Thursday, February 12, 2026

Shuka Maharshi Explaining Bhakti A Way For Mukthi - శుకుడు పరీక్షిత్తునకు భక్తిమార్గంబె ముఖ్యంబని తెలుపుట

శుకుడు పరీక్షిత్తునకు భక్తిమార్గంబె ముఖ్యంబని తెలుపుట

రాజా! ఇది ఇంకా వివరంగా చెబుతాను, విను. పూర్వం బ్రహ్మ మనస్సులో ధర్మనీతి పరాయణమైన దృష్టితో మూడు పర్యాయాలు వేదాన్ని పరామర్శించాడు. అలా పరామర్శించి భక్తితో తప్ప మరొక మార్గాన మోక్షం లభించదని నిశ్చయించుకొన్నాడు. ఆ మార్గాన్నే తరణోపాయంగా నిర్ణయించుకొని వికారానికి లోబడకుండా ఆత్మస్వరూపుడైన జనార్దనుణ్ణి భక్తితో ధ్యానించాడు.

రాజా! జగదీశ్వరుడైన శ్రీహరి సకల జీవులలో సదా ఆత్మరూపుడై ఉన్నాడు. బుద్ధి మొదలయిన లక్షణాలతో ఆ దేవుడు మనకు గోచరిస్తాడు. ఉత్తములకు ఆయన సేవింపదగినవాడు. సకలవేళలా నమస్కరింపదగినవాడు. భక్తులపై వాత్సల్యం కలవాడు. నియమనిష్ఠలు కలిగి ఏకాగ్రమైన బుద్ధితో ఆత్మస్వరూపుడగు శ్రీహరి కథాసుధను తనివి దీరా, చెవులారా గ్రోలేవారు ధన్యులు. అట్టివారు కుటిలమైన పలువిషయాలతో చెడిపోయిన తమ శరీరాలను పరిత్యజించి విష్ణుదేవుని పాదపద్మాలను చేరుకొంటారు. ఇది సిద్ధమైన విషయం.

రాజా! మానవులుగా జన్మించిన వారూ, మరణం ఆసన్నమైనవారూ, మహాజ్ఞానులూ, చేయవలసిన కర్తవ్యం ఇలా చెప్పడమైనది.

రాజా! విను. బ్రహ్మవర్చస్సు కోరేవాడు వేదవిభుడగు చతుర్ముఖ బ్రహ్మను సేవించాలి. అట్లే ఇంద్రియశక్తి కోరేవాడు ఇంద్రుణ్ణీ, సంతతికోరేవాడు దక్షుడు మొదలయిన ప్రజాపతులనూ, భోజనం ఆశించేవాడు అదితినీ పూజించాలి. స్వర్గాభిలాషి ఆదిత్యులనూ, రాజ్యాభిలాషి విశ్వదేవతలనూ, దేశప్రజలనూ, సంపదనూ స్వాధీనం చేసుకోగోరేవాడు సాధ్యులనూ, సిరిని వరించేవాడు దుర్గనూ ఉపాసించాలి. తేజస్సు కోరేవాడు అగ్నినీ, ధనాభిలాషి వసువులనూ, వీర్యార్థి రుద్రులనూ, ఆయువు అభిలషించేవాడు అశ్వినీదేవతలనూ, పుష్టికామి భూమినీ అర్చించాలి. ప్రతిష్టను అపేక్షించేవాడు లోకమాతలగు ఆకాశభూదేవతలనూ, అందచందాలు కోరేవాడు గంధర్వులనూ, కామినులను కామించేవాడు అప్పరసయైన ఊర్వశినీ, సర్వాధికారం కాంక్షించేవాడు పరమేష్ఠినీ భజించాలి. కీర్తికోరువాడు యజ్ఞమూర్తియైన విష్ణువునూ, ధనంకోరేవాడు వరుణుణ్ణీ, విద్యార్థి శివుణ్ణీ, దాంపత్య సుఖాభీలాషి పార్వతినీ కొలవాలి. ధర్మార్ధాలపై అభీలాష కలవాడు పుణ్యచరిత్రుడైన విష్ణువునూ, సంతానార్థి పితృదేవతలనూ, రక్షణ కోరేవాడు యక్షులనూ, బలం కోరేవాడు మరుద్గణాలనూ, రాచరికంపై అభిలాష గలవాడు మను రూపంలో ఉన్న దేవతలనూ, శత్రుమరణం వాంఛించేవాడు నిరృతినీ, భోగాభిలాషి చంద్రుణ్ణీ ఆరాధించాలి ఇంకా,
(వసువులు ఎనమండుగురు. 1. ఆపుడు 2. ధ్రువుడు 3. సోముడు 4. అధ్వరుడు 5. అనిలుడు 6. ప్రత్యూషుడు 7. అనలుడు 8. ప్రభాసుడు. వీర్యప్రదులగు రుద్రులు పదునొకండుగురు. 1. అజుడు 2.ఏకపాదుడు 3. అహిర్బుధ్న్యుడు 4 త్వష్ట 5. రుద్రుడు 6. హరుడు 7. శంభుడు 8. త్య్రంబకుడు 9.అపరాజితుడు 10. ఈశానుడు 11. త్రిభువనుడు.)

రాజా! పై చెప్పిన వాటినన్నింటినీ కోరినా, కోరకున్నా, పరతత్త్వసాధనలో నేర్పుగలవాడు మోక్షం మాత్రం తప్పక అభిలషిస్తాడు. తదనుగుణంగా తన హృదయంలో పరమేశ్వరుణ్ణి నెలకొల్పి భజిస్తాడు.

రాజా! పెక్కుమాట లెందుకు? పైని వివరించిన కోరికలతో ఇంద్రాది దేవతలను సేవించినట్లే, పద్మపత్రనేత్రుడైన విష్ణుని భజిస్తే నిర్మలమైన, జ్ఞానం, వైరాగ్యం, మోక్షం సిద్ధిస్తాయి. ఆ లక్ష్మీనాథుని కథాసుధారసం నిండుగా ఉన్ననదీ తరంగాలలో ఓలలాడడం గొప్పఅదృష్టం. శ్రీహరికథలు చెవులపండువు చేయకుండా ఉండునా?

ఈ రీతిగా పరీక్షిన్మహారాజుకు శుకయోగి చెప్పాడని సూతుడు పలుకగా ఆకర్ణించిన శౌనక మహర్షి ఆ సూతునితో ఇలా అన్నాడు.

ఈ రీతిగా శుకుడు పలికిన పలుకులను మిక్కిలి శ్రద్ధతో విన్న పరీక్షిత్తు శ్రేయోభిలాషతో వెనువెంటనే ఏమని ప్రశ్నించినాడో విశదీకరించి చెప్పు.

చవులూరేటట్లుగా ఉన్న మనోహరమైన నీమాటలు వింటుంటే ఇంకా ఏలాంటి మంచి మంచి విష్ణుకథలు చెపుతాడో అని మా మనస్సులలో ఉబలాటం పెల్లుబుకుతున్నది.

శౌనకు డావిధంగా చెప్పడం విని, సూతు డీరీతిగా అన్నాడు.

మునులారా! ఆ పరీక్షిత్తు బాల్యంలో సైతం తూలిపడే జులపాల జుట్టుతో తోడిబాలురతో గూడి ఆడుకొనే దినాలలో గూడ శ్రద్ధతో హరిపాదాలను అర్చించేవాడు.

అలాంటి భాగవతశ్రేష్ఠుడైన పరీక్షిత్తుతో వాసుదేవుని భక్తుడైన శుకయోగి ఇలా చెప్పాడు.

ఏ పుణ్యాత్ముడు భగవంతుని ఖ్యాతిని ప్రకటించే కథలు వింటూ కాలం గడుపుతాడో, అతని ఆయుస్సు తప్ప ఇతరుల ఆయువును సూర్యుడు ఉదయాస్తమయాలతో మోసగించి లాగుకొనిపోతుంటాడు. ఆ సంగతి గ్రహింపక మూఢుడు "నేను తప్పక చాలా సంవత్సరాలు జీవిస్తాను" అనుకుంటాడు. సంసారానికి హేతువులైన ఆలుబిడ్డలు, ఇల్లువాకిళ్ళు, తోటలు, దొడ్డు, ధనం మొదలైన వాటి తగులంలో చిక్కుకుంటాడు. అతనికి ఆయువుతీరగానే యమభటులు వచ్చి వాణ్ణి నానావిధబాధలకు గురిచేస్తూ యమపురికి తీసుకుపోతారు. అప్పుడు వాడు "అయ్యో! నేను పుణ్యం చేయలేదే! పాపం చేశానే!" అంటూ గోడు గోడున ఏడుస్తాడు.

ఆ కారణం వల్ల.

ఓ రాజా! పూగుత్తులతో ఆకసమంటుతూ అడవులలో చెట్లు జీవించడం లేదా? ఆహార మైథునాది వాంఛలతో పశువులు పల్లెసీమల్లో బ్రతకడం లేదా? కొలిమి తిత్తులు గూడా ఎడతెరపిలేకుండా ఊపిరి లోనికి వెలికి పీల్చుకొని వదలటాన్ని సాగిస్తున్నాయి గదా! ఊరపందులు, కుక్కలు గుంపులు గుంపులుగా ఇల్లిల్లు తిరుగుతూ దిక్కుమాలి దీనంగా తిరగడం లేదా! ఒంటెలు, గాడిదలు పెద్దపెద్ద బరువులు మోస్తున్నాయి కదా! అదేరీతిగా పద్మనేత్రుడైన శ్రీమన్నారాయణుని తెలియనేరని నరపశువులు అడవులందో, గృహాలందో సంసార విషయాలలో ఆసక్తిగల్గి జీవిస్తున్నారు. వారి బ్రతుకు వ్యర్థం.

భూపతీ! విష్ణుని నామసంకీర్తనలు వినని వీనులు కొండగుహలు. కురునాథా! చక్రధారి మీద పద్యాలు చదువని నాలుకలు కప్పల నాలుకలు. కీర్తిప్రియుడా! శ్రీకాంతుని చూడలేని కన్నులు నెమలిఈకల కన్నులు. సత్యవచనుడా! పద్మనేత్రుని పూజకు ఉపకరించని చేతులు పీనుగుయొక్క చేతులు. రాజర్షీ! శ్రీహరి చరణాలమీది తులసీదళాల పరిమళం ఆఘ్రాణించని ముక్కు పందిముక్కు పాపరహితా! గరుడవాహనుని సేవకు వెళ్లని పాదాలు చెట్ల వ్రేళ్ళు, విష్ణు పరం గాని చెవులు, నాలుకలు, మొదలయినవి వ్యర్థమైనవని తాత్పర్యం.

శ్రీమన్నారాయణుని యొక్క పవిత్రనామాక్షరస్మరణతో ద్రవించనివి మనస్సులు కావు, అవి కరకుబండలు. పద్మనాభుని కథలకు ఆనందబాష్పాలు రాలగా పొంగి పులకించనిది శరీరం కాదు, అది కదలని మెదలని వట్టి మొద్దు. పరమాత్మునికి ప్రణమిల్లని మూఢుని తలమీదిది బంగారు కిరీటం కిరీటం కాదు, అది కట్టెలమోపు. భగవంతునికి అర్పితం కాని మానవుని ఐశ్వర్యం ఐశ్వర్యం కాదు, అది అడవిగాసిన వెన్నెల. వాసుదేవుని సేవింపనివాడు. ప్రాణవాయువు లోపల ఉండి కదిలే పీనుగు. పద్మనాభుని పాదాల నాశ్రయింపనివాని జీవితం పొత్తినూలికాయలోని సాలెపురుగు జీవితం.

ఈ రీతిగా పలికిన శుకయోగి పలుకులకు పరీక్షిత్తు చిత్తం వికసించింది. అతడు నిర్మలమైన బుద్ధి విశేషం కలవాడై.

ఆరాజు బిడ్డలనూ, హితులనూ, బంధువులనూ, భార్యనూ, ఇతర పరిజనాన్ని, ధనాన్సీ జడత్వాన్నీ వదలిపెట్టినాడు. కమలనేత్రుడైన మాధవునిపై చిత్తం నిలిపాడు.

ఈ రీతిగా మరణభయాన్ని విడనాడి, ధర్మార్ధకామాలనే త్రివర్గాన్ని తిరస్కరించి, పరమ పురుషునియందే మనస్సును కేంద్రీకరించి శ్రీహరి లీలావిశేషాలను శుకుడు వర్ణిస్తుండగా వినాలనే తలంపుతో పరీక్షిన్మహారాజు ఇలా అన్నాడు.

విప్రోత్తమా! సర్వమూ తెలిసిన నీవు సర్వానికీ ఆత్మ అయిన వాసుదేవుణ్ణి కీర్తించేసరికి నాకుగల భ్రాంతులన్నీ తొలగిపోయాయి. నా మనస్సు సంతోష పరవశమయింది.

మునివర్యా! సర్వేశ్వరుడూ, సర్వవ్యాపీ అయిన శ్రీహరి ఈ జగత్తును ఏ రీతిగా సృష్టిస్తూ, రక్షిస్తూ, సంహరిస్తున్నాడు? అవ్యయుడైన ఆ దేవుడు అనేక శక్తులు కలిగినవాడు. అతడు మొదట ఏ శక్తుల సాయంతో బ్రహ్మ ఇంద్రుడు మొదలైన రూపాలు దాల్చి వినోదించాడు? ఆయన సత్త్వరజస్తమస్సులనే ప్రకృతికి సంబంధించిన గుణాలను, పరిగ్రహించడం క్రమంగా జరుగుతుందా? లేక ఒకే సమయంలో జరుగుతుందా? ఏకమూర్తి అయిన ఈశ్వరుడు అనేక మూర్తులు ధరించి ఎందుకలా అనేక విధాల ప్రవర్తిస్తాడు? అలా ప్రవర్తించకపోతే ఆయనకు వచ్చే నష్టమేమి? నీవు అంతా తెలిసిన మహానుభావుడవు. నా కీవిషయాలు తెలియ జెప్పు.

పరీక్షిన్మహారాజు ఆ విధంగా అడిగే సరికి మౌనం వహించకుండా తగిన సమాధానం చెప్పాలన్న కుతూహలంతో ఉత్తమగుణ సంపన్నుడైన శుకుడు తన మనస్సులో ఇలా భగవంతుణ్ణి ప్రార్ధించాడు.

ప్రకృతికంటే, జీవునికంటె భీన్నుడై, (శ్రేష్ఠుడై), అంతటికీ అధిపతియై, గొప్ప మహిమలుగలవాడై, సృష్టిస్థితి సంహారాలనే క్రీడలు గావించువాడై, త్రిమూర్తుల శక్తులు గలవాడై, అందరికీ అంతరాత్మగా వెలుగొందుచున్నవాడై, బ్రహ్మ మున్నగు దేవాధిపులు అందుకోజాలని దుస్తరపథంలో ప్రకాశించేవాడైన శ్రీహరికి నేను తత్త్వప్రాప్తి మీద అభిలాషగలిగి ప్రణమిల్లుతున్నాను.

సజ్జనుల పాపాలను పరిహరించేవాడూ, దుర్జన శిక్షకుడూ, అన్ని రూపాలూ తన రూపమే అయినవాడూ, పరమహంసా శ్రమంలో ఉండే మునుల హృదయపద్మం మధ్య వెలుగొందేవాడూ, యదుకుల తిలకుడూ, సకల కల్యాణ గుణశోభితుడూ, ఉత్తమభక్తులకు సులభమైనవాడూ, భక్తిలేనివారికి దుర్లభుడూ, అత్యుత్తమమూ, అనుపమమూ, అనంతమూ అయిన ప్రవర్తన గలవాడూ, స్వస్వరూపమయిన బ్రహ్మంలో విహరించేవాడూ అయిన ఆ పరమేశ్వరునికి ప్రణమిల్లుతున్నాను.

ఏ పరమేశ్వరుణ్ణి ఉద్దేశించి చేసే ప్రణామం, పూజ, ధ్యానం, నామసంకీర్తనం అమోఘమైనవో, ఏ ప్రభుని లీలలు వింటే దోషాలన్నీ తొలగి లోకం మంగళాయతనమవుతుందని పెద్దలు చెబుతున్నారో, అట్టి పాపరాశిపరిహారకుడూ, భద్రమయ కీర్తనుడూ అయిన భగవంతుణ్ణి ఆశ్రయిస్తున్నాను.

ఏ పరమాత్ముని చరణయుగళిని ఎల్లకాలాల్లోనూ కోరి సేవించి నిపుణులైనవారు అంతర్ముఖమైన బుద్ధితో ఇహపరలోకాలకు చెందిన జాడ్యం వదలుకొని ఏ విధమైన తాపం లేనివారై పరబ్రహ్మను పొందుటకుపాయమైన మార్గంలో శ్రమలేకుండా చరిస్తారో, అట్టి పాపసంఘవినాశకుడూ, మంగళప్రదకీర్తనుడూ అయిన పరమేశ్వరునికి నేను ప్రణామం చేస్తున్నాను.

ఎన్ని తపస్సులు చేసినా, ఎన్ని దానాలాచరించినా, ఎన్ని జపాలు నిర్వహించినా వాటివల్ల కలిగే ఫలాలను ఏ పరమేశ్వరుడికి సమర్పించకుంటే అవన్నీ నిందాస్పదాలై ఆపదలతో గూడీనట్లు పరిణమించునో, అట్టి పాపనివారకుడూ, మంగళకీర్తనుడూ, పరిమితి లేనివాడూ అయిన పరమేశ్వరుణ్ణి సేవిస్తాను.

యవనులు, కిరాతులు, పుళిందులు, హూణులు, శకులు, కంకులు, ఆభీరులు, చండాలురు అనే వారికి చెందిన జాతులలో జనించినవారునూ, మిగిలిన పాపశీలురునూ ఏ పరమ పావనుడైన భగవానుని సేవించి, ఉత్తములైన భాగవతులను ఆశ్రయించి శుద్ధశరీరులై, మంగళాకారులై ఉంటారో అట్టి వికారరహితుడూ, సర్వసమర్థుడూ అయిన పరమాత్మకు సదా నమస్కరిస్తాను.

తపస్సులతోనో, చిత్తనిగ్రహంతోనో, నానా దానాలతోనో, వ్రతాలతోనో, జపాలతోనో, మంత్రాలతోనో, శ్రుతిస్మృతుల అధ్యయనంవల్లనో, లేక ఉత్తమ భక్తితోనో, ఇలా దేనివల్ల ఆయన దివ్యచరణాలు లభిస్తాయి? అని బ్రహ్మరుద్రాదులు ఏ పరమాత్ముణ్ణి భావిస్తుంటారో ఆ మోక్షవిభుడూ, ఆత్మస్వరూపుడూ నాకు సదా సులభుడవుగాక!

లక్ష్మీదేవికీ, యజ్ఞానికీ, ప్రజలకూ, బుద్ధికీ, జగత్తుకూ, భూమికీ, యాదవకులానికీ పతీ గతీ అయిన భగవంతుణ్ణి నేను భజిస్తాను.

ఆ దేవుడు అణుస్వరూపుడా? లేక విభుస్వరూపుడా? దిక్కాలాదులచే పరిచ్చిన్నుడా? లేక అపరిచ్చిన్నుడా? సగుణుడా? నిర్గుణుడా అంటూ పండితులు తమ తత్పాన్వేషణ ప్రయత్నం విఫలం కాగా, ఏ దేవుని చరణకమలసేవా పరాయణులై తత్త్వాన్ని దర్శిస్తున్నారో అట్టి సర్వోత్కృష్టుడూ, విశ్వాత్ముడూ అయిన విష్ణుదేవుని నేను భజిస్తాను.

బ్రహ్మకు జగన్నిర్మాణం చేయాలన్న బుద్ది పుట్టించాలని ఏ భగవానుడు పూర్వం సరస్వతిని పంపగా ఆమె బ్రహ్మను తనకు భర్తగా స్వీకరించి లోకసామ్రాజ్యంలో ఆయనను సృష్టి నిపుణుణ్జిగా చేసిందో, అట్టి సగుణుదైన భగవంతుణ్ణి సేవించుట కుపక్రమిస్తాను.

తాను పరిపూర్ణుడై అంతటా వ్యాపించి ఉండికూడా పృథివ్యాదులగు ఐదు మహాభూతాలను కలిపి శరీరాలనే పురాలను నిర్మించి వాటిలో పురుషుడనే పేరుతో ఎవడు ధీరుడై ప్రకాశిస్తుంటాడో, పంచభూతాలనూ, పదునొకండు ఇంద్రియాలనూ, ప్రకాశించునట్లు చేసి మహామహిమతో షోడశకళాస్వరూపుడై వెలుగొందుతూ ఎవడు జీవత్వమనే నృత్తకళావిలాసం ప్రదర్శిస్తుంటాడో, అట్టి అవ్యయుడూ, అచ్యుతుడూ అయిన భగవంతుడు మనోజ్ఞమైన నవరసాలనే తేనెలు జాలువారగా నా మనస్సునుండి పుట్టిన వాక్కులనే పూలదండలతో సజ్జనుల హృదయసీమల నలరించుగాక!

పదునొకండింద్రియములు- వాక్కు, పాణి, పాదం, పాయువు, ఉపస్థ అనేవి ఐదు కర్మేంద్రియాలు, శ్రోత్రం, చర్మం, చక్షువు, జిహ్మ, ఘ్రాణం-అనేవి ఐదు జ్ఞానేంద్రియాలు, మనస్సు చేరి పదునొకండింద్రియాలు.

నవరసాలు : శృంగారం, హాస్యం, కరుణం, రౌద్రం, వీరం, భయానకం, బీభత్సం, అద్భుతం, శాంతం-అనేవి నవరసాలు. నర్తకులు నృత్తస్తమయంలో నవరసాలు ఒలికిస్తూ సామాజికుల హృదయాలను రంజింప జేస్తారన్న ప్రక్రియ ఇక్కడ నిర్ధేశించబడింది.

మానమే ధనంగా గలవారూ, మహితాత్ములూ, సమాధి నిపుణులూ అయినవారు ఏ మహనీయుని ముఖపద్మధ్యానమనే తేనె నాస్వాదిస్తూ, భయరహితులై భవబంధ విముక్తులై విరాజిల్లుతారో, అట్టి ముని జనాగ్రగణ్యుడూ, గాఢమైన అజ్ఞానమనే చీకటికి సూర్యుడూ, సజ్జనులలో ముఖ్యుడూ అయిన వేదవ్యాస భగవానునికి నేను నమస్కరిస్తాను.

ఇలా శ్రీహరికీ వ్యాసభగవానునికీ ప్రణామాలు సమర్పించి శుకయోగి పరీక్షిన్మహారాజుతో ఇలా అన్నాడు.

మనుజేంద్రా! ఇప్పుడు నీవు నన్నడిగిన విషయాన్నే పూర్వం బ్రహ్మ నారాయణుని ద్వారా విన్నాడు. నారదుడు ప్రశ్నిస్తే దానినే ఆయన వివరించాడు. తదుపరి నారదుడు నాకది ఎరిగించాడు. వినదగినదీ, ఆశ్చర్యావహమైనదీ, సంశయం తొలగించేదీ అయిన ఆ విషయం నీకు చెబుతాను విను.


నారదుండు బ్రహ్మను బ్రపంచ ప్రకారంబు నడుగుట

No comments:

Post a Comment

The story of Yashodamma catching and punishing Balakrishna for breaking butter pots - యశోద దధిభాండ వికలనాదులు సేసిన కృష్ణుని బట్టుకొనుట

యశోద దధిభాండ వికలనాదులు సేసిన కృష్ణుని బట్టుకొనుట యశోద శ్రీకృష్ణునిపై పాటలు పాడుతూ, పెరుగును చిలకడం ప్రారంభించింది. ఆమె గాన మాధుర్యానికి చెట...