Monday, February 9, 2026

Parikshit Birth to Uttara - ఉత్తరకు పరీక్షిత్తుడు జన్మించుట

ఉత్తరకు పరీక్షిత్తుడు జన్మించుట

ఓ సూతమహర్షీ! కౌరవపాండవుల గురువైన ద్రోణుని పుత్రుడు, అశ్వత్థామ మంచిని మరచి మహాకోపంతో ప్రయోగించిన బ్రహ్మాస్త్రం అగ్ని ఉత్తర కడుపులోని పసిపాపను వణకింపగా శ్రీకృష్ణుడు తన మాయతో ఆ బాలునికి మరణభీతి లేకుండా చేసి బ్రతికించినాడు. అతడు జన్మించి ఎన్నియేండ్లు ఉండినాడు? ఏ విధంగా ప్రవర్తించినాడు? ఏయే కార్యక్రమాలు నిర్వర్తించినాడు? అతనికి శుకమహర్షి పరబ్రహ్మతత్త్వమును ఏ రీతిలో ప్రబోధించి చరితార్జుని గావించినాడు? చివరకు పరీక్షిత్తు తన శరీరాన్ని ఏ విధంగా త్యజించినాడు? నాకు వివరంగా తెలుపవలెనని ప్రార్ధించుచున్నాను అని శౌనకుడు సూతుని అడిగినాడు.

అప్పుడు సూతుడిట్లనినాడు. ధర్మరాజు నాలుగు సముద్రములు సరిహద్దులుగాగల సమస్త జంబూద్వీప సామ్రాజ్యాన్ని సంపాదించి, ఆకాశాన్నంటు కీర్తితో, దాసదాసీజనం, గుఱ్ఱాలు, ఏనుగులు, కాల్బలం, బంగారం మొదలైన సంపదలతో పాలించినాడు. వీరులైన సహోదరులతో, విద్వాంసులతో కలిసి వినోద కాలక్షేపాలు జరిపినాడు. వైభవాలను అనుభవించుచు, యజ్ఞయాగాదులు నిర్వహించినాడు. దుర్మార్గులను దండించి, మంచివారిని, తక్కిన సమస్త జనులను కాపాడినాడు. ఇన్ని ధర్మాలు నిర్వహించుచునే నిరంతరం శ్రీకృష్ణపదారవింద సేవాతత్పరుడై, ఏహ్యములైన బాహ్యసంబంధముల కోరికలు వీడి, కామ, క్రోధ, లోభ, మోహ మద మత్సరములనే ఆరు అంతశ్శత్రువులగుంపును తఱిమి అజాత శత్రువను నామ సార్ధక్యంతో పరిపాలన సాగించినాడు.

ఆకలిబాధతో నకనకలాడువాడు మంచి గంధం మొదలగువానిని పూసికొనుటతో తృప్తిని తానెట్లు పొందడో, అట్లే విష్ణుపాద సేవలందు ఆసక్తిగల ధర్మరాజు అనేక సంపదలు కలిగియుండియు పరిపూర్ణ తృప్తిని పొందలేదు.

అటుపై కొన్ని దినాలకు అభీమన్యుని భార్యయగు ఉత్తరగర్భంలో ఉన్న పసికందుకు పదినెలల గడువు పూర్తి అయింది. అశ్వత్థామ ప్రయోగించిన బాణాగ్నివలన ఆ పసివానికి భరింపరాని పరితాపం కలిగింది. దహింపబడుచు బాధతో ఇట్లు మొర పెట్టుకొనినాడు.

ఓ దైవమా! నే నిప్పుడు తల్లి గర్భగోళంలో ఉన్నాను. మొర పెట్టుకొనుటకు శక్తిలేదు. నాకు దిక్కెవరు? నా తల్లి ఎల్లప్పుడు నేను భర్తలేనిదానను, అనాథను అని దుఃఖింపగా విన్నాను. ఇప్పటి ఈ బాణాగ్ని తొలగిపోవు ఉపాయమేది? నన్ను రక్షించు ప్రభువు ఎవడు? గర్భమునందు కలిగిన ఈ విపత్తును ఎవడు గ్రహింపగలడు? దైవమే కాపాడవలెను.

ఈ నిప్పులు గ్రక్కుబాణమునకు లోనై నేను కడుపులోనే చనిపోయి, పిండం బయటికి రానప్పుడు గర్భం చెదరిపోయినదని మా అమ్మ తెలిసికొన్నచో ఆ గర్భశోకమునకు తట్టుకొనలేక భయంకర యాతనతో తాను మరణించును.

ఆగ్నేయాస్త్రపు మంటలు అతిశీఘ్రంగా సమీపింపగా తప్పక శ్రీమహావిష్ణువు రక్షింపగలడని నిత్యమూ మా అమ్మ సహచరులైన స్త్రీలతో ప్రసంగించే మాటలు నేడు నిజం కాగలవో!

అన్ని జీవులలో ఇచ్చటనే ప్రకాశించుచున్నవాడు మొరపెట్టుకొను నన్ను చూచుటకు (రక్షించుటకు) రాకపోవునా? తప్పకవచ్చి తీరును. అశ్వత్థామ ప్రయోగించిన అగ్నిబాణమును అవలీలగా తొలగించి నాకు ఈనాడు అభయప్రదానము చేయకపోవునా? ఆలోచింపగా ఆయన మొదటినుండి నమస్కరించిన వారిని కాపాడినవాడే కదా! ఎంతమందిని ఆయన రక్షింపలేదు! ఈ సమయమున నా కర్మము ఎట్లున్నదో!

ఆ ప్రకారంగా ప్రాణాలుపోయి పిండంలో ఉన్న బాలుడు ఆలోచించే సమయంలో.

తల్లి కడుపులో తల్లడిల్లే ఆ పిల్లవాడు ఆపదలనుండి కాపాడే అభయప్రదాతను పదే పదే భావించి, ధ్యానించే సందర్భంలో కన్నులపండువుగా మహావిష్ణువు తనయెదుట కనిపించినాడు. తొలకరి మబ్బుపైన క్రొత్త మెరుపుతీగవలె, అతడు తన దేహంపై తళతళమని తళుకులీనే పసుపుపచ్చని పట్టుపుట్టాన్ని ధరించినాడు. అతడు తన చెక్కిళ్లపై మణులు పొదిగిన బంగారు చెవికమ్మలు దాల్చి ప్రకాశించినాడు. ఇక బాణాగ్నిని తొలగించే వేగిరపాటుతో కన్నులెఱ్ఱజేసినాడు. బాలసూర్య మండలమునకు సాటిగా రత్నాలు తాపిన బంగారు కిరీటంతో వెలుగులు చిమ్మినాడు. చేతికి మురుగులు, భుజములకు భుజకీర్తులు, వక్షస్థలంపై వనమాల(
వైజయంతి మాల) శోభిల్లగా సాటిలేనివాడై బొటనవ్రేలెడంత రూపంలో ఒకచేతిలో గద పట్టుకొని కన్పించినాడు.

ఈ రీతిగా భక్తులకు లొంగిన విష్ణువు సాక్షాత్కరించి మంచును తొలగించే సూర్యునివలె బాలునికి పది దిక్కులలో తన చేతి గదను గుండ్రంగా గిరగిరమని తిప్పినాడు. అప్పుడు అది మొక్కవోవని గొప్పనిప్పుమంటవలె గుప్పుగుప్పుమని తిరిగినది. దానితో అశ్వత్థామ ప్రయోగించిన ఆగ్నేయాస్రముయొక్క వేడిమి అణగిపోయింది. బాలకుని చుట్టుముట్టిన సంతాపం నివారింపబడింది. ఎప్పుడు దేహాన్ని చుట్టుకొన్న మంటలు తొలగిపోయినవో అప్పుడు శిశువునకు ఎంతో సంతోషం కలిగింది.

ఓ బ్రాహ్మణోత్తమా! గదను చేతబట్టి అటునిటు అంతట తిరుగుచు, బాలునికి మిక్కిలి భీతిని కలిగించి చెంతకు వచ్చే బాణాగ్నిని, తన గదాప్రసారములచే పొడి పొడి గావించి నన్ను కాపాడే ఈ దయామయుడు ఎవ్వడై ఉండునో అని బాలకుడు తలపోయుచు చూచుచుండగా అంతలోనే విష్ణువు అంతర్ధానమైనాడు.

ఆ సమయాన అనుకూలించే మంచి గ్రహములన్నీ ఉన్నత స్థానాల్లో ఉన్నవి. అన్నింటి మంచిగుణములయొక్క భావిఫలితం సూచింపబడింది. అట్టి శుభముహూర్తంలో పాండవవంశాన్ని నిలిపి ఉద్ధరింపగల కుమారుడు పుట్టినాడు.

అపుడు ధర్మరాజు తమ పురోహితుడైన ధౌమ్యుని, పలువురు బ్రాహ్మణులను రప్పించి పుణ్యాహవాచనం జరిపించి, పుట్టిన వెంటనే బిడ్డలకు చేయవలసిన అనేక సంస్కార క్రియలను నిర్వహింపజేసినాడు. అటుపై బ్రాహ్మణులకు, కుమారుడు పుట్టిన గొప్ప పండుగను పురస్కరించుకొని ఎంతో వైభవంతో గోవులు, భూమి, బంగారం, గుఱ్ఱములు, అగ్రహారాలు దానంచేసి, ఆ బ్రాహ్మణులను ఇష్టాన్నసంతృప్తులను చేసినాడు. వారందరూ సంతోషంతో ధర్మజునితో ఇట్లా పలికినారు.

ధర్మజా! మీ పురువంశపు సంతతి పూర్తిగా నశింపబోతున్నదన్న సమయంలో మీ అదృష్టవశమున మీ వంశ విచ్చిత్తి జరుగనీయకుండ అత్యంత ప్రభావంకల విష్ణువు దయచూపి ఈ పిల్లవానిని బతికించినాడు. కనుక ఇక ఇతడు శత్రు సమూహాన్ని అంతమొందించి, విష్ణురాతుడు అనే పేరుతో ప్రఖ్యాతి వహిస్తాడు.

అని పల్కిన బ్రాహ్మణోత్తములకు నరపాలకులలో శ్రేష్టుడైన ధర్మరాజు ఈ రీతిగా అన్నాడు.

పుణ్యమూర్తులైన ఓ బ్రాహ్మణ శ్రేష్ఠులారా! నా మాటలు విని ఆలోచింపుడు. మా పెద్దలు పేరుప్రతిష్టలతో ఎంతో కీర్తి గడించినవారై దయామయులై, జీవించారు. వారందరు రాజర్షులు. ఈ బాలుడు ఎల్లప్పుడు వారికి సమానుడవుతాడా? నిరంతరం శ్రీమహావిష్ణువుయొక్క పాదపద్మాలపై భక్తి కలిగినవాడై జీవిస్తాడా? చూచి చెప్పండి.

ఆ విధంగా యుధిష్టిరుడు అడుగగా బ్రాహ్మణులు యిట్లన్నారు "ధర్మరాజా! నీ మనుమడు మనువు తనయుడైన ఇక్ష్వాకునివలె జనులను పాలిస్తాడు. శ్రీరామచంద్రునివలె వేదధర్మాలను నిలిపి తాను కావించిన ప్రతిజ్ఞలను నెరవేరుస్తాడు. డేగ తరుముకొనిరాగా శరణుజొచ్చిన పావురాన్ని రక్షించిన శిబి చక్రవర్తివలె శరణాగతులై అండజేరిన వాళ్లను కాపాడుతాడు. దానగుణంలో గనివంటివాడౌతాడు. దుష్యంతుని కుమారుడైన భరతునివలె చంద్రవంశం వారైన తన బంధువులకు, యజ్ఞయాగాదులు కావించే బ్రాహ్మణులకు ఎనలేని కీర్తిని విస్తరిల్లజేస్తాడు. అర్జున కార్తవీర్యార్జునులవలె విలుకాండ్రలో మొట్టమొదట గణింపదగినవాడౌతాడు. అగ్నిహోత్రునివలె తిరస్కరింపరానివాడవుతాడు. సింహంలాగా పరాక్రమాన్ని ప్రకటిస్తాడు. సముద్రంలాగా తరించడానికి అసాధ్యుడౌతాడు. భూదేవివలె అపరిమితమైన ఓర్పును ప్రదర్శిస్తాడు. సూర్యునివలె తేజస్సుతో శత్రువులను తపింపజేస్తాడు. వాసుదేవునివలె సమస్త ప్రాణికోటికి మేలు కలిగిస్తాడు. తల్లిదండ్రులవలె ప్రజలయెడ సహనం కలిగి ఉంటాడు. ఇంతేకాదు, ఇంకను ఎందఱో ప్రసిద్ధ ప్రభువుల గుణాలను తనలో ఇమిడించుకొన్నాడు.

ఓ ధర్మరాజా! నీ మనుమడైన ఈ బాలుడు అభిమానమే ధనముగా గలవాడై, అందరిని సమదృష్టితో చూడడంలో బ్రహ్మవంటివాడవుతాడు. ఇతరులను అధిక ప్రసన్న దృష్టితో అనుగ్రహించటంలో శివుడు. సమస్త ప్రశస్త కల్యాణ గుణాలలో సాక్షాత్తు మహావిష్ణువును, ధర్మాన్ని ఆచరించడంలో యయాతిని, ధైర్యసంపత్తిలో దానవ శ్రేష్ఠుడైన బలిచక్రవర్తిని పోలుతాడు. విష్ణుభక్తిలో ప్రహ్లాదుని వంటివాడవుతాడు. ఔదార్యంలో రంతిదేవునికి దీటుగా ఉంటాడు. మేరువువలె ఆశ్రయింపదగినవాడవుతాడు. ఇతడు కీర్తిని సంపాదిస్తాడు. పెద్దలను మన్నిస్తాడు. అశ్వమేధ యాగాలు చేస్తాడు. గొప్ప కొడుకులను కంటాడు. దుష్టులను దండిస్తాడు.

కలిపురుషుని ప్రేరణచే కలిగిన పాపాలన్నింటిని నశింపజేస్తాడు. శ్రీరామచంద్రునివలె పుడమిని రక్షిస్తాడు. వేదశాస్త్రాలను అనుసరించిన ప్రవర్తనతో మెలగుతాడు. అన్నింటిని మించి అతిముఖ్యంగా విష్ణువునందలి భక్తిని వరించి తరిస్తాడు.

ఈ విధంగా పరీక్షిత్తు చాలా సంవత్సరాలు జీవిస్తాడు. ఒక బ్రాహ్మణ కుమారుడైన శృంగిచే ప్రేరేపింపబడ్డ తక్షకుడనే పాము విషాగ్నిచేత చనిపోతానని తెలిసికొని, అన్ని సంబంధాలను వదలిపెట్టి, విష్ణుని పాదపద్మాలను సేవిస్తూ చివరగా శుకయోగీంద్రునివలన ఆత్మజ్ఞానాన్ని పొంది, గంగానదీతీరంలో తన శరీరం విడిచి, భయమూ, శోకమూ లేని లోకాన్ని పొందుతాడు అని బ్రాహ్మణులు జాతక ఫలితాన్ని సవిస్తరంగా వివరించి, తమ కోర్కెలు తీరేట్లు సంభావనలు పొందినవారై వెళ్లినారు.

తల్లి కడుపులో ఉన్నప్పుడు ముందు తాను ఏ వాసుదేవుని చూచాడో అతడే ఈ సమస్త ప్రపంచంలో ఉన్నాడని కన్నులు విప్పి జన్మించే సమయంలో పరీక్షించడంవల్ల (అన్నివైపులా చూడటం వలన) మానవులు అతణ్జి పరీక్షిత్తు అని పిలిచినారు.

శుక్లపక్ష చంద్రుడు క్రమక్రమంగా కళలతో నిండి ఎలా పరిపూర్ణుడు ఔతాడో అట్లే తాతలు తనను ప్రతిదినం ఎంతో గారాబంగా పోషింపగా పరీక్షిత్తు ధర్మసమూహాన్ని పాలించేంతటి విద్యాబుద్ధులతో పరిపూర్ణుడు కాగలిగాడు.

పరీక్షిత్తు పెరిగి పెద్దవాడౌతుండగా ధర్మరాజు అశ్వమేధ యాగం చేయదలచినాడు. బంధువులను యుద్ధంలో సంహరించిన దోషాన్ని పోగొట్టుకొనడానికై అశ్వమేధయాగాన్ని సంకల్పించినాడు. చాలినంత ధనం లేదని చింతిల్లినాడు. అప్పుడు కృష్ణుడు పూర్వం 
మరుత్తుడనే రాజు యజ్ఞాన్ని నిర్వహించడానికై ఆర్జించిన ధనాన్ని తాను యజ్ఞం నిర్వహింపని కారణంగా భూమిలో నిక్షిప్తం గావించియుండినాడు. దానిని తీసికొని యజ్ఞం చేయుమని ప్రోత్సహించినాడు. భీమార్జునులు ఉత్తరంవైపు పోయి అక్కడ దాచియున్న ధనాన్ని తీసికొని వచ్చినారు. ధర్మరాజు శ్రీకృష్ణునుద్దేశించి మూడు యజ్ఞాలు నిర్వహించినాడు. ద్వారకనుండి హస్తినాపురానికి వచ్చిన శ్రీకృష్ణుడు కొన్ని మాసాలు ధర్మరాజాదులతో గడపి, ద్వారకకు పయనింపగా అర్జునుడు కూడా శ్రీకృష్ణునితో ద్వారకకు పోయినాడు. అంతకుమునుపు విదురుడు మైత్రేయు ని కర్మయోగ రహస్యాన్ని గురించి కొన్ని ప్రశ్నలడిగి, అతనివల్ల ఆత్మజ్ఞాన సంపన్నుడై హస్తినాపురానికి విచ్చేసినాడు.

ఆత్మబంధువైన విదురుడు తీర్థయాత్రలు పూర్తిచేసుకొని హస్తినాపురానికి రాగానే, ధృతరాష్ట్రుడు మొదలైన చుట్టాలు మొత్తం ఎంతో సంతోషంతో ఎదురేగి స్వాగతం పలికారు.

ధృతరాష్ట్రుడు మొదలైన బంధువుల స్వాగత సత్కారాల అనంతరం ధర్మరాజు విదురునికి తన యింట్లో స్నానభోజనాది సత్కార క్రియలు నిర్వర్తించి అతడు సుఖాసీనుడై ఉన్న సందర్భంలో ఆయన దగ్గర చేరి, బంధువులందరు వింటుండగా ఇట్లా అడిగినాడు.

అయ్యా! మీరు ఇంతకాలం ఏయే ప్రదేశాలలో పర్యటించినారు? ఏయే పుణ్యతీర్థాలు చూచినారు? ఎక్కడెక్కడ నివసించినారు? మీవంటి భగవద్భక్తులు తీర్థాలను లెక్కచేయరు గదా! మీలోనే విష్ణువు ప్రకాశిస్తున్నాడు కావున అన్ని తీర్ధాలు మీరే! బాగా ఆలోచించి చూస్తే మిమ్ము మించిన పుణ్యతీర్థాలు పుడమిలో ఎక్కడ ఉన్నాయి? మిమ్ము చూచి మాటాడితే చాలు సర్వశ్రేయస్సులు కలుగుతాయి. ఇక ఇతర తీర్థాలను వెతకవలసిన అవసరమే లేదు. మీరు సర్వజ్ఞులు. పుడమిలో లోకులు ఏమనుకొంటున్నారు? వార్తలేమి? మీరెక్కడ ఉన్నా లోకంలోని విశేషాలు అన్నీ తెలిసికోగలరు.

మా తండ్రి మరణానంతరం మా పెదతండ్రి కుమారులు పలువురు మమ్ము పాములతో కరిపించారు. విషాన్నం తినిపించారు. ఇల్లు తగులబెట్టారు. ఒకటీ రెండూ కాదు. నానావిధాలుగా బాధలు పెట్టి వెతలు కలిగించారు. ఆ సందర్భాలలో మీరు మమ్ము మా భార్యలను, మా తల్లిని చావునుండి కాపాడి, బుజ్జగించి, మా తండ్రివలె పైకితీసికొని వచ్చినారు. అన్ని కష్టాలనుండి ఉద్ధరించినారు. ఆ విషయాలను అన్నింటిని మీరెప్పుడైన తలచుకొందురా?

పక్షులు తమ పిల్లలను రెక్కలలోదాచి, వాటికి రెక్కలువచ్చి ఎగిరేవరకు ఎంతో మమకారంతో ఎట్లా కాపాడుతాయో అట్లా మీరు మమ్ములను రక్షించినందువల్లనే మేము బ్రతుక కలిగినాము. లేనిచో మేము జీవించి ఉండేవారమా?

మీరు తీర్థయాత్రా సందర్భంలో ద్వారకకు వెళ్లినారు కదా! అచ్చట యాదవులు సుఖంగా జీవిస్తున్నారా? శ్రీకృష్ణుని అనుగ్రహం వారు పొందుతున్నారా? ఆ వాసుదేవుని చూచినారా? వారెట్లున్నారో లోకుల వలన మీరేమైనా విన్నారా?

ఈ విధంగా ప్రశ్నించిన ధర్మరాజు మాటలు విని విదురుడు సమాధానంగా లోకమునందలి అన్ని విషయములను వరుసగా విశదీకరించి చెప్పినాడు. కాని యాదవుల వినాశాన్ని గూర్చి ఏమీ చెప్పలేదు. అలా చెపితే ధర్మజుడు భరింపరాని దుఃఖంతో మిక్కిలి క్రుంగి కృశిస్తాడని భావించి చెప్పలేదు.

లోకులు మంచి విషయం చెప్పినచో మేలు మేలు అని మెచ్చుకొంటారు. చెడ్డ విషయం చెపితే అశుభం అని ఛీత్కారం చేస్తారు. పైగా సదయ హృదయుడదైన విదురుడు శూద్ర స్త్రీకి జన్మించినవాడు కనుక మంచివారైన యదువీరుల మరణవార్తను ధర్మరాజుకు చెప్పలేకపోయాడు.

విదురుడు ధర్మస్వరూపుడు. పూర్వం మాండవ్యుడనే మహాముని శాపంవల్ల యముడు శూద్ర స్త్రీ  గర్భంలో విదురుడైపుట్టి వంద యేండ్లు జీవించినాడు. ఆ నూరు సంవత్సరాలు యముని తండ్రియైన సూర్యుడే క్రమం తప్పకుండా యథావిధిగా యమధర్మరాజు స్థానంలో ఉండి పాపాత్ముల పాపకర్మలకు తగినట్లు శిక్షలు విధించినాడు.

ఇక ధర్మరాజు రాజ్యాన్ని స్వీకరించి, దిక్పాలుర వంటి సోదరులతోకూడి, కులదీపకుడైన మనుమడు పరీక్షిత్తును అల్లారుముద్దుగా పెంచి పెద్దచేసి ఎంతోకాలం మిక్కిలి వైభవంతో సుఖంగా ఉండినాడు.

మంచి మనస్సుగల శౌనకా! విన్నావు కదా! కన్నెప్రాయపు కాంతాజనాలు, ఆనంద భవనాలు, అపారధనాలు, అందాలవనాలు మొదలైన భోగభాగ్యాలపై అమితమైన ఆసక్తిని పెంచుకొని అందులో పూర్తిగా మునిగిపోయి, అనుక్షణం అదే సౌఖ్యమని అందుకై అఱ్ఱులుచాచే మానవులను కాలం మోసం చేస్తుంది. వంచనాశీలమైన కాలప్రవాహం దురవగాహమైంది.

గాంధారీ ధృతరాష్రులు దేహత్యాగము

No comments:

Post a Comment

Sree Maha Bhagavathamu Part 2 - శ్రీ మహా భాగవతము ద్వితీయస్కంధము

శ్రీ మహా భాగవతము ద్వితీయస్కంధము శ్రీ మహా భాగవతము ద్వితీయ స్కంధము ప్రారంభము శుకుడు పరీక్షిత్తునకు ముక్తి మార్గంబుందెల్పుట