అంటూ ఆ ధ్రువుడు దుఖపడ్డాడు. ఆ మైత్రేయముని విదురుడితో ఇలా చెప్పాడు. మనోహరమైన శ్రీహరి పదపద్మరేణువులచే సంస్కరింపబడిన శరీరాలు గలవారు. అనుకోకుండా లభించిన దానివలన, తృప్తి పడుతూ సంతోషంగా జీవిస్తుంటారు. అలాంటి మీ బోటివాళ్లు ఆ వెన్నుని పాదపద్మసేవ తప్ప మిగతావాటిని తలవనైనా తలవరు సరికదా మరొకదానిని దేనినీ పొరపాటున కూడ ఇచ్చగించరు. మనువు వర్తనవంటి నడవడి కలవాడా! ఈ రీతిని విష్ణుదయను పొందిన తన కన్న కొడుకు ధ్రువుడు తిరిగివస్తున్నవార్తను ఉత్తానపాదుడు చారునివల్ల విన్నాడు. ఆ సమయంలో.
మనసులో ఇలా అనుకున్నాడు.
ప్రాణం పోయినవాళ్లు మళ్లీ తిరిగి రావడమా? అదే కాక ఇలాంటి వృత్తాంతాలు ఎక్కడన్నా జరిగి ఉంటాయా? ఎపుడూ మేలు ఎరుగనట్టి నాకు అంతటి శుభాలు వాటిల్లుతాయా? అని ఆలోచించాడు నమ్మకం కుదర లేదు. అయినా 'అతి తొందరలో నీ కుమారుడు తిరిగి రాగలడు' అన్న నారదముని మాటలు గుర్తుకు వచ్చాయి. ఆ మాటలమీద గురి ఏర్పడింది. కృతార్థత సమకూరిన వాడయ్యాడు.
తన కొడుకు వస్తున్నాడనే శుభవార్తను తెచ్చిన ఆ ఘనుడికి(చారుడికి) ధనాన్ని ముత్యాలపేరులను మనస్సు హర్షిల్లగా కానుకలుగా ఇచ్చాడు. తన పుత్రుణ్ణి చూడాలనే ఆనందంలో లోపల చుట్టుముట్టుగా
ధ్రువుడికై ఎదురు చూపులుచూస్తున్న ఉత్తానపాదుడు కొడుకును చూడాలనే ఉబలాటంతో ఉత్తమజాతి అశ్వాలను కట్టిన పసిడి తేరును ఎక్కాడు. కులవృద్దులు, బంధువర్గం, మంత్రులు దానిచుట్టువారు రాసాగారు. వేదమంత్ర ఘోషలు, శంఖం, బాకా, వేణువువంటి ఊదే వాద్యాల ధ్వనులు, మంగళ వాద్యాలమోతలు పిక్కటిల్లాయి. నగలు సింగారించుకుని పల్లకీలు ఎక్కివచ్చిన సునీతి, సురుచి, ఉత్తముడితో కూడ వెంటపోయారు. ఇలా అట్టహాసంతో ఆ పట్టణం పొలిమేరల్లో అంతా కలియగూడి వేగవంతంగా వెళుతూ నగర ఉద్యానవనం దరిగా వస్తున్న ధ్రువుణ్ణి చూసి ఆ రాజు స్వయంగా.
కొడుకును చూచి పొంగిన మమకారంతో ఉత్సహించి గబగబా రథం దిగాడు. విష్ణుపదసేవతో పాపాలన్ని పోగొట్టు కున్నవాడు, ఈశ్వరానుగ్రహంతో అన్ని కోరికలు తీరినవాడు తన కొడుకు అని పులకించి పోయాడు. ఆ ఆనంద పారవశ్యంలో
ఆ రాజు గట్టిగా కవుగలించుకున్నాడు. ముఖమంతా నిమిరాడు. తలను మూచూచాడు. గడ్డాన్ని చేతి మునివేళ్లతో పట్టుకున్నాడు. మోదించాడు. ఆ కన్నీటి ధారాపాతంలో ముంచెత్తాడు దీవించాడు. అప్పుడు శాశ్వత యశోవంతుడైన ఆ ధ్రువుడు
తండ్రి ఆశీస్సులు పదే పదే అందుకున్నాడు. ఆ సంతోషం పట్టలేకపోయాడు. కన్నతండ్రి అడుగులకు తన నొసలు అంటేటట్లుగా నమస్కరించాడు. తండ్రి సేవలో తన్మయుడై పోయాడు.
(ధ్రువుడు మునుపు తండ్రివలన పొందిన అవమానాన్ని స్మరింపకపోవటం గమనింపదగిన విషయం)
ఆవల మంచివాళ్లల్లో ముందటివాడైన ధ్రువుడు తల్లులిద్దరికీ వినమ్రుడై మొక్కాడు. సురుచికి వేరుగా నమస్కరించాడు. ఆమె కుమారుణ్ణి అలా చూసి పైకి ఎత్తి, నవ్వుతూ అక్కున చేర్చుకుంది
ఆ సురుచి సంతోషాతిరేకంవల్ల బొంగురుపోయిన గొంతుతో 'వందేళ్లు జీవించు' అంటూ దీవించింది. నీరు పల్లం వైపుకి ప్రసరించే విధాన ఆ భగవంతుడు వాత్సల్యంతో ఎవరిపట్ల మిత్రభావంతో ఉంటాడో, ఎవరిమీద దయ చూపి ప్రసన్నుడవుతాడో వాని పట్ల ఈ భూమిలోని సర్వ ప్రాణికోటి తనంతాతానే మిక్కిలి అనుకూలంగా వుంటుంది. అలాంటిదే సురుచిన్ని. ఆమె వెనకటి వృత్తాంతాన్ని తలవకనే ఆ ధ్రువుడి ఘనతపై ప్రీతి చూపింది. ఈ నేలమీది విష్ణుభక్తి నిండినవారు పరిశుద్దాత్ము లవడంవల్ల వాళ్లపై ఎవరూ కోపంతో ఉండరు.
ఉత్తముడూ, ధ్రువుడూ ఎంతో ప్రేమగా ఒకరినొకరు కౌగిలించుకొన్నారు. ఒంటి పులకరింతలతో; ఆనందబాష్పాలతో తడిసి ముద్దయిపోయారు. అంతలో సునీతి కూడ తన ప్రాణంలో ప్రాణమైన తన తనయుని అక్కున చేర్చుకుంది. ఆ తనుస్పర్శానుభూతితో ఎంతో ఆనందపడింది. వెనకటి బాధనంతా వెనక్కి పెట్టింది. ఆ సంతోషపు కన్నీటి ధారలతో తడిసిపోయిన ఆమె పాలిండ్ల స్తన్యమున్నూ కన్నీటితో కలసిపారింది.
ఆ నగర పౌరులందరూ ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బవుతూ ఆ ధ్రువుడి తల్లిని తృప్తికరంగా దర్శించారు. నీకు వాటిల్లిన ఇన్నాళ్ల దుఃఖాన్ని తొలగించినవాడు నీ కొడుకు. ఎక్కడికో ఏనాడో వెళ్లి, ఇంతవరకు కనపడని నీ కుమారుణ్ణి ఈ దినాన నీ పుణ్యం కొద్దీ తిరిగి పొందగల్గావు. ఈ ధ్రువుడు తన గొప్పమహిమతో ఈ భూభాగాన్నంతా పరిపాలిస్తాడు. ఆ తామరసాక్షుని స్మరించే గొప్ప గొప్ప యోగులు జయింప శక్యంకాని మృతిని సైతం జయించగల్గుతారు. అలాంటి వినయశీలుల పీడలను తీర్చే ఆ విష్ణుమూర్తిని కొలవగల్గడం నీ వల్లనే అయింది అనేది సత్యమైన మాట. అని నుతించారు. అలా పౌరజనంచే అనునయించబడ్డ ధ్రువుణ్ణి ఉత్తానపాదుడు ఉత్తముడితోపాటు గజారూఢుని చేశాడు. స్తోత్రపాఠాలు వింటూ మనస్సున గొప్పగా ఆనందపడుతూ తన రాజధానికి చేరుకున్నాడు.
ఆ నగరం బంగారు తాపడంగల ఇళ్ళ పైకప్పులు, అచ్చమైన గోడలు, తలవాకిళ్లు, అందమైనగోపురాలు, చక్కనైన ప్రాకారాలు కల్గి ఉంది. పళ్లు, పూలగుత్తులు వేలాడుతున్న అరటిబోదెలు, లేతపోకచెట్లు మొదలైన అలంకరణలతో విశేషంగా ఉంది. కర్పూరం, కస్తురి, చందనంవంటి పరిమళద్రవ్యాలు కలబోసిన నీళ్లతో ఒత్తుగా కలయంపి చల్లిన బాటలుగల అంగళ్లు కలిగి ఉంది. ప్రీతి పుట్టించే నవరత్నఖచిత రంగవల్లులతో ప్రతి ఇంటి ముంగిలి కళకళలాడుతున్నది. పుణ్యనదీజలంతో నిండిన మంగళ కలశాలతో ఒప్పుతూ ఉంది. బీయ్యం, సువర్ణపుష్పాలు, పేలాలు, యవలు/పసుపు కలిపిన బీయ్యం, పువ్వులు, పళ్సు, వంటి పూజోపహారాల సముచ్చయంతో విలసిల్లుతూ ఉంది. ఇలా అన్ని ప్రక్కలా అలంకరణలతో ఆ పట్టణం పండుగదనంతో చూడచక్కగా ఉంది.
పురంలోకి ప్రవేశించి రాచబాటలో వేంచేస్తూ ఉండగా అదే సమయంలో సింహాలవలె సన్నటి నడుములుగల ఆ నగర రమణులు మేడలపైన వరుసలుకట్టి నిల్చున్నారు. ఆ భగవద్భక్త పుంగవునిపై మెరుస్తున్న తెల్లఆవాలు, పళ్లు, అక్షతలు, పూలు, చల్లుతున్నారు. లేతగడ్డిపరకల కట్టలతో పెరుగు కలిపిన నీటిని చిలుకరిస్తున్నారు. ఆ చిలకరింపుల్లో వాళ్ల చేతుల బంగారు గాజుల ఝణ ఝణ ధ్వనులు ఇంపుగొల్పుతున్నాయి.
ఈ విధంగా వాత్సల్యంతో చల్లుతూ నిక్కమైన పలుకులతో ఆ స్త్రీలు ఆశీర్వాదం చేశారు. పసిడిపళ్లాల్లో సమకూర్చిన మణిదిపాలతో హారతులు పట్టారు. పట్టణప్రజలు, పల్లెలప్రజలు, స్నేహితులు, మంత్రులు, బంధువర్గం మొదలైన వాళ్లంతా చుట్టూ నడుస్తుండగా ధ్రువుడు రాజప్రాసాదానికి పోసాగాడు.
ఆ రాజభవనాలు, పచ్చలు తాపిన బంగారు గోడలతో; రత్నాలరాసుల గుట్టలతో మిలమిల లాడ్తున్నాయి. పాలనురుగులవలె తెల్లనైన, బంగారు పరికరాలతో కూర్చిన, విలువైన వస్త్రాలు పరచిన పరుపులు ఇంపుగా ఉన్నాయి. పూలతోటలు, 'చక్కటి కల్పవృక్షాలతో, చిలుకలు, కోకిలల కలరవాలతో, తుమ్మెదజంటల ఝుంకారాలతో అలరిస్తున్నాయి. దిగుడుబావులు, ఎంతో విలువైన వైడూర్యాలతో కూర్చిన మెట్లతో, తళతళమనే స్వచ్చమైన నీటితో నిండుగా ఉన్నాయి. కొలనులు, విరబూసిన ఎర్రకలువలతో, అప్పుడప్పుడే వికసిస్తున్న తామరపూలతో, తెల్లకలువలతోనూ, కొంగలు, జక్కవలు, రాజహంసలు, బెగ్గురులు, కణుజు పిట్టల కిలకిల నాదాలతో ఆహ్లాదింపచేస్తున్నాయి.
ఇంకా ముచ్చటగొల్పే రకరకాల వస్తువులతో నిండుగా ఉన్నట్టి, స్త్రీ పరిజనంతో కూడు కున్నట్టిది, పుష్కలత్వంలో అమిత ప్రీతిదాయకంగా ఒప్పి ఉన్నట్టిది, అయిన తన తండ్రి మందిరాన్ని సంతోషంగా స్వర్గంలో ప్రవేశించే దేవేంద్రుడి వలె ధ్రువుడు తన తండ్రి యింట ప్రవేశించాడు.
ధ్రువుడు అపరదేవేంద్రుడిలా జనకుని గృహంలోకి ప్రవేశించాడు. ఆ తర్వాత రాజర్షియగు ఆ ఉత్తానపాదుడు కుమారుడి అద్భుతమైన మహిమను చెవులారా విన్నాడు. కళ్లారా చూచాడు. మనసులో ఎంతో విస్తుపోయాడు. ధ్రువుడికి ప్రజలపైగల మమకారం, ప్రజలకు ధ్రువుడిపట్ల అభిమానం, యువక ప్రాయం పూర్తిగా నిండినవాడునూ అయిన ధ్రువునికి యౌవరాజ్య పట్టాభిషేకం చేశాడు. వయస్సుపై బడ్డట్టుగా తనను తానే గమనించుకొని, ఆత్మ తత్త్వాన్ని తెలుసుకోవాలను కున్నాడు. విరాగియై అడవుల్లోకి వెళ్లిపోయాడు. ఆ తరువాత ఆ ధ్రువుడు శింశుమార ప్రజాపతి కూతురు 'భ్రమి'ని వివాహమాడాడు. ఆమెవల్ల కల్పుడు, వత్సరుడనే ఇద్దరు పుత్రుల్ని కన్నాడు. ఇంకా వాయుపుత్రిక అయిన 'ఇల' వల్ల 'ఉత్కలుడు' అనే పేరుగల కొడుకును, మిక్కిలి సాగసుగల కన్యకను పొందాడు. ఆ లోపల అవివాహితుడిగా ఉన్న తన సోదరుడు ఉత్తముడు వేటకై అడవికి వెళ్లి హిమవత్పర్వతం మీద ఒక యక్షునిచే చంపబడ్డాడు. ఆతడి తల్లికూడా ఆ కడుపుశోకంతో వనంలోకి వెళ్లి ఆ అడవిమంటల్లో చిక్కుకుని చనిపోయింది. ధ్రువుడు సోదరుడి చావువార్త విని రోషపడి ఓర్మిలేనివాడై ఆ దుఃఖంతో కలవరపడి పోయాడు. జైత్రం అనే రథం ఎక్కి ఉత్తరం వైపుకి వెళ్లాడు. హిమవత్పర్వత సానువుల్లోని అలకాపట్టణాన్ని చూశాడు. ఈ పట్టణం భూతగణాలతో కొలువబడుతుంది. యక్షులతో పరివ్యాప్తమై ఉంది. గొప్ప భుజ బలంగల ఆ ధ్రువుడు.
No comments:
Post a Comment