అర్జునుడు ఈ రీతిగా అశ్వత్థామను బంధించి తీసుకొనివచ్చాడు. అతడుకూడ చిన్నపిల్లలను చంపడంవల్ల సిగ్గుచే మొగం చాటేసుకొన్నాడు. ఆలాంటి కృపితనూజుని అశ్వత్థామను ద్రౌపది చూచి, సుశీలయైన ఆమె ఆ గురుపుత్రునకు నమస్కరించి ఇలా అన్నది.
పూర్వం ధనుర్విద్య నభ్యసించే సమయంలో నా భర్తలు అయిదుగురు బాణప్రయోగం, బాణోపసంహారం, మొదలైన సమస్త శస్త్రవిద్యలు నీ తండ్రియైన ద్రోణాచార్యులవద్ద అభ్యసించారు. నీవు పుత్రరూపంలోనున్న ద్రోణుడవు. పాందవులు నీకు శిష్యులవంటివారు. అట్టి శిష్యుల కుమారులను దయమాలి నరకివేయడం నీవంటివానికి న్యాయమా?
నాయనా! నీవు బ్రాహ్మణుడవు. బుద్ధి విచక్షణకు, దయాదాక్షిణ్యాలకు నీవు పెట్టినది పేరు. స్వచ్చమైన వీరాధివీరులలో నీవు అగ్రగణ్యుడవు. పసిపిల్లలను చంపడం రాక్షస కార్యంకదా! ఇది ధర్మమా? ఇటువంటి ఘోరకృత్యానికి నీవు ఎలా ఒడిగట్టావు?
నా కుమారులు ఆయుదాలుపట్టి ఆవేశంతో నీ మీదికి రాలేదే! యుద్ధరంగంలో కూడ లేరే! బలగర్వంతో నీకు ఆవంతకూడ అపకారం చేయలేదే! చీకట్లో, అందమైన ఆ చిన్నపిల్లలను, యుద్ధవిద్యలో ఆరితేరినవారు కానివారిని, గాఢనిద్రలో ఉన్నవారిని చంపటానికి అయ్యో! నీ చేతులెట్లాడాయో!
పుత్రమరణశోకం నన్నెంతో కలచివేసింది. నా హృదయం దుఃఖంతో నిండిపోయింది. నేను తల్లడిల్లిపోతున్నాను. అర్జునుడు యుద్ధంలో తాళ్లతో నిన్ను కట్టివేసి శిబిరానికి ఈడ్చుకొని వచ్చిన సంగతి తెలిసి అది సహింపలేక నీ తల్లి కూడ ఈ రోజు ఎచ్చట, ఏ రీతిగా, దుఃఖంతో నావలె ఎంతగా తల్లడిల్లిపోతోందో కదా!
ద్రౌపది ఈ రీతిగా అశ్వత్థామ హృదయంలో ములుకులవలె గ్రుచ్చుకొనే పలుకులు పలికి, కృష్ణార్జునులను ఉద్దేశించి ఇలా అన్నది.
భర్తయైన ద్రోణుడు మరణించినా, కృపి పుత్రప్రేమతో సహగమనం చేయకుండా ఇంట్లోనే ఒంటరిగా ఉండిపోయింది. మీరు ఈతనిని బంధించి ఈడ్చుకొని రావడంవల్ల ఆ ఇల్లాలు, నే నేవిధంగా పుత్రశోకంతో దుఃఖిస్తున్నానో, తానుకూడ అదేవిధంగా గుండెలు పగిలేలా ఎంతగానో విలపిస్తూ ఉంటుంది కదా! ఇతడా బ్రాహ్మణుడు. బంధితుడై యున్నాడు. ప్రాణాలు కోల్పోతే మనకు మహాపాపం. ఈతనిని హింసించడం మానండి.
ప్రజాపరిపాలన తత్పరులగు రాజులు బ్రాహ్మణులకు కోపం వచ్చేటట్లు చేయరాదు. వారు కోపిస్తే వారి క్రోధాగ్ని జ్వాలలకు భూమి కంపిస్తుంది. రాజవంశాలు అనే అడవులు సమూలంగా నాశనమైపోతాయి.
అని పలికిన పాంచాలి మాటలలో ధర్మం, దయ నిష్కపటం, సత్యం తొణికిసలాడాయి. అందరూ ఆమెను కొనియాడారు. ధర్మరాజు సంతసించాడు. నకులుడు, సహదేవుడు, సాత్యకి, అర్జునుడు, వాసుదేవుడు అంగీకారం తెలియజేశారు. భీముడు మాత్రం అందుకు అంగీకరించక ఇలా అన్నాడు.
కన్నకొడుకుల గొంతులు గోసి చంపినందులకు కోపం రాకపోగా, ఈ శిశుహంతను విడిచివేయండని అంటుందేమిటి ఈ ద్రౌపది? ఈమె వట్టి వెర్రిబాగులది. వీడు బ్రాహ్మణుడా? వీనిపై కనికరం చూపించడం పనికిరాదు. వెంటనే చంపివేయండి. నా మాటలు మీకు అంగీకారం కాకపోతే చెప్పండి. ఒక్క పిడికిటిపోటుతో ఈ దుష్టుని శిరస్సును ఛిన్నాభిన్నం చేసాను.
అని భీముడు రౌద్రంగా పలికి అశ్వత్థామ మీదకు ఉరకబోయాడు. ఆతనిని రక్షించడానికై ద్రౌపది అడ్డంగా వచ్చి నిలిచింది. భీముని ఆర్భాటాన్ని చూచాడు కృష్ణుడు. అన్నంత పని చేసేలా ఉన్నాడని భావించాడు. వెంటనే చతుర్భుజమూర్తి అయ్యాడు. రెండు చేతులతో వాయునందనుని గట్టిగా అదిమిపట్టుకొన్నాడు. మిగిలిన రెండు చేతులతో ద్రౌపదిని పక్కకు తప్పించాడు. అపుడు వాసుదేవుడు పవనపుత్రుని ఆవేశం తగ్గించేలా నవ్వుతూ ఇలా అన్నాడు.
పాండవవంశ భూషణుడవైన వాయునందనా! ఈ అశ్వత్థామ రక్షింపదగినవాడు కానే కాడు. శిశుహంత, దుష్టబుద్ధి. పరమ కిరాతకుడు. ముమ్మాటికీ చంపదగినవాడే. ఇది వికల్పం లేనిమాట. కాని “బ్రాహ్మణుడు చంపదగినవాడు కాడు” అని వేదం ద్వారా తెలియజేయబడుతోంది. ఈ సూక్ష్మధర్మప్రకారం అతడిని రక్షించడమే న్యాయమనిపిస్తోంది. యథార్థమేమిటో దానిని ఆచరించు.
కృష్ణుడు ఈ విధంగా సరసోక్తులతో భీముని శాంతింపజేశాడు. అర్జునుని చూచి “ద్రౌపదికి, నాకు, భీమునకు అంగీకారయోగ్యంగా, ముందుగా నీవు కావించిన శపథంకూడ నెరవేరేటట్లుగా నా ఆజ్ఞ పాలించు” అని హితోపదేశం చేశాడు. అప్పుడు కిరీటి గోవింద వచనానుసారంగా కర్తవ్యోన్ముఖుడయ్యాడు.
అర్జునుడు విశ్వంలో అందరిచేతా కొనియాడబడేవాడు. వీరాధివీరుడు. పైగా ఇంద్రనందనుడు. అటువంటివాడు భయంకరమైన కత్తి తీశాడు. అతని జుట్టులో ప్రకాశించే మణిని లాగుకొన్నాడు. కట్లు విప్పాడు. శిబిరభాగం నుంచి ఒక్క ఊపున గెంటివేశాడు.
అత్యంత సాహసంచేసి బాలురను వధించిన ఆ బ్రాహ్మణుడు ఈ విధంగా స్వీయతేజస్సును, మణిని కోల్పోయి భరించరాని అవమానంతో తలవంచుకొన్నాడు. ఆతనిలో ఆవేదన అధికమయింది. సిగ్గుతో కుంచించుకొనిపోయాడు. అతని పొగరంతా క్షణంలో మాయమయ్యింది. మిక్కిలి వేగంగా అక్కడినుండి వెళ్లిపోయాడు.
సంపదలనైనా లాగుకోవాలి. అటుకాని పక్షంలో శిరోముండనమైనా కావించాలి. అదీకాని పక్షంలో ఇంటినుంచైనా వెళ్లగొట్టాలి. అంతేకాని చంపదగినట్టి ఘోరకృత్యం చేసినా, బ్రాహ్మణుని వధించడం రాజులకు ధర్మంకాదు.
అర్జునుడు ఈ ప్రకారంగా అశ్వత్థామను ప్రాణాలతో మిగిల్చి శిబిరం నుండి వెళ్లగొట్టాడు. పాండవులు ద్రౌపదీ సహితంగా చనిపోయిన కుమారులకై దుఃఖించారు. అనంతరం మృతులైన బంధువుల కందరకు దహనాది సంస్కారాలు కావించారు. స్త్రీజనాలు ముందు నడువగా అందరూ గంగానదికిపోయి ధర్మోదకాలు, తిలతర్పణాలు ఒనరించారు. మళ్లీ వాళ్లలో దుఃఖం పొంగిపొర్లింది. శ్రీహరి పాదారవిందసంజాతపుణ్య గంగాజలాలలో మరల స్నానాలు కావించి అందరూ శుద్ధులయ్యారు. పిమ్మట కృష్ణుడు, వ్యాసాది మహర్షులు పుత్ర మిత్రబంధు శోకార్తులైన గాంధారీ ధృతరాష్ట్రులను, కుంతీ ద్రౌపదులను ఓదార్చారు. వారి విచారాన్ని పోగొట్టారు. మనస్సులకు శాంతిని చేకూర్చారు.
ద్రౌపదిని కొప్పుపట్టి ఈడ్చడం మహాపాపం. ఆ ఘోరకృత్యాన్ని కౌరవులు ఆచరించారు. దానివల్లనే వారి ఆయువు క్షీణించింది. వారు దుర్మదాంధులు. అటువంటి ధృతరాష్ట్ర కుమారులనందరినీ, కృష్ణుడు యుద్ధరంగంలో సంహరింపజేశాడు. అన్నమాట ప్రకారంగా ధర్మరాజుకు రాజ్యం ఇప్పించాడు. మహావిఖ్యాతి చేకూర్చాడు. మహేంద్ర వైభవంతో మూడశ్వమేధాలు చేయించి పాండవుల కీర్తి దశదిశలా వ్యాపించేలా చేశాడు.
No comments:
Post a Comment