శ్రీ యజ్ఞ వరాహావతార వర్ణనము
బ్రహ్మతన మదిలో "ఈ లోకాలన్నింటిని సృష్టించాలని ఆరాట పడుతున్నాను. మరి ఇప్పుడు పాతాళగుహ చొచ్చిన ఈ భూమిని ఎలా ఉద్ధరించాలి?" అని అనుకొంటూ చరాచరప్రాణికోటిలో ఆత్మస్వరూపుడుగా ఉన్నవాడునూ, పురుషశ్రేష్ఠుడునూ, అప్పుడే విచ్చిన తామరలవంటి కన్నులు కలవాండునూ, అయిన రమాపతిని స్మరించుకొనుచుండగా, అంతలోనే ఆయన ముక్కురంధ్రం నుండి 'యజ్ఞవరాహరూపు'డైన మాధవుండు బొటనవేలంతరూపంతో పుట్టి, చూపరులకు ఆశ్చర్యం గొల్పేటట్లు నింగి కెగబాకి, వెంటనే ఒకపెద్ద ఏనుగంత ఆకృతిని తాల్చాడు.
బ్రహ్మదేవునిచే ప్రజోత్పత్తి యందు నియమితులైన మరీచిమొదలైన నవబ్రహ్మలును, స్వాయంభువమనువుతో కూడిన ఆయన కుమారులును బ్రహ్మనాసారంధ్రంనుండి పుట్టిన యజ్ఞవరాహరూపాన్ని తిలకించారు. "అహో! ఎక్కడైన ఇంతటి వింత ఉందా? మనం చూస్తుండగానే ఈ 'పందిపిల్ల' బొటనవ్రేలంత కన్పించి అంతలోనే ఏనుగంతగా, పెద్దబండ అంతగా మారిపోయింది ఆశ్చర్యం" అనుకొన్నారు. అపుడు బ్రహ్మ పులకించిపోయి ఇలా అన్నాడు.
(సర్గం అంటె సృష్టి, ఈ సృష్టి తొమ్మిది రకాలు. 1) మహత్సర్గం 2) అహంకారసర్గం 3) భూతసర్గం 4)ఇంద్రియసర్గం 5) దేవసర్గం 6) తమస్సర్గం 7) వనస్పత్యాదిసర్గం 8) తిర్యక్సర్గం 9)మనుష్యసర్గం కుమారసర్గమనేది కూడ ఉంది. అయితే ఇది మనుపష్యసర్గం లోనిదే. విడిగా గ్రహిస్తే 'దశవిధసర్గాలు' అవుతాయి.
మరీచ్యాదులను నవబ్రహ్మలంటారు. వారు - 1 మరీచి 2) భరద్వాజుడు 3) అంగీరసుడు 4)పులస్త్యుడు 5) పులహుడు 6) క్రతువు 7) దక్షుడు 8) వసిష్ఠుడు 9) వామదేవుడు
భరద్వాజ వామదేవులకు బదులుగా 'అత్రి, భృగువు'లను కొందరు గ్రహిస్తారు.)
భూదేవిని పాతాళంనుండి ఎట్లా ఉద్ధరించగలనా? అని ఎంతో చింతతో ఉన్న నాకు మనశ్శాంతి కల్గించే ఉద్దేశంతో విష్ణుమూర్తి 'యజ్ఞవరాహావతారం'తో ప్రత్యక్షమయ్యాడు. ఇది చాలా ఆశ్చర్యాన్ని గొల్పే సంఘటన.
'స్వాయంభువు' యజ్ఞవరాహమూర్తిని చూచి సంభ్రమాశ్చర్యం పొందాడు.
యజ్ఞవరాహస్వామి చేసిన 'గుర-గుర' మనే గర్జన ప్రళయకాలం నాటి మేఘసమూహం చేసే ఉరుములాగ దిక్కుల్ని పిక్కటిల్లేటట్లు చేసింది. ఆ శబ్దం విని బ్రహ్మ మరియు అక్కడ మూగిన యతీశ్వరులు ఆనందించారు.
స్వామి మాయామయమైన యజ్ఞవరాహరూపమెత్తి, 'ఘుర ఘుర' మని పెడబొబ్బ పెట్టినపుడు బ్రహ్మాండలోకపు మధ్యభాగం బద్దలైంది. భూలోకం, తపోలోకం మరియు సత్య (బ్రహ్మాండ) లోకం అనే మూడులోకాల్లో నివసిస్తున్న ఋషులు ఆ రూపాన్ని ఋగ్వేద, యజుర్వేద, సామవేద మంత్రాలతో స్తుతించారు. యజ్ఞవరాహరూపమెత్తిన ఆ లోకేశ్వరుడు మంచివారిపట్ల దయగలవాడు. అప్పుడాయన ప్రదర్శించిన విలాసక్రీడ దిగ్గజాల వినోదాన్ని తలపించింది.
భూమిని ఉద్ధరించటానికి అవతరించిన యజ్ఞవరాహంయొక్క సంరంభం ఇలా ఉంది. అది తన జూలుని విదిల్పినప్పుడు ఏర్పడ్డ పెద్దగాలికి మబ్బులన్నీ చెల్లాచెదరయ్యాయి. చురకత్తుల్లాగ మిక్కిలి వాడియైన దాని కాలి గిట్టల్ని సోకి ఆదిశేషుడు మరియు దిగ్గజాలు వణికిపోయాయి. దాని తీక్ష్ణమైన కోరలనుండి ఎగిసిన మంటలకు వెండికొండ, బంగారుకొండ కరిగిపోయాయి. అతి భయంకరమైన దాని 'ఘురఘుర' అరపులకు సప్తసముద్రాలనీరింకి బురద అయింది. అది ఇటునటు భూమిపై పొర్లుతూ, ఎగిసి చిందులేస్తూ, నింగి బద్దలయ్యేట్లు శబ్టిస్తూ, ఆకాశమంత ఎత్తు ఎగిరి దూకుతూ, కోపంతో మూతి బిగిస్తూ, చిరచిరలాడుతూ వాసనచూస్తూ అతిశయించింది.
ఇంకా ఆ వరాహం చేసిన చేష్టలు ఎలా ఉన్నాయంటే.
ఆ వరాహం తన కొమ్ములతో పదునాల్గులోకాలను వరుసగా కుప్పకూలిపడునట్లు చిమ్ముతుంది. కనకాద్రిని తన రొమ్ముతో కుమ్ముతుంది. ఏడుసముద్రాల్ని తనగిట్టలచే రొంపిచేసి దానిపై విజృంభించి తిరిగింది. తన తోకతో విసిరిన గాలితాకిడిచేత ఆకాశాన్ని బద్దలు చేస్తుంది. కన్నుల్లో నిప్పులు గురిసి భీకరంగా కన్పిస్తుంది. ఒక్కొక్క పర్యాయం మహర్షులు భక్తితో సేవలందించటానికి తగిన ఆకారంతో సాక్షాత్కరిస్తుంది.
(చతుర్దశభువనాలు: ఇవి ఏడు ఊర్ధ్వలోకాలు, ఏడు అధోలోకాలు.
ఊర్థ్వలోకాలు 7: 1) భూలోకం 2) భువర్లోకం 3) సువర్లోకం 4) మహర్లోకం 5) జనలోకం 6) తపోలోకం 7)సత్యలోకం.
అధోలోకాలు 7 : 1) అతలం 2) వితలం 3) సుతలం 4) రసాతలం 5) మహాతలం 6) తలాతలం 7)పాతాళం.
సప్తసాగరాలు : 1) లవణ 2) ఇక్షు 3)దధి 4) క్షీర 5)సురా 6) సర్పి 7) జల.
ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం అనే మూడువెళల్లో యజ్ఞరూపాన్నే ధరించి ఉన్న యజ్ఞవరాహాకారుడైన ఆ జగత్ప్రభువు ప్రళయకాలంలో యోగనిద్రలో ఉన్నాడు. ఆ సమయంలో భూమి నీటిలో మునిగి పాతాళం చొచ్చింది. దాన్ని ఉద్ధరించాలని తలంచి ఆ స్వామి సముద్రమధ్యభాగంలో ప్రవేశించాడు. సముద్రుడు వరాహమూర్తియొక్క వేగానికి తట్టుకోలేక పైకగిసిన అలలనే చేతులెత్తి. "యజ్ఞవరాహస్వామీ! నన్ను కాపాడవయ్యా!" అని దీనంగా అర్థించాడు. అప్పుడాయన చురకత్తులలాగ మిక్కిలి వాడియైన తన గిట్టలచేత సముద్రపునీటిని ఎగమీటి, పాతాళమధ్యభాగంలో ఉన్న భూమిని చూశాడు.
ఆ స్వామి పాతాళం చొచ్చి భూమికొరకు అన్వేషిస్తున్నాడు. అంతలో సముద్రపు అడుగున దాగిన దేవతల వైరియగు రక్కసుడు (హిరణ్యాక్షుడు), భూమికొరకు గాలిస్తున్నవాడూ, తన గొరిజల తాకిడిచే కులపర్వతాల్ని ముక్కలు చేయజాలినవాడూ, ధరాకాంతకు భర్తా, యజ్ఞ స్వరూపుడూ అయిన వరాహస్వామిని చూశాడు.
ఆ రాక్షసుడు సముద్రమధ్యభాగంలో వరాహరూపమెత్తిన స్వామి ఉనికిని గమనించి కోపావేశంతో భయంకరమైన రూపుదాల్చినాడు.
ఆ రాక్షసుడు మహాభయంకరాకృతి దాల్చి స్వామిపైకి తన గదను విసిరాడు. క్రోధం, గర్వం, బలం, ప్రతాపం ఇత్యాది గుణాలు మూర్తీభవించిన యజ్ఞవరాహుడు విజృంభించి 'సింహం చెలరేగి ఏనుగును మట్టు పెట్టు' నట్లు ఆ రక్కసుణ్జి తన కోరతో ఒక్కపోటు పొడిచి చంపాడు.
శ్రీహరి దితికుమారుడైన హిరణ్యాక్షుణ్సి భయంకరంగా చంపి వాని రక్తం అనే బురద చెక్కిళ్ళకు అంటుకోగా, సముద్ర మధ్యభాగంనుండి భూమిని పైకెత్తి కోరపైన నిల్పాడు. కోరపైన భూమిని నిల్పిన ఆ చిత్రం సంధ్యారాగం పులుముకొన్న కొండవలె దేదీప్యమానంగా వెల్గింది.
లేతనెలవంకరేఖలాంటి తెల్లని కోరపై కూర్చున్న భూదేవి, ఎల్లప్పుడు భర్తను ఎడబాయని శ్రీదేవి విష్ణుమూర్తికి దట్టంగా అద్దిన కస్తూరిముద్దలాగ ఉందట!
Subscribe to:
Post Comments (Atom)
The Battle Between Boar Varaha Avatar and Hiranyaksha - హిరణ్యాక్షుండు యజ్ఞవరాహంబగు హరినెదిరించి పోరుట
హిరణ్యాక్షుండు యజ్ఞవరాహంబగు హరినెదిరించి పోరుట నారదుడు పాతాళానికి పొమ్మని చెప్పగానే హిరణ్యాక్షుడు అగ్గిలాగ మండి పడ్డాడు. విష్ణువుతో తలపడి తీ...
-
సూర్య ద్వాదశ నామాలు ధ్యేయః సదా సవితృమండలమధ్యవర్తీ నారాయణః సరసిజాసన సన్నివిష్టః । కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటీ హారీ హిరణ్మయవపుః ధృతశంఖచక్రః ...
-
ఆదిత్యహృదయం తతో యుద్ధపరిశ్రాంతం సమరే చింతయా స్థితమ్ | రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితమ్ || 01 || దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతో ...
-
శ్రీ దేవీ భాగవతము నవమ స్కంధములోని శ్రీ సరస్వతీ కవచం ఓం శ్రీం హ్రీం సరస్వ త్త్యై స్వాహా -శిరో మే పాతు సర్వతః | ఓం శ్రీం వాగ్దేవతాయై స్వాహా -ఫ...
No comments:
Post a Comment