Wednesday, January 21, 2026

Magha Puranam 3 - మాఘ పురాణం 3 వింధ్య పర్వతము

మాఘ పురాణం-3 వ అధ్యాయం

వింధ్య పర్వతము
దిలీపుని మాటలకు వశిష్టుడు మరల ఇట్లు చెప్పదొడంగెను,

"భూపాలా ! నేను తెలుపబోవు విషయము చాలా పురాతనమైనది, ఒకానొక సమయమున వింధ్య హిమాలయపర్వతాల మధ్యనున్న ప్రాంతమున కాటకము కలిగెను, ఆకరువు అన్ని వర్ణముల వారినీ పీడించినది. ప్రజలకు తిండి లేదు. త్రాగుటకు నీరు లేదు, అంటు వ్యాధులు ప్రబలి జనులు, పశువులు, చాల నష్టపడివవి. అందువలన యజ్ఞ యాగాది కార్యములుగాని, దేవతార్చనలుగాని చేయలేకపోయిరి. వనములందు తవస్సుచేసుకొను మునీశ్వరులు సహితము ఆ కరువుకు హాహా కారములు చేసి ఆశ్రమములు వదలి వలసపోవుచుండిరి. అప్పుడు భృగుమహర్షి ఆ కరువు ప్రాంతములోనే నివసించుచుండెను, రేవానది తీరమందున్న ఫలవృక్షములు పంట భూములు నీరు లేక బీడుపడిపోయినవి. త్రాగడానికి నీరుకూడా లభించుట లేదు.

మహా తపస్వియగు భృగుమహర్షి కూడా ఆ కాటకమును తట్టుకోలేకపోయాడు. ఎన్నో సంవత్సరాల నుండి ఆప్రాంతమందుండుట వలన అచటనుండి కదలుటకు ఇష్టము లేకపోయినవ్పటికీ విధిలేక హిమాలయ ప్రాంతములకు వలసపోయాడు.

హిమాలయ పర్వతాలకు పడమటి దిక్కున ఒక కొండ చరియ వున్నది. ఆ కొండచరియ అచటనున్న కైలాస పర్వతమునకు చాలా దగ్గరగా నున్నది, అది తెల్లగా కూడ వున్నది, ఆ కొండచరియయందు ఇంద్రనీలములు వుండుటవలన ధగధగా మెరుస్తున్నది. మహర్షులు, సిద్ధులు, జ్ఞానులు, ఆ కొండవద్దకు వచ్చి శ్రీమన్నారాయణుని భక్తి భావముతో ప్రార్దించుచుండిరి, అంతియేగాక ఆ పర్వతమువద్దకు యక్షులు, గంధర్వులు వచ్చి విహరించుచుందురు” అని వశిష్ఠులవారు దిలీపునకు వివరించిరి. అంతట దిలీపుడు వశిష్ఠునితో ఇట్లు పలికెను.

“ఓ మహానుభావా! ఆ పర్వతమునుగురించి చెప్పిన మాటలు నాకు ఆశ్చర్యమును కలుగజేసినవి. ఇంకను విశేషములున్న తెలుపగోరెదను” అని ప్రార్ధించెను.

మరల వశిష్ఠులవారు ఇట్లు చెప్పిరి. “రాజా! నీ యభీష్టము ప్రకారమే వివరింతును. సావధానుడవై ఆలకింపుము.

“ఆ పర్వత రాజము కడువింతయైనది. దానిపై నున్న వింత చెట్లు పురాతనవన్యమృగములు, అనేకరకముల పక్షులతో నున్న అ వర్వతము ముప్పది యోజనములు పొడువుకలిగి పదియోజనములు ఎత్తుగలదియై అలరారుచుండెను. అటువంటి పర్వతము వద్దకు భృగు
ముహర్షి వచ్చి ఆ సుందర నయనానందకరమగు దృశ్యములను చూచి సంతోషించాడు, తానుతవస్సుచేసుకొనుటకు అదే మంచి అనుకూలమైన స్థలమని నిర్ణయించి, ఆశ్రమము కట్టుకొని తపస్సు చేసుకొనుచుండెను, అటుల కొంత కాలము గడచిపోయెను. ఒకనాడు ఒక గంధర్వ యువకుడు భార్యాసమేతుడై, ఆ పర్వతముమీదికి వచ్చి, తపమాచరించుకొనుచున్న భృగుమహర్షినిగాంచి, నమస్కరించి, గద్గద స్వరముతో తన వృత్తాంతమును భృగునకు ఇట్లు తెలియ చేసెను.

గంధర్వ యువకుని వృత్తాంతము
"భృగుమహార్షీ నా కష్టమును ఏమని విన్నవింతును? నేను, పూర్వజన్మలో చేసిన ఫుణ్యఫలము వలన నాకు స్వర్గము ప్రాప్తించిననూ పులి మొగము నాకు కలిగినది. ఏ కారణముచే నాకు అటుల కలిగెనో బోధపడకున్నది? ఆమె నా భార్య రూపవతి, గుణవంతురాలు,మహాసాధ్వి. ఈ నా  వికృతరూపము వలన ఎందుకు పనికిరాని వాడనైతిని. గాన నా యీరూపమునకు కారణమేమియో వివరించి నా మనోబాధను తొలగింపజేయుడు" అని పరిపరి విధముల ప్రార్థించెను.

భృగుమహర్షి గంధర్వుని దీనాలాపము నాలకించెను, అతని వృత్తాంతము వినగానే ముని హృదయము కలచివేసినట్లయినది. ఆ గంధర్యునికెటులైనను తన శక్తికొలది సాయము చేయవలయునని నిశ్చయించుకొని ఇట్లనెను.

“ఓయీ గంధర్వకుమారా ! నీవు అదృష్టహీనుడవు. అదృష్ట హీనతవలననే నీకీ కష్టదశ గలిగినది. పాపము, పేదరికము, దురదృష్టము అను మూడునూ మనుజుని కృంగదీయును, ఈ మూడింటిని నివృత్తి చేసుకొనవలెనన్న, మాఘమాస స్నానమే పరమౌషధము. అన్ని జాతులవారును ఆచరించవలసిన పరమపావనమైన మార్గము. గావున నీవు నీ భార్యతోగూడ ఈ వర్వతమునుండి ప్రవహించుచున్న నదిలో స్నానము చేయుము. అదియునుగాక యిది మాఘమాసము గదా! వెళ్లపోయిన తీర్థమెదురైనట్లు అన్నియు సమకూడియున్నవి, ఈ రోజుతో నీ కష్టములు తొలగిపోవును. నీ మనోవాంఛ ఈడేరును. భయపడకుమని మాఘస్నాన ఫలము గురించి వివరించెను.

ఆ గంధర్వుడు 
భృగుమహర్షి ఉపదేశమును శ్రద్దగా వినెను. తన భార్యకూడ మునీశ్వరుని వచనము లాలకించి సంతోషించెను. ఆ మహర్షి చెప్పినవిధముగ గంధర్వుడు భార్యాసమేతుడై. ఆ దాపుననే ప్రవహించుచున్న నదిలో స్నానము చేసెను, వెంటనే తనకున్న పెద్దపులి ముఖముపోయి తేజోవంతమయిన, సుందరమైన ముఖముతో ప్రకాశించెను. ఆ గంధర్వ దంపతులు అమితానందము నొందిరి.

అంత వారిద్దరును 
భృగుమహర్షి కడకు నచ్చి సాష్టాంగ నమస్కారములు చేసిరి, భృగువు వారలను దీవించి పంపించెను.

ఈ విధముగా గంధర్వ యువకుని చరిత్రమును వశిష్టులవారు దిలీపున కెరిగించి, "వింటివా రాజా!
గందర్వకుమారుని వృత్తాంతము? మాఘమాసములో పుణ్యనదులయందు స్నానమాచరించిన
యెడల యెట్టి ఫలము కలుగునో ఊహీంచుకొనుము.

No comments:

Post a Comment