పరీక్షిన్మహారాజు కలిని నిగ్రహించి ధర్మపరిపాలనము సేయుట
ఈ విధంగా పరీక్షిత్తు భూదేవిని ధర్శదేవతను ఓదార్చినాడు. మహారథుడు, అర్జునుని మనుమడు ఐన ఆ మహావీరుడు తొలకరి మెఅపు తీగెవలె తళతళ మెరుస్తూ, కన్నులకు మిరుమిట్లుగొలిపే తన ఖడ్గాన్ని చివాలున భీతి కలిగించేట్లు జళిపించి చంపుటకై పూనుకొన్నాడు. ఆ మహారాజును చూచి, కలి వెంటనే తన రాజ చిహ్నాలనన్నిటిని విడిచి, వడలిన వదనంతో భయకంపితుడై ఆ రాజు పాదముల పై శిరస్సునుంచి నమస్మారంచేసి.
ఓ రాజోత్తమా! భయంతో నా దేహమంతా వణకుతున్నది. నన్ను చంపకు. నీ శరణుజొచ్చిన నన్ను కాపాడు మని వేడుకొన్నాడు. పరీక్షిత్తు కలిపురుషుని చంపక నవ్వుతూ ఈ విధంగా అన్నాడు.
ఓరీ! దుర్మార్గుడా! నిర్మల కీర్తిగల అర్జునుని మనుమడు ఓడినవారిని, ధైర్యం వీడి, భయంతో కంపించేవారిని చంపటానికి ఇష్టపడడు. కావున నీవు నీ ధూర్తస్వభావాన్ని విడిచి దూరంగా తొలగిపో!
పరమ పాపాత్ముడవైన నీవు పాపాలకు బాంధవుడివి. అట్టి నీకు నేను పాలించే ఈ భూమండలంలో స్థానం లేదు. రాజవేషధారివైన నీలో అసత్యం, లోభం, దొంగతనం, దౌర్జన్యం, దురాచారం, మోసం, కలహం, కపటం, కాలుష్యం, దౌర్భాగ్యం మొదలైన ధర్మవ్యతిరేక లక్షణాలు అన్నీ గూడు కట్టుకొని ఉన్నాయి. సత్యానికి, ధర్మానికి ఆలవాలమైన ఈ బ్రహ్మావర్తదేశంలో యజ్ఞవేత్తలైన పెద్దలు యజ్ఞేశ్వరుడైన శ్రీమహావిష్ణువును యజ్ఞాలతో ఆరాధిస్తున్నారు. సమస్త చరాచర ప్రపంచంలో, లోపల వెలువల అంతట నిండియున్న వాయువువలె సర్వాంతర్యామియైన ఆ స్వామివారికి సర్వశుభాలు కలిగిస్తూ, వారి మనోరథాలు తీరుస్తున్నాడు. కనుక నీవు ఈ ప్రదేశంలో ఉండటానికి వీలులేదు అని యమునివలె కత్తిని పైకెత్తగా అపుడు కలి చక్రవర్తితో ఇలా పలికినాడు.
జగత్ప్రభూ! ధగధగమనే కాంతులతో మెరుస్తున్న నీ కరవాలాన్ని చూచి నా గుండెలు పగులుతున్నాయి. చిత్తం తత్తరపడుతుంది. ఇప్పుడు నే నెక్కడికి పోగలను? ఎక్కడ ఉండగలను? నీవే ఆలోచించు.
ఓ రాజేంద్రా! అటు ఇటు ఎటు చూచినా అంతట ధనుస్సు ధరించిన నీ రూపమే కన్పిస్తుంది. మరి నే నెచ్చట తలదాచుకోవాలో నీవే ఆనతిమ్ము అని అలమటిస్తూన్న కలిపురుషుని అభ్యర్థనను ఆలకించి ఆ పరీక్షిత్తు అతనికి జూదం, మద్యపానం, స్త్రీలు, ప్రాణివధ అనే నాలుగు స్థానాలు ఇచ్చినాడు. అతడు ఇంకను అర్థించగా అయిదవ స్థానంగా సువర్ణాన్ని అనుగ్రహించినాడు. ఆ సువర్ణం కారణంగా అసత్యం, మదం, కామం, హింస, వైరం అనే మఱి ఐదు స్థానాలు కలికికి కలిసి వచ్చాయి. ఈ స్థానాలు తప్ప మఱి యే ఇతర స్థలాలను స్పృశింపరాదని కలిని పరీక్షిత్తు గట్టిగా కట్టడి చేసినాడు. ఈ విధంగా ఆ మహారాజు కలి పురుషుని నిగ్రహించి, అంతకుమునుపు పోగొట్టుకొన్న తపస్సు, శౌచం, దయ అనే మూడు పాదాలను ఎద్దురూపంలో ఉన్న ధర్మదేవతకు అర్పించి భూదేవికి అపరిమితమైన ఆనందాన్ని కలిగించినాడు.
కలిదర్పమును అణచిన సింహపరాక్రముడైన ఆ రాజసింహుడు హస్తినాపురంలో సింహాసనాసీనుడై కౌరవ సామ్రాజ్య లక్ష్మిని గౌరవ పూర్వకంగా కలతలను పూర్తిగా అణచి పరిపాలించినాడు.
ఈ విధంగా వాసుదేవుని అనుగ్రహంవల్ల అశ్వత్థామ బాణాగ్ని జ్వాలలనుండి బ్రతికి బయటపడి, ఎద్దురూపంలోనున్న ధర్శదేవతకు అభయమిచ్చిన పరీక్షిత్తు, మునిశాపకారణంగా తక్షకుని విషాగ్ని జ్వాలల వలన తప్పక మరణం ప్రాప్తిస్తుందని తెలుసుకొని, సర్వసంగ పరిత్యాగియై శుకయోగీంద్రుని ఆశ్రయంతో పరిపూర్ణ పరమార్ధాన్ని గ్రహించి, చివరగా గంగానది ఒడ్డున తన శరీరాన్ని విడిచినాడు అని చెప్పి సూతుడు శౌనకునితో ఇంకా ఇట్లన్నాడు.
పవిత్రుడా! పాపరహితుడా! హరిలీలలు తెలుసుకొనేవారు, హరిపాద స్మరణ చేసేవారు, నిరంతరం హరిచరిత్రలు ఆలకించేవారు వారి మరణ సమయంలోకూడా ఎట్టి భ్రాంతిని, తొట్రుపాటును పొందరు.
(శౌనక మహర్షీ!) భృగువంశ్రేష్ఠా! పుణ్యచరిత్రుడైన వాసుదేవుడు తన అవతారం ముగించిన తరువాత లోకమంతటా విజ్బంభించిన కలి అభిమన్యుని పుత్రుడైన పరీక్షిత్తు కాలంలో తన ప్రభావం చూపక ఎంతో అణగిమణగి ఉండినాడు.
ఈ ప్రకారంగా నాలుగు సముద్రాల నడుమ గల విశాల భూమండలాన్ని చక్రవర్తియై ఆ అభీమన్యుపుత్త్రుడు ఏకచ్చత్రంగా పరిపాలన గావించినాడు.
ఈ కలియుగంలోని విశేషమేమంటే పాపాలు చేస్తేనే వాటి ఫలితాలు కలుగుతాయి. ఇక పుణ్యాల విషయమా? చేయాలని అనుకొంటే చాలు. వెంటనే అవి ఫలితం ఇస్తాయి. కనుకనే అభిమన్యు కుమారుడైన పరీక్షిత్తు కలి విజ్బంభణను అణచి, ఇక కలివల్ల ప్రమాదం కలుగదని నిశ్చయించుకొని అతనిని ప్రాణాలతో విడిచి పెట్టినాడు. తుమ్మెద నెమ్మదిగా నేర్పుతో పూలలోని తేనెను మాత్రమే ఉల్లాసంతో ఆస్వాదించి, విరుల కెటువంటి చేటు కలిగింపక వదలివేస్తుంది కదా!
అంతేకాక పొంచిపైకి దూకే తోడేలువలె ప్రమత్తులు, చంచల చిత్తులు ఐన మానవులను మాత్రమే కలి పురుషుడు బాధిస్తాడు. ధీరులకు కలివలన భయం కలుగదని తలచిన ఆ మహారాజు కలిని రూపుమాపక వదలిపెట్టినాడని చెప్పగా విని శౌనకాది మహర్షులు సూతుని కొనియాడుతూ ఇట్లన్నారు.
పౌరాణిక శిరోమణీ! నీవు చిరకాలం వర్ధిల్లు మరణస్వభావం గల మాకు అమృతమయమైన విష్ణు వినిర్మలయశోవ్యాప్తికి చెందిన లీలావిశేషాలు వినిపించినావు. మహాభారమైన యజ్ఞకార్యాలు ప్రారంభించి క్రమ్ముకొన్న హోమాల పొగలతో పొగిలే మాచే గోవింద చరణారవింద మధురమకరందమును తనివితీర త్రాగించినావు. మేము ధన్యులమైనాము. స్వర్గమే కాదు అపవర్గం కూడ భాగవతులైన భక్తుల సాంగత్య భాగ్యఫలంలో సహస్రాంశానికైనా సాటిరాదు సుమా! ప్రాకృతగుణాతీతుడైన శ్రీమన్నారాయణుని గుణవిశేషాలు పరమేశ్వర బ్రహ్మాదులు కూడ తెలియలేరు. అట్టి భగవంతుని గూర్చి వీనులవిందుగా వినడానికి ఇచ్చగింపని వెఱ్ఱివాడు ఎక్కడైనా ఉంటాడా?
ఆనందనందనునికి చేసే వందనాలు అతని గురించి చేసే సంకీర్తనలు సంపత్కరాలు. పాపాలను, సంతాపాలను పూర్తిగా హరించేవి. అవి దివ్యకాంతులీనెడి దివ్వెలై కటికచీకట్లను పోగొట్టేవి. పాషండులకు పొందరానివి.
వాసుదేవుని పాదసేవలు పావనత్వమును ప్రసాదించేవి. దురితములనే తీగెలను ఖండించేవి. నిత్య కల్యాణ ప్రాభవంతో చైతన్యం కలవి, శ్రీదేవీ సేవలను ఆమోదించేవి.
పుణ్యాత్ముడా! పరమభాగవతోత్తముడు, పాండవ పౌత్రుడు అయిన పరీక్షిన్నరేంద్రుడు శుకమహర్షి సూక్తులతో వినిర్మల బుద్ధియై మిక్కిలి తేజరిల్లుతూ ముక్తికి ఆలవాలమైన వాసుదేవుని పాదమూలాన్ని ఏ విధంగా పొందినాడు?
మహానుభావా! అత్యద్భుత యోగ విద్యాసముపేతము, విష్ణు కథాపరిపూతము, పరమపుణ్యము, సమస్త కల్యాణగుణ గణగణనీయము, భక్తజనులకు అపేక్షితము అయిన పరీక్షిత్తు శ్రవణం చేసిన భాగవత కథను మాకు వినిపింపుమని అడుగుతున్న మహర్షులతో సూతుడిలా చెప్పినాడు.
అయ్యా! పెద్దలైన మీవంటివారు అడగటమూ, కమలాక్షుడైన విష్ణుని కథలు చెప్పగలగడమూ అనేది నాకు మహభాగ్యం. పెద్దలచే సమ్మాన్యమైన నా జన్మ ధన్యమైంది. నా జీవితం సఫలం.
తక్కువకులంలో జన్మించినవాడైనా, శ్రీమన్నారాయణుని విశిష్ట కథలను వినిపిస్తే ఉన్నత కులగౌరవాన్ని పొందుతాడు.
ఏ దేవదేవుని గుణగణాలు గణించటానికి నాలుకలు చాలక నలువ(బ్రహ్మ) మొదలగు దేవతలు 'అనంతుడు' అని అనుచున్నారో, తనను కోరు తక్కిన ముక్కోటి దేవతలను కాదని శ్రీదేవి ఎవని పాదధూళిని పరిగ్రహించిందో, బ్రహ్మదేవుడు ఎవని పాదపద్మాలు కడిగిన పవిత్రజలాన్ని అఖిల జగత్తుకు అనుగ్రహించినాడో, 'భగవంతుడు' అనే పరమపవిత్ర శబ్దానికి అర్ధస్వరూపమై ఎవడు అతిశయించి విరాజిల్లుతున్నాడో, ఏ మహాత్ముని ప్రాపుగాంచి మహామునులు సర్వసంగ పరిత్యాగులై 'పరమహంస' పదాన్ని అందుకొని మరలిరాకున్నారో ఆ వాసుదేవుని దివ్యగాథలు పరిపూర్ణంగా గ్రహించటానికి ఎవరికి సాధ్యమౌతుంది?
మునివర్యులారా! పక్షి తన శక్తికొలది ఎంత పైకి ఎగిరినప్పటికి ఆకాశం అంతు కనుగొనలేదు. అట్లే వాసుదేవుని మహావైభవాన్ని తనకు తెలిసినంత మేరకు తప్ప సమగ్రంగా వివరించి చెప్ప గల సమర్దుండెవడు? నా మనస్సుకు అందినంతవరకు మీకు తప్పక వివరిస్తాను. ఆలకించండి.
హస్తినాపురరాజేంద్రుడైన పరీక్షిత్తు ఒకనాడు వింటిని చేతబట్టి అడవులలో ఏనుగులు మొదలైన జంతువులు తప్పించుకొని పోనీయకుండ పరాక్రమంతో వెంటనంటి వేటాడసాగినాడు.
పెద్ద పెద్ద గోతులు త్రవ్వి, జంతువులను అందులో పడేటట్లు తోలి వలలు, ఉచ్చులు మొదలైనవి పన్ని వాటిలో చిక్కుకొన్న మృగాలను సమీపించి చంపవలెననే ఉత్సాహము, మృగాలను వెంటబడి వేటాడేటట్లు చేయగా.
ఆ మహారాజు ఎంతో నైపుణ్యంతో, అడవి పందులను, అడవి ఎద్దులను, తోడేళ్లను, పెద్ద పులులను, సివంగులను, ఖడ్గ మృగాలను, కేసరి మృగాలను (అడవి గొఱ్ఱెలను) సింహాలను, ఏనుగులను, శరభాలను, సవర మృగాలను, కోండ చిలువలు మొదలైన వాటిని పడగొట్టినాడు.
No comments:
Post a Comment