Saturday, February 21, 2026

Sanaka Sanandana Sanatana, and Sanatkumara Praying Narayana - సనకాదులు నారాయణుని స్తుతించుట

సనకాదులు నారాయణుని స్తుతించుట

వనజదళాక్ష భక్తజనవత్సల! దేవ! భవత్సుతుండు మ
జ్జనకుండునైన పంకరుహజాతుండు మాకు రహస్య మొప్పం జె
ప్పిన భవదీయమంగళగభీరపరిగ్రహవిగ్రహంబు మే
మనయముంజూడంగంటిమి కృతార్థులమై తగమంటి మీశ్వరా!


"తామరలవంటి కన్నులవాడా!, భక్తులపట్ల దయగలవాడా! ప్రభూ! ఓ స్వామీ! మీకు కుమారుడును మాకు తండ్రియునైన బ్రహ్మదేవుడు మిమ్మల్ని ఎల్లప్పుడు దర్శించే మహారహస్యం చెప్పాడు. దాన్ని ఆసరాగా గ్రహించి నీ మనోజ్ఞమైన సుందరాకారాన్ని చూచి తరించాం. ధన్యులమైనాం" అని సనకాదులు విష్ణుమూర్తిని స్తుతించారు.

దేవ! దుర్దనులకు భావింప హృదయసంగతుండవై యుండియుం గానంబడవు
కడంగి నీ దివ్యమంగళవిగ్రహంబునం జేసి సమంచితాశ్రితుల నెల్లం
జేకొని సంప్రీతచిత్తులంగాంజేయు దతిశయకారుణ్యమతిం దనర్చి
కమలాక్ష! సర్వలోకైక నాయక! భవత్సందర్శనాభిలాషానులాప

విదితదృఢభక్తియోగప్రవీణు లగుచు, నర్థిమై వీతరాగులైనట్టి యోగి
జనమనఃపంకజాతనిషణ్ణమూర్తి, వని యెఱుంగుదురయ్య, నిన్నాత్మవిదులు


"ఓ ప్రభూ! నీవు సర్వాంతర్యామివి. దుష్టుల హృదయంలో కూడా ఉంటావు. అయితే వారికి కన్పించవు. కాని నీవు కనికరంతో నీ భక్తులెల్లరికి దివ్యమంగళరూప సాక్షాత్కారం కల్గించి ఆదుకొంటావు. ఓ పద్మాక్ష! లోకనాయక! నిన్ను చూడాలనే కోర్కెతో, నిన్నే స్మరించే రజోగుణవిముక్తులైన భక్తుల హృదయాల్లో నీవు పాదుకొని ఉంటావని జ్ఞానులు చెపుతారు" అని మునులు ప్రస్తుతించారు.

యుక్తిందలంప భవద్వ్యతి, రిక్తములై నట్టి యితర దృఢ కర్మంబుల్‌
ముక్తిదము లయిన నీ పద, భక్తులు దత్కర్మములను బాటింప రిలన్‌


'ఓ స్వామీ! నిన్నుద్ధేశించి కాక అన్యచింతనతో చేసే పనులవి ఎంత గొప్పవైనా, లేక ముక్తినొసంగేవైనా, నీ పాదసేవకులైన భక్తులు వాటిని ఒల్లరు'(ఇష్టపడరని భావం).

కావునంగీర్తనీయగతకల్మషమంగళతీర్థకీర్తి సు
శ్రీవిభవప్రశస్తసుచరిత్రుండ వైన భవత్పదాబ్జ సే
వా విమలాంతరంగబుధవర్గ మనర్గళభంగి నన్యమున్‌
భావమునం దలంచునె కృపాగుణభూషణ! పాపశోషణా!


ఓ స్వామీ! నీవు దయాభరణుడవు. భక్తుల పాపాలను పటాపంచలు చేయగలవాడవు. నీ చరిత్ర కొనియాడదగింది. దోషరహితమైంది. శుభకరమైంది. పుణ్యప్రదమైంది. సత్కీర్తి శోభితమై ప్రశస్తి కెక్కినట్టిది. హృదయంలో ఏ కల్మషం లేని నీ పాదసేవకులు ఇతర కర్మల జోలికిపోరు. అన్యదేవతలను కొలవరు.

పరమతపోవిధూతభవపాపులమై చరియించు మాకు నేం
డరయ భవత్పదాశ్రితుల కల్గి శపించిన భూరిదుష్కృత
స్ఫురణ నసత్పథైకపరిభూతులమై నిజధర్మహానింగా
నిరయము నొందంగా వలసె నేరము వెట్టక మమ్ముంగావవే


దేవా! మేము తపోబలంచేత జన్మసంబంధమైన పాపాలను తుదముట్టించిన వారం. కాని ఈ రోజు మీ పాదదాసులైన కావలికాండ్రని(జయ విజయుల్ని) శపించి దారితప్పినాం. అవమానానికి గురి అయ్యాం. మా ధర్మానికి హాని కల్గింది. అందుకు మమ్ముల శిక్షించకుండా కాపాడండి" అని మునులు ప్రార్ధించారు.

కర మనురక్తిషట్పదము కమసుగంధమరందవాంఛచేం
దరమిడి శాతకంటకవృతస్ఫుటనవ్యతరప్రసూన మం
జరులను డాయుపోల్కిని భృశంబగు విఘ్నములన్‌ జయించి నీ
చరణసరోజముల్‌ గొలువ సమ్మతి వచ్చితిమయ్య, కేశవా


"ఓ తండ్రీ! గోవిందా! తుమ్మెద కమ్మని తేనెను క్రోలడానికి ఉత్సాహంతో వాడియైన ముళ్ళతో కూడిన పూగుత్తులను ఆశ్రయించినట్లే మేముకూడ ఆటంకాలను ఛేదించి నీ పాదపద్మాలను సేవించాలని వచ్చాము అని సనకాదులన్నారు.

అలరు భవత్పదాంబుజయుగార్పితమై పొలుపొందునట్టి యీ
తులసి పవిత్రమైన గతిం దోయజనాభ! భవత్కథాసుధా
కలితములైన వాక్కుల నకల్మషయుక్తిని విన్నంగర్ణముల్‌
విలసితలీలమై భువింబవిత్రములై విలసిల్లు మాధవా!

ఓ లక్ష్మీనాథా! నీ పాదపద్మాలను సోకి, ఈ తులసి పవిత్రమై రాణించినట్లే, నీ కథామృతంతో కలిసిన మాటలను వింటే చెవులు పవిత్రమైతాయి.

మహితయశోవిలాసగుణమండన! సర్వశరణ్య! యింద్రియ
స్పృహులకుంగానరాక యతసీకుసుమద్యుతి నొప్పుచున్న నీ
సహజశరీర మిప్పుడు భృశంబుగంజూచి మదీయదృక్కు లిం
దహహ! కృతార్థతంబొరసె నచ్యుత! మొక్కెద మాదరింపవే!

"కీర్తదాయకమైన గుణగణాలు గలవాడా!, అందరికీ దిక్కైనవాడా! ఓ మాధవా! నీ రూపం ఇంద్రియాపేక్షగల సామాన్యులకు కన్పించదు. అది అగిసెపువ్వులాంటి నీలం వన్నె గల్గిన సహజశరీరం. దాన్ని దర్శించి మా చూపులు ధన్యమయ్యాయి. నీకు నమస్కరిస్తున్నాం. మమ్ములను ఆదుకో స్వామీ!" అని మునులు ప్రార్ధించారు.

"స్వామీ! మీ దర్శనంవల్ల మా చూడ్కులు సార్థకమయ్యా" యని సనకాదులు స్తుతించారు. మాధవుడు మహానందం చెంది మునుల నుద్దేశించి యిలా అన్నాడు.

జయుడు, విజయుడు అనే పేర్లుగల ఈ ఇద్దరు నా కావలికాండ్రు. వీరునా ఆజ్ఞను ఉల్లంఘించి, మిమ్మల్ని సరకు చేయకుండా అవమానించారు. మీరు వారు చేసిన తప్పిదానికి తగినశిక్ష విధించారు. అది నాకు సమ్మతమే. అంతేగాదు- సేవకులు చేసే అపరాధానికి యజమానియే బాధ్యుడు. అందువల్ల ఈ ఇర్వురు చేసిన తప్పునకు నన్ను మన్నించి అనుగ్రహించండని శ్రీహరి ప్రార్ధించాడు.

శరీరంలో పుట్టిన కుష్ఠురోగంవల్ల రోగి చర్మం కళతప్పినట్లే సేవకులు ఏదైనా తప్పుపని చేస్తే ప్రభువులు కీర్తిని, పేరుప్రతిష్టలను కోల్పోయి లోకంలో అపకీర్తి పాలవుతారు.

మునీంద్రులారా! మీవంటి మహానుభావులవల్ల లోకమంతా మెచ్చదగ్గ పుణ్యకీర్తి నాకు దక్కింది. అమృతతుల్యమైన నా కీర్తివైభవంచేత ఈ వైకుంఠనగరం విరాజిల్లుతోంది. ఈ నగరంపేరు వింటేచాలు దుష్టులైన చండాలజాతులవారు కూడ పుణ్యాత్ములవుతారు.

అంతటి కీర్తిగడించిన నేను, మీ వంటి మహాత్ములకు అపకారం చేసేవారెంతటివారైనా, లేక వారు నాకు భుజసమానులైనా సరే వారిని మట్టుపెడతాను. అయినప్పుడు ఇతరులను గూర్చి మీ ముందు చెప్పాలా?(చెప్పవలసిన పనిలేదు).

"లోకంలో ఉత్తములైన బ్రాహ్మణులు నా పాదపూజ చేస్తారు. వారిచ్చిన పాద్యం అతిపవిత్రమైంది. దాని వల్ల లోకుల పాపాలన్నీ పటాపంచలవుతాయి. పవిత్రమైన అర్ఘ్యపాద్యాలు పొందిన పాదాలు నావి.

మంచిమనస్సుగల శ్రీదేవి తన కడగంటిచూపులనే హారంతో నన్నాకర్షించి, నన్ను విరాగిగా తలంచక నా ఎదపై వాలింది. (వక్షఃస్థలాన్ని ఆశ్రయించిందని భావం).

మహాత్ములారా! యజ్ఞంలో అగ్నిముఖంగా వ్రేల్వబడిన, నేలితో తడిసిన హవ్యం నా మనస్సుకు ఇంపుగొల్పదు(నచ్చదు). కర్మఫలకాంక్షలులేని బ్రాహ్మణోత్తముడు భుజించే అల్పాహారమే నాకు ప్రియమైంది.

"మునీశ్వరులారా! నేను ఎల్లప్పుడు యోగమాయావైభవంతో ప్రకాశిస్తుంటాను. ధరణీసురులుగా వాసికెక్కిన బ్రాహ్మణుల పవిత్రమైన పాదధూళిని నవరత్నాలు పొదివిన నా బంగారు కిరీటంపైన ధరిస్తాను. నా పాదపద్మాలనుండి పుట్టిన గంగాజలాన్ని స్పృశించి తలపై చల్లుకొని పరమేశ్వరుడు మొదలైన దేవతలు పుణ్యాత్ములయ్యారు. బ్రాహ్మణులవల్ల ఎవరికైనా అపకారం జరిగితే, వారిపై కోపపడనివారునూ, ఆ బ్రాహ్మణులు నాతో సమానులని భావించేవారును నాకు చాలా ప్రియమైనవారు సుమా!" అన్నాడు విష్ణుమూర్తి.

మునులారా! ఆవులను, బ్రాహ్మణులను, నన్ను, దీనులను ఎవరు భేదభావంతో చూస్తారో వారు తప్పక అధోగతి పాలవుతారు. యమభటులు అలాంటివారిని పాముపగ వంటి పగతో విజృంభించి పెద్దగద్దలు ముక్కుతో పొడిచినట్లు పొడిచి ముక్కలు చేస్తారు.

"లోకంలో బ్రాహ్మణులు ఎవరినైనా అవమానిస్తే, అలా అవమానానికి గురియైనవారు ఆ బ్రాహ్మణులను చిరునవ్వులతో, మహానందభరితులై పూజిస్తే, మంచిమాటలతో వారిని స్తుతిస్తే, కొడుకులు తండ్రిని ప్రేమతో పల్కరించినట్లు పల్కరిస్తే అలాంటివారు నాకు సమానులు అన్నాడు హరి.

మహాత్ములారా! వినండి. అంత గొప్పచరిత్రగల్గిన మహానుభావులకు నేనెప్పుడూ సేవకుడుగానే ఉంటాను. అలనాడు భృగుమహర్షి నన్ను కాలితో తన్నితే సంతోషించాను.

"ఓ మునులారా! నా మనసులోని ఆంతర్యం తెలియక, ఈ ఇర్వురు మీ ఆజ్ఞని జవదాటారు. అందుకు తగిన ఫలితాన్ని చవిచూశారు. అంతేగాదు నిజానికి నా మనసులో ఉన్నది కూడ ఇదే. వీరు భూలోకంలో రాక్షసులై పుట్టి త్వరగా నా చెంతకు చేరేటట్లు వీరిని అనుమతించండి" అని శ్రీహరి ప్రార్ధించగా మునులు ఆ స్వామి తియ్యని పల్కులు విన్నారు. ఆ పల్కుల అమృతాన్ని తనివి దీర ఆస్వాదించినా, వారిలో కోపం కాటువేస్తూనే ఉంది.

సనకాదిమునులు జయవిజయులు చేసిన పరాభవాన్ని సహించలేక పోయారు. అయితే శ్రీహరి మృదుమధురమైన పల్కులకు హృదయానందాన్ని పొందారు. శ్రీహరి మాటలు గంభీరమై లోతైన అర్ధం కలవగుటచేత తేలికగా బోధపడేవి గావు. అమృతంతో సమానమైన తియ్యదనం గలవి, శబ్ద దోషం లేనివి. అలాంటి పల్కులు విని ఆ మునులు సంతోషించి 'తమలో దాము' ఇప్పుడు ప్రభువు మనలను అభినందించో లేక నిందించో అదికాకపోతే 'మన శాపానికి వెరచియో' ఏదో మరి మనల్ని సందేహానికి గురిచేశాడు అని అనుకొన్నారు. అంతలో మళ్ళీ పునరాలోచనలో పడ్డారు.

కలువలవంటి కన్నులుగల శ్రీహరి తమను దయతో చూచాడ'ని మనసులో సంతోషపడి, మునులు పులకరించిపోయారు. ఉత్కంఠతో రెండుచేతులెత్తి నమస్కరిస్తూ ఇలా అన్నారు.

సనకాదిమునులు యోగమాయావిలాసుడైన శ్రీహరి ఐశ్వర్యాన్ని బలాన్ని, మహోత్సాహాన్ని గమనించి వినయంతో ఇలా అన్నారు.

"ప్రభూ! నీవు గొప్ప ఐశ్వర్యవంతుడివి, పాపరహితుడివి, పరమపూజ్యుడవు, జయవిజయుల్ని మేము శపించటం నీ కిష్టమని చెప్పావు. నీ చరిత్రని తెలిసికోవటం మాకు సాధ్యం కాదు.

లోకాలను పవిత్రంచేయగల వాడా! ప్రాజ్ఞులను రక్షించేవాడా! సమభావంగల ఓ ప్రభూ! దేవతలకు దీటుగా పరదేవతలని కీర్తి వడసిన ఈ బ్రాహ్మణులకు నిజంగా నీవే అధిపతివి. అంత గొప్ప స్వామివైన నీకు ఆ బ్రాహ్మణులు నాయకులా? ఇది చాల విచిత్రం సుమా! అని మునులన్నారు.

ఓ దయార్ద్రమూర్తీ, పాపనాశక! కమలలోచన! దేవా! నీవు ఎన్నో అవతారాలెత్తి నీ ధర్మాన్ని నిర్వహిస్తున్నావు. అందుకే లోకం ఏ ఉపద్రవాలు లేకుండా ఉంది. చెక్కుచెదరకుండా ఉంది. నీవు వికారాలు లేనివాడివి. నీది అచలరూపం. నీ అవతారాలఫలితాలను, అందలి రహస్యాలను తత్త్వజ్ఞులు చెపుతుంటారు.
(సాధారణంగా 'దశావతారాలు' అంటారు. అంటే విష్ణువెత్తిన అవతారాల్లో పది అవతారాలు చాల ముఖ్యమైనవి. భాగవతం చెప్పిన అవతారాలు 23 అవి

1. యజ్ఞవరాహం, 2. సుయజ్ఞుడు, 3. కపిలుడు, 4. దత్తాత్రేయుడు, 5. సనకాదులు, 6.నరనారాయణులు (మునులు), 7 పృథువు, 8. పుష్కరుడు, 9. ధ్రువుడు, 10. హయగ్రీవుడు, 11.మత్స్యావతారుడు, 12. కూర్మావతారుడు, 13. నరసింహుడు, 14. నారాయణుడు(గజేంద్రుని రక్షించినస్వామి), 15. వామనుడు, 16. హంసుడు, 17. మనువు, 18. ధన్వంతరి (ఆయుర్వేదప్రచారకుడు), 19. పరశురాముడు, 20. శ్రీరాముడు, 21. శ్రీకృష్ణుడు, 22. బుద్ధుడు,
23. కల్కి)

"దయార్ద్రమూర్తి! లోకపాలక! గొప్పవివేకం గల స్వామీ! ఈ విశ్వమంతా నీ అధీనంలోనే ఉంది. అందువల్లనే మా వంటి మునులం మృత్యుభయంనుండి విడివడ్డాం. వాస్తవమిట్లుండగా 'నీవు ఇతరుల స్వాధీనంలో ఉన్నా'నని అంటున్నావు. ఇది చాల విచిత్రమైన సంగతి" అన్నారు సనకాదులు.

ప్రతినిత్యం యాచకులు వచ్చి లక్ష్మీదేవి పాదాలను సాగిలపడి మ్రొక్కినపుడు వాటి ధూళి తమ తలల కలంకారంగా ఉంటుంది. తామరపూలనుండి స్రవించిన తేనెను ఆస్వాదించడానికి వచ్చే జుంటీగ వంటి భక్తులు తులసిమాలగల నీ పాదపద్మాలను మహాభక్తితో కొలుస్తున్నారు. ఆ భక్తులయెడ ప్రేమాతిశయంగల ఓ స్వామీ! నీవు శ్రీదేవిని దయతో మన్నించకున్నావు. నిజానికి నీ మహిమ చాల విచిత్రం గదా! నీవు తామరలవంటి కన్నుల వాడవు. నీ రూపం శుభప్రదమైంది. అంతేగాదు - శ్రీదేవిహృదయాన్ని దోచుకొన్నవాడవు కూడ.

భాగ్యాలకు నెలవైన దేవా! శ్రీవత్సాన్ని రొమ్మున తాల్చిన స్వామీ! ఈ బ్రహ్మవేత్తల పాదధూళియే నీ శరీరానికి అలంకారమని అన్నావు. సమస్తలోకాలకు బ్రాహ్మణుల మహిమను చాటాలని నీవు ఈ పవిత్రాకారాన్ని ధరించావు.

బ్రాహ్మణమహిమని లోకానికి చాటటానికే గాదు, భక్తుల పాలిటి కొంగుబంగారమైన ఓ దేవా! నీవు ఎల్లప్పుడు ధర్మం తప్పని వాడవు. లోకనాయకుడవు. అలాంటినీవు రక్షింపదగిన వారిని రక్షింపకున్నచో వేదధర్మం దారితప్పుతుంది. కావున నీవు సత్త్వగుణుడవై ఈ జీవకోటిని కాపాడుతున్నావు. నీవు స్వశక్తిచేతనే అధర్మపరుల్ని దండిస్తావు. వేదధర్నాన్ని ఉల్లంఘించే పద్ధతులు నీకు నచ్చవు. బ్రాహ్మణులపట్ల నీవు దయగలవాడవు. వారిని వినయంగా పల్కరించటమే నీకు తగును.

అన్యుల నుద్దేశించి వినయంగా మాట్లాడితే నీ మహిమకు చేటని భావిస్తావేమో! అదేమీ కాదని మునులంటున్నారు.

స్వామీ! వినయంగా మాట్లాడటం నీకొక లీలకాగా ఈ విశ్వానికి కర్తవు, ఆధారుడవు, పోషించేవాడవైన నీకుగాని నీ వైభవానికి గాని హాని ఎక్కడుంటుంది? ఉండదు.

మహానుభావా! మేము మునులం. మమ్మల్ని నీవు మహానందంతో గౌరవిస్తున్నావంటె అది ఉత్తముల్ని చేరదీయటమే కదా! ఈ జయవిజయుల గూర్చి ఒక్కమాట చెప్పాలని ఉంది.

"స్వామీ! మేము కావలికాండ్రని శపించాం. ఇంతకంటె కూడ పెద్దశిక్ష విధించాలని మీరనుకొంటే అలాగే చేయండి. లేదా వీరికి ఇతోధికమైనమేలు కల్గించాలనుకొంటే వీరిని కాపాడండి" అని మునులు హరితో అన్నారు.

ఓ స్వామీ! వారిద్దరిని మీరు రక్షిస్తే మాకు సంతోషమే. ఒక వేళ ఏ తప్పు చేయనివారు, హృదయంలో ఎలాంటి కల్మషం లేనివారును అయిన జయవిజయుల్ని మేము నిష్కారణంగా శపించివుంటే మాకు మీరే శిక్ష విధించినా సమ్మతమే అని సనకాదులు దోసిలొగ్గి హరిని ప్రార్థించారు. అప్పుడా శ్రీహరి మునులను దయతో చూస్తూ ఇలా అన్నాడు.

'ఓ మునీశ్వరులారా! ఈ జయ విజయులు భూలోకానికి వెళ్ళి అక్కడ లోభమోహ పరాయణులై రాక్షసుల కడుపున జన్మిస్తారు అని భగవంతుడు సనకాదులతో అన్నాడు.

రక్కసులైన వారిరువురు దేవతలకు, ప్రజలకు హాని కల్పిస్తారు. సమస్త లోకాలను నొప్పించే పనులే చేస్తారు. నా పట్ల విరోధాన్ని పెంచుకొంటారు.

ఆ ఇర్వురు యుద్ధరంగంలో నాతో తలపడి, సుదర్శనచక్రపు తాకిడిచే కూలి, తిరిగి మహోత్సాహంతో నా సన్నిధికి వస్తారు(వారికి వైకుంఠప్రాప్తి అవుతుందని భావం).

నా సన్నిధికి రావటమేగాక, ఇంకా ఈ జయవిజయులిద్దరు భూలోకమున రాక్షసులై పుట్టి నాతో తలపడాలని బుద్ధిపుట్టి, నా ఎదుట నన్నే చూస్తూ చస్తారు. తర్వాత తమ పాపాల నుండి విడివడినవారై వైకుంఠంలో నివసిస్తారు.

"ఈ జయ విజయులకు తర్వాత మరెప్పటికి భూలోకంలో పునర్జన్మ ఉండదు. మీ కోర్కెప్రకారం నేను కూడ మనస్సులో సమాధాన పడతాను" అని హరి సనకాదులతో అన్నాడు.

'మునీశ్వరులారా! ఇక ఈ విషయాన్ని గూర్చి విచారపడవద్దు' అని హరి సనకాదులతో అన్నాడు. వారు స్వామివారి మనస్సులోని ఆంతర్యం తెలిసికొని 'దీనజన రక్షకుడును, పాపాల్ని హరించేవాడును, సముద్రంలో శయనించువాడును అయిన విష్ణుమూర్తి'ని మహోత్సాహంతో వేనొళ్ళ కొనియాడారు.

జరిగిన సంఘటనకు విచారపడవద్దని విష్ణువు సనకాదులకు చెప్పాడు. ఆ మాటకు వారు పులకించిపోయారు. కన్నులు చెమ్మగిల్లాయి. అంత నా మునులు మునిజనులను కాపాడే వాడును, దేవతలకు అధిపతియు, ఇంతటి వాడని చెప్పసాధ్యం కానివాడునునైన ఆ విష్ణువు దేహాన్ని ఆయన నివాసాన్ని కన్నులార కాంచి కమలాక్షుని యెదుట తలలు వంచారు.

ఇంతవరకు తాము పల్కిన పల్కులు(శాపాదులు) భగవంతుడైన విష్ణువు పల్కించినవిగా భావించి మునులు మహోత్సాహంతో వైకుంఠపుర వైభవాన్ని పొగడుతూ శ్రీహరిచే(అనుమతిబడసినవారై వెళ్ళారు).
('జయ విజయులను శాపగ్రస్తులను చేసిన విషయంలో తాము కేవలం నిమిత్తమాత్రులమే - అంతా ఆ విష్ణువే చేయించాడు' అని సనకాదులు గుర్తించారు. సమస్తం సర్వేశ్వరుని అధీనమే. ఆయన ఆజ్ఞలేనిది చీమైనా కదలాడదనే భావం కానవస్తుంది.)

మునులు శ్రీహరి అనుజ్ఞ గైకొని అక్కడనుండి తమ నివాసాలకు వెళ్ళిపోయారు. వెంటనే శ్రీమహావిష్ణువు జయవిజయుల్ని చూచి సాదరంగా ఇలా అన్నాడు.

జయ విజయులారా! విధిలేక మీరు రక్కసి కడుపున పుట్టవలసివచ్చింది. నేను గొప్పబలం కలవాడనైనా బ్రాహ్మణవాక్కును తిరస్కరించలేను.

బ్రాహ్మణ వాక్కును నేను తిరస్కరించను కాబట్టి, వారి శాపం ప్రకారం మీరు రాక్షసులై పుట్టండి. నాకు శత్రువులై నాతో పోరు సల్పి నన్నే ధ్యానిస్తూ నాచే చచ్చి తిరిగి వైకుంఠం చేరగలరు.

వికసించిన తామరరేకులవంటి కన్నులు గలవాడును, దేవేంద్రుడు మొదలైన దేవతల కిరీటాల మణికాంతులు సోకుటచే మెరుస్తున్న పాదాలు గలవాడును నగు శ్రీహరి భూలోకంలో రాక్షసులై పుట్టండి వెళ్లండి అని జయవిజయుల్ని ఆదేశించి లక్ష్మీదేవి తన వెంటరాగా శాంతిధామం, పుణ్యప్రదమైన తన నివాసం వైకుంఠానికి వెళ్ళాడు.

ఆ తర్వాత విష్ణుమూర్తి భార్యాసమేతుడై లోపలికి వెళ్ళగానే, భయగ్రస్తులైన జయ విజయులు దిగులుపడి, కాంతి తరిగి భూలోకం లోనికి కూలిపోయారు. ఆకాశంలో దేవతల విమానధ్వనులు మూడులోకాల్లో ప్రతిధ్వనించాయి.

"ఆ జయ విజయులే ఇప్పుడు దితిగర్భంలో ఉన్నారు. వారి శక్తియే మహాతేజస్సుగా అయి, మీ శక్తిని హరించి వేసింది" అని బ్రహ్మ దేవతలతో చెప్పాడు.

'దేవతలారా! ఇంతకు ఈ పరిస్థితులకు శ్రీమహావిష్ణువే మూలకారకుడు. ఈ జగత్తు సృష్టి, స్థితి లయాలకు కారకుడు, తుది మొదలు లేనివాడు, కారుణ్యమూర్తి ఆయనే. మీకు ఆయన మేలు చేస్తాడు. చీకుచింతలు మాని వెళ్ళండి. మీ కోర్కెలు నెరవేరుతాయి' అని బ్రహ్మ వారితో అన్నాడు.

బ్రహ్మ అలా చెప్పగానే దేవతలు అసలు కథ తెలిసికొన్నవారై దేవలోకానికి వెళ్ళారు. కశ్యపుని మాటలు విని దితి కూడ అంతగా సంతోషం లేనిదయింది.

జయవిజయులు దితియందు హిరణ్యాక్ష హిరణ్యకశిపులై పుట్టుట

No comments:

Post a Comment

The Battle Between Boar Varaha Avatar and Hiranyaksha - హిరణ్యాక్షుండు యజ్ఞవరాహంబగు హరినెదిరించి పోరుట

హిరణ్యాక్షుండు యజ్ఞవరాహంబగు హరినెదిరించి పోరుట నారదుడు పాతాళానికి పొమ్మని చెప్పగానే హిరణ్యాక్షుడు అగ్గిలాగ మండి పడ్డాడు. విష్ణువుతో తలపడి తీ...