Thursday, January 22, 2026

Sarva Siddhi Matangi Raja Matangi - సర్వసిద్ది మాతంగి రాజ మాతంగి

శ్యామల నవరాత్రులలో ఐదవ రోజు సర్వసిద్ది మాతంగి రాజ మాతంగి

మాతంగముని కుమార్తె కాబట్టి ఈమె మాతంగి అయినది. శివ సహస్రనామ స్తోత్రములో శివుడికి మతంగుడనే పేరుంది. మతంగుడి శక్తి కాబట్టి మాతంగి. మరకత వర్ణంతో ప్రకాశించే శ్రీ మాతంగీదేవి వశీకరణ దేవతగా ప్రశస్తి పొందినది.

మాతంగీ దేవిని రాజమాతంగి, సుముఖి, కర్ణ మాతంగి, వశ్యమాతంగి, లఘు శ్యామలా, ఉచ్చిష్ట చండాలి అనే పేర్లతో కూడా పిలుస్తుంటారు. ఈ దివ్య స్వరూపిణి ఉసాసనవల్ల వాక్సిద్ధి, సకల రాజ స్త్రీ పురుష వశీకరణాశక్తి, ఐశ్వర్య ప్రాప్తి సాధకుడికి లభిస్తాయి. సరస్వతీ దేవి యొక్క తాంత్రిక అవతారంగా మాతంగి పిలువబడుతుంది. సరస్వతి దేవివలెనే మాతంగి అమ్మవారికి కూడా సంగీతము, సాహిత్యము, వాగ్దాటి మరియు లలిత కళలకు అధినాయికగా గుర్తింపు పొందింది. ఈఅమ్మవారిని  ఆరాధించటం వలన సూర్య గ్రహ దోషాలు శాంతిస్తాయి.

పచ్చలు, చిలుకల వంటి పచ్చగా, రత్న సింహాసనంపై కూర్చొని, ఎర్రని వస్త్రాలు ఆభరణాలు ధరించి, గుంజ మాలతో అలంకరించబడి, శంఖంతో చేసిన చెవి పోగులు ధరించి, ఖడ్గము, పాశము, బల్లెము మరియు అంకుశము ధరించి మనకు దర్శనమిస్తుంది. పురుషార్థ ప్రదములైన సిద్ధులకు, గృహస్తా శ్రమములో జీవితం సుఖమయం. కావటం కోసం అమ్మ ఆరాధన అత్యంత శ్రేయస్కరం. 

మత్తెక్కించే ఎర్రటి కళ్ళతో ఆనందంగా ఎప్పుడూ వీణ వాయిస్తూ ఉంటుంది.

నారద పాంచరాత్రంలోని పన్నెండవ అధ్యాయంలో శివుడిని శ్మశాన చండాలుడిగా చెబితే అయన శక్తియెన అమ్మవారిని ఉచ్చిష్ట చాండాలిగా చెప్పబడి ఉంది. ఆ రూపానికే మాతంగి అని పేరుంది. పూర్వం కదంబ వనంలో ఉండే మతంగ ముని తపమును మెచ్చి లలితాదేవి తన మూడోకంటి నుండి శ్యామవర్ణంలో ఒక దివ్య తేజోమూర్తిని సృష్టించింది. ఆమెయే మాతంగి. దక్షిణామ్నాయ మరియు పశ్చిమామ్నాయ మఠాలకు అమ్మ అధిష్టాన దేవత.

అక్ష్యవక్ష్యే మహాదేవీం మాతంగీం సర్వసిద్ధిదాం
 ।
అస్యాః సేవన మాత్రేణ వాక్సిద్ధిం లభతే ధృవం 


వాక్సిద్ది కోసం పై శ్లోకాన్ని పఠిస్తే ఉత్తమం. అమ్మ పూర్ణరూపం వాగ్దేవియే. అమ్మ మూడు నేత్రాలు సోమసూర్యాగ్నులకు ప్రతీకలు. అమ్మవారి నాలుగు భుజాలు నాలుగు వేదాలకు, పాశము అవిద్యకు, అంకుశము విద్యకు ప్రతీకలు. పాశము కర్మరాశికి, శబ్దస్పర్శరస రూపగంధాలు పంచభూతాత్మక సృష్టికి, కదంబ వనము బ్రహ్మాండానికి ప్రతీకలు. 

దుర్గాసప్తశతిలోని ఏడవ అధ్యాయములో అమ్మవారు వీణాధారి అయి చిలుక యొక్క మధురమైన మాటలు వింటూ అరుణవర్ణపు చీరలో అందరికీ దర్శనమిస్తుంది. ఇక్కడ చిలుక మాటలు “హ్రీం” కారానికి ప్రతీక. అరుణ వర్ణం జ్ఞానానికి ప్రతీకగా చెబుతారు.

ఊతం భద్ర సుభద్ర రుద్రరమణీమ్‌ ఉచ్చిష్ట చండాలినీమ్‌ 
భాతిమ్‌ రోహిత వస్త్ర సంపుటికరీమ్‌ వాణీం చతుర్బాహునీమ్‌ 
గీతం వాచక నాద నృత్య నిధి సంఘీభావ సంపూజనీమ్‌ 
మాతంగీమ్‌ హరితాం సుశోభి సుమతీమ్‌ మంత్రిత్వ సంచాలకీమ్‌!

భావము: ఆశ్రయము (ఊతం) ఇచ్చి భద్రంగా చూసే విష్ణురూప (సుభద్ర) రుద్రకామినీ ఉచ్చిష్ట చండాలినిగా పేరుపొందావు. ఎరుపు వస్త్రములతో ఆభరణములతో కాంతివంతముగా కప్పుకున్న (సంపుటి) నాలుగు బాహువులు గల సరస్వతీ. నృత్య నాట్య సంగీత వాచకములకు నిధివి, ఐకమత్య బోధకురాలివి కడు పూజనీయురాలివి. ఓ మాతంగీ! ఆకుపచ్చ రంగులో శోభిల్లు బుద్ధిమంతురాలివి, ఆ లలితా మాతకు ప్రధానమంత్రిగా సంచాలకము చేస్తున్నావు అట్టి నీకు నమస్మారములు!

హిమవంతుని స్నేహితుడైన మతంగముని శ్యామలా ఉపాసకుడు. మతంగముని పత్నిని ఆకుపచ్చని శరీరకాంతితో, పద్మధారియై మాతంగి స్వప్న సాక్షాత్కారమును అనుగ్రహించెను. నిరంతర, అకుంఠితసాధనతో తల్లిని పుత్రికగా పొందగలిగెను. తత్ఫలితముగా బ్రహ్మాండ సంకేతమైన కదంబ వనములో మతంగముని ధ్యానాసక్తుడైయున్న సమయమున బ్రహ్మాండమను కదంబ వనమున ప్రసన్నవదనయై, మందస్మితముతో తల్లి సాక్షాత్మరించినది.

శక్తి సమాగమ తంత్రాను సారము లక్ష్మీనారాయణులు పార్వతీపరమేశ్వరులకు భక్తిప్రపత్తులతో మహానైవేద్యమును సమర్పించగా, కరుణతో స్వీకరించుచున్న సమయమున కొన్ని మెతుకులు క్రిందకు జారి, వాని నుండి ఒక అందమైన కన్య ఆవిర్భవించినదట. విపరీతమైన ఆకలితో ఉన్న ఆ కన్య, వారు భుజించగా మిగిలిన నైవేద్యమును భుజించి, ఉచ్చిష్ట చండికగా ప్రసిద్ధి చెందినది.

మత్స్య పురాణము ప్రకారము అంధకాసుర రుధిర పానార్థమై పార్వతీ దేవి తనశరీరము నుండి కౌశికీ దేవిని ఉత్పన్నము చేసినదట. మాతృ రూపిణియైన గౌరీదేవి దేహము నుండి ఉత్పన్నమైన కారణమున ఈమెను మాతంగి అంటారు.

మహాభారత కథనం ప్రకారం ఒక బ్రాహ్మణ స్త్రీకి, మంగలి యువకుడికి పుట్టినవాడు మాతంగుడని, ఇలా వర్ణసాంకర్యతో పుట్టిన మాతంగుడు జాతిపరంగా చండాలుడైనాడని, జన్మ సంస్కారం వల్ల ఎంతో తపస్సు చేసి ఇంద్రుడి వరంతో చండదేవుడు అనే పేరు పొందాడని, శ్యామలాదేవి ఇతని భార్య గర్భాన జన్మించిందని, ఇలా చండాలుడుకి జన్మించినందున చాండాలిగా, మాతంగుడి కుమార్తె గనుక మాతంగిగా, లోకంలో ఈ దేవి ప్రసిద్ధి పొందిందని తెలుస్తోంది. 

మాతంగుడి తీవ్రతపస్సుకి సంతోషించిన శ్యామలాదేవి ఆయనకి ప్రత్యక్షమై వరం కోరుకోమంది. అప్పుడు మాతంగుడు దేవితో “అమ్మా, పూర్వం నేను నా స్నేహితుడైన హిమ వంతుడితో మాట్లాడే సందర్భంలో, ఆయన నన్ను తక్కువగా చేసినట్లుగా ప్రవర్తిస్తూ “నేను గౌరీదేవికి తండ్రిని” నా కన్నా గొప్పవాడెవరు?” అని గర్వంగా అన్నాడు. అప్పటినుంచి నాకు కూడా ఒక శక్తికి తండ్రి కావాలనే కోరిక కనుక దయచేసి నువ్వు నాకు కుమార్తెగా జన్మించు” అనగా, శ్యామలాదేవి తధాస్తు అని పలికింది. కొన్నాళ్ళకు మాతంగుడి భార్య గర్భవతియై కుమార్తెను కన్నది. ఆమె మాతంగిదేవిగా ఆవిర్భవించి ప్రసిద్ధి చెందింది. ఈ దివ్య స్వరూపిణి సోత్రపఠనం వల్ల వాక్సిద్ధి, విద్య, ఐశ్వర్యప్రాప్తి, అన్ని కార్యాలలో జయం భక్తులకు లభిస్తాయి.

అసురీ శక్తులను అంతమొందించు యుద్ధమున పరమేశ్వరి తన శరీరము నుండి ఒక అద్భుత శక్తిని ఆవిర్భవింపచేసి, సేనలకు ప్రధాన మంత్రిణిగా నియమిస్తు, తనచేతి ముద్రికను తొడిగినదని, యుద్ధమున తల్లి విషంగుడు అను రాక్షసుని అంతమొందించిన కథనము కూడా కలదు. మాతంగిని ముద్రికాదేవిగా కూడ ఆరాధిస్తారు.

అశుభములలో, అశుభ్రతలో మిళితమైన కాలుష్యశక్తిగా భావించి, మాతంగిని చండాలికగా పిలుస్తారు. చండాలిక విషయ వాసనలు అంట లేనిదే కాని మనము అంటరాని మాత కాదు. ఉగ్ర మాతంగిగా ఘోర రూపియై, శవసింహాసనయై, ఒక చేత పురైతో అరణ్య నివాసినిగా సంచరిస్తుంటుంది.

శ్యామలాదేవిగా మరకత మణివర్ణముతో, పద్మాసనస్థితయై, పద్మమును, కెంపులుపొదిగిన వీణను ధరించి, ఎర్రని వస్త్రములతో, ఎర్రని ఆభరణములతో ఎర్రని పూలమాలలతో వాక్శక్తియై అనుగ్ర హిస్తుంది.

రాజమాతంగిగా నాదస్వరూపమైన వీణను చేత ధరించి, చిలుకలకు పలుకులు నేర్పుతూ, సంగీత, సాహిత్యమనే ఘన స్తనములతో, చతుషష్టి కళారూపిణియై ఉంటుంది.

ధ్యాన మాతంగిగా నీలివర్ణముతో కదంబ మాలను ధరించి, సృష్టి- స్థితి-లయములను నడుము క్రింది మూడు వళులతో (ముడుతలతో) మూడు లోకములను ఏలుతుంటుంది. సర్వ వర్ణోపశోభిత సర్వశక్తి సమన్విత అయిన మాతంగిమాత.

మోహరాత్రియైన మాతంగి మతంగుడు అను శివశక్తిని కలుపుకొని పరిపూర్ణమవుతుంది. శ్రావణ బహుళ అష్టమి బుద్దావతారముగా భావించే తల్లికి ప్రీతిపాత్రము. మూలబిందువు నుండి వాయవ్యదిశకు విస్తరిస్తుంది. వా
క్శక్తి మంత్ర శక్తియెన తల్లి సర్వతంత్రిణి.

సౌమ్యరూపియై ఉన్నప్పుడు చెరుకు విల్లు, పూలబాణములు, చిలుకను, వీణను ధరించి ఉంటుంది. ఘోర రూపియైన మాతంగి పాశాంకుశములను, దండము కృపాణమును, కపాలమును, ఖట్వాంగమును ఆయుధములుగా ధరించి ఉంటుంది.

శరీరములోని విశుద్ధి చక్రము మాతంగి నివాస స్థానము. త్రికోణము మాతంగి నివాస స్థానము. సూక్ష్మ రూపములో యంత్రముగాను, స్టూలములో మూర్తిగాను చతుషష్టి కళలలో ప్రకటితమవుతుంది. వాక్కు గాను ప్రకటింపబడుతుంటుంది. మేరు దండములా ఉన్న మన వెన్నెముకలో, తిరగబడిన ఆడ ఏనుగు తొండమువలె మాతంగి నివసిస్తుంది. తృతీయనేత్ర స్థానము నుండి బయలుదేరిన శక్తిని జిహ్వాగ్రమునకు చేర్చే సరస్వతీ నాడి యందు మాతంగి నివసిస్తుంది. శరీర మందలి విశుద్ధి చక్రములోను మాతంగి మాత నివాసం ఉంటుంది.  

సరస్వతీదేవి అవతారమే మాతంగి. అంతఃకరణ ప్రపంచము మాతంగిది. బాహ్యము సరస్వతిది. ఆధ్యాత్మిక విషయ బోధనలకు గురువు మాతంగి. ఆనందానికి ప్రతీకగా హస్తములో అమృతపాత్రను, వ్యాకరణ రూపమైన శంఖమును ధరించి మనకు దర్శనమిస్తుంది.

అవ్యాజ కరుణామూర్తి పాదపద్మములకు సవినయ సమర్పణము చేయుచున్న మహాకవి కాళిదాసును అనుగ్రహించుటకు అడ్డుపడుతున్న అతపి ఏడుజన్మల పాపరాశులను కాళిసతి ద్వారా ఆ ఏడు జన్మల పాపములను ఏడు క్షణములుగా మార్చి సరస్వతీ తత్త్వముతో బీజాక్షరమును అనుగ్రహించిన విధానము కూడా కనుపించుచున్నది.

ఓమ్‌ మాతంగ్యైచ విద్మహే
ఉచ్చిష్ఠ ఛాండాళ్యైచ ధీమహి
తన్నో దేవీ ప్రచోదయాత్‌ !!


ఈమెను ఉచ్చిష్ట ఛండాలిని లేద ఉచ్చిష్ట మాతంగిని అని కూడా పిలుస్తారు. ఇక్కడ ఉచ్చిష్ట అనగా మిగిలిపోయినది అని. ఈమెకు నైవేద్యంగా మిగిలిపోయిన లేదా సగం తిన్న ఆహారంను పెడతారు. సహజంగ భగవంతునికి శుభ్రమైన పదార్థములను నైవేద్యంగా సమర్పిస్తాము కానీ, మాతంగి అమ్మవారికి అపరిశుభ్రమైన పదార్థములను నైవేద్యంగా సమర్పిస్తారు. అందుకే ఈ  అమ్మవారు అపరిశుభ్రతతో ముడిపడి ఉంటుంది.

ఈమెను పూజించిన వారికి అమితమైన శక్తులు సిధ్ధిస్తాయి. ముఖ్యంగ శత్రువులపై నియంత్రణ ఉంటుంది. అందరినీ ఆకట్టుకునే శక్తి లభ్యమవుతుంది. లలిత కళలపై అపారమైన పట్టు సాధ్యమవుతుంది. ఈమె చిక్కటి అందమైన కనుబొమ్మలతో, కలువ పువ్వుల్లాంటి మూడు
కన్నులతో, అలంకరించబడ్డ సింహాసనంపై ఆసీనురాలై ఉంటుంది. ఈ మాతంగి చుట్టూ వివిధ దేవతలు ఆమెకు సపరిచర్యలు చేస్తూ ఉంటారు. ఈమె నాలుగు హస్తాలలో పాశము, ఖడ్గము, డాలు, అంకుశము ఉంటాయి. ఈమె ఆకుపచ్చని వర్ణంలో ఎంతో సౌందర్యవతిగా ఉంటుంది.

మాతంగి రూపాలలో అత్యంత ప్రజాదరణ కలిగిన దేవత అయిన ఉచ్చిష్ట మాతంగి రూపం శవం మీద కూర్చుని, ఎర్రటి వస్త్రాలు ఎర్ర ఆభరణాలు, గురివింద విత్తనాల దండను ధరించి ఉంటుంది. గుండ్రంగా, పెద్దవిగా ఉన్న వక్షోజాలతో దేవత రూపం పదహారేళ్ళ కన్యగా వర్ణించ బడింది. ఆమె తన రెండు చేతుల్లో పుర్రె, కత్తిని ధరిస్తుంది. మిగిలిపోయిన ఆహార పదార్థాలను అమ్మవారికి నైవేద్యంగా పెడతారు.

తంత్రసార ధ్యాన మంత్రాల ప్రకారం మాతంగి రూపం నీలి రంగులో ఉంటుంది. నెలవంక ఆకారంలో చంద్రుడు ఆమె నుదిటిని అలంకరిస్తాడు. మూడు కళ్ళతో, నవ్వు మొహంతో ఆమె రూపం ఉంటుంది. ఆమె రకరకాల నగలు ధరించి, ఆభరణాలతో తయారు చేయబడిన సింహాసనంపై కూర్చొని ఉంటుంది. ఆమె నాలుగు చేతుల్లోని ఒక చేతిలో ఉచ్చు, మిగిలిన చేతులలో కత్తి, మేక, ఒక కర్రను కలిగి ఉంది. ఆమె నడుము సన్నగా ఉండి వక్షోజాలు బాగా అభివృద్ధి చెందిన రూపంలో మనకు మాతంగి అమ్మవారు దర్శనమిస్తారు.

పురశ్చర్యర్ణవము నుండి గ్రహించిన ధ్యాన మంత్రం ప్రకారం మాతంగి ఆకుపచ్చ రంగులోని దేహంతో నుదుటి పైన చంద్రవంకతో ఉంటుంది. పొడవాటి జుట్టుతో, పెదవులపైనా నవ్వుతో, మత్తు కళ్ళు కలిగి ఉండి కదంబ పువ్వులతో తయారు చేసిన పూలమాలతో, వివిధ ఆభరణాల దండలను ధరించి ఉంటుంది. ఆమె ముఖం చుట్టూ కొద్దిగా పట్టిన చెమటలు ఆమెకు మరింత అందాన్ని తెచ్చిపెడతాయి. ఆమె నాభి క్రింద ఉన్న చర్మం పైన యొక్క మూడు క్షితిజ సమాంతర మడతలు అందంగా కనిపిస్తుంటాయి. బలిపీఠం మీద కూర్చుని, రెండు చిలుకలతో చుట్టుముట్ట
బడిన ఆమె చతుష్షష్టి కళలకు నిలువెత్తు రూపంగా కనిపిస్తుంటుంది.

శారదతిలకము ప్రకారం రాజ మాతంగి మాత వీణ వాయిస్తూ, శంఖాలను, గవ్వలను చెవిపోగులుగా ధరించి, పూల దండలతో దర్శన మిస్తుంది. పూల చిత్రాలను ఆమె నుదిటిపై కలిగి ఉంటుంది. ఆమె తెల్లటి తామర దండను ధరించిన రూపంలో చిత్రీకరించబడింది.

కాళిదాసు యొక్క శ్యామలదండకంలో వర్ణించిన ప్రకారం, మాతంగి రత్న ఖచితమైన వీణ మీటుతూ ఉంటుంది. తియ్యగా మాట్లాడుతుంది. చిక్కటి పచ్చరంగు, ఎర్ర కుంకుమపొడితో అభిషేకించబడిన రొమ్ములతో, నుదిటిపై నెలవంక చంద్రునితో, నాలుగు చేతులలో ఆయుధాలు ధరించి ఉంటుంది. ఆమె నాలుగు చేతులలో ఉచ్చు, మేక, చెరకువిల్లు, పూల బాణాలను కలిగి ఉంటుంది. ఈ ఆయుధాలనే త్రిపుర సుందరి దేవత కూడా ధరించి ఉంటుంది. మాతంగి మాత చిలుకను ప్రేమిస్తుందని గానమును ఎంతగానో ఇష్టపడుతుందనీ కూడా వివరించబడింది.

శ్యామలాదేవి (మాతంగి)ని కూడా కాళీదేవి యొక్క శ్యామకాళి రూపంగా భావించడం కనిపిస్తుంది. మహాకవి కాళిదాసు ఆమె రూపాన్ని వర్ణిస్తూ “మాతా మరకత శ్యామా... మాతంగీ మధుశాలినీ” అన్నాడు. అంటే.. శ్యామలాదేవి నల్లని వర్ణం కలిసిన మరకత (ఆకుపచ్చ) వర్ణంతో ప్రకాశిస్తుందిట. అందుకని మతంగ మహర్షి దర్శించిన శ్యామలా స్వరూపాన్ని కూడా శ్యామకాళిగా ఉపాసించడం కనిపిస్తుంది. శ్యామకాళిని ఉపాసిస్తే ఆ తల్లి ప్రేమ శక్తిని ప్రసాదిస్తుంది. సృష్టి రహస్యాన్ని కాలస్వరూపాన్ని తెలిసేటట్లుగా చేస్తుంది.

మాతంగి అనే పదానికి ఆడ ఏనుగు అనే అర్ధం కూడా ఉంది. ఏనుగు గణపతి రూపానికి సంకేతం. గణపతి అంటే విజ్ఞానానికి, విద్యకి ప్రతీక. మాతంగీ దేవి కూడా విద్యకి, విజ్ఞానానికి ప్రతీక. కనుక మాతంగీ అంటే విద్యా ప్రదాయిని అని కొందరు పండితులు చెప్తారు.

ఒకచేత మధుపాత్ర ధరించి, ఇంకోచేత చిలకను ధరించి, మధ్య పానముచే కైపెక్కిన కన్నులు కలిగి, చెవులకు శంఖాభరణములు ధరించి స్థన భారము చేత వీణ వాయిస్తూ, జుట్టు విరబోసుకుని వుండే దేవత “మాతంగి” మరియు “శ్యామల దేవి”. మాత ముఖ్య లక్షణము సర్వజన వశీకరణము. మాతంగి దేవత మరకత వర్ణము, ఈ మాతని ఉపాసించే వారికి సకల జనులు, రాజు, అధికార గణం వశీకృతులై  ఉంటారని అంటారు.

శ్రీ రాజామాతంగి దేవిని ఉపాసించేవారికి జన వశీకరణ, ధన వశీకరణ, రాజ్యాధికార ప్రాప్తి, ఉన్నత ఉద్యోగములు, అధికార పదవులు ఈ తల్లి అవలీలగా ప్రసాదిస్తుంది. ఉద్యోగము ఉన్నతపదవులు కోరుకునే వారు ఈ తల్లిని ఆశ్రయించడం శుభకరం. ఆరోగ్యము అష్ట ఐశ్వర్యములు సంగీతము సాహిత్యాన్ని ఈ తల్లి ప్రసాదిస్తుంది. ఈ తల్లిని ప్రసన్నం చేసుకొనిన మహాకవి కాళిదాసు, తెనాలి రామలింగ కవి మొదలగు ఎందరో బహుదా కీర్తిని ఉన్నత స్థితిని పొందారు.

ఈ దేవిని వామాచారమార్గంలో దక్షిణాచారమార్గంలో కూడా ఉపాసించవచ్చు. సాధకుడు దేవతా వర్ణమైన చిలక పచ్చరంగు వస్త్రాలను గానీ, ఎర్రని వస్త్రాలను గానీ ధరించాలి. చిలకపచ్చ లేక ఎర్రని పూసల మాలను జపానికి ఉపయోగించాలి. అలాగే ఆసనం కూడా ఇదే రంగుల్లో ఉండాలి. ఇలా ఉచ్చిష్ట మాతంగీ దేవిని గానీ, ఆదేవి ఇతర రూపాలైన శ్రీరాజమాతంగీ, లఘుశ్యామలా, సుముఖీదేవి మంత్రాలనిగానీ నియమ పూరితంగా భక్తిశ్రద్ధలతో ఆచరిస్తే విద్య, ఐశ్వర్యం, గొప్ప వశీకరణ శక్తి సాధకుడికి లభిస్తాయని వివరిస్తారు.





No comments:

Post a Comment