Thursday, February 26, 2026

Lord Brahma and Various Demigods (Devas), Along with Sages, have Worshipped Lord Dakshinamurthy - బ్రహ్మాదులు దక్షిణామూర్తి రూపుం డగు నీశ్వరుని స్తుతించుట

బ్రహ్మాదులు దక్షిణామూర్తి రూపుం డగు నీశ్వరుని స్తుతించుట

ఆ పూలవనం పక్కనే ఒక పెద్ద వటవృక్షం కంటికి అనింది. ఆ మర్రిమాను వందయోజనాల నిడివి, డెబ్బై అయిదు యోజనాల వైశాల్యం కల్గి ఉంది. ఆ చెట్టు పచ్చ పచ్చటి ఆకుల రెమ్మలతో కొమ్మలతో గుబురుగా అల్లుకొని గుమ్మటంగా ఉంది. ఎటుపక్కనుంచి చూచినా ఆ చెట్టు నీడపట్టుకు ఏమీ కొదువ ఉండదు. పక్వానికివచ్చిన కెంపురంగు పండ్లగుత్తులతో ఇంపుగా ఉంది. ఆ నీడ సిద్ధక్రియాయోగాభ్యాసకులకు ఆటపట్టుగాను, పుణ్యస్వరూపులైన మోక్షగాములకు ఉనికి పట్టుగాను, మహాసంసారమనే తాపానికి నివారకంగాను ఉంటుంది. చేవదేఱిన ఆ మర్రి 'అబ్బ! చాలగొప్పమాను' అని అనేట్లు చేస్తున్నది. భక్తకోటిని ఎపుడూ ఆనందపరుస్తూనే ఉంటుంది. ఆ వటం వలసినంత ఐశ్వర్యప్రాప్తికి పొందికైనది.

ఆ మర్రిమాను మూలంలో పేరు ప్రఖ్యాతులుపొందిన సనందనాది జ్ఞానులచే ఉపాసితుడు, శాంతమూర్తి, స్నేహస్వభావి, లోకకల్యాణకారి, ఈశ్వరుడు, జగత్తుకు చుట్టమూ, విశ్వయశస్వి, గుహ్యక, రాక్షస, సాధ్య, కుబేరాది దేవజాతి కొలువుకాడు, ఎదురులేని శక్తిమంతుడు, జ్ఞాన, భక్తి, కర్మయోగ సాధననైష్ఠిక యోగి, నెలవంకను ఆభరణంగా ధరించినవాడు, మౌనిస్తుత్యుడు, తపసుల వాంఛలను తీర్చేవాడు, విబూదితో, దండంతో, లింగంతో, జటాజూటంతో, మృగచర్మంతో ఆనవాలు పట్ట కలవాడు, భక్త ప్రసన్నుడు, ముని చీకటి మబ్బుచాయను పోలిన తాజా లోహితవర్ణం కలవాడు, శాశ్వతుడు, తత్వస్వరూపుడు.

కుడితొడపై ఎడమపాదాన్ని తిన్నగా ఉంచిపెట్టి, ఎడమ మోకాలిపైన ఎడమ చేతిని నిలువుగా చాపాడు. కుడిచేతి ముంజేతితో రుద్రాక్షమాలను చక్కగా పట్టి, గొప్పజ్ఞాన ముద్రా లక్షితుడై ఉన్నాడు. మనసున తిరుగులేని పరమానందం వల్ల తెలిసిన మనోలయంతో నిలకడగా ఉన్నాడు. మాత్సర్యాన్ని వదిలించుకున్నాడు. యోగపట్టం కట్టుకున్నాడు. పూర్తిగా రోషాన్ని తొలగించుకొని ధర్మపీఠం మీద కూర్చున్న రెండవ యముడివలె దర్భలతో కూర్చిన యోగపీఠం మీద దీక్షావ్రతిలా కూర్చొని ఉన్నాడు. అట్టి మునులలో అగ్రగణ్యుని, యోగ్యుడైన ధ్యాననిష్ఠుని

మహాయోగి వర్యులంతా వింటూ ఉండగ నారదమహర్షితో ఇష్టాలాపనలు సాగిస్తున్నవాణ్ణి, మెడలో పాము ఆభరణంగా కలవాణ్ణి, సాధుపురుషులను పెంపుచేసేవాణ్ణి, ఘను
ణ్ణి, జన్మలేనివాణ్ణి, శివుణ్ణి.

వచ్చిన వాళ్లంతా శివుణ్ణి చూశారు. లోకపాలురూ, ముని ముఖ్యులూ పరమ భక్తితో వంగి పాదప్రణామం చేశారు. అదే సమయంలో శివుడు బ్రహ్మను గమనించాడు. ఎంతో తత్తర పడుతూ

ఓ పుణ్యాత్ముడా! విదురా! బ్రహ్మకు శివుడు ఎంతో శ్రద్ధతో చక్కగా ఎదురువెళ్లి ప్రీతి పూర్వకంగా నమస్కరం పెట్టాడు. ఆ పెట్టిన తీరు పూర్వం కశ్యపబ్రహ్మకు వామనావతారంలో విష్ణువు నమస్కరించినట్లుగా ఉంది.

శివుడు బ్రహ్మకు నమస్కరిస్తున్న సమయంలో శివుడి అనుచరులయిన సనందాదిసిద్దులూ, మహామునిజనం బ్రహ్మను చూశారు. చేతులెత్తి జోతలు పెట్టారు. తదుపరి వారి వందనా లందుకుని ఆ బ్రహ్మ శివుణ్ణి అవలోకించి నవ్వు మొహంతో పల్కరించాడు.

ఓ శివ! జగానికంతటికీ యోనిబీజరూపాలైన ప్రకృతి పురుషస్థితులకు నువ్వు నిజరూపుడవు. ఈ విశ్వంలోని స్త్రీ పురుషతత్త్వపు మార్పులు పట్టనట్టి పరబ్రహ్మరూపుడవని తెలుసును. కాని నువ్వే జగదీశ్వరుండవు అని ఎంతో యత్నించిగాని నేను ఎరుగ లేకపోయాను.

ఓ ఈశా! ఈశ్వరుడ! ఆ ఎరిగింపే కాదు, సమమైన అంశలే అయిన శక్తి శివ ఆకృతులలో విశ్వలీలలు నడపుతుంటావు. సాలెపురుగు వలె ఈ లోకాలసృష్టికి, ప్రళయానికి పాలనకు నువ్వే ప్రధానకారణుడివి అవుతుంటావు.

(సాలెపురుగు తననుంచే గూడును సృష్టించి తిరిగి తనలోనే లయం చేసుకుంటుంది.)

ఓ పాప రహితుడా! 'వర్ణాశ్రమ ధర్మాలను కట్టడి చేసేవి, శిష్టులచే అమితంగా గ్రహించబడినవి, సకలపుణ్యాలూ సకలఫలాలు లభింపచేసేవి వేదాలు' అని ప్రజల నాలుకల నాని ఉన్నాయి. ఆ ప్రశస్తి సంహితల ధర్మాలను సమృద్ధిగా అలవరచాలని కోరి మరీ నీకు నువ్వే ఆ దక్షబ్రహ్మను ఈ సమస్తానికి కారణ భూతుని చేశావు. అలాగే ఆ యాగాన్నీ నడిపించావు. అందువల్లనే నువ్వు క్షేమస్వరూపుడివిగా నిలిచిపోయావు. ఓ భక్తలోక పోషకా! పన్నగాలంకారా! నువ్వే మేలుపనులకు పూనుకునేటువంటి వాళ్లకు మోక్షపదాన్నీ అనుగ్రహించగలవు, కీడు పనులకు తలపడే వాళ్లకు దుర్గతినీ అందించగలవు.

ఆ విధంగా, చేసినవారికి, చేసినంతలో జరగడానికీ, ఆ జరుగుబాటు ఏ ఒక్కడి విషయంలోనో అటుదిటు కావడానికీ కారణం ఏదో కావచ్చు. ఒక వేళ ఆ ఒక్కటికి నీ రోషం కారణం అని అనుకున్నట్లయితే నీ పాదపద్మాల మీదే మనస్సు పెట్టి, ప్రాణులందరిలోనూ నిన్నే చూస్తూ, ఆ ప్రాణులనూ తనకంటే అన్యమైనవి కాదని లోపల దర్శిస్తూ ప్రవర్తిల్లే గొప్పప్రజ్ఞావంతుల్లో కోపం, మూర్ఖంగా ప్రవర్తించే వాళ్లలో వలె అంత ఎక్కువగా పుట్టదు కదా. అటువంటి పూజ్యుడవే అయిన నీకూ హానికరమైన ఆ రోషం కల్గుతుంటుందా? (కల్గదు)

చక్కని నడవడిక కలవాడా! కంఠం నీల వర్ణంగా, కేశాలు రక్తవర్ణంగా కలవాడా! సత్త్వగుణవంతుడా! జగద్రక్షకా! సిగ నగగా గంగను తాల్చినవాడా! లోకం నచ్చిన నడవడి కలవాడా! ఓహరా! మరొక విషయం. వాళ్లు భిన్నమైన తలంపు కల్గి దైనందిన కార్యక్రమాల అమలులో పొగరుపట్టి పాపమతులై నడచుకుంటారు. అలాంటి వాళ్లు ఒరుల కలిమికి ఓపలేని మచ్చరంవల్ల ఆధివ్యాధి పీడితులవుతారు. ఆయువుపట్టులను సైతం చీల్చి సలుపు పుట్టించే అతిఘారమైన పెక్కు విరుపుమాటలతో వెలుపలి వారిని వేపుకు తింటుంటారు. ఆ రకం మందబుద్దుల్నీ నీ వంటి సాధు స్వభావులు విధినిహతులుగా భావించుకొని ఆ టక్కరులకు ఏలాగున్నూ చెడ్డను చేయరు. మహోపకారి మహాపకారిని దండించక మంచి వైపుకు మరల్చుట అతని కర్తవ్యం అని భావం. అంతేకాక

హరి తన గొప్ప ప్రతిభను, ఏ దేశానికి అయినా ఏ కాలానికి అయినా అనువుగా తప్పించుకోలేనిదిగా తీర్చాడు. ఆ విష్ణు మాయ కమ్మి, అజ్ఞానులైన వాళ్లు వేరుచూపు కలవారవుతారు. వీళ్లవల్ల చేటు వాటిల్లినప్పటికిన్ని అది నొసటిరాత అనుకుని ఎదుటివారి నొవ్వును చూసి తట్టుకోలేక సజ్జనుడు కనికరం చూపిస్తాడు తప్ప ఏ మాత్రం బాధించడు. కాబట్టి నువ్వు విష్ణు మాయామోహం పట్టనివాడవు. కనుకనే నువ్వు సర్వజ్ఞుడవు. మాయామోహితులై కర్మపరులైన వారివల్ల ఏమైనా చేటు జరిగినా వాళ్లను నువ్వు రక్షించి తీరాలి. ద్రోహుల పట్లను అనుగ్రహం చూపే సాధుజనుల తత్త్వం అనుసరణీయం అని భావం.

అదిగాక ఆ యాగం వంతుకు నువ్వు యోగ్యుడవే. అయినా నీ భాగాన్ని నీకు దక్కనీయని కారణంగా నీచేత దక్షుడియాగం పూర్తిగా బూడిద పాలయింది. కొలిక్కిరాని ఆ దక్షయాగాన్ని పునరుద్ధరించు. దక్షుడికి తిరిగి ప్రాణం పొయ్యి. భగుడికి కళ్లు తెప్పించు. భృగుడి మీసాలు గడ్డాలు మళ్లీ మొలిపించు. పూషుడి దంతాలు పెట్టించు. విరిగి తునాతునకలైన అవయవాల గాయాలనుంచి దేవతలకు, ఋత్విక్కులకూ విముక్తి కల్గించి ఆరోగ్యవంతులను చెయ్యి. ఈ దక్షయాగంలో మిగులు భాగం ఈ యాగ పరిపూర్తికి తగిన కారణమై నీ భాగమే అవుతుంది.

No comments:

Post a Comment

Puri Jagannath Rath Yatra - పూరీ జగన్నాథ్ రథయాత్ర

పూరీ జగన్నాథ్ రథయాత్ర ఆలయ ఆధ్వర్యంలో జరిగే ఉత్సవాలన్నింటికల్లా ముఖ్యమైనది జగన్నాథ రథయాత్ర. భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి గాంచినది పూరీ జగన్నాథ...