Thursday, February 5, 2026

Parkshith Maha Raja - పరీక్షిత్ మహారాజు

పరీక్షిత్ మహారాజు

పరబ్రహ్మస్వరూపుడు అయిన పరమేశ్వరుడే గరికపోచ నుండి బ్రహ్మపర్యంతం సకలజీవరాశులను సృష్టించాడు. ఆ సృష్టిలో దేవతలు, మానవులు, తిర్యక్కులు (పశుపక్ష్యాదులు), స్థావరాలు (చలనంలేనివి) అనే నాలుగు వర్గాలు ఉన్నాయి. వాటిలో స్త్రీ పురుషభేదాలు, సత్త్వ రజస్తమోగుణ భేదాలు ఏర్పడ్డాయి. మనుష్యజాతిని క్రమబద్ధీకరించడానికి ఆశ్రమధర్మ భేదాలు, వర్ణవిభజనలు, వారి మనుగడకు పురుషార్జాలు నిర్దెశించబడ్డాయి. ఆ పురుషార్జాలను సాధించడానికి కావలసిన జ్ఞానాన్ని అందించడానికి చతుర్ముఖబ్రహ్మ ద్వారా భగవానుడే వేదాలను వెలువరింపబేశాడు.ఆ జ్ఞానాన్ని నేరుగా పొందడానికి సామాన్యులకు సాధ్యం కాదు కనుక భగవంతుడే వేదవ్యాసునిగా అవతరించి వేదవిజ్ఞానాన్ని ఒకచోట చేర్చి విపులీకరించి, కర్మకాండలతో కూడుకొన్న పూర్వభాగానికి తన శిష్యుడైన జైమినిచే పూర్వమీమాంసాసూత్రాలు వ్రాయించి జ్ఞానభాగమైన ఉత్తర భాగానికి తానే బ్రహ్మసూత్రాలను రచించాడు. అందులోను పూర్వభాగానికి వివరణగా పంచమవేదమనబడే మహాభారతాన్నీ ఉత్తర భాగానికి వివరణగా శ్రీమద్భాగవతాన్ని రచించి, వాటిలో వేదసారాన్నంతా సులభంగా అర్ధమయ్యేటట్లు పొందుపరచాడు.

సృష్టించాలనే సంకల్పం కలిగినపుడు దానికి అనుగుణమైన సమయంలో పరమాత్మ రజోగుణ ప్రధానమైన బ్రహ్మదేవుని శరీరంలో ఉండే జీవుని చేరి జగత్తును సృష్టిస్తాడు. ఉపసంహారం చేయదలచుకొన్నప్పుడు తమోగుణ ప్రధానమైన శివునిలోనుండే జీవునితో చేరి లయం చేస్తాడు. జగత్తుయొక్క రక్షణ పోషణకార్యాన్ని సత్త్వగుణ ప్రధానమైన విష్ణుస్వరూపంలో నిర్వహిస్తాడు. వేదాలలో నిర్దెశింపబడిన వాసుదేవుడే సృష్టికి పూర్వమందున్న పరమాత్మ భగవానుడు. అతడు సమస్త జీవుల దశేంద్రియ, మనస్సులతోనూ, పంచభూతాలతోనూ కూడి విరాట్‌పురుషునిగా వెలసి, అనిరుద్ధుడు అనబడి, నీటిలో యోగనిద్రలో శయనించి, తన నాభిహ్రదము నుండి పద్మాన్ని సృష్టింపగా, ఆ పద్మంనుంచి బ్రహ్మదేవుడు ఆవిర్భవించాడు. వేయిశిరస్సులతో, సహస్ర అవయవాలతో దివ్యాభరణాలతో ప్రకాశించే అనిరుద్ధ భగవానుని దివ్యదేహం నుంచి సనకసనందనాది నలుగురు కుమారులు, దేవమానవాదిరూపాలు ఆవిర్భవించాయి. ఆ దేవదేవుడే క్రమేణా కాలానుగుణంగా అనేకమైన అవతారాలెత్తి దుష్టశిక్షణ, శిష్టరక్షణ, ధర్మసంస్థాపన, భక్తపాలన వంటి అనేకకార్యాలను నిర్వర్తించాడు. మంత్రద్రష్టలైన మునులు, వ్యాసవశిష్టాది మహర్షులు, దక్షాదిప్రజాపతులు, మనువులు, ఇంద్రాదిదేవతలు మొదలైన వారందరూ ఆ
పరమాత్మయొక్క అంశలచే పుట్టినవారే.

శ్రీరామ, శ్రీకృష్ణ అవతారాలు పరిపూర్ణాలు. తక్కిన అవతారాలు ఒక ప్రత్యేకకార్యార్థమై సంభవించాయి. శ్రీకృష్ణావతారంలో జ్ఞానం, బలం, శక్తి ఐశ్వర్యం, వీర్యం, తేజస్సు మొదలైన భగవంతుని దివ్యమంగళ లక్షణాలన్నీ ప్రకటితమయ్యాయి. అందుకే 'కృష్ణస్తు భగవాన్‌ స్వయం' అని అన్నారు.

ఈ స్టూలజగత్తే కాకుండా మనోబుద్ధి అహంకారాలతో కూడుకొన్న సూక్ష్మదేహాలు కూడా భగవంతుని
మాయచే ఏర్పడ్డాయి. ఆయన అవతారలీలారహస్యాలు పరిమితమైన మానవమేధాశక్తికి, తర్కహేతుచర్చలకు అంతుబట్టవు. ఆయన పాదపద్మాలను శరణు వేడినవారికి మాయపొరలు తొలగి మర్మం తెలుస్తుంది. సకల వేదసారాన్ని వ్యాసుడు, తన కుమారుడు శ్రీశుకదేవునికి బోధించాడు. శుకమహర్షి పరీక్షిత్తునకు, అక్కడ ఉన్న ఋషులకు వినిపించాడు. అక్కడ ఈ పరమపవిత్రమైన భాగవతగాథను వినే అదృష్టం నాకు దక్కింది. నా శక్తిమేరకు నేను విన్నదానిని మీ అందరికీ వినిపిస్తాను” - అని సూతమహర్షి శౌనకాది మహామునులకు వివరించాడు.

“పూర్వం ఉపరిచరవసువు వలన జన్మించిన సత్యవతికి పరాశరమహర్షి వల్ల నారాయణాంశతో వ్యాసుడు జన్మించాడు. అతడు కలియుగంలోని ప్రజల దుస్థితిని ధ్యానావస్టలో గమనించి, వారికి తేలికగా అర్ధం కావడానికి వేదాలను నాలుగుగా విభజించి ఋగ్వేదాన్ని పైలునకు, యజుర్వేదాన్ని వైశంపాయనుడికి, సామవేదాన్ని జైమినికి, అధర్వవేదాన్ని సుమంతునకు అప్పగించి వాటిని తమ తమ శిష్యులకు బోధిస్తూ భద్రపరచాలని ఆదేశించాడు. పురాణేతిహాసాలను సూతుని తండ్రి అయిన రోమహర్షణునికి అప్పగించాడు. వేదాలను గ్రహించలేనివారికి మహాభారతాన్ని పంచమవేదంగా చతుర్వేదసారంగా భగవద్గీతను ఇమిడ్చి, సులభగ్రాహ్యంగా రచించాడు.
బ్రహ్మసూత్రాలనూ వ్రాశాడు. ఇన్ని అనన్యసాధ్యమైన గొప్ప గ్రంథాలు వ్రాసినా వ్యాసుడు అశాంతితో వ్యాకులచిత్తుడై ఉండగా ఒకనాడు దేవర్షి నారదుడు వచ్చి వ్యాసుని ఊరడించి ఇలా అన్నాడు - “ఓ మహానుభావా! వేదవ్యాసా! నీవు అనేక వేదపురాణ శాస్త్ర ఇతిహాసాదులను అనన్యసాధ్యంగా లోకులకు అందించి ఎనలేని సేవ చేశావు. భారత మహాగ్రంథంలో ప్రసంగవశాన భగవానుని గుణగణాలను పేర్కొన్నావే కానీ ప్రధానంగా దేవదేవుని గాథధాగుణగణాలను కీర్తించలేదు. భగవత్స్వరూపలీలాగుణవైభవాలను నుతించని గ్రంథం ఎంత గొప్పదయినా అది నిస్సారమయింది. అట్టివాటిని పరమహంసలయిన పరమభాగవతోత్తములు ఎవ్వరూ ఆదరించరు. ప్రజలకు భక్తిని కలిగించలేని కర్మ దుఃఖహేతువే కాని ఫలప్రదంకాదు. భగవద్బక్తిని కలిగించని పురుషార్ధసాధనలు మోక్షప్రదాలు కావు. భగవంతునికి సమర్పితంకాని కర్మఫలాలు తాత్కాలికాలు అనర్ధాన్ని తెచ్చిపెట్టేవి. సుఖశాంతులను కలిగించవు. కాబట్టి ఓ వ్యాసమహర్నీ! సకల వేదశాస్త్ర జ్ఞాననిధివైన నీవే భగవానుని దివ్యలీలాగాథలను వివరించడానికి సర్వసమర్థుడవు. నీ రచనలను చదివినవారికీ, విన్నవారికీ మోక్షం లభిస్తుంది. నీవు భగవంతుని నామసంకీర్తన లీలాగుణ వైభవగాథలతో కూడి భక్తిని ప్రతిపాదించే కావ్యాన్ని రచిస్తే పరమశాంతిని ఆనందాన్ని పొందగలవు” అని ఉపదేశించి నారదమహర్షి అందుకు తార్కాణంగా తన పూర్వజన్మవృత్తాంతాన్ని వివరించి నిష్క్రమించాడు.

ఆ తరువాత వ్యాసుడు తన 'శమ్యాప్రాసము' అనే ఆశ్రమంలో ధ్యానమగ్నుడై పరమదేవుని దర్శించి, ఆయన అధీనంలో ఉన్న మహామాయను దాటుకొని, భగవదనుగ్రహం పొందడానికి భక్తియే సాధనమని గ్రహించి శ్రీమహాభాగవత సంహితను రచించి తన పుత్రుడైన శుకయోగికి వివరించాడు అని సూతుడు శౌనకాది మునులకు ఇట్లు చెప్పసాగాడు.

పరీక్షిత్తుయొక్క జన్మనుగూర్చి, ముక్తినిగూర్చి, పాండవుల మహాప్రస్తానాన్ని, శ్రీకృష్ణకథోదయాన్ని మీకు వివరిస్తాను. మహాభారతయుద్ధంలో చివరిరోజు భీముని గదదెబ్బతో తొడలు విరిగి చచ్చేందుకు సిద్ధంగా ఉన్న దుర్యోధనుని దురవస్థచూచి అశ్వత్థామ విచారంతో అతనికి ప్రియం కలిగించడానికి రాత్రి పాండవళిబిరంలో దూరి గాఢనిద్రలో ఉన్న ద్రౌపదీపుత్రులైన అయిదుగురు ఉపపాండవుల తలలునరికి దుర్యోధనునికి చూపి సంతృప్తిపరచాడు.

ఈ ఘోరవార్తను విన్న అర్జునుడు కలతజెంది శ్రీకృష్ణుని తోడ్కొని అశ్వత్థామను బంధించి తెచ్చి, ద్రౌపది కోరికపై వానిని చంపకుండా అతని తలపైనున్న శిరోమణిని తీసివేసి, తల గొరిగించి విడిచిపెట్టాడు. తరువాత శ్రీకృష్ణుడు ధర్మరాజును పట్టాభిషిక్తునిజేసి, అతనిచే అశ్వమేధయాగాలను చేయించి, అపాండవం చేయాలనే సంకల్పంతో అశ్వత్తామ ప్రయోగించిన బ్రహ్మశిరోనామకాస్త్రం బారినుండి ఉత్తరగర్భంలోని శిశువును రక్షించాడు. ఆ బాలుడే పరీక్షిత్తు.

భారతయుద్ధంలో జరిగిన అపారజననష్టంగూర్చి దుఃఖిస్తూ శ్రీకృష్ణవ్యాసనారదాదులు ఎంత సముదాయించినా ధర్మరాజు శోకబుద్ధితో తపించిపోతుంటెే, అంపశయ్యపై శయనించి దేహత్యాగానికి సిద్ధంగా ఉన్న భీష్మునివద్ద శ్రీకృష్ణుని ప్రోత్సాహంతో అపారలోకానుభవ విషయాలు, శాస్త్రజ్ఞానసంగతులను తెలుసుకొన్నాడు. పాండవులవద్ద కొన్నాళ్లు గడిపి, వారినందరినీ ఒప్పించి శ్రీకృష్ణపరమాత్మ హస్తినాపురం నుండి ద్వారకకు వెళ్లిపోయాడు.

తరువాత కొన్నాళ్లకు శ్రీకృష్ణుడు తన అవతారాన్ని పరిసమాప్తం కావించాడని తెలుసుకొన్న ధర్మరాజాదులు అభిమన్యుని కుమారుడైన పరీక్షిత్తుకు సింహాసనం అప్పగించి, మహాప్రస్థానం చేశారు.

తదనంతరం పరీక్షిత్తు ధర్మమార్గం తప్పకుండా జనరంజకంగా, ధర్మబద్దుడై రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. ఉత్తరాభిమన్యుల పుత్రుడైన పరీక్షిత్తు అనబడే విష్ణురాతుడు పరమభాగవతోత్తముడై, సద్గుణసంపన్నుడై, పరాక్రమశాలియై కృపాచార్యుల ఆధ్వర్యంలో మూడు అశ్వమేధయాగాలు నిరాటంకంగా జరిపించగా, దేవతలు నిజరూపాల్లోనే వచ్చి హవిస్సులను అందుకొన్నారట. అతడు తన మేనమామ అయిన ఉత్తరుని కుమార్తె ఐరావతిని వివాహమాడి జనమేజయుడు మొదలైన నలుగురు కుమారులను పొందాడు. పరీక్షిత్తు దిగ్విజయ యాత్రచేసి
భద్రాశ్వ, కేతుమాల, ఇలావృత, రమ్యక, హిరణ్మయ, హరివర్ష, కింపురుష, భారతాది వివిధ దేశాలను జయించాడు.

ఆయాదేశాలలోని ప్రజలు, పండితులు పఠిస్తూ ఉండే పూర్వరాజుల చరిత్రలను వింటూ, ఆ కథలద్వారా పాండవులకు శ్రీకృష్ణుడు చేసిన సహాయాలు, వాసుదేవుని పాదపద్మాలపట్ల పాండవులకు ఉండే భక్తివిశేషాలను తెలుసుకొంటూ పరమాత్మునిపట్ల అంకితమైన పవిత్రభక్తితో పరవశిస్తూ పుణ్యాత్ముడై జీవిస్తూ ప్రజలను కంటికిరెప్పలా కాపాడేవాడు. ఒకసారి పరీక్షిత్తు దేశాటనం చేస్తుండగా రాజువేషాన్ని ధరించిన ఒక అనాగరికుడు ఒంటికాలితో ఉన్న ఒక ఎద్దును, కన్నీరు కారుస్తున్న ఒక గోమాతను కాలితో తన్నుతూ అదలించడం చూసి వాడే కలిపురుషుడని,
వృషభాన్ని ధర్మమూర్తిగాను, ఆవును భూమాతగాను గ్రహించి మెరపువేగంతో కత్తిదూసి కలిపురుషునిపైకి లంఘించాడు. అపుడు భయవిహ్వలుడైన కలిపురుషుడు పరీక్షిత్తుని పాదాలపైబడి శరణు వేడుకోగా, ఆయన కనికరించి “ఓయీ! నీవు నీచాత్ముడవు. రాజవేషం ధరించావు గాని నీలో అన్నీ పాపప్రవృత్తులే గోచరిస్తున్నాయి. అసత్యలోభ దౌర్జన్య చౌర్య దురాచార కపట మాయా కాలుష్యాది అవగుణాలన్నీ నిన్ను ఆశ్రయించి ఉన్నాయి. నీవల్ల నా ప్రజలు అనేకబాధలకు గురి అవుతారు. కనుక నీవునా రాజ్యంలో ఎక్కడా కనిపించరాదని శాసిస్తున్నాను”
అని ఆజ్ఞాపించాడు. ఆ తర్వాత వృషభమూర్తికి లోపించిన 'తపం - శౌచం - దయి అనే మూడు పాదాలను పునరుద్ధరించి, భూమాతకు ఆనందం కలిగించి, కలిపీడ లేకుండా రాజ్యాన్ని పరిపాలించాడు. అలాంటి పరీక్షిత్తుని రాజ్యకాలంలోనే మీరు వేయి సంవత్సరాలపాటు చేయసంకల్పించిన ఈ సత్రయాగాన్ని ప్రారంభించారు అని సూతుడు శౌనకాది మహామునులకు వివరిస్తూ ఇంకా ఇలా చెప్పాడు.

ఈ విధంగా కలిని నిగ్రహించి, జనహితంగా చాలాకాలం రాజ్యాన్ని పరిపాలిస్తున్న పరీక్షిన్మహారాజు అరణ్యానికి వేటకై వెళ్లి అనేక జంతువులను వేటాడి ఆకలిదప్పికలతో అలసి సొలసి, ఎంత వెదికినా నీటిచుక్కైనా దొరకని స్థితిలో శమీకమహామునియొక్క ఆశ్రమంలో ప్రవేశించి, 'దాహం దాహం కొంచెం నీరివ్వండి' అని బిగ్గరగా ఎంత అరచినా ఎవరూ పట్టించుకోలేదు. ధ్యానమగ్నుడై ఉండడంవల్ల శమీకమహర్షికి ఏమీ వినిపించలేదు. దాహంతో గొంతెండి, నాలుక పిడుచకట్టుకుపోతుండగా దాహబాధను తట్టుకోలేక కదలక మెదలక ఉన్న మునిని చూచి
రోషావేశంతో, విధివశుడై బయట చచ్చిపడి ఉన్న పామును తెచ్చి శమీకుని మెడలోవేసి వెళ్లిపోయాడు. ఇది చూచిన ఇతర బాలురు, శమీక మహాముని పుత్రుడైన శృంగితో చెప్పగా అతడు, సర్వం తెలుసుకొని క్రోధావేశపరుడై నా తండ్రి మెడలో మృతసర్పాన్ని వేసి అవమానించినవాడు నేటికి వారం రోజులలో తక్షక సర్పదష్టుడై మరణిస్తాడు' గాక అని శపించాడు.

సమాధినుండి లేచిన శమీకముని జరిగినదంతా తెలుసుకొని మిక్కిలి విచారిస్తూ శృంగితో ఇలా అన్నాడు. “నాయనా! ఎంతపని చేశావురా. ఇంత చిన్న తప్పుకే అంత కఠోరమైన శాపాన్ని ఇస్తావా? తల్లి కడుపులోనే దగ్దం కావలసిన రాజును శ్రీహరియే రక్షించాడు కదా. వాసుదేవుడు నిష్క్రమించిన తరువాత అరాచకం ప్రబలిపోకుండా ఈ రాజే దేశాన్ని కాపాడి సమర్థవంతంగా సంరక్షిస్తున్నాడు. అలాంటి ధర్మాత్ముడైన రాజు లేకపోతే జరిగే అనర్జాల పాపం మనకు చుట్టుకోదా? తొందరపాటుతో ఎంత చెడ్డపని చేశావురా తండ్రీ!” అని మందలించి, విచారించి ఒక మునిబాలుని పిలిచి ఈ శాపవార్తను మహారాజుకు తెలిపిరమ్మని పంపించాడు. శాపవార్తను తెలుసుకొన్న పరీక్షితుడు జరిగినదానికి విచారించి, దైవసంకల్పాన్ని ఎవరూ తప్పించుకోలేరని భావించి, తనకు మరణకాలం
సమీపించిందని గ్రహించి, తన హృదయాన్ని గోవిందునిపై లగ్నంచేసి సకలరాజ్యభోగాలను విడిచిపెట్టి, సర్వసంగపరిత్యాగియై, విష్ణుపదియైన గంగానది ఒడ్డున, దర్భాసనం మీద కూర్చొని నిశ్చలభక్తితో ధ్యానిస్తున్నాడు.

ఈ విధంగా పాండవపౌత్రుడైన పరీక్షిత్తు శ్రీమహావిష్ణువుయొక్క చరణారవింద సంస్మరణకందళిత
హృదయారవిందుడై గంగానది తీరంలో ప్రాయోపవిష్టుడై ఉన్న విషయం తెలుసుకొన్న అత్రి, విశ్వామిత్ర, వశిష్ట, భృగు, వ్యాస, భరద్వాజ, పరశురామ, దేవల, మైత్రేయ, కణ్వ, అగస్త్య, నారదాది పరమపావనులైన బ్రహ్మర్షి రాజర్షి దేవర్షి పుంగవులు అనేకులైన ఋషిసత్తములు శిష్యప్రశిష్యులతో వచ్చారు. పరీక్షిత్తు వారందరికీ దండప్రణామాదులాచరించి, ఆనందబాష్పాలతో చేతులు జోడించి “ఓ దయామూర్తులైన తపోధనులారా! మీరు సమస్త పాపరాశిని భస్మం చేయగల పుణ్యాత్ములు మీ పాదరజం సోకగానే నేను ధన్యుడనయ్యాను. నా పాపం పరిహారమయ్యే మార్గం సెలవియ్యండి. ఈ సంసారసాగరంలో మునిగితేలుతున్న నాకు ఈ విప్రశాపమే ఒక వరం అయ్యేటట్లు భావిస్తున్నాను. ఈశ్వరసంకల్పం అనివార్యం. రాబోయే ప్రతి జన్మలోను శ్రీకృష్ణచింతనపట్ల ఆసక్తి, శ్రీకృష్ణగాథా శ్రవణానురక్తి, శ్రీకృష్ణదరణసరోజాలపట్ల భక్తి కలిగేట్లు అనుగ్రహించండి. నా శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని గోవిందుని లీలలు గానం చెయ్యండి, భాగవతోత్తముల చరిత్రలను వినిపించండి, ఏడురోజులలో నాకు ముక్తి కలిగే మార్గమేదో చూపించండి” అని వేడుకొని, తన కుమారుడైన జనమేజయునికి రాజ్యభారం అప్పగించాడు.

పరీక్షిత్తుని హరిభక్తికి సంతోషించిన ఆ మహామునులందరూ వారంరోజుల గడువు దాకా తాము అక్కడే ఉంటామన్నారు. ఏడుదినాలలో ముక్తిని పొందే మార్గమేదైనా ఉందా? అని అన్వేషించసాగారు.

అంతలో దైవయోగంచేత, పదహారేళ్ల బాలునివలె కనిపిస్తూ, దిగంబరుడైన ఒక అవధూత అక్కడికి వచ్చాడు. అతనిని మహాయోగివరేణ్యుడు, వేదవ్యాస కుమారుడైన శ్రీశుకదేవునిగా గుర్తించి అక్కడ ఉన్న మహర్షులందరూ గౌరవసూచకంగా లేచి ఆయనను ఆహ్వానించారు. పరీక్షిత్తు ఎదురేగి, ప్రణమిల్లి, సత్కరించి, ఉచితాసనంపై కూర్చుండబెట్టి ఆయన పాదాలపై వాలి ఇలా అన్నాడు.

"ఓ యోగీంద్రా! నేడెంత సుదినం. నా అదృష్టవశంచేత మీరు వచ్చారు. ఎక్కడా ఆవుపాలు పితికే సమయంకంటే ఒకచోట ఆగని మీ దర్శనంకంటే మాబోటి వారికే ఏమికావాలి? శ్రీకృష్ణపురమాత్మయే మిమ్మల్ని ఇక్కడికి పంపించి ఉంటాడని నా నమ్మకం. నా సమస్యకు పరిష్కారమార్గం చూపగలవారు మీరే. తాము నాపట్ల అనుగ్రహముంచి వారం రోజుల వ్యవధిలో వైకుంఠధాముని చేరే దారి చూపించండి. ఎల్లప్పుడూ మానవుడేమి చేస్తుండాలి. ఏమి వింటూ ఉండాలి. దేనినిగూర్చి ఆలోచిస్తూ ఉండాలి. మరణానికి చేరువలో ఉన్న నేను ఇప్పుడేమి చెయ్యాలి. దేనిని పరిత్యజించాలి. సరియైన మార్గాన్ని ఉపదేశించి నన్ను తరింపజేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను అని పరీక్షిత్తు శ్రీశుకదేవులవారిని వేడుకొన్నాడు అని సూతుడు శౌనకాది ఋషులకు చెప్పాడు.


శుకుడు(శుక మహర్షి)

No comments:

Post a Comment