Saturday, July 25, 2026

Vasudeva Dwadashi - వాసుదేవ ద్వాదశి

వాసుదేవ ద్వాదశి

తొలి ఏకాదశి' మర్నాడే 'వాసుదేవ ద్వాదశి', ఈ రోజు ప్రత్యేకత ఏంటంటే!వాసుదేవ ద్వాదశి రోజు కృష్ణుడికి సంబంధించినది. దీనిని తొలి ఏకాదశి తర్వాత రోజు జరుపుకోవాలి.

గోపద్మ చాతుర్మాస్య వ్రతాన్ని తొలి ఏకాదశి రోజు ప్రారంభించాలని మిగిలిన పురాణాలు చెబుతుంటాయి. ఏకాదశి రోజు శ్రీకృష్ణుని సోదరి సుభద్ర వ్రతం మొదలుపెట్టక పోవటంతో, ద్వాదశి రోజు ఆమెకు కృష్ణుడు(వాసుదేవుడు) గోపద్మ వ్రతాన్ని ఉపదేశించి ఐదేళ్ల వ్రతాన్ని ఒకేసారి పూర్తి చేయించాడని కథనం. అందుకే వాసుదేవ ద్వాదశిగా ప్రసిద్ధి చెందిందని భావిస్తారు.

గోపద్మ వ్రతము
గోపద్మ వ్రతము అనేది చాతుర్మాస సమయంలో గోవులను పూజించటానికి ఏర్పాటు చేసుకున్న వ్రతము. దీనిని సుమంగళి స్త్రీలు ఆషాడ శుక్ల ఏకాదశి రోజు ప్రారంభించి కార్తీక శుక్ల ద్వాదశి వరకు కొనసాగిస్తారు.

గోపద్మ వ్రతంలో భాగంగా గోవులను పూజించటమే కాక పశువుల పాకలను/ కొట్టాలను శుభ్ర పరచి, వాటిలో అందమైన ముగ్గులు వేసి అలంకరిస్తారు. ఈ ముగ్గుల్లో భాగంగా ఆవునూ మరియు దూడను గీసి వాటిని 33 పద్మాలతో నింపుతారు. పూజలో భాగంగా ముగ్గు చుట్టూ 33 ప్రదక్షిణాలు చేస్తారు, 33 సార్లు అర్ఘ్యం ఇస్తారు మరియు 33 రకాల నైవ్యేద్యం పెడతారు. పశువుల పాక అందుబాటులో లేనివారు ఇంట్లోనే ముగ్గువేసి పూజా కార్యక్రమం చేస్తారు. ఈ గోపద్మ వ్రతాన్ని అయిదు సంవత్సరాల పాటు మాత్రమే కొనసాగించి ఆ తర్వాత ముగిస్తారు.

సనాతన ధర్మంలో ఆవును పవిత్రతకు చిహ్నంగా పరిగణిస్తారు. ఆవును పూజించటం అనేది వైదిక సంస్కృతిలో ఒక భాగం. సమస్త దేవతలు ఆవులో కొలువై ఉంటారని భావిస్తారు.

గోపద్మ వ్రత కథ:
ఒకసారి దేవసభలో అప్సర రంభ నాట్య ప్రదర్శన చేస్తుంది. మనోహరంగా వాయిస్తున్న సంగీత వాద్యముల నడుమ ఆమె అద్భుత నాట్యం కొనసాగుతుండగా, ఒక తబలా పగిలి అపస్వరం రావటంతో నాట్యం ఆగిపోయింది. దానికి ఇంద్రుడు నొచ్చుకుని వెంటనే యమ్ముణ్ని పిలిచి భూలోకంలో వ్రతమాచరించని వారి చర్మంపై తెచ్చి తబలాను బాగుచేయవలసిందిగా కోరతాడు. దానికి యముడు, భూలోకములో అటువంటి వారు ఎవరైనా ఉన్నారేమో తెలుసుకుని రమ్మని తన భటుల్ని పంపిస్తాడు.

ఆ భటులు లోకమంతా తిరిగి వచ్చి యమునికి ఇలా నివేదిస్తారు. గౌరి, సావిత్రి, అనసూయ, ద్రౌపది, అరుంధతి మరియు సరస్వతి ఇలా అందరూ ముగ్గులు వేసి పూజిస్తున్నారు. ఒక్క శ్రీకృష్ణుని సోదరి అయిన సుభద్ర ఇంటివద్ద మాత్రం ముగ్గులేదు అని తెలియచేసారు. దానికి యముడు వారిని ఆమె చర్మాన్ని తీసుకుని వచ్చి ఆ తబలాకు బిగించవలసిందిగా ఆదేశిస్తాడు. 

ఈ సమాచారాన్ని నారదుడు శ్రీకృష్ణునికి చేరవేస్తాడు. విషయం తెలిసిన శ్రీకృష్ణుడు ఉదయం నిద్రలేచిన వెంటనే సుభద్ర దగ్గరకు వెళ్లి ఆమెను ఇంటివద్ద ముగ్గు ఎందుకు లేదు మరియు వ్రతాన్ని ఎందుకు ఆచరించటం లేదు అని ప్రశ్నించగా, దానికి సుభద్ర నాకు సూర్య, చంద్రుల వంటి ఇద్దరు సోదరులు, మహావీరుడైన అర్జునుని వంటి భర్త, దేవకీ వసుదేవుల వంటి తల్లిదండ్రులు ఉండగా నేను దేనికోసం వ్రతం చేయాలి అని ఎదురు ప్రశ్నిస్తుంది. 

దానికి శ్రీకృష్ణుడు అన్నీ ఉన్నాగానీ భవిష్యత్తు కోసం వ్రతం చేయాలని ఆమెను ఒప్పించి ఆమెకు వ్రత విధానాన్ని ఇలా వివరిస్తాడు. గద్ద, విష్ణు పాదము, శంఖము, చక్రము, గద, పద్మము, స్వస్తిక, బృందావన, వేణువు, వీణ, తబలా, ఆవు, దూడ, 33 పద్మములు, తులసి ఆకు, దేవుని చిత్రాలతో కలిపి గీయాలి అని చెబుతాడు. అప్పుడు సుభద్ర రాతి పొడిని ముత్యములు మరియు పగడములతో కలిపి ముగ్గు వేసింది. ఆ తర్వాత శ్రీకృష్ణుడు తెలిపిన విధంగా గోపద్మ వ్రతాన్ని ఆచరించింది. 

ఆ విధంగా సుభద్ర గోపద్మ వ్రతం ఆచరించి, యమభటుల నుండి తప్పించుకోగలిగింది. అప్పటినుండి ఈ వ్రతం ప్రాచుర్యం పొందింది. యమభటులు ఉత్తరానికి తల పెట్టి పడుకుని ఉన్న ఒక దున్నపోతు నుండి చర్మము సంగ్రహించి తబలా బాగుచేసుకున్నారు.

వాసుదేవుడు అంటే శ్రీ మహావిష్ణువే. విష్ణువు నామాల్లో ఒక్కొక్క దానికి ఒక్కో విశిష్టత ఉంది. అలాగే వాసుదేవ నామానికీ ప్రత్యేకత ఉంది.

వసుదేవుని కుమారుడైనందున వాసుదేవ అనే పేరు వచ్చింది. అన్నిటిలో వసించు వాడు కునుక వాసుదేవుడు అని అంటారు. విష్ణు సహస్రనామంలో ‘సర్వ భూత నివాసోసి వాసుదేవ నమోస్తుతే’ అనేది దీనినే సూచిస్తోంది.

ఇక అన్ని ప్రాణుల్లో నివసించే ప్రాణ శక్తి, చైతన్య శక్తి, ఆత్మపరమైన శక్తికి వాసుదేవమనే పేరు ఉన్నట్టు పెద్దలు చెబుతారు.

ప్రాణులను ఆశ్రయించి ఉండే వైశ్వానరాగ్నికి వాసుదేవమనే పేరు ఉంది - ‘అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః అని గీతలో భగవంతుడు చెప్పిన విషయం వెనుక అర్థం ఇదే.

‘వాసనాద్వాసుదేవస్య వాసితంతే జగత్త్రయం’ అంటే అన్నిటా ఆయన ఉన్నాడనే విషయాన్ని విష్ణు సహస్ర నామంలో వివరించారు.

అర్జునుడు కృష్ణుణ్ని ఎక్కువగా పిలిచే పేరు వాసుదేవా అనే

ఇక ఈ రోజు చేసే పూజ విషయానకి వస్తే శయనేకాదశి రోజు ఉపవాసం ఉన్న వారు ద్వాదశి రోజున విష్ణు పూజచేసి భోజనం చేయవచ్చు. ద్వాదశే పుణ్య తిథి, విష్ణువుకి ప్రీతికరమైనది, శయన ఏకాదశి తర్వాత వచ్చేది కనుక దీనికి ప్రాముఖ్యం ఎక్కువ.

వాసుదేవ ద్వాదశి రోజు ప్రత్యేకంగా ఆచరించవలసిన విధానాల గురించి పురాణాల్లో ఎక్కడా ప్రత్యేకంగా చెప్పలేదు. ఈ రోజు ప్రత్యేకంగా ఉపవాసము చేయవలసిన అవసరము లేదు. ఏకాదశి, గోపద్మ, చాతుర్మాస్య వ్రతాలు చేసేవారు ఆయా వ్రత నియమాల ప్రకారం అనుసరించాలి. వాసుదేవ ద్వాదశి అని ప్రత్యేకంగా పేర్కొంటున్నాం కాబట్టి విష్ణు సహస్ర నామం పఠించటం, గోపద్మ వ్రత కథను చదవటం శ్రేయస్కరం.

ఓం నమో భగవతే వాసుదేవాయ


No comments:

Post a Comment

Omkareshwar Jyotirlinga, Mandhata, Khandwa District, Madhya Pradesh - ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగం, మాంధాత, ఖాండ్వా జిల్లా, మధ్య ప్రదేశ్

ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగం, మాంధాత, ఖాండ్వా జిల్లా, మధ్య ప్రదేశ్ ఓంకారేశ్వర్ దేవాలయం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఖండ్వా జిల్లాలోని నర్మదా నదీ తీ...