Tuesday, February 10, 2026

King Parikshit Became The Sovereign By Dharmaraja - ధర్మరాజు పరీక్షితునకు పట్టము గట్టి మహాప్రస్థానంబున కేగుట

ధర్మరాజు పరీక్షితునకు పట్టము గట్టి మహాప్రస్థానంబున కేగుట

కలి ప్రవేశించగానే క్రౌర్యం, హింస, అసత్యం, ఆడంబరం, కుటిలత్వం మొదలైన వాటితో అధర్మం పట్టణాల్లో ఇండ్లలో సమస్త ప్రదేశాల్లో విస్తరించిందని గ్రహించిన ధర్మరాజు మనుమడైన పరీక్షితుని హస్తినాపుర సామ్రాజ్యానికి పట్టాభిషిక్తునిజేసినాడు. పవిత్ర సముద్రజలాలతో అభిషేకించి ఆశీర్వదించినాడు. అనిరుద్ధుని కుమారుడైన వజ్రుని మధురానగరానికి అధిపతిగా చేసినాడు. మమకారం వదలి ఏనుగులు, గుఱ్ఱాలు, సైనికులు, కంకణాలు మొదలైన సమస్తాభరణాలు, అమాత్యులను, విద్వాంసులను, స్త్రీలను సకల ధన కనక వస్తువాహనాలను అభిమన్యుని కుమారుడైన పరీక్షితుని అధీనం గావించి ధర్మనందనుడు విరక్తితో బుద్ధియోగాన్ని ఆశ్రయించినాడు.

వైరాగ్యవంతుడైన ధర్మరాజు ప్రాజాపత్యమనే యాగంచేసి, గార్హపత్యం మొదలైన అగ్నులను ఆత్మయందు తాను ఆరోపించుకొన్నాడు. నిరహంకారుడై, సంసారబంధాలను పూర్తిగా త్రెంచివేసి, వాక్కు మొదలైన అన్ని యింద్రియాలను మనస్సునందు, మనస్సును ప్రాణమునందు, ప్రాణాన్ని అపానమందు, అపానాన్ని మృత్యువునందు, మృత్యువును పాంచ భౌతికమైన శరీరమునందు, శరీరాన్ని సత్వరజస్తమోగుణములందు, ఆ మూడుగుణాలను అవిద్యయందు, ఆరోపాలకు అన్నింటికి కారణమైన అవిద్యను జీవాత్మయందు, జీవాత్మను అవ్యయమైన పరమాత్మయందు లయమగునట్లు చేసినాడు. సర్వసంగ పరిత్యాగియై నారచీరలు ధరించినాడు. మౌనంతో నిరాహారుడై, తలవిరబోసికొని, పిచ్చివానివలె, పిశాచము పట్టినవానివలె, చెవిటివలె, జడునివలె ఎట్టి అపేక్షలు లేనివాడయినాడు.

మనస్సులో పరబ్రహ్మాన్ని పదే పదే మననం చేసికొంటూ పూర్వం విజ్ఞానవంతులు అనుసరించిన ఉత్తరపు దిక్కునకు ధర్మనందనుడు నిర్మల ప్రయత్నంతో ఏకాగ్రచిత్తుడై పయనించినాడు.

బ్రాహ్మణ్రశ్రేష్ఠా! అనంతరం ధర్మజుని సోదరులైన భీమసేనాదులు కలిప్రభావంతో ప్రజలందరూ పాపమార్గంలో సంచరించటం గ్రహించినారు. సకల ధర్మకార్యాలు నిర్వహించినారు. శ్రీమన్నారాయణుని పాదపద్మాలను తమ హృదయంలో పదిలపరచుకొన్నారు. ఆయనమీది భక్తిచే పవిత్రులయినారు. ఈ విధంగా రజోగుణం లేని హృదయాలతో విషయాసక్తి గలవారు ప్రవేశింపరానిదీ, పాపరహితులు, విజ్ఞానవంతులైన ఏకాంతభక్తులకు గమ్యమై వెలుగొందే విష్ణులోకాన్ని చేరినారు.

అటుపై విదురుడు పవిత్ర ప్రభాస తీర్ధంలో భగవంతునిపై మనస్సు లగ్నంచేసి, శరీరాన్ని త్యజించినాడు. పూర్వజన్మలో తాను యమధర్మరాజు కావున పితృదేవతలతో కలిసి తన అధికార పీఠాన్ని అధిష్టించినాడు. ద్రౌపది భర్తలచేత ఉపేక్షింపబడినదై దేవదేవుడైన వాసుదేవుని యందే తన హృదయాన్ని నిలిపి, ఆ పరమేశ్వరుని స్థానాన్నే పొందింది.

రాజా! పాండవుల మహాప్రస్థానాన్ని, శ్రీకృష్ణుని పరమపదయానం చదివినవాడూ, వినినవాడూ భవబంధ విముక్తుడై, శ్రీహరి భక్తుడై కైవల్యపదాన్ని పొందుతాడు. శ్రీ కైవల్యపదంబు చేరుటకే గదా ఈ గ్రంథం వ్రాయబడింది.

అనంతరం అచ్చట హస్తినాపురంలో రాకుమారుడు పరీక్షిత్తు దైవజ్ఞులైన పెద్దలు చెప్పినట్లు విప్రశ్రేష్ఠుల సమక్షంలో సమస్త విద్యలు నేర్చినాడు. మహాభక్తవర్యుడుగా రాజ్యపాలన సాగించినాడు. అంత పరీక్షిత్తు ఉత్తరుని కొమార్తె ఇరావతిని పెండ్లాడి జనమేజయుని వంటి నలుగురు కుమారులకు తండ్రి అయినాడు. గంగానదీ తీరంలో కృపాచార్యుని పర్యవేక్షణలో మూడు అశ్వమేధ యాగాలు చేసి ఆ యజ్ఞాలలో దేవతలకు ప్రత్యక్షంగా హవిర్భాగాలు అందించినాడు. జైత్రయాత్రకు బయలుదేరి, దిక్కులన్నింటిని జయించే సందర్భంలో ఒకచోట గోమిథునాన్ని తన్నుతూ రాజచిహ్న ముద్రితుడై శూద్రుని వేషంలో ఉన్న క్షుద్రుడగు కలిపురుషుని పట్టి శిక్షించినాడు అని చెప్పగానే శౌనకుడు సూతునితో ఈ విధంగా అన్నాడు.

పరీక్షిన్మహారాజు భూధర్మదేవతల సంవాదం

శ్రీ మహా భాగవతము

పంచాంగం

No comments:

Post a Comment