అటుపిమ్మట శ్రీకృష్ణుడు బంధువుల దుఃఖాన్ని తొలగించడంకోసం సుభద్రకు సంతోషాన్ని చేకూర్చడంకోసం హస్తిపురిలో కొన్నిమాసాలు ఉండిపోయి ద్వారకానగరానికి పయనమయ్యాడు. ధర్మతనయుడు పెద్దవాడు కాబట్టి పూజ్యభావంతో నమస్కరించాడు. ధర్మనందనుడు దానికి బదులుగా నందనందనుని అమందానంద కందళిత హృదయారవిందుడై కౌగిలించుకొన్నాడు. ఆతనిద్వారా సుఖంగా పోయిరమ్మనే మంగళాంగీకారాన్ని స్వీకరించాడు. ఆ సమయంలో కొందరు తనకు భక్తిపురస్సరంగా వందనం ఆచరింపగా, పరమాత్మ వారిని కౌగిలించుకొన్నాడు. మరికొందరు పెద్దవారు నేరుగా తనను ఆలింగనం చేసుకొనగా, వారికి శుభాకాంక్షలు అందజేశాడు. అనంతరం సర్వాంగసుందరంగా అలంకరించబడ్డ రథాన్ని అధిరోహించబోయే సమయంలో ద్రౌపదీ సుభద్రలు, కుంతీగాంధారులు, ఉత్తర, విదుర ధృతరాష్ట్రులు, యుధిష్ఠిరయుయుత్సులు, కృపాచార్యుడు, భీమనకుల సహదేవులు, ధౌమ్యుడు మున్నగువారు ఆయనను అపారప్రీతి విశేషంతో వీక్షించారు. సజ్జన సాంగత్యంచేసి దుర్జనసాంగత్యం వదలిపెట్టిన బుద్ధిమంతుడు ఎవరి పవిత్రగాథలు ఒక్కమారు వింటే చాలు, మరల విడిచిపెట్టలేడో, అటువంటి శ్రీకృష్ణుని ఎడబాటు వారు సహించలేకపోయారు. నిరంతరం ఆయనను చూస్తూ, తాకుతూ, ఆయనతో సంభాషిస్తూ ఆయనతో కలసి శయనిస్తూ, కూర్చుంటూ, భుజిస్తూ, ఒక్కక్షణంకూడ ఆయనతో వియోగాన్ని సహించలేని పాండవుల దగ్గరకు కృష్ణుడు మళ్లీ వచ్చాడు. వారందరూ మళ్లీ తిరిగి రావాలని ఆయనను కోరారు. అటుపిమ్మట హరి పయనమైన దిశగా దృష్టి సారించారు. ఆయనకే మనస్సు సమర్పించుకున్నారు, అనుకోకుండా వారి నయనాలలో బాష్పబిందువులు క్రమ్ముకొన్నాయి. తేరు సాగిపోతూ ఉండగా అల్లంత దూరంలో నిల్చుండిపోయారు.
ప్రయాణ సమయంలో శ్రీకృష్ణుని వీక్షించాలని కౌరవకాంతల తహతహ. వారు బంగారు మేడలపై అధిరోహించారు. ఆ పరాత్పరుని కనులార సందర్శించి ప్రీతిదాయకంగా పుష్పవర్షం కురియించారు. విజయుడు వెనుక నిల్చున్నవాడై ముత్యాల దండలచే అలంకరించబడ్డ, రత్నదండంతో కూడుకొన్న శ్వేతచ్చత్రాన్ని చేతబట్టాడు. ఉద్ధవుడు, సాత్యకి పరమానందంతో కృష్ణునకు అటూ, ఇటూ నిలబడి వింజామరలు వీస్తున్నారు. మంగళసూచకంగా బాకాలు, నగారాలు, తప్పెటలు, శంఖాలు ఒక్కసారి మ్రోగి భూమ్యాకాశాల మధ్యభాగంలో వ్యాపించాయి. సమస్త బ్రాహ్మణోత్తములు సగుణ నిర్గుణ బ్రహ్మములకు అన్వయించునట్లుగా కృష్ణునకు స్వస్తివాచకాలు పలికారు. జగన్మోహనమూర్తి, పద్మనయనుడు, సకల పుణ్యరాశి అయిన శ్రీకృష్ణదేవుడు పురజనుల పురాకృతసుకృతంలాగా భాసించి హస్తిపురవీథుల వెంట సాగిపోతున్నాడు.
గోపాల చూడామణి, పరమసుందర శిరోమణియైన కృష్ణపురమాత్మను చూచే ఉత్కంఠతో పౌరసుందరీమణులు రాజమార్గంబునకు ఇరువైపులనున్న మేడల పై భాగాలను అధిరోహించారు. వారు రెండుతెగలుగా, ఇరుదెసలా నిల్చున్నవారై, విచ్చిన పద్మాల్లాంటి అరచేతులు కల్గిన బాహువులు చాచి పరస్పరం కృష్ణుని చూపిస్తూ తమలోతాము ఇలా భాషింపసాగారు.
కొందరు "సృష్టి ప్రారంభానికి ముందు, ప్రళయ కాలాంతంలో గుణాలు క్షోభించడానికి ముందు, సామ్యస్థితిలో ఉండగా అవిశేషమైన ఆత్మ ఒకటే ఉంటుంది. అప్పుడు సత్త్వాది గుణప్రవర్తకాలైన మహదహంకారాదుల ఉత్పత్తియే ఉండదు. ప్రపంచమన్నదేలేదు. జగత్తును సృష్టించే సమస్త శక్తులు పరమాత్మలో అంతర్లీనమై ఉంటాయి. సమస్త జీవులు ఆ ఆత్మలోనే కలిసిపోతాయి. అపుడు ఆత్మస్వరూపుడైన కేవలుడొక్కడే ఉంటాడు. అతడే పురాతనుడు. అతడే పురాణ పురుషుడు. ఈ కృష్ణు డతదే" అని వచించారు.
మరికొందరు "జీవులు బ్రహ్మస్వరూపములుకదా! జీవులు బ్రహ్మముకంటె వేరైనప్పుడు కదా లీనత్వం సంభవిస్తుంది. జీవుడు బ్రహ్మమే అయినప్పుడు లీనత్వమనేది ఎలా పొసగుతుంది?" అని సందేహం వ్యక్తం చేశారు.
వేరేకొందరు "జీవులకు బ్రహ్మత్వం స్వభావసిద్ధం. కాని మాయవల్ల జీవుడు అనే పరిగణనకు సత్వరజస్తమోగుణాలతో సంబంధం ఏర్పడుతుంది. అప్పుడే అతడు జీవుడు అనబడుతున్నాడు. జీవోపాధి భూతాలైన సత్త్వాదిశక్తుల లయమే జీవలయం" సంశయాన్ని తొలగిస్తూ మాటాడారు.
వేరే మరికొందరు "ప్రళయాంతం అయిన పిమ్మట సృష్టిని ప్రారంభించే సమయంలో పరమాత్మ సృజనచేసే సంకల్పాన్ని పొంది తన వశంలోనున్న మాయను స్వీకరించి, నామరూపాలతో సంబంధం లేకయున్న జీవునకు నామరూపాలు కల్గింపగోరి, జీవాత్మలను మోహింపజేసే మాయను ప్రవర్తింపజేసి సృష్టిస్తాడు" అని తెలియజేశారు.
మరికొందరు "విమలమైన భక్తి, భగవంతుని దర్శించాలనే ఉత్మంఠ కలిగిన, ఇంద్రియ నిగ్రహంతో కూడుకొన్న విద్వాంసులు మాత్రమే ఈ మహానుభావుని సత్యరూపాన్ని దర్శించగలుగుతారు" అని వచించారు.
ఆ సర్వేశ్వర సాక్షాత్కారం కూడ యోగమార్గం ద్వారానే సాధ్యపడుతుందని కొందరు తెలియజేశారు.
ఇంతవరకు ఆధ్యాత్మిక జ్ఞానం కల్గిన స్త్రీల వచనాలు వివరించబడ్డాయి. ఇక భక్తిభావ సంపన్నలైన ఇంతుల హృదయాలు ఆవిష్కరించబడుతున్నాయి. ఆ సమయంలో జాబిల్లివంటి నెమ్మోము కల్గిన ఒక పూంబోడి పూవిలుకాని పూవుటమ్ములకు గురియై కృష్ణవిరహంచే పరితపించి ఇలా అంటోంది. ఓ చెలీ! శ్రీకృష్ణుని తేరు అల్లంతదూరంలో సాగిపోతోంది. ఇక ఆ అరదం మన కన్నులకు కన్పించేటట్లు లేదు. ఆ తమ్మికంటిని వీక్షింపగా లేని క్షణాలు కల్పాలుగా తోస్తాయి. ఈ ఇండ్లు మనకు శాశ్వతాలు కావు. వీటిని నమ్ముకొని ఇక్కడే ఉండిపోవడం ఎందులకు? ఆయన వెంటపోయి ఆయనకు సపర్యలందిస్తూ హాయిగా కాలం గడుపుదాము. రావే పోదాము అని వచించింది.
ఓ సఖీ! ఇతడు యాదవవంశ విభుడు మాత్రమేకాదు, వేదాలద్వారా తెలియబడే పరమాత్మ సృష్టికి పూర్వం, ప్రళయానికి చివర విలసిల్లే కేవలుడు. విశ్వసృష్టి స్థితిలయాలు కల్పించే ఆదిదేవుడు. ఊహింపశక్యంకాని లీలావిలాసరతుడు. ఈయన లీలలు తెలుసుకోవడం చాలా కష్టం. నా అదృష్టవశంచే ఈ పరాత్పరుని దర్శించగలిగాను అని ఒక అంగన పవిత్ర హృదయంలో పొంగిపొరలే ఆనందంతో గంతులు వేసింది.
ఓ చెలియా! యుగపరిణామంలో ఈ భూమిలో తమోగుణ ప్రధానులైన ప్రభువులు ఉద్భవించి లోకులను హింసిస్తూ ఉంటారు. ఆ సమయంలో ప్రతి యుగంలోను పరమాత్మ తనదైన శరీరంతో అవతరించి ఆ దుష్టులను వధిస్తూ ఉంటాడని మరో అంగన వచించింది.
ఇంతేకాకుండా.
ఈ పవిత్ర కీర్తనుడు జన్మించడంవల్ల యాదవవంశం వాసి గాంచింది. ఈ సత్యమార్గ ప్రవర్తకుడు నివసించడంవల్ల మధురానగరం పేరు పొందింది. ఈ పురుషోత్తముడు సదా విహరించడంవల్ల ద్వారకానగరం ధన్యమయింది. ఈ శౌర్యశాలి దురాత్మకులను శిక్షించడంవల్ల, సదాత్మకులను రక్షించడంవల్ల సమస్తవిశ్వం బాధలు లేనిదయింది. ఈ విశ్వమోహనమూర్తి సౌందర్యాన్ని వీక్షించి, అలరువిల్తుని అమ్ములు రొమ్ములు చీల్చగా, పరవశించిన హృదయాలతో వ్రేపల్లెలోని గోపకామినీ సమూహం నిరంతరం అధరామృతపానం చేసినట్లుగా ప్రేమసాగరంలో ఓలలాడింది అని ఇంకొక భామిని భాషించింది.
ఈ పద్మాలవంటి నేత్రాలున్న ఈతనిని, ఈ సౌభాగ్యమూర్తిని, ఈ కరుణావారాశిని భర్తగా చేపట్టి, ప్రీతితో ఆయనకు సపర్యలు చేస్తూ, సంసారం నిర్వహిస్తూ ఉండే అదృష్టం రుక్మిణి మున్నగు పతివ్రతాశిరోమణులకు చేకూరింది. వారు పూర్వజన్మలలో నిష్కళంక చిత్తాలతో ఏ పుణ్యతీర్థాలు సేవించారో కదా! ఎటువంటి మంచినోములు నోచియున్నారో కదా! అని వేరొక అంగన సంభాషించింది.
ఈ విధంగా అనేక విధాలుగా భాషించే పౌరభామినుల వాక్యాలు విని, శౌరి వారిని క్రీగంటచూస్తూ, నవ్వుకొంటూ హస్తిపురాన్ని దాటిపోయాడు. ధర్మరాజు ఆయనకు రక్షణగా చతురంగ బలాలను పంపించాడు. ఆ సైన్యంతోపాటు తన ఎడబాటును ఓర్వలేక వెన్నంటి వచ్చుచున్న ధర్మతనయాదులను బుజ్జగించి వెనుకకు పంపించివేశాడు. క్రమంగా సాగిపోతూ కురు, జాంగల, పాంచాల, శూరసేన, యామునదేశ, బ్రహ్మావర్త, కురుక్షేత్ర, మత్స్య, సారస్వత, మరు, ధన్వ, సౌవీర, అభీర, సైంధవ దేశాలు దాటివెళ్లాడు. ఆయాదేశవాసులు ప్రీతితో సమర్పించిన కానుకలు స్వీకరించాడు. మళ్లీ ప్రయాణం సాగించి ద్వారకకు ఆనుకొనియున్న ఆనర్తమండలాన్ని చేరుకొన్నాడు. అప్పటికే సూర్యుడు అస్తమించాడు. సంధ్యాసమయమయింది. అశ్వాలా అలసిపోయి ఉన్నాయి. అల్లంతదూరంలో ద్వారకానగరం దర్శనమిచ్చింది.
శ్రీకృష్ణుడు ద్వారకానగరంబు ప్రవేశించుట
No comments:
Post a Comment