కశ్యపుని భార్యయైన దితి తనకు కలుగబోయే కొడుకులు దేవతల్ని ముప్పుతిప్పలు పెట్టగలరని అనుకొంటుండగానే నూరుసంవత్సరాలు గడిచాయి. తర్వాత ఆమెకు సమస్తలోకాల్ని విధ్వంసం చేయగల కుమారులు పుట్టారు.
దితి పుత్రులను పొందిన ఆ సమయంలో
దితికి లోకద్రోహులైన కొడుకులు పుట్టగానే భూమి కదిలింది. కులాచలాలు వణికాయి. సముద్రాలు అల్లకల్లోలమయ్యాయి. నక్షత్రాలు రాలాయి. ఆకాశం బద్దలైంది. దిగ్గజాలు కిందికి వంగిపోయాయి. మెరుపులు తళుక్కుమన్నాయి. పిడుగులు భూమిపై పడ్డాయి.
(మహేంద్రం, మలయం, సహ్యం, శుక్తిమంతం, గంధమాదనం, వింధ్యం, పారియాత్రం- అని ఈ ఏడింటికి కులపర్వతములని వ్యవహారం.)
హోమాగ్నులు పొగ చూరాయి. ఎదురు గాలులు వీచాయి. చెట్లన్నీ అడ్డదిడ్డంగా కూలిపడ్డాయి. గ్రహాలు, తారలు కాంతి విహీనమయ్యాయి. మబ్బులు నెత్తురు కురిశాయి. మెరుపులు మిరుమిట్లు గొల్పాయి. రాహువు అకాలంలో సూర్యుని చెరబట్టాడు. చిమ్మచీకట్లు ప్రబలాయి. కుక్కలు గొంతెత్తి అరచాయి. పట్టపగలే నక్కలు కూశాయి. పులుగులు బాధతో కూతలు పెట్టాయి. కన్నుల్లో నీరుగ్రమ్మగా దేవతా విగ్రహాలు కూలిపడ్డాయి.
ఆవుల పొదుగుల్లో రక్తం, చీము కారింది. గాడిదలు బోరున ఓండ్ర పెట్టాయి. ఏన్గుల చెక్కిళ్ళలో మదముడిగింది. గుర్రాల తోకల్లో నిప్పులు చూపట్టాయి.
దితి కడుపున శక్తిమంతమైన కుమారులు కల్గిన సమయంలో గుహలు మారుమ్రోగాయి. శుభ గ్రహాలు దుష్టగ్రహాలతో కలిసి అడ్డదారులు త్రొక్కి భమించాయి. (గ్రహగతి మారటం అశుభసూచకం)
ఓ బుద్ధిమంతుడవైన విదురా! ఒక్క సనకాదిమునులు తప్ప తక్కిన ప్రాణికోట్లన్నీ వెరపుగొల్పే ఉత్పాతాలను చూచి 'ఇది ప్రళయకాలమా? కాక సత్పురుషులను హింసించడానికి అవతరించిన రక్కసుల ఆగడమా?' ఏదో తెలియక భయగ్రస్తమయ్యాయి.
అంత భయంకరంగా జయ విజయులు రాక్షసులై పుట్టారు.
అంతభయంకరంగా జన్మించిన ఆ రక్కసు లిర్వురు కులపర్వతాలను పోలి ఉన్నారు. వారి బాహుబలం చెప్పనలవి కానిది. వారు తమ అడుగులతో చరచినప్పుడు నేల గడగడలాడింది. తాము ధరించిన రత్నాల భుజకీర్తులు, చెవిపోగులు, మొలనూళ్ళు, కడియాలు, ఉంగరాలు, కిరీటాలు, బంగారు గజ్జెలు మొదలైన ఆభరణాల నిగనిగలు జిగేలుమన్నాయి. ఆ ఇర్వురి దేహకాంతి సూర్యరశ్మిని వెలవెలబోయేట్లు చేసింది.
రాక్షస కుమారులిర్వురు మహాతేజోధనులై వెల్గుతున్న సమయంలో వారి తండ్రియైన కశ్యపుడు దితి ఇంటికి వచ్చి, బాలురను చూచి వారికి పేర్లు పెట్టాలనుకొన్నాడు.
ఆ కశ్యపబ్రహ్మ గర్భాధాన సమయంలో దితికడుపున తానుంచిన తొలి వీర్యంవల్ల కల్గిన కుమారునికి 'హిరణ్యకశిపుడు' అనే పేరుపెట్టాడు. దితిగర్భంనుండి ముందు పుట్టిన కుమారునికి 'కాంచనలోచనుడు' (అనగా హిరణ్యాక్షుడు) అనే పేరుపెట్టాడు. తర్వాత నిజపుణ్యభూమికి తరలిపోయాడు-
(రాక్షసులుగా జన్మించిన ఈ బాలుర ప్రసవగాథ విచిత్రమైంది. కశ్యపుడు దితిగర్భాన మొదటనుంచిన వీర్య శిశువు 'హిరణ్యకళిపుడు'. ప్రసవసమయంలో ముందు పుట్టిన కుమారుడు 'హిరణ్యాక్షుడు'. దితిగర్భపుష్పంలో నిక్షిప్తమైన కశ్యపుని వీర్యం రెండుగా విభజింపబడ్డప్పుడు మొదటి బీజం గర్భంలో వెనుకగాను, రెండవబీజం ముందుభాగంలోను ఉండటం జరిగింది. ప్రసవసమయంలో రెండవ బీజం తొలుతగా, మొదటిబీజం రెండవదిగా బహిర్గతమైనట్లు వివరణ చెపుతున్నది.
తొలుత పుట్టిన బిడ్డ హిరణ్యాక్షుడు. బంగారుకళ్ళవాడు - మలివిడత పుట్టిన బిడ్డ 'హిరణ్యకశిపుడు' బంగారుసింహాసనం కలవాడు అని కశ్యపుడు వారికి నామధేయం చేశాడు.
కవలలలో ముందు పుట్టినవాడు తమ్ముడు, వెనుక పుట్టినవాడు అన్నగా పరిగణించటం ఉన్నది.)
కుమారులకు పేర్లుపెట్టి కశ్యపుడు వెళ్ళిన తర్వాత, హిరణ్యకశిపుడు బ్రహ్మవల్లపొందిన వరగర్వంతో శత్రువుల భుజగర్వాన్ని అణచి దిక్పాలురందరిని జయించి, తనకెవ్వరు ఎదురులేకుండ చేసికొని మహాసంతోషంతో మెలిగాడు. అతని తమ్ముడు హిరణ్యాక్షుడు. వాడు మదించిన ఏన్గుతొండంతో దీటైన గదను చేత దాల్చి తన్నెరించగలపగవారు లేనందువల్ల సగర్వంగా భూలోక సంచారం చేసేవాడు. తర్వాత స్వర్గానికి పోయి అక్కడ కూడ తనతో యుద్ధం చేయడానికి సాహసించని దేవతలను చులకనచేసి, బ్రహ్మవలన వరంపొంది హితులతో కలిసి, శత్రువులను కలతపరిచేవాడు. మెడలో విష్ణుమాలిక ధరించి, కాళ్ళగజ్జెలు గల్లుగల్లు మంటుంటే, తనదేహకాంతితో దిక్కులన్నింటిని వెల్గిస్తూ ఉండేవాడు. వాని దాటికాగలేక దేవతలు తమ ఇండ్లను వదలి ఎక్కడికో పారిపోయారు. దేవతలు వదిలిపెట్టిన ఇండ్లు జిల్లేడు, ఉమ్మెత్త చెట్లకు నెలవులుగా మారిపోయాయి.
"అయ్యో! ఈ దేవతలు పరాక్రమహీనులై, తమ ఉపకరణాలను వదలిపెట్టి, విక్రమింపలేక, ఏంచేయాలో తోచక భయగ్రస్తులై పారిపోయారే!” అనుకొని ఆ మేరుపర్వతమంతధైర్యశాలి హిరణ్యాక్షుడు భుజదర్పంతో విర్రవీగి సముద్రంలో దూకాడు
దేవతల దైన్యస్థితిని తలపోస్తూ హిరణ్యాక్షుడు సముద్రంలో దూకగా.
వరుణదేవుని బలాలైన జలచరాలన్నీ హిరణ్యాక్షుని ఉరవడికి తట్టుకోలేక సాహసాన్ని కోల్పోయి, ఆ సముద్ర మధ్యభాగాన ఎక్కడో దాక్కున్నాయి.
దేవవైరియగు హిరణ్యాక్షుడు జలచరాల నిట్టూర్పులవల్ల సంచలించిన అలలను తన గదతో దట్టించి రూపుమాపాడు.
అంతేగాక ఆ హిరణ్యాక్షుడు పెక్కేండ్లు సంద్రం నడుమనే యథేచ్చగా సంచరించాడు. శత్రువుని మట్టుపెట్టే క్రీడతో స్వైరవిహారం చేశాడు. తర్వాత జలధినాయకుడైన వరుణుని విభావరినగరం వెళ్ళి అక్కడ హాయిగా కాలం గడుపుతున్న వరుణుని చూశాడు.
ఆ తర్వాత
సాగరాధిపతియు, పాతాళలోకపాలకుడునైన వరుణుని చూచి హిరణ్యాక్షుడు "ఓయీ! ఈ లోకంలో దిక్పతులందరికంటె నీవే మొనగాడవని, లోకం మెచ్చుకోదగిన పోటుమగాడవని అంటారు. అంతగొప్ప వీరుడవైతే ఇపుడు నాతో తలపడు. నీ భుజబలాన్ని నీ ప్రతాపాన్ని ఇప్పుడే అణచివేస్తా అని పరిహసించాడు. అప్పుడు వరుణుడు రక్కసుని గెలుపు, బలం, పరాక్రమాలతో, తన బలాన్ని పోల్చుకొని వానితో యుద్ధం చేయడానికి పూనక.
రక్కసునితో పోరుసల్పుటకిది తగిన సమయం కాదని తలంచి వరుణుడు ఓర్పు అనే నీటితో తనలో రగులుతున్న కోపాగ్నిని ఆర్పి, మెత్తగా ఆ హిరణ్యాక్షుని ఉద్దేశించి ఇట్లన్నాడు.
ప్రసుత్తం నేను మనశ్శాంతి గల్గి ఉన్నాను. యుద్ధం చేయరాదని నియమం పెట్టుకొన్నాను. కాబట్టి యుద్ధక్రీడకు నేను ఉత్సహించను. ఇప్పుడు నీ భుజబలాన్ని ఎదుర్కొని నిలువగల్గినవాడు 'ఒక్క విష్ణుమూర్తి తప్ప తక్కిన వారెవ్వరు ఎక్కడ కూడలేరు' అని వరుణుడు హిరణ్యాక్షుని ఉద్దేశించి అన్నాడు.
ఆ మహావిష్ణువు వైకుంఠంలోఉన్నాడు. ఆయన సాహసంతో యుద్ధం చేసి ఎందరో శత్రువుల్ని మట్టుపెట్టిన వీరుడని, అనిందితచరిత్రుడని జనం వేనోళ్ళ స్తుతిస్తోంది. నీతో పోరుసల్పగలడాయన. అంతటితో నీ కథ ముగుస్తుంది.
ఓరి బుద్ధిహీనుడా! యుద్ధరంగంలో పలాయనం చేయటం అపకీర్తి గదా అని అనుకోకుండా కాలికి బుద్ది చెప్పే పిరికిపందల నెదుర్కోవటం పౌరుషమవుతుందా? అదో ఆ వైకుంఠవాసుడు నీ పని చక్కపెట్టగలడు. ఆయనతో తలపడాలని ఉంటే వైకుంఠానికి పో. ఆ స్వామి నిరంతరం రక్కసులతో పెనగి విజేతగా ఉన్నాడు.
అంతేగాక, ఇంకా.
మహర్షులచే కొనియాడబడుతున్న ఆ శ్రీహరి నాల్గు యుగాలలో అవసరమైనప్పుడు మానవాకృతి ధరించి, భుజబలంతో దుష్టరాక్షసుల్ని మట్టుపెడుతుంటాడు.
(యుగములు : ఇవి నాల్గు. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం.
1. కృతయుగం : ధర్మం నాల్గు పాదాలతో నడుస్తుంది
కాలపరిమాణం : 17,28,000 మానవసంవత్సరాలు
2. త్రేతాయుగం : ధర్మం మూడుపాదాలతో ఉంటుంది
కాలపరిమాణం : 12,96,000 మానవసంవత్సరాలు
3. ద్వాపరయుగం : ధర్మం రెండుపాదాలతో ఉంటుంది
కాలపరిమాణం : 8,64,000 మానవసంవత్సరాలు
4 కలియుగం : ధర్మం ఒకేపాదంతో ఉంటుంది
కాలపరిమాణం : 4,32,000 మానవసంవత్సరాలు)
ఓరీ రాక్షసా! నీవు ఆ నారాయణుణ్ణి ఎదుర్కొన్నావో కయ్యం సంగతి దేవుడెరుగును. నీ భుజబలం కాస్త సన్నగిల్లి నేలరాలిపోతావు. తర్వాత కుక్కల పాలవుతావు. ఇప్పుడు వెంటనే నీవు వైకుంఠానికి వెళ్ళితే, నీ సత్తా ఏమిటో తేలిపోతుంది. తర్వాత ఏమి జరుగుతుందో చెప్పటం దేనికి? (నీ చావు తప్పదని భావం.)
విష్ణువునెదుర్కొన పొమ్మని వరణుడు చెప్పగానే హిరణ్యాక్షుడు మహాకోపంతో మనస్సులో ఏ మాత్రం జంకులేకుండా ఆ దేవరక్షకుడు, దుర్మార్గుల నాశనం చేసేవాడైన విష్ణువుని తప్పక యుద్ధంలో ఎదిరిస్తానని పల్కి వైకుంఠ మార్గం పట్టాడు.
వైకుంఠ మార్గంలో పోతున్న హిరణ్యాక్షునికి నారదుడు కన్పించి "ఓ రాక్షసా! ఎక్కడికి పోతున్నావు?" అని అడిగాడు. అప్పుడా రాక్షసుడు ఆయనతో ఇట్లన్నాడు.
"నేను బొడ్డుదామరవాడును, అంతం లేనివాడును అగు లక్ష్మీధవుణ్ణి, యుద్ధరంగంలో ఎదుర్కొని అతణ్ణి చంపి నా రాక్షసకులానికి సంతోషం కల్గించాలని వైకుంఠనగరాభీముఖంగా సాగిపోతున్నా" నని హిరణ్యాక్షుడు నారదునితో అన్నాడు. ఆ నారదుడు వానితో ఇలా అన్నాడు-
"భుజపరాక్రమం కలవాడైన ఆ నారాయణుడు ఇప్పుడు వైకుంఠంలో లేడు. ఆయన భూమిని ఉద్ధరించాలని ఆదివరాహావతార మెత్తి పాతాళలోకంలో మోహరించి ఉన్నాడు. ఆయన్ని ఎదిరించే సాహసముంటే అక్కడికే పో. అక్కడే యుద్ధం చేయి" అని నారదుడు చెప్పాడు.
No comments:
Post a Comment