Friday, February 6, 2026

Arjun Cornered Ashwatthama - అర్జునుండు వుత్రఘాతియగు అశ్వత్థామ నవమానించుట

అర్జునుండు వుత్రఘాతియగు అశ్వత్థామ నవమానించుట

అని చెప్పి సూతుడు - రాజులలో ఋషివంటివాడైన పరీక్షిన్మహారాజు పుట్టుక, అతని ధర్మాధర్మకృత్యాలు, అతడు మోక్షము పొందుట, పాండవుల మహాప్రస్థానము, శ్రీకృష్ణ చరిత్ర వివరిస్తానన్నాడు. కౌరవులకు, ధృష్టద్యుమ్నుడు మొదలగువారికి జరిగిన కురుక్షేత్ర మహాసంగ్రామంలో వీరులంతా స్వర్గానికి వెళ్ళిన తరువాత, భీముని గదదెబ్బకు దుర్యోధనుడు తొడలు విరిగి నేలకూలగా, అశ్వత్థామ అతనికి సంతోషాన్ని కలిగించాలని నిద్రపోతున్న ద్రౌపదీపుత్రుల (ఉపపాండవుల) తలలు నరికి వాటిని తెచ్చి ఆ సుయోధనుడికి అర్పించాడు. అశ్వత్థామ చేసింది క్రూరకృత్యమని లోకులు నిందిసారు.

అశ్వత్థామ కరవాలానికి కన్నకొడుకుల తలలు తెగిపోయాయన్న వార్త ద్రౌపది చెవులపడింది. ఆమె చాలా కలత చెందింది. మిక్కిలి దుఃఖించింది. మనస్సులో జీర్ణించుకోలేకపోయింది. శోకంతో కన్నీళ్లు పెల్లుబికి వచ్చి చెక్కిళ్లపై ధారగా కారగా 
ఏడ్చి ఏడ్చి నేలపై వివశురాలై పడిపోయింది. ఆమెను చూచి అర్జునుడు చాలా జాలి పొందాడు. నేలపై పడిపోయిన పాంచాలిని లేవనెత్తాడు. సమయానికి తగిన ఓదార్చుతోకూడిన మధురమైన వచోవిన్యాసంతో ఊరటపరిచాడు. ఆమె తలవెండ్రుకలు నిమురుతూ ఇలా సాంత్వన వాక్యాలు పలికాడు.

చంద్రవదనా! నీవు ఒక క్షత్రియకాంతవు. అందులోను ద్రుపదమహారాజు కొమార్తెవు. అట్టి నీవు చనిపోయినవారిని గూర్చి ఇలా శోకించడం తగదు. దాక్షిణ్యం లేనివాడై ఆ అశ్వత్థామ మన బిడ్డలను నరకివేశాడు. ఆతనిని నేను వదలివేస్తాననుకొన్నావా? తగిన ప్రతీకారం చేస్తాను. ఈ గాండీవమనే నా వింటినుండి భయంకరంగా వెలువడే, చీల్చి చెండాడే అమ్ములతో వాని తల నరకివేస్తాను. దానిని నీకు కానుకగా తీసుకొనివస్తాను. ఆ తలను కాలితో తన్ని అటుపిమ్మటనే అశుచిస్నానం ఆచరించెదవు గాక!

అనీ ఈ విధంగా అర్జునుడు అనునయవాక్యాలతో 
ద్రౌపదిని సమ్మతింపజేశాడు. తనకు నిరంతరం ఆత్మీయుడు, యుద్ధసందర్భాలలో సారథియునైన శ్రీకృష్ణుడుకూడ అందులకు అంగీకరించి మేలుమేలని ప్రశంసించాడు. అర్జునుడు వెంటనే కవచాన్ని ధరించాడు. గాండీవాన్ని చేత దాల్చాడు. కపిధ్వజాన్ని రథంపై ఎత్తించాడు. అశ్వత్థామ పై స్యందనాన్ని తోలించాడు.

తనను ఏమైనాసరే సంహరిస్తానని ప్రతిజ్ఞచేసి సన్నద్దుడై మీదికి వస్తున్న అర్జునుణ్ణి చూశాడు ద్రోణసూనుడు. పసిబాలురను చంపిన పాపంతో పీడించబడినవాడు కాబట్టి ఆపదలోనున్న వాడయ్యాడు. ప్రాణభయంతో పరుగెత్తసాగాడు. పూర్వం బ్రహ్మదేవుడు తనచేతనే సృష్టించబడిన కన్యనే మోహించి క్రీడింప యత్నించిన సమయంలో రుద్రుడు తనవెంటబడగా భయభ్రాంతుడై  మృగరూపంతో పరుగెత్తినట్లుగా అశ్వత్థామ అర్జునుని చూచి పరుగులు తీశాడు.

అశ్వత్హామ శక్తి ఉన్నంతమేరకు గుఱ్ఱాల నడుపుకొంటూ కొంతదూరం పరుగెత్తాడు. తనను వెన్నంటి తరుముతున్న పార్థుని చూశాడు. తన రథాశ్వాలు అలసిపోయినట్లగా గుర్తించాడు. తన ప్రాణాలు కాపాడుకోవడానికి ఉపాయం ఏమి ఉందా? అని ఆలోచించాడు. ఒక్కక్షణం ఆగి ఆచమనంచేసి ధ్యానయోగావిష్ణుడయ్యాడు. తనకు ప్రయోగం తప్ప ఉపసంహారం తెలియకపోయినా బ్రహ్మశిరోనామకాస్త్ర ప్రయోగమంత్రం జపించాడు. స్వీయ ప్రాణరక్షణార్థం దానిని అభిమంత్రించి అస్త్రంగా అర్జునునిపై ప్రయోగించాడు. అది భయంకరమైన తేజస్సుతో భూమ్యాకాశాల మధ్యభాగం వ్యాపించి సమస్త ప్రాణికోటికి భీతి కల్గించడం ప్రారంభించింది. ఆ సమయంలో విజయుడు శ్రీకృష్ణునితో ఇలా అన్నాడు.

పుండరీకాక్షా! భక్తరక్షకా! శ్రీకృష్ణా! సంసారాగ్ని జ్వాలల్లో దహించబడుతున్న జనుల తాపాలను రూపుమాపడానికి నీకొక్కనికే శక్తి కలదు. నీవు కన్నులముందు సాక్షాత్కరించిన సగుణరూప పరబ్రహ్మవు. ఈ కనబడే ప్రకృతికన్న అవ్వల వెల్గువాడవు. నీవే ఆదిపురుషుడవు. నీవు నీ చిచ్చక్తిచే మాయను లోబఱచుకుని ఉంటావు. అఖండ సచ్చిదానందరూపమైన ఆత్మయందు మాయలో మునిగి జీవభావంలో జీవించేవారిని కృపతో కటాక్షిస్తావు. వారికి ధర్మమే ప్రధాన లక్ష్యమైన కల్యాణాన్ని ప్రసాదిస్తావు. జగన్నివాసా! సజ్జన రక్షణకోసమై ఈ భూమిపై అవతరిస్తావు.

దేవాధిదేవా! ఇదేదో ఒక కాంతిపుంజం. భూమ్యాకాశాలు, సమస్త దిక్కులు వ్యాపించి, ఎటుచూచినా, అదే, నాకెదురుగా వస్తున్నది. దీనిస్వరూపమేమిటో నాకర్థం కావడంలేదు. నాపై దయతో అదేమిటో స్పష్టంగా తెలియజేయుము.

అర్జును డీవిధంగా పలుకగా ప్రశ్నించగా, శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు.

వివ్వచ్చుడా! ద్రోణుని కుమారుడైన ఆ అశ్వత్థామ కుటిలవర్తనుడు. దుష్టశీలుడు. అతడు పరుగెత్తి పారిపోతూ చేసేదిలేక ఆత్మరక్షణార్థమై వక్రబుద్ధితో బ్రహ్మాస్త్రం ప్రయోగించాడు. ఈ భయంకరమైన తేజస్సు దానిదే. దానిని మరలించాలంటే బ్రహ్మాస్త్రానికి తప్ప మరొక్కదానికి ఆ సామర్థ్యంలేదు. దాని ఉపసంహారం ఆ ద్రోణపుత్రునికి తెలియదు. నీవు ఆలస్యం చేయకుండా దానిపై నీ బ్రహ్మాస్త్రాన్ని (ఉపసంహారాస్త్రంగా) ప్రయోగించు.

శ్రీకృష్ణుని వచనాలు వినగానే అర్జునుడు ఆచమించాడు. మంత్ర దేవతను స్మరించాడు. ఆ వాసుదేవునకు ప్రదక్షిణం చేశాడు. అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మా
స్త్రంపై తన బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు.

ఆ బ్రహ్మా
స్త్రాలు రెండూ భూమ్యాకాశాలమధ్యలో నిండిపోయాయి. సూర్యాగ్ని తేజస్సులతో తమలో తాము పరస్పరం పోరు సాగించాయి. ముజ్జగాలు భీతితో తల్లడిల్లిపోయాయి. సమస్త భూతాలు వారింప శక్యంకాని భయంతో ప్రళయకాలమేమోయని భావించాయి. ఆ సమయంలో శ్రీకృష్ణుని అనుమతిపై అర్జునుడు ఆ రెండు బ్రహ్మాస్తాలను ఉపసంహరించాడు.

అర్జునుడు ఆ రెండు అస్త్రాలను ఉపసంహరించాడు. అశ్వత్థామను వెన్నంటి తరిమిపట్టుకొన్నాడు. ఆతనిని చూచిన వెంటనే ధనంజయుని నేత్రాలు క్రోధంతో ఎరుపెక్కాయి. యజ్ఞకర్త త్రాటితోయాగ పశువును బంధించినట్లుగా ద్రోణపుత్రుని కట్టివేసి సేనాశిబిరానికి లాగుకొని వెళ్లాడు. ఆతనిని హింసించి తీరుతానని ఈడ్చుకొని వస్తున్న బీభత్సుని చూచి కృష్ణుడు ఇలా అన్నాడు.

అర్జునా! నీవైతే పాపకృత్యాలను ఆచరించేవాడవు కావు. ఈ బ్రాహ్మణుడు చూస్తే మహాపాపాత్ముడు. మీ కుమారులతనిని ఎదుర్కొనే శక్తిలేనివారు. అతనితో సమానమైన సామర్థ్యం లేనివారు. పైగా నిద్రిస్తున్నవారు. ధనుర్విద్యలో ఆరితేరనివారు. పోల్చిచూస్తే తనకంటె వయస్సులో చాల చిన్నవారు. అటువంటి చిన్నవాళ్లను రాత్రి సమయంలో క్రూరబుద్ధితో చంపేశాడు. అట్టి మహాపాతకుని విడిచిపుచ్చవలసిన అవసరం లేదు. అయినా ప్రాణాలపై ఆశతో వేడినిట్టూర్పులు విడుస్తూ పరుగెత్తాడు. నీవు దయాబుద్ధి నవలంబీంచి వీనిపై కనికరం చూపించు.

అర్జునా! భయపడినవానిని, దిగులుతో బుద్ధిమందగించినవానిని, నిద్రలో స్పృహలేనివానిని, ఆనందంతో మద్యపానంచేసి మైమరచినవానిని, యుద్ధరంగంలో పరాజితుడై పారిపోయినవానిని, మంచివానిని, కార్యోత్సాహం లేనివానిని, రక్షించుమని మొర పెట్టుకొన్నవానిని, స్త్రీలను వధించడం అనేది ధర్మం కాదు కదా!

అర్జునా! ఎవడు దయ, దాక్షిణ్యం వదలి తన ప్రాణాలు కాపాడుకోవడంకోసం ఇతరుల ప్రాణాలు బలి చేస్తాడో, అటువంటివాడు నరకలోక బాధలు అనుభవిస్తాడు. లేదా రాజదండనం ద్వారా శిక్ష అనుభవించి ఆ దుఃఖాలు పొందకుండా శ్రేయస్సును పొందుతాడు. కాని ఈ బ్రాహ్మణుడు మహాభయంతో పరితపిస్తున్నాడు. అటువంటి వానిని కఠినంగా శిక్షించడం ఎందులకు? ఒక్కసారి ఆలోచించి చూడు.

కృష్ణుడు ఈ విధంగా అర్జునునితో ధర్మశాస్త్రానుగుణంగా ప్రసంగించాడు. “తప్పు చేసినా విప్రుని దండింపకూడదు” అనే ధర్మాన్ని గుర్తు తెచ్చుకొని కిరీటి అశ్వత్థామను వధించలేదు. అయినా పాంచాలి సమక్షంలో తాను చేసిన ప్రతిజ్ఞ గుర్తు చేసుకొన్నాడు. త్రాళ్లతో కట్టివేయబడియున్న గురుపుత్రుని రథంపై పడవేశాడు. పార్థసారథి గుర్రాలను వడిగా త్రోలగా సేనలు ఉండే గుడారం కడకు కొనివచ్చాడు.

అంతులేని పుత్త్రశోకంతో ఉన్న ద్రౌపదికి, గట్టి త్రాటితో చేతులు కట్టివేయబడి, వణుకుతున్న అవయవాలతో ఉన్న అశ్వత్థామను అర్జునుడు చూపాడు.


ద్రొపది యశ్వత్థామను జూచి సంభాపించుట

No comments:

Post a Comment

kunthi devi praying sri krishna Kunti Stuti - కుంతీదేవి శ్రీకృష్ణుని స్తుతించుట

కుంతీదేవి శ్రీకృష్ణుని స్తుతించుట కృష్ణా! నీవే ఆదిపురుషుడవు. అందరిచేత స్మరింపబడేవాడవు. జగత్తుకన్న వేరుగా ఉండేవాడవు. నాశనం లేనివాడవు. సమస్తభూ...