Saturday, February 14, 2026

Parikshit asked Sukadeva (Suka) about the creation of the universe - పరీక్షితు౦డు శుకుని బ్రపంచోద్భవాదికంబు నడుగుట

పరీక్షితు౦డు శుకుని బ్రపంచోద్భవాదికంబు నడుగుట

అప్పుడు 
పరీక్షిత్తు శుకయోగి తో ఇలా అన్నాడు- "మునీంద్రా! బ్రహ్మదేవుడు నారదమునికి భగవద్దర్శనం కలగడానికి చెప్పిన ఉపాయం దయతో నాకూ చెప్పండి. సత్వరజస్తమోగుణాలకు అతీతుడూ, పద్మనేత్రుడూ అయిన శ్రీహరి కథలు లోకానికి మంగళం కలిగిస్తాయి. అవి నాకు తెలియజేయండి! మీరు చెప్పినది విని సంగరహితమైన నాహృదయంలో శుభచరిత్రుడూ, తుదిమొదళ్ళు లేనివాడూ, చిన్మయ స్వరూపుడూ, పాపరహితుడూ, లక్ష్మీసమేతుడూ అయిన కృష్ణుణ్ణి నిలుపుకొంటాను. చంచలం, త్యజింపదగిన పదార్థాలకు నెలవూ అయిన ఈ శరీరాన్ని పరిత్యజిస్తాను.

అంతేకాక ఎవడు శ్రద్దా భక్తులు కలిగి కృష్ణుని గుణగణాలను ఇతరులు కీర్తిస్తుంటే వింటాడో, తాను గూడా స్వయంగా కీర్తిస్తాడో, అట్టి భక్తుని హృదయకమలంలోనికి శ్రవణరంధ్రాలద్వారా కృష్ణుడు ప్రవేశిస్తాడు, అక్కడ విశ్రమిస్తాడు. నీటిలోని మురికిని శరదృతువు తొలగించినట్లు మనస్సులోని మాలిన్యాన్ని తొలగిస్తాడు. అందుచేత-

అడవుల్లో సంచరిస్తూ వేసవికాలంలోని మండుటెండల తాపానికి పరితప్తుడైన బాటసారి బడలి దప్పిక జెంది చివరికి తన ఇల్లు చేరుకొంటాడు. అక్కడ హాయిగా అలసట తీర్చుకొంటాడు. అక్కడనుండి మళ్ళీ ఎక్కడికీ కదలడు. అట్లే రమాకాంతుని చరణకమలయుగళంతో సంబంధం కలిగి ఆ ఆనందం చవి చూచినవాడు మళ్ళీ దాన్ని వదలడు.

అంతేకాదు. సమస్త భూతాల తోటి కలయిక లేని ఆత్మకు భూతాలతో సాంగత్యం ఎలా కల్గింది? అది అకారణంగా కలిగిందా? లేక కర్మవల్ల సంభవించిందా? ఈ వైనం నాకు వివరించు-

ఓ పరమ దయామయా! యోగవంశాబ్ధిచంద్రా! ఎవని నాభిలో సమస్తలోకాల ఉనికికి హేతువగు పద్మం పుట్టిందో, ఆ పద్మంలో పుట్టి సర్వాంగసుందరంగా ప్రకాశించే బ్రహ్మదేవుడు ఎవని అనుగ్రహం వల్ల ఔత్సుక్యంతో సకలప్రాణులనూ సృష్టించాడో, అట్టి బ్రహ్మ ఏ రీతిగా సర్వేశ్వరుని రూపాన్ని సాక్షాత్కరింపజేసికొన్నాడో, అట్టి పరంజ్యోతి స్వరూపుడైన పద్మాక్షునికీ, బ్రహ్మకూ అవయవ విన్యాసంలోనూ, భావగమనంలోనూ వ్యత్యాసం ఉన్నదా? ఉంటే వివరించు.

భూతాలకు అధినాథుడైన సర్వేశ్వరుడు ఉత్పత్తికీ, స్థితికీ, లయానికీ హేతువైన తన మాయను వదలి మాయా నియామకుడై ఏ ఏ స్థలాలలో శయనించాడు? అంతేకాక పూర్వం విరాట్పురుషుని అవయవాలతో ఇంద్రుడు మొదలైన లోకపాలకులతో కూడిన లోకాలు ఎలా సృష్టింపబడ్డాయి? మహాకల్పాలు, అవాంతరకల్పాలు, భూతభవిష్యద్వర్తమానకాలాలు, శరీరాభిమానంతో జన్మించే దేవతలు, పితరులు, మానవులు మొదలగు వారికి కలిగే ఆయుఃప్రమాణాలు నాకు చెప్పు.

మహాకాలాన్నీ, సూక్ష్మకాలాన్నీ అనువర్తించి జీవులు ఏ ఏ కర్మలు చేసి ఏ ఏ లోకాలకు ప్రయాణం సాగిస్తారు? ఏ ఏ కర్మలవల్ల వాళ్లకు దేవతా శరీరాలు వస్తాయి? అట్టి కర్మమార్గపద్ధతి నాకు వివరించు.

ఇంకా సత్వాది గుణాలకు ఫలాలైన దేవాది స్వరూపాలు కోరే జీవులు ఏయే కర్మలు ఏ విధంగా చేయాలి? ఆ కర్మలను ఎవరికి సమర్పించాలి? వాటిని ఎవరు స్వీకరిస్తారు?

భూమి, పాతాళం, దిక్కులు, ఆకాశం, గ్రహాలు, నక్షత్రాలు, పర్వతాలు, నదులు, సముద్రాలు, దీవులు ఎలా ఉద్భవించాయి? ఆ యా చోట్ల ఉండే జీవుల జన్మలు ఎలాంటివి?

వెలుపలా, లోపలా బ్రహ్మాండం కొలత ఎంత? మహాత్ముల చరిత్రలు ఎటువంటివి? వర్ణాశ్రమ నియమాలు, క్రమంగా ఏర్పడి ఆశ్చర్యం కలిగించే శ్రీమన్నారాయణునిఅవతార కథలు, నాలుగుయుగాలు, ఆ యుగాల ప్రమాణాలు, యుగధర్మాలు, ప్రతియుగంలోనూ మానవులు పాటించవలసిన సాధారణ ధర్మాలు, విశేషధర్మాలు, ఆ యా జాతులకు సంబంధించిన ధర్మాలు, రాజర్షుల ధర్మాలు, జీవన సాధనాలైన ఆపద్ధర్మాలు, మహత్తు మొదలైన తత్త్వాలసంఖ్య, వాటి లక్షణం, ఆ తత్త్వాలకు హేతువులయిన లక్షణాలు, భగవానుణ్ణి ఆరాధించే పద్ధతి, యమనియమాదులైన అష్టాంగాలతో కూడిన యోగక్రమం, యోగిశ్రేష్ఠులైన వారి అణిమ, మహిమ మొదలగు అష్ఠసిద్ధుల స్వరూపం, అర్చిరాది మార్గాలలో ఆ యోగులు పయనించే తీరు, లింగశరీరాల వినాశం, ఋక్కు, యజుస్సు, సామం, అధర్వం అనే నాలుగు వేదాలు, ఆయుర్వేదం మొదలైన ఉపవేదాలు, ధర్మశాస్త్రాలు, ఇతిహాసాలు, పురాణాలు ఆవిర్భవించిన పద్ధతి, అన్ని భూతాలకూ ఏర్పడే అవాంతర ప్రళయం, వాటిస్థితి, మహాప్రళయం, ఇష్టాపూర్తాలనబడే యజ్ఞాది వైదిక కర్మలు, బావులు, మడుగులు, చెరువులు, దేవాలయాలు మొదలగు వాటి నిర్మాణం, అన్నదానం, ఆరామ ప్రతిష్ట మొదలైన స్మృతుల్లో చెప్పిన కర్మలు, కామ్య కర్మలైన అగ్నిహోత్రాదులు నిర్వర్తించే విధానం, జీవుల సృష్టి ధర్మం, అర్ధం, కామం అనే త్రివర్గాలను ఆచరించే తీరు, మలిన శరీరులైన పాషండుల పుట్టుక, జీవాత్ముడు బంధింపబడదే రీతి, ఆపై మోక్షం పొందే పద్ధతి, స్వస్వరూపంతో నెలకొనే ప్రకారం, దేనికీ లోబడక అన్నిటా స్వతంత్రుడైన ఈశ్వరుడు తన మాయతో సమస్త కర్తలకూ సాక్షిగా ఉంటూనే ఆ మాయకు అతీతుడై ఉదాసీనునిలాగా ప్రభువై క్రీడించే పద్ధతి- ఈ సంగతులన్నీ విపన్నుడనై ప్రపన్నుడనైన నాకు
వివరించు.

"నీవు బ్రాహ్మణ శాపంవల్ల దుఃఖీస్తున్నావు, నీ మనస్సు కలత జెంది ఉంది, పైగా నిరాహారదీక్షతో ఉన్నావు! నేను చెప్పే ఈ విషయాలు ఎలా వినగలవు?" అని సంశయింప వద్దు. నేను మీ ముఖపద్మం నుండి వెలువడే శ్రీమన్నారాయణ కథా సుధను తనివి దీరా తాగాలన్న కుతూహలంతో ఉన్నాను. అట్టి నాకు ఇంద్రియాలు స్వాధీనంలోనే ఉన్నాయి. కాబట్టి నేను అడిగిన ప్రశ్నలు అన్నిటికీ సమాధానాలు సవిస్తరంగా ఆనతిచ్చి నన్ను కృతార్థుణ్ణి కావించు. నీవు బ్రహ్మతో సమానుడవు. నీవు మాత్రమే ప్రాచీన సంప్రదాయాన్ని అనుసరించి వాటిని వివరించడానికి తగినవాడవు".

ఈ విధంగా విష్ణురాతుడైన (విష్ణువుచే రక్షితుడైన) పరీక్షిన్మహారాజు (బ్రహ్మరాతుడైన బ్రహ్మచే వ్యాసునికి పుత్రుడుగా అనుగ్రహింపబడిన) శుకమహాయోగిని అడిగాడు.

అప్పుడు శుకమహర్షి "రాజా! బ్రహ్మ నారదుల సంవాదరూపమూ, ఒకే సంప్రదాయానికి చెందింది, క్రమపద్ధతిలో పరంపరగా వస్తున్నదీ అయిన భాగవతమనే మహాపురాణమున్నది. అది వేదంతో సమానం. దానిని పూర్వం సర్వేశ్వరుడు బ్రహ్మకల్పంలో బ్రహ్మకు ఉపదేశించాడు. అది నీకు తెలియపరుస్తాను, విను," అని చెప్పి పరీక్షిత్తుతో ఇలా అన్నాడు. 

రాజోత్తమా! "జీవుడు భూతాలకు మేలు చేకూర్చేవాడు, జ్ఞానమే స్వరూపంగా కలవాడు, అలాంటివానికి శరీరంతో సంబంధం ఎలా కలిగింది" అంటావా? జగతీతలమంతా వ్యాపించి ఉన్న ఈశ్వరుని మాయ అనేది లేకపోతే జీవునికి దేహంతో సంబంధం కలుగదు. నిద్రించే వేళ స్వప్నంలో దేహాలతో సంబంధం గోచరిస్తుంది కదా! అలాగే నారాయణుని యోగమాయాప్రభావంవల్ల జీవుడు పంచభూతాలతో కూడిన దేహంతో సంబంధం కలవాడవుతాడు. ఆ మాయాగుణాలవల్లనే క్రమంగా బాల్యం, కౌమారం, యౌవనం అనే దశలు పొందుతాడు. మనుష్య, దేవతాది ఆకారాలను కూడా స్వీకరిస్తాడు. నేను అనే అహంకారాన్నీ నాది అనే మమకారాన్నీ పెంచుకొంటాడు. సంసారమాయలో బద్దుడవుతాడు.

ఇలా బద్దుడై వర్తించే జీవుడికి భగవంతుని మీది భక్తితో ముక్తి ఎలా కల్గుతుంది అంటావా? వివరిస్తాను, విను. ప్రకృతికీ, పురుషుడికీ అతీతమైన బ్రహ్మస్వరూపాన్ని జీవుడు ఎప్పుడు తీవ్రంగా ధ్యానిస్తాడో అప్పుడు మోహంనుండి విడివడుతాడు. అహంకార మమకార మయమైన సంసారంనుండి విడుదల పొందుతాడు.

అంతేకాదు, జీవుడికీ, ఈశ్వరుడికీ శరీరాలతో, సంబంధాలు కనిపిస్తున్నాయి. భగవంతుడు కూడ శరీరం ధరించే ఉన్నాడు. అట్టి భగవంతుడి మీద భక్తి కలిగివుంటే జీవుడికెలా ముక్తి సిద్ధిస్తుంది? అని ప్రశ్నించావు.

అవిద్యకు లోనైనవాడు జీవుడు. అవిద్యా ప్రభావంవల్ల అతడు కర్మననుసరించి సంప్రాప్తించిన శరీరాన్ని ధరిస్తాడు. ఆ దేహం మిథ్యారూపమైనది. భగవంతుడు యోగమాయతో గూడినవాడు. ఆయన తన యోగమాయా ప్రభావంవల్ల తన ఇష్టానుసారం జ్ఞానమయమైన లీలాశరీరం కల్పించుకొంటాడు. అందువల్ల మోక్షానికి సాధనమైన జ్ఞానానికై తనసేవ కల్పించబడిందని భగవంతుడైన ఈశ్వరుడు బ్రహ్మతో చెప్పాడు. బ్రహ్మ నిష్కపటంగా తపస్సు చేసి పరమేశ్వరుని ఆరాధించాడు. అప్పుడు తన జ్ఞానానందఘనమైన స్వరూపం బ్రహ్మకు చూపిస్తూ ఈశ్వరుడు పై రీతిగా తెలిపాడు.

అందువల్ల జీవుడికి భగవద్భక్తి తప్పక మోక్షం ప్రసాదిస్తుంది. ఈ విషయం నిరూపించే ఇతిహాసం ఒకటి ఉన్నది. అది వివరిస్తాను, విను. దానివల్ల నీ సందేహం తీరుతుంది అని చెప్పి యోగివర్యుడైన శుకుడు రాజవర్యుడైన పరీక్షిత్తుతో ఇలా అన్నాడు.


నారాయణుండు బ్రహ్మతపంబునకు మెచ్చివరంబు లిచ్చుట

No comments:

Post a Comment

Parikshit asked Sukadeva (Suka) about the creation of the universe - పరీక్షితు౦డు శుకుని బ్రపంచోద్భవాదికంబు నడుగుట

పరీక్షితు౦డు శుకుని బ్రపంచోద్భవాదికంబు నడుగుట అప్పుడు  పరీక్షిత్తు  శుకయోగి తో ఇలా అన్నాడు- "మునీంద్రా! బ్రహ్మదేవుడు నారదమునికి భగవద్దర...