరు సమర్పించడం చాలా శ్రేయస్కరం.ఈ రోజు తమ పూర్వీకులకు చేసిన తర్పణం వల్ల పూర్వీకులకు మోక్షం లభిస్తుంది. పిత్ర దోషం నుండి బయటపడవచ్చు
భీష్మ పంచకం అంటే ఏమిటి?
భీష్మాష్టమి మొదలుకొని భీష్మద్వాదశి వరకూ ఉన్న ఐదు రోజులనూ భీష్మ పంచకం అని పిలుస్తారు. వ్యాసుడు భారతాన్ని ప్రజలకు అందించి ఉండవచ్చు. కానీ భీష్ముడే కనుక లేకపోతే భారతమే లేదు ! తండ్రి సౌఖ్యం కోసం తన సింహాసనాన్నే త్యాగం చేసిన ధీరుడు భీష్ముడు. తన ద్వారా కలిగే సంతానం వల్ల ఆ త్యాగం ఎక్కడ పొల్లు పోతుందో అన్న సంశయంతో, ఆజన్మాంతం పెళ్లి చేసుకోనంటూ ‘భీషణ’ ప్రతిజ్ఞ చేసిన ధీరుడు.
భీష్మునికి తను కోరుకున్న సమయంలో తనువు చాలించగలిగే వరం ఉంది. అందుకే ఆయన మార్గశిర మాసంలో అంపశయ్య మీదకి చేరుకున్నా, ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేవరకూ వేచి ఉన్నాడు. ఉత్తరాయణం ప్రవేశించిన తరువాత అష్టమి రోజున , తనని ఐక్యం చేసుకోమని ఆ కృష్ణ పరమాత్ముని వేడుకున్నాడు. భీష్ముడు జీవితం యావత్తూ పరిపక్వంగానే గడిచింది. ఇక తన మరణ సమయంలోనూ తన విశిష్టతను చాటుకున్నాడు ఈ కురువృద్ధుడు.
తనను చూసేందుకు అంపశయ్య వద్దకు వచ్చిన ధర్మరాజుకు, రాజనీతిలోని సారాంశమంతా బోధించారు. పాండవులతో పాటుగా ఉన్న కృష్ణుని వేనోళ్ల స్తుతిస్తూ విష్ణు సహస్ర నామాన్ని పలికారు. అలాంటి భీష్ముని కొలుచుకునేందుకు ఆయన నిర్యాణం చెందిన తరువాత వచ్చే ఏకాదశి భీష్మ ఏకాదశిగా జరుపుకొంటున్నాము.
భీష్మ ఏకాదశిని జయ ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈ రోజు మొదలుపెట్టిన ఏ కార్యమైనా విజయవంతం అవుతుందని ఓ నమ్మకం. అందుకనే ఆ పేరు. ఇక భీష్ముడు భారతీయులందరికీ పూర్వీకుడే! ఆచార్యునిగా, భరతవంశంలోని ఆది పురుషునిగా ఆయన మనకు స్మరణీయుడు. అందుకే ఈ రోజున ఆయనకు తర్పణాలను విడవాలని సూచిస్తారు. భీష్ముని తమ పూర్వజునిగా భావిస్తూ ఎవరైతే ఆయనకు తర్పణం విడుస్తారో వారి పాపాలన్నీ దహించుకుపోతాయని పెద్దలు చెబుతారు.
భీష్మాష్టమి మొదలుకొని భీష్మద్వాదశి వరకూ ఉన్న ఐదు రోజులనూ భీష్మ పంచకం అని పిలుస్తారు. ఈ అయిదు రోజులూ భీష్ముని వ్యక్తిత్వాన్ని తలచుకుంటారు. భీష్ముని జీవితం నుంచి ప్రేరణ పొందేందుకు ఈ అయిదు రోజులనూ కేటాయిస్తారు.
మనం తరచూ వినే వ్యక్తిత్వ వికాస తరగతులకు ఏమాత్రం తీసిపోని ఆచారం ఇది. పైగా భీష్మ ఏకాదశినాడు ఉపవాసం ఉంటూ, విష్ణుసహస్రనామాలను జపిస్తూ, భగవద్గీతను పఠిస్తూ, భీష్ముని తల్చుకుంటే సాగే క్రతువుతో మనిషి వ్యక్తిత్వమే సాత్వికంగా మారిపోతుంది.
No comments:
Post a Comment