Wednesday, February 25, 2026

Genealogical History of Swayambhuva Manu - మైత్రేయుండు విదురునకు స్వాయంభువ మనువుత్రికల వంశవిస్తారంబు దెలువుట

మైత్రేయుండు విదురునకు స్వాయంభువ మనువుత్రికల వంశవిస్తారంబు దెలువుట

ఓ రాజా! వినండి. విదురుడితో మైత్రేయమునీంద్రుడు తిరిగి ఇలా చెప్పసాగాడు. స్వాయంభువ, శతరూప దంపతులకు ముగ్గురు కూతుళ్లూ, ఇద్దరు కొడుకులూ ఎంతో ఇంపుగా పుట్టారు. వారు ఆకూతి, దేవహూతి, ప్రసూతి, ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు. వీళ్లల్లో తొలిబిడ్డ ఆకూతిని మనువు, రుచి అనే ప్రజాపతికి ధర్మపత్నిగా చేశాడు. మనుమలు, మునిమనుమల పరంపర కోసం కలుపుకుంటున్న ఈ సంబంధాన్ని శతరూప కూడా సంతోషంగా సమ్మతించింది.

(సుమహిత భ్రాతృమతిని - శ్రేష్ఠులగు సోదరులుగల దానిని - అని ఆకూతిని వర్ణించడం గమనార్హం. పితా న జ్ఞాయతే యస్యా భ్రాతా యదినవిద్యతే,
నోపయిచ్చేత్తు తాం కన్యాం ధర్మలోపభయాత్యుధీః 
అన్న ధర్మశాస్త్రోక్తి ననుసరించి సోదరుడు గల కన్యను పెండ్లాడడం సముచితమన్న దృష్టితో ఇలా వర్ణించడమైనది.)

అలా పెళ్లి జరిగిన రుచిప్రజాపతి, బ్రహ్మతేజస్వి, ఉన్నతుడు, సమబుద్ధితో మనస్సును లోబరుచుకోగలవాడు అవడం వల్ల ఆకూతి కడుపున విష్ణువు అంశతో యజ్ఞుడనే మగవాడూ, విష్ణుమూర్తిని ఎపుడూ విడిచి ఉండని(ఎడబాటు ఎరుగని) జగన్మాత ఆదిలక్ష్మి అంశతో 'దక్షిణ' అనే పడుచూ జంటగా పుట్టారు. మంచివర్చస్సు కలవాడూ, విష్ణుమూర్తి స్వరూపుడూ, తన దౌహిత్రుడూ అయిన యజ్ఞుణ్ణి, స్వాయంభువమనువు ఎంతో సంతోషపడుతూ తన ఇంటికి తీసుకుని వెళ్ళాడు. సత్వ ప్రకృతిగల తన కూతురు 'దక్షిణ'ను రుచిప్రజాపతి తనయొద్దనే ఉంచుకున్నాడు. సకల మంత్రాధిదేవత అయిన శ్రీయజ్ఞుడు, తననే వరించాలనే ఉద్దేశంతో ఉన్న 'దక్షిణ'ను పెళ్లాడాడు. వాళ్లు ఆది దంపతులు కాబట్టి అన్నాచెల్లెళ్ల వరుసగల ఆ ఇద్దరి పెళ్లి ఎవరికీ నిషేధింపదగినది కాలేదు. (సరికాదనిగాని జరుగరానిదని కాని అనిపించనిదని భావం) అని చెప్పి మైత్రేయుడు మళ్లీ ఇలా చెప్పడం మొదలుపెట్టాడు.

(ఈ విశిష్టవివాహవిధి నిషేధింపతగినది కాదని భావం. ఎందుకంటే తరువాతతరువాత వధూవర కులగోత్రాల నియమాలు అప్పటికి ఏర్పడినవి కావు.)

ఓ విదురా! దేవతలచేత పొగడబడిన పుణ్యదంపతులు దక్షిణాశ్రీయజ్ఞులకు అతిబలవంతులైన “యామ” అనే పేర్లుగల పిల్లలు కలిగారు.

(యామములు అంటే జాములు అని అర్ధం. ఒక రోజులోని (పగలు, రాత్రి) 12 కాలభాగాలు. ఒక్కొక్క భాగం ఒకరాశి ప్రమాణంతో ఉంటుంది.)

తోషుడు, ప్రతోషుడు, సంతోషుడు, భద్రుడు, శాంతి, ఇడస్పతి, ఇధ్ముడు, కవి, విభుడు, వహ్ని, సుదేవుడు, రోచనుడు అనే పన్నెండుమంది పిల్లలు పుట్టారు. వీళ్లే స్వాయంభువ మన్వంతర కాలంలో 'తుషితులు' అనే పేరుతో దేవతలుగా ప్రసిద్ధిని పొందారు. ఇంకా ఆ మన్వంతరంలోనే మరీచి మొదలైన మునినాథులూ, యజ్ఞుడూ, ఇంద్రుడూ ఇంకా కాంతిమంతులైన ప్రియవ్రత ఉత్తానపాదులునూ ఆ కొడుకులూ, మనుమలూ, ముని మనుమలతో వ్యాపించి వృద్ధిపొందారు.

మనువు రెండో కూతురైన దేవహూతిని కర్దమునికి అప్పగించి ఆ వంశాన్ని వృద్ధి చేశారని ముందే తెలిపాను. ఇక ఆ మనువు మూడవ సంతానం అయిన 'ప్రసూతి' అనే కన్యకను బ్రహ్మకొడుకు దక్షుడి కిచ్చాడు. ఆ దక్షప్రసూతులకు కల్గిన సంతతి తరతరానికి పెరిగి పోయి ముల్లోకాలకూ వ్యాపించింది. ఇక కర్దముడి ఆడపిల్లలందరూ బ్రహ్మర్షులకు భార్య లయ్యారు. వాళ్ల సంతానక్రమాన్ని వివరిస్తాను.

No comments:

Post a Comment

After Virabhadra Destroyed Daksha's Yagna, Demigods, Priests Approached Lord Brahma - దేవతలు వీరభద్రాదులచే బరాజితులై బ్రహ్మతో విన్నవించుట

దేవతలు వీరభద్రాదులచే బరాజితులై బ్రహ్మతో విన్నవించుట శివుడి ప్రమథసేనలచే దేవతలంతా వాళ్ల కత్తులు, గదలు, చురకత్తులు వంటి పోటు ముట్టుల తాకిళ్లకు ...