పరిక్షితుండు వేటాడి శమకునిపై మృతసర్పము నెత్తివైచుట
ఆ నరేంద్రుడు సింహపరాక్రమంతో వేటగాళ్లు మెచ్చేట్లు చంద్రమండలంలోని మృగాన్నితప్ప అరణ్యంలోని అన్ని మృగాలనూ వేటాడి చంపాడు.
ఈ విధంగా రాజు వేటపైన గాటమైన ఆసక్తితో మృగాల వెంటబడి తరుముతూ పరుగులతో తిరిగి తిరిగి, ఆకలిదప్పికల వలన అలసిపోయినాడు. అప్పు డతడు చల్లని నీటికోసం వెదకి వెదకి విసిగి వేసారి, చివరకు ఒక తపోవనం చేరినాడు.
అచ్చట పరీక్షిత్తు కన్నులు మూసికొని, ప్రశాంతంగా కూర్చొని తపస్సు చేసే శమీక మహామునిని చూచినాడు. ఆ ముని పొడవైన జడలతో జింకచర్మం ధరించి పంచేంద్రియాలను నిగ్రహించి, ప్రాణం, మనస్సు, బుద్దిని స్వాధీనపరచుకొని, జాగ్రత్, స్వప్న సుషుప్తులు అనెడి అవస్థలుదాటి నాల్దవదియైన సమాధి అవస్థలో ఏకాగ్రచిత్తుడై బ్రహ్మానుసంధానస్థితిలో ఎట్టి వికారాలు లేనివాడై ఉన్నాడు.
అప్పుడు పరీక్షిత్తు నెమ్మదిగా ఆ మునిని సమీపించి, దవడలు ఎండి, నాలుక తడి ఆరిపోగా, హీనమైన కంఠస్వరంతో నట్టుపడుతున్న పలుకులతో మెల్లమెల్లగా ఇట్లన్నాడు.
ఓ పుణ్యాత్ముడా! మహాప్రజ్ఞాధురీణుడా! మాకు వెంటనే నీరు తెచ్చియిమ్ము. ఈ సమయంలో వేటాడలేక భరింపరాని దాహం కలిగింది. తోడుగా పరివారము చెంతలేరు. వారు దూరంగా ఉన్నారు.
ఆ శమీకముని మాటాడలేదు. ఆ ముని కన్నులు మూసికొని సమాధిలో, బాహ్యేంద్రియజ్ఞానంలేక పరమేశ్వర ధ్యానంలో నిమగ్నుడై ఉన్నాడని పరీక్షిత్తు తెలుసుకోలేకపోయాడు.
ఈ బ్రాహ్మణుడు అహంకారంతో కన్నులు మూసికొని ఉన్నాడు. ఉలుకడు పలుకడు. పోనీ రండి అని చేతి సైగలైన చేయడు. త్రాగుటకు మంచినీళ్లు ఇవ్వడు. మహారాజును గదా మర్యాదగా నాకు ఏవైనా పండ్లు తెచ్చి పెట్టడు. తపస్సుయొక్క ప్రభావంతో ఇంతగా కన్నులు మూసికొనిపోయే సంపదలు ఒనగూడినవా?
దప్పికతో నోరెండి ఇంటిముంగిటికి వచ్చి నీరడిగిన అతిథికి చల్లని నీరు తెచ్చి ఇవ్వటం ఎంతటివారికైనా అవశ్య కర్తవ్యం. కాని ఈ మౌని నాకు నీరిచ్చి దప్పిక తీర్చడేమి?
ఆ విధంగా పరీక్షిత్తు వేటలో మిక్కిలి అలసి గొంతెండి అంతులేని రోషంతో లోలోపల కుమిలిపోతూ, కోపాన్ని ఆపుకోలేక, మహర్షి తిరస్కారాన్ని భరింపనివాడై వింటికొప్పుతో ఒక చచ్చిన పామును అదేపనిగా తీసికొనివచ్చి ఆ బ్రహ్మర్షి మూపుపై పడవేసినాడు.
శమీకపుత్త్రుండగు శృంగి పరీక్షితుని శపించుట
Subscribe to:
Post Comments (Atom)
Triratra Vrathadeeksha - త్రిరాత్ర వ్రతదీక్ష
త్రిరాత్ర వ్రతదీక్ష ఆ జగన్మాత దయతోనే సర్వ జగత్తూ నడయాడుతోంది. ఆ అమ్మ కరుణావల్లి, ఆ తల్లి అమృతహృదయ, ఆమె చల్లని చూపులకోసం ముల్లోకాలు ఎదురు చూస...
-
సూర్య ద్వాదశ నామాలు ధ్యేయః సదా సవితృమండలమధ్యవర్తీ నారాయణః సరసిజాసన సన్నివిష్టః । కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటీ హారీ హిరణ్మయవపుః ధృతశంఖచక్రః ...
-
నిత్య పారాయణ శ్లోకాలు స్తోత్రాలు నవ గ్రహ స్తోత్రం సుబ్రహ్మణ్యాష్టకం ఆదిత్యహృదయం కనకధారా స్త్రొత్రమ్ దుర్గాసప్తశ్లోకీ శ్రీ సరస్వతీ కవచం తోటకా...
-
శ్రీ దేవీ భాగవతము నవమ స్కంధములోని శ్రీ సరస్వతీ కవచం ఓం శ్రీం హ్రీం సరస్వ త్త్యై స్వాహా -శిరో మే పాతు సర్వతః । ఓం శ్రీం వాగ్దేవతాయై స్వాహా -ఫ...
No comments:
Post a Comment