దీపదానము నోచినవారికి పాపాలన్నియు బాసిపోవును.
దీపదానము నోచినవారికి పాపాలన్నియు మాసిపోవును.
దీపదానము నోచినవారికి దివ్యపధంబు సన్నిధియగును.
ఈ పాట పాడుకొని కథ చెప్పుకొని అక్షతలు వేసికోవలెను.
సుగుణ అనే ఓ ఇల్లాలు గౌరీదేవిని ఎంతో భక్తి శ్రద్ధలతో సేవించేది. వున్నంతలో సంతృప్తిగా, సంతోషంగా కుటుంబాన్ని నెట్టుకొచ్చే ఆ ఇల్లాలిని ఓ సమస్య పట్టి పీడించ సాగింది.
సుగుణ ఉదయాన్నే నిద్రలేచి పూజా మందిరాన్ని శుభ్రపరిచి దీపారాధన చేసేది. అయితే ఆమె అలా దీపారాధన చేయడం ఆలస్యం అవి వెంటనే కొండెక్కేవి. దాంతో ఆమె మనసంతా ఆందోళనతో నిండిపోయేది. అనుకున్నట్టుగానే ఆమె ఇంట్లో ఎవరో ఒకరు అనారోగ్యాల బారిన పడసాగారు. ఈ కారణంగా మానసిక ప్రశాంతత లేకపోవడమే కాకుండా ఆర్ధికంగా కూడా ఆమె చితికిపోసాగింది.
దీనికి పరిష్కారం చెప్పమని అమ్మవారిని తలచుకుంటూ నిద్రలోకి జారుకున్న సుగుణకి ఒక కల వచ్చింది. 'దీపదానాల నోము' నోచుకోవడమే ఈ సమస్యకి పరిష్కారమంటూ, అమ్మవారు ఆ నోము విధి విధానాలను గురించి వివరించింది. కార్తీకమాసం రాగానే అమ్మవారు చెప్పినట్టుగా సుగుణ ఆ నోము పట్టింది.
కార్తీక మాసం ప్రారంభమైన రోజున శివాలయంలోగానీ, విష్ణు ఆలయంలోగాని మొదటి రోజున ఒక దీపం వెలిగించాలని అమ్మవారు చెప్పినట్టుగానే చేసింది. అలాగే రెండవ రోజున రెండు దీపాలు ... మూడవ రోజున మూడు దీపాలు వెలిగించింది. ఇలా నెలంతా దీపాలు వెలిగిస్తూ ప్రతి రోజు ఒక దీపంతో పాటు దక్షిణ తాంబూలాలను బ్రాహ్మణుడికి దానం ఇస్తూ వచ్చింది.
ఇక నెల పూర్తి అయిన తరువాత కార్తీక పౌర్ణమిన గానీ, అమావాస్యరోజున గాని 33 మట్టి ప్రమిదలలో ఒక్కొక్క వత్తి వేసి వెలిగించాలని అమ్మవారు చెప్పినట్టుగానే చేసింది. ఆ దీపాలతో పాటు దక్షిణ తాంబూలాలను సంతానం కలిగిన ముత్తయిదువులకు వాయనదానమిచ్చి ఉద్యాపన చెప్పుకుంది. ఆ రోజు నుంచి ఆమె ఇంట 'దీపారాధన' అలాగే నిలిచివుండటమే కాకుండా, అందరూ పూర్తి ఆరోగ్యంతో సుఖసంతోషాలతో కూడిన జీవితాన్ని కొనసాగించినట్టు ఈ కథ వివరిస్తోంది.
ఉద్యాపనము: ముప్పదిమూడు వెండి ప్రమిదలు లేదా 33 మట్టి ప్రమిదలలో శక్తికొలది చేయించి వానిలో నొక్కక్క దీపము వెలిగించవలెను. ఈ దీపము కమలవత్తులతో వెలిగించవలెను. కమలవత్తి యనగా పదమూడు పోచలు కలిపినవత్తి ఎనిమిది ముక్కల క్రింద త్రుంచి ఆ యెనిమిది ముక్కలు కలిపి ఒక్కవత్తిగా నలపవలెను. దీనిపేరు కమలవపువొత్తి ఈ కమలపువొత్తులు ప్రమిదక్కొక్కటి చొప్పున వెలిగించి దీపములు వెలుగుచుండగా శక్తికొలది దక్షణ తాంబూలాదులతో బ్రాహ్మణునకు దానమీయవలెను. ఈయుద్యాపనము కార్తీక మాసములోచేయవలెను.
No comments:
Post a Comment