Sunday, July 13, 2025

Shakthi Peetam - 2 Kamakshi Devi Kanchipuram - శక్తి పీఠం -2 కామాక్షీ దేవి కాంచీపురం



శక్తి పీఠం -2 కామాక్షీ దేవి - కాంచీపురం

కాశీ, కాంచీపురాలు శివుడి రెండు కళ్ళని బ్రహ్మాండ పురాణం చెప్తోంది. శివదేవుడి కన్నుల్లో ఒకటిగా, దేవాలయాల నగరంగా పేరుపొందిన కాంచీపురంలో జగన్మాత శ్రీ కామాక్షీదేవిగా కొలువుదీరి ఆరాధనలందుకుంటోంది.

సతీదేవి తన తండ్రి ప్రజాపతి శివునికి వ్యతిరేకకంగా దక్ష యజ్ఞం నిర్వహిస్తున్న సమయంలో తండ్రి మీద ప్రీతితో యజ్ఞం చూడడానికి వచ్చి, తండ్రి తిరస్కారము మరియు శివ దూషణతో కలత చెంది తనలోని అగ్నిని ఆవాహనం చేసుకొని, అగ్నిలో ఆత్మార్పణం చేసుకోగా. అదితెలిసి శివుడు కోపంతో రుద్రుని పంపగా, రుద్రుడు దక్షప్రజాపతి తలనరకగా, తదుపరి శివుడు దేవతల కోరికమేరకు మేషం యొక్క తలను ప్రజాపతికి ఇచ్చి బ్రతికించాడు. తదుపరి శివుడు సతీ వియోగంతో సతీ దేవి శరీరాన్ని తీసుకొని పొతూవున్న ఉన్నసమయంలో ఆ శ్రీమహావిష్ణువు తన సుదర్శన చక్రంతో ఆ తల్లి సతీదేవి శరీరాన్ని ముక్కలు చేయగా, ఆ శరీర భాగాలు పడిన చోట్లు అమ్మవారి శక్తిపీఠాలుగా మార్పుచెందాయి. ఆ శరీరభాగాలలోని నాభి భాగం పడిన ప్రదేశమే కాంచీపురం అని పురాణం. దీనికి నాభి పీఠం లేదా ఓఢ్యాన పీఠం అని పేరు.

పూర్వం బంధకాసురుడు అనే రాక్షసుడు అపరిమిత బలగర్వంతో దేవతలను అనేక కష్టనష్టాలకు గురిచేయగా, వారందరూ ఈ బాధలనుంచి తమకు విముక్తి కలిగించమని శివుని వేడుకున్నారు. అందుకు శివుడు కైలాస పర్వతంలోని ఒక గుహద్వారా కాంచీపురం చేరుకొని జగన్మాతను ప్రార్థించమని సూచించాడు. శివుని సూచన మేరకు దేవతలు కాంచీపురం చేరుకొని పూజలు జరిపారు. వారి పూజలను మెచ్చుకున్న దేవి బంధకాసురుడిని సంహరించి తన ఉగ్రరూపమును మార్చుకుని కామాక్షి దేవిగా మారినట్లు కథనం.

ఒకనాడు కైలాసంలో లీలావిలాసంగా కొన్ని క్షణాలు శివుడి కళ్ళను పార్వతీదేవి తన చేతులతో మూసివేసింది. ఫలితంగా పార్వతీదేవి నల్లగా మారిపోయింది. దీనినుంచి తనను గట్టెంకించమని శివుని కోరగా - కత్యాయన మహర్షి వద్దకు చిన్న పిల్లగా మారి వెళ్ళమని, అక్కడ కొంతకాలం గడిపి అనంతరం కాశీనగరం మీదుగా కాంచీపురమునకు వెళ్ళి సైకతలింగమును పూజించమని సలహా యిచ్చాడు. పార్వతీదేవి అలాగే చేయసాగింది. కాంచీపురంలోని మామిడి చెట్టుక్రింద వున్న ఏకామ్రేశ్వరుడి సైకతలింగమును గుర్తించి తపస్సు చేయసాగింది. ఆ సమయంలో నారదమహర్షి పార్వతీదేవిని చూసి విషయం తెలుసుకొని పంచ బాణ మంత్రం ఉపదేశించాడు. మన్మధాంతకుడైన శివుడి మంత్రమైన పంచబాణ మంత్రమును పార్వతీదేవి పఠించసాగింది. దీనితో శివునిలో మోహాగ్ని కలిగింది. దీనిని తగ్గించేందుకు గంగాదేవి నీటి ప్రవాహాన్ని పెంచి శివుడికి కొంత ఉపశమనాన్ని కలిగించింది. పార్వతీదేవిని పరీక్షించదలచిన శివుడు గంగాప్రవాహాన్ని అధికం చేయగా పార్వతీ దేవి, విష్ణువు సూచనను అనుసరించి సైకతలింగమును గట్టిగా కౌగలించుకుంది. పార్వతీదేవి స్పర్శవల్ల శివుడు పులకిమ్చి ప్రత్యక్షం కాగా, దేవతలందరూ అదే సమయంలో వారి వివాహము జరిపించారు. వివాహం జరిగిన సంతోషంలో పార్వతీదేవి తన చూపులతో అందరిపైన అమృతంను కురిపించి, భక్తులందరి కోరికలను తీర్చింది. దీనిని గమనించిన శివుడు ఆమెకు ’కామాక్షీదేవి’ అని పేరు పెట్టాడు. వివాహానికి హాజరైన దేవతలందరి కోరికపై కామాక్షీదేవి, ఏకామ్రేశ్వరుడైన శివుడు కాంచీపురంలోనే ఉండిపోయినట్లు పురాణ కథనం.

ఈ పురాతన ఆలయం పెరునారాత్రుపడై అనే ప్రాచీన తమిళ సంగం సాహిత్యంలో ప్రస్తావించబడింది. ఇది సంగం యుగంలో కాంచీపురం రాజధాని నగరంగా మొత్తం తొండై మండలాన్ని  ప్రఖ్యాత సంగం యుగం రాజు తొండైమాన్ ఇళంతిరైయన్‌ను పరిపాలించాడు.

బంగారు కామాక్షి కుడి చేతిలో చిలుకను అలంకరించినపుడు, అసలు బంగారు విగ్రహం కనిపించింది. ఈ బంగారు విగ్రహం విదేశీయుల దండయాత్రల నుండి కాపాడుకోవడానికి బంగారు కామాక్షిని ప్రస్తుత పంచలోహ విగ్రహంతో మార్చారు. ఇప్పుడు బంగారు దేవత తంజావూరులోని పశ్చిమ మాసి వీధిలో శ్యామా శాస్త్రి ఆధ్వర్యంలో ప్రత్యేక మందిరంతో నివసిస్తోంది.

దేవాలయాల నగరమైన కాంచీపురంలోని శివకంచిలో అమ్మవారి ఆలయం వుంది. విశాలమైన ఆలయప్రాంగణం, వివిధ దేవతామూర్తులను కలిగివుండి కన్నులపండువగా కామాక్షి ఆలయం దర్శనమిస్తుంది. గర్భాలయంలో శ్రీకామాక్షీదేవి పద్మాసనస్థితిలో చతుర్భుజాలతో దర్శనమిస్తుంది. పాశం, అంకుశం, చెరుకుగడ ధనుస్సు, పుష్పబాణములను తన చేతులలో ధరించి వుంది. కంటి చూపులతోనే భక్తుల కోర్కెలనీడేర్చే కామాక్షీ అమ్మ వారి ఎదురుగా ఉన్న పూలసజ్జరూపు నిర్మాణంలో ఉన్న శ్రీచక్రము ఆదిశంకరాచార్యులవారు ప్రతిష్ఠించినట్లు చెప్పబడుతోంది. కాంచీపురంలోని ఏ ఆలయంలో ఉత్సవం జరిగినా ఊరేగింపు అమ్మవారి ఆలయానికి ప్రదక్షిణగా వెళ్ళేలా ఆలయ నిర్మాణం సాగడం విశేషం. పల్లవులు, చోళులు, విజయనగర రాజులు ఆలయాభివృద్ధికి కృషి చేశారు.

ప్రధాన దేవత కామాక్షి విగ్రహం పద్మాసనంలో కూర్చొని ఉంది, ఇది సాంప్రదాయిక నిలబడి ఉన్న భంగిమకు బదులుగా శాంతి, శ్రేయస్సును సూచించే యోగ భంగిమ. కామాక్షి దేవత తన రెండు చేతులతో చెరకు గడ , చిలుకను, పాశ , అంకుశాన్ని ఐదు పువ్వుల గుత్తిని ధరించి ఉంటుంది. వందలాది సంప్రదాయ ఆలయాలు ఉన్న నగరంలో అసాధారణంగా కనిపించే ఈ ఆలయం మినహా కాంచీపురం నగరంలో మరే ఇతర అమ్మవారి ఆలయాలు లేవు. ఈ వాస్తవాన్ని వివరించే వివిధ ఇతిహాసాలు ఉన్నాయి..అమ్మవారిని ఈ ఆలయంలో పరబ్రహ్మ స్వరూపిణిగా పూజిస్తారు , పద్మాసన భంగియోగ ముద్రలో ఉంటారు.

ఈ ఆలయం ఐదు ఎకరాల స్థలంలో , నాలుగు విశాలమైన గోపురాలతో ఒక పెద్ద తటాకముతో విస్తరించబడినది . ఈ దేవాలయం సమీపాన వరాహ రూపమైన మహావిష్ణు (తిరు కాల్వనూర్ దివ్యదేశ ) దేవాలయం ఉండేది. గుడి శిధిలం కావటం వలన మూల విగ్రహాన్ని కంచి కామాక్షి అమ్మవారి దేవాలయంలో పునః ప్రతిష్టించారు. 

ఈ దేవాలయంలో గర్భగుడి ఎదుట గాయత్రీ మండపం , అరూపలక్ష్మి , స్వరూపాలక్ష్మి విగ్రహాలు ఉన్నాయి. అమ్మ వారి విగ్రహం ముందు ఉగ్రరూపంనుండి శాంత పరచటానికి , జగద్గురు శ్రీ ఆది శంకరాచార్యులు స్థాపించిన శ్రీచక్ర యంత్రం ఉంది.

ఆలయంలో ప్రతి రోజు నాలుగు ఆరాధన సేవలు అందిస్తారు. వార్షిక పండుగ ఫిబ్రవరి మధ్య నుండి మార్చి మధ్య వరకు మాసి తమిళ మాసం వసంతకాలం లో వస్తుంది. ఈ సమయంలో రథోత్సవం , తెప్పోత్సవం జరుగుతాయి. అంతేకాక తమిళ మాసమైన వైకాసిలో నవరాత్రి, ఆడి, ఐపాసి మాసంలో , శంకర జయంతి ,వసంత ఉత్సవాలు జరుగుతాయి.

కాంచీపురం తమిళనాడు రాష్ట్రంలో చెన్నై నగరమునకు 76కిలోమీటర్ల దూరంలో వుంది. తిరుపతి నుంచి కాంచీపురమునకు 90కిలోమీటర్లు.

"కాంచీపురాశ్రితే దేవి కామాక్షీ సర్వమంగళా!
చింతనామాత్ర సంతుష్టా చింతితార్థఫలప్రదా!!

కామాక్షీ స్తోత్రం

No comments:

Post a Comment