నారదుడు ధరించే వీణ మహతి. ఆ విపంచిలోని తీగలపై నారాయణ నామం ఎల్లప్పుడు వినిపిస్తూ ఉండగా, ఆయన ముఖంనుండి హరిసంకీర్తనలు అమృతధారల్లా బయల్వెడలుతున్నాయి. ఆ గీతాలు విని మునీంద్రులు పారవశ్యం చెందుతున్నారు. జేగురు రంగుగల ఆయన జడలకాంతి దిక్కులలో ఉదయకాంతిని వెదజల్లుతోంది. ఆయన మెడలో ధరించిన తులసిమాలలసువాసనలు భూమ్యాకాశాల మధ్యభాగంలో వ్యాపిస్తున్నాయి. ఆయన లోకానికి క్షేమాన్ని కలిగించే, స్వచ్చమైన కీర్తిలో పారం ముట్టినవాడు. ప్రసిద్ధమైన వ్యావహారిక నీతిలో కడునేర్పరి. ఆయన ఏదో మాట్లాడే ప్రయత్నం ఆకాశంనుండి వ్యాసుని కడకు ఏతెంచాడు.
ఆ విధంగా వచ్చిన నారదుడు వినయశీలి, వేదవిభజనకళాపరమ సంతుష్టుడు, సంసారదుఃఖ విదూరుడు, మానసిక విజ్ఞానప్రకాశుడునైన వ్యాసుని సందర్శించాడు.
ఈ విధంగా తన ఆశ్రమానికి విచ్చేసిన నారదమహర్షిని గుర్తించి వ్యాసుడు శీఘ్రంగా లేచాడు. యథావిధిగా అర్చించాడు. చిరునవ్వు చిందే వదనంతో మెల్లగా వ్రేలితో వీణమీటుతూ ఇలా అన్నాడు.
పరాశరుని కుమారుడవైన వ్యాసమునీంద్రా! నీవు పురాణప్రపంచ నిర్మాణంలో బ్రహ్మవంటివాడవు. మహాభారతాన్ని పంచమవేదంగా నిర్మించినవాడవు. వేదాలలోని శబ్దాల అర్ధం తెలిసినవాడవు. కామం మున్నగు అంతశ్శత్రువులారింటిని జయించినవాడవు. పరబ్రహ్మతత్త్వాన్ని నిర్ణయించినవాడవు. యోగులలో అగ్రేసరుడవు. వినయసంపన్నుడవు. ఇటువంటి నీవు మనఃస్థైర్యం గోల్పోయి పిరికివానిలా విచారించడానికి కారణమేమిటయ్యా! ఆశ్చర్యంగా ఉందే!
అని పల్కిన నారదునితో వ్యాసుడిలా అన్నాడు.
"మునీశ్వరా! నీవు బ్రహ్మమానస పుత్రుడవు. శ్రీమన్నారాయణార్చనను స్వీకరించావు. దశదిశలా సంచరించావు. మిక్కిలి గొప్పదైన జ్ఞానోపదేశంలో పరాకాష్ట నందుకొన్నావు.
అంతేకాక నీవు సూర్యునివలె ముల్లోకాలలో సంచరిస్తావు. వాయువువలె సమస్త ప్రాణులలో మెలగుతావు. నీవన్నీ తెలిసినవాడవు. ఆ కారణంచే
నారద మునీంద్రా! నీకు తెలియరాని ధర్మమంటూ లోకంలో ఏదీ ఉండదు. పెక్కు విషయాలను పరిశీలించి చూచినవాడవు. నాలో ఏర్పడిన కొరత ఏమిటో నా దిగులుకు కారణమేమిటో దయతో వివరించి చెప్పు.
అని వ్యాసుడు ప్రాధేయపడగా నారదుడు ఈ విధంగా సమాధానమిచ్చాడు.
వ్యాసమునీంద్రా! నీవు పెద్దల పూజలందుకొనేవాడవు. విశేషంగా ప్రకాశించే ధార్మిక విషయాలు ఎన్నో చెప్పావు. కాని అందులో విష్ణుకథలు కొంచెం కొంచెం మాత్రమే చెప్పావు. వాసుదేవుని సగుణాత్మక సద్గుణ మహిమలను వర్ణిస్తే తప్ప ఎన్ని ధర్మాలు సోదాహరణంగా చెప్పినా భగవంతుడు సంతసించడు. నీకు ఈ మనోవేదన రావడానికి కారణం హరినామ సంకీర్తనం సమగ్రంగా చేయకపోవటంవల్లనే సుమా!
మానససరోవరం బంగారురంగు పద్మాలతోను, హంసల గుంపులతోను నిండి ఉంటుంది. శ్రీహరినామ మహిమను వ్యక్తపరచే గ్రంథం ఆ స్వచ్చమైన మానససరస్సులా ప్రకాశిస్తుంది. హరిసంకీర్తన లేని గ్రంథంలో ఎన్ని చిత్రవిచిత్రాలైన అర్థాలున్నా అది శోభాకరం కాదు. అది పొగరుతో కూస్తున్న నల్లకాకులతో కూడుకొని, ఉపయోగించటానికి పనికిరాని నీటిగుంటలాంటిది.
ద్వైపాయన మహార్షీ! నీవు భగవంతుని తత్త్వం తెలిసినవాడవు కదయ్యా! శ్రీహరి అనంతకల్యాణ గుణసంపన్నుడు కదా! ఆయనను ఎట్లు వర్ణించగలం? స్తుతించే సమయంలో అపశబ్దాలు దొర్లుతాయేమో అనుశంక అవసరం లేదయ్యా! అపభ్రంశ శబ్దాలతో కూడుకొన్న వాక్యాలతో హరిచరిత్ర వ్రాసినా, సర్వపాపాలు పటాపంచలవుతాయి. కాబట్టి సజ్జనులైన భక్తులు, యోగీశ్వరులు ఆ విష్ణువునే మనస్సులో ఎప్పుడూ తలపోస్తూ ఉంటారు. ఆయన లీలలనే గానం చేస్తూ ఉంటారు. ఆయన నామాన్నే జపిస్తారు. ఆయన గాథలను నిరంతరం శ్రవణం చేస్తారు. నిత్యం ఆయనను కీర్తిస్తారు. ఈ విధంగా వారు తమ జన్మలను సార్థకం చేసుకొంటారయ్యా! ఒక్కసారి సావధానంగా ఆలోచించవయ్యా!
జ్ఞానం నిష్కర్మతారూపం, నిరుపాధికం. జ్ఞానం కలిగిన సమయంలో సమస్తకర్మలనుంచి విముక్తి ఏర్పడుతుంది. అట్లే ఉపాధిభావం కూడ తొలగిపోతుంది. అయినా జ్ఞాని ఇంకా దేహత్యాగం చేయడు, ప్రారబ్ధం పూర్తయ్యేవరకు జీవించే ఉంటాడు. కాని జీవన్ముక్తుడై ఉంటాడు. ఆ సమయంలో అతడు ఆచరించే కర్మ విషయవాసనలకు లోనుగాకుండా ఉంటుంది. ఉపాధిభూతమైన అజ్ఞానాన్ని తొలగించి విడుదల అయ్యే స్థితిలో ఉంటుంది. అయినా జ్ఞానోత్పత్తి అయిన పిమ్మటకూడా హరిభక్తి లేకపోతే కర్మ పరిపూర్ణంగా శోభించదు.
కర్మలు రెండురకాలు. కామ్యకర్మలు. నిష్కామకర్మ్శ్మలు. ఫలాపేక్షతో చేసే కర్మలు కామ్యకర్మలు. నిష్కామకర్మలు కూడ రెండురకాలు. అవి శుభకారణాలు. భగవంతునికి అర్పించకుండా, ఏ కోరిక లేకుండా ఉండి చేసే కర్మ ఒకటి. ఏ కోరిక లేకుండ భగవంతుని ఉపాసిస్తూ, తదర్పణ కావించే కర్మ వేరొకటి. ఫలాన్ని వాంఛించకుండా పరోపకార పారీణతతో చేసే కర్మలు సత్ఫలితాలనే ఈయవచ్చు. ఈయకపోవచ్చు. అయినా ఈశ్వరునకు సమర్పించే కర్మమాత్రమే ఉత్కృష్టకర్మ అవుతుంది. కారణం దైవం కర్మఫలప్రదాత కాబట్టి. భగవంతునికి సమర్పించే కర్మలో లోపం ఉన్నా తొలగిపోతుంది.
భగవద్బక్తి లేని జ్ఞానం శుష్క జ్ఞానం. భక్తిలేనట్టి వాక్కులు తార్కికవాక్కులు. భక్తివిరహితమైన కర్మ దుష్కర్మ. భక్తిలేని జ్ఞానం, వాక్కు కర్మ ఎంత గొప్పవైనా నిరర్ధకాలే.
కాబట్టి, వ్యాసమహార్షీ! నీవు ఏమీ తక్కువవాడవు కావు. బుద్ది నిశ్చయంలో గొప్పవాడవు. సత్యాన్ని దర్శించేవాడవు. దిగంతముల వరకు వ్యాపించిన స్వచ్చమైన కీర్తి కలవాడవు. సత్యమునందు అనురక్తి కలవాడవు. వ్రతానుష్టానపరుడవు. నీకు కావలసినదీ లేదు. కోరదగినదీ లేదు. అయినా సమస్త మానవులయొక్క బంధవిముక్తికోసమై వాసుదేవుని సృష్టిలీలలను భక్తియుక్తంగా వర్ణించవయ్యా! శ్రీహరిని వర్ణించకుండా వేరొకవిధంగా భీన్నార్థాలు కల్పించి, ఇతరవర్జనలు చేయడంవల్ల ఫలితం ఉండదు. అట్లు భిన్నదృష్టి కలవారికి నామరూపాత్మకమైన ప్రపంచం గోచరిస్తుంది తప్ప అభేదదృష్టి కలుగదు. అటువంటివారి బుద్ది సుడిగాలిచే గిరగిర త్రిప్పబడి కొట్టుకొనిపోయే నావలాగా తీరం చేరలేదు.
సామాన్య మానవులకు కామ్యకర్మలపై ఆసక్తి ఎక్కువ. వారు చేయవలసిన ధర్మాలేవో చెప్పి శాసించడం నీవంటి వానికి తగదు. ఎందువల్లనంటే మూఢులు అదే ప్రధానమని భావించి కలుషితాలైన కామ్యకర్మలకే అలవాటు పడిపోతారు. అప్పుడు వారు పరమార్ధాన్ని మరచిపోతారు. కాబట్టి వారి బుద్ధి పెడదారిపట్టకుండా తత్త్వోపదేశదృష్టి కలవాడవై జ్ఞానాన్ని అందించి వారి తాపత్రయ బాధలు నివారించుమని చెప్పి నారదుడు ఇంకా ఇలా అంటున్నాడు.
సదసద్వివేక విచక్షణుడైనవాడు సకల క్రియావ్యాపారాలను వదలివెస్తాడు. శ్రీ మహావిష్ణువుయొక్క నిర్వికల్పాత్మకమైన సచ్చిదానంద రూపాన్ని సంపూర్ణంగా దర్శిస్తాడు. ఆ స్వరూపంపై ఆనుకూల్యదృష్టి కలిగి భగవదనుభవం ప్రదర్శిస్తాడు. ఆ వివేకం లేనివాడు త్రిగుణాలకు లోనయినవాడై, జననమరణరూప సంసార చక్రంలో పరిభ్రమిస్తూ ఉంటాడు. తాను కాని దేహంపై “ఈ దేహమే నేను” అనే అహంకారంతో, తనవికాని సంపదలపై “ఇవి నావి” అనే మమకారంతో అజ్ఞానంలో సంచరిస్తూ ఉంటాడు. అటువంటి అజ్ఞానికి భగవంతుని లీలలు స్పష్టంగా అర్ధమయ్యేలా వివరింపుము.
మానవులు తమ వంశాన్ని అనుసరించి, ఆశ్రమాన్నిబట్టి అనుష్టించవలసిన ధర్మాలు ఎన్నో ఉన్నాయి. అవి తప్పకుండా చేయవలసిందే. ఎవడైనా ఏ కారణంవల్లనైనా వాటిని చేయలేని స్థితిలో వాటిని విడిచి గోవింద పదారవిందాలను భక్తితో సేవిస్తే ఆ సేవ సిద్ధి పొందక మరణించినా, అతడికి నష్టమేమీ కలుగదు. అతడు ఈ జన్మలో కాకపోయినా, మరో జన్మలోనైనా తాను చేసిన దానికి ఫలం పొందుతాడు. అలా కాకుండా విష్ణుసేవకు దూరమై కులధర్మాలను పరమనిష్టతో ఆచరించినా, అవి సంసారహేతువులు కాబట్టి, వాడు ఎన్ని జన్మలెత్తినా కృతార్థుడు (మోక్షగామి) కాలేడు.
ఇట్టి సత్యాన్ని తెలుసుకొన్న మానవుడు కర్మమార్గం పై అత్యంత ప్రీతి ప్రకటించకుండా ఎల్లప్పుడూ శ్రీహరిని సేవించడానికై ప్రయత్నం చేయడం చాలామంచిది. కాలానుసారంగా సుఖాలు కలుగుతూ ఉంటాయి. అప్పుడు సుఖాల్లో మునిగిపోయి మత్తుడై శ్రీహరిని విస్మరించడం తగదు. అలాగే దుఃఖాలు వస్తూ ఉంటే ఆ కష్టాలు భరించలేక హరిని సేవించడం మానరాదు. అందువల్ల, పైనున్న బ్రహ్మ మొదలుకొని అధోలోకంలోని స్థావరాలవరకు పరిభ్రమించే జీవకోటికి హరిసేవ కర్తవ్యం. హరిసేవాపరాయణుడు ఒకవేళ తిరిగి జన్మనొందినా, అతడు సామాన్య మానవునిలా సంసారబంధంలో తగుల్కొనడు. ఆ సంస్కారంతో భక్త్యానంద సాగరంలో మునిగినవాడై శ్రీహరిసేవను విడిచిపెట్టకుండా జీవితం కొనసాగిస్తాడు.
ఈ ప్రపంచమంతా విష్ణుమయం. ఈ విశాలవిశ్వంలో విష్ణువుకన్న భిన్నమయింది ఏదీలేదు. ఆ భగవంతుని సంకల్పంవల్లనే సృష్టిస్థితి సంహారాలు ఏర్పడుతున్నాయి. వ్యాసమహర్షి! నీవు సర్వం తెలిసినవాడవే కదా! ఈ విషయాన్నంతా అక్కడక్కడ మహాభారతం మున్నగువాటిలో నీవు చెప్పియున్నట్టిదే! విశ్వకల్యాణంకోసమై శ్రీహరి అంశతో అవతరించిన వాడవు నీవని గుర్తు ఉంచుకో. మహావైభవంగా ఆ గోవిందుని శౌర్యాదులను సంపూర్ణంగా వర్ణించు. మానవునకు ఉండే పాండిత్యం, వేదాధ్యయనం, దాతృత్వం, ధర్మానుష్టానం, తపస్సు, ధైర్యం, సంపద మున్నగు వాటికన్నింటికి పరిపూర్ణఫలం పవిత్ర కీర్తనుడైన పద్మనాభుని స్తుతించడమే కదా!
No comments:
Post a Comment