ఒక రాజుకూతురు పూర్వజన్మమున పదారుకుడుముల తద్దినోము పట్టి యది యుల్లంఘనము చేసినందున ఆమెకు దారిద్య్రమును, వైధవ్యమును సంభవించెను. ఆ దారిద్య్రబాధకామె యనుభవింపజాలక ప్రాణములు విడువనెంచి యొకనాడొక యడవిత్రోవను బట్టి పోవుచుండెను. అప్పుడు భూపరిపాలనకై పార్వతీ పరమేశ్వరులా దారిని వచ్చుచు నాయింతిని జూచి "నీవెవరవు? ఇట్లేల నొంటరిగా నీకారడవిలో భయములేక పోవుచున్నావ"ని యడుగగా "కుడువకూడు, కట్టబట్ట, దారిద్య్రముచేత బాధపడలేక యీ యడవులబట్ట పోవుచున్నా" ని ఆమె చెప్పెను. అప్పుడు పార్వతీదేవి - "నీవు పదియారు కుడుములబెట్టి నోముపట్టి యుల్లంఘనము చేసినావు కనుక, యిట్టి బీదతనము నిన్ను బాధించుచున్నద" ని చెప్పెను. అది విని ఆ రాజకుమార్తె "అమ్మా! యాలోటు నేనెట్లు పూర్తిచేసుకొనగలుగుదును? దయచేసి చెప్పవలయున" ని ప్రార్థించెను. అందుకు పార్వతీదేవి యామెతో "నీవిప్పుడు తిరుగనింటికిపోయి భాద్రపదశుద్ద తదియనాడు నోముపట్టికథ చెప్పుకొని యక్షింతలువేసుకొని యానోము నుద్యాపనచేయు" మన, పార్వతీ పరమేశ్వరులకు భక్తితో నమస్మారముచేసి వారివద్ద సెలవుతీసుకొని, యింటికిపోయి తలంటి నీళ్ళుపోసుకొని బిళ్లకుడుములు వండుకొని, చల్ల తెచ్చుకొనుటకై పొరుగింటి కేగెను. ఆ సమయముననొక కుక్కవచ్చి యోరగిల వేసిన తలుపుతోచుకుని యా కుడుములను తినిపోయెను. అప్పుడా రాజకుమార్తెవచ్చి కుడుములు తినిపోవుచున్న యాకుక్కను చూచి, యది కుడుములతినుట గ్రహించి నిండుమనస్సుతో నాకుక్కకే తాను తెచ్చిన చల్ల మూడుముంతలు పోసెను. ఆ కుక్క గౌరిగా మారి యామెకు ప్రత్యక్షమై ఆమెకు అఖండ అయిశ్వర్యములను ఇచ్చెను.
పూజ విధానము: భాద్రపదశుద్దతదియ ( తెల్లవారితే వినాయకచవితి ) నాడు ఉదయమే తలంటుకొని పసుపు తో గౌరమ్మని చేసి, ఓ తమలపాకులో పెట్టి, పూజ ప్రారంభించాలి. ముందుగా సంకల్పము చెప్పుకొని, గౌరీ దేవిని శోడషోపచారముల తో పూజించాలి. పూజ తరువాత చేతిలో అక్షింతలు పట్టుకొని, నోము కథ చదువుకోవాలి. ఆ తరువాత ఆ అక్షింతలు , కొద్దిగా అమ్మవారిపై వేసి, కొన్ని మన నెత్తిన చల్లుకోవాలి. ఆ పై నోములో చెప్పిన విధముగా పదహారు బిళ్ళ కుడుములు (బియ్యం పిండిలో తగినంత బెల్లము పొడిచేసి వేసి, కొద్ది గా నెయ్యి, కొద్ది గా ఇలాచీపొడి వేసి, బాగా కలపాలి. ఆ పిండిని పదహారు ఉండలుగా చేసి, ఒక్కో ఉండను కొద్దిగా వత్తి, బిళ్ళలాగా చేయాలి.) చేయాలి. రెండు కొత్త చేటలు తీసుకొని, వాటికి పసుపు రాసి, కుంకుమ బొట్టు పెట్టి, ఒక చాటలో పదహారు కుడుములు, పసుపు, కుంకుమ, పెట్టి రెండో చాట తో ఆ చాటను కప్పి, ఒక ముతైదువుకు వాయనమిచ్చి, పాదనమస్కారము చేసి, ఆశీర్వాదము పొందాలి. ఇది ఏనోముకైనను తప్పనిసరి.
పదహారు కుడుముల నోము బాద్రపదమాసములో , వినాయక చవితి
రోజున కాని , బాద్రపదశుద్ధ తదియ నాడు కాని పట్టాలి . వీలైతే అదేరోజున
కూడా ఉద్యాపన చేయవచ్చు. ఉద్యాపన తప్పకుండా పుట్టింటిలోనే చేయాలి . లేదా ఆఖర్చులు
పుట్టింటి వారు పెట్టాలి. సామాన్యముగా అన్ని నోములు పుట్టినింటిలో అత్తింటివారి
ఆద్వర్యము లోనే పడుతారు . ఉద్యాపన పుట్టింటిలోనే చేస్తారు, కాని
వేరేవాటికి కన్న ఈ నోముకు మాత్రము పుట్టింటివారి భాద్యత తప్పనిసరి .
ఏనోము కైనా ఆ నోముకు ప్రత్యేకముగా చెప్పిన అమ్మవారినైతే తప్ప, మిగితావాటికి జగన్మాత ఐన గౌరిదేవిని పూజిస్తారు.
మంగళం
సతతమూ ఆరోగ్య భాగ్యంబు నొసగెడి
శ్రీ గౌరిదేవికి జయ మంగళం నిత్య శుభ మంగళం
సర్వవిధ సౌభాగ్యములనిచ్చి బ్రోచెడి
శ్రీ గౌరిదేవికి జయ మంగళం నిత్య శుభ మంగళం
ఇంటా బయట హెచ్చు పసుపు కుంకుమ పండ
స్త్రీల చల్లగ జూచు మా గౌరిదేవికి జయ మంగళం నిత్య శుభ మంగళం
శక్తి కొలదైన భక్తి మెండుగ నున్న
అభయహస్తము జూపు అమ్మ శ్రీ గౌరికి
జయ మంగళం నిత్య శుభ మంగళం
జయ మంగళం నిత్య శుభ మంగళం.
No comments:
Post a Comment