Sunday, January 11, 2026

Kailasa Gouri Gowri Nomu Katha - కైలాస గౌరీ నోము కథ

కైలాస గౌరీ నోము కథ

ఒక మహారాజు లేక లేక పుట్టిన తనకూతురిని  మహాగారాబముతోనుపెంచి పెద్దదానిని చేసి పదునారేండ్లు ప్రాయమువచ్చిన తరువాత మన్మధునిబోలిన మహారాజు కొకనికిచ్చి అఖండ వైభవముతో వివాహము చేసినాడు. 

కాని యాచిన్నదాని పెనిమిటి యాచిన్నదానిని యెప్పుడు చూడకుండా వారకాంతలయిండ్లలోనే అహోరాత్రములు గడుపుచున్నాడు. బాలికామణి భర్తకొరకు మనోవ్యాధితో మంచముపట్టి పగలు రాత్రి పార్వతీపరమేశ్వరులను ప్రార్థించుచు, కైలాసములో పార్వతీపరమేశ్వరుల లాగు వైకుంఠములో లక్ష్మీనారాయణల లాగు, సత్యలోకములో సరస్వతీ బ్రహ్మ లాగు, మేమెప్పుడు నొకరికొకరు ఎడబాయకుండా నుండే నోము సకలసుఖాలు పొందేనోమునోచి వెయ్యండని వేడుకొనుచుందేది. ఉండగా నుండగా కొన్నాళ్ళకు పార్వతీదేవి యాపడుచు కలలోకి వచ్చి- "కైలాసగౌరీనోము నోచవేకాంతా! గౌరీశంకరు లాగు, లక్ష్మీనారాయణు లాగు, వాణీవిధాతల లాగు సకల సౌభాగ్యాలతో  నీవు, నీ స్వామీ ఏకమై సంతాన భాగ్యములో ఇంతులలో మేలుబంతి వౌదువ" ని ఆనతి వచ్చెను. కలగాంచిన వెంటనే తెలివోంది గౌరీదేవికి కడుభక్తితో మొక్కుకొని రాజుకూతురు కైలాసగౌరీనోము ఉద్యాపనము చేసికొన్నది. ఆమెభర్త వెంటనే ఆటవెలదులను వదలి అత్యానురాగముతో వచ్చి తన యిల్లాలి నాదరించి, యిల్లాలితో చిరకాల మిహపరము లనుభవించినాడు. ఆమె నోచిన నోము అందరుకాంతలు నోచినారు.

ఉద్యాపనము: ఐదు కుంచముల కుంకుమ, ఐదు కుంచముల పసుపు, అందుకు సరిపోయిన పండ్లు పార్వతీదేవి గుడిలో కానీ, పర్వదినాలలో కానీ, గంగానదుల తీరముననో గానీ ఉంచుకొని యా పండ్లు, పసుపు, కుంకుమ ముత్తయిదువులకు చేరడు చేరడు చొప్పున పంచిపెట్టవలెను. పంచి పెట్టుట సమాప్తియగు వరకు మాటాడరాదు.


No comments:

Post a Comment