Friday, January 30, 2026

Shani Trayodashi - శని త్రయోదశి

శని త్రయోదశి

త్రయోదశి శనివారం నాడు వస్తే ఆ రోజును శని త్రయోదశిగా వ్యవహరిస్తారు. శనివారం శ్రీమహావిష్ణువుకు ప్రీతిపాత్రమైన రోజు.ఈ రోజు శని దేవుడికి చెందినది. శని గ్రహం యొక్క దుష్ప్రభావంతో బాధపడుతున్న వ్యక్తులు శని దేవుని పూజించడం వల్ల గ్రహ శాంతి కలుగుతుంది.

జ్యోతిష్య శాస్త్రంలో శనిదేవుడు కర్మలకు, న్యాయానికి అధిపతి. సూర్య పుత్రుడైన శనిదేవుడు నెమ్మదిగా సంచరిస్తూ ఒక్కో రాశిలో 2.5 ఏళ్లు ఉంటూ వారి వారి కర్మలను బట్టి ఫలితాలను ఇస్తుంటాడు. మనుషులు చేసే పనులకు అనుగుణంగా న్యాయం చేస్తుంటాడు. అయితే ఈయనకు కష్టాలను ఇచ్చే వాడు అనే పేరే ఉంది. కానీ న్యాయబద్ధంగా జీవించే వారికి అదృష్టాన్ని కూడా ప్రసాదిస్తాడు. అందుకే శనిదేవుడి అనుగ్రహం ఉంటే అన్నీ శుభాలు జరుగుతాయని భావిస్తారు.

శనిదేవుడికి కర్మ ఫలదాత అంటారు. ఈ శనిదేవుడు 12 రాశులపై 7.5 ఏళ్లు ఏలినాటి శని, అష్టమ లేదా అర్ధాష్టమి (2.5 సంవత్సరాలు) రూపంలో ప్రభావం చూపుతూ ఉంటాడు. ఈ సమయంలో ఆయా రాశుల వారికి కష్టాలు ప్రారంభం కావడం, అనుకున్న పనులు ఆలస్యం కావడం, మానసిక ఒత్తిడి కలగడం లేదా అదృష్టం కలిసి రావడం, అద్భుతమైన కెరీర్‌ వృద్ధి కలగడం వంటివి జరుగుతూ ఉంటాయి.

ప్రస్తుత సమయం లో కుంభ రాశి వారు చివరి దశ. మీన రాశి వారు రెండో దశ, మేష రాశి వారు మొదటి దశ లో వున్నారు. వీరే కాక సింహ రాశి వారు అష్టమ శని మరియు ధనుస్సు రాశి వారు అర్ధాష్టమ శని దశలో వున్నారు. కావున వీరు శని త్రయోదశి రోజు పరిహారాలు చేసుకోవడం మంచిది. ఇది కొంత పరిహారము మాత్రమే పూర్తిగా కాదు.

శనివారం శ్రీమహావిష్ణువుకు ప్రీతిపాత్రమైన రోజు. అలాగే త్రయోదశి పరమేశ్వరునికి ఇష్టమైన దినం. అందుకనే త్రయోదశి శనివారం నాడు వస్తే శివ కేశవులకు అత్యంత ప్రీతిపాత్రమైన రోజని చెప్తారు. మరియు శనిదేవుని అధీనంలో ఉండే తిథి, నక్షత్రం, వారం, మాసం శనివారం నాడు వస్తుంది కాబట్టి దానిని శని త్రయోదశి అంటారు.

శనిదేవుని శనీశ్వరుడు అని పలకరాదు, శనైశ్చరుడు అని పలకాలి.

ఈ శని మంత్రాన్ని జపించాలి

నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజమ్
ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరమ్

శని ధ్యానం
నీలద్యుతిః నీలవపుః  కిరీటీ
గృధస్ధితాశ్చాపకారో ధనుష్మాన్|
చతుర్భుజః సూర్యసుతః ప్రశాంతః
సదాస్తు మహ్యం వరమందగామీ||

బీజమంత్రం:
ఓం ప్రాం ప్రీం ప్రౌం సః శనైశ్చరాయ నమః

శని గాయత్రి:
1.ఓం రవిసుతాయ విద్మహే
మందగ్రహాయ ధీమహి
తన్నః శనిః ప్రచోదయాత్

2.ఓం కాకధ్వజాయ విద్మహే
ఖడ్గ హస్తాయ ధీమహి
తన్నో మందః ప్రచోదయాత్

శని దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి నల్ల నువ్వులు కొన్ని, 100 గ్రాముల నువ్వుల నూనె ప్యాకెట్, 1 కిలో బొగ్గు, ఒక చిన్న నల్ల గుడ్డ, 8 ఇనుప మేకులు, కొన్ని నవధాన్యాలు కట్టి, ఆలయ పూజారికి దానం చేయండి లేదా ప్రవహించే నదిలో వేయండి.

కాకికి ఆహార పదార్థాలను అందించి, ఎంతో పుణ్యఫలం కాకి శని దేవుని వాహనం.కాకికి ఆహారం అందించడం వల్ల శనిదేవుడు ప్రీతీ చెందుతాడు మరియు పితృదేవతలు కూడా ప్రీతీ చెందుతారు.

శని త్రయోదశి నాడు పాటించాల్సిన కొన్ని జాగ్రత్తలు కూడా సంప్రదాయాలలో ఉన్నాయి. శని ఆలయ దర్శనం ముగించుకుని బయటకు వచ్చిన తర్వాత వెనక్కి తిరిగి చూడకూడదని పెద్దలు చెబుతుంటారు. అలా చేయడం వల్ల దోష ప్రభావం మళ్లీ మొదలవుతుందనే నమ్మకం పురాణ కథల ద్వారా ప్రచారంలో ఉంది. ఈ నమ్మకాలు భక్తులలో ఒక క్రమశిక్షణను కలిగించడంలో సహాయపడతాయి.

శనివారం నూనె, గొడుగు, నవధాన్యాలు.. మొదలైన వాటిని కొనుగోలు చేయవద్దు.

ఈ రోజున మీరు నల్ల చీమకు పంచదార ఇవ్వాలి. నల్ల చీమలు కనిపించకుంటే చీమలు ఎక్కువగా ఉన్నచోట పంచదార వేయండి. అలాగే చెట్టు మూలాన దీపం వెలిగించి పూజిస్తే శని కోపం తగ్గుతుంది.

నల్ల నువ్వులు, నువ్వుల నూనె శనికి ఎంతో మేలు చేస్తుందని అందరికీ తెలిసిందే. కాబట్టి వాటితో దానం చేసి పూజిస్తే శని తృప్తి చెందుతుందని చెబుతారు. అలాగే ప్రతి శనివారం ఇలా చేస్తే విజయం చేకూరుతుంది.

నేడు ఆలయానికి వెళ్లి నవగ్రహాల్లో శని దేవుడి ఎదుట దీపం వెలిగిస్తే ఎంతో మేలు జరుగుతుందనే నమ్మకం ఉంది.


శని


నవ గ్రహ స్తోత్రం

నవగ్రహ బీజ మంత్రములు

నిత్య స్తోత్రావళి

పంచాంగం

No comments:

Post a Comment