Saturday, February 28, 2026

Prithu pursued the Earth Goddess and compelled her to resources - ప్రృథు చక్రవర్తి గోరూపిణి యగు భూమివలన, నోషధుల బిదుకుట

ప్రృథు చక్రవర్తి గోరూపిణి యగు భూమివలన, నోషధుల బిదుకుట

విదురుడు మైత్రేయమహర్షిని ఇలా అడిగాడు "ఓ పుణ్యచరిత్రా! గోరూపాన్ని భూమి ఎందుకు ధరించాల్సి వచ్చింది? గోరూపంలోనున్న భూమాతకు ఏది దూడగా అయింది? ఆ ఆవుపాలు పిదకడానికి తగిన పాత్రఏది? పాలుపిండే పృథుచక్రవర్తి ఏయే పదార్థాలను పిండాడు? సహజంగా భూమి మిట్టపల్లాలతో అసమతలంగా ఉంటుందిగదా! మరి అది సమతలరూపాన్ని ఏ విధంగా పొంద గలిగింది? ఆ యజ్ఞాశ్వాన్ని ఇంద్రుడు ఎందుకు దొంగిలించవలసి వచ్చింది? సనత్కుమారుని ద్వారా సమస్త విజ్ఞానాన్ని పొందిన పృథుచక్రవర్తికి ఎటువంటి సుగతి లభించింది?

మైత్రేయమహర్షీ! నీకూ, విష్ణు దేవునికీ భక్తుడనైన నాకు పరబ్రహ్మ స్వరూపుడూ, పుణ్యగాథలను వినేవాళ్లకు పుణ్యం ఇచ్చేవాడూ, సర్వేశ్వరుడూ, భగవంతుడూ అయిన శ్రీకృష్ణుని మిగిలిన అవతార గాథలను తెలియజేయండి. మరియూ ఆ పుండరీకాక్షుడు పృథుచక్రవర్తి అవతారం ధరించి గోరూపధారిణి అయిన భూమిని పిదకడం మొదలైన గాథల నన్నింటినీ వివరంగా చెప్పుమని విదురుడు అడిగాడు. ఆ సమయంలో విష్ణుగాథలపట్ల ఆసక్తిగల భక్తాగ్రేసరుడైన విదురుని పొగడుతూ మైత్రేయుడు ఇలా చెప్పడం మొదలెట్టాడు. బ్రాహ్మణవర్గంచే ఆ విధంగా పట్టాభిషిక్తుడై ప్రజారంజకంగా పరిపాలనలో నియుక్తుడైన పృథుచక్రవర్తి రాజ్యభారం మోస్తున్నాడు. ఆ సందర్భంలో సారవిహీనమైన భూమినుండి అన్నం దొరకక పోవడంవల్ల, ఆకలి బాధలవల్ల ప్రజలు క్రుంగి కృశించి పృథుచక్రవర్తికి ఇలా విన్నవించుకున్నారు.

ఓ మహారాజా! మేమంతా ఆకలిబాధలచే అధికంగా పీడింపబడుతున్నాం. మాపని ఎలాఉందంటే, చెట్టు తొర్రలో రగిలిన అగ్నిచే అంటుకొని మండే వృక్షాల పరిస్థితివలె ఉంది.

ఓ రాజా! దాసులకు రక్షకుడవైన నిన్ను మేము శరణుకోరుతున్నాం. దయతో మాకు అన్నం పెట్టి రక్షించమని ప్రజలు శిరస్సువంచి వేడుకోగా.

ఆ మాటలువిని పృథుచక్రవర్తి దానికి తగిన ఉపాయం ఆలోచించాడు. కోపంతో త్రిపురాసురసంహారం చేసిన రుద్రునివలె వింటికి బాణం సంధించాడు.

ఈ విధంగా బాణాలు సంధించిన రాజును చూచి భూదేవి గోరూపాన్ని ధరించింది. మోసంచేసే వేటగానిని చూచి అడవిలో పరుగెత్తే లేడి వలె పరుగు తీసింది.

ఈ విధంగా భూదేవి పరుగులు తీయగా, పృథువు కోపంతో ఎర్రబడ్డ కనులుగలవాడై వెంబడించాడు. దిక్కులలో, రెండుదిక్కుల నడుమలో, భూమ్యాకాశాల మధ్య, ఎక్కడికెళ్లినా వెంబండించి తరుమసాగాడు. విల్లంబులు ఎక్కుపెట్టి పరుగెత్తసాగాడు. ఆ సమయంలో భూదేవి మృత్యువు చేజిక్కిన మనుజులవలె దిక్కులేనిదై హృదయతాపంతో ఇలా అన్నది. "ఓ పృథుమహారాజా! నీయందు ధర్మము, వాత్సల్యము ఉన్నాయి. ఆపదలో నున్నవారిని రక్షించే స్వభావం ఉంది. జీవుల ప్రాణాలను కాపాడటంలో నిశ్చలత ఉంది. అయినా, దీనురాలైన నన్ను చంపడానికి పూనుకొన్నావు. నేను నీయందు కోరికగలదానను. నన్ను చంపడానికి వెంటపడటం ఎందుకు? ధర్మతత్త్వం తెలిసిన వారెవరూ స్త్రీలను చంపరు. తప్పుచేసినా జాలిపడి రక్షిస్తారు.

ఓ రాజేంద్రా! ఈ భూమిమీది జనసమూహానికి నేను నౌకవలె ఉన్నాను. గొప్పదైన, దృఢమైన శరీరాన్ని ధరించిన నేను ఎల్లప్పుడు ఆ జనసమూహానికి ఆధారంగా ఉంటాను కదా.

(ఘనత్వము, దృఢత్వము అనేవి పృథ్వీభూత తత్త్వాలు, ధర్మాలు.)

ఇలాంటి నన్ను దయతప్పి, ముక్కలుగా తుంచాలని సంకల్పించావు. నేను లేనిచో ఈ సకల జీవరాసులు నీటిలో మునిగిపోకుండా రక్షించడం నీకెలా సాధ్యము? అనగా పృథువు భూమాతకు ఈ విధంగా చెప్పాడు.

"ఓ భూదేవీ! నీవునా ఆజ్ఞను అతిక్రమిస్తున్నావు, అంతేకాక, యజ్ఞాలలో హవిర్భాగాలను అనుభవిస్తూ కూడ ధాన్యాదులను పెంచకుండా ఉన్నావు. గోరూపాన్ని ధరించి, గడ్డిమేస్తూ పాలను ఇవ్వకుండా నీలోనే దాచుకొంటున్నావు. పూర్వం బ్రహ్మ నీలో సృష్టించిన ఓషధీబీజాలను నీ శరీరంలోనే అణచి పెట్టుకొని బయటకు రానీకుండా చేస్తున్నావు. నీవు మూర్ఖురాలవు, మందబుద్దివి. అపరాధం చేశావు గాబట్టి దురాత్మురాలవు. నిన్ను నా బాణాలతో తూట్లు పొడిచి చంపుతాను. నీ శరీరమాంసంతో ఈ దీనులైన జీవుల ఆకలిబాధ తీర్చి రక్షిస్తాను. "నీవు కామినిని అన్నావు. (స్త్రీ లను చంపరాదన్నావు. ధర్మం తెలిసినవారి కది తగదన్నావు.) జీవులపట్ల దయలేక తమని తాము పోషించుకొనేవారు జాలిలేనివారు. అట్టివారు జీవద్రోహులు". వాళ్లు స్త్రీలైనా, పురుషులైనా, నపుంసకులైనా చంపదగ్గవారే. రాజులు వారిని చంపినా అది పాపం కాదు. కాబట్టి, పాపం అంటదు. నీవు కామినివైనా మదంతో ప్రవర్తించావు. స్తబ్దస్వభావం కలిగివున్నావు. మాయాబలంతో ఇప్పుడు గోరూపంలో పారిపోతున్నావు. నిన్ను నువ్వు గింజలంత చిన్నచిన్న తునియలుచేసి నాయోగమహిమతో ప్రాణికోటిని ఉద్ధరిస్తాను." ఇలా రోషంగా మాట్లాడి భయంకర రూపం ధరించి, యమునివలె  ప్రవర్తిస్తున్న పృథుచక్రవర్తికి వణుకుతూ భూదేవి నమస్కరించి ఆయనను ఇలా స్తుతించింది.

ఓ రాజా! నీవు నిర్గుణుడవైన నారాయణుడవే అయినా, నీవు నీ మాయాగుణాలు పొందినకారణంగా సగుణుడవై నానావిధ దేహాలు ధరిస్తున్నావు. జ్ఞానులచే స్తుతింపబడుతున్నావు.

(పరమాత్మ నిర్గుణుడు; నిరాకారుడు; సర్వవ్యాపి, ఆయన తననే ఆశ్రయించి ఉన్న మాయవల్ల సగుణుడైనపుడు నా నా రూపాలతో ఈ సృష్టి సమస్తం ఏర్పడుతున్నదని తాత్త్విక వివరణ. ఈ తా
త్త్విక స్థితిని దర్శించినవారు జ్ఞానులు)

అటువంటి నీవు నన్ను సగుణమూర్తివై సకల జీవరాశులకు ఆధారంగా పూర్వం సృజించావు. అందువల్లే, నేను నాలుగు విధాలైన భూతసమూహాన్ని భరించవలసి వచ్చింది. అలా ఉండగా,

ఓ రాజేంద్ర! దయయే అలంకారంగా కలవాడా! సృజించిన నీవే నన్ను చంపడానికి ఆయుధమెత్తావు. నేను నిన్ను తప్ప మరెవరిని శరణువేడేది?

ఓ పుణ్యపురుషా! ఊహింపరాని మహిమతో కూడిన నీ మాయచే ఈ చరాచర ప్రపంచాన్ని సృష్టించావు. నీవు ధర్మరక్షకుడవు. వికసించే తామర రేకులవంటి కనులుగల ఓ ప్రభూ! నీ పరాక్రమాన్ని లోకు లెవ్వరూ జయించలేరు. నీవు సర్వతంత్ర స్వతంత్రుడవు. బ్రహ్మను పుట్టించావు. ఆ బ్రహ్మచే సకలలోకాలను సృజింపజేశావు. సౌందర్యమూర్తివైన ఓ పృథుచక్రవర్తీ! నీవు ఒక్కడవే అయినా పెక్కు విధాలుగా సమస్తంలో ప్రకాశిస్తావు.

అంతేకాక పంచభూతాలు, ఇంద్రియాలు కలుగుటకు కారణాలైన చైతన్యము, అహంకారము అనే శక్తులవల్ల ఈ లోకాలను సృష్టించి, పెంచి, నశింపచేస్తూ, అధికములైన విరుద్ధశక్తులుగల పురుషునకు నమస్కారం చేస్తాను. అటువంటి పరమాత్మ స్వరూపుడివైన నీవు నీచే నిర్మింపబడి పంచభూతాలు, ఇంద్రియాలు, మనస్సుతో నిండిన ఈ లోకాన్ని స్థిరంగా నిలుప ప్రయత్నించి

ఆ విధంగా పనిగట్టుకొని ఆదివరాహ రూపాన్ని ధరించి పాతాళంలో ఉన్న నన్ను దయతో పైకి లేవనెత్తావు. అలా ఎత్తిపట్టి మహాజలరాశిపై నావవలె నన్ను నిలిపావు. నాపై ప్రాణులను నిలిపావు. ప్రజారక్షణ కోసం నీవు పృథురూపం ధరించావు. ఇలా భూభారాన్ని వహించి ప్రజలను రక్షిస్తున్న నీవు కేవలం పాలకోసం నన్ను చంపాలని ఆలోచిస్తున్నావు. ఓ రాజచంద్రా! పుణ్యగుణాలప్రోవా! అనవద్యుడవు, వేదవేద్యుడవు, సకల చరాచరరక్షకుడవైన నీకిది ఆశ్చర్యంగా కనిపించడం లేదా?

భగవంతుని మహిమోపేతమైన మాయచే మోహం పొందిన మనస్సుగల మావంటి వారికి హరిభక్తుల చేష్టలు తెలుసుకోవడం శక్యం కాదు. అలాంటప్పుడు శ్రీహరి చర్యలను ఎలా తెలుసుకోగలం? అటువంటి యశోనిధులైన జితేంద్రియులకు, మహానుభావులకు మొక్కుతున్నాను - అని, ఈ విధంగా కోపంచే పెదవులు అదరుతున్న పృథుచక్రవర్తిని పొగిడి, ధైర్యం తెచ్చుకొని భూదేవత మళ్లీ ఇలా అన్నది.

ఓ నిర్మలమైన మనస్సుగల రాజా! పరమాత్మా! నాకు భయంలేకుండా ప్రవర్తించుము, మంచి మనస్సుతో కోపాన్ని దిగమింగు. దయతో నా మనవిని విను.

లోకంలో పువ్వులు కందిపోకుండా తేనెను మృదువుగా, తాగే గండు తుమ్మెదవలె పండితుడైన మానవుడు దేనినీ నొప్పించకుండా అన్నింటినుండి సారాంశాన్ని నేర్పుగా గ్రహిస్తాడు.

త్త్వదర్శనులైన మునులు ఈ లోకంలోను, పరలోకంలోను, పురుషులకు ఫలం చేకూర్చే కృషి అగ్నిహోత్రం మొదలైన ఉపాయాలను దర్శించి ఆచరించారు. ఆ విధంగా ఆ ఉపాయాలను ఆచరించేవాడు ఆ ఫలాన్ని పొందుతాడు. అలాంటి ఉపాయాన్ని లెక్కచేయకుండా తనకు తోచినట్లు చేసేవాడు, ఎంతటి పండితుడైనా అతనికి ఆయాసమేగాని ఫలం దక్కదు. పెక్కుమాటలెందుకు? ఎంతకాలం గడిచినా వానిస్థితి అంతే.

అని చెప్తూ భూదేవి మరలా ఈ విధంగా అన్నది. 

పూర్వం బ్రహ్మదేవుడు అధికంగా సృజించిన పైర్లను, పాపాత్ములైన దుర్జనులు దుర్బుద్ధితో దోచుకొని అనుభవిస్తుంటే వీరులైన రాజులు వాళ్ళను అడ్దుకోకుండా చూస్తూ ఊరుకుంటే నేను రక్షణలేనిదాననై దొంగలవల్ల పెక్కుమార్లు బాధలకు గురి అయి కృశించిపోయాను. అంతేకాక

ఓ రాజా! శ్రేష్ఠాలైన యజ్ఞక్రియలు ఎప్పుడు లేనందువల్ల నేను నిరాదరణకు గురి అయి, ఈ లోకం పెద్ద పెద్ద దొంగలతో నిండి ఉండటం చూచి, ఓ రాజా! యజ్ఞాది సత్కార్యాలకు ఉపయోగపడే ఆ ఓషధులను దొంగలు ఎత్తుక పోకుండా నేను వాటిని మింగాను. అవి నాలో జీర్ణమైపోయాయి.

ఓ రాజేంద్రా! గొప్ప ప్రవర్తనగల పృథుచక్రవర్తీ! వినుము. మరల ఆ ఓషధులను ఒక ఉపాయంతో పొందవచ్చు. నీ వాత్సల్యం పొందినదానిని గాబట్టి నీకాపద్ధతి చెబుతాను.

(వత్సలురాలు అనగా సంతానవతి.)

రాజా! నీవు తప్పక నాకొక దూడను, చక్కని పాలపాత్రను, పాలుపిదికే వానిని కల్పించుము. అలా అయితే ఈ జీవులకు

ప్రభూ! నా మాటలు వినండి. నీవు నాకు తగిన దూడను, పాలుపిదికేవాడిని సమకూరిస్తే ఈ ప్రాణులకు ఇష్టమై బలవర్ధకాలై, పాలు, అన్నం రూపంలో ఉండే కోర్కెలను ప్రసాదిస్తాను. నా మాటలు నమ్ము.

ఓ రాజా! ఇప్పుడు నాది ఎగుడుదిగుడుగా మిట్టపల్లాలుగల ప్రదేశాలు కలిగిన స్థితి. నన్ను నీవు చదునుచేసి సమతల ప్రదేశం కలదానినిగా చేస్తే మేఘాలు వర్షించే సమయంలో మాత్రమే జలం లభించడంగాక, వర్షాకాలం తర్వాత కూడ ఆ జలాలు ఇంకిపోక నిలబడి ఉండేస్థితి ఏర్పడుతుంది

భూదేవి ఈ విధంగా పలికిన మధుర వాక్యాలను విని తన మనస్సులో అనురాగం పొందిన పృథుచక్రవర్తి కర్తవ్యోన్ముఖుడాయెను.

అప్పుడు పృథుచక్రవర్తి మనువును గోవత్సంగాను, తనచేతిని పాత్రగాను చేసి, తాను పిండే వాడుగా భూమినుండి సకలమైన ఓషధులను పిదికాడు. ఈ విధంగా పృథుచక్రవర్తి వాత్సల్యం కలిగి గోరూప ధారిణియైన భూమినుండి అందరు తమ ఇష్టమైన కోర్కెలను పొందారు.

ఋషులంతా ఒకచోట చేరి బృహస్పతిని దూడగా చేసి ఆహ్వానించారు. తమ ఇంద్రియాలనే పాత్రలో ఛందోమయమైన క్షీరాన్ని పిండారు. దేవతలు ఇంద్రుని దూడగా బంగారు పాత్రలో ఓజోబల వీర్యామృతమైన క్షీరాన్ని పిండారు. దైత్యదానవులు గుణవంతుడైన ప్రహ్లాదుని దూడగా సురాసవమైన క్షీరాన్ని పిండారు. అప్సరసలు, గంధర్వులు, విశ్వావసువును దూడగా చేసి పద్మమయమైన పాత్రలో మాధుర్య సౌందర్యాలతో కూడిన గాంధర్వమనే క్షీరాన్ని పిదుకుకొన్నారు.

ఋషులు బృహస్పతిని దూడగా చేసుకొని ఇంద్రియాలనే పాత్రలో వేదమయమైన క్షీరాన్ని పిదుకుతున్నారు. అలానే దేవతలు ఇంద్రుడు దూడగా బంగారు పాత్రలో ఓజోబల వీర్యామృతమయమైన క్షీరాన్ని, దైత్యదానవులు గుణవంతుడైన ప్రహ్లాదుడు దూడగా, ఇనుప పాత్రలో సురాసమయవమైన క్షీరాన్ని అప్సరసలు, గంధర్వులు, విశ్వావసువు దూడగా పద్మమయమైన పాత్రలో మాధుర్య సౌందర్యాలతో గూడిన గాంధర్వమనే క్షీరాన్ని పిదుకుకొన్నారు. పితృదేవతలు సూర్యుడు దూడగా ఆమపాత్రంలో కవ్యమనే క్షీరాన్ని సిద్దులు కపిలుడు దూడగా ఆకాశపాత్రలో సంకల్పనారూపమైన 'అణిమాదిసిద్ధి' అనే క్షీరాన్ని విద్యాధరులు మొదలైనవారు కపిలుడు దూడగా, ఆకాశపాత్రంలో ఖేచరత్వాది విద్యామయమైన క్షీరాన్ని, కింపురుషాదులు మయుడు దూడగా ఆత్మపాత్రంలో సంకల్పమాత్ర ప్రభావం, అంతర్ధాన రూపం, అద్భుతాత్మకం అయిన 'మాయ' అనే క్షీరాన్ని యక్షరక్షోభూత పిశాచాలు రుద్రుడు దూడగా, కపాలపాత్రలో రుధిర స్వరూపమైన క్షీరాన్ని అహి దందశూక, సర్పనాగాలు తక్షకుడు దూడగా, బిలపాత్రలో విషరూపమైన క్షీరాన్ని, పశువులు ఆబోతు దూడగా అరణ్యపాత్రలో తృణమనే క్షీరాన్ని, క్రూరమృగాలు సింహం దూడగా స్వకళేబరపాత్రలో మాంసం అనే క్షిరాన్ని పక్షులు గరుత్మంతుడు దూడగా స్వదేహపాత్రలో కీటకాలు, ఫలాదులు అనే క్షీరాన్ని పిదుకుకొన్నారు. ఈ విధంగా సమస్త చరాచర ప్రపంచం తమలో శ్రేష్టులు దూడలుగా, తమకు తగిన పాత్రలలో తమకు తగిన క్షీరాలను భూమినుండి పిండుకున్నారు. మరియు

ఈ ప్రకారం క్రమక్రమంగా పృథువు మొదలైనవారు వేరువేరు వత్సాలను, పాత్రలను కల్పించుకొని తమతమ కోర్కెలనే వేరువేరు క్షీరాలను పితుకుకున్నారు.

అప్పుడు పృథుచక్రవర్తి ఎంతో సంతోషించి అన్ని కోర్కెలను తీర్చే భూమాతను పుత్రికగా స్వీకరించాడు. తన వింటి కొప్పుతో పెద్దపెద్ద పర్వత శిఖరాలను పొడిపొడి చేశాడు. ఋగ్వేదంలో “భూమత" యే "కామదుఘా” అని ప్రశంసింపబడింది.

భయంకరమైన తన బాహుబలంతో భూమండలాన్ని చదునుచేసి ఆ పృథుచక్రవర్తి శాశ్వత కీర్తిని పొందాడు. తన ప్రజలకు తాను తండ్రివలె, జీవన ప్రదాతవలె వ్యవహరించాడు.

క్రమంగా అక్కడక్కడ పూర్వం లేని జనపదాలు, పట్టణాలు, దుర్గాలు, కొండ పల్లెలు, చెంచుపల్లెలు, బోయపల్లెలు, గొల్లపల్లెలు కల్పించాడు. అనేకరకాలైన నివాసస్థానాలు కల్పించాడు.

ప్రజలు భయము లేకుండా ఆయా నివాసాలలో ఎల్లప్పుడు సుఖసంపదలతో తులతూగుతూ బ్రతుకుతున్నారు. అలాంటి పృథుచక్రవర్తిని కీర్తించటం ఎవరికీ శక్యం కాదు.

మైత్రేయుడిలా వివరించి, ఇంకా విదురునితో ఇలా అన్నాడు. రాజర్షియైన పృథుచక్రవర్తి సత్సంకల్పంతో నూరు అశ్వమేధయాగాలను చేస్తానని దీక్షబూనాడు. బ్రహ్మావర్తదేశంలోని మనుక్షేత్రంలో సరస్వతీ నదీతీరంలో అతడు గొప్పగా చేయబోయే యజ్ఞఫలితం మహత్తరంగా ఉంటుందని భావించి ఇంద్రుడు సహింపలేక పోయాడు.

సరస్వతి, దృషద్వతి అనే రెండు నదుల నడిమి ప్రదేశాన్నే “బ్రహ్మావర్త" మంటారని మనుస్మృతి. (2-17)

No comments:

Post a Comment

Speeches by Pritha regarding Dharma and Brahman - పృథుచక్రవర్తి సభాసదులకు సద్ధర్మముల నుపదేశించి బ్రాహ్మణ ప్రశంస సేయుట

పృథుచక్రవర్తి సభాసదులకు సద్ధర్మముల నుపదేశించి బ్రాహ్మణ ప్రశంస సేయుట అలా చెప్పి ఇంకా ఇలా అన్నాడు. ఇలా విశేషగుణసంపద గలిగి, దోషరహితమై, సత్పురుష...