Thursday, January 22, 2026

Vasant Panchami - వసంత పంచమి

వసంత పంచమి

మాఘ శుద్ధ పంచమిని 
వసంత పంచమి అని కూడా అంటారు. దీనిని శ్రీ పంచమి అని మదన పంచమి అని కూడా అంటారు. మాఘశుద్ధ పంచమి సరస్వతీదేవి జన్మించిన రోజు. ఈ పండుగ యావత్ హిందూ జాతి విశేషముగా జరుపుకుంటారు. ఈ రోజు సరస్వతి దేవికి పూజ చేయవలెను.
ఈ వసంత పంచమి రోజున పిల్లలకు అక్షరాభ్యాసం చేయడమే కాకుండా ప్రతి ఒక్కరూ జ్ఞానవంతులు కావడం కోసం సరస్వతీ దేవి అనుగ్రహాన్ని పొందడం కోసం సరస్వతీ మాతను విశేషంగా పూజిస్తారు.

వసంత పంచమి విశిష్టత
సరస్వతీదేవిని మాఘ పంచమి నాడు శ్రీ పంచమి పేరిట ఆరాధిస్తారు. సర్వవిద్యలకూ ఆధారం వాగ్దేవే కనుక చిన్నపెద్ద తేడాల్లేకుండా పుస్తకాలు, కలాలు అమ్మవారి దగ్గర పెట్టి ఈ రోజున ఆరాధిస్తారు. సంగీత నృత్యసాహిత్యాలకు కూడా ఈ దేవీ యే మూలం కనుక ఈ తల్లిని నృత్యకేళీవిలాసాలతో స్తుతిస్తారు. ఈ తల్లిని జ్ఞానప్రాప్తి కోసం ఆరాధించమని బ్రహ్మవైవర్తపురాణం చెప్తోంది. ఈ శ్రీ పంచమినాడు సరస్వతిని ఆరాధించే విధివిధానాలను నారదునకు శ్రీమన్నారాయణుడు వివరించినట్లు దేవీ భాగవతం చెప్తోంది.

ఈ వసంత పంచమి పండుగ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని బాసర, వర్గిల్, విజయవాడ కనక దుర్గమ్మ దేవాలయాల వంటి ప్రముఖ దేవాలయాల్లో ఘనంగా పూజలు నిర్వహిస్తారు.

మాఘమాసం శిశిరఋతువులో వసంతుని స్వాగతచిహ్నమూగా ఈ పంచమిని భావిస్తారు. ఋతురాజు వసంతుడు కనుక వసంతుని, ప్రేమను కలిగించేవాడు మదనుడు కనుక మదనుణ్ణి, అనురాగ వల్లి అయిన రతీదేవిని ఆరాధన చేయటం కూడా శ్రీపంచమినాడే కనబడుతుంది. వీరి ముగ్గురిని పూజించడం వల్ల వ్యక్తుల మధ్య ప్రేమాభిమానాలు కలుగుతాయి. దానివల్ల జ్ఞాన ప్రవాహాలు ఏర్పడుతాయి.

అమ్మ దగ్గర అక్షరాభ్యాసం చేయస్తే పిల్లలు జ్ఞాన రాశులు అవుతారు. సరస్వతి ఆరాధన వల్ల వాక్సుద్ధి కలుగుతుంది. అమ్మ కరుణతో సద్భుద్ధినీ పొందుతారు. మేధ, ఆలోచన, ప్రతిభ, ధారణ, ప్రజ్ఞ, స్ఫురణ శక్తుల స్వరూపమే శారదాదేవి. అందుకే ఈ దేవిని శివానుజ అని పిలుస్తారు.

ఈ వసంత పంచమి రోజున చిన్న పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తే జ్ఞానం, విద్యాబుద్ధులు వికసించి భవిషత్తులో ఉన్నత స్థానాలకు చేరుకుంటారని ప్రగాఢ విశ్వాసం.

శరన్నవరాత్రులల్లో మూలా నక్షత్రం రోజున సరస్వతీ రూపంలో దుర్గాదేవిని ఆరాధించినప్పటికీ మాఘమాసంలో పంచమి తిథినాట సరస్వతీదేవికి ప్రత్యేక ఆరాధనలు విశేష పూజలు చేస్తారు.

ప్రతిరోజూగాని, పంచమినాడు సప్తమి తిథులలో కాని, సరస్వతీ జన్మనక్షత్రం రోజు గాని పూజించిన వారికి ఆ తల్లి కరుణాకటాక్షాలు పుష్కలంగా లభిస్తాయి. అహింసకు అధినాయిక సరస్వతిదేవి. సరః అంటే కాంతి. కాంతినిచ్చేది కనుక సరస్వతి అయింది. అజ్ఞాన తిమిరాంధకారాన్ని దూరం చేసి విజ్ఞాన కాంతికిరణ పుంజాన్ని వెదజల్లే దేవత సరస్వతీ.

ఈ అహింసామూర్తి తెల్లని పద్మములో ఆసీనురాలై వీణ, పుస్తకం, జపమాల, అభయ ముద్రలను ధరించి ఉంటుంది. అహింసామూర్తి కనుకనే ఈ తల్లి చేతిలో ఎటువంటి ఆయుధాలు ఉండవు. జ్ఞానకాంతిని పొందినవారికి ఆయుధాల అవసరం ఏమీ వుండదు.

‘‘వాగేశ్వరీ, మహాసరస్వతి, సిద్ధసరస్వతి, నీలసరస్వతి, ధారణ సరస్వతి, పరాసరస్వతి, బాలాసరస్వతి’’ ఇలా అనేక నామాలున్నప్పటికీ ‘‘సామాంపాతు సరస్వతీ ’’ అని పూజించే వారు ఆ తల్లికి ఎక్కువ ప్రేమపాత్రులట.

సరస్వతీ దేవిని ఆవాహనాది షోడశోపచారాలతో పూజించి సర్వవేళలా సర్వావ స్థలయందు నాతోనే ఉండుమని ప్రార్థిస్తారు. వ్యాసవాల్మీకాదులు కూడా ఈ తల్లి అనుగ్రహంతోనే వేదవిభజన చేయడం, పురాణాలు, గ్రంథాలు, కావ్యాలు రచించడం జరిగిందంటారు. పూర్వం అశ్వలాయనుడు, ఆదిశంకరాచార్యులు కూడా ఈ తల్లిని ఆరాధించి ఉన్నారు.

మేషరాశి రాసి వారు కుజ గ్రహ అనుగ్రహం కోసం ఆ తల్లిని "ఓం ఐం సరస్వతీ నమః" అనే మంత్రాన్ని 108 సార్లు పఠించాలి.

సూర్యోదయం సమయంలో ఈ మంత్రాన్ని పఠించడం వల్ల పరీక్షల్లో విజయం సాధించడం, సొంతంగా నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం పెరగడం, మాటల్లో, ఆలోచనల్లో స్పష్టత కలుగుతుంది.

శుక్రుడి ప్రభావంతో ఈ వృషభ రాశి వారికి కళల్లో విజయం కలుగుతుంది. ఈ రాశి వాళ్లు పసుపు రంగు దుస్తులు ధరించి "ఓం హ్రీం సరస్వతీ నమః" మంత్రాన్ని పఠించాలి. ఈ మంత్ర పఠనం వల్ల సంగీతం, కళలు, రచన, సిరి సంపదలు, అదృష్టం వంటివి పెరుగుతాయి.

మిధున రాశి వారికీ బుధుడి ప్రభావంతో వ్యాపారంలో విజయం చేకూరుంతుంది. ఈ రాశి వాళ్లు 
"ఓం ఐం హ్రీం క్లీం సరస్వత్యై నమః" మంత్రాన్ని పఠించాలి. ఆకుపచ్చ దుస్తులు ధరించి ఈ మంత్రాన్ని పఠిస్తే వ్యాపారంలో పురోగతి, కళల్లో రాణింపు, చదువులో ఏకాగ్రత, తెలివితేటలు బాగా పెరుగుతాయి.

చంద్రుని ప్రభావంతో ఈ కర్కాటక రాశి వారు మనశ్శాంతిని పొందుతారు. ఇక ఈ రాశి వారు తూర్పు ముఖంగా కూర్చుని "ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మ్యై సరస్వత్యై నమః" అనే మంత్రాన్ని పఠించాలి. దీని వల్ల మానసిక అశాంతి తొలగిపోయి, మానసిక స్థిరత్వం, ఆరోగ్యం మెరుగుపడతాయి.

సూర్యుడి ప్రభావంతో సింహ రాశి వాళ్లకు నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. ఈ రాశి వాళ్లు "ఓం హ్రం హ్రీం హ్రూ సహ్ సూర్య సరస్వత్యై నమః" మంత్రాన్ని పఠించాలి. అంతే కాకుండా వీళ్లు పసుపు రంగు వస్త్రాలు ధరించి తూర్పు ముఖంగా కూర్చొని ఈ మంత్రాన్ని పఠించాలి. దీని వల్ల నాయకత్వ సామర్థ్యం, పనుల్లో విజయం, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.

కన్యా రాశి వాళ్లు బుధుడి ప్రభావంతో విశ్లేషణాత్మకంగా ఆలోచనలు పెరుగుతాయి. ఈ రాశి వాళ్లు "ఓం బుం బుద్ధయే సరస్వత్యై నమః" మంత్రాన్ని పఠించాలి. ఈ రాశి వాళ్లు ఆకుపచ్చ దుస్తులు ధరించి ఉత్తర దిశలో కూర్చుని ఈ మంత్రాన్ని పఠించాలి. దీని వల్ల విజయం, ఉద్యోగ, వ్యాపారాల్లో పురోగతి, తెలివితేటలు పెరుగుతాయి.

తులా రాశి వాళ్లు శుక్రుడి ప్రభావంతో కళల్లో విజయం చేకూరుతుంది. ఈ రాశి వాళ్లు 
"ఓం శుక్రాయ సరస్వతీ నమః" మంత్రాన్ని పఠించాలి. ఈ రాశి వాళ్లు తెలుపు లేదా నీలం కలర్‌ వస్త్రాలు ధరించి తూర్పముఖంగా కూర్చొని ఈ మంత్రాన్ని పఠించాలి. దీనివల్ల సంగీతం, కళల్లో విజయం సాధించడమే కాకుండా వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుందట.

వృశ్చిక రాశి వారికి కుజ ప్రభావంతో సాహసోపేతమైన స్వభావం పెరుగుతుంది. ఈ రాశి వాళ్లు 
"ఓం అంగారకాయ సరస్వతీ నమః" అనే మంత్రాన్ని పఠించాలి. ఈ రాశి వాళ్లు ఎరుపు రంగు వస్త్రాలు ధరించి, ఆగ్నేయ దిశలో కూర్చుని మంత్రాన్ని పఠించాలి. దీని వల్ల ధైర్యం పెరగడం, శత్రువులపై విజయం సాధించడం జరుగుతుంది.

ధనుస్సు రాశి వారు బృహస్పతి ప్రభావంతో బాగా జ్ఞానవంతులుగా మారుతారట. ఈ రాశి వాళ్లు 
"ఓం బృహస్పతయే సరస్వత్యై నమః" అనే మంత్రాన్ని పఠించాలి. దీని వల్ల ఆధ్యాత్మిక జ్ఞానం, పనుల్లో విజయం చేకూరుతుంది.

మకర రాశి వాళ్లకి శని ప్రభావంతో క్రమశిక్షణ అలవడుతుంది. ఈ రాశి వాళ్లు 
"ఓం శ్యం శనిశ్చరాయ సరస్వత్యై నమః" మంత్రాన్ని పఠించాలి. ఈ రాశి వాళ్లు పశ్చిమ ముఖంగా కూర్చుని మంత్రాన్ని పఠించాలి. దీని వల్ల కష్టానికి తగిన ప్రతిఫలం ఉండటం, కెరీర్‌లో స్థిరత్వం ఏర్పడటంతో పాటు శని దోషం తగ్గుతుంది.

కుంభ రాశి వాళ్లు శని ప్రభావంతో వినూత్న ఆలోచనలకు విశేషంగా ప్రాధాన్యం ఇస్తారు. ఈ రాశి వాళ్లు "ఓం శ్యం శనిశ్చరాయ సరస్వత్యై నమః" మంత్రాన్ని వసంత పంచమి రోజున పఠించాలి. ఈ రాశి వాళ్లు కొత్త ఆలోచనలు తీసుకోవడం, విజయం సాధించడం, సాంకేతిక రంగంలో పురోగతి సాధించడం జరుగుతుంది.

మీన రాశి వాళ్లు బృహస్పతి ప్రభావంతో ఊహాశక్తి, భావోద్వేగాలు బాగా ఎక్కువగా కలిగి ఉంటారు. ఈ రాశి వాళ్లు "ఓం బృహస్పతయే సరస్వత్యై నమః" అనే మంత్రాన్ని పఠించాలి. దీని వల్ల పనుల్లో విజయం, ఆధ్యాత్మిక ఎదుగుదల, సృజనాత్మకతకు సంబంధించిన రంగాల్లో విజయం వరిస్తుంది.





No comments:

Post a Comment