అలా మాట్లాడే సమయంలో యాగభాగాలు స్వీకరించేవాడు, యాగాధిపతియైన సర్వేశ్వరుడు ఇంద్రునితోకలిసి అక్కడకు వచ్చి పృథుచక్రవర్తితో ఇలా అన్నాడు.
ఓ పృథుచక్రవర్తీ! లోకులు మెచ్చేలా నీవు చేసిన నూరో అశ్వమేధయాగానికి ఇప్పుడు ఈ దేవేంద్రుడు భంగం చేసినందువల్ల క్షమాపణ చెబుతున్నాడు చూశావా?
కాబట్టి నీవు ఇతనిని (దేవేంద్రుని) క్షమింపుము. సత్పురుషులు దేహాభిమానంలేనివారు కనుక ప్రాణులకు అపకారం చేయరు. అందువల్ల నీ లాంటి సత్పురుషులు దైవికమైన మాయచేత జ్ఞానాన్ని కోల్పోయి ఇతరులకు బాధ కలిగిస్తే, ఎంతోకాలం నీవు చేసిన వృద్ధజన సేవ వ్యర్థమౌతుంది కదా.
ఈ దేహం అవిద్య, కోరిక, కర్మ - ఈ మూడింటిచేత మొదలైనదని తెలుసుకొని, ప్రాణిహింసచేయని మహాయోగులు దేహాభిమానం కలవారు కాకుండటం చేత, ఇల్లు, భార్య మున్నగు వానియందు వ్యామోహంలేనివారిని వేరే చెప్పాలా?
దేహంతో ఉన్న ఆత్మ సత్యం. స్వచ్చం, స్వయంప్రకాశకం. అది నిర్గుణమైనది, సద్గుణాన్ని ఆశ్రయించేది, వ్యాపించేది వ్యాపింపచేసేది, మూయవడనిది, అన్నింటికి సాక్షిగా నిలిచేది. ఇది దేహంకంటే భిన్నమైనదని ఎవడు తెలుసుకుంటాడో, అతడు నాయందు ఆసక్తిగలవాడు. కాబట్టి అతడు దేహాన్ని ధరించినవాడే అయినా, ఆ దేహలక్షణాలు పొందక ప్రవర్తిస్తాడు. అంతేకాదు. ఎవడు తన ధర్మాలను తాను నిర్వర్తిస్తూ, కోరికలులేనివాడై, శ్రద్ధతో కూడుకొన్నవాడై, ఎల్లప్పుడు నన్ను భజిస్తాడో, అతడి మనస్సు ప్రశాంతమౌతుంది. ఆ విధంగా ప్రశాంతమనస్కుడు, సత్వరజస్తమోగుణాలకు అతీతుడు, సమదృష్టికలవాడు అయిన వ్యక్తి నా పరిపూర్ణ స్వరూప శాంతస్థితిని పొందుతాడు. దానినే మోక్షమని అంటారు. ఈ ఆత్మ అన్ని కాలాల్లో ఒకే విధంగా ఉంటూ, దేనిని అంటి పట్టుకోకుండ తటస్థంగా ఉండేదే అయినా, దీని ద్రవ్యానికి, జ్ఞానానికి, క్రియకు, మనస్సుకు అధిపతిగా నన్ను ఎవడు తెలుసుకోగలడో వాడు పుట్టుకలెేని వాడౌతాడు.
ఈ జననమరణాలపరంపర పదార్ధాలు, పని, పనిచేయించునది, ప్రాణం తానే అయి వేరువేరుదేహాలు ఆధారంగా కలది కనుక, ప్రాప్తించిన ఆపదల్లో, సంపదల్లో నాయందు మనస్సు లగ్నం చేసిన మహాత్ములు మార్పుపొందరు. అందువల్ల నీవు సుఖదుఃఖాలను సమానంగా చూచే మనస్సుకలవాడవు, సమానమైన ఉత్తమ, మధ్యమ, అధమ స్థితులు కలవాడవు, జయించిన ఇంద్రియాలు మనస్సు కలవాడవు, విశేషంగా లభించిన మంత్రులందరితో కూడినవాడవు అయి అన్ని లోకాలను కాపాడు - అని, మరల ఇలా అన్నాడు.
ఓ రాజా! రాజోత్తములకు ప్రజలను కాపాడటం ఉత్తమధర్మం. ప్రజలుచేసే పుణ్యకార్యాలలో ఆరోభాగం లోకపాలకుడైన మహారాజుకు లభిస్తుంది. ప్రజలను కాపాడని రాజు పుణ్యాలు హరించబడతాయి. అంతేకాదు, అతడు ప్రజల పాపఫలాన్ని పొందుతాడు. బ్రాహ్మణ శ్రేష్ఠులు చెప్పినట్లు సంప్రదాయ ప్రకారం ధర్మకార్యాచరణ చేయాలి. ధర్మార్థకామాలపట్ల మెలకువతో మెలగాలి. వాటిపై ఆసక్తి చూపవద్దు.
ఈ విధంగా, ఓ రాజా! ప్రజలపట్ల ప్రేమగలవాడవై భూమిపై సమభావం కలిగి ఎల్లప్పుడు పరిపాలిస్తే నీయింటియందే సనకాదులను చూస్తావు.
ఓ రాజా! యోగము, తపస్సు, యజ్ఞాలచే సులభుడనుకాని నేను సమభావంగల సత్పురుషుల మనస్సులలో ఉండే వాడిని గాబట్టి నీ శాంతశీలానికి, మత్సరములేని కీర్తనలకు లోబడ్డాను. నీకు నేనొక వరం ఇస్తాను. వేడుకొమ్మనగా పృథుచక్రవర్తి సమస్తలోకాలకు గురువైన ఆ విష్ణుమూర్తి మృదుమధుర వచనాలు శిరసావహించి మనస్సులో ఆనందించినవాడై
తాను చేసిన పనులకు సిగ్గిల్లుతూ పృథుచక్రవర్తి కాళ్లకు భక్తితో వినమ్రుడై నమస్కరిస్తున్న దేవేంద్రుని చూచి ప్రేమపూర్వకంగా పృథువు కౌగిలించుకొన్నాడు.
(చేసిన తప్పుకు సిగ్గుపడటం, భక్తిభావంతో వినమ్రతను ప్రదర్శించడం ఇంద్రుని పశ్చాత్తాపానికి నిదర్శనం.)
అలా కౌగిలించుకొని పృథువుపై ద్వేషభావం లేనివాడైన తర్వాత.
విశ్వరూపుడు, భగవంతుడు అయిన ఆ విష్ణుమూర్తి, ఆ రాజు చేసిన పూజానమస్కారాలచే తృప్తి చెందిన మనస్సుగలవాడై, పృథువు తన కాళ్లకు నమస్కరించగా, ప్రయాణం కొనసాగించాలనుకొన్నప్పటికీ పృథువుపై దయతో నిలిచిపోయాడు.
ఈ విధంగా తనమీద దయతో ఆలసించడంతో విష్ణుని సందర్శించడంవల్ల కలిగిన ఆనందంతో కన్నీటి పర్యంతమై ఆ పరమేశ్వరుని మూర్తిని చూచి, స్పష్టంగా చూడలేక బొంగురుపోయిన గొంతుతో మాట్లాడలేక, ఎలాగో తన మనస్సులో ఆ దేవదేవుని భావించుకొని కౌగిలించుకొని, కన్నీటిధారలను తుడుచుకొని భగవంతుని దర్శిస్తూ, కళ్ళకు తృప్తి దీర అగుపించనివాడును, గరుడునిమూపుపై చేయిమోపి, నేలపై తన పాదపద్మాలు నిలిపి ఉన్నవాడును అయిన ఆ దేవతామూర్తితో ఆదిరాజైన పృథుచక్రవర్తి ఇలా అన్నాడు.
ఓ భగవంతుడా! వరదుడా! నిన్ను సజ్జనుడైనవాడు దేహాభిమానంతో భోగాలు అనుభవించాలని వరమెలా కోరతాడు. ఇహసుఖాలవరాలు నరకంలో ఉన్నవారికి కూడ లభిస్తాయి గదా! చెప్పవయ్యా!
ఓ మహాత్మా! ఓ పాపనాశకా! లక్ష్మీపతీ! పద్మనయనా! ఈ వరమే కాదు. మహానుభావులైనవారి వాక్కులనుండి వెలువడే తేనెలవంటి మీ పాదపద్మాలను గూర్చిన పొగడ్తలు విని సంతోషం పొందుతాను. అలా కాకుండ మోక్షాన్ని ప్రసాదించినా నేనంగీకరించను.
(భవబంధ విముక్త స్థితియే మోక్షం. అది ఒక విలక్షణ మానసిక పరిపక్వ దశావిశేషమే. అంతేగాని అదొక ప్రదేశం కాదు.)
ఓ పద్మనయనా! శ్రీహరీ! అందువలన స్వచ్చమైన నీ గొప్పకీర్తిని వినడానికి దయతో పదివేల చెవులు ప్రసాదించు. ఇప్పుడు అదే నా కోరిక.
పాపరహితా! పద్మనయనా! పెద్దలవాక్కులనుండి నీ పాదపద్మాలనుండి పుట్టిన అమృతకణాల వాయు తత్త్వమార్గం మరిచిన దుష్టయోగులను ఆ అమృతకణాలచే తత్త్వమార్దం వైపు మరలిస్తుంది. అలాంటి వరం అనుగ్రహించు. అది తప్ప ఇతరవరాలు నేను కోరను.
రాక్షసాంతకా! పరమపురుషా మంగళకరాలై సుప్రసిద్ధాలైన వైభవాలు కలవాడవు నీవు. నీ వైభవాలే ఈ సృష్టిలో సద్గుణాలు. అలాంటి గుణాలకై ఆశపడి లక్ష్మీదేవి నిన్నాశ్రయించింది. గుణాలను గ్రహించాలనే కుతూహలం ఆమెకుంది. అయినా ఆమె గుణాలను వరించలేదు. నిన్నే వరించింది.
ఈ విధంగా నీ ప్రసిద్ధి శుభప్రదమని ఆమెకు తెలుసు. ఆమె నిన్నుకోరి వరించింది. నీ గుణాల నొకమారు యాదృచ్చికంగానైనా చెవులార వినగలిగినవాడు నీ వెంటబడునుగాని, నీ గుణాలపట్ల విరక్తినెలా పొందుతాడు.
నీ గుణాలను నీ గుణాలుగా విన గలగటానికి సత్యదర్శనులైన వారి సాంగత్యం కావాలి. వారి అనుగ్రహమే నీ అనుగ్రహం.
తెలిసి ఒకమారు నీ గుణముల రుచి తెలిసికొన్నవాడు నీ వెంటపడకమానడు. ఎవడైనా మానితే వాడు పశువే. నేనును నీ గుణాలలో ఉత్సాహం చెందినవాడినే కాబట్టి, లక్ష్మీదేవి భజించిన పద్ధతిలోనే నేనూ నిన్ను భజిస్తాను.
ఈ విధంగా నీ సేవాసక్తిగల నేను, లక్ష్మీదేవి ఒకే విషయంపై కోరికతో పోటీ పడతాము గాబట్టి మా యిద్దరికీ ఒకరి తర్వాత ఒకరు తగవులేకుండా నిన్ను సేవించే అవకాశం ఇవ్వు. అలాకాక నీ పాదపద్మాలపై సేవాసక్తి గల మేము నేనంటే నేననే భావంతో తగవు రావచ్చు. దేవా! అయినా అలానే కానీ! అని మరలా ఇలా అన్నాడు.
దేవాధిదేవా! నీ పాదసేవ చేసే లక్ష్మీదేవి పనులను పాపరహితబుద్ధితో నేను కోరడంవల్ల ఆ లోకమాత అయిన లక్ష్మీదేవితో తగవు తప్పక వస్తుంది. దయాస్వభావుడవైన నీవు దీనులను బ్రోచేవాడివిగాన కొద్దిపాటి దానిని గూడ అధికం చేయగలవు. నీ నిజస్వరూపాన్ని చూపడంలో ఆసక్తిగల నీవు నన్ను ఆదరించినట్లు ఓ మహానుభావా! లక్ష్మీదేవి నాదరింపవు.
అందువల్ల సత్పురుషులు నిరంతరము నీ గుణాలను భజిస్తారు. వారు నీపాద సేవనం తప్ప మరొక ప్రయోజనం ఎరుగరు. ఓ దేవా! నీవు నీ సేవకులను వరాలు కోరుకొమ్మని మోహపూరితమైన మాటలు చెబుతావు. అలాంటి నీ మాటలకు లోబడని జనులు కోరికలతో పనులు ఎలా చేస్తారు? దేవా! నీ మాయాజాలంలో పడ్డ ప్రజలు ఏ కారణంతో నీ పాదసేవకంటె భిన్నమైన వాటిని కోరుతారు? అందువల్ల బిడ్డలయోగక్షేమాలను తనంతతానుగా కోరుకొనే తండ్రివలె నీవు నాకు మేలు చేకూర్చేందుకు సమర్థుడవు. అని పలికిన పృథుచక్రవర్తి మాటలు విని జగద్రక్షకుడైన ఆ విష్ణుమూర్తి సంతోషంతో కూడిన మనస్సుతో ఇలా అన్నాడు. "పృథుచక్రవర్తి! దైవానుగ్రహంవల్ల నా పట్ల నిశ్చలమైన భక్తి నీకు కలిగింది. దానివల్ల నీవు మాయనుండి బయటపడగలవు. నేను ఆదేశించిన విధంగా పనులు ఏమరుపాటులేకుండా చేస్తే నీకు శుభాలు కలుగుతాయి. నా భక్తులంతా స్వర్గమోక్షనరకాలను సమానంగా భావిస్తారు. నీ ప్రయత్నం కూడా అలాంటిదే. నా ఆదేశం ప్రకారం వదలిపెట్టలేని కోపాన్ని వదలుకొని నాపట్ల భక్తిని చూపించావు. అదేనాకు సంతోషం" అని పొగిడి, అనుగ్రహించి, పృథువు చేసిన పూజలు స్వీకరించి విష్ణువు బయలుదేరడానికి సిద్ధమయ్యాడు. అప్పుడు
నరులు, సిద్ధ, సాధ్య, కిన్నర, చారణ, గంధర్వ, ముని, నాగాదిజనులు, హరి పార్శ్వవర్తులు సంతోషహృదయాలతో యజ్ఞదీక్షాబుద్ధియైన పృథుచక్రవర్తి చేసిన సన్మానాలు సంతోషంగా స్వీకరించి తమతమ నెలవులకు వెళ్లారు. ఋత్విక్కులతో కూడిన పృథుచక్రవర్తిని ఆనందంతో చూస్తూ దేవతలందరూ తనను జయజయ నినాదాలతో స్తుతిస్తుండగా విష్ణుభగవానుడు వైకుంఠధామానికి వెళ్లాడు.
తర్వాత ఇంద్రియాలకు కనిపించకపోయినా, ఆత్మద్వారా దర్శింపగలిగినవాడైన ఆ పరమేశ్వరుడైన వాసుదేవునకు నమస్కరించి పృథుచక్రవర్తి తన నగరానికి వెళ్లిపోయాడు. ఆ సమయంలో నానావిధాలంకారాలతో స్వర్ణతోరణాలతో సుగంధవాసనలతో రత్నాల ముగ్గులతో ప్రకాశిస్తూ, ఫలపుష్పాదులు, అక్షతలు, దీపమాలికస్తంభాలు, పోకచెట్లబోదెలతో అన్ని ఇళ్ల ముంగిళ్లు వెలిగిపోతున్నాయి. కస్తూరి, పచ్చకర్పూరం, చందనం కలయంపిగా చల్లిన రాచమార్గాలు కన్పిస్తున్నాయి. అలా తరుపుష్పాలతో కూడిన నగరం ప్రవేశించాడు. రాజమార్గంలో నడుస్తుండగా రత్నకుండలకాంతులు ధగద్ధగాయమానంగా వెలిగిపోగా పౌరకాంతలు బంగారు పళ్లెరాలతో మంగళహారతులందించారు. శంఖనాదాలు, దుందుభితూర్యనాదాలు మారుమ్రోగాయి. వందిమాగధుల పొగడ్తల మధ్య పృథుచక్రవర్తి నిగర్వియై అంతఃపురంలోకి ప్రవేశించాడు. తర్వాత
ఆ పృథుచక్రవర్తి పౌరులచేతను, జానపదులచేతను మిక్కిలి ప్రీతితో రకరకాల పూజలందుకొని సంతోషించిన మనస్సుగలవాడై ప్రజలకు ఇష్టమైన కోర్కెలు తీర్చి, వారిని అనేకవిధాలుగా గౌరవించాడు. ఆ రకంగా మంచి గొప్ప పనులుచేస్తూ ప్రశస్తిపొంది గొప్పవాడని పేరుగాంచాడు. భూమండలాన్నంతా పరిపాలించి స్వచ్చమైన తనకీర్తిని భూలోకమంతా వ్యాపింపజేసి ఆ చక్రవర్తి సంతోషంతో పరమపద ప్రాప్తిని పొందాడు.
ఆ పృథుచక్రవర్తి కథను విదురునకు మైత్రేయ మహర్షి చెప్పెనని శుకమహర్షి పరీక్షిత్తునకు చెప్పిన విధానాన్ని శౌనకాదిమునులకు సూతుడు వివరించాడు.
No comments:
Post a Comment