బ్రహ్మాదులంతా నొసటిపై దోసిలి ఒగ్గి నమస్కరిస్తూ ఆ ఘనమూర్తి ఘనత అంతూ పొంతూ లేనిదని గ్రహించుకున్నారు. పొగడటం వాళ్లతరం కావడం లేదు. అయినా ఆ స్వామి దయామయ, దండనమయరూపాన్ని కనిపింపచేయడంవల్ల ఎవరికి తోచినంతలో వారు కీర్తించసాగారు. వాళ్లల్లో దక్షుడు పూజాపునస్కారాది అర్చనసేవలను స్వీకరింపచేశాడు. బ్రహ్మాది దేవతలందరికి పరమపిత అయిన, నంద సునందాది అనుచర భక్తశిఖామణుల సేవలు అందుకుంటున్న తన యజ్ఞానికి, యజమాని అయిన విష్ణుదేవుని శరణుకోర దగ్గవాణ్ణిగా ఊహించుకున్నాడు. ఇలా వర్ణించాడు. "ఓ దేవా! నీవు నిజరూపంలో ఉన్నప్పుడు కాలగతినిబట్టి రాగద్వేషాది మనోదశలన్నింటికీ నిత్యమూ అతీతుడుగా ఉంటావు. నీవు సాటిలేనివాడవు. అయినా ఓ పక్కన మాయను కాదంటావు. మరో వైపున మాయను అనుసరిస్తావు. పురుషరూపంలో నటించే దైవరూపంలో స్వచ్చందుడివే. అంతలోనే మాయకు పడి పోతుంటావు. అనురాగం, ద్వేషాదులు కూడిన వాడిలా రామకృష్ణాది మానవ అవతారాల్లో ప్రత్యక్షమవుతుంటావు. ఇన్ని కారణాలవల్ల ఈ విశ్వానికంతటికీ అధినాథుడివి నువ్వే. తక్క్మిన బ్రహ్మరుద్రాదులు నీ మాయలోని ఐశ్వర్యరూపులు. కనుక లోకనాథులు కారనే వేరు భావనగల నన్ను ఆదరించు. విశ్వానికి మూలకారణులయిన శివుడూ, బ్రహ్మా లోకపాలకులూ, చేతనాచేతన జీవకోటి సర్వస్వమున్నూ నీవే. నీకంటే వేరైనది మరేదీ ఈ లోకంలో ఉండబోదు", అనే దక్షుడి విజ్ఞాపనం ముగిసిన మరుక్షణాననే తక్కిన ఋత్విగాదులందరూ స్తుతించారు.
"నందీశ్వరుని శాపబద్దులమై కేవలం యాగకర్మానుసారం మసలుకునే బతుకులు మా ఋత్విక్కులవి. దానివల్ల మా వాళ్లందరం వేదం తెల్పిన ధర్మం ప్రకారం చేపట్టగల యాగాది క్రియలలోనే వర్తిస్తుంటాం. ఇంద్రుడు మొదలైన దేవతాకృతుల వంకతో వర్తించే నిన్ను యజ్ఞస్వరూపుడవనిన్నీ ఎరుగుదుము. కాకపోతే అప్రాప్యుడవే కాదు శుద్ధస్వరూపుడవని కూడా తెలుసును. ఓ లచ్చిమగడ! గోవింద! విష్ణువ! మోక్షప్రదుడ! జ్ఞానమూర్తి! నిచ్చలూ లక్ష్మివెంట విహరించేవాడ! ఇంకా ఇంకా ఆలోచించగా నెపం ఎంచలేని అందమైన నీ అచ్చమైన చేతనాతత్తాన్ని తెలుసుకోగల తెలివి మాకు లేదని తెలిసింది."
(వ్యాసభాగవతంలోనూ పోతనభాగవతంలోనూ శివుని శాపం అని ఉన్నా శ్రీధరుడూ మొదలగు వ్యాఖ్యాతలు నందీశ్వరుడని చెప్పారు. నందీశ్వరుడు శివస్వరూపుడని తెలుస్తూ ఉంది.
సభాసభ్యులు ఇలా అన్నారు. "భక్తిపరులయందు దయకల ఓ దేవా! సంసృతిసరణి, 'దుఃఖం అనే కారుచిచ్చుకాకలతో ఎపుడూ కలవరపెట్టుంది. కడు తిప్పలనే కోటలతో దాట నలవి కానిది, యముడనే పెద్దపాముతో కూడుకొని ఉంది. పాపపు పనులనే పులులతో కమ్ముకుని ఉంది. గొప్పసుఖాలు గొప్పదుఃఖాలు అనే గరళంతో నింపిన చెలమలు కల్గిఉంది. ఇలా ఏ అండాదండాలేని ఈ సంసారంలోబడి మోటుజనులు తిరుగుతుంటారు. ఎండమావుల్లా ఆశపెట్టే ఇంద్రియరూప భోగాలన్నిటిని అహంకారహేతువైన ఒళ్లు, మమకారహేతువైన ఇల్లు అనే పెద్ద బండరాళ్లను మోస్తూ ఉంటారు. ఆ మొరకులు నీ పాదపద్మాలను ఎప్పటికి చూడగలుగుతారో కదా!"
శివుడు ఇలా అన్నాడు. "వరదాయకా దేవా! కోరికలులేని యోగులచే పూజింపబడినవాడా! నేను నీ పాదపద్మాలను నా ఎదలో ఎల్లపుడూ నిలుపుకుంటాను. భగవానుడవైన నీ నుంచి సర్వవాంఛలను పుచ్చుకునే స్ఫూర్తి కలిగిన నన్ను పరమమూర్ఖులు 'సదాచారభ్రష్టుడు' అని నిందిస్తుంటారు. ఆ మాటలను నేను నీ మీది అపేక్షవల్ల పట్టించుకోను.
పద్మగర్భుడా! నీ మాయ అతిగా కమ్మిన మనస్సులు కలవారై నీ గొప్ప తత్వమహిమను పాటించిన బ్రహ్మాదిదేవతలు దేహధారులై ఆ తత్త్వజ్ఞతను అర్ధం చేసుకోలేనివారై నిన్ను చూడలేకపోతున్నారు. తామరసాక్షా! నువ్వు నీ చూపులతోనే భక్తులసంకటాలను హరించగల గొప్పవాడవు. ఎప్పటికీ తరుగని పరమసంతసాన్ని సంఘటింప చేసేందుకు నన్ను అనుగ్రహించవలసింది."
బ్రహ్మ ఇలా అన్నాడు. "జోలి కల్పించుకొని వస్తుతారతమ్యాది విశేషాలను గుర్తించే కళ్లు మొదలైన ఇంద్రియాలతో వరుసగా అతికష్టం మీద నీరూపం గోచరిస్తుంది. ఆ రూపం, మాయామయమైనది. అది లేనిది ఉన్నట్టుగాను, జ్ఞానానికి పదార్థానికి మూలమైన సత్వాది త్రిగుణాలకు ఆశ్రయమైనట్టిదిగానూ ఒప్పుతుంటుంది. దీటు లేని రూపం నీ కంటే వేరై ఉంటుంది. అని చెప్పుకుంటూ నాకు నేను గుర్తు చేసుకుంటుంటాను. మానసిక శారీరక పరిణామాలు పొందనివాడా! పరమాత్ముడా! కళంకంలేనివాడా! నిక్కు లేనివాడా! చేయని సంకల్పం కలవాడా! మలినం తాకనివాడా! జనంచే పిలువదగ్గవాడా! శ్రేష్టుడా! వేదాలవల్ల తెలియదగ్గవాడా! రమ్యమైన ఆనందరూపుడా! భవభయ విదూరా!"
ఇంద్రుడిలా పలికాడు. "దైవమా! విష్ణువా! దైవతోత్తమా! నీ మేను దైత్యజాతి సంహారంకోసం ఆయుధాన్ని చేపట్టిన ఎనిమిది బాహువులతో గూడి నీ దేహం మెరుస్తూ ఉంటుంది. అది యోగిజనుల అంతరంగప్రేమకు నిధానమైనట్టిది. విపులమైన విశ్వంవలె కల్ల కానిది, సత్యమైనది, శాశ్వతమైనది అనే యావతో యోచిస్తుంటాను."
(శ్రీమహావిష్ణువు యొక్క ఎనిమీది చేతుల్లోని శత్రు సంహారక సాధనాలు. 1.శంఖం 2.చక్రం 3.డాలు 4.ఖడ్గం 5.గద 6.బాణాలు 7.చాపం 8.పాశం.)
ఋత్విక్కుల భార్యలు ఇలా అన్నారు, "చ్యుతిలేని ఓ విష్ణు! కావాలని నీ పాదసేవకోసమే ఇలా ఈ యాగం అప్పట్లో దక్షునిచే కూర్చబడింది. శివుడి ఆగ్రహంవల్ల అదంతా వల్లకాడయి నాశనమై పోయింది. పూర్తిగా నిలిపివేసిన బలికర్మలతో ఉత్సవకళ తప్పిపోయింది. నీ కాంతిమంతమైన నేత్రాలతో స్పష్టంగా ఒక్కమారు తేరిపార పరికించు. అది తప్పక పవిత్రకర్మగా ప్రకాశిస్తుంది."
ఋషు లిలా కీర్తించారు. "ఓ సుకృతుడా! లక్ష్మీపతీ! విను. నువ్వూ మా లోకుల వలెనే పనులు తలపెడుతూ ఉంటావు. కాని ఆ పని ఫలితాన్ని పొందవు. ఈ లోకంలో నువ్వు తప్ప మిగతావాళ్లు ఐశ్వర్యం కోసరం ఎల్లకాలం లక్ష్మిని అవలంబిస్తుంటారు. అలాంటి లక్ష్మి చాలఇష్టంగా నీ చెంతకు చేరితే నువ్వు సమ్మతించవు. ఓ గోవిందా! ఓ పద్మగర్భా! నీ ప్రవర్తనం గురించి మేం ఏమనగలం?"
సిద్దు లిలా ప్రార్ధించారు. "ఓ విష్ణూ! మా మనస్సనే మదపుటేనుగు సంసారపీడ అనే దారుణమైన కార్చిచ్చుతో కాలి పోయింది. దప్పికతో అల్లల్లాడింది. మంగళకరమూ పరిశుద్ధమూ అయిన నీ గాథలనే అమృతప్రవాహాల్లో మునిగింది. భవతాపాన్ని తోసేసుకుంది. పద్మగర్భా! పరమాత్మ సాక్షాత్కారం పొందిన నిర్వికారచిత్తుడివలె ఆ మనస్సు తిరిగి వెనక్కి మళ్లిపోదు."
యాగ యజమాని ప్రసూతి ఇలా అంది. "చేతులూ, కాళ్లూ వంటి అంగాలు అన్నీ పొందికగా ఉన్నా తలకాయ లేని మొండెం జీవనానికి తగనిదే అవుతుంది. పూజాద్రవ్యాది యాగాంగాలు ఎన్నో ఉన్నాా శీర్షప్రాయుడవైన నువ్వు లేని యజ్ఞం అందగించదు. ఈ అవసరంలో నువ్విటుగా విచ్చేయడం చాలామేలు అయింది. లక్ష్మీ ప్రియునిగా భక్తురాండ్రమైన మా అందరినీ ఆదుకో.
(యాగోపకారకాలైన దర్శపూర్ణమాసాదులకు ఒక అంగం ప్రయాజం. ఇది అయిదువిధాలు. ప్రయాజాద్యంగాని సమిధోయజతి, ఇడాంయజతి, వహ్నిర్యజతి, తనూనపాతం యజతి, స్వాహాకారం యజతీతి పంచ విధాని (దీపికా).
దిక్పాలకులు ఇలా సన్నుతించారు "దేవరలకు తొలిదేవరా! కంటితో కానగల సహజస్థితి కలిగి, ఎంతో సువిశాలమైన ఈ సమస్తవిశ్వానికి సాక్షిభూతమైన ప్రాణిస్వరూపుడవు నువ్వు నీ బహిర్ముఖాలైన నామరూపాలతో మా నేత్రాది ఇంద్రియాలచేత ఓ దేవ! కపటాన్ని పులుముతుంటావు. పంచభూతాత్మకమైన జీవి వలెనె మాకంటికి అగపడుతుంటావు. కాకపోతే తద్భిన్నమైన నీశుద్ధ సత్త్వమూర్తిమత్వంతో మాత్రం మాకు గోచరించవు. ఓ పరబ్రహ్మమా! శాశ్వతసంతోషసంధాయీ!, గోరక్షకా! అలాకాక గోచరించేట్టు కటాక్షించినట్లయిన మా బోటివాళ్ల బతుకులు ఉపమించుటకేమి మిగిలిఉంటాయి. ఎల్లప్పటికీ మాకు అగోచరుడవనే బుద్ధితోనే జీవిస్తుంటాం సుమా!"
యోగిపుంగవులు ఇలా పలికారు. "ఓ పరబ్రహ్మరూపా! దయామయుడా! లక్ష్మీపతీ! పుండరీకాక్షా! ఎల్లప్పుడు సమస్తలోకాలనూ రక్షించేవాడా సమస్త విశ్వంయొక్క సృష్టి స్థితి లయలను చేస్తున్న కారణంగా దైవీశక్తితో సత్వరజస్తమో గుణాలతో కూడిన నీ మాయచే బ్రహ్మ శివుడు మొదలగు అనేక భేదాలను పొందుతావు. అయినా, నీవు ఎప్పుడూ స్వస్వరూపంలోనే ఉంటావు. నీవు సర్వమోహాలను విడిచిన వాడవు కదా! అట్టి నిన్ను అనన్యభక్తితో దాసభావంతో ప్రేమతో ఆరాధించే మమ్మల్ని రక్షించు."
శబ్ద బ్రహ్మ(వేదపురుషుడు) ఇలా అన్నాడు " ఓ వెన్నుడ! నీ నిజసంగతినిశ్రద్ధగా సవ్యంగా ఆకళించుకోవడానికి నేనే కాదు బ్రహ్మా శివుడూ, ఇతరులూ శక్తిచాలని వారలే. నువ్వు సత్త్వగుణానికి ప్రాపు అయిన వాడవూ తద్విలక్షణుడవూ నిర్గుణుడవున్నూ అయిన పరబ్రహ్మ తత్త్వానివి. ధర్మార్ధ కామ మోక్షాలను కటాక్షించేవాడా! నీకు ప్రతినిత్యమూ ఇందరము జోతలుపెడ్తూ ఉన్నాం. మమ్మల్ని కరుణించు."
అగ్నిదేవుడు ఇలా అన్నాడు "ఓ హరీ! నువ్వు యాగ రక్షణకార్యాన్ని నీ కనుసన్నతో శ్రద్ధతో నడపుతుంటావు. యాగాగ్నులను అయిదు విధాలుగా సృష్టించావు. పూజకు అయిదు మంత్రాలను సృజించావు. వీటి హోమాలతో ఒప్పే యాగమూర్తివి నువ్వు. నీకునా మొక్కులు. నీ ప్రదీప్తిని పుచ్చుకొని నీ నియోగంతో హవ్యవాహుడిగా భూతలంలో యాగాదులను, దేవతల కందిచ్చే హవ్యాన్ని స్తోత్రసముదాయాలను పొందుతాను.
(పంచాగ్నులు : 1. గార్హపత్యం, 2. ఆహవనీయం, 3. దక్షిణాగ్ని, 4. సభ్యం, 5. ఆవసథ్యం)
దేవతలు ఇలా అన్నారు "గతంలో ప్రళయం ముగిసేవేళ మిగిలిన సర్వజగత్తునూ నీ కడుపులో పదిలపరిచావు. నువ్వు ఒక్కడివిగా ఉన్నపుడు పాలసముద్రంలో శేషశయ్యమీద పవలించావు. జనలోకానికి పైలోకంలో ఉంటున్న సిద్ధజనులు నీ సృష్ట్యవయవ భూతపదార్థ శైలిని పదే పదే ధ్యానించారు. శ్రీకాంత! దైవశ్రేష్ఠమా! అప్పటి నీ ఆదిదేవస్వరూపాన్ని ఈ దినం మాకు సాక్షాత్కరింప చేశావు."
గంధర్వులు ఇలా వినుతించారు "పద్మలోచనా! లక్ష్మీమనోవల్లభా! దేవా! ఈశ్వరా! దేవాధీశా! శివుడు, బ్రహ్మ మొదలయిన దేవతలు, మరీచి మొదలయిన ప్రజాపతులు, నీ అంశలోని భాగాలై జన్మించినవారే. నీ విలాసమైన ఈ బ్రహ్మాండాన్ని రక్షించు. నీకు ఎంతో భక్తితో కైమోడ్పులు చేస్తున్నాము. మమ్మల్ని ఏలుకో."
విద్యాధరులు ఇలా అన్నారు "ఓ పుండరీకాక్ష! జీవుడు నీదైన అవిద్యా ప్రకృతికి లోబడి శరీరం పొందుతాడు. ఆ శరీరంపై నేను, నాది అనే తగులమును ఏర్పరచుకుంటాడు. పెళ్లాం, పిల్లలూ, ఇల్లూ, పొలం, చుట్టం పక్కం, డబ్బూ, గొడ్డూ వంటి విషయ వాంఛల పరంపరలో కలయడం, వీడడం వంటి పీడలు పొందుతుంటాడు. ధైర్యం లేని వాడవుతాడు. అశాశ్వతమైన ఇంద్రియార్థాలపట్ల వల్లమాలిన అపేక్ష కలవాడవుతాడు. ద్రోహబుద్ధి అతిశయించిన వాడవుతాడు. అలాంటి మనిషికూడ, దయ గూడుకట్టుకున్నవాడా! లక్ష్మీ మనోహరా! కోరి మరీ నీ నైజాన్ని తెలిపే గాథలకు పరవశుడయితే ఇంతకాలం నుంచి కల్గిన ఒంటిమీది వలపును వదల్చుకో గల్గుతాడు. ఆ ఇచ్చ విశేషజ్ఞానం మీదికి మళ్లి సాధువర్తనుడవుతాడు."
బ్రాహ్మణప్రజలు ఇలా ప్రణమిల్లారు, యజ్ఞం, దేవతల కీయదగ్గ అన్నం, అగ్ని సంహితలూ, సమిధలు, కుశలూ, యాగపాత్రలూ, యజ్ఞవిధి పరీక్షాధికారులు, యాగకర్మలు చేసే బ్రాహ్మణులు, యాగయజమాని, యజమానిభార్య, దేవతలూ, అగ్నిహోత్రాలూ, స్వధాదేవీ, సోమరసం, నేయి, బలిపశువూ ఈ అన్నింటి రూపమూ నువ్వే పూర్వకాలాన (స్వాయంభువ మన్వంతరం తొలినాళ్లలో) యజ్ఞవరాహస్వామి స్వరూపాన్ని వహించావు. కర్రలవంటి కోరలచే అట్టడుగులోకానికి పోయిన భూమిని 'పెద్ద ఏనుగు పద్మాన్ని ఎత్తి పట్టినట్టు నువ్వు ఎత్తిపట్టావు. అలాంటి యోగి సముదాయంచే కీర్తించబడేవాడివి, యాగరూపుడవు. యాగకర్మ సంకల్పరూపుడవున్నూ అయిన నువ్వు, చేజారిపోయిన మా యాగకర్మాచరణలు, సవ్యకర్మాచరణలు సంపూర్తికావాలని వేడుకపడుతున్న మమ్మల్ని కనికరించు. నీ నామసంకీర్తనల చేతనే యాగంలో ఎదురైన అడ్డంకులన్నీ నశించి పోతాయి. అంతటి మహిమాన్వితుడవైన నీకు మా జేజేలు.
ఈ ప్రకారాన యాగపాలకుడిగా విష్ణుమూర్తిని అన్ని రకాల ప్రజ శ్లాఘించింది. శివుడి అవరోధంవల్ల ఆగిపోయిన దక్షయాగాన్ని ఎంతో పెద్దఎత్తున ఏ లోటూ వాటిల్లని విధంగా శ్రీహరి కొనసాగింప చేశాడు.
ఈ జగం అంతటికి ఆత్మరూపుడు తానే కావడంవల్ల ఆ విష్ణుమూర్తి హవ్యపదార్థాలన్నిటిని భుజించేవాడు అయినప్పటికిన్నీ తనకు కేటాయించిన త్రికపాల పురోడాశమంత్రభాగంతోనే తృప్తి పడ్డాడు. దక్షుణ్ణి ఇలా పల్కరించాడు.(యజ్ఞంలో విష్ణువును ఉద్దేశించి సమర్పించే దానిని త్రికపాలపురోడాశం అంటారు.)
ఓ పూజ్యుడ! దక్షా! నేనూ, బ్రహ్మా శివుడూ ముగ్గురం ఈ విశ్వానికి మూలం, అందులో నేను దొరను. నేను కర్మ సాక్షిని. నేను స్వయం ప్రకాశుణ్జి. నేను సత్త్వరజస్తమోగుణాత్మకమైన మాయలోకి ప్రవేశించి సృష్టి స్థితి, లయాలకు మూలభూతమైన ఆ యా యాగకృత్యాలకు తగ్గట్టుగా బ్రహ్మ శివాదిపేర్లను పొందుతుంటాను. అలా ఏకరూపమైన బ్రహ్మరూపుడను నేను. నాలోని బ్రహ్మా శివుడూ ఇతరజీవ సమూహాన్ని అవివేకి నాకంటే ఇతరం అనుకుంటాడు. మానవుడు చేతులూ కాళ్లూవంటి అవయవాలను తన దేహంకంటే వెరైనవని ఊహమాత్రంగా కూడా ఎలా తలవడో ఆ రకంగానే నా భక్తుడు నా లోనిప్రాణి సమూహాన్ని విడిగా యోచించడు. కనుక మా ముగ్గురిని ఏకరూపంగా ఎంచేవాడు ధన్యజీవి అని చెప్పగానే దక్షుడున్నూ,
విష్ణువు పలికిన మాటలు విని, ఆ యాగం 'విష్ణుదేవత'కు సంబంధించిన మూడు కపాలాల పురోడాశంతో కూడుకున్నది అనే తెలివిని పొంది, దానికి తగ్గట్టుగా ఆ విష్ణుమూర్తి చరణారవిందాలను ఎడతెగని భక్తిభావంతో, సేవించుకున్నాడు.
(కపాలం అంటే యజ్ఞపాత్ర, పురోడాశం అంటే పిండితో తయారుచేసిన హోమద్రవ్యం.)
అంగయాగం, ప్రధానయాగం అనే రెండు యాగాలతోనూ దేవతలను పూజించాడు. పవిత్రయాగకర్మయొక్క శిష్ట భాగంతో శివుణ్ణి ఇష్టంగా కొలిచాడు. తదాసక్తంగా 'సమాప్తి ఇష్టి' కర్మ ఉదవసానాన్ని ముగించాడు. తాను, ఋత్విక్కులూ సోమపానం చేసిన వారితోనూ కలసి అవభృథస్నానాలు కానిచ్చాడు. ఇంత పూనికవల్ల సిద్ధించిన సమస్త కార్యాలవల్ల కోరికలు తీరిన దక్షుణ్జి 'ధర్మమతితో ఆనందంగా జీవనం సాగించు' అని దీవించి దేవతలు, ఋత్విక్కులు, బ్రాహ్మణులు వారి వారి ఇళ్లకు వెళ్లిపోయారు. విష్ణువూ, శివుడూ తమ తమ భవంతులకు తరలిపోయారు.
ఆ తర్వాత దక్షుడి కూతురు సతీదేవి తన ముందటి శరీరాన్ని వీడింది. హిమవంతుడికి మేనకాదేవి గర్భాన మళ్లీ పుట్టింది. ప్రళయకాలంలో భగవంతుడిలో లీనమై ఆదమరచి నిద్రించిన శక్తి, సృష్టి ఆరంభ సమయంలో భగవంతుణ్ణి చేరుకునే విధంగా ఇదివరలో తనపెనిమిటి అయిన శివుణ్ణి తిరిగి పరిణయమాడింది. దక్షుడి యాగాన్ని ప్రధ్వంసం చేసిన శివుడి జీవనగాథ నంతా పూర్వం బృహస్పతి తన వద్ద విద్యనేర్చిన ఉద్ధవుడికి చెప్పాడు. ఆ ఉద్ధవుడు నాకు వినిపించాడు. నేను నీకు చెప్పాను. అని మైత్రేయుడు చెప్పి మళ్లీ విదురుడితో ఇలా చెప్పసాగాడు.
ఇంతదాకా చెప్పిన ఈ కథను చదివిన మతిమంతులకూ, చెవిన వేసుకున్న విద్వాంసులకూ సంపదలు, ఆయుస్సు, యశస్సు లభిస్తాయి. పాపాలు తొలగిపోతాయి. సంసారపు కట్టు ముళ్లన్నీ విడిపోతాయి.
మైత్రేయుడు ఆ కథనంతా విన్పించి మళ్లీ ఇలా ప్రారంభించాడు, విదుర! ఈ మాటవిను. సనకమహర్షి మొదలైన వాళ్లూ, నారదుడు, హంసుడు, అరుణి, ఋభుడు, యతి అనే వాళ్లూ బ్రహ్మ కొడుకులు. కాని వాళ్లంతా గృహస్థాశ్రమం స్వీకరించని ఆజన్మ బ్రహ్మచారులు. కనకనే వాళ్ల వంశ పరంపర కొనసాగలేదు.
ఇంకనూ అధర్ముడికి మృష అనే అంగన గర్భాన దంభుడు, మాయ అనే స్త్రీ పుట్టారు. ఈ అధర్ముడి బిడ్డలిద్దరూ జంట అయ్యారు. వీళ్లను నిస్సంతువైన నిరృతి పెంచుకున్నాడు. ఈ దంభు మాయ అనే దంపతులకు లోభుడు అనే అబ్బాయి, నికృతి అనే అమ్మాయి పుట్టారు. వాళ్లిద్దరూ జత అయ్యారు. ఈ దంపతులకు క్రోధుడనే కొడుకు, హింస అనే కూతురూ కలిగారు. ఈ అన్నా చెల్లెళ్లూ ఆలూమగలయ్యారు. వీరి దాంపత్యానికి కలి, దురుక్తి అనే పిల్లలు పుట్టారు. ఈ ఇద్దరూ భార్యాభర్త లయ్యారు. ఈ దంపతులకు భయం, మృత్యువు అనే సంతానం కల్గింది. వీళ్లూ జోడుకట్టారు. వీరికి యాతన, నిరయం అనే ఇద్దరు పిల్లలు పుట్టారు. వీళ్లంతా వంశపరంపరకు కుదురు అయిన అధర్ముడి వంశవృక్షానికి శాఖలుగా ఒప్పారు. శుభం కోరే ప్రతి మనిషి కించిత్తుకూడా ఈ పద్ధతిని అనుసరించకూడదు. ఈ తీరున ప్రతిసర్గనూ సారవంతంగా కుదించి నీ చెవిని వేశాను. ఈ పుణ్య కథను మూడుసార్లు విన్నవాడు ఎవ్వడైనా పాపం తొలగిపోయిన వాడవుతాడు. అని కథా సారాంశం చెప్పాడు. తిరిగి మళ్లీ ఇలా అందుకున్నాడు. (ఇది ఫలశ్రుతి)
No comments:
Post a Comment