కుంతీదేవి శ్రీకృష్ణుని స్తుతించుట
కృష్ణా! నీవే ఆదిపురుషుడవు. అందరిచేత స్మరింపబడేవాడవు. జగత్తుకన్న వేరుగా ఉండేవాడవు. నాశనం లేనివాడవు. సమస్తభూతములలో లోపల వెలువల ప్రకాశించేవాడవు. లోకేశ్వరుడవు. ప్రభువులకే ప్రభుడవు. అట్టి నీకు నమస్కారములు అర్పిస్తున్నాను.
అంతేకాక తెరచాటున నిలువబడి నాట్యాన్ని ప్రదర్శించే నటునిలా మాయ అనే తెరమాటున ప్రవర్తించు నీ మహిమ అవాఙ్మానస గోచరమైనది. పరమహంసలు, రాగద్వేషాలు లేనివారు, విమల మనస్కులు అయిన మునీశ్వరులకు గూడ నీవు కానరావు. పరిపూర్ణుడవు. అటువంటి నీవు అజ్ఞానులమై సంసారంలో మునిగిన మాకు ఎలా దర్శనమిస్తావు? శ్రీకృష్ణా! వసుదేవనందనా! దేవకీతనయా! నందగోపుని ముద్దుబిడ్డడా! గోవింద! పద్మనాభా! వనజమాలా విభూషితా! కమలలోచనా! అరవింద సదృశచరణయుగళా! హృషీకేశా! భక్తిపురస్సరంగా నీకు వందనమాచరించెద. నా విన్నప మాలకించు.
భగ భగ మండిపోతున్న లక్కయింట్లో నేను, నా బిడ్డలు కాలిభస్మమై పోకుండా కాపాడావు. దుర్యోధనుడు తినిపించిన కాలకూట విషపూరితాన్నంతో భీముడు మరణించకుండా రక్షించావు, ధృతరాష్టసూనుడు దుర్మదంతో కట్టుబట్టలొలువబోగా, ద్రౌపది అవమానం పాలుకాకుండా మానసంరక్షణం కావించావు. భీష్మద్రోణ కర్ణాదివీరాధి వీరులచే నా బిడ్డలు యుద్ధరంగంలో నలిగిపోకుండా చేశావు. ఉత్తర కడుపులో పెరుగుతున్న గర్భాన్ని అశ్వత్థామ బాణాగ్నిచే నాశనం కాకుండా చక్రం అడ్డువేశావు. పెక్కు విధాలుగా నన్నూ నా బిడ్డలను సంరక్షించావు. నిన్ను ఏమని వర్ణించగలనయ్యా!
జగదీశ్వరా! మహాబలవంతుడైన కంసునిచేత బాధపడుతున్న మీ తల్లిని కాపాడినట్లుగా, దుర్యోధనాదులచేత నేను బాధ పొందకుండా నీవే కాపాడావు. నీ అనంత గుణసముదాయాన్ని వర్ణించడానికి నేను ఏ పాటిదానను?
మాది గొప్ప వంశం లేదా గొప్ప కులం అనే ఆభిజాత్య మదం, ఐశ్వర్యమదం, ధనమదం, విద్యామదం కలిగినవారు దీనులకు మాత్రమే గోచరించే నిన్ను స్తుతించలేరు.
కృష్ణా! నీవు భక్తులకు కొంగుబంగారం వంటివాడవు. గుణవృత్తులైన ధర్మం, అర్థం, కామం అనే త్రివర్గం లేనివాడవు. రాగం, ద్వేషం ఇత్యాది ద్వంద్వాలు నీ చెంతకు రాలేవు. ముక్తిప్రదాతవు. కాలస్వరూపుడవు. యోగ్యతానుసారంగా సమస్తాన్ని నియమించేవాడవు. ఆది, అంతం లేకుండా ఉండేవాడవు. సృష్టి సర్వస్వాన్ని నీ అధికారంలో ఉంచినవాడవు. అందరియెడ సమభావంతో వర్తించేవాడవు. సకలప్రాణికోటులను శిక్షించడంలో, రక్షించడంలో కడు సమర్థుడవు. నిన్నుసదా మనస్సులో ధ్యానించి వందనాలు అర్పిస్తున్నాను.
అవతారపురుషుడవైనా, మానవ ప్రవృత్తులను అనుకరించే నీ లీలలు గ్రహించడం ఎవరికీ సాధ్యంకాదు. నీకు కావలసిన వారూ లేరు. అక్కరలేని వారూ లేరు. హితులూ లేరు. అహితులూ లేరు. జన్మకర్మలు అనేవి నీకు లేనేలేవు. తిర్యగ్జంతుజాలాలలో వరాహాదిరూపాలలోను, మానవులలో శ్రీరామాదిరూపంలోను, ఋషులలో వామనాది రూపాలలోను, జలచరాలలో మత్స్యాది రూపంలోను నీ వవతరించడం ఈ లోకంకోసమే కాని సత్యానికి నీకు జన్మమూలేదు. కర్మసంబంధాలు లేవు.
ఎంతటి మహానుభావుడవు నీవు? ఆనాడు చిన్నతనంలో ఒక పసిపాపడులా ఎలా ప్రవర్తించావయ్యా! ఒకనాడు యశోద కడుపారా పాలుత్రాగని నిన్ను ఒడిలోనుంచి, క్రిందకు దింపి, పొయ్యిపై పొంగుతున్న పాలకుండను దించుటకై లోనికేగగా, కోపంతో నీవు పెరుగుకుండను చిన్నరాతితో పగులగొట్టావు. తిరిగివచ్చి నేలపాలైన పెరుగును చూచి యశోద కుపితురాలయింది. ఒక త్రాటితో నిన్ను రోటికి కట్టివేసింది. నీవు ముఖం చిన్నబుచ్చుకొని, వెక్కి వెక్కి ఏడుస్తూ, కన్నుల కాటుక చెరిగిపోతూ ఉండగా, నయనాలు రుద్దుకొంటూ, గట్టిగా నిట్టూరుస్తూ ఒక చిన్నపిల్లవాడిగా నటించడం నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది కృష్ణా!
అనంతా! మలయగిరిపై మంచిగంధపు చెట్టు వెలసినట్లుగా ధర్మపుత్రుని కీర్తి వ్యాపింపజేయడానికై, పుట్టుకలేని హరి భూమిపై యాదవకులంలో అవతరించాడని కొందరంటారు.
పరాత్పరా! వసుదేవుడు, దేవకి పూర్వజన్మలో అధికమైన తపస్సుచేసి నిన్ను పుత్రునిగా జన్మించుమని కోరారు కదా! వారి ప్రార్ధన మన్నించి దానవసంహారానికై అవతరించావని మరికొందరు అంటారు.
లెక్కకందని గుణాలు గల స్వామీ! నడి సముద్రంలో మునిగిపోయే ఓడలా, భరించరాని భారంతో క్రుంగిపోయే భూమిని ఉద్ధరించడానికై బ్రహ్మదేవుడు ప్రార్ధించగా అవతరించావని వేరే కొందరు అంటారు.
జన్మరహితుడా! తమ కర్తవ్యమయిన స్వస్వరూప జ్ఞానాన్ని కొందరు జీవులు విస్మరిస్తారు. అజ్ఞానంలో మునిగి తేలుతారు. నిరంతరం కోరికలతో కర్మలు ఆచరిస్తారు. తత్ఫలితంగా సంసారచక్రంలో పరిభ్రమిస్తూ ఉంటారు. అటువంటి వారికి విముక్తి కలిగించడానికై, వారు తరించడానికి వీలుగా శ్రవణం, స్మరణం, వందనం, అర్చనం మున్నగు నవవిధ భక్తిమార్గాలు ప్రసాదించడానికై నీవు అవతరించావని మరికొందరు అంటూ ఉంటారు.
కృష్ణా! విశ్వేశ్వరా! విశ్వంభరా! నీవు బ్రహ్మాండాలనన్నింటినీ నియమించేవాడవు. అన్ని లోకాలను భరించేవాడవు. నీ పాదపద్మాలు అనంతజన్మ పరంపరలను అంతం చేసేవి. యోగీశ్వరులు నిత్యం వేదవాక్యాలతో ప్రస్తుతించేవి. నిన్ను స్మరిస్తూ, పొగడుతూ, గానం చేస్తూ నీ కథలు శ్రవణం చేస్తూ ఉండేవారు మాత్రమే నీ పాదపద్మాలను దర్శించగలుగుతారు. అన్యులు ఇతర మార్గాలద్వారా నీ పాదధూళిని కూడ వీక్షించలేరు.
కృష్ణా! మాకు నీకన్న వేరే రక్షకుడు లేడు. నీ పాదపద్మాలనే పూర్తిగా ఆశ్రయించి బ్రతుకుతున్నాము. మమ్ము విడిచిపెట్టి ద్వారకానగరం వెళ్లిపోతావా? నీవు నీ కరుణాకటాక్ష వీక్షణాలతో చూడకపోతే యాదవులుకాని, పాండవులు కాని బ్రతికి బట్టకట్టగలరా? ఇంద్రియాలు జీవుని విడిచి ప్రవర్తించగలవా? నీవులేనిచో మాకు నామరూపాలు లేవు. కీర్తిప్రతిష్టలు లేవు. ఇక మాకు హీనదశ రాకుండపోతుందా? పద్మం, వజ్రం, మత్స్యం ఇత్యాది మంగళ చిహ్నాలతో కూడుకొన్నవి నీ పాదాలు. అట్టి నీ అడుగులచే ఈ భూమండలమే పరమపవిత్రమయింది. నీవు మమ్మల్ని విడిచిపెడితే ఈ ప్రాంతం బోసిపోతుంది. కళావిహీనమయిపోతుంది. నీ దయార్ద్రమైన చూపులతో తడుపబడి ఇచ్చట జనప్రదేశాలు పూలతోను, పండ్లతోను నిండిన ఓషధులతోను, చెట్లతోను, తీగలతోను, పొదలతోను, నదీనదాలతోను కన్నుల పండువు చేస్తున్నాయి.
జగదీశ్వరా! పరమేశా! ఆత్మీయులైన యాదవులందు, పాండవులయందు నాకున్న అనురాగపాశాన్ని త్రెంచివేయి. మహాసముద్రంలో కలసిపోయే గంగాతరంగిణిలాగా నా మనస్సు నీ పాదసంస్మరణంలో లగ్నమయ్యేలా చేయవయ్యా!
శ్రీకృష్ణా! యదుకులాలంకారా! అర్జున ప్రాణమిత్రమా! శృంగారసముద్రా! లోకకంటకులైన రాజులను దహించేవాడా! జగదీశ్వరా! దేవతలను, బ్రాహ్మణులను, గోగణాలను ఆర్తినుంచి తొలగించేవాడా! మోక్షప్రదాయకా! కరుణాపయోనిధీ! నీకు నమస్కరిస్తున్నాను. నా భవబంధాలు ఖండించు.
కుంతీదేవి సత్యమధుర వాక్కులతో భగవంతుని ఈ విధంగా ప్రార్ధించగా, ఆయన ఆమె వచనాలను స్వీకరించాడు. తన మాయాపూరిత మందహాసంతో ఆమెను తిరిగి ప్రపంచంలో ప్రవర్తించేలాగా వ్యామోహానికి గురి చేశాడు. రథాన్ని అధిరోహించాడు. హస్తినాపురానికి కురుక్షేత్రం నుంచి పాండవసమేతంగా విచ్చేశాడు. కొంతకాలం అక్కడ ఉండి కుంతిని, సుభద్రను, తక్కినవారిని సెలవుగైకొని తనద్వారకకు వెళ్లడానికి పూనుకొన్నాడు. మరికొంతకాలం ఉండుమని ధర్మరాజు బతిమాలగా అచ్చటనే ఉండిపోయాడు.
ధర్మరాజు తాను చేసిన కురుక్షేత్ర సంగ్రామాన్ని కన్నుల ముందుకు తెచ్చుకొని, ఆలోచనలోపడి దుఃఖంలో మునిగిపోయాడు. కృష్ణుడు, వ్యాసుడు, ధౌమ్యుడు ఎన్నివిధాల ఉపదేశం చేసినా, ఆతని మనస్సుకు ఊరట లభించలేదు. చుట్టాలనందరిని చంపివేశానన్న అతని శోకానికి వారి ఉపశమన వాక్యాలు ఓదార్పునందించలేకపోయాయి. అతనిలో జ్ఞానం అంతరించి అజ్ఞానం ఆవరించింది. ఇలా మనస్సులో భావించి అన్నాడు.
తన శరీర పోషణకోసం నోరులేని జీవాలైన మృగాలను చంపించే దుర్మార్డునికి, నాకు తేడా ఏముంది కనుక? రాజ్యకాంక్షతో గురువులను, పసివారిని, బ్రాహ్మణులను, సుతులను, సోదరులను సంహారం చేయించాను. నావంటి పాపాత్ముడు ఎందైన ఉంటాడా? ఎన్ని లక్షల సంవత్సరాల పర్యంతం నరకలోక వాసనలు అనుభవించినా ఈ పాపం అడుగంటుతుందా?
ప్రజలను న్యాయబుద్ధితో పరిపాలించే రాజేంద్రుడు ధర్మయుక్తంగా యుద్ధం కావించి వైరివీరులను చంపడంలో దోషంలేదని శాస్త్రాలు వక్కాణిస్తున్నాయి. ఆ మాట నాకు దుఃఖాన్ని పోగొట్టడంలేదు. రథగజతురగపదాతులనే చతురంగ బలాలతో కూడుకొన్న అక్షౌహిణులకొలది సైన్యాన్ని చంపించాను. నా రాజ్యకాంక్షే ఇంతటి అనర్దానికి దారి తీసింది. ఆత్మీయులనందరిని యుద్ధంలో చంపించి కులకాంతలకు తీరనిద్రోహం చేశాను. నా అపరాధానికి ప్రాయశ్చిత్తం లేదు. పాపనివృత్తికొరకై గృహస్థులకు కొన్ని ధర్మాలు, యాగాలు విధించబడిన మాట సత్యమే. అశ్వమేధయాగం మున్నగు యజ్ఞక్రియలద్వారా బ్రహ్మహత్యాది దోషాలు పరిహారమవుతాయని వేదాలు ఘోషిస్తున్నాయి. కాని బుద్ధిపూర్వకంగా చేసే జీవహింసకు పరిహారం ఉంటుందా? బురదచేత బురద నిండినచోటు పరిశుభ్రమవుతుందా? కల్లుచేత కల్లుకుండ శుద్ధమవుతుందా? కోరికలతో కూడుకొని మనఃపూర్వకంగా చేసే జీవహింసతో కూడుకొన్న యాగాలచేత మానవులపాపం పెరుగుతుందేకాని తరగదని నా సందేహం. అందులకై శోకిస్తున్నాను.
ధర్మపుత్రు డీవిధంగా యుద్ధం పేరుతో జనద్రోహం చేశానని, తన పాపానికి పరిహారంలేదని మనస్సులో శోకించాడు. భోజనం చేయాలనే సంకల్పంకూడ ఆయనకు కలగలేదు. ఒక్కసారి భీష్ముని సందర్శించి రావాలనే కాంక్ష ఆయనలో బయలుదేరింది. వెంటనె కురుక్షేత్రానికి పయనమయ్యాడు.
Subscribe to:
Post Comments (Atom)
kunthi devi praying sri krishna Kunti Stuti - కుంతీదేవి శ్రీకృష్ణుని స్తుతించుట
కుంతీదేవి శ్రీకృష్ణుని స్తుతించుట కృష్ణా! నీవే ఆదిపురుషుడవు. అందరిచేత స్మరింపబడేవాడవు. జగత్తుకన్న వేరుగా ఉండేవాడవు. నాశనం లేనివాడవు. సమస్తభూ...
-
సూర్య ద్వాదశ నామాలు ధ్యేయః సదా సవితృమండలమధ్యవర్తీ నారాయణః సరసిజాసన సన్నివిష్టః । కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటీ హారీ హిరణ్మయవపుః ధృతశంఖచక్రః ...
-
ఆదిత్యహృదయం తతో యుద్ధపరిశ్రాంతం సమరే చింతయా స్థితమ్ | రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితమ్ || 01 || దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతో ...
-
శ్రీ దేవీ భాగవతము నవమ స్కంధములోని శ్రీ సరస్వతీ కవచం ఓం శ్రీం హ్రీం సరస్వ త్త్యై స్వాహా -శిరో మే పాతు సర్వతః | ఓం శ్రీం వాగ్దేవతాయై స్వాహా -ఫ...
No comments:
Post a Comment