Wednesday, February 25, 2026

The Rivalry Between Daksha and Shiva stemmed from Daksha's immense ego - ఈశ్వరునకు దక్షప్రజాపతికిని విరోధము సంభవించుట

ఈశ్వరునకు దక్షప్రజాపతికిని విరోధము సంభవించుట

దక్షప్రజాపతి కుమార్తె సతి. ఆమె భవుడి భార్య. ఆమె ఎంతో పతిభక్తి కలది. అయినా సంతానయోగం లేదు. తన మగడంటే పడని తన తండ్రిమీది కోపం కొద్దీ మరొకదారి లేక అమాయకంగా యోగమార్గంతో దేహాన్ని చాలించింది అంటూ మైత్రేయుడు విదురుడితో చెప్పాడు. అది విన్న విదురుడికి ఎంతో ఆశ్చర్యం అయింది. ఆ సంగతంతా తెలుసుకోవాలనే ఉబలాటంతో ఆ మైత్రేయుణ్లి చూసి ఇలా పలికాడు.

నేర్పరివైన ఓ మైత్రేయ మహర్షీ! దక్షుడికి కూతుళ్లంటే ప్రాణం. అంతటి ప్రేమైక మూర్తి అయిన దక్షుడు 'సతీదేవి'ని మన్నించక పోవడానికి మూలకారణం ఏమై ఉంటుంది. శివుడు చరాచర ప్రపంచాని కంతటికీ తండ్రి. శత్రుభావన లేనివాడు. ప్రసన్నమూర్తి. మహోన్నతుడు. సమస్తలోకాలకు దైవం. ఆత్మారాముడు. సజ్జనుల్లో మేటి. అలాంటి మహాదేవుడి మీద దక్షుడికి వైరం ఎందుకు కల్గి ఉంటుంది? ఏ కారణంగా సతీదేవి విడువదగని తన ప్రాణాలు విడిచింది? మామ అల్లుళ్ల మధ్యగల ద్వేషభావాన్ని నాకు తెలిసేటట్లు వివరించండి.

అలా అడిగిన విదురుడితో, మైత్రేయుడు చాల కుతూహలంగా చెప్పసాగాడు. ఓ విదురా! పూర్వకాలంలో నవబ్రహ్మలు సత్రయాగం చేయ తలపెట్టారు. ఆ యజ్ఞాన్ని ప్రజలంతా ఇష్టపడేలా చేయాలని వాళ్ల తలంపు. దాన్ని చూడడానికి

(బ్రహ్మలు తొమ్మిదిమంది. భృగువు, పులస్త్యుడు, పులహుడు, క్రతువు, అంగిరసుడు, దక్షుడు, అత్రి, మరీచి, వశిష్ఠుడు అనేవారిని నవబ్రహ్మలంటారు.)

బ్రహ్మ, శివుడు, యోగులు, దేవతలు, మునులు, మహర్షులు, అగ్ని నవ బ్రహ్మలు ఆసక్తితో విచ్చేశారు. సూర్య ప్రభలతో సాటి కాగల తేజం గల దక్షప్రజాపతి అరుదెంచాడు. అతడు రాగానే బ్రహ్మ, శివుడు తప్ప సభలోని మిగతా వాళ్లంతా గౌరవంగా లేచి నిలబడ్డారు.

అట్లా విచ్చేసిన దక్షుడు బ్రహ్మకు నమస్కరించాడు. సభాసదులంతా చేసిన సత్కారాల్ని అందుకున్నాడు. తనకు తగిన పీఠం మీద ఆసీనుడయ్యాడు.

తాను రాగానే అందరూ లేచినా శివుడు మాత్రం తన ఆసనం దిగలేదు. అది చూసి దక్షుడు రోషపడ్డాడు. కంటికొనల్లో అలముకొన్న చురచుర చూపులు తళుక్కుమన్నాయి. వాళ్లతో ఇలా సంభాషించాడు.

విబుధులారా! మహర్షులారా! అగ్నిమొదలగు దేవతలారా! మీరంతా మీ మాటలు మాని నా మాటలు ఆలకించండి. నా వచనాలు కేవలం తెలివిమాలి ఈర్ష్యతో పలికేవి కావు అంటూ శివుణ్ణి వేలెత్తి చూపిస్తూ

ఆలోచించి చూడగా శివుడు అష్టదిక్పాలకుల ప్రతిష్టను మంటగలుపుతున్నాడు. వైదికంగా పనీపాటాలేని ఇతడివల్ల సచ్చీలుర పంథా పాడయిపోయింది. పట్టి చూస్తే సిగ్గు లేనివాడు కూడ. మరొక సావిత్రి అనదగిన నా బిడ్డను పెద్దల సమక్షంలో పెళ్లాడాడు. నా కూతురు పరమసాధ్వి, బెదురుచూపులు కలది. అమాయకురాలు. శివుడివి కోతిచూపులు. ఈ రీతి శిష్యుడు కావటాన్ని బట్టి అయినా భావించి ఎదురువచ్చి నమస్కరించకపోతే పోనీ. నన్ను చూడగానే చిన్నపలుకు పలికే మాత్రానికి తన నోటికి ఏమి తక్కువయింది?

ఈ శివుడు యాగక్రియానుష్థానాదులు ఎపుడూ చేసి ఎరుగనివాడు. ఆత్మాభిమానం లేనివాడు. అహంకారంతో తిరిగేవాడు. వెఱివాళ్లకు హితుడు. దిసమొలవాడు. భూతపిశాచాదులు ఇతడిచుట్టూ ఉంటాయి. తామస ప్రవృత్తిగల శివభటులకూ, భూతగణాలకూ ఇతడు ఏలిక. ఒళ్లంతా బూడిద పులుముకుంటాడు. ఎముకలే ఇతడి నగలు. శుచిని పాటించనివాడు. పిచ్చివాళ్లకు ఇతడు మారాజు. దుష్టమనస్వి. భీతి పుట్టే ఆకారం కలవాడు. శ్మశానమే ఇతడి నివాసస్థానం. విరియబోసిన (జారిన) జుత్తు కల్గి ఉంటాడు. ఇతడికి శివుడనే పేరు దేశమంతా ఎలా వ్యాప్తి చెందిందో? కాని ఈ అమంగళుడైన శివుడికి, తెలిసి తెలిసి శూద్రుడి చేతిలో వేదం పెట్టినట్లు

ఇలాంటివాడికి నా బిడ్డను కట్టబెట్టాను. అంతా విధిప్రేరితం.

ఓ పుణ్యమనస్కుడా! ఈ తీరున తిరస్కరపుమాటలు మాట్లాడి దక్షుడు శివుణ్ణి శపించడానికి పూనుకున్నాడు. చేత నీళ్లుపట్టి నిలిచి రోషంగా ఇలా అన్నాడు.

శివుడి చుట్టూ ఇంద్రుడు, విష్ణువులుండగా "యజ్ఞసమయంలో మిగతా దేవతలతోపాటు హవిర్భాగం లభించకుందుగాక" అని శపించాడు.

ఈ తీరున దక్షుడి దూషణల్లోని వాక్యాలు ఎక్కువగా నిందించినవి అయినప్పటికీ ఆ మహాదేవుడి విషయంగా అర్థాంతరంలో ఆ నిందలు స్తుతులుగానే పరిణమించాయి. ఆ తర్వాత శివుణ్ణి  శపించిన కారణంగా దక్షుణ్ణి, సభలో ముఖ్యమైన వాళ్లందరూ ఇది తగని పని అని వారించారు. ఆ అడ్డగింత దక్షుడిలో కోపాన్ని మరింత హెచ్చించింది. ఏమీ అనలేక ఇంటికి వెళ్ళిపోయాడు.

ఆ పిమ్మట శివుడి కింకరుల్లో మొదట లెక్కించదగ్గ నందికేశ్వరుడు 'శివుణ్ణి శపించడం, శివుణ్ణి గూర్చిన అనుచితవాక్యాలు' విన్నాడు. కోపంతో అతని కళ్లు ఎర్రబారగా. ఇట్లా అన్నాడు. ఈ దక్షుడు నశించే స్వభావంగల మానవ శరీరాన్నే ఉత్కృష్టమైందిగా భావించాడు. తిరిగి చెడుచేయ తలపెట్టని శివుడిపట్ల వేర్పాటుధోరణి కలవాడై అతడికి ద్రోహం తలపెట్టాడు. ఇలాంటి జడుడు, పరతత్త్వజ్ఞానం పట్ల అనాసక్తుడవుతాడు. కపటాచారాల నివాసాలలో, స్త్రీ కామనతో విధినిషేధ రూప భేదాలవల్ల మతి తప్పి కర్మసిద్దాంతాల్ని విస్తరింపచేస్తాడు.

ఇతడు శరీరాదుల్నే మేల్తరంగా యోచించాడు. అందువల్ల ఇతడు పరాత్పరుడి తత్త్వాన్ని గ్రహించుకోలేని పశుతుల్యుడు. స్త్రీవ్యామోహితుడు. ఇతడు మిక్కిలి తొందరలోనే మేకముఖం కలవాడవుతాడు.

ఈ దక్షుడు తనలోపలి అవిద్యనే ముఖ్య తత్త్వజ్ఞానంగా ఎపుడూ భావిస్తుంటాడు. ఇతడు శివుణ్ణి  అవమానించిన దుష్టుడు. ఇతడి మార్గాన్ని ఆమోదించేవాడు ఇతడితోపాటు ఎపుడూ సంసారకర్మల్లోపడి పుడుతూ చస్తూ మళ్లీ మళ్లీ పుడుతూ ఉంటాడు.

అంతేకాక ఈ శివద్రోహులు విధినిషేధ రూపంలో ప్రతిపాదితమైన విషయాన్ని బలపరచే, స్తుతి వచనాల నుండి దూరమైనందు వల్ల కల్లు, తేనెల వంటి స్వర్గ సౌఖ్య పురుషులతో మనోవికలురై కర్మకాండల మీద మోజు కల్గిన వారవుతారు. ఇంకా 'ఇవి తినదగ్గవి, ఇవి తినగూడనివి' అనే యోచన లేనివారవుతారు. కేవలం దేహధారణ కోసమే విద్య, తపస్సు, వ్రతాలు ఆచరిస్తారు. ధనం, దేహం, ఇంద్రియాల సుఖాన్నే ప్రీతిగా భావిస్తారు. వేడుకపడి భిక్షాటనం చేస్తారు అంటూ నందికేశ్వరుడు బ్రాహ్మణుల్ని శపించాడు. వీటిని విన్న భృగుడు ప్రతిశాపం పెట్ట పూనుకుని ఇలా అంటాడు.

ఈ దేశంలో శివదీక్షాపరులూ, వీళ్లపక్షం ఉండేవాళ్లూ ఉత్తమ శాస్త్రాలన్నింటిని వ్యతిరేకించే వాళ్లూ 'పాషండులు' అవుతారు అని శపించాడు.

(ధూర్దటి= బరువైన జడలు కలవాడు వ్యుత్పత్తి, శివుడు(అమరకోశం) పాషండుడనగా కర్మభ్రష్టుడు)

వేదం అన్ని వర్ణాలవారి ఆచారాలకు పెన్నిధి. ప్రపంచానికి మేలుకల్గించేది. సనాతనమయింది. పూర్వపు మునుల సమ్మతి కలది. విష్ణువే ప్రమాణదైవంగా కలది. ఎప్పటికీ నశించనిది. పవిత్రమయింది. శుభకరమైంది. శిష్టుల పంథా ననుసరించేది. అలాంటి వేదాన్సీ బ్రాహ్మణజాతినీ దూషించిన కారణంగా శివవ్రతులు ఎవరికైనా మధ్యమజనులచే పూజింపబడే భూతపతే దైవం అవుతాడు. ఇట్టివారు బూడిద, జడ, ఎముకలనూ ధరిస్తారు. మూఢులుగా, శుచీ శుభ్రం పాటించని వేద బాహ్యులుగా అంతం అవుతారు అని భృగుమహర్షి శపించాడు.

(జనైః అర్హతే - యాచ్యతే ఇతి జనార్దనః - జనులచే పురుషార్థ విషయమై కోరబడేవాడు, జనాన్‌ అర్దయతి= పీడయతి= కోరికలు తీర్చేందుకు జనంచే యాచించబడేవాడు, జన్మల్ని నశింపచేసేవాడు.

నందికేశ్వరుడు, భృగుమహర్షి ఒకరినాకరు శపించుకున్నా దైవకృపవల్ల వారు ఎలాంటి నాశాన్ని పొందలేదు. అయినా శివుడు వికల మనస్కుడై తన అనుచరులతో సహా అక్కణ్ణుంచి వెళ్లిపోయాడు.

(విమనస్కుడు అంటే జరిగిన సంఘటనను మనస్సునకు పట్టించుకోనివాడై అనే అర్ధాన్ని సంభావించటం సముచితం.)

ఏ యాగకర్మకైనా విష్ణువే సర్వపూజ్యుడు. అలాంటి యాగాన్ని బ్రహ్మదేవుడు వెయ్యేళ్లపాటు చక్కగా అనుష్ఠించాడు. 'సురనది గంగానది, యమునానది సంగమ స్థలం' అయిన ప్రయాగలో యజ్ఞసమాప్తి స్నానం ఎంతో భక్తితో చేశారు. అందు పాల్గొన్నవారు గతంలోని పాపాలన్నీ తుడిపేసుకొని నిర్మలులుగా ఘనత పొందారు. వాళ్లంతా తమ తమ ఆశ్రమభూములకు ఎంతో సంతోషంతో వినోదంగా తరలి వెళ్లారు అంటూ విదురుడికి మైత్రేయుడు తేటతెల్లంగా వినిపించి, మళ్లీ ఇలా అన్నాడు.

దక్షప్రజాపతి యజ్ఞము చేయునపుడు దాక్షాయణి యచ్చటికింబోవుట

No comments:

Post a Comment

After Virabhadra Destroyed Daksha's Yagna, Demigods, Priests Approached Lord Brahma - దేవతలు వీరభద్రాదులచే బరాజితులై బ్రహ్మతో విన్నవించుట

దేవతలు వీరభద్రాదులచే బరాజితులై బ్రహ్మతో విన్నవించుట శివుడి ప్రమథసేనలచే దేవతలంతా వాళ్ల కత్తులు, గదలు, చురకత్తులు వంటి పోటు ముట్టుల తాకిళ్లకు ...