Saturday, February 28, 2026

Indra obstructed King Prithu’s 100th Ashwamedha Yagna (horse sacrifice) - పృథుచక్రవర్తియశ్వమేధంబు సేయునెడ నింద్రుం డశ్వము నపహరించుట

పృథుచక్రవర్తియశ్వమేధంబు సేయునెడ నింద్రుం డశ్వము నపహరించుట

పృథుచక్రవర్తి చేస్తున్న అట్టి యజ్ఞానికి సాక్షాత్తూ భగవంతుడు, హరి, లక్ష్మీవల్లభుడు, విశ్వగురుడు, విశ్వాత్మకుడు, విశ్వవిభుడు, బ్రహ్మశివులతో కూడినవాడు, లోకాలను పాలించే సమస్తదేవతలచే అనుసరింపబడేవాడు, యజ్ఞస్వరూపుడు, అన్ని యజ్ఞాలకు మొదటి ప్రభువు అయిన విష్ణుదేవుడు - గంధర్వులు, మునులు, సిద్దులు, సాధ్యులు, విద్యాధరులు, అప్సరసలు, దైత్యులు, యక్షులు, దానవులు మొదలైనవారు కీర్తిస్తుండగా, గొప్పకీర్తిగలవాడై నందసునందాదులు సహచరులుగా కపిలనారద సనకాది ప్రముఖయోగీంద్రులచే స్తుతింపబడుతూ ప్రత్యక్షమైనాడు.

పరమభాగవతులచే సేవింపబడేవాడు, నారాయణాంశతో పుట్టినవాడు అయిన పృథుచక్రవర్తికి భూదేవి హవిస్సులు పిండియిస్తూ కోరినకోర్కెలను, సమస్త పదార్థాలను అందించేది. వృక్షాలు పెద్దగా పెరిగి పూలనుండి తేనెలు వర్షించాయి. చెరకు, ద్రాక్షజాతులు రసాలిచ్చాయి. పెరుగు, పాలు, నేయి, మజ్జిగ, పానకం మొదలైనవాటిని వర్షింపగా అవి నదులయ్యాయి. సముద్రాలు వజ్రాలను, రత్నజాతులను కల్పించాయి. పర్వతాలు నాలుగువిధాలైన ఆహారాలు కల్పించాయి. లోకపాలకులతో కలిసిమెలిసి సమస్తజనులు కానుకలు తెచ్చియిచ్చారు. ఇలా పరిపూర్ణవైభవంతో వెలుగొందుతూ అధోక్షజునిసేవయే దీక్షగా ధరించిన పృథుచక్రవర్తి తొంబైతొమ్మిది అశ్వమేధాలు చేశాడు. నూరవయాగంతో యజ్ఞాధిదేవతయైన విష్ణుని అర్చించడానికి సంకల్పించాడు, దానిని చూచి ఓర్చుకోలేక

దేవేంద్రుడు మిక్కిలి కోపంతో పాషండుని వేషంలో మాయారూపం ధరించి వచ్చి యజ్ఞాశ్వాన్ని హరించి ఆకాశానికి వెళ్లాడు.

అలా వెళుతుండగా పుణ్యాత్ముడైన పృథుని కుమారుడు అత్రిమహర్షిచే ప్రరేపితుడై వింటిని, బాణాలను ధరించి మిక్కిలి దర్పంతో దేవేంద్రుని వెంబడించి వెళ్లాడు.

ఈ విధంగా పృథుకుమారుడు యజ్ఞాశ్వాన్ని హరించిన ఇంద్రుని చంపడం ధర్మంగా భావించాడు. ఇంద్రుడు మాయారూప వేషధారియై అది అధర్మం అనిపించేలా చేశాడు. పృథుని పుత్రుడు ఇంద్రుని నిలునిలుమనివారించి వింటినారి శబ్దం చేశాడు. ఎదురుగా జడలు, భస్మము, ఎముకలు ధరించిన మూర్తి నిలబడ్డాడు. అతనిని ధర్మమూర్తిగా భావించి పృథుకుమారుడు బాణం వేయలేకపోయాడు. ఇంద్రుని చూపిస్తూ అత్రిమహర్షి రోషాతిశయంతో పృథుపుత్రునితో ఇలా అన్నాడు.

యజ్ఞాన్ని చెడగొట్టినవాడు, దేవతలలో అధముడు అయిన ఇంద్రుడితడు. కావున, నీవు ఇతని జయించుమని అత్రి వేనవంశజునితో మూడుమార్లు చెప్పాడు. అంతట, వేనుని వంశస్థుడు

ఆకాశమార్గంలో వెళ్లే ఇంద్రునిపైకి కోపంతో కూడిన చిత్తస్థైర్యంతో పృథుకుమారుడు మహాగజంపై లంఘించే సింహకిశోరంవలె దూకాడు. అప్పుడు యాగాశ్వాన్ని చేజిక్కించుకొన్న ఆ ఇంద్రుడు అశ్వాన్ని హరించడానికి ధరించిన రూపాన్నీ అశ్వాన్నీ వదలివేసి మాయమయ్యాడు.

వీరుడైన పృథురాజకుమారుడు తన యజ్ఞాశ్వాన్ని బలపరాక్రమాలతో దక్కించుకొని తండ్రియొక్క యాగ ప్రదేశానికి వచ్చాడు.

అప్పుడు అక్కడచేరిన ఋషిపుంగవులు అతడు చేసిన అద్భుత కార్యానికి ఆశ్చర్యపడి అతనికి 'జితాశ్వు' డనే సార్ధకనామంపెట్టారు. అప్పుడు

దేవేంద్రుడు తిరిగి చీకటిని సృష్టించి ఎవ్వరూ తనను చూడకుండా మాయా రూపంలో బంగారు పాశంతో యూపస్తంభానికి కట్టివేసిన గుర్రాన్ని వదిలించుకొని ఆకాశమార్గంలో వేగంగా వెళ్ళసాగాడు. ఆ వృత్తాంతం అత్రిమహర్షి చెప్పగా, పృథురాజకుమారుడు కపాలఖట్వాంగాయుధాలతో వేగంగా వెళ్లే ఇంద్రుని జయించలేక - మళ్లీ అత్రి మహర్షి చెప్పగా పృథురాజకుమారుడు తోక తొక్కిన పామువలె కోపించి బాణాన్ని ఎక్కుపెట్టాడు. అదిచూచి దేవేంద్రుడు గుర్రాన్ని మాయారూపాన్ని వదలి ఎప్పటివలె పారిపోయాడు.

అలా తీసుకెళ్లిన యాగాశ్వాన్ని తిరిగి తీసుకొని ఆ వీరశ్రేష్ఠుడు పితృయాగశాలకు వచ్చాడు.

ఇంద్రుడు యాగాశ్వాన్ని దొంగిలించడానికై ధరించి వదలిన అనేక అమంగళ కరములైన మారురూపాలను మూఢులైన జనులు ధరించారు. పాషండులగుర్తులు గల దిగంబరవేషధారులు జైనులుగా, కాషాయవస్త్రాలు ధరించినవారు బౌద్దులుగా జడలు, భస్మము, ఎముకలు ధరించిన వారు కాపాలికులుగా పేరుగాంచారు. ధర్మంతో సమానమైన అధర్మంపట్ల ఆసక్తిగల కొందరు అజ్జజనులు (తెలివిలేనివారు).

(పాషండులు వేదబాహ్యులు. వేదవిహిత ధర్మాలను విడిచినవారు.)

పాం షండయతి - పా+షండ+ఘఞ్. రక్షకమైన వేదధర్మమును వమ్ము చేసేవారు. “పాషండ ద్రుమషండ దావదహన శ్చార్వాక శైలాశనిః" పాషండ షండగిరి ఖండన వజ్రదండాః "పాషండసాగర మహాబడబాముఖాగ్నిః"  అని దాశరథి మొదలియాండాన్‌ చెప్పిన ధాటీపంచకంలోని శ్లోకపాదాలు.

పాషండులనగా వేదధర్మాలను ఆచరింపక ఫలహీనం చేసేవారు. దేహమనే యజ్ఞశాలలో అశ్వమనే ప్రాణమయకోశం కాపాడబడటం వేదోక్త ధర్మం)

ఆ విధంగా ఆయా వేషాలు వరుసక్రమంలో ధరించిన వారిని గూర్చి తెలుసుకొన్న పృథుచక్రవర్తి కోపించి విల్లెక్కుపెట్టి ఇంద్రునిపై బాణంవేయడానికి సిద్ధపడగా ఇంద్రుని చంపడానికి వేగంగా బయలుదేరిన అతనిని చూచి ఋత్విక్కులు ఇలా అన్నారు.

ఓ పృథుచక్రవర్తీ! వేదాలలో చెప్పిన రీతిగా యాగాలలో యాగపశువులను బంధించడం, హింసించడం తప్ప గొప్ప యాగదీక్ష స్వీకరించినవారు ఇతరులను చంపడం శాస్త్రసమ్మతం కాదని పండితులు చెబుతారు.

కాబట్టి, ఇప్పుడు నీవు ఇంద్రుని సంహరించే ప్రయత్నం మానుకో. నీ ధర్మాన్ని వ్యతిరేకించే ఇంద్రుని. ఓ రాజా! శక్తిమంతాలైన మంత్రాలతో ఇంద్రుని ఆహ్వానిస్తే అతడు ఇక్కడకు వస్తాడు. అలా వచ్చిన దేవేంద్రుని తగినవిధంగా పట్టుకోవచ్చు.

రాజా! ధైర్యం చెదిరేలా ఇంద్రుని బంధించి అగ్నికి ఆహుతిగా హోమంచేస్తే నీ విస్తారమైన తేజస్సుచే అతడు సామర్థ్యం కోల్పోయి చెడిపోతాడు.

ఋత్విక్కులు పృథుచక్రవర్తిని వారించి కోపించినవారై స్రుక్కులు స్రువాలు తీసుకొని యజ్ఞంలో వేల్చుటకు పూనుకొనెే సమయంలో బ్రహ్మ విచ్చేసి ఋత్విజులతో ఇలా అన్నాడు. యాగాలలో పూజించే దేవతలు ఇంద్రుని అంశాలు. అట్టి ఇంద్రునిది భగవదంశం. కాబట్టి, అతనిని మీరు వధింపరాదు. ఆయన భగవదంశలో పుట్టాడుగాబట్టి, ఇలాంటి యాగాలను నాశనం చేసే ధర్మవ్యతిరేకమైన పనులు ఆయన చేస్తున్నా చూస్తూవుండాలిగాని ప్రతీకారం చేయగూడదు. ఈ గొప్ప కీర్తిగల పృథుచక్రవర్తికి తొంభైతొమ్మిది యాగాల ఫలితం దక్కుతుంది. అని బ్రహ్మ పృథుచక్రవర్తితో ఇలా అన్నాడు.

రాజా! మోక్షధర్మం తెలిసిన నీవింక యజ్ఞాలు చేయనవసరం లేదు. ఎలాగైనా ఇంద్రునితో మంచి చేసుకొని అతనికి కోపం ఎక్కువగాకుండా ప్రవర్తించాలి. మీరిద్దరూ మంచివారు గాబట్టి, కలిసి తిరిగితే శుభమవుతుంది. నీ మనస్సులో చింతవీడి నా మాటలను ఆదరించి వినుము. భంగపరచబడ్డ యాగం మళ్లీ చేయడానికి ప్రయత్నించవద్దు. కోపంతో కలుషితమైన యాగం అజ్ఞాన కలితమవుతుంది - అన్నాడు బ్రహ్మ.

నీ యాగాన్ని నాశనం చేయడానికి యాగాశ్వాన్ని దొంగిలించిన ఇంద్రుడు దేవతలలో ఎక్కువ పట్టుదల గలవాడుగాన, అతనిచే ఏర్పడిన మనస్సు నాకర్షించే ఈ పాషండ ధర్మాలతో ధర్మానికి వ్యతిరేకం అవుతుంది. కాబట్టి, ఈ యాగం చాలించుమని బ్రహ్మ ఇలా అన్నాడు.

(ఇంద్రియతృప్తికై ప్రాకులాడటం చిత్తాకర్షకమైన పాషండధర్మం.)

ఓ పృథుచక్రవర్తీ! శుభాకారా! అదిగాక వినుము. మీ తండ్రి వేనుని దోషంవల్ల లోపించిన అనేక ధర్మాలను రక్షించడానికి నీవు వేనుని పుత్రుడిగా జన్మించావు. నారాయణాంశంలో జన్మించావు. నీవు మానవలోకంలో పుట్టిన పద్ధతినికూడా తలంచు. నిన్ను సృష్టించిన బ్రహ్మకోర్కెను నెరవేర్చు. ధర్మమార్గంలో పాలించు.

అని మరీ బ్రహ్మ ఇలా అన్నారు. అప్రధానాలైన ధర్మాలకు మూలము, భయంకరమైన వేదబాహ్య జీవితమార్గము అయిన ఇంద్రుని మాయను గెలవాలి. అని బ్రహ్మ ఆదేశించగా పృథుచక్రవర్తి ఇంద్రునితో మిక్కిలి స్నేహం కలవాడైనాడు. తర్వాత యజ్ఞాంత మంగళస్నానాలు పూర్తికాగా 
ప్రశంసార్హుడు పుణ్యపురుషుడు అయిన ఆ పృథుచక్రవర్తిచే భూరిదక్షిణలు పొందడంవల్ల సంతుష్టులయిన బ్రాహ్మణులు పెక్కు దీవెనలందించారు. ఆనందభరితులైన దేవతలందరు అనేక వరాలు ఇచ్చారు.

తరువాత అక్కడి జనులు ఇలా అన్నారు.

ఓ రాజా! ప్రజలందరు నీచేత ఆదరించబడినారు. దానం, గౌరవం పొంది, పితృదేవతలు, దేవతలు, ఋషులు, మానవులు పూజలు పొంది మిక్కిలి సంతోషించారు.

నారాయణుండు ప్రసన్నుండై పృథు చక్రవర్తి ననుగ్రహించుట

No comments:

Post a Comment

Speeches by Pritha regarding Dharma and Brahman - పృథుచక్రవర్తి సభాసదులకు సద్ధర్మముల నుపదేశించి బ్రాహ్మణ ప్రశంస సేయుట

పృథుచక్రవర్తి సభాసదులకు సద్ధర్మముల నుపదేశించి బ్రాహ్మణ ప్రశంస సేయుట అలా చెప్పి ఇంకా ఇలా అన్నాడు. ఇలా విశేషగుణసంపద గలిగి, దోషరహితమై, సత్పురుష...