Sunday, January 11, 2026

Dhyrya Gouri Gowri Nomu Katha - ధైర్య గౌరీ నోము కథ

ధైర్య గౌరీ నోము కథ

రాజు కూతురు ధైర్య గౌరీనోము పట్టి నోముల్లంఘన చేసినది. 
ఆ తరువాత  మరొక జన్మములో మరల రాజుకూతురుగా పుట్టినది. రాజు కూతురునకు మాటలాడుటకు భయమూ, పని చేయుటకు భయమూ, పలుకరించుటకు భయమూ ఆమె అన్నింటికి ఆ ధైర్యముగా నుండెడిది. “పిల్లకు చిన్నతనము గనుక ఆలాగున్నదని రాజును రాణియు నశ్రద్ధగావించిరి. రాచబిడ్డ పెద్దదయినదికాని యా జబ్బు మాత్రముపోలేదు. తల్లిదండ్రులు, అత్తమామలు, భర్త బంధువులు అందరు ఆ పిల్ల కొరకు బెంగ పెట్టుకున్నారు. పిల్ల చీటికి మాటికి ధైర్యములేక యేడ్చుచు కూర్చుండేది. "లేక లేక కలిగిన యీ పిల్లకీ కళంక మేమి చెపుమా!" యని భార్యభర్తలిరువురు దైవములకు 'మొక్కుచు- 'తమ యాపద బాపుమనని దైవమును వేడుకొనుచుండే వారు. 

ఇట్లుండగా భక్తుల మొరవిని పరమేశ్వరుడొకనాడు బ్రాహ్మణ వేషముతో వారింటికి వచ్చెను. రాజు కూతురు దీర్గవిచారముతో గడగడ వణుకుచు ఏడ్చుచు నొకమూల కూర్చున్నది. అది చూచి ఆ మాయ బ్రాహ్మణు-"డదియేమని"యడిగెను. ఆమె తలిదండ్రులు వృత్తాంతమంతయు నా దేవునకు భక్తిశ్రద్ధలతోడ చెప్పుకొనిరి. అప్పుడా బ్రాహ్మణ వేషయైన పరమేశ్వరుడు - "ఈబిడ్డకి కష్టము తీరుటకొక వ్రతము చేయవలెను. పూర్వజన్మమంది మీ ధైర్యగౌరీ నోము పట్టి ఉల్లంఘనము చేసినది. అందుచేత నీమె ధైర్యములేక యిట్లు కృసించి పోవుచున్నది" అని చెప్పి, యంతర్థానమయ్యెను. వెంటనే రాజదంపతులు, రాజకుమార్తెయు ఆశ్చర్యమగ్నులై- 'దేవుడు ప్రత్యక్షమై వ్రతము చెప్పినాడిని' తెలిసికొని భక్తితో ఆయన చెప్పినట్లా వ్రతము యధావిధిగా చేసిరి. వెంటనే బాలిక సురక్షితురాలై ధైర్య స్థెర్యము కలిగి సుఖసంతోషములతో భర్తతో గాపురము చేయుచు, కడుపునిండ బీడ్డలుగాంచి, సిరిసంపదలతో తులతూగుచు, నిత్యకళ్యాణము పచ్చతోరణముతో, పదివేలేండ్లు బ్రతికి పార్వతి సాన్నిధ్యము నొందెను. ఆమె నోచిన నోము భామలందరు నోచి యిష్టార్థముల నందిరి.

ఉద్యాపనము: ఈ కథ చెప్పి అక్షతలు వేసుకొని తవ్వెడు గిద్దెడు ఆవునెయ్యి, వరహాయెత్తు భమిడివుత్తతో ఒక్కటే దీపముగా వెలిగించవలెను. మానెడు సోలెడు ఆవుపాలలో కావలసిన బియ్యము వెసికొని వండి నైవేద్యముపెట్టి యెవ్వరికి పెట్టకుండ భోజనము చెయ్యవలెను. దీపము కొండయెక్కే వరకు భోజనము చేయరాదు. ఈ దీపము చాతుర్మాసములో నెప్పుడైన నొకప్పుడు వెలిగించవలెను.

No comments:

Post a Comment