హిరణ్యాక్షుండు యజ్ఞవరాహంబగు హరినెదిరించి పోరుట
నారదుడు పాతాళానికి పొమ్మని చెప్పగానే హిరణ్యాక్షుడు అగ్గిలాగ మండి పడ్డాడు. విష్ణువుతో తలపడి తీరాలని భావించి పెద్దగద నొకదాన్ని చేత తాల్చాడు. తన భుజబలాన్ని ప్రదర్శించాలని విర్రవీగుతూ భీకరరూపంతో పాతాళానికి వెళ్ళాడు.
హిరణ్యాక్షుడు పాతాళం ప్రవేశించి నీటి మధ్య
సురవైరియగు హిరణ్యాక్షుడు పాతాళంలో స్వామిని నిగాగా చూచాడు. ఆయన విస్తారమైన కోరలతో వెల్గుతున్నాడు. భూమిని ఉద్దరించటానికి పూని ఉన్నాడు. మొయిలువన్నెతో నిక్కపొడుచుకున్న రోమాలతో యజ్ఞవరాహరూపాన్ని ధరించిన దేవవిభుణ్ణి చూశాడు.
హిరణ్యాక్షుడలా ఎత్తి వచ్చిన సందర్భంలో 'సూకరాకృతిధరించిన' శ్రీహరి కూడా
మహావిష్ణువు తామరకాంతిని గుత్త బుచ్చుకొన్న తన చూపుల తీవ్రతచేత రక్కసుని శారీరకవిజృంభణాన్ని ఒక్కపెట్టున మటుమాయం చేశాడు.
అప్పుడా యజ్ఞవరాహస్వామి అపారవిక్రమంతో విచ్చలవిడిగా చక్రభ్రమణం చేస్తున్నాడు. ఆ విహారం ఎదురులేనిది.
ఆ ఆదివరాహం రాక్షసుని గుండెలు గుభేలు మనేట్లు యుద్ధోత్సాహంతో కొంతసేపు ముట్టెతో అంచులు మూలాన్ని సోకేటట్లు కులపర్వతాల్ని చిమ్మింది. బ్రహ్మాండభాండం పగిలి చిల్లులు పడేట్లు కొమ్ములతో జీరాడింది. సప్తసాగరాలు బురదలాగ గజిబిజి అయ్యేట్టు తనగిట్టలతో ఇంకిపోయేట్లు గోకుతుంది. తన తోకను తిప్పుతూ చంద్రుణ్జీ సూర్యుణ్ణీ ఒక మూలకు నెట్టివేస్తున్నది. గునగున నడుస్తుంది. ఊపిరి బిగబట్టి ఎగిసిపడుతుంది. ఎగిరి దాటుతుంది. విజృంభిస్తుంది. పైకొంటుంది. బొరకలుపడేట్లు నేలని బరుకుతుంది.
ఆ తర్వాత ఇంకా,
ముట్టెపై భూమిని ధరించి కళ్ళల్లో నిప్పులు చెరుగుతూ ఆ యజ్ఞవరాహం రక్కసునికి ఎదురుపడింది. ఆ రక్కసుడు దాన్ని చూచి 'ఇది అడవిజంతువు గదా జలచర మెట్లైందో' అనుకొన్నాడు.
'వనచరం జలచరమైందే' అని సంభ్రమాశ్చర్యాలు పొందిన హిరణ్యాక్షుడు, రాక్షసులపొగరు అణచగల ఆ యజ్ఞవరాహరూప మెత్తిన విష్ణువుతో ఇట్లన్నాడు.
ఓ తెలివిలేని వరాహమా! నేను బ్రహ్మవల్ల రసాతలగతమైన ఈ భూమిని వరదానంగా పొందాను. ఇది ఎప్పటికైనా నాదే. అని రాక్షసుడు విష్ణువుతో అన్నాడు.
ఓయీ! నీవు భూమిని లేపుకొని పోవద్దు. ఇక్కడే వదలిపెట్టు. కాదు కూడదని పెకలించి తీసికొని పోవాలని ప్రయత్నిస్తే నీ ప్రాణం తీస్తాను. నా మాట విను. ఎందుకు నీ కంత పట్టుదల?
ఏదో నీ మోసబుద్ధితో ఇప్పుడు ఈ భూమిని దొంగిలించుకొని పోవాలనుకున్నావేమో, దాన్ని చూస్తూ ఊరుకోను. నా భుజబలంతో నిన్ను అణచి మట్టు పెడతాను అన్నాడు అసురుడు.
ఓరీ! యోగమాయవల్ల దక్కిన మగతనం నీది. ఒక్కపెట్టున నీ బలాన్ని అణచివేసి, మా సంగడికాండ్రకు, సేవకులకు, మా కులానికంతటికి సంతోషం గొల్పుతాను. నీ బలం ఉడిగి నా గదదెబ్బ రుచి చూచిన నీ దేవతలెల్లరు బిక్కుమంటారు. చచ్చి చెడతారు అని ఇట్లు వదరుతున్న రక్కసుని మాటలు విని ఆ యజ్ఞవరాహస్వామి బ్రహ్మాదిసురలకు రాబోయే ఉపద్రవాన్ని పసిగట్టి, అప్పుడా భూదేవిని తన వాడికోరపై మోపి విలసిల్లాడు.
వరాహస్వామి రక్కసుని దుందుడుకు మాటలకు రెచ్చిపోయి 'గజరాజు భయభ్రాంతమైన తన ఆడఏనుగును పొదువుకొన్నట్లు' భూమిని ముట్టెపై నిల్పి విలసిల్లాడు.
వరాహస్వామి దంతకాంతులు ఆకాశాన్ని వెల్గిస్తున్నాయి. అప్పుడాయన పాతాళంనుండి బయలుదేరాడు. అంతభయంకరా కృతి ధరించిన ఆ విష్ణుమూర్తి వెనుక - రాక్షసుడు వస్తూ -
గజరాజును పట్టుకోబోయే మొసలిలాగ ఆ రక్కసుడు శ్రీమన్నారాయణుని వెంటబడ్డాడు. ఆ స్వామి సముద్రాన్ని తరించివస్తున్నాడు. గిట్టల్తో మేరునగాన్ని సైతం ఎగురమీటగలసత్తువగలవాడు. వరాహరూపాన్ని ఎత్తివున్నాడు.
ఇది అవమానమే అనుకోకుండ, సిగ్గువిడిచి, మోసంతో యుద్ధం చేసి, విజయాన్ని కైవసం చేసుకోవాలనుకొన్నావు. ఇక్కడేమో పిరికివానిలాగ కాలికి బుద్ధి చెప్పావు. ఇది వీరలక్షణమా? (కాదనిభావం).
హిరణ్యాక్షు డిలా ఎదిరించి మాట్లాడగా, శ్రీహరి మనసు కోపంతో ఉడికిపోతూ,
అప్పుడా వరాహస్వామి నీటిపై భూమిని నిల్పి దానికి ఊతగా, తనబలాన్ని అడ్డుపెట్టాడు. దేవతలు ఆనందించారు.
అప్పుడు బోరుమని పూలవాన కురిసింది. వైభవంగా సురభేరులు మ్రోగాయి. గంధర్వుల పాటలు విన్పించాయి. అచ్చరలేమలు ఆనందంగా నాట్యమాడారు.
యజ్ఞవరాహావతారుడైన ఆ శ్రీమన్నారాయణుడు బంగారుపోగులు, భుజకీర్తులు, హారాలు, కాళ్ళకు కడియాలు, వేళ్ళకు ఉంగరాలు మొదలైన ఆభరణాలు ధరించి అసురునితో తలపడడానికి సిద్ధమైనాడు.
చేతబుచ్చుకొని మణులు తాపిన సరికొత్త బంగారుకవచం ధరించిన రాక్షసుడు ప్రయోగించిన వాడిబాణాలు స్వామివారి అంతరింద్రియాల్ని సోకుతున్నాయి. వాడు చెలరేగి ముందుకువస్తుంటే, ఆయన కోపావిష్టుడయ్యాడు.
రాక్షసుని దురుసుమాటలకు, వేసిన వాడిబాణాలకు స్వామికి కోపం కల్గింది. కాని ఆయన నవ్వుతూ ఇలా అన్నాడు.
ఓరి దుష్టుడా! నీవు మహా దురహంకారివై నన్ను ఎల్లప్పుడు 'అడవిజంతువా!' అని కారుకూతలు కూస్తుంటావు. నీవన్నట్లే నేను అడవిమెకాన్నే. అయితే పొలికలని(యుద్ధభూమి)లో నా ధాటికి ఆగి నిల్చిన నీవంటి కుక్కల్ని ఈ రోజే మట్టుపెడతా.
ఓరీ దుర్మార్గుడా! నీకు సత్తావుంటే నాతో పోటొడ్డి యుద్దానికి సిద్ధపడు. నేటితో నీ కోర్కెను నెరవేరుస్తాను. అంతేగాని మాటిమాటికి నీ గొప్పలెందుకు చెప్పుకుంటావు?
ఓరీ రాక్షసాధమా! ఆ మాటలన్నీ కట్టిపెట్టి విను. యుద్ధకోవిదులైన ఎందరో మహాత్ములు మిత్తికోరల్లో చిక్కిన వారైనను నీ మాదిరి ఇలాగా తమగొప్పలు చెప్పుకోరు. ఎందుకు నీకీ సొంతపొగడ్తలు? అది వీరుల ప్రజ్ఞలవుతాయా? (కావని భావం)
అరె దేవ విరోధీ! ఇదిగో చూడు. పాతాళంలో వుందంటున్నావే - ఆ నిధిని మహాపరాక్రమంతో కైవసం చేసుకొంటాను. నన్నేదో సిగ్గులేని వానిగా నీ వంటున్నావు. కానిమ్ము,దాక్కొని నీతో కయ్యమాడుతాను. నీ గదను చూచి పరుగెత్తానంటున్నావు గదూ! సరే నన్నెదిరించి చూడు-నీ కోర్కె వేగంగా నెరవేరుతుంది.
ఓ రాక్షసా! నీవీ కాల్బంట్లకు నాయకుడవు. ఈ యుద్ధరంగంలో పోటుమగాడవై నన్నెదిరిస్తే తప్పక నీ ఉసురు తీస్తాను. నీ బలాన్ని అణచి వేస్తాను. నా పరాక్రమంతో నిన్ను హతమార్చి 'భూమిలో రక్కసులు లేకుండా చేస్తాను. ఇదే నా ప్రతిజ్ఞ' అన్నాడు వరాహస్వామి.
రక్కసికులంలో అధముడైన ఓరీ! యుద్ధరంగంలో నన్నెదిరించే మొనగాడవైతే రా. నీ పరాక్రమం, ధైర్యం, బలిమి ఉంటే ప్రదర్శించు. నీ స్నేహితుల కన్నీళ్ళు తుడవగల పోటు మానిసివైతే రా. నాతో తలపడు- ఈ వ్యర్థపు మాటలు ఎందుకు? (వదరుబోతు కూతలు మాని నాతో కయ్యానికి దిగుమని వరాహస్వామి రక్కసుని గద్దించాడు).
'నిన్నిక్కడే పాతిపెడతా' నన్నావు. నిజంగా నీ వంతటివాడవే. ఇదో ముందుగానీవు నీ ప్రియమైన బంధువులందరిని చూచిరా. యమలోకానికి కాపురం చేయటానికి పోవలసి ఉంటుంది. నీ ప్రియమైన బంధువులందరిని చూచిరా అని వరాహస్వామి రాక్షసుణ్ణి గేలి చేశాడు.
పద్మలోచనుడైన వరాహస్వామి 'యమపురి కేగుటకు సిద్ధంగా ఉండిమని గేలిచేయగానే ఆ రక్కసుడు కోపోద్రేకంతో రేగిన మనస్సుగలవాడై తోకద్రొక్కిన సర్పరాజులాగా మండి పడ్డాడు.
వరాహస్వామి పల్కులకు హిరణ్యాక్షుని అవయవాలన్నీ జలదరించాయి. వాడు బుసకొడుతూ, కోపావేశంతో రెప్పలు ముడివడిగా సాహసించి హరి నెదుర్కోడానికి ముందుకు వచ్చాడు.
ఆలాంటి వేళలో హిరణ్యాక్షుడు అతి భీకరాకారంతో, కోపంతో గదని ఝుళిపించి శ్రీహరిని కొట్టబోయాడు. హరి ఆ గద వేటుని తప్పించుకొని తన గదతో వాని గదను తుత్తునియలు చేశాడు. అప్పుడా రక్కసుడు దుర్మదుడై వేరొక గదతో స్వామిపై విజృంభించాడు.
హిరణ్యాక్షుడు ప్రయోగించిన గద వేటును తప్పించుకొన్నాడు వరాహస్వామి. తర్వాత తన గదాయుద్ధకౌశలంతో ఆ రాక్షసుని రొమ్ముపై ఒక్క బలమైన దెబ్బకొట్టాడు. ఆ గద తాకిడికి వాడు కొంతసేపు మతిదప్పిపడి, అంతలోనే తేరుకొని శత్రుహంతయైన శ్రీహరిపై తన గదను సారించాడు.
వరాహస్వామి హిరణ్యాక్షు లిర్వురు విజయేచ్చతో యుద్దానికి సన్నద్దులయ్యారు. వారిర్వురి కయ్యం ఉవ్వెత్తుగా లేచిన అలలతో కూడిన ఉత్తర దక్షిణ సముద్రాలు ఢీకొన్నట్లుంది. రెండు మదపుటేనుగులు తమ తొండాలతో తాడించుకొన్నట్లుంది. కోపావేశంతో రెండు పెద్దపులులు తలపడినట్లుంది. పోతరించిన రెండు ఎడ్లు రంకెలువేస్తూ కుమ్ములాడినట్లుంది. ఆ వీరులిర్వురు సింహాలవలె విజృభించి పోరు సల్పుతున్నారు. హిరణ్యాక్షుడు ఎడమనుండి చుట్టుకొని రాగా, వరాహస్వామి కుడినుండి చుట్టి, పిడుగుపాటును పోలిన కౌమోదకితో వాని రొమ్ముపై బలంగా కొట్టాడు. ఆ రాక్షసుడు దెబ్బసోకి స్పృహనుండి కోలుకొని శ్రీహరి నొసటిని గట్టిగా గాయపరిచాడు. ఇట్లా ఇరువురు నెత్తురు చిమ్మే శరీరాలతో పుష్పించిన అశోకవృక్షాల్ని తలపించారు. ఒకరిపై నొకరు మిడిసిపడుతూ, రోజుతూ, రొప్పుతూ, కొట్టుకుంటూ, ఒండొరుల రక్తం వాసన చూస్తూ, తిట్టుకొంటూ, గేలిచేస్తూ యుద్ధం చేస్తున్న సమయంలో, ఆ వేడుక చూడాలని బ్రహ్మ మునుల్ని సిద్ధ సాధ్యుల్ని తక్కిన దేవతల్ని వెంటబెట్టుకొని అక్కడికి వచ్చాడు. భూమాతకొరకై రక్కసునితో తలపడుతున్న యజ్ఞవరాహస్వామితో ఇట్లన్నాడు.
'ఓ దివ్యమంగళమూర్తీ! పరమాత్మా! ఈ దుర్మార్గుడైన రాక్షసుడు మేమిచ్చిన వరగర్వంతో లోకుల్ని బాధిస్తున్నాడు. ఇలాంటి దుశ్చరిత్రుని మట్టుపెట్టకుండ వదలటం మంచిది గాదు. వీనిని భూదేవికి శుభం కలిగించు అని బ్రహ్మ శ్రీవరాహస్వామిని వేడుకొన్నాడు.
"కళ్యాణదాయకా! పరమాత్మా! చిన్నపిల్లవాడు భయంకరమైన పాముని చేతపట్టి ఆడినట్లు, ఈ రక్కసుణ్ణి ఇంకా చంపకుండా ఉపేక్షించటం తగునా?” అని బ్రహ్మ అన్నాడు.
అంతేగాక, ఇంకా, మహాత్మా! 'అబిజిత్తు' అనే పేరుగల యీ కాలంలోనే ఈ దైత్యుని మట్టు పెట్టండి. ఈ ముహూర్తం తప్పితే అసుర సంధ్యాసమయం వస్తుంది. అప్పుడు మాయాబలశాలియైన వీనిని చంపటం తేలిక కాదు. అందువల్ల మంచివారిని కాపాడుట యందాసక్తిగల మీరు వీనిని యిప్పుడే మట్టుపెట్టండి.
(అభిజిత్తు : ఒక నక్షత్రం, రోహిణికి ప్రక్కనే ఉంటుంది. దక్షుని కూతురు. చంద్రునికి భార్య. అందరికంటెతానే చంద్రునికి అతి ప్రియమైన భార్యకావాలని తలంచి తపస్సుచేసింది. ఆ సమయంలో ఆమె స్థానంలో కుమారస్వామి 'అగ్నిదైవత్య'మనే వేరొక నక్షత్రాన్ని నిల్పాడు. 'అభిజిత్తు'ను శుభలగ్నంగా వైదికులు భావిస్తారు.
పగలు పదునాల్గు గడియలమీద రెండుగడియల కాలాన్ని అభిజిత్తు అంటారు. (శ, ర). సహజంగా నక్ష్మత్రాల సంఖ్య 27. అశ్విన్యాదులు. కాని కార్తాంతికులు 'అభిజిత్తు'ను 28వ నక్షత్రంగా గుర్తిస్తారు.)
బ్రహ్మ 'స్వామీ! అభిజిల్లగ్నంలోనే వీనిని చంప'మని చెప్పగానే అక్కడ మూగిన దేవతలు విని ఆనందించారు. అప్పుడా స్వామి ముఖపద్మం వికసించింది. ఆయన రక్కసుని కెదురై నిలిచాడు.
సహజంగా శ్రీమన్నారాయణుని కళ్ళు తెల్లదామరల్ని పోలి ఉంటాయి. కాని ఇప్పుడు కోపావేశం చేత కొత్తగా విచ్చిన ఎర్రదామరలను పోలివున్నాయి. ఆ స్వామి గొప్పగదతో రక్కసుని చెక్కిలిపై ఒక్క దెబ్బ కొట్టాడు. వాడు ప్రక్కకు తొలగిపోయాడు.
అప్పుడా దితిబిడ్డడైన హిరణ్యాక్షుడు పరుగెత్తిపోయి ఒక భయంకరమైన గదతో తన భుజబలాన్ని ప్రదర్శిస్తూ శ్రీహరి గదను మొత్తాడు- అది పోయి సముద్రంలో పడింది.
అంతలో ఏమిజరిగిందనగా...
తన గదతాకిడికి వరాహస్వామిగద సంద్రంలో పడింది. స్వామి నిరాయుధుడయ్యాడు. రాక్షసుడు యుద్ధనీతిని స్మృతికి దెచ్చుకొని స్వామితో పోరాడటం మానుకొన్నాడు. అప్పుడాకాశంలో దేవతల ఆర్తనాదాలు బోరుమన్నాయి.
ఆ రక్కసుని యుద్ధనీతికిని, వాని ప్రతాపాతిశయానికి వరాహస్వామి ఆశ్చర్యం చెందాడు. ఆయనలోకూడ ఉత్సాహం అతిశయించింది.
యజ్ఞవరాహస్వామి భూమిని ఉద్ధరించినవాడు. ఇక రక్కసునిపై సుదర్శన చక్రాన్ని ప్రయోగించాలనుకొన్నాడు. ఆ చక్రం దితి సంతానమనే అడవిని కాల్చివేయగల కాంతిగలది. చూపరుల జయ నాదంతో ప్రతిధ్వనించే సూర్యమండల సదృశమైంది. నిరంతరం శరణుజొచ్చిన వారిని కాపాడగలది. విశ్వమంతటికి రక్షణ నివ్వగలది.
ఆ వరాహస్వామి ఎత్తిన సుదర్శన చక్రం మధ్యాహ్న సూర్యమండలకాంతివంటి కాంతితో మిరుమిట్లుగొల్పింది. దాని నుండి ఎగిసిన మంటలతాకిడికి మదించిన శత్రువుల పరాక్రమమనే చీకట్లు పటాపంచలయ్యాయి. సహింప నలవికాని దాని 'కహ కహ' శబ్దం సముద్రఘోషనే అణచినట్లయింది.
దాని వైభవాన్ని దేవతలెల్లరు ప్రస్తుతించారు. దాని కాంతి యింతింత అని చెప్పలేము. దాని తేజస్సు రోదసినంతటిని ఆవరించింది. అది అతి వేగంగా వచ్చి ఆ యజ్ఞవరాహస్వామి కుడిభుజాన్ని అలంకరించింది. అప్పుడాయన చక్రధారియై దేవతలెల్లరు 'జయశబ్దం' చేస్తుంటే రక్కసునికి ఎదురు నడిచాడు.
హిరణ్యాక్షుడు తనకెదురుగా వస్తున్న చక్రధారిని చూచి, వీరభటుని లాగ ఎదిరించి నిలిచి, ఒక పెద్దగదతో ఆ స్వామిని కొట్టాడు.
హిరణ్యాక్షుడు సారించిన గదను వరాహస్వామి ఒక్కకాలితాపుతో పక్కకు నెట్టాడు. ఆయనలో ఆనందం పెల్లుబికింది. మొగంపై చిర్నగవు తాండవించింది.
రక్కసుని గదను అలవోకగా కాలితో తన్ని వరాహస్వామి వానితో ఇలాగ అన్నాడు.
"ఓరీ నీచరాక్షసా! గద చేతబుచ్చుకొని యుద్ధరంగంలో నన్నెదిరింప రారా?” అని వరాహస్వామి రక్కసుని పిలిచాడు. వా డా మాటకు తెగ గర్వించి తన గదని స్వామిపై ప్రయోగించాడు. అప్పుడా హరి గరుత్మంతుడు పామును పట్టుకొన్నట్లు పట్టుకొన్నాడు.
దితికుమారుడైన హిరణ్యాక్షునికి బలాఢ్యుడైన వరాహస్వామిని ఎదిరించడం సాధ్యం కాదని తెలుసు. అయినా వాడు గర్వంతో స్వామి నెదుర్కొన్నాడు.
అంతలో
అప్పుడా రక్కసుడు ప్రళయకాలాగ్నిజ్వాలవలె ధగధగ మెరుస్తున్న ఒక శూలం చేబూని యజ్ఞవరాహావతారుడైన శ్రీమహావిష్ణువుపై విసిరాడు - అది బ్రహ్మజ్ఞుడైన సద్బ్రాహ్మణునిపై ప్రయోగించే హింసాకర్మ యోగంవలె వ్యర్థమైపోయింది. అలా చచ్చుబడి వస్తున్న ఆ శూలాన్ని స్వామి 'ఇంద్రుడు వజ్రాయుధంచేత గరుడుని రెక్కల్ని ఛేదించినట్లు' ఒక్కవ్రేటున తన చక్రాయుధంచేత తుత్తునియలు చేశాడు.
ఆ సమయంలో తనశూలం సుదర్శన చక్రంచేత పతనమైంది. రాక్షసుడది చూచాడు
అప్పుడా హిరణ్యాక్షుడు కోపావేశంతో శ్రీహరిని ఒక్క పిడికిటిపోటు పొడిచాడు. పూలమాల తాకిడివల్ల గజరాజులా వరాహమూర్తి కలతచెందక విరాజిల్లాడు.
హిరణ్యాక్షుడు శ్రీయజ్ఞవరాహస్వామి పైన వేలకొలది మాయలు పన్నాడు. భూమినుండి లేచిన దుమ్ము చీకట్లు కమ్మినట్లయింది. ఆకసం నుండి మేఘాలు పెద్దపెద్దబండలు, పెంటప్రోవులు, మూత్రం, గబ్బుకొట్టే ఎముకలు, నెత్తురులను కురిపించాయి. అప్పుడు గొప్ప ఉపద్రవసూచకమైంది
ఇంతేకాదు.
ఆకాశంలో నిలబడిన భూతాలు, దయ్యాలు, స్త్రీ పిశాచాలు జుట్లు విరబోసుకొని, దిసమొలతో, కరకుకోరలతో, దవడలతో, ఎర్రని కండ్లతో దవళ్ళు తెరచుకొని శస్త్రాస్త్రాలు తాల్చివున్నారు. యక్షదైత్య చతురంగబలాలతో కూడి పెడబొబ్బలు పెడుతున్నారు.
ఆ తర్వాత
ఆ వరాహేశ్వరుడు మూడు వేళల - (అనగా ఉదయ మధ్యాహ్న సాయం సంధ్యలలో) యజ్ఞపాదుడు. జగానికంతటికి భీతిని గొల్పే ఆ రక్కసుని మాయచేష్టల్ని అంతమొందించే ఒక అస్త్రాన్ని వానిపై విసిరాడు.
సూర్యకాంతివంటి కాంతి గల చక్రం భూమండలమంతా వ్యాపించి ఒక్కపెట్టున ఆ రాక్షసుడు పన్నిన మాయలన్నింటిని వాడు చూస్తుండగానే పటాపంచలు చేసింది.
తర్వాత ఇక్కడ దితి ఇంట ఏమి జరిగిందో చెపుతున్నాడు.
ఇక్కడ దితి తన భర్తయైన కశ్యపుని పల్కులు స్మృతికి దెచ్చుకొంది. తన కుమారుడైన హిరణ్యాక్షుని చావు ఆమె కళ్ళకు కట్టినట్లయింది. అప్పుడామె పయోధరాల నుండి నెత్తుటి చారికలుస్రవించాయి. (కన్నీటికి మారు, లేదా పాలకు బదులు- నెత్తురు స్రవించిందని భావం. ఇది దితి దుఃఖాన్ని ప్రతిబింబించింది.)
ఆ సమయంలో హిరణ్యాక్షుడు ప్రయోగించిన వందలకొలది మాయలు, చేసిన మేలు మరిచే వానికి చేసిన ఉపకారాలవలె శ్రీహరి పైన పనిచేయలేదు. నిష్ఫలమయ్యాయి. అయినప్పటికి ఆ అసుర పట్టువీడని వీరయోధునిలా హరిచెంతకు వచ్చి రెండుచేతులు సాచి ఆయన రొమ్ముమీద గుద్దాడు. అయితే ఆయన తప్పించుకొని ప్రక్కకు పోగా ఆ రక్కసుడు ఒక్క పిడిగుద్దు గుద్దాడు. కాని ఆ దనుజవైరి అలకచెందక భయంకరరూపంతో వజ్రతుల్యమైన తన అరచేత వాని మొలపై ఒక చరపు చరిచాడు. అంతట వాడు గిరగిర తిరిగి చూపుకోల్పోయి సోలిపడబోయాడు. ఎట్లో తేరుకొని చివరకు స్వామి ఎదుట నిలబడ్డాడు.
తనకోరలతో హిరణ్యాక్షుని రొమ్మును చీల్చినవాడును, వాడియైన గిట్టలుగలవాడును, బ్రహ్మాండమనే కుండను బ్రద్దలు కొట్టగలవాడును, జూలు గలవాడునునైన ఆ వరాహావతారునికి బలముడిగిన రక్కసుడు లొంగిపోయాడు.
ఇలా హిరణ్యాక్షుడు వరాహస్వామికి లొంగిపోగా.
శ్రీహరి తన వజ్రతుల్యమైన చేతితో రక్కసుని గూబ అదరగొట్టాడు. అది చూచి ఇంద్రాదులు సంతోషించారు. అప్పుడా హిరణ్యాక్షుడు కండ్లు తేలవేసి దీనుడై పెనుగాలి తాకిడికి కూకటివ్రేళ్ళతో కుప్పకూలే చెట్టులాగ నేలపై రాలిపడ్డాడు.
(యజ్ఞవరాహావతారక్రియ ఇంతటితో ముగిసింది. సనకాదులచే శాపగ్రస్తులైన జయ విజయులు భూలోకంలో రాక్షసులై జన్మించవలసి వచ్చింది. శ్రీహరి అనుగ్రహంవల్ల ఆ యిర్వురు ఆయనకు విరోధులుగా మూడు జన్మలెత్తి పోరు సలపాలి. హిరణ్యాక్ష హిరణ్యకశిపుల వధతో ఒక రాక్షస జన్మ ముగిసిపోతుంది. స్వామి వరాహావతారమెత్తి హిరణ్యాక్షుని వధించాడు. ఇక నరసింహాకృతి తాల్చి హిరణ్యకశిపుని చంపవలసి ఉంది- అంతటితో జయ విజయులకు ఒక్క రాక్షసజన్మ సమాప్తమౌతుంది.)
తర్వాత హిరణ్యాక్షుడు హరిదెబ్బకు నెత్తురు కారుతుంటే, వికారరూప మెత్తి, కనుగ్రుడ్లు పైకి ఉబికి కనపడగా, నిలబడి పండ్లు పటపట కొరుకుతూ పడి చచ్చాడు.
నేలపైకూలిన హిరణ్యాక్షుని చూచి బ్రహ్మాదిదేవతలు 'వీనికి ఏమి యీ దురవస్థ?' అని తలంచి ఆశ్చర్యపడ్డారు. తర్వాత ఇలా అన్నారు.
పరమయోగులు యోగమార్గంలో తమ పాంచభౌతికదేహాన్ని ఆ శ్రీమన్నారాయణుని స్మరిస్తూ పరిత్యజించాలని భావిస్తారు. అయితే ఇక్కడ ఈ రక్కసుడు ఆ స్వామి పిడికిటి దెబ్బతో చచ్చి ఆయన ముఖసందర్శన చేస్తూ ప్రాణత్యాగం చేశాడు. ఆతని మహిమ ఎంత గొప్పదో అని బ్రహ్మాదులు ఆశ్చర్యపడ్డారు.
ఆశ్చర్యంతో దేవతలిలా అనుకొన్నారు -
ఈ రక్కసులు మనస్సులో సమభావం గలవారు. సనకాదుల శాపంవల్ల ఇలా దౌర్భాగ్యజన్మని ఎత్తారు. ఇప్పుడు విష్ణువువల్ల వీరికి చావు కల్గింది. తర్వాతి జన్మల్లో వీరు నిరంతరం ఆ శ్రీహరి నిత్యవాసమైన వైకుంఠంలోనే ఉంటారు. ఇక వీరికి చావుపుట్టుక లుండవు.
ఆ యోగీంద్రులు అలా రక్కసుని అదృష్టాన్ని గాంచి ఆశ్చర్యచకితులయ్యారు. తర్వాత పవిత్రదేహం ధరించినవాడును, వికసించిన కమలాలవంటి కన్నులు గలవాడును, దేవతలు, మునులు, యోగులు మొదలైన వారిని రక్షించేవాడును, రక్కసులనే ఏన్గులకు సింహసమానుడును నైన శ్రీమన్నారాయణుని చూచారు.
హిరణ్యాక్ష వధను చేసిన శ్రీహరిని చూచి,
"పద్మాక్షా! ఈ భూలోకవాసుల మాయామర్మాలు నీకు బాగా తెలుసు. అసూయతో పగబట్టిన ఈ హిరణ్యాక్షుణ్ణి చంపావు. ఇకమీదట అందరికీ శుభం కలుగుతుంది." అని దేవతలందరు తమ నొసళ్ళపై చేతులుంచి గొప్పజ్ఞానంకలవాడు మరియు పుణ్యాత్ముడు అయిన శ్రీమన్నారాయణుని వినయంతో స్తుతించారు.
ఎల్లదేవతలు, మునులు, ఋషులు హరిని సుతించిన తర్వాత
యజ్ఞవరాహరూపధారియైన శ్రీహరి రక్కసుని చంపాక, బ్రహ్మ మొదలైన దేవతలు, మునులు ఆయన్ని ప్రస్తుతిస్తుంటే తన మనస్సులో ఆయన మహానంద మొందాడు. అందరికి ఉల్లాసం కల్గేట్లు అనుగ్రహంతో చూశాడు.
అదొక గొప్పవేడుక. దానికి గుర్తుగా అప్పుడు విష్ణువు వైకుంఠపురానికి తరలి వెళ్ళాడు. దేవతలభేరులు ముమ్మరంగా మ్రోగాయి. నేలపై పూలజల్లు కురిసింది. అగ్నిగుండాలు ధగధగ వెల్గాయి. సూర్యచంద్రమండలాలు దేదీప్యమానంగా ప్రకాశించాయి.
ఇది పవిత్రమైన కథ. బ్రహ్మ దీన్ని దేవతలకు చెప్పాడు. అదే కథని మైత్రేయుడు విదురునికి చెప్పటంవల్ల ప్రఖ్యాతమైంది.
ఈ కథను శుకమహర్షి మంచిమనస్సుతో పరీక్షిన్మహారాజుకు చెప్పాడు. సూతుడనే పౌరాణికుడు శౌనకాది మునులకు ఇదే కథని మనోజ్ఞంగా విన్పించాడు.
ఆ విధంగా మైత్రేయముని విదురునికి కథను చెప్పగా విని ఆయన సంతోషించాడు.
పుణ్యప్రదమైన ఈ చరిత్రను విన్నా చదివినా ప్రజలందరికి శ్రీహరి పాదసేవ, ఇహలోక పరలోకసౌఖ్యాలు, మరియు గొప్పపేరుప్రతిష్టలు చేకూరుతాయి.
మళ్ళీ సూతుడు శౌనకాదులతో ఇలా అన్నాడు.
"పరీక్షిత్తు శుకమహర్షిని చూచి మునీంద్రా! హిరణ్యాక్షుడు చనిపోయాక భూదేవి నిలకడను పాందిన విధాన్ని, స్వాయంభువమనువును పుట్టించిన తరువాత బ్రహ్మ సమస్తమైన పశుపక్ష్యాదుల్ని మానవుల్ని సృష్టించడానికి అనుసరించిన పద్ధతుల్ని మహాభక్తుడైన విదురుడు, శ్రీకృష్ణునకు అపకారం తలంచిన పాపాత్ములైన కౌరవులను వదలి వెళ్ళిపోయి, తన తండ్రియైన వేద వ్యాసునంతవాడై మనస్సు, వాక్కు శరీరం అనే త్రికరణాల్ని శ్రీకృష్ణపరమాత్మవశంచేసి, భక్తులు సేవిస్తుండగా పుణ్యతీర్థాటనవల్ల సమస్తపాపాలనుండి విముక్తుడై మైత్రేయమునిని ఏ యే ప్రశ్నలు అడిగాడో అవన్నీ తెలిసేట్లు వివరించమని పరీక్షిన్మహారాజు శుకమహర్షిని ప్రార్ధించాడు.
"వాక్చాతుర్యం గల మహాత్మా! సకల సృష్టికి మూలపురుషుడైన బ్రహ్మ ప్రజలను సృష్టించే మనువుల్ని పుట్టించాక ఇంకేమి సృజించాలనుకొన్నాడు? బ్రహ్మ సృష్టించిన మరీచి మొదలైనవారు బ్రహ్మాదేవుని ఆజ్ఞానుసారంగా ఈ విశ్వసృష్టి ఎలా చేశారు? వారు భార్యాసమేతులై ఎలాంటి సృష్టిచేశారు? భార్యా రహితులై ఎలాంటి సృష్టిచేశారు?" అని పవిత్రమైన మనస్సుగల విదురుడు మైత్రేయుని అడిగాడు.
"ఓ కరుణార్ద్ర హృదయా! వివేకజనస్తుత! మైత్రేయా! అందరూ తమలో తామైక్యం చెంది దేనిని, దేనిని సృష్టించారు? ఇవన్నీ మాకు వివరించి చెప్పండి" అని ప్రార్థించాడు.
చతుర్ముఖుండొనర్చు యక్షాదిదేవతాగణ సృష్టి దెలుపుట
Subscribe to:
Post Comments (Atom)
The Battle Between Boar Varaha Avatar and Hiranyaksha - హిరణ్యాక్షుండు యజ్ఞవరాహంబగు హరినెదిరించి పోరుట
హిరణ్యాక్షుండు యజ్ఞవరాహంబగు హరినెదిరించి పోరుట నారదుడు పాతాళానికి పొమ్మని చెప్పగానే హిరణ్యాక్షుడు అగ్గిలాగ మండి పడ్డాడు. విష్ణువుతో తలపడి తీ...
-
సూర్య ద్వాదశ నామాలు ధ్యేయః సదా సవితృమండలమధ్యవర్తీ నారాయణః సరసిజాసన సన్నివిష్టః । కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటీ హారీ హిరణ్మయవపుః ధృతశంఖచక్రః ...
-
ఆదిత్యహృదయం తతో యుద్ధపరిశ్రాంతం సమరే చింతయా స్థితమ్ | రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితమ్ || 01 || దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతో ...
-
శ్రీ దేవీ భాగవతము నవమ స్కంధములోని శ్రీ సరస్వతీ కవచం ఓం శ్రీం హ్రీం సరస్వ త్త్యై స్వాహా -శిరో మే పాతు సర్వతః | ఓం శ్రీం వాగ్దేవతాయై స్వాహా -ఫ...
No comments:
Post a Comment