Wednesday, January 7, 2026

Muni Karthika Vratamu Katha - ముని కార్తీక వ్రతము కథ

ముని కార్తీక వ్రతము కథ

ఒక బ్రాహ్మణుని భార్య ముని కార్తీక దీపముల నోముపట్టి ఉల్లంఘన చేసెను. అందువలన ఆమెకు దరిద్రమును కడుపు శోకమును వచ్చెను. అది భరించ జాలక- "బ్రహ్మదేవుని యొద్దకువెళ్ళి వరమడిగి తెచ్చుకుంటానిని ఆమె బయలుదేరి వెళ్లుచుండగా త్రోవలో నొక బ్రాహ్మణుడు కనబడి-"ఎక్కడికి వెళ్లెదవమ్మా!" అని యడిగెను. "నేను బ్రహ్మదేవుని యొద్దకు వెళ్లుచున్నాను". అని యామె చెప్పెను.

అప్పుడా బ్రాహ్మణుడు - "అమ్మా! నాదికూడా ఒక మనవియున్నది చెప్పమని" యడిగెను. "అది యేమిటో చెప్పమని" ఆమె యడుగగా- "పదు నెనిమిది జన్మములనుంచి అన్నపానములులేక ఈలాగున్నాను అని చెప్పమని" యా బ్రాహ్మణుడు చెప్పెను.

"సరే అని యామె కొంతదూరము వెళ్లగా అక్కడ పండ్లతోనున్న ఒక ముంతమామిడి చెట్టు కనబడి-"అమ్మా! ఎక్కడికి వెళ్లుచున్నావ"ని అడిగెను. "నేను బ్రహ్మదేవుని యొద్దకువెళ్లి వరము తెచ్చుకొనుటకై పోవుచున్నా" ని యా బ్రాహ్మణి చెప్పగా- "అమ్మా! నాదికూడా ఒక మనవి వున్నది" అని యాచెట్టు చెప్పెను. "అది యేమిటో చెప్పుమ" ని యా విప్రుని భార్య యడుగగా- "మూడు పురుషాంతరములనుండి చెట్టునిండా పండియున్నాను ఎవ్వరూ ఒక పండైనా కోసుకొనితినరు. అది యెందుచేతనో అడిగిరమ్మ" ని చెప్పను. 

అంతట ఆ బ్రాహ్మణుని భార్య బయలుదేరి వెళ్లుచుండగా కొంతదూరము వెళ్లేసరికి ఒక ఆవుదూడ గడ్డిలో నిలబడియుండి - "అమ్మా! ఎక్కడికి వెళ్లుచున్నావ"ని యడిగినవి.  అప్పుడా బ్రాహ్మణస్త్రీ  "బహ్మదేవునియొద్దకు వరములు తెచ్చుకొనే నిమిత్తము వెళ్లుచున్నాన"ని చెప్పగా "అమ్మా మాది ఒక చిన్న మనవి యున్నది. అడిగి రావలయున" ని యది చెప్పెను. "అది యేమిటిని యామె 
యడుగగా- "ఈలా నిలబడి యున్నాము. ఈ సంగతి యేమిటో కనుక్కొని రావలయునని చెప్పెను. "సరే" అనెను. 

ఆమె మరల కొంతదూరమేగుసరికి చెట్టునిండా పువ్వులతో ఒక మల్లెంటు ఆమెకు కనబడి- "అమ్మా! యెక్కడకు వెళ్లుచున్నావ" ని యామెనడిగెను. "బ్రహ్మవద్దకువెళ్లి వరము తెచ్చుకుంటాను" అని ఆమె చెప్పగా - "అమ్మా! నాది కూడా ఒక చిన్న మనవి యన్నది. చెట్టు నిండా పువ్వు పూచిన ఒక్క పువ్వునైనా ఎవ్వరు తెంపుట లేదు అని చెప్పుమని చెప్పెను. “అలాగే” యనెను . 

యామె కొంతదూరము వెళ్లగా ఒకచోట వెదురు దండెముల కోకలు తగులబడుచుండెను. అదిచూచి ఆమె. మరికొంతదూరము వెళ్లుసరికి, అక్కడ అట్లపెనము అంటుకొని మండుచుండెను. అదిచూచి మరికొంతదూరము వెళ్లేసరికి బ్రహ్మలోకము కనబడెను. 

అప్పుడామె బ్రహ్మలోకమునికి వెళ్లి బ్రహ్మ కెదురుగా నిలబడెను. ఆమెను జూచి బ్రహ్మ "ఏమమ్మా! ఈలాగువచ్చినావు!" యని యడుగగా- "దరిద్రము చేతను, కడుపు శోకముచేతను బాధపడలేక యీలాగువచ్చినాన" ని చెప్పెను. "నీవు క్రిందటి జన్మమున ముని కార్తీక దీపముల నోముపట్టి ఉల్లంఘనచేసినావు. ఆ కారణముచేత నీకీ దరిద్రమున్ను, కడుపు శోకమున్ను వచ్చినవి. ఇప్పుడు మరల యింటికివెళ్ళి ముని కార్తిక దీపపు నోము పట్టి మూడు కార్తులు సమముగా వెలిగించుకుంటే అన్నీ బాగావుంటాయి" అని బ్రహ్మ చెప్పెను. అప్పుడామె- "సరెకాని ఒక బ్రాహ్మణుడు పదునెనిమిది జన్మములనుండి అన్నవానములు లేకుండా వున్నాడు. ఎందుచేత" ననియడిగెను. "ఆ బ్రాహ్మణుడు బాగా వేదము చదువుకున్నవాడు. ఎవరికి ఒక్క ముక్కయినా చెప్పినాడు. కాడు. అందుచెత అయోగ్యత కలిగింది. కాబట్ట నీవు వెళ్లేటప్పుడు ఆయనతో "రామ" అనుమాట చెప్పి వెళ్ళుమని బ్రహ్మదేవుడు చెప్పెను".

"త్రోవలో ఒక ముంతమామిడిచెట్టు పండ్లు పండియున్నది. దాని పండ్లెవ్వరును కోసుకొని తినరట. ఎందుచేత" నని మామె యడుగగా "ఒకి ముత్తయిదువ పదిమంది కొడుకులతల్లి ఒక పిల్లవానిని పెంపు యియ్యమనగా యిచ్చినదికాదు. ఆ కారణము చేత వంశము పోయినది. ఆ శాపముతగిలి ఆమె చెట్టయి పుట్టినది. నివు వెళ్లేటప్పుడు ఒక పండుతిని చక్కా వెళ్లుమని బ్రహ్మచెప్పెను"

"త్రోవలో నొక యావుదూడ నిలబొడి గడ్డిలో మేతమేయకుండా నిలుచుండి యున్నవి. ఎందుచేతనని యామె యడుగగా "అత్తకోడలును ఆవునకు దూడకు గడ్డి నీళ్ళు పోయుటకు వంతులాడి నీవే వేసినావంటే నీవే పోసినావ" ని పోయుట మానివేసినారు. అందుచేత వారిద్దరును ఈలాపుట్టి గడ్డిమేయకుండా నిలిచియున్నారు. నీవు వెడలే సమయమందు గుప్పెడు గడ్డితీసి 
వానికివేసి యిన్ని నీళ్ళుపోసి మరి వెళ్ళుమ" ని బ్రహ్మదేవుడు చెప్పెను. 

"సరే త్రోవలో నొకమల్లెంటున్నది. దానినిండా పూవులున్నవి ఎవ్వరును నొక్కపువ్వయినను కోసు
కొనరు. ఏమికారణమ" ని యా బ్రాహ్మణి యడుగగా- "అది పూర్వము భోగమది. ఆ జన్మయందు మల్లెపూవులు తెచ్చుకొని ఒక పువ్వుయినను ఎవ్వరికి యియ్యకుండా తానే అలంకరించుకొనేది. అందుచేత యిలాపుట్టినది. ఇపుడు నీవు ఒక పువ్వు కోసుకొనుము. తరువాత అందరు కోసుకొంటారు" అని బ్రహ్మచెప్పెను. 

"సరే త్రోవలో దండెమున కోకలు కాలిపోవుచున్నవి. ఎందుచేతన”ని యనియడుగగా - "ఏడుతరముల ఆడబడుచును తీసికొనివచ్చి ఒక బట్ట యెప్పుడును పెట్టిన పాపానబోలేదు. అందుచేత వారి చీరెలు తగులబడిపోవుచున్నవి. నీవు వెళ్ళేటప్పుడు అందులో నొక కోకతీసి కట్టుకొనుము చల్లారిపోవును" అని బ్రహ్మదేవుడు చెప్పెను.

"సరే యింకొకచోట అట్ల పెనములు మండిపోవుచున్నవి. ఎందుచేతన" ని యా బ్రాహ్మణి యడుగగా- "అత్తకోడలు ఎదురువాయనాలు అందుకున్నారు. అందుచేత మండుచున్నవి. నీవు వెళ్ళేటప్పుడు నీళ్లుచల్లి వెళ్లుము" అని బ్రహ్మదేవుడు చెప్పెను.

"సరే ఇవన్నియు చేయుదును. నాకు ఫలితమేమిటి?” అని యామె యడుగగా "మున్నూటారువది వత్తులుచేసి గిద్దెడు నూనెపోసి దీపాలు వెలిగించి నోముపట్టి ఉద్యాపనము చేసుకొమ్మ"ని బ్రహ్మ చెప్పెను. అప్పుడామె- -“సర్రే” మంచిదని తిరిగి వచ్చుచు అట్లు పెనముపై నీళ్లుచల్లెను. మరికొంత దూరమువెళ్లి దండెమున కోకలు తగులబడిపోవుచుండగా ఒకటి తీసుకొని కట్టుకొనెను. మరికొంత దూరమువెళ్లి మల్లిపందిరి రెండుపువ్వులు కోసుకొని కొప్పులో పెట్టుకొనెను. మరికొంత దూరము వెళ్లి ముంతమామిడిచెట్టునున్న ఒక పండుకోసుకొని తినెను. తరువాత బ్రాహ్మణుని యొద్దకువెళ్లి పాలలో బియ్యముపోసి పరమాన్నమువండి పళ్లెములోపోసి “రామ-రామ-రామ యని మూడు సారులు యాతనికిపెట్టి తిన్నగా యింటికివె
ళ్లెను.

తరువాత శివరాత్రినాడు కార్తీకదీపముల నోముపట్టి మూడువందల యిరువదివత్తులు, గిద్దెడు 
నూనెపోసి శివాలయములో దీపము వెలిగించి యింటికి వచ్చెను. వత్తుల ఫలముకంటె 
పలికిన ఫలము ఎక్కువగుటచేత ఆమె యింటికి వచ్చేసరికి సిరిసంపద కలిగియుండెను. అప్పుడు చిన్నలైనవారు కాళ్లను, పెద్దలైనవారు చేతులు పట్టుకొని "ఎమి నోము పట్టినావ"ని యడిగిరి. "ఏమీలేదు మునికార్తిక దీపముల నోముపట్టినాను. పలికిన ఫలితమేగాని వత్తిఫలము లేదని బ్రహ్మదేవుడు వరమిచ్చినాడు" యని యా బ్రాహ్మణుని భార్య వారందరితో జెప్పెను. ఆ నోము కలియుగములో నందరు పట్టి ఉద్యానము చేసికొని సిరిసంపదలతో తులతూగిరి.

ఉద్యాపనము: అయిదుమూళ్ల యంగవస్త్రమున యిదుమానికెల బియ్యము మండపముపై పోసి దక్షిణ తాంబూలము పెట్టి వెండి ప్రమిదలో పయిడివత్తివేసి దీపము వెలిగించి ఒక బ్రాహ్మణునకు వాయన మీయవలయును. 

శక్తి తప్పినను భక్తి తప్పరాదు. కథ లోపమయినను వ్రతలోపము కాకూడదు.

No comments:

Post a Comment