Friday, February 27, 2026

Sage Narada instructed the five-year-old Prince Dhruva to chant the twelve-syllabled Vishnu mantra: "Om Namo Bhagavate Vasudevaya" - ధ్రువు౦డు నారదోపదేశంబు వడసి తపంబు సేయుట

ధ్రువు౦డు నారదోపదేశంబు వడసి తపంబు సేయుట

స్వధర్మాన్ని వెల్లడింపచేసే తదేకమైన మతితో ఆ దేవుణ్ణి పూజించుకో, ఆ ఘనుడైన విష్ణుమూర్తి కన్న నీ చింతను తీర్చేవారు మరెవ్వరూ ఉండబోరు అని సునీతి తేల్చి చెప్పింది. ఆ తల్లి మాటలు నచ్చాయి. అవి ప్రయోజనవంతమైన కార్య సాఫల్యానికి మూలకారణా లన్పించాయి. తనను తానే కట్టడి చేసుకున్నాడు. పట్టణం దాటిపోయి వెళ్తున్నట్టి సమయంలో నారదుడికి ఈ విషయం మూలముట్టుగా తెలియవచ్చింది. ధ్రువుడి దగ్గరకు చేరుకున్నాడు. ఆ ధ్రువుడి అభిలషిత కర్తవ్యాన్ని అర్ధం చేసుకున్నాడు. పవిత్రమైన తన చేత్తో ధ్రువుడి తలను నిమిరాడు. అహో! తమ ఆత్మగౌరవ విఘాతాన్ని తట్టుకోలేని క్షత్రియుల తేజం చిత్రం కదా! ఈ చిఱుతవయస్సులో చిన్నతల్లి పరుషమైన మాటలకు బెంగ పెట్టుకొని ఇలా వెళ్లి పోతున్నట్లున్నాడనే భావం చాల చిత్రంగా అన్పించింది. ఓ బుడుతడా! సర్వ భోగభాగ్యాలతో నింపుగల ఇంటిని కాదని ఇలా ఏకాకిగా ఎక్కడికని పోతావు. నీకు కావాల్సిన వాళ్లు చేసిన నిరాకరణం నిన్ను బాగా దిగాలు పరచిందని నా కన్పిస్తుంది. అనగానే ధ్రువుడు ఇలా పలికాడు. సవతితల్లి పలుకులనే ములుకుల తాకిడి గాయాన్ని 'దైవధ్యానయోగం' అనే తృప్తికరమైన మందుతో మాన్పుకుంటాను అన్నాడు. ఆ వాక్కులు విన్న నారదుడు ఆ ధ్రువుడితో ఇలా అనునయంగా చెప్పాడు.

ఓ తండ్రీ! విను. నువ్వు చిఱుతడివి. ఎపుడూ ఆటలమీది అపేక్షతో మనసారా తిరుగుతూ కాలంగడిపే కుర్రవయస్సు నీది. అవమర్యాద, మర్యాదలు పట్టని చిన్నతనం నీది.

అవమానం, మానం గూర్చిన విభేదజ్ఞానం నీకీ చిన్నవయస్సులో ఉండినా ఉండవచ్చు. అయినా సుఖజీవులకు ఆ మంచిచెడు విడమరచి చెప్పే నేర్చు వారివారి పూర్వకర్మానుసారంగా తట్టుతూ ఉంటుంది. అందువల్ల ఎక్కువ సుఖాలు గాని, ఎక్కువ దుఃఖాలుగాని అవిచ్చిన్నంగా పొందుతుంటారు.

కాన వివేకి తనకు దక్కిన సుఖదుఃఖాలు ఈశ్వరాధీనం అనుకుంటాడు. ప్రాప్యమైనంతలో సంతుష్టుడవుతుంటాడు. "నీవుకూడా నీ తల్లి చెప్పినట్టి ధ్యాన యోగశాస్త్ర పద్ధతితో ప్రవర్తించి ఆ జగన్నాథుని దయను సంపాదిస్తాను" అని అంటావనుకో.

నిష్కల్మషుడా! మహా మహా యోగీశ్వరులంతా తెంపులేని భూలోకజన్మల్లో సంసారం పట్టక సదా మనన మతితోనే ఉంటారు. ధర్మబద్ధంగా శ్రద్దాళువులై యోగసాధన చెస్తారు. నిశ్చలసమాధి యోగస్థితిలోనూ ఆ దైవం తెరవును ఆ యోగులు కనుక్కో లేకున్నారు. అందువల్ల నీకు కేవలం ఆరాధన మాత్రాన ఆ దైవం శక్యుడు గాడు. ఈ అదనులో వృథా అయిపోయే ఆ యోగవిద్యాభ్యాసప్రయత్నాన్ని విరమించు. అలా కాదు ముముక్షువును కాదలచాను అంటే ఆ పూనిక పట్టు. కావడికుండలవంటి సుఖదుఃఖాలు రెంటిలో ఏది ఎంత విధివిహితంగా సంప్రాప్తిస్తుందో అంతే ఆత్మసంతృప్తితో ఈ విశ్వంలో మనగల్గినవాడు నిజమైన విజ్ఞానిగా పేరుపొందుతాడు.

ఆ విజ్ఞాని ఇంకా సద్గుణవంతుణ్లి చూసి మురియాలి. గుణవంతుడివలె నటించేవాళ్లమీద దయతలవాలి. సరిసాటి వారితో చేతులు కలపాలి. ఇలా ఉంటుండేవాడు ఆధ్యాత్మికాది కష్టాలు మూటినీ, విడనాడ గల్గుతాడు అని నారదుడు తెలియచెప్పాడు. అది విని ధ్రువుడు ఇలా అన్నాడు. ఓ పావనుడ! ఈ మెతకస్వభావం సుఖదుఃఖ పీడిత మనస్కులకు పొంద వీలుకానిదని అపారదయామయుడవైన నీనోట విన్నాను. అలాంటపుడు శత్రువులకు దడపుట్టించే రాచగుణం నాది. వినమ్రత లేక పోవడం సహజం. అలాంటి నేను సురుచి దురుసు మాటల బాణాల పెట్టువల్ల పగిలిన గుండె కలవాడను. అందువల్ల నా ఎదలో శాంతిపాఠం నిలకడగా పట్టి ఉండదు. కాన మూడులోకాల్లోకి మేల్తరమైంది, మరొకరిది కానిది, వాసయోగ్యమైనది అయిన చోటును పొందాలని ఆశపడుతున్నాను. నా కొక మంచి దోవనుచూపు. నువ్వు పరదైవం అయిన బ్రహ్మ తొడనుంచి పుట్టినవాడవు. వీణావాదనంలో బహు నేర్పరివి. ఈ లోకం శ్రేయస్సు కోసరమే సర్వం సంచరిస్తుండే అపరసూర్యుడివి అనగానే విని

నారదుడు ధ్రువుడితో మళ్లీ ఇలా అన్నాడు. ఓ పుణ్యుడ! ఓ బిడ్డ! విను. నిన్ను ఇపుడు ముక్తి పథానికి ప్రేరేపించినవాడు. ధీరోత్తములలో ముఖ్యుడైన వాసుదేవుడే

నువ్వన్నూ ఆ కీర్తిమంతుణ్ణి తెరపి ఇవ్వని తదేకమైన ధ్యానం వైపుకే మొగ్గు చూపే మనస్సుతో ఆరాధించు.

'కావాలని మనుజుడు ధర్మార్ధ కామమోక్షాలవల్ల కలిగే మంచిని నేనూ లోపల పొందాలి అని కోరుకుంటే ఆ శ్రేయస్సిద్ధికి మూలం విష్ణుపాద పద్మసేవనం తప్ప మరొక దారి కానరాదు.

గుణమనోహరా! శ్రేష్ఠయిన యమునానది ఒడ్డున మధువనం ఉంది. అది అతి పవిత్రమైంది. పుణ్యప్రదమైంది. ప్రసిద్ధమైంది. ఈ క్షేత్రం విష్ణు సన్నిధికలది. అక్కడకు వెళ్లు. నీకు శుభం కల్గుతుంది.

శుభ్రమైన ఆ యమునానది జలాల్లో మునుకలు వేసి, ఆ క్షేత్రంలోని నారాయణమూర్తికి అత్యంత శ్రద్ధతో మొక్కుకో. సంసిద్ధమైన తలంపుతో యమనియమాలను ఆచరించు.

ఇంకా నువ్వు పసివాడవు. వేదం వల్లించడం వంటి తదుచిత కర్మలకు తగని వయస్సువాడవు. అయినా కూడా నీకు యుక్తంగా ఉండే కుశలు, జింక చర్మాలను స్వస్తికం మొదలైన యోగాసనాలను ఏర్పరచుకో. తడవకు మూటి చొప్పున మూడు తడవులు ప్రాణాయామం చెయ్యి. ప్రాణం, ఇంద్రియం, మనస్సు వీటిలోని దోషాల్ని నిలుకడ లేని మనస్సువల్ల దొర్లే పొరపాట్లను తుడిపేసుకో, దిట్టపడ్డ హృదయంతో.

తన రక్షణను అర్జించి వచ్చిన వాళ్లకు మంచి దయను చూపడానికి సంసిద్ధమై ఉండేవాడు, ప్రకాశవంతమైన ముఖం, నిర్మలమైన చూపులూ కలవాడూ, కోటేరులాంటి ముక్కు వంపుదీరిన రెండు కనుబొమలు, పాలుగారే బుగ్గలూ కలవాడు, వంకలులేని చక్కనైనవాడు, ఇంద్రనీలంపు సొంపులు ఒలికే ఒంటితీరు కలవాడు, మిసమిసలాడే ప్రాయం కలవాడు, ఎర్రని కన్నులూ, పెదవులూ కలవాడు, కరుణకుకడలి వంటివాడు, ధర్మార్థకామమోక్షాలకు ఆశ్రయుడు, భక్తులకు ఆశ్రయమైనవాడు అందరి బాగు కోరేవాడు, శ్రీవత్సమనే పుట్టుమచ్చతో ఎంచబడేవాడు, యావన్మందికీ దిక్కయినవాడు, సర్వానికీ సాక్షి భూతుడు, మహా మానవలక్షణం కలిగిన పుణ్యశాలి, నీలిమబ్బు చాయవాడు, మార్పులు లేనివాడు

నూటెనిమిది పేటల ముత్యాలపేరు, మకుటం, సందికడియాలు, కడియాలు వంటినగలు దిట్టంగా తొడిగినవాడు, ఆలనలో పెనుపరి అయినవాడు, మొలకు అందం తెచ్చే మొలనూలు, చెవుల్లో నప్పిన కుండలాలు, వక్షాన ఘనంగా అగుపించే కౌస్తుభమణి ధగధగలతో మెరిసిపోతున్న కంఠహారం తాల్చినవాడు, ఉల్లాసకరుడు, మనోహరమైన శంఖం, చక్రం, గద, పద్మము పట్టిన చేతులు కలవాడు, విశ్వవిఖ్యాతుడు, పుట్టుకలేనివాడు, గుప్పున గుబాళించే వనమాలికను వేసుకున్నవాడు, అజ్ఞానాన్ని తరిమికొట్టేవాడు, పసుపు పచ్చటి కొత్తపట్టుదైన పుట్టం కట్టినవాడు, అపరంజి మంజీరాలు పెట్టినవాడు, అత్యంతమైన మంచితనం గూడుకట్టినవాడు, చూడముచ్చటైనవాడు,

మంచిభావాలు నిండిన మనస్సుకూ, నేత్రాలకూ ఉల్లాసం కలిగించేవాడూ, హృదయమనే పద్మం దుద్దులో నివసించే విరివిగా వెలుగులు చిమ్మే, పెద్ద నఖాలనే మణులు అలంకారంగాగల పదపద్మయుగళుడూ, సాటిలేని మృదుహృదయుడూ మహాపురుషుడూ.

అలాంటి పురుష పుంగవుణ్ణి ఆరాధించు. మనసులో నెలకొన్నవాడూ; ప్రీతిగల చూపుకలవాడూ; కోర్కెలు తీర్చ ఉత్తముడూ; అయిన ఆ విష్ణుమూర్తిని ఏకాగ్రచిత్తంతో నిశ్చలంగా నిలిపి స్మరించుకో, గొప్ప ముక్తి సాధనమార్గంతో తపస్సు చెయ్యి. అలా ప్రతిష్టితం అయిన ఆ దివ్యమంగళరూపం తిరుగు ముఖం పట్టదు. అంతేకాదు ఏ మంత్రాన్ని ఏడు పొద్దులు జపిస్తే ఆ దివ్యులను చూడగల శక్తి అలవడుతుందో, అలాంటిదే ఓంకారంతో కూడిన పన్నెండక్షరాల వాసుదేవమంత్రం. ఇది ఏ ప్రదేశంలో ఏ వేళలో ఎలా విభక్తమో, తెలిసిన వివేకులు అనుష్టించే మంత్రం. ఈ మంత్ర మననంవల్ల

("ఓం నమో భగవతే వాసుదేవాయ" అనేది ద్వాదశాక్షరీమంత్రం. దీనికే 'వాసుదేవద్వాదశాక్షరి' అని నామాంతరం.

గడ్దిపరకల బోలిన చామనచాయకల వాసుదేవుణ్ణి గరికపోచలతో అర్చించాలి. చక్కనైన పద్మాలవంటి నేత్రాలు కలవాణ్ణి పద్మాలతో పూజించాలి. తులసిమాలలు తాల్చే వాణ్ణి మూడాకుల తులసిరెమ్మలతో సేవించాలి. నిష్కళంకమైన చరిత్ర కలవాణ్ణి పూలమాలలతో, గరుడపక్షి రెక్కలమీద విహరించేవాణ్ణి ఆకులతో, లోకాలకు మూలదుంపవంటి పరమేశ్వరుణ్ణి వనమూలికలతో, పసుపుపచ్చటి పట్టుపుట్టం కట్టుకునేవాణ్ణి చెట్టుబెరడుపట్టలతో నేసిన నారబట్టలతోనూ, భజించాలి. మన్నుతో, రాయితో, కొయ్యతో దిద్దిన విగ్రహమూర్తుల్లో గాని, ప్రసిద్ధమైన పుణ్యతీర్థాల్లో గాని, క్షేత్రాల్లో గాని ఆ నారాయణుణ్ణి కొలవాలి.

మనస్సు నిగ్రహించుకోవాలి. మృదుస్వభావం కావాలి. సంభాషణలను కట్టడి చేసుకోవాలి. సదాచారం తెలియాలి. స్తుతిమంతుడైన హరియొక్క శ్రేష్ఠ గుణాలను అలవరచుకోవాలి. కందమూలాదులను మితంగా తినాలి. ఈ తీరుగా ప్రవర్తిస్తూ ఉండాలి.

కీర్తనీయుడైన ఆ దైవం తన ప్రకృతితో తన ఇచ్చవచ్చినట్లు అవతారాలు ఎత్తుతాడు. ఊహాతీతంగా కావించే ఆయన లీలలను మనస్సుకు పట్టెటట్లు తలంచుకోవాలి. అంతేకాదు కార్యాచరణ బుద్ధితో చేసే పూజాదిక సేవలన్నింటిని ద్వాదశాక్షర వాసుదేవమంత్రంతోనే ఆ దైవానికి పొందించాలి. ఇలా త్రికరణ శుద్దిగా చేసిన కర్మలతో గుండెల్లో నిలిచిపోయేలా భక్తి పూజలతో ఉపచరించాలి. ఆ భగవన్మాయకు లోనుకాని ఆరాధకులకు, చతుర్విధపురుషార్థాల్లో కోరింది కోరినట్టుగా ప్రసాదిస్తాడు. విరాగి అయినవాడు నిత్యం స్మరిస్తూ భక్తియోగంచేత ముక్తికోసం భజిస్తాడు అని దేవర్షి చెప్పగా విన్నాడు. ఆ ధ్రువుడు నారదుడికి, ప్రదక్షిణలు చేసి నమస్కరించాడు. ఆ తరువాత ఋషిలోకసేవ్యమైనట్టి సకలఫలప్రదమైన, ఆ పరాత్పరుడి పాదపద్మాలచే అలంకరించబడి మధువనానికి వెళ్లాడు.

బ్రహ్మకుమారుడు నారదుడు ఉత్తానపాదుడి దగ్గరకు పోయాడు. ఆ రాజుచే పరిపరివిధాల గౌరవం పొందాడు. ఎంతో తృప్తిచెందాడు. ఎత్తయిన పీటమీద సుఖోపవిష్టుడై ఆ రాజువంక చూచి

ఇలా పల్కరించాడు.

ఓ అధిపా! నీ ముఖం వాడిపోయి ఉంది. నువ్వు బాగా చిన్నబోయి ఉండడానికి కారణం ఏమిటి? అన్న నారదుడితో ఆ భూపతి ఇలా బదులు చెప్పాడు.

ఓ నారదా! మంచి వివేకం కలవాడూ, ఏ పాపం పట్టనివాడూ, ఐదేళ్ల అర్భకుడు నా ప్రియపుత్రుడు. ఆ పసివాడి మీదజాలి చూపకపోగా నేను అవమానించాను. తల్లిని తీసుకొని తాను ఎక్కడికో వెళ్లిపోయాడు.

అలా వెళ్లి వెళ్లి భయంకరమైన చిట్టడవుల్లోకి దూరి పోయి ఉంటాడు. నడచినడచి సొలసిపోయి, ఉంటాడు. ఆకలి నొప్పికి మెలికలు తిరిగిపోయి ఉంటాడు. కళకళలాడే ఆ మోము మరీ వాడిపోయి ఉంటుంది. అభం శుభం తెలియని ఆ పసివాడు తోడేళ్లు, పాములు, ఎలుగుబంట్లు, ఇత్యాది వన్యప్రాణుల వాతపడ్డాడేమోనని దుఃఖిస్తున్నాను.

ఓ మునివర్యా! అంతటి ఉత్తముడయిన నా కొడుకును నా ఒడిలోకి తీసుకోకుండా నిర్లక్ష్యం చేశాను. నా కాంత మీది ఆసక్తితో చేసిన ఈ దుండగం నా పనే.

ఆ ఉత్తానపాదుడి మాటలు విన్నాక నారదుడు ఆ రాజుతో ఇలా అన్నాడు. ఆ విష్ణువు దేవతల కిరీటపు రత్నకాంతులతో విలసిల్లే చరణకమలాలు కలవాడు. పద్మదళనేత్రుడు. అట్టి ఆ భగవానుడు పిల్లవాణ్ణి కాపాడుతున్నాడు. సమస్తలోకాలు మెచ్చే యశస్సంపన్నుడు. శుభప్రవర్తనం కలవాడు. అయిన నీ పిల్లవాడి గురించిన దిగులు నీ కెందుకు?

ఆ మహానుభావుడు విష్ణుదేవుని సేవించి సమస్త దిక్పాలకులకూ పొందరాని నిత్యపదానికి అధీశ్వరు డవుతాడు. లోకపావనుడయిన నీ కొడుకు ప్రభావం నీకు తెలియదు రాజా!

అంతేగాక, నీ వంశప్రతిష్టను ఈ జగం అంతా యుగాంతపర్యంతం నిలుపగలడు. అతడు సద్గుణాల సముద్రుడు. నీ రాజధానికి తప్పక తిరిగి వస్తాడు. ఓ శుభచరితా! ఆ ధ్రువుణ్ణి గూర్చిన దిగులు మానుకో.

అని నారదుడు చెప్పిన మాటలమీద మంచినమ్మకం ఏర్పడింది. ఉత్తానపాదుడి మనసు అంతా కొడుకు తలపోతలతోనే నిండిపోయి రాచరికం శూన్యంగా తోచింది. రాచకార్యాలను అసలు పట్టించుకోవడం మానేశాడు.

అటు పై ఆ అడవుల్లో ధ్రువుడు పోగా పోగా అతడికి మధువనక్షేత్రం ఎదురపడింది. ఆ క్షేత్రం మునులు, దేవతలు, యోగులు స్తోత్రం చేసిన సద్గుణాలతో శుద్ధమైన చోటు. దుష్టజీవలోకమనే మబ్బుల్ని విడగొట్టే వాయువు వంటిది. సుకృతాలకు ముఖ్యస్థావరం వంటిది.

తన ముందరనే కనపడుతున్న మధువని చేరుకున్నాడు. యమునా నదిలో స్నానం కావించాడు. వ్రతం పట్టినవాడై మనసును కుదుటపరచుకుని ఆ విష్ణుమూర్తిని పదేపదే ధ్యానించాడు. మూడురాత్రులకు ఒక్కసారి వెలగ, రేగు పళ్లను వ్రతసమాప్తి ఆహారంగా తీసుకుంటూ కాలం వెళ్లబుచ్చాడు. శరీరం నిలుకడను బట్టి ఒక్కనెలపాటు ఇలాగే ఆ మధువనస్వామిని ఆరాధించాడు. ఆ పై రెండో నెల ప్రారంభంనుంచి ప్రతి ఆరుదినాలకూ ఎండుగడ్డి పరకలు, పండిరాలిన ఆకులను మాత్రమే నములుతూ ఆ నారాయణుని పూజించాడు. మూడో నెల మొదటినుంచి తొమ్మిది దినాలకొకసారి ఆ ఆకులలములు మాని జలం మాత్రమే పుచ్చుకుంటూ మాధవుణ్ణి సేవించాడు. నాల్గో నెల మొదలైనప్పటి నుంచి పన్నెండేసి దినాలకొక పర్యాయం ఆ నీటినికూడ తాగడం మాని గాలిని మాత్రమే ఆరగిస్తూ ఊపిరులను అనుకూలపరచుకుంటూ; ఆ పుండరీకాక్షుని సేవలతో తరించాడు. ఐదోమాసం రాగానే శ్వాసను బంధించి మనస్సు అలపు చెందని రీతిన ఒంటి కాలిమీద నిలబడి ఆ పరంధాముణ్ణి ధ్యానిస్తూ జీవంలేని మోడువలె కాలం పుచ్చాడు.

సర్వ సూక్ష్మ భూతాలకూ పంచేంద్రియాలకూ ఆధారమైన చిత్తంలో శబ్దాది విషయాలకు వేటికీ కుదురు కల్పించలేదు. మహత్తు మొదలైన పరతత్త్వస్వరూపాదులకు ఆశ్రయం ఇచ్చే ప్రకృతి పురుషులకు యజమానుడైనట్టి శాశ్వతబ్రహ్మ స్వరూపుడైనట్టి పరబ్రహ్మమును తన డెందంలో లగ్నం చేసుకున్నాడు. విష్ణువుకన్న మరోరూపం గూర్చిన చింతనలేకుండా తన మనస్సును ఆ పరబ్రహ్మమందే నిలిపి ఉంచాడు. ఆ ఘోరతపస్సుకి ముల్లోకాలూ గజగజలాడి పోయాయి. అంతటితో ఆగక మరింత పెచ్చుగా ఆ పిల్లవాడు నేలమీద ఒంటి కాలిమీద నిలుచుండి కాలిబొటన వ్రేలితో నొక్కుతూ ఉండగా.

అడ్డూ ఆపూలేని మదగజం పాదం మోపిన వైపుకు ఒరగిపోయే ఓడవలె నేల సగం సగంగా అటూ ఇటూ వాలిపోతూ ఊగడం మొదలు పెట్టింది.

ధ్రువుడు తదేకదృప్టితో చరాచరప్రపంచంలోని సర్వజీవుల ప్రాణాయామపు ఉనికిని పొంది ఉన్న ఆ ఈశ్వరునిలో తన ప్రాణాన్ని చేర్చాడు. ఆ ఐక్యతను పొందడానికి ఊపిరిని స్తంభింప చేసిన కారణంగా విష్ణువూ చలించిపోయాడు. ఆ సర్వేశ్వరుని చలనానికి లోకాలన్నీ తూగాడాయి.

చూపులకే జడుపు పుట్టించేలా లోకాలకు ఉప్పతిల్లిన ఆ పెద్ద ఉపద్రవస్థితిని పరికించారు దిక్పాలకులు. ఆ పాలకులంతా భయంతో గుంపుగా ఆ విశ్వశరణ్యుని దర్శించాలని బయలుదేరిపోయారు.

అలా వెళ్లి ఆ నారాయణునికి మొక్కుకుంటూ అంజలి ఘటించి ఇలా మొరపెట్టుకున్నారు.

ఓ హరీ! ఓ పరమాత్మా! కేశవా! చరాచరప్రాణికోటి శరీరాలను తాల్చిన వాడవు నువ్వే. కాని ఈ ప్రకారంగా అందరి శ్వాస ఒక్కమారుగా ఆడక పోవడం ఇంతకు మునుపు ఎన్నడూ మేం కని విని ఎరుగం. ఓ విశ్వనాథ! సర్వ శరణ్య! నీ పాదపద్మాలను అత్యంతప్రీతితో శరణు పొందుతున్నాం. ఈ మా పీడను బాపి ఆదుకోవా!

ఆ నారాయణస్వామి దేవతల మనవిని విన్నాడు. వాళ్ల కిలా ధైర్యం చెప్పాడు. ఆ బుడుతడు ఉత్తానపాదుడనే రాజుబిడ్డ. విశ్వాత్మకుడనైన నా యందు తన మనస్సును లీనం చేసి ఏకాగ్రతతో తపస్సు చేస్తున్నాడు. ఆ ఘోరతపం మూలంగానే మీ ఊర్పుల కదలిక ఆగిపోయింది. అలా అతిక్రమింప వీలులేని ఆతడి తపస్సును వెనక్కి మళ్లింపచేస్తాను. మీ గృహాలకు మీరు వెళ్లండి అని ఆజ్ఞాపించాడు. ఆ దేవతలు ఏ జంకూ లేనివారలై ఆ విష్ణుమూర్తికి నమస్కరించి నిశ్చింతగా తమ దివిసీమకు తిరిగి వెళ్లారు. ఆ తరువాత

వాళ్లంతా అటు వెళ్లగానే నారాయణుడైన ఆ విశ్వప్రభువు, పక్షుల్లో ఉన్నతుడైన గరుడుని వాహనంగా చేసుకొని తన భక్తుడు ధ్రువుణ్ణి చూడాలని వేడుకపడి ఆ వెంటనే తిన్నగా మధువన క్షేత్రానికి కదలివెళ్లాడు. మిక్కుటం అయిన భక్తి యోగసాధనతో ధ్రువుడి బుద్ధి పదనెక్కింది. తన మనస్సనే విచ్చీవిచ్చని తామరమొగ్గలో మెరుపు మెరిసినట్లు తళుక్కుమన్న ఆ సర్వ వ్యాపకమూర్తిమత్వం అంతరాన అంతర్ధానమయింది. ఆ మరుక్షణంలోనే తన ఎదుట ప్రత్యక్షమైంది. ఆ పూర్వ, అపూర్వజ్ఞాన చక్షువులకు ఇంతదాకా పొడగట్టిన ఆ నిండు రూపాన్ని కళ్లు విప్పి తిలకించాడు. తత్తరపడ్డాడు. ఆనందబాష్పాలు రాల్చాడు. ఒళ్లంతా పులకించి పోయింది.

సాక్షాత్కరించిన భగవంతుని ధ్రువుండు స్తుతించుట

No comments:

Post a Comment

After receiving blessings for his devotion and an exalted position, a mature Dhruva returns to his kingdom to be welcomed by his father, King Uttanapada - ధ్రువుండు మరల దన పురంబునకు వచ్చుట

ధ్రువుండు మరల దన పురంబునకు వచ్చుట అంటూ ఆ ధ్రువుడు దుఖపడ్డాడు. ఆ మైత్రేయముని విదురుడితో ఇలా చెప్పాడు. మనోహరమైన శ్రీహరి పదపద్మరేణువులచే సంస్కర...