శివుడి ప్రమథసేనలచే దేవతలంతా వాళ్ల కత్తులు, గదలు, చురకత్తులు వంటి పోటు ముట్టుల తాకిళ్లకు చీలి చివికిన ఒంటిచీకాకుతో హడలెత్తిపోయారు. ఆకులతతో బ్రహ్మను ఆశ్రయించారు. ఎవరికివారే ఒక్కుమ్మడిగా ఆతడి పాదాలకు సాగిలపడి మొక్కుకున్నారు. వినయంతో వంగినవారై
శివుడి ప్రమథభటులు నిర్దయతో బలాత్కారంగా తమను బాధించిన తీరునంతా ఆసాంతం దేవతలు వెళ్లగక్కుకున్నారు అని మైత్రేయుడు విదురుడితో చెప్పాడు. మళ్లీ
విశ్వం తానుగా ఉన్నవాడు, తామరసాక్షుడు అని పేర్కొనదగిన విష్ణువూ, బ్రహ్మా, వీళ్లిద్దరూ ఆ యాగం ఇలా భగ్నమవుతుందని ముందే గ్రహించినవారు. కాబట్టే వారు దక్షయజ్ఞం చూడటానికి ప్రత్యక్షంగా వెళ్ళలేదు.
దేవతల విన్నపం విని బ్రహ్మ వాళ్లతో తిరిగి ఇలా బదులు మాట్లాడాడు.
మహాతజస్స్వరూపుడైన పురుషుడు పొరపాటున తప్పు దొర్లినవాడు అయి ఉండవచ్చు. అంతమాత్రంచేత వారిపై ప్రతీకారానికి పూనుకుంటే ప్రజలకు లోకంలో మేలు అనేదే మిగులదు. మంచిగా మనలేరని భావం. పొరపాటున తప్పు జరిగినా హాని తలపెట్టక పోవడం పెద్దల లక్షణం.
అని బ్రహ్మ బోధించి, మళ్లీ దేవతల దృష్టిని మరలుస్తూ ఇలా అన్నాడు.
పశుపతీ, ఈశ్వరుడూ, అభవుడూ, శర్వుడూ అయిన శివుడు దక్షయాగాంశకు తగినవాడు. అయినా యాగాంశ పంపకంలో అతణ్ణి దూరంగా పెట్టారు. ఆ సభలో సభ్యులుగా మీరున్నందువల్ల మహాపరాధకులూ, దుర్బుద్ది కారకులూనూ, అగు
పనిపడి ఆ మహాదైవం మహాక్రోధుడయితే, ప్రజలు నామమాత్రానికి కూడా మిగలని వారవుతారు. అంతటి శివుడి ఎడ పుల్లవిరుపు మాటలనే బాణాలపొదితో గాయపడింది. సతీదేవి ఆత్మాహుతి చేసుకోవటంవల్ల భార్యా విరహమూ దానికి తోడయింది. ఆ యాగాన్ని తిరిగి సంధానింప చేయాలని మీ అందరి అభిలాష. అందుకుగాను ఆ పరమహృదయుని, త్రిపురాలను దగ్ధంచేసిన ఆ ఘనుని దరిచేరండి. నిర్మలమైన అంతఃకరణంతో ముందుగా ఆతడి పాదపద్మాలను విడవక గట్టిగా పట్టుకొనండి. భక్తిశ్రద్ధలతో శరణువేడండి. ఓ దేవతలారా! ఆ శివుడి కనికరం దక్కినట్లయితే మీ కోర్కె నెరవేరిన వారవుతారు.
(విద్యున్మాలి, తారకాక్షుడు, కమలాక్షుడు అను ముగ్గురు రాక్షసులు మూడుపురాలరూపంలో లోకానికి హాని కల్గిస్తుండగా శివుడు వారిని సంహరించిన కథ ఇక్కడ అనుసంధేయం.)
అని బ్రహ్మ దేవతలకు చెప్పి మరొక విషయాన్ని ఇలా చెప్పుకొచ్చాడు. ఆ మహామహుని సన్నిధికి పోవడానికి మాకు బెరుకు అని తలపోయకండి. ఆ శివుణ్ణి చేరుకునే ఉపాయం గ్రహించుకోవాలని ఉన్నట్లయితే ఈ మాటలు వినండి. నేను గాని, ఇంద్రుడుగాని, మునులుగాని, మీరుగాని ఇంకా జీవులు మరెవరైనాగాని ఆ పరమాత్ముడి యథార్థమైన రూపునూ, అతడి శక్తి వీర్యాల పరిమితిని తెలుసుకోవడానికి ఉన్నశక్తి చాలదు. ఆ శివుడు తనదైన మనస్తత్త్వంతో నడుచుకోగల స్వతంత్రుడు. ఆ వెరవు ఇది అని వెల్లడించుటం ఎవరివల్ల కాని పనే. అయినా సరే భక్తులకు లొంగి, శరణు కోరిన వారిని ఆదుకునే స్వభావం గల ఈశ్వరుణ్ణి కలసి రావడానికి ఈ పూటే బయలుదేరుదాం అని చెప్పి బ్రహ్మ, దేవతలనూ, పితృదేవతలనూ, ప్రజాపతులను అందరిని జట్టులుగా కూడగట్టుకొని నేరుగా కైలాసం దిశగా తరలిపోయాడు. చాలా దూరం సాగినాక
దేవతలు కైలాసపర్వతాన్ని చక్కగా కంటినిండుగా చూశారు. ఆ శైలం ప్రముఖంగా సేవకుల మదికి ఆనందమయమైంది. అది కిన్నరుల కేళీ విహారభూమి. అది నిచ్చలూ వైభవం కలది. అది శుభాలకు ఆలయమైంది. అది సిద్దులు, గుహ్యకులు వంటి దేవయోనులకు వాసస్థానమైంది. అది వెండి కాంతుల నేల కలది, అది స్వయం ప్రయుక్త ప్రకాశంలో కులపర్వతాలను మించిపోయిన గొప్ప ప్రత్యేకమైన శోభ కలది.
ఆ వెండికొండ కొమ్ములు రంగురంగుల గైరికాది ద్రవ్యాలతో, నిరంతరమైన రతనాల వన్నెల మిశ్రమంతో పైపైకి ఎంతో ఎత్తున ప్రకాశిస్తుంటాయి. ఆ కొండమీది విశాలసమ ప్రదేశాలు, కిన్నరులు, గంధర్వులు, కింపురుషులు, అచ్చరల గుంపులతో కిటకిటలాడుతుంటాయి. కొండప్రదేశాలు, మాన్యులు, విమానవిహారులు అయిన దేవదంపతుల వినోద విహారాలకు మేలుగా ఉంటాయి. కొండగుహలు, నవకమైన విరజాజి పూల తీగల కప్పుతో మనోహరంగా ఉంటాయి. పర్ణశాలలు, దేవతల సిద్ధుల ఇల్లాండ్రతో అందగిస్తుంటాయి. దేవతలగ్భహాలు, వారి వారి కలిమికి అనువుగా ఉంటాయి, వెరసి పెక్కువిధాలుగా ఒప్పే శుభసంపదలకు, మెప్పుగల మంచిపనులకు హారం వంటిది ఈ వెండికొండ.
(మతల్లి, మతల్లిక, మచర్చిక - పదములు శ్రేష్ఠతా వాచకాలు సమాసంలో ఉత్తరపదంగా వస్తుంటాయి.)
మందారాలు, పారిజాతాలు, తెల్లతెగడ, చీకటిమాను, మద్ది, తాడి, తక్కల, రక్తకాంచన, దిరిసెన, తెల్లమద్ది, మామిడి, కడిమి, ప్రబ్బలి, పొన్న సురపొన్న, సంపెగ, పాటలి, అశోక, పొగడ, మల్లె, ఎర్రగోరంట, పచ్చసంపెగ, మామిడి, తామర, మోదుగు, ఏలక్కాయ, లవంగ, జాజి, ఇప్ప, మల్లియ, పనస, గురివింద, కొండమల్లె, అత్తి, రావి, జువ్వి, మఱి, ఇంగువ, భుజపత్తిరి, పోక, రాజపూగ, నేరెడు, ఖర్జూరం, అంబాళం, ప్రియాళు, కొబ్బరి, గార, వెదురు, మొదలైన గాలికి గలగల మోగే చెట్లతో, రక రకాల ద్రుమాలతో, గుబురు పొదలతో, పూలమొక్కలతో ఆ వెండికొండ అలరారుతుంది. కోయిలలు, నెమళ్లు, ఊరబిచ్చుకలు, రాచిలుకలు, గండుతుమ్మెదలు వంటిభిన్న భిన్నపక్షుల కూహూ, కేగ్రో. కిచకిచ, ఝంకారాది కూతలు అన్ని వైపులనించి మరేదీ విన్పించనంతగా గింగురుమంటున్నాయి. సింహాలు, సివంగులు, ఏదుపండులు, ఎద్దులు, మీగండ్లమెకాలు, కోతులు, అడవి పందులు, పెద్ద పులులు, కుక్కలు, దుప్పులు, దున్నలు, తోడేళ్లు, లేళ్లు, మొదలైన అడవిజంతువులకు నెలవై శోభిస్తుంది. అరటి తోపులతోనూ, విచ్చుకున్న తామరలు, ఎర్ర, తెల్ల కలువపూల శోభతోనూ తిన్నని ఇసుకప్రదేశాలతోనూ అందగిస్తున్న మంచి కొలనులున్నూ, ఆ సరస్సుల్లో స్వేచ్చగా, అటు ఇటు తిరుగాడే రాయంచలు, కొంగలు, బెగ్గురులు, జక్కవ పిట్టలు, కొంగలు, నీటికోళ్లు మొదలుగా పోగయిన నీటి పిట్టల కలకలరవాలు, ఒక దానితో ఒకటి కలిసిపోయి చెవులు చిల్లులు పడేంత రొదలతో విరాజిల్లుతుంది. జలకాలాటల వేడుకల్లో సతీదేవి చక్కటి కుచ మండలాల్లో దట్టంగా పులుముకొన్న కస్తూరిపరిమళంతో పచ్చగంధం పరిమళం మేళవించిన నీటి ప్రవాహంతో గంగానది నిండుగా ఆనందాన్ని అందింపచేస్తోంది. ఆ కైలాస శిఖరాన్ని బ్రహ్మ, ఇంద్రుడు, మొదలైన దేవతలందరూ దర్శించి చెప్పలేనంత ఆశ్చర్యానందాల్లో మునిగి తేలారు. తమ ముందరే ముత్యాలు రవ్వలు పొదిగిన బంగారు విమానాలతో నిండి ఉన్నట్టి, పుణ్యకాంతలతో కళ కళలాడుతున్నట్టి అలకాపట్టణాన్ని దాటారు. ఆ అలకానగరానికి వెలుపలగా నంద, అలకనంద అనే రెండు నదులు జమిలిగా ప్రవహిస్తుంటాయి. అవి పుణ్యప్రదమైన తీర్ధపాదుడైన విష్ణుమూర్తి పాదపద్మాల ధూళిరేణువులతో పవిత్రమైనవి. శృంగార క్రీడాసక్తిగల జంటల బడలిక సేద తీర్చే ఓలలాటలకు అనువైనవి. ఆ జలవిహారాల్లో అటు ఇటు కదలాడే ఘనకుచాలమీది కుంకుమపూల/పూత కలసిపోయి గోరోజనం రంగుకు తిరిగిన నీటి వెల్లువ గల ఆ నదులను దాటి ముందుకు కదిలారు. ఆ తరువాత తెల్ల/ఎర్ర కలువపూల సౌగంధికవనం తమ ముందర అగపడింది. ఆ పెంపుడు తోటలో అడవి ఏనుగుల రాపిడివల్ల చందనంచెట్ల నుంచి ఘుమఘుమ సువాసనలు మోసుకొస్తున్న కొండగాలిని తడవలు తడవలుగా అనుభవిస్తూ తన్మయులయిపోతున్న యక్షిణుల మూక ఉంది. ఆ వనంలో పచ్చలు తాపిన మెట్లతో, పసిమిపూసిన కలువపూలతో, దిగుడు బావులు నిండుగా ముచ్చటగా ఉన్నాయి. ఆ పూలతోట కింపురుషుల సంచారాలకు అనువుగా ఉంది. ఈ పుష్పవనాన్ని ఆనుకొని
No comments:
Post a Comment