Saturday, January 17, 2026

Chollangi Amavasya - చొల్లంగి అమావాస్య

చొల్లంగి అమావాస్య

చొల్లంగి అమావాస్య అంటే ఏమిటి?
తెలుగు నెలల ప్రకారం పుష్య మాసంలో వచ్చే అమావాస్యనే "చొల్లంగి అమావాస్య" అంటారు. ఇది సంక్రాంతి పండుగ తర్వాత వచ్చే అత్యంత పవిత్రమైన రోజు. దీనికి "చోళాంగి అమావాస్య" అని కూడా పేరు.

ఈ రోజు ఋషి తర్పణం, పితృతర్పణం చాల ప్రశస్తం. మన గోత్ర ఋషి యొక్క ఋణం తీర్చుకొనే సమయం. ఎప్పుడైతే మన గోత్ర ఋషి కి తర్పణం విడుస్తామో అపుడే ఆ ఋషి యొక్క ఋణం తీర్చుకున్న వారమవుతాము. ఎందుకనగా మన వంశం అభివృద్ధి కారకుడు మన గోత్ర ఋషి. ప్రవరలో ఎంత మంది ఋషులున్నారో వారి అందరికి తర్పణం విడిచిన యింకా మంచిది. ఋషులతో పాటు మూడు తరాల పితృదేవతలకు, చనిపోయినవారికి తర్పణం విడువవలెను. అవకాశం ఉంటే, బ్రాహ్మణుని ఇంటికి పిలిచి తర్పణం విడిచి వస్త్రదానం, స్వయంపాకం, తమ శక్తి కొలది ధన దానం చేయవచ్చు. అవకాశం లేనివారు దగ్గర్లోని శివాలయం కి వెళ్లి అక్కడ పూజారిని సంప్రదించి తర్పణం విడువవచ్చు. ఆలా కూడా వీలు కానివారు ఇంట్లోనే ఋషి పేరు చెప్పుకొని నల్లనువ్వులు తో తర్పణం విడవవచ్చు. దీనివలన పితృదోషాలు కొంత వరకు తీరవచ్చు.

పేరు వెనుక ఉన్న అసలు కారణం
"చోళం" అంటే శరీరం/చర్మం, "అంగి" అంటే వదిలేయడం. మన శరీరానికి, ఆత్మకు అంటుకున్న పాపాలను, మాలిన్యాలను వదిలించుకునే రోజు కాబట్టి దీనికి ఆ పేరు వచ్చింది. కాకినాడ సమీపంలో తుల్యభాగ నది సముద్రంలో కలిసే చోట (సంగమం) ఈ ఉత్సవం పెద్ద ఎత్తున జరుగుతుంది.

పురాణ గాథ (ఇంద్రుడి కథ)
ఒకప్పుడు దేవేంద్రుడు అహల్య విషయంలో చేసిన తప్పు వల్ల గౌతమ మహర్షి శాపానికి గురవుతాడు. ఫలితంగా ఆయన శరీరం వికారంగా మారిపోతుంది. ఆ శాపం పోవాలంటే ఈ పుష్య అమావాస్య రోజున చొల్లంగి సంగమ క్షేత్రంలో స్నానం చేయాలని మహర్షులు చెబుతారు. ఇక్కడ స్నానం చేసిన తర్వాతే ఇంద్రుడు తన పూర్వ రూపం పొంది, శాప విముక్తుడవుతాడు.

ముఖ్య ఉద్దేశ్యం:
ఇంద్రుడి వంటి వాడికే శాప విముక్తి కలిగిందంటే, సామాన్యులమైన మనం ఇక్కడ స్నానం చేస్తే మన పాపాలు కచ్చితంగా తొలగిపోతాయని భక్తుల నమ్మకం.

ఎందుకు అంత ప్రత్యేకం?
సంవత్సరంలో ఈ అమావాస్య జనవరి 18 (ఆదివారం) రోజు వచ్చింది. అమావాస్య ఆదివారం నాడు వస్తే దానిని "అర్ధోదయ పుణ్యకాలం" అంటారు. ఇది కొన్ని కోట్ల సూర్య గ్రహణాలతో సమానమైన ఫలితాన్ని ఇస్తుంది. ఈ రోజున కేవలం ఒక చిన్న దానం చేసినా కొన్ని వేల రెట్ల పుణ్యం లభిస్తుంది.

ఇంట్లో ఉండే వారు ఎలా పాటించాలి?
ఒకవేళ మీరు సముద్రం, నదులకు వెళ్లలేకపోయినా బాధపడక్కర్లేదు. ఇంట్లోనే ఇలా చేయండి. 
స్నానం చేసే నీటిలో కొద్దిగా గంగాజలం వేసుకోండి. స్నానం తర్వాత సూర్యుడికి నమస్కరించి, మీ పూర్వీకులను తలచుకోండి. కనీసం ఒక్కరికైనా ఆ రోజు అన్నం పెట్టండి.

No comments:

Post a Comment