Saturday, February 28, 2026

Speeches by Pritha regarding Dharma and Brahman - పృథుచక్రవర్తి సభాసదులకు సద్ధర్మముల నుపదేశించి బ్రాహ్మణ ప్రశంస సేయుట

పృథుచక్రవర్తి సభాసదులకు సద్ధర్మముల నుపదేశించి బ్రాహ్మణ ప్రశంస సేయుట

అలా చెప్పి ఇంకా ఇలా అన్నాడు. ఇలా విశేషగుణసంపద గలిగి, దోషరహితమై, సత్పురుషులచే సమ్మానింపబడిన పృథుచక్రవర్తి కీర్తిని తెలియజెప్పే మైత్రేయునితో భాగవతుడైన విదురుడిలా అన్నాడు.

మునిశ్రేష్ఠా! విను. పృథుచక్రవర్తి బ్రాహ్మణులచే రాజ్యపట్టాభిషిక్తుడై దేవతలచే సద్గుణాలుపొంది విష్ణుతేజంతో వెలిగిపోయాడు. ఆయన ఏయే పనులు చేశాడో పాపరహితుడా! నాకు తెలియజేయవయ్యా!. భూమి ఏ విధంగా గోరూపంలో స్థిరపడింది. ఎవరి పరాక్రమ దీప్తితో వెలుగొందిన పద్ధతిలో ప్రస్తుత రాజులందరు బ్రతుకుతున్నారో అట్టి పృథుచక్రవర్తి చరితాన్ని భూమిలో వివేకవంతుడైన వాడెవడైనా వినకుండా ఉంటాడా?

ఆ పలుకులు విని మైత్రేయుడు విదురునితో ఇలా అన్నాడు. పవిత్రమైన ప్రవర్తనచే పృథుచక్రవర్తి రాజుల పొగడ్తలు పొంది సంతోషంతో పాలనంచేశాడు.

ఆ పృథుచక్రవర్తి గంగాయమునల మధ్యప్రదేశంలో నివసించాడు. ప్రారబ్ధ కర్మఫలాలు వ్యయం కావాలని సర్వపుణ్యాలను తాననుభవించాడు. అన్నిదేశాలలో తన ఆజ్ఞకెదురు లేకుండా చేశాడు. సప్తద్వీపాలలో ఏకచ్చత్రాధిపత్యం వహించాడు. విష్ణుభక్తులైన బ్రాహ్మణులకు తప్ప మిగిలినవారి విషయంలో యమునివలె చండశాసనుడయ్యాడు. అలా కొంతకాలం పరిపాలించి దీర్ఘసత్రమనే యజ్ఞం చేయడానికి దీక్ష వహించాడు.

ఆ దీర్ఘసత్రానికి రాజర్షులు, దేవర్షులు, పితృదేవతలు, బ్రహ్మర్షులు విచ్చేసి శాస్త్రోక్తంగా సమ్మానాలందుకొన్నారు. అప్పుడు శుభలక్షణాలుగల ఆ పృథుచక్రవర్తి

పృథుచక్రవర్తి ఆకారవిశేషాలు వర్ణించబడ్డాయి. మహోన్నతుడు, ఎత్తైన భుజాలుగలవాడు, వికసించేముఖ శోభులవాడు, వికసించిన ఎర్ర తామరలవంటి కనులు గలవాడు, అందమైన ముక్కుపుటాలు గలవాడు, చిరునవ్వులు చిందించేవాడు. అందాలకురులు గలిగి శంఖంవంటి కంఠంగలిగి వెడల్పైన వక్షఃస్థలముకలిగి, మూడు ముడుతలుపడ్డ నడుము భాగంతో విశాలమైన పిరుదుభాగంతో సుడిగుండంవలె నాభీవివరం ప్రకాశించగా, బంగారు స్తంభాలవంటి తొడలతో, ఎర్రని పాదాలుకలిగి కొత్త పట్టువలువను ఉత్తరీయంగా ధరించి ఆ మహాకీర్తిమంతుడు వెలిగిపోయాడు.

మరియు వ్రతదీక్షచేపట్టినందున ఆభరణాలు వదలివేసినప్పటికీ శరీర సౌందర్యంతో ప్రకాశిస్తూ, జింకచర్మం ధరించి, లక్ష్మీశోభతో చేత దర్భలు పట్టుకొని ఉచితకర్మలు చేస్తూ సుందరమైన చూపులుగల పృథుచక్రవర్తి నక్షత్రమధ్యంలో చంద్రునివలె సకలజనులకు ఆహ్లాదం కలిగిస్తూ సభామధ్యంలో లేచి నిలబడి సభ్యులకు ఆనందం కలిగేలా చక్కని మాటలతో ప్రసన్నంగా, పరిశుభ్రంగా, గంభీరంగా మాట్లాడుతూ ఇలాఅన్నాడు.

ఓ సభ్యులారా! వినండి! ధర్మాన్ని ఎల్లప్పుడూ తెలుసుకోగోరిన మనుష్యుడు తన మనస్సులో ఉండే భావాన్ని ధీరులు, సజ్జనులు అయిన వారికి తలియజేయవలసిన అవసరం ఉంది.

నేను ఈ లోకాలను శాసిస్తున్నాను. ప్రజలకు ఆయావృత్తులను కల్పించి, దానమిస్తున్నాను. రక్షిస్తున్నాను. ప్రజలు ఆయా పనులలో హద్దులు మీరకుండా విధివిధానాలు స్థిరపరచడానికి బ్రహ్మచే నేను నియోగింపబడ్డాను. ప్రజాపాలన నా కర్మానుష్ఠానం. ఈ విధమైన కర్మానుష్ఠానమువలన కర్మసాక్షి అయిన ఆ పరమేశ్వరుడు ఏలాంటివానికి సంతోషం కలిగిస్తాడో, పండితులు అతనికి ఏ పుణ్యలోకం ప్రాప్తిస్తుందని అంటారో, అనుష్థానపరుడనైన నాకు కోరికలు పిదికేవి అయిన పుణ్యలోకాలు వరుసగా లభిస్తాయి.

ప్రజలను ధర్మంగా పాలించక, తన ప్రయోజనాలకై పన్నులు తీసుకొంటే, ఆ ప్రభువునకు తన ప్రజల పాపాలు సంక్రమిస్తాయి. కాంతిని కోల్పోయి రాజు నశిస్తాడు. ప్రజలుకూడా తమహితం కోసం రాజుహితం కోరాలి. అసూయలేకుండా కృష్ణార్పణంగా ధర్మాచరణ చేయాలి. మీరిలా చేస్తే అదే నన్ను అనుగ్రహించినట్లు. అంతేకాక, మీరు పితృదేవతలతో, ఋషులతో సమానులు. ఆలాంటిమీరు సమ్మతితో కర్తను, పాలకుడను, బ్రహ్మచే అనుమోదించువాడను అయిన నాకు పరలోకంలో ఏ ఫలం కలుగుతుందో ఆలాంటి ఫలం కలగటానికి తగిన కర్మను ఆచరించండి. ఆ విధంగా చేస్తే నేను సంతోషిస్తాను. అని అనగా, ఆ సదస్యులు మహారాజుతో ఇలా అన్నారు.

ఓ పృథుచక్రవర్తీ! ప్రజలందరు తమ పనులన్నీ భగవదర్పితంగా (వాసుదేవార్పణం) చేయాలని బోధించావు. వాసుదేవుడనేవాడు భూమిపై ఉన్నాడా?

(ఆ భగవంతుని రూపరేఖావిలాసాలు తెలియజేయుమని ప్రజలు ప్రభువును కోరారు.)

ఆ మాటలు విని ప్రజలతో పృథుచక్రవర్తి ఇలా అన్నాడు. ఓ యోగ్యులారా! వినండి! యజ్ఞేశ్వరుడు కొన్ని సిద్ధాంతాల ననుసరించి ఉన్నాడు. బుద్ధిమంతులారా! దీనికి విరుద్ధంగా మీరు భగవంతుడు లేడంటే ఆ భగవానుడు సృష్టించిన కాంతిమంతమైన ఈ ప్రపంచం, ఇందలి చిత్రవిచిత్రాలైన కర్మలు ఆయనలేకుంటే అసలులేవు కదా. అందువల్ల భగవంతుడున్నాడు.

అదీగాక, ఈ లోకంలోని చిత్రవిచిత్రాలు వాటికర్తయైన భగవంతుడు లేకున్నా కర్మవశంగా కలుగుతాయని అన్నారనుకోండి.

(కర్త అయిన ఈశ్వరుడు లేకున్నా కర్మలు జరుగుతాయనుకొనేవారు నాస్తికులు. శివుని ఆజ్ఞలేనిదే చీమైనా కుట్టదు అనుకొనేవారు ఆస్తికులు.)

ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు, ధ్రువుడు, మనువు మొదలైనవారికి మా తాతగారైన అంగరాజునకు, మిగిలిన రాజలోకానికి, నారద, ప్రహ్లాద, బలిమొదలైన భాగవతోత్తములకు స్వర్గమోక్షాలు ప్రాప్తించేందుకు కారణభూతుడు ఆ భగవంతుడు. మృత్యువు మనుమడైన వేనుడు మొదలైన దురాత్ములకు తప్ప మిగిలినవారి కందరికీ కోరిన కోర్కెలిచ్చి ప్రసన్నవరదుడైనవాడు ఆ స్వామి.

ఈ విధంగా అనుభవజ్ఞాన సంపన్నులైన పండితుల అనుభవాన్నిబట్టి లోకం మేలుకోరే విష్ణువు లేడనడం జరగదు. అదీగాక

గొప్పతపస్సుచే ఒప్పునట్టి మునులపూజ, ఎవని పాదపద్మారాధన వల్ల వృద్ధిపొంది ఆయన పాదపద్మాలనుండి పుట్టిన గంగానదివలె అన్ని మానసిక పాపాలను పోగొట్టేదై పూర్వజన్మల సంసారబాధను పూర్తిగా పోగొట్టగలదా...?

పరమేశ్వరుని పాదపద్మాలమూలమును మందిరంగా భక్తితో ఎవ్వడు పొందగలడో వానికి సమస్త పాపాలు తొలగుతాయి. సజ్జనులు కీర్తించిన వైరాగ్యం, జ్ఞానం, ధైర్యం, వీర్యం ప్రాప్తిస్తాయి. ఎన్నడూ సంసార దుఃఖాన్ని పొందడు.

లోకాలకు మూలాధారమైన పరమేశ్వరుడు విష్ణువు. ఆయనకు సమానులు గాని, అధికులు గాని లేరు. రెండవ సమానమైనవాడు లేకపోవడంవల్ల ఆ విష్ణువు ధీరులలో శ్రేష్ఠుడు.

కర్మవలననే లోకం పుట్టి, పెరిగి, నశిస్తుందందామా? కర్మ అనేది జడకార్యం, చేతనం కాదు. అది ప్రపంచ సృష్టిలో కర్త అనడానికి వీలులేదు. ఈ లోకంలో జగత్సృష్టి రూపకర్మకు కార్య, కారణ సంబంధం ఆ భగవంతుడైన విష్ణువే.

మీరు ఆ పరమేశ్వరుణ్ణి మీమీ యోగ్యతననుసరించి కోర్కెలు సిద్ధించినవారై త్రికరణ శుద్ధిగా కాపట్యం లేని రీతిలో కీర్తన, నమస్కార సేవలను చేసి కోర్కెలను ఫలింపజేయడానికి ఆ పరమేశ్వరుని పాదపద్మాలు సేవించండి. అదీగాక

స్వరూపంచే ఈశ్వరుడు నిశ్చయంగా స్వచ్చమైన జ్ఞానపు ముద్ద. నిర్గుణుడు. అతనియందు కర్మమార్గం సాగుతుంది గాన అతడు సంకల్పించడు. ధాన్యపు కంకులలోని ధాన్యం తెల్లగా ఉంటుంది. అది పొట్టులో దాగి దంచినపుడు బయటపడుతుంది. అలానే మంత్రాల సామర్థ్యం నిబిడీకృతంగా ఉంటుంది. సత్కర్మవలన అది ప్రకటితమవుతుంది. యజ్ఞాని కుపయోగించే ద్రవ్యాలు అన్నీ పదార్ధ సంచయాలు. అందులో యజ్ఞం ఇమిడిఉంది. అలా ప్రకటితమైనపుడు ప్రత్యేక గుణాలతో వేర్వేరుగా వ్యక్తమవుతుంది. జ్యోతిష్టోమం మొదలైన పేర్లతో యజ్ఞరూపమై సమస్త జగత్తు వెలువడును.

అదీగాక కొయ్యలో పుట్టిన అగ్ని ఆ కొయ్య లక్షణాలైన పొడవు, వంకరల నాశ్రయిస్తుంది. దేహంలోని అంతర్యామి దేహధర్మాలను అనుసరించి వ్యక్తమవుతుంది. అవ్యక్తం, కలచేది అయిన కాలం, వాసన, అదృష్టం అయిన ధర్మం అంతర్లీనంగా దేహంలో ఉంటుంది. అని పలికి కొంచెమాగి పృథుచక్రవర్తి మరలా ఇలా బోధించాడు. "నామార్గం అనుసరించే నా ప్రజలు జీవితమే నిశ్చల దీక్షగా మెలగుతూ హరిని భజిస్తారు. ఈ సృష్టియజ్ఞాన్ని అనుభవించే అధిపతి, దాన్ని ఉపదేశించేవాడు నారాయణుడే. ప్రజలు తమతమ ధర్మాలను అనుసరించి ఇలా అర్చిస్తూ యోగస్థులై ఉంటారు. వారు నన్ను అనుగ్రహించే పద్ధతి ఆశ్చర్యకరం -అని పృథుచక్రవర్తి నారాయణ భక్తులను స్తుతించాడు. మరలా ఇలా అన్నాడు.

గొప్ప సిరిసంపదలతోనూ, మహత్తరమైన ప్రతాపంతోనూ, అఖండమైన వైభవంతోనూ ప్రకాశించే రాజుల తేజస్సు తపస్సుతోనూ, శమదమాదులతోనూ, క్షమాగుణంతోనూ విరాజిల్లే బ్రాహ్మణుల పైనా, విష్ణు భక్తులపైనా ఏ మాత్రం తన ప్రభావాన్ని చూపించలేదు.

(క్షాత్రధర్మలక్షణాలు సంపద, వైభవం, ఐశ్వర్యం. బ్రహ్మ ధర్మ లక్షణాలు తపస్సు, ఇంద్రియనిగ్రహం, క్షమావిద్యలు. ఆ క్షత్రియుల అధికారం విప్రులపై ఎప్పుడూ ప్రభావం చూడకుందుగాక!

పురాణ పురుషుడైన నారాయణుడు బ్రాహ్మణుల పాదపద్మరేణువులను ధరిస్తాడు. అతనికి బ్రాహ్మణులే దేవతలు. ఆ కారణంవల్లనే ఆ భగవంతుడు నిరంతరం తనతో ఉండే లక్ష్మీదేవిని పరిగ్రహించాడు సమస్తలోకాలలో పవిత్రకీర్తినీ, ఐశ్వర్యాన్నీ పొందగలిగాడు.

(సదానపాయిని, ఎల్లప్పుడూ విష్ణు వక్షస్థలవాసిని లక్ష్మీదేవి.)

బ్రాహ్మణసేవచే సమస్త సద్గుణాలు కలుగుతాయి. భగవంతుడు సంతోషిస్తాడు. అట్టి బ్రాహ్మణులను ఆ ధర్మాన్ని పాటించేవాడు గొప్ప నీతిమంతులై తప్పక సేవించరా? జ్ఞానవిద్యలో అభ్యాసపరుడు కాకున్నా బ్రాహ్మణ సేవవలన అతని మనస్సు నిర్మలమై మోక్షప్రాప్తికూడా సిద్ధిస్తుంది. అందుచేత ఉదాత్తచిత్తంతో బ్రాహ్మణ బృందాన్ని సేవించాలి.

ఆర్యమహాజనులారా! భగవంతుడు విజ్ఞాననిధి. తత్త్వజ్ఞాన సంపన్నులైనవారు ఇంద్రాది దేవతల్ని ఉద్దేశించి బ్రాహ్మణముఖంగా అర్పించే అన్నంవల్ల(హవిస్సు) తృప్తి చెందినట్లు, అచేతనమైన అగ్నిలో వేల్పిన హవిస్సువల్ల ఈశ్వరుడు తృప్తి పొందడు. కాబట్టి, లోకంలో అగ్ని ముఖంకంటె బ్రాహ్మణుల ముఖం పరిశుద్ధమైంది. అత్యంత ప్రధానమైంది. అందువల్ల సకల జనులూ బ్రాహ్మణులను సేవించాలి.

(యజ్ఞయాగాదులు దేవతలనుద్దేశించి చేస్తారు. అగ్నిముఖంగా దేవతలకు హవిస్సులు అందుతాయి. తద్ద్వారా పుణ్యలోకప్రాప్తి, ఇష్టఫలసిద్ధి కలుగుతుందని నమ్మకం. ఇక్కడ పృథుచక్రవర్తి బ్రాహ్మణసేవలోని ప్రాధాన్యం వివరించాడు.)

అదీగాక

ఓ చతురులారా! ఈ లోకమంతా ఏ వేదంలోనైనా అద్దంలో ప్రతిబింబించే వస్తువులవలె ప్రకాశిస్తుంది. ఆవిధమైన కళంకంలేనిది, నాశరహితమైనది సనాతనవేదం. దానిని శ్రద్ధతో అధ్యయనంచేసి, తపస్సుతో సాధించి, మౌనంతో క్రమబద్ధం చేసుకొని, ఇంద్రియ నిగ్రహంతో నిశ్చలం కావించి, సమాధి స్థితిలో ఉండేవారే బ్రాహ్మణులు. సత్యాసత్య నిర్ణయశక్తి వారికుంది. అలాంటి బ్రాహ్మణుల పాదరజాన్ని ధరించేవారికి సర్వపాపాలు నశించి సద్గుణాలు అలవడుతాయి.

అలాంటి బ్రాహ్మణుల పాదధూళిని నేను తలపై ధరిస్తాను. బ్రాహ్మణులను సేవించినవానికి సమస్తగుణాలు, శీలం, కృతజ్ఞతాభావం, సిద్ధిస్తాయి. అట్టి శ్రద్ధగల మహానుభావుని ఐశ్వర్యాలు వరిస్తాయి. గోబ్రాహ్మణులు, అనుచరులతోగూడి విష్ణువు నాకు ప్రసన్నుడగుగాక అని చెప్పిన పృథుచక్రవర్తిని చూసి పితృదేవ బ్రాహ్మణులు, సత్పురుషులు సంతోషంతో ఆశీర్వదించి ఇలా అన్నారు.

ఓ పృథుచక్రవర్తీ! నీ పుణ్యవిశేషంవలన ఎన్నడో బ్రహ్మదండంచే హతుడైన పాపి వెనరాజు నరకంనుండి తరించాడు. 

(వంశంలో ఒక పుణ్యాత్ముడు జన్మిస్తే వారివంశం తరిస్తుందనడానికి పృథుచక్రవర్తి గాథ ఉదాహరణ.

వేనుని పాపాలు పృథువుపవిత్రవర్తనతో నశించాయి. పుత్రుడంటే తండ్రియు మరొక రూపంలో జన్మిస్తాడు గాబట్టి పాపప్రవర్తనుడు సత్పుత్రునివల్ల పవిత్రుడవుతాడు.)

కుమారునివలన తండ్రి సర్వలోకాలను జయిస్తాడనే వేదవాక్యం నిశ్చయం.

ఓ రాజా! హిరణ్యకశిపుడనే రాక్షసరాజు విష్ణునిందచేసి, నరకానికి వెళ్లాలని సంకల్పించినా, గుణవంతుడు, భాగవతుడు, భక్తుడు అయిన సత్పుత్రుడు ప్రహ్లాదునివల్ల పవిత్రకీర్తిని గడించాడు. కాబట్టి, పాపాలు తొలగి నరకానికి వెళ్లలేదు.

అని చెప్పి వీరవరుడయిన పృథుచక్రవర్తిని పది వేలసంవత్సరాలు గొప్పగా జీవిస్తావని ఆశీర్వదించి మరీ ఇష్టం కలిగేలా

మరలా ఇలా అన్నారు, ఓరాజా! నీకు పరమేశ్వరుడైన విష్ణుపై భక్తిఉండటంవల్ల పరమోత్తముడు వేదవేద్యుడయిన ఆయన నుంచి కథలు మాకు తెలియజేస్తున్న నీవు మాకు రాజువు కావున మేము కూడా విష్ణుభక్తుల మయ్యాము. నీ ప్రజారంజక పరిపాలనం, ప్రజలపై అనురాగం దయాస్వభావులయిన మీవంటి వారికి సహజం. అందులో ఆశ్చర్యం లేదు. జ్ఞానాన్ని కోల్పోయి సంచరించేమేము దైవం పేర చేసే కర్మల వల్ల మా అజ్ఞానపుటవధిని తెలుసుకున్నాము. ఆ మహానుభావుడు బ్రాహ్మణుల నధిష్టించి క్షత్రియులను, వారిద్వారా బ్రాహ్మణులను, వారుభయుల ద్వారా ప్రపంచాన్ని భరిస్తాడు. అలాంటి బలసంపన్నుడు, సమస్తరూపుడు, మహోన్నతుడు అయిన పృథుచక్రవర్తికి విష్ణుడన్న భక్తితో నమస్కరిస్తున్నాము. అని చెప్పే సమయంలో

పృథు చక్రవర్తి యొద్దకు సనకాదు లరుగుదెంచుట

No comments:

Post a Comment

Speeches by Pritha regarding Dharma and Brahman - పృథుచక్రవర్తి సభాసదులకు సద్ధర్మముల నుపదేశించి బ్రాహ్మణ ప్రశంస సేయుట

పృథుచక్రవర్తి సభాసదులకు సద్ధర్మముల నుపదేశించి బ్రాహ్మణ ప్రశంస సేయుట అలా చెప్పి ఇంకా ఇలా అన్నాడు. ఇలా విశేషగుణసంపద గలిగి, దోషరహితమై, సత్పురుష...