Wednesday, January 7, 2026

Puvvu Thambulam Nomu Katha - పువ్వుల తాంబూలము నోము కథ

పువ్వుల తాంబూలము నోము కథ

ఒకరాజు కూతురుని నెప్పుడు మగండేలేవాడు కాదు 'ఆవిడ సంతానము లేక సిరియొల్లక అడవులబట్టి పోయెను. పార్వతీదేవి ముసలి ముత్తయిదువ వేషము వేసికొనివచ్చి "ఏమి బిడ్డా! యిలా వచ్చితివిని యడిగెను. "ఏమిచెప్పనమా! నా స్థితి అంత" అని యామె తనకథ యంతయు చెప్పెను. అప్పుడు పార్వతీదేవి- "నేను చెప్పినట్లు చేయుము. అమ్మాయీ! నీమగనికి నీమీద  దయవచ్చును. తరువాత సంతానము కలుగును. సకల భాగ్యాలు వచ్చును అని చెప్పెను. రాజకూతురురామె మాటలకు సంతోషించి - "యంతకంటే యేమి కావలయును చెప్పమని యడుగగా పార్వతీదేవి "అమ్మాయీ! నీవు తిన్నగా యింటికివెళ్ళి ప్రతిదినము అయిదు పువ్వులు తాంబూలములో పెట్టి ఒక ఎడాది భక్తి శ్రద్దలతో పార్వతీదేవి పేరుచెప్పి ఒక ముత్తయిదువకిచ్చి తరువాత పళ్లెమునిండా పువ్వులుపోసి బంగారు పువ్వుచేయించి చీర,రవికెల గుడ్డపెట్టి పళ్లెముతో కూడా ముత్తయిదువుకు ఉద్యాపనము చేసికొనుము అని చెప్పెను. ఆ మాటలు విని ఆమె తిన్నగా యింటివచ్చి భక్తిశ్రద్దలతో పార్వతీదేవి పేరు చెప్పి ఏడాది పైన చెప్పిన ప్రకారము పువ్వులు తాంబూలాలిచ్చుకొని ఆవిడ చెప్పిన ప్రకారము ఉద్యాపనము చేసికొన్నదట. అప్పటినుండి ఆ రాజుకూతురు మొగుడు నీళ్ళుపాలు కలిసినట్లు కలిసి సుఖములనుభవించిరి. తరువాత ఆమె
ముత్యాలవంటి బిడ్డలను కని రత్నమాణిక్యాలు, భూషణాలు పెట్టుకొని సుఖముగానుండెను.

ఉద్యాపనము: ప్రతిదినము అయిదు పువ్వులు తాంబూలములో పెట్టి ఒక ఎడాది భక్తి శ్రద్దలతో పార్వతీదేవి పేరుచెప్పి ఒక ముత్తయిదువకిచ్చి తరువాత పళ్లెమునిండా పువ్వులుపోసి బంగారు పువ్వుచేయించి చీర,రవికెల గుడ్డపెట్టి పళ్లెముతో కూడా ముత్తయిదువుకు ఉద్యాపనము చేసికొనవలెను. 

No comments:

Post a Comment