Thursday, January 1, 2026

Atla Taddi Katha - అట్లతద్ది కథ

అట్లతద్ది కథ

ఆశ్వయుజ మాసంలోని తదియ తిథినే అట్లతద్ది లేదా అట్ల తదియ అని అంటారు. ఈ పండుగను ఉయ్యాల పండుగ, గోరింటాకు పండుగ అని కూడా పిలుస్తారు. ఇది ముఖ్యంగా తెలుగు మహిళల ఆరాధన పండుగలలో ఒకటి, గౌరీదేవిని పూజిస్తూ కుటుంబ సౌఖ్యం, సుభిక్షం, మంచి వరుడు కోసం అమ్మాయిలు ఈ రోజును ఎంతో ఆనందంగా జరుపుకుంటారు. పూరాణాల ప్రకారం, ఈ రోజున గౌరీదేవి పార్వతీ అమ్మవారి అవతారంగా పూజించబడుతుంది. సతీమణులు భర్త సౌఖ్యాన్ని కోరుకుంటూ, పెళ్లికాని అమ్మాయిలు తమకు కావలసిన గుణగణాలతో కూడిన భర్త కోసం వ్రతం చేస్తారు. ఈ వ్రతంలో ముఖ్యమైన విశేషం “అట్లు వండటం, పంచుకోవడం, ఉయ్యాల ఊగడం” కావడం.

అట్లతద్ది పుట్టుక వెనుక ఆసక్తికరమైన కథ ఉంది. పూరాణ ప్రకారం, గౌరీదేవి శివుడిని పొందడానికి దీర్ఘకాలం తపస్సు చేసింది. తపస్సు ఫలితంగా ఆమెకు శివుడి అనుగ్రహం లభించింది. ఆ దినమే “అట్లతద్ది”గా పరిగణించబడుతుంది. అందువల్ల ఈ రోజున స్త్రీలు గౌరీదేవికి పూజలు చేసి, అట్లు (పిండివంటలు) నైవేద్యంగా సమర్పిస్తారు. పూజ అనంతరం అమ్మవారిని ఆరాధిస్తూ ఉయ్యాల ఊగడం, గోరింటాకు రాయడం, సఖులతో పాటలు పాడడం ఆచారంగా కొనసాగుతుంది. ఈ రోజు ఇంట్లో ఆనందం, స్నేహభావం, సౌందర్యం ప్రతిఫలించేలా మహిళలు చేస్తారు. పెళ్లికాని అమ్మాయిలకు ఈ రోజు ఎంతో శుభప్రదంగా భావిస్తారు. పండితుల అభిప్రాయం ప్రకారం, అట్లతద్ది రోజున ఉయ్యాల ఊగుతూ సంతోషంగా గడిపిన అమ్మాయిలకు సుగుణాలు గల భర్త లభిస్తాడు. గౌరీదేవి కృపతో వారి జీవితంలో సౌఖ్యం, శాంతి నెలకొంటుందని నమ్మకం. యుక్తవయస్క ఆడపిల్లలు ఈ రోజున స్నేహితులతో కలిసి ఆటపాటలతో గడిపితే అది గౌరీదేవికి సేవ చేసినట్లే అని పురాణాలు పేర్కొంటాయి. అందుకే గ్రామీణ ప్రాంతాల నుంచి నగరాల దాకా ఈ పండుగను మహిళలు ఎంతో ఉత్సాహంగా, ఆనందంతో జరుపుకుంటారు. అట్లతద్ది కేవలం ఆచారం మాత్రమే కాకుండా, స్త్రీ శక్తి, భక్తి, సౌభాగ్యానికి ప్రతీక గా నిలిచే ప్రత్యేక పర్వదినంగా భావిస్తారు.

వ్రత కథ
రాచవారి అక్కెమ్మ, వెలమువారి అక్కెమ్మ, బ్రాహ్మణవారి అక్కెమ్మ, కోమటివారి అక్కెమ్మ, కాపువారి అక్కెమ్మ విరైదుగురు తద్దినోము నోచుకుందామని ఉపవాసముండిరి. మూడు జాములు దాటిన తరువాత సుకుమారి అయిన రాచవారి అక్కెమ్మ మొగము తిరిగిపడిపోయెను. అంతట అన్నలు వచ్చి “యేమమ్మా! ఇట్లుపడి పోయినద”ని తల్లిని అడుగగా- నాయనా తద్దినోము నోచుకుందామని యుపవాసముండి చంద్రుడు వచ్చినదాక నుండలేక పడిపోయినదని చెప్పెను. అప్పుడొకయన్నగారు చింతచెట్లెక్కి అద్దముకట్టి అరికకుప్పకు ఆ అద్దమునకు తిన్నగా చిచ్చు పెట్టి చెల్లెలినిలేపి “అమ్మాయీ అదిగో! చంద్రుడు వచ్చినాడు. ఆ చింతచెట్టు వైపునకు చూడుమని భ్రమింపజేసి నోము నోచుకొమ్మని చెల్లెలితో చెప్పెను. ఆమె నిజముగా చంద్రుడు వచ్చినాడనుకొని సంతోషించి నోము నోచుకొని అన్నము తినెను. అంత నామెకు పదియేండ్లు వచ్చిన తరువాత పెండ్లిచేయుటకు ప్రయత్నించగా ముసలి మొగుడు వచ్చెను. ఆమె వానిని జూచి "నాకు పెండ్లి అక్కరలేదు. అయ్యో తద్దినోము నోచుకుంటే పడుచుమొగుడు వచ్చునని సాయంత్రము దాకా నుండి నోము నోచుకొని" అన్నము తింటిని. నాకీ ముసలిమగడేల దాపరించెనని విచారించు చుండెను.

అంతట తల్లిదండ్రులువచ్చి “అమ్మా ! మనది రాచకులం పెండ్లియాడకుండుట తప్పని అనేక విధముల చెప్పినను, వినక యొక రాత్రివేళ అడవివెంబడి పోవుచుండెను. అటు కొంత దూరము పోయి యొకకొలను దరినున్న మఱిక్రింద నిష్టతో తపస్సుచేయ మొదలుపెట్టెను. ఇలా కొంతకాలము తపస్సు చేయుచుండ భూపరిపాలనకై యాపొంత నరుగుచున్న పార్వతీ పరమేశ్వరులామెను చూచి-“ఓ చిన్నదానా! ఎందుచేత నీవిలా తపస్సు చేయుచుంటివ”ని యడిగిరి. అందుకామె-“మీరేమి ఆర్చెడివారా తీర్చెడివారా మీకెందుకు?” అని యుత్తరమిచ్చెను. ఆర్చెడివారమును, తీర్చెడివారమును మేమే. చెపవలయున”నని మరల వారడగిరి. అంత నామెలేచి వారికి నమస్కరించి “నేను తద్దినోము నోచుకొనుచున్నాను, నాతో నోచుకొనినవారివలె గాక నాకు ముసలిమగడు వచ్చినాడు. నేనేమి పాపము చేసితినో" యని యామె దీనయై పలికెను. “నీవు ఉపవాసమునుండి మూడుఝాములు తిరిగిన తరువాత మొగముతిరిగిపోగా నీయన్నవచ్చి చింతచెట్టుకొమ్మకు అద్దముకట్టి క్రింద చిచ్చుపెట్టి ఆ అద్దములో కనబడుచున్న మంటను చంద్రుడని భ్రమింపచేయగా నీవునిజముగా చంద్రుడు వచ్చినాడని నోము నోచుకొని భోజనము చేసినావు. ఆ కారణముచేత నీకు ముసలిమగడు వచ్చినాడు” అనివారు చెప్పి-“ఇప్పుడైన
నింటిపోయి దీపాలవేళదాకా నుండి నోము నోచుకొన్న యెడల పడుచుమగడు వచ్చునిని చెప్పిరి. అప్పుడాపిల్ల ఇంటికివచ్చి రాత్రిదాకా నుపవాసముచేసి యధావిధిగ నోము నోచుకొనియెను. అంతనామెకు పడుచు మొగుడు వచ్చెను. అప్పుడు ఆ వూరివారందరును, “ఏమి నోము నోచితివమ్మా ! ఏమి వ్రతము పట్టినావమ్మా! నీకు పడచు మగడు దొరకుటకు?” అని యడిగిరి. అందుకామె “అట్లతద్దె దీపాల వేళదాకా నుండి నోము నోచుకున్నాను. ముసలిమగడు పడుచుమగడు అయినాడు.”

ఉద్యాపనము: కలియుగమం దందరును అట్లతద్దె నోముపట్టి , పదేసి అట్లు నైవెద్యముపెట్టి పదేసి అట్లు వాయనములిచ్చి ఈవిధంగా పదేండ్లు నోచుకొని. ఈ కధచెప్పి అక్షింతలు వేసుకొని, పదేండ్లుయైన తరువాత పదిమంది ముత్తయిదువులకు పదేసి అట్లు, దక్షిణ, నల్లపూసలు, లక్కజోళ్లతో వాయన మీయవలయును.

అట్లతద్దికి ముందురోజు కాళ్ళు, చేతులకు గోరింటాకు పెట్టుకుంటారు. గుమ్మాలకు తోరణాలు కడతారు. తెల్లవారుజామున నిద్ర లేచి, స్నానపానాదులు ముగించి సాయంత్రం వరకూ ఏమీ తినరు. ఆఖరికి మంచినీళ్ళు కూడా తాగరు. అట్లతద్దినాడు పిల్లలు, స్త్రీలు ఉయ్యాల ఊగుతారు. పరవశంగా ఊయల ఊగుతూ ‘అట్లతద్దోయ్.. ఆరట్లోయ్.. ముద్దపప్పోయ్.. మూడట్లోయ్…‘
లాంటి సరదా పాటలు పాడుకుంటారు.

No comments:

Post a Comment