Monday, February 23, 2026

Bakthi Yoga, Sankhya Yoga The teachings of Lord Kapila to his mother Devahuti - కపిలుండు దేవహూతికి భక్తి యోగమును తెలియంజేయుట

కపిలుండు దేవహూతికి భక్తి యోగమును తెలియంజేయుట

ప్రజల ఫలాశలు పలురకాలు. కాబట్టి వారి భక్తియోగపు పోకడలుకూడ అనేక విధాలు. చెపుతాను, వినుమన్నాడు కపిలుడు.

"తామసం, రాజసం, సాత్వికం అని భక్తిభేదాలు మూడురకాలు. వాటిలో తామసభక్తి ఎలాంటిదో చెపుతాను" అన్నాడు కపిలుడు.

పరులను బాధపెట్టటం, కపటవర్తనం, అసూయవంటి గుణాలుకల్గి, ఎల్లప్పుడు భేదదృష్టిగలవాడై, భగవంతునిపై భక్తిని ప్రదర్శించేవాడు తామసుడు. వాని భక్తి తామసభక్తి.

విషయభోగాలలో నైపుణ్యంగల్గి, సంపదకొరకు, కీర్తికొరకు పూజార్హుడనగు నన్ను కొలిచే భక్తుడు రజోగుణంగల రాజసభక్తుడు.

దోషకర్మల్ని నివారిస్తూ 'తన నడవడి లోకానికి ఆదర్శప్రాయమై వుండేటట్లు నడచుకొంటూ, కర్మల్ని భగవదర్పణంగా చేసే మనుజుడు సాత్త్వికయోగి అవుతాడు. అతని గుణాలు ప్రజాహితంగా వుంటాయి.

అమ్మా! మనుపుత్రీ! నేను పాపభావాలు లేనివాణ్ణి. కళ్యాణగుణాలతో విలసిల్లేవాణ్ణి. అంతేగాదు. పరమాత్మను. నా గుణాల్ని చెవులారా విని, భక్తితో నన్ను కొలిచే భక్తుల మనోభావాలు సముద్రాన్ని చేరే దేవగంగమాదిరి ఫలవంతమవుతాయి.

నేను నీచగుణాలకు దూరంగా ఉంటాను. నాపై ఉండవలసిన భక్తిభావన ఎలాంటిదో చెప్పాను. ఏ ఫలితాన్ని ఆశించకుండ నాయెడ చిరకాల భక్తిభావం గల్గియుండుము.

నా భక్తులనుసరించే భక్తి నిష్కామభక్తి. వారికి ఫలాపేక్ష ఉండదు. అలాంటివారికి సాలోక్యం, సామీప్యం, సారూప్యం, సాయుజ్యం అనేవి నాల్గు సాధనాలు. కాన నాల్గింటితో వెలసిన భక్తికి ఆత్యంతిక భక్తియనిపేరు. అన్యదేవతల్ని కొలుచుటవల్ల ఏర్పడే ఎలాంటి కోర్కెలనైనా, నన్నే ఆరాధించే నా భక్తులు తిరస్కరిస్తారు. అన్యకర్మల్ని వారు అపేక్షించరు. ఆత్యంతిక భక్తిభావంగల మనుజుడు త్రిగుణాలకతీతుడై 'నా ఆకారాన్ని' పొందగల్గుతాడు.

(శరణాగతికి 'భక్తియే' ఆలంబనం. దీని ఆసరాతో విశిష్టాద్వైతులు భగవత్సాయుజ్యాన్ని పొందగలమని విశ్వసిస్తారు. ఈ ఘట్టంలో కపిలాచార్యులు తల్లికి ప్రబోధించిన భక్తిమార్గం అయిదు విధాలుగా ఉంది.

1) తామస భక్తి; హింస, దంభం, మచ్చరం వీనివల్ల క్రోధాన్ని భేదదృష్టిని అవలంబించటం.

2) రాజస భక్తి: కీర్తి సంపదలు మున్నగువానికై విగ్రహారాధన చేయటం

3) దోషనివారణకు లేదా పాపవిముక్తికై శాస్త్రగతిని అనుసరించి భగవంతుని ప్రీతికొఱకై ప్రయత్నించటం.

4) నిర్గుణ భక్తి: ఫలాపేక్షగాని, పైనతెల్పిన మూడుగుణాలతో గాని నిమిత్తంలేని భక్తి.

5) ఆత్యంతిక భక్తి: భగవంతుని సేవ తప్ప తక్కిన దేన్నీ కోరని భక్తి,)

సంధ్యావందనాది నిత్యవిధులు, తిథి వారనక్షత్రాదుల ననుసరించి పితృతర్పణాలు, సాంవత్సరికాలు మున్నగు నిజధర్మాల్ని శ్రద్ధతో చేయాలి. పాంచరాత్ర క్రియాయోగంలో చెప్పబడిన శ్రీహరి ఆరాధన క్రియలు నిష్కామదృష్టితో చేయాలి. శ్రీమహావిష్ణుని విగ్రహాన్ని దర్శించి, స్తోత్రం, సాగిలపడటం, నమస్కరించటం, సేవించటం, ధ్యానించటం, శ్రవణం మొదలైన క్రియలు నిష్టతో నిర్వహించాలి. కర్మసాంగత్యం లేకుండటం, మంచివారిపట్ల ప్రేమ, దీనులయెడ దయ, తుల్యులైనవారితో స్నేహంగా మసలటం, మున్నగు నియమవిధులతో యోగసాధన కావించాలి. ఆధ్యాత్మికం, ఆధిభౌతికం, ఆధిదైవికం అనే మూడింటిని గూర్చి తెలిసికోవాలి. వాటిని గూర్చి ఇతరులకు ప్రవచించాలి.

(ముందటి వచనంలో 'ఆత్యంతికభక్తి' అనే పదముంది “అంతమతిక్రాంతో
త్యంతః స ఏవాత్యంతికః అని 'ఆత్యంతిక' శబ్దానికి నిర్వచనం. అంతవఱకు ఏ మాత్రం మిగులకుండ నిర్వహించడాన్ని 'ఆత్యంతికం' అంటారు. అంటే భగవంతుని పూజావిధానంలో అనుసరించవలసిన యే విధిని కూడ విస్మరించరాదు. విస్మరిస్తే కర్తకు ఏదోవిధమైన నష్టం కల్గుతుందని శాస్త్రవచనం. దీని పిండితార్థం 'అవినాశి' అని గుర్తుంచుకోవాలి.)

ఇంకా కపిలుడు ఇలా అంటున్నాడు,

భక్తుడు శ్రీమన్నారాయణుని గుణకీర్తన చేయాలి. భగవంతుని భక్తుల్ని ప్రేమతో మన్నించాలి. అహంకారం, చాంచల్యం లేకుండా మసలుకోవాలి. పైన చెప్పిన దైవారాధనకార్యాలలో నిమగ్నుడై, వానివల్ల ప్రేరణ పొందిన పుణ్యాత్ముడు మంచిమార్గంలో పయనిస్తాడు. స్వామి గుణగణాల్ని నిరంతరం కీర్తించే పుణ్యాత్ముడు 'అన్యాశ్రయుడు' కాకుండ గాలిలో కలిసిన పూలవాసన నాసారంధ్రాల్లో చొచ్చినట్లే కల్యాణగుణశోభితుడనైన నాలో ఐక్యమవుతాడు.

చరాచరభూతాల్లో నివసించే నన్ను ఏ మానవుడు లెక్కచేయకుండ, కేవలం నా విగ్రహాన్ని మాత్రమే కొలుస్తూ నాపై అనన్యభక్తిని ప్రదర్శింపడో, అలాంటివాడు బూడిదలో హవిస్సు వదలినయట్టి వాడవుతాడు - అనగా వ్యర్థజీవనుడని భావం.

"తల్లీ! సమస్తభూతాలలో ఉన్న నాకు ఈ భూతప్రపంచానికి విడదీయరాని సంబంధముంది. కుటిలాత్ములైన జనానికి ఇది తెలీదు. వారికి నాయందు, ఈ భూతాలయందు ఎల్లప్పుడు తేడాయే కన్పిస్తుంది. అలాంటి మాయావులకు ఎప్పటికీ శాంతి లేదు. వారు సామాన్యద్రవ్యంతో గాని విశేషద్రవ్యంతోగాని నన్ను పూజించినా, నాకు సంతోషం కలుగదు" అని చెప్పి, కపిలుడు గుణవతులలో అగ్రగణ్యయైన తల్లితో ఇంకా ఇలా అన్నాడు.

తల్లీ! అచేతన శరీరాలకంటె ప్రాణులు; ఆ ప్రాణుల్లో వృక్షాలకంటె రసవేదులైన జీవులు, వాటికంటె గంధవేదులైన తేనెటీగలు, తేనెటీగలకంటె శబ్దవేదులైన పాములు, వాటికంటె రూపవేదులైన కాకులు, కాకులకంటె పెక్కు పాదాలుగలవి, జీవులు శ్రేష్టమైనవి.

బహుపాదులకంటె, నాల్గుకాళ్ళ జంతువులు, వాటికంటె రెండుకాళ్ళుగల మానవులు మిక్కిలి శ్రేష్ఠులు. మానవుల్లో నాల్గుతెగలవారున్నారు.

మానవుల్లో నాలుగు జాతులు, ఆ జాతుల్లో బ్రాహ్మణులు, వారిలో వేదజ్ఞులు, వారికంటె వేదార్థం తెలిసినవారు, వారికంటె శాస్త్రసందేహాల్ని తీర్చగల మీమాంసకులు, వారికంటె స్వధర్మమెరిగినవారు, వారికంటె అనుభవజ్ఞులు, వారికంటె సంగవిముక్తులు, వారికంటె ఉత్తమధర్మపరాయణులు, వారికంటె కూడ ఎవడు అన్యదేవతారాధనల్ని త్యజించి, తనకర్మలన్నింటిని నన్నుద్ధేశించి చేస్తాడో, వాడు ఉత్తమోత్తముడు. వాడే నిజంగా సమభావంతో వర్తించే గొప్పవాడు.

సమదర్శియైన ఆ భక్తునిచూచి, భూతకోటి(సకలజాతులు) ఆనందవార్ధిలో మునిగి, ఆయనను గౌరవపురస్కారంగా వేనోళ్ళ స్తుతిస్తుంది.

జగత్కర్త సకల జీవకోటిలో ఆత్మరూపుడై వుంటాడు. పురుషుడు భక్తియోగంద్వారాగాని, అష్టాంగయోగమార్గంలో గాని, 'పరమాత్మ'ను దర్శిస్తాడు. ప్రకృతి మాత్రం 'పురుషస్వరూపంగా ఒక్కొక్కప్పుడు అందుకు భిన్నంగా ఉన్న దైవస్వరూపాన్ని పొంది 'క్రియలు' నిర్వర్తిస్తుంది. ఇదే భగవంతుని స్వరూపం. ఈ స్వరూపం వివిధరూపాలతో భాసించే కాలమని చెప్పబడుతుంది. కాలస్వరూపం మహత్తు మొదలైన ఏడుతత్త్వాలకు, వీటియందు తగుల్కొన్న ప్రాణికోటికి భీతిని కల్గిస్తుంది. భూతాలలో దాగి వాటిని నాశనం చేస్తుంది. విష్ణుమూర్తి యజ్ఞఫలాన్ని ఇచ్చేవాడు కాబట్టి, సమస్త విశ్వాన్ని తన గుప్పిట్లో వుంచుకొని అధికారం చెలాయిస్తుంటాడు. ఆయనకు బంధువులు గాని, శత్రుమిత్రులు గాని వుండరు. సకల ప్రాణికోటిలో ఆయన మేల్కొని, నిద్రావస్థలో వున్న ప్రాణుల్ని సంహరిస్తాడు. అతడంటే భయంతో గాలి వీస్తుంది. సూర్యుడు వెల్గుతాడు. ఇంద్రుడు వర్షిస్తాడు. తారకలు వెల్గుతాయి. చంద్రుడు చల్లగా వెన్నెల కురిపిస్తాడు. సముద్రాలు చెలియలికట్ట దాటవు. చెట్టు, తీగెలు ఋతుధర్మం తప్పక కాయలు కాస్తాయి. పూలు పూస్తాయి. నదులు ప్రవహిస్తాయి. అగ్ని మండుతుంది. కొండలతో కూడిన భూమి క్రుంగదు. ఆకాశం ఎల్లజీవులకు నెలవై వుంటుంది. జగత్తుకు మహత్తే బీజం కాబట్టి, అది ఏడు ఆవరణాలతో కూడిన తన ఉపాధిని విస్తరిస్తుంది. త్రిగుణాభిమానులైన బ్రహ్మాదులు సృష్టికార్యమునందు భగవంతునిచే నియోగింపబడి వారి పని వారు జాగ్రత్తగా చేస్తుంటారు. తల్లిదండ్రులు సంతానాన్ని ఉత్పత్తి చేస్తారు. కాలుడు మృత్యువుతో కలిసి ప్రాణికోటిని సంహరిస్తాడు. స్థావర జంగమాత్మకమైన సమస్త జగత్తు భగవంతుని అధీనంలోనే వుంటుంది” అని చెప్పి, కపిలుడు మరల అంటున్నాడు.

(భగవంతునికి మరో పేరు కాలం. 'కాలః కలయతామహం' అని భగవానుడే గీతలో అన్నాడు. అంటే శుభాశుభాల్ని వృద్ధి క్షయాల్ని చేస్తున్నవారిలో కాలస్వరూపుడు భగవంతుడే.)

ప్రభంజనపు తాకిడి ఎలావుంటుందో మేఘానికి తెలియనట్లే, జగత్కర్త బలమెంతటిదో ఎవ్వరికీ బోధపడదు.

అమ్మా! ఈ ప్రాణికోటి భగవంతుని మాయకు లోబడినట్టిదే. తమకు సుఖదాయకమైన సంపద చేతికందనందువల్ల ఎప్పుడూ బాధలకు గురియౌతుంటుంది.

('సుఖ హేతుకమగునర్థము' అనే మాట ఈ పద్యంలో వుంది. సుఖదాయకమైన అర్ధం (లేదా సొమ్ము) ఏదో కాదు- అది ఆత్మజ్ఞానమే. భౌతిక సుఖం కాదని తెలియాలి. ఆత్మజ్ఞునికి దుఃఖం లేదని భగవంతుడన్నాడు. ఆత్మజ్ఞాన సంపద అక్షయసుఖమని తెలిసికోవాలి.

అజ్ఞాని క్షణభంగురాలైన నివాసం, క్షేత్రం, పశుసంపదలు, భార్య, సంతానం, బంధువులు, అన్యపదార్థాలు మున్నగు అనిత్యవస్తువుల్ని నిత్య వస్తువులుగా నమ్మి జీవిస్తాడు. పెక్కు జంతుదేహాలలో ప్రవేశించాలని ఉబలాటపడతాడు. ఆతనికి వైరాగ్యభావన వుండదు. నరకకూపంలాంటి తన దేహాన్ని వదులుకోలేడు. అదే తనకు మిక్కిలి సుఖప్రదమని భావిస్తాడు. అతడు విష్ణమాయకు లోబడ్డవాడే.

భార్య, పిల్లలు, పశువులు, సొమ్ము, ఇల్లు, వాకిలి మొదలైనవాటి రక్షణ, వాటికి సంబంధించిన వ్యాపారాలలో తగుల్కొని, ప్రతినిత్యం దహ్యమానమైన శరీరం కలవాడవుతూ,

బుద్ధిహీనుడై పాపకర్మల్ని చేస్తూ భార్య చెప్పే రహస్యాలు, పిల్లల తియ్యని పల్కులు విని పరవశించే దౌర్భాగ్యుడవుతాడు

ఇంకా ఇంద్రియదాసుడైనవాడు వాని వెకలి చర్యలందే ఆసక్తుడవుతాడు. దుఃఖమే అతనికి సుఖంగా తోస్తుంది. వాటియందే అభిమానం కల్గివుంటాడు.

తాము సంపాదించిన ధనంతో గర్వించేవారు ఇతరులకు ఎల్లప్పుడు బాధలు కల్గిస్తూనే వుంటారు. వారు మహామూర్ఖులు. తమవారిని రక్షించుటే వారికి ముఖ్యం.

తమవారిని రక్షింపనెంచే మూర్ఖుడు ఆ పనిలోనే మునుగుతూ, తేలుతూ, వారు తినగా మిగిలినదానితో పొట్టపోసుకుంటూ, జీవితాన్ని సాగదీస్తాడు. వాడు పరభాగ్యోపజీవి. వానికి తన కుటుంబాన్ని పోషించే శక్తికూడ ఉండదు.

కుటుంబాన్ని రక్షించలేని దరిద్రుడు సిరిసంపదలకు దూరమై, చెడుబుద్ధి గలవాడై ఏ పని చేయజాలక వ్యర్ధప్రయత్నాలు చేస్తూ మూఢత్వంతో ప్రవర్తిస్తాడు. కృపణత్వంతో జీవిస్తాడు. అతనిది నిర్దయావస్థ. భార్య, పిల్లలు వాణ్ణి అశక్తుడని, తమని పెంచి పోషించలేని అధముడని నిందిస్తారు. వారు అతణ్ణి రైతు బక్కచిక్కిన ముసలెద్దుని చూచినట్లు చులకనగా చూస్తారు. ఆయనకు ఏ విధమైన సుఖం లేదు. ఒకప్పుడు తాను పోషించినవారే తనకింత పిడచపెడితే కాదనలేక బతుకుని వృద్ధాప్యంలో సాగదీస్తూ బాధలను అనుభవిస్తారు.

ఆ దీనుడు అవసానదశలో వికృతాకారుడై, బంధువులు ఏడుస్తుండగా, చావుకెదురుచూస్తూ, ఇంటిని వదలిపోలేక కుక్కమాదిరి ఎంగిలి కుడుస్తూ, శరీరం గజగజ వణుకుతుంటే జీవితాన్ని వెళ్ళదీస్తాడని ముగింపు.

దీనుడు అవసానదశలో రోగగ్రస్తుడవుతాడు. ఆకలి తగ్గిపోతుంది. ఒక్క ముద్ద కూడ ముట్టలేడు. అస్తమించే సమయానికి కళ్ళు తేలేస్తాడు. గొంతులో కఫం కమ్ముకుంటుంది. గొర గొర శబ్దం ఏర్పడుతుంది. అంతలోనే బంధువులు తన చుట్టుచేరి పిలుస్తుంటే ఉలుకూ పలుకూ ఉండదు. ఆయన్ని కాలపాశం బిగిస్తుంది. భార్యని, పిల్లల్ని పోషించగల పట్టు తప్పుతుంది. ఇంద్రియాలలో నిస్సత్తువ ఆవేశిస్తుంది. తెలివి దప్పిన అతనికి కష్టాలే దిక్కు

ఆ దీనునికి చావుదగ్గర పడగానే భయంకరమైన ఆకారాలు గలవారును, కొరకొర చూచే చూపులు గలవారును అయిన ఇద్దఱు యమదూతలు తన యెదుట నిలబడతారు. వారిని చూడగానే అతడు భయంతో మలమూత్రాలు విసర్జిస్తాడు. దూతలు యమపాశంతో వాని బొందినుండి ప్రాణం వెలువరిస్తారు. అంతట జీవుడు బాధలనుభవించవలసిన యాతనాశరీరాన్ని ధరిస్తాడు. రాజభటులు దోషిని శిక్షాస్తానానికి గుంజుకొని పోయినట్లు, యమభటులు బలాత్కారంగా అతణ్ణి బహుదూరం, వెళ్ళడానికి కూడా వీలుగాని భయంకరమైన త్రోవలో శిక్ష ననుభవింపజేయడానికి ఈడ్చుకొనిపోతారు.

యమలోకంలో దీనుని దశ ఎట్లుంటుందో కపిలుడు తల్లికి నివేదిస్తున్నాడు. దీనుని శరీరాన్ని అక్కడి జాగిలాలు పీక్కు తింటాయి. యమభటులు భయంకరంగా పెడబొబ్బలు పెట్టి భయగ్రస్తుణ్ణి చేస్తారు. వాని దేహం భయంతో వణికిపోతుంది. తాను పూర్వజన్మలో చేసిన పాపకార్యాల్ని తలపోసుకొంటూ వాడు స్పృహ కోల్పోతాడు.

ఆ దీనుడు ఆకలిదప్పులతో అలమటిస్తాడు. తుఫాను గాలికి హోరుమని రేగుతూ, ఎండకు మలమలమాడే ఇసుక గల దారిలో నడుస్తూ తపించినవాడౌతాడు. యమభటుల కొరడాదెబ్బలకు వీపు బద్దలవుతుంది. దేహం పట్టుతప్పుతుంది. మార్గమధ్యంలో స్పృహ దప్పినపుడు, నిరాశయమైన నీళ్ళలో మునుకలు వేస్తూ దారిసాగుతాడు. గతంలోని పాపపు చీకట్లు కమ్ముకుంటాయి. తొంబై తొమ్మిదివేల యోజనాలనిడివిగల ఆ యమపుర మార్గంలో భటులు వాణ్ణి ఈడ్చుకొని పోతారు.

మహాపాపి యమపురిమార్గంలో మూడు ముహూర్తాల కాలంలో సాగిపోగా, సామాన్యపాపి రెండు ముహూర్తాల కాలంలోనే ఆ దారిలో పోయి యమనగరం చెరి నరకబాధ లనుభవిస్తాడు.

యమభటులు పాపాత్ముల్ని కొఱవుల్లో పట్టుకుంటారు. కత్తివాదఱలకు గురిచేస్తారు. అగ్గి గుండాల్లో పడదోస్తారు. ఒళ్ళు నుగ్గయ్యేట్లు బడియలతో మోదుతారు.

యమభటులు పాపాత్ముణ్ణి కొఱవులతో కాలుస్తారు. సలసల కాగే నీటిలో ముంచుతారు. గదలతో మోది, కత్తులతో చీలుస్తారు. పేగుల్ని తెంచి, చిత్రవధ చేస్తారు. ఏనుగుల్తో త్రొక్కిస్తారు. పాములతో కరపిస్తారు. కాయంమీద గండశిలల్ని దొర్లిస్తారు. వాని కండలు కోసి వాని నోటితోనే తినిపిస్తారు.

పాపాత్ముడు అవసానదశలో పరివారం పోషిస్తుంటే, వారిచ్చిన తిండితో పొట్ట నింపుకొంటూ, పాడిదప్పి, నరకంలో పడి అలమటిస్తాడు. నిధి కోల్పోయి ఏడ్చే దీనుని మాదిరి, దాంపత్యదోషంవల్ల కల్టిన 'తామిస్రం, అంధతామిస్రం, రౌరవం' అనే ఘరనరక కూపాలలో పడిపోతాడు. తర్వాత పాపసంచయం వ్యయమైపోగా మరల మానవజన్మ నెత్తుతాడు అని కపిలుడు తల్లికి పాపాత్ముని చరిత్రను ఏ కరువు పెట్టాడు. మళ్ళీ, తన ప్రవచనం ఇలా కొనసాగించాడు.

కపిలుండు దేవహూతికి బిండోత్పత్తి క్రమంబు దెలువుట

No comments:

Post a Comment

Bakthi Yoga, Sankhya Yoga The teachings of Lord Kapila to his mother Devahuti - కపిలుండు దేవహూతికి భక్తి యోగమును తెలియంజేయుట

కపిలుండు దేవహూతికి భక్తి యోగమును తెలియంజేయుట ప్రజల ఫలాశలు పలురకాలు. కాబట్టి వారి భక్తియోగపు పోకడలుకూడ అనేక విధాలు. చెపుతాను, వినుమన్నాడు కపి...