Friday, July 31, 2026

Varieties of Bhasma - Bhasma Bhedalu - భస్మ భేదాలు

శ్రీ దేవీ భాగవతం ఏకాదశ స్కంధము - భస్మ భేదాలు

విరించిపుత్రా! శాంతిక పౌష్టిక కామదభేదాలతో ఈ భస్మం మూడు విధాలు. ఇది నీకు కుతూహలం కలిగించే విషయం. కనక వివరంగా చెబుతాను, ఆలకించు.

గోమయమంటే పరమపావనంకదా! మహాపాపక్షయకరమూ మహాకీర్తికరమూకదా! ఆ గోమయాన్ని - ఆవుతోక కిందభాగం నుంచి ఇవతలికి వచ్చీరాకుండానే - చేతితోనే స్వీకరించి యథావిధిగా బ్రాహ్మామంత్రాలతో(వేదమంత్రాలతో) హోమం చెయ్యగా సిద్ధించిన భస్మాన్ని శాంతికం అంటారు. గోమయాన్ని సావధానచిత్తుడై గ్రహించాలి. కిందపడకుండా మధ్యలోనే పట్టుకుని షడక్షరీమంత్రంతో హోమంచేస్తే సిద్ధించే విభూతిని పౌష్టికమంటారు. దాన్నే ప్రాసాదజపంతో (బీజాక్షరాలతో) హోమంచేస్తే వచ్చే భస్మాన్ని కామదమంటారు.

భస్మవ్రతపరుడు తెల్లవారుజామునే లేచి శుచియై గోశాలకు వెళ్ళి ఆవులకు నమస్కరించాలి. బ్రాహ్మణుడైతే తెల్ల అవుదీ, క్షత్రియుడైతే ఎర్ర ఆవుదీ, వైశ్యుడు పసుపురంగులో ఉన్న ఆవుదీ, శూద్రుడైతే కర్రిఆవుదీ పేడను తెచ్చుకోవాలి. పూర్ణిమనాడుగానీ అమావాస్యనాడుగాని అష్టమినాడుగానీ చిత్తశుద్ధితో ఈ పని చెయ్యాలి. తెచ్చాక ఆయా నిర్దిష్ట మంత్రాలు చదువుతూ చిట్టుగానీ పొట్టుగానీ(తుషేణ వా బుసైర్వాపి) కలుపుతూ ముద్దలు చేసి(చరిచి) శుచిప్రదేశంలో ఎండబెట్టాలి. అరణిని మథించి చేసిన అగ్నిగానీ శ్రోత్రియుల ఇంటినుంచి తెచ్చిన అగ్నిగానీ మంత్రపూర్వకంగా హోమకుండంలో వేసి ఈ పిడకలను పూర్వోక్త విధివిధానంగా హోమం చెయ్యాలి. అటు పైని కొత్తపాత్రను తెచ్చి ప్రాసాదమంత్ర పూర్వకంగా ఆందులోకి నింపాలి. చందన కాశ్మీరాది సుగంధద్రవ్యాలను కలపాలి. ఆ పాత్రను భద్రవరచుకోవాలి.

నిత్యమూ ముందుగా జలస్నానం చేసి తరవాత భస్మస్నానం చెయ్యాలి. జలస్నానానికి అశక్తుడైతే హస్తపాద ప్రక్షాళనం చేసుకుని ఈశానమంత్రంతో శిరస్సున చిలకరించుకోవాలి. తత్పురుషమంత్రంతో ముఖాన, అఘోరమంత్రంతో హృదయభాగాన, వామమంత్రంతో నాభిదేశాన, సద్యోమంత్రంతో సర్వాంగాలకూ విభూతి పెట్టుకోవాలి. దీన్ని భస్మస్నానం అంటారు. తరవాత పూర్వవస్త్రాన్ని విడిచి శుద్ధవస్త్రాన్ని ధరించాలి. హస్తపాదాలను మళ్ళీ కడుక్కొని ఆచమనం చెయ్యాలి. ఈ భస్మస్నానం కూడా చెయ్యలేనివారు త్రిపుండ్రధారణ చేస్తే చాలు. మధ్యాహ్నానికి ముందయితే విభూతిని తడిపి ధరించాలి. అటు పైని ఎవరైనాగానీ పాడిదే అలదుకోవాలి. తర్జన్యనామికామధ్యాంగుళులతో(బొటనవేలూ చిటికెనవేలూ కాక,మిగిలన మూడు వేళ్ళతో) త్రిపుండ్రంగా విభూతిని పెట్టుకోవాలి.

శిరస్సు లలాటం చెవులు కంఠం హృదయం బాహువులు - ఇవ్వి భస్మన్యాసానికి తావులని చెబుతారు. ప్రాసాదమంత్రం జపిస్తూ అయిదువేళ్ళతోనూ శిరస్సున జల్లుకోవాలి. శిరోమంత్రం పఠిస్తూ మూడువేళ్ళతో ఫాలభాగాన దిద్దుకోవాలి. సద్యోమంత్రంతో కుడిచెవికీ వామదేవమంత్రంతో ఎడమచెవికీ భస్మం అద్దాలి. అఘోరమంత్రం ధ్యానిస్తూ మధ్యవేలుతో కంఠంమీద, హృదయమంత్రాన్నే జపిస్తూ మూడువేళ్ళతోనూ హృదయంమిద, ఆలాగే మూడువేళ్ళతోనే శిఖామంత్రంతో దక్షిణబాహువుకీ, కవచ పఠనంతో వామబాహువుకీ విభూతిని అలంకరించాలి. ఈశానమంత్రం అంటూ మధ్యవేలితో నాభికి విభూతిని సోకించాలి. ఇదంతా తనకు తాను చేసుకోవచ్చు. లేదా గురువు శిష్యుడికి చెయ్యవచ్చు.

నొసట ధరించే త్రిపుండ్రాలు త్రిమూర్తులకు ప్రతీకలు. మొదటిరేఖ బ్రహ్మ మధ్యలోది విష్ణువు. ఆపైది మహేశ్వరుడు. ఒక్కవేలుతోనే పెట్టుకున్న విభూతి చుక్కకు ఈశ్వరుడే అధిదేవత.

నారదా! శిరోమధ్యంలో బ్రహ్మదేవుడూ, లలాటంలో శివుడూ చెవులకు అశ్వినీదేవతలూ కంఠస్థానంలో గణేశుడూ విభూతికి అధిష్టానదేవతలు. క్షత్రియ వైశ్య శూద్రులకు భస్మధారణమే తప్ప భస్మోద్దూళనం పనికిరాదు. తక్కిన జాతులవారు అందరూ అమంత్రకంగా విభూతి పెట్టుకోవచ్చు.

బ్రహ్మనందనా! అతిగోప్యమయినప్పటికీ సర్వకామఫలప్రదం కనక భస్మోద్దూళనఫలం ఏమిటో నీకు ఉపదేశిస్తున్నాను, శ్రద్ధగా గ్రహించు.

భస్మోద్దూళనం




Bhasmadharana - Sirowratham - భస్మధారణ - శిరోవ్రతం

శ్రీ దేవీ భాగవతం ఏకాదశ స్కంధము - భస్మధారణ - శిరోవ్రతం

నారదా! భస్మధారణకే శిరోవ్రతమని పేరు. దీన్ని ఆచరించినవారికే పరావిద్యకు అధికారం. విధివిధానంలో శ్రద్ధగా ఈ శిరోవ్రతాన్ని ఆచరించాలి. దీన్ని ఆచరించకుండా శ్రౌతస్మార్త సమాచారం ఎంత తెలుసుకున్నా అనుపకారకమే. శిరోవ్రతాచరణం వల్లనే బ్రహ్మాదులు దేవతలు కాగలిగారు. దీని మాహాత్మ్యాన్ని త్రిమూర్తులుకూడా పూర్తిగా వర్ణించి చెప్పలేరు. అధర్వణవేదంలో శిఖరాయమాణంగా చెప్పబడ్డ గొప్ప వ్రతమిది. ఇంతకన్నా గొప్ప వ్రతం మరొకటి లేదంటే లేదు. శాఖాభేదాలనుబట్టి ఈ వ్రతానికి చాలా పేర్లున్నాయి. పేరులూ దారులూ వేరైనా వస్తువు ఒక్కటే. శివాఖ్యం. సత్యచిద్ఘనం. కనక దీన్ని అందరూ ఆచరించాలి. ఎన్ని శాస్త్రాలూ ఎన్ని విద్యలూ నేర్చినా శిరోప్రత విహనుడైనట్టయితే అతడు సర్వధర్మ విహినుడికిందే లెక్క. ఇది పాపకాంతారదాహకం. సర్వవిద్యాసాధకం. నిత్యమూ ఆచరించాలని అధర్వణ శ్రుతి స్పష్టంగా చెబుతోంది.

ఆగ్నిరిత్యాది మంత్రాలు ఆరింటితో శుద్ధిచేసిన భస్మాన్ని శరీరంలో సర్వాంగాలకూ నిండా పులుముకోవాలి. సంగ్రహంగా శిరోవ్రతమంటే ఇదే.

సంధ్యాసమయాల్లో విద్యారంభాల్లో తప్పకుండా చెయ్యాలి. పన్నెండు రోజులనుంచి పన్నెండేళ్ళ వరకూ ఎంతకాలమైనా ఈ వ్రతాన్ని సంకల్పించుకోవచ్చు. కనిష్ట - గరిష్ట పరిమితులు మాత్రం అవ్వి. శిరోవ్రతస్నాతుడికి విద్యలనుగానీ మంత్రాలనుగానీ ఉపదేశించనివాడు ఆ విద్యల్ని కోల్పోతాడు. గురుశబ్దానికి అనర్హుడవుతాడు.

బ్రహ్మవిద్యాగురువంటే సాక్షాత్తూ పరమేశ్వరుడు. మునీశ్వరుడు. పరమదయామయుడై ఉండాలి గదా! వేనవేల జన్మల్లో ధర్మాచరణం చేసినవారికిగానీ బ్రహ్మవిద్యపట్ల శ్రద్ధకలగదు. కోరిక పుట్టదు. అందుచేత శిరోవ్రతం అనుష్ఠించి బ్రహ్మవిద్యను అభ్యర్థించినవారిని ఏ గురువూ తిరస్కరించకూడదు. ద్వేషించకూడదు. ద్వేషం ఎప్పుడూ అజ్ఞానసంభవమే. అతడికి ఆత్మజ్ఞానం లేదని అర్థం. ఇది గురుశిష్యులిద్దరికీ వర్తించేమాట.

శిరోవ్రతస్నాతులే బ్రహ్మవిద్యోపదేశానికి సాక్షాదధికారులు. మరింకెవ్వరూ కారు. ఈ ప్రతంతో అంతర్గతమైన పశుత్వాన్ని వదిలించుకోవాలి. పాశుపతుడు కావాలి. అటువంటివారికే బ్రహ్మవిద్యను ఉపదేశించాలని వేదానుశాసనం.

సతారమైన త్రియంబకమంత్రాన్ని జపిస్తూ త్రిపుండ్రాలుగా భస్మధారణ చేస్తే సరిపోతుందని జాబాలుల మతం. గృహస్థులు ఇలా చేస్తే చాలుననీ ఓంకారయుక్తంగా హంసమంత్రాన్ని ముమ్మారు ఉచ్చరిస్తూ త్రిపుండ్రాలను నిత్యమూ ధరించడం భిక్షుకులకు కర్తవ్యమనీ జాబాలికీశ్రుతి చెబుతోంది. సప్రణవమూ సశివమూ అయిన త్రియంబకమంత్రంతోనే గృహస్థులేకాదు వానప్రస్థులూ త్రిపుండ్రాలుగా భస్మధారణ చెయ్యాలి. మేధావీత్యాది మంత్రంతోకూడా బ్రహ్మచారి తడిపిన భస్మాన్ని త్రిపుండ్రాలుగా ధరించవచ్చు. ఏమైనా బ్రాహ్మణుడికి నొసట నిత్యమూ భస్మావగుంఠనం ఉండాలి, అప్పుడే బ్రాహ్మాణుడనిపించుకుంటాడు.

సన్యాసాశ్రమం స్వీకరించినవారు సతారమైన త్రియంబకమంత్రంతోగానీ పంచాక్షరితోగానీ ప్రణవంతోగానీ నొసటా హృదయంమిదా బాహువులపైనా విభూతిని త్రిపుండ్రాలుగా ధరించాలి. బ్రహ్మచారులు మేధావీత్యాది మంత్రంతోగానీ త్రియాయుష మంత్రంతోగానీ ధరించాలి. గౌణభస్మమైనా ధరించవచ్చు. శూద్రులు శివాయనమః అనే మంత్రంతో త్రిపుండ్రాలను ధరించాలి. మిగిలినవారికి ఏ మంత్రమూ అవసరంలేదు. భక్తితో భస్మోద్దూళనం చేసుకుంటే చాలు. విభూతిధారణచేస్తే సమస్తవిభూతులూ(ఐశ్వర్యాలూ) కలుగుతాయి. ఇది సర్వధర్మాలలోకీ వరేణ్యం. కనక నిత్యమూ ఆచరించాలి.

అగ్నిహోత్రంనుంచిగానీ విరజామంత్రహోమాగ్నినుంచిగానీ ఆవిర్భవించిన భస్మాన్ని ఒక శుభ్రమైన పాత్రలోకి తీసుకోవాలి. కాళ్ళూ చేతులూ కడుక్కుని రెండుసార్లు ఆచమించి సమాహితచిత్తంతో పంచబ్రహ్మ మంత్రాలను చదువుతూ భస్మాన్ని మెల్లమెల్లగా కలపాలి. (ఈ మంత్రాలతోనే భస్మాన్ని పాత్రలోకి తియ్యాలని కొందరు) ముమ్మారు ప్రాణాయామంచేసి అగ్నిరిత్యాది మంత్రాలు ఏడింటితో మూడుసార్లు. అభిమంత్రించాలి. ఓమాపోజ్యోతిరిత్యాది మంత్రాలను పఠిస్తూ ఆ తెల్లని విభూతిని శరీరంమీద శీర్షాదిపాదపర్యంతం జల్లుకోవాలి. ఇలా చేసినవాడు విపాపుడూ విరజుడూ అవుతాడనడంలో ఏ సందేహమూ లేదు. అటుపైని జలాధిపుడైన జగన్నాథుణ్ణి శ్రీమహావిష్ణువును ధ్యానించి విభూతిలో నీటిచుక్కలు వేసి అగ్నిరిత్యాది మంత్రాలను మళ్ళీ పఠిస్తూ తడపాలి. అప్పుడు పార్వతీపరమేశ్వరులను ధ్యానిస్తూ బ్రహ్మచర్యాది ఆశ్రమాలకు నిర్దిష్టమైన ఆయా మంత్రాలను పఠిస్తూ ముందు శిరస్సున ధరించి, నొసటా హృదయానా బాహువులపైనా తిపుండ్రరేఖలుగా ధరించాలి. మధ్యమానామికాంగుష్ఠాలతో అనులోమ విలోమ మార్గాల్లో - త్రిసంధ్యల్లోనూ నిత్యమూ - భస్మత్రిపుండ్ర ధారణ చెయ్యాలి.

నారదా! ఆజ్ఞానధ్వంసకమూ జ్ఞానసాధకమూ అయిన ఈ విభూతి ఆగ్నేయమనీ గౌణమనీ రెండువిధాలు. ఇందులో మళ్ళీ గౌణం చాలా రకాలు. అగ్నిహోత్రభస్మం, విరజానలభస్మం, ఔ పాసనభస్మం, సమిదగ్నిభస్మం, పచనాగ్నిభస్మం, దావానలభస్మం - ఇవన్నీ గౌణాలు. బ్రాహ్మణ క్షత్రియవైశ్యులకు అగ్నిహోత్ర భస్మంగానీ విరజానలభస్మంగానీ ధరించదగినవి. ఔ పాసనాగ్నిభస్మాన్ని గృహస్థులకు విశేషంగా చెప్పారు. బ్రహ్మచారులు సమిదగ్నిభన్మం ధరించాలి. శూద్రులు శ్రోత్రియుల ఇళ్ళనుంచి పచనాగ్నిభస్మం తెచ్చుకుని ధరించాలి. తక్కినవారందరూ దావానలభస్మాన్ని ధరించాలి.

ఇంక శిరోవ్రతదీక్షావిధానమేమంటే - పూర్ణిమాతిథి మంచిది. స్వగృహంలోగానీ ఆరామంలోగానీ అరణ్యంలోగానీ దీక్ష తీసుకోవచ్చు. ఇవి ప్రశస్తాలు. శుభప్రదాలు. పూర్ణిమకు ముందటి త్రయోదశినాడు సుస్నాతుడై అగ్నికార్యం నిర్వర్తించి గురువును పూజించి పాదాభివందనం చేసి అనుమతి పొందాలి. అటు పైని వైశేషికపూజ నిర్వహించి పరిశుభ్రమైన తెల్లని వస్త్రాలు ధరించాలి. కొత్త యజ్ఞోపవీతం వేసుకోవాలి. తెల్లనిపూలు దండగుచ్చి ధరించాలి. మంచిగంధం అలంకరించుకోవాలి. దర్భాసనంమిద దర్భలు చేతబట్టి కూర్చోవాలి. తూర్పుముఖంగాగాని ఉత్తరముఖంగాగానీ కూర్చుని ముమ్మారు ప్రాణాయామం చెయ్యాలి. పార్వతీపరమేశ్వరులను ధ్యానించి వారికి విన్నపం చేసుకోవాలి. నేను ఈ వ్రతం చేస్తున్నాను అని సంకల్పం చెప్పుకోవాలి. అప్పటికి వ్రతదిక్షితుడైనట్టు లెక్క. ఈ శిరోవ్రతం జన్మాంతంవరకూగానీ, పన్నెండేళ్ళపాటుగానీ ఆరేళ్ళపాటుగానీ మూడేళ్ళపాటు గానీ ఏణ్ణర్థంగానీ ఏడాదిగానీ ఆరునెలలుగానీ మూడునెలలుగాని నెలనాళ్ళేగానీ పన్నెండురోజులేగానీ ఆరురోజులేగానీ మూడునాళ్ళేగానీ ఆధమపక్షం ఒకరోజుగానీ చెయ్యవచ్చు. ఓపికను బట్టీ వీలునిబట్టీ సంకల్పావధిని నియమించుకోవచ్చు. విరజాహోమం చేసే అగ్నిని తెచ్చి ఆజ్యంతో సమిధలతో చరువుతో యథావిధిగా మంత్రయుక్తంగా హోమం చెయ్యాలి.

దీక్ష తీసుకునే రోజుకి ముందుగానే (పూతాహాత్పురతః 10-15) భూతశుద్దిని ఆకాంక్షించి మళ్ళీ సమిధలతో ఆజ్యంతో మంత్రాలతో హోమం చెయ్యాలి. నా దేహంలో ఈ తత్త్వాలు శుద్దిపాందుగాక అని స్మరిస్తూ హోమక్రియ సాగించాలి. పంచభూతాలూ పంచతన్మాత్రలూ పంచకర్మేంద్రియాలూ
పంచజ్ఞానేంద్రియాలూ పంచప్రాణవాయువులూ సప్తధాతువులూ సత్త్వరజస్తమోగుణాలూ మనోబుద్ధ్యహంకారాలూ ప్రకృతిపురుషులూ రాగమూ విద్య కళ నియతి కాలమూ మాయ శుద్ధవిద్య మహేశ్వరసదాశివులూ శక్తి శివతత్త్వమూ - వీటిని తత్త్వాలు అంటారు. వీటి శుద్ధిని ఆకాంక్షించి విరజామంత్రాలతో హోమంచేస్తే మానవుడు శుద్ధిపాంది విరజుడు అవుతాడు.

అటుపైని ఆవుపేడ తెచ్చి ముద్దలు చేసి అభిమంత్రించాలి. హోమాగ్నికుండంలో వేల్చి రోజంతా సంరక్షించాలి. హవిష్యంమాత్రమే భుజించి అగ్నికుండాన్ని చూసుకుంటూ ఉండాలి. చతుర్దశీ సుప్రభాతాన హోమక్రియలన్ని యథావిధిగా నడిపి ఆ రోజంతా ఉపవాసం ఉండాలి. నిరాహారుడుగా గడపాలి. పూర్ణిమనాడు ప్రాతఃకాలంలో మళ్ళీ యథావిధిగా హోమం చెయ్యాలి. హోమాంతంలో రుద్రాగ్నిని ఉపసంహరించాలి. హోమకుండంనుంచి శ్రద్దగా పద్ధతిగా భస్మం తీసుకోవాలి. అప్పుడు ముండితుడో జటిలుడో శిఖావంతుడో అయ్యి స్నానం చెయ్యాలి. సిగ్గుపడనివాడైతే దిగంబరంగానూ, సిగ్గుపడేవాడైతే కాషాయాంబర చర్మాంబర వల్కలాలలో ఏదో ఒకటి కట్టుకోవాలి. ఏకాంబరుడే కావాలి. మొలనూలు చుట్టుకోవాలి. దండం పట్టుకోవాలి. కాళ్ళు కడుక్కుని రెండుసార్లు ఆచమించి ఆత్మనూ శరీరాన్నీ సంకలీకరించి విరజానలసంభవమైన ఆ భస్మాన్ని అగ్నిరిత్యాదికమైన ఆధర్వణమంత్రాలను ఆరింటిని చదువుతూ మూర్ధాదిచరణాంతంగా అన్ని అవయవాలకూ పులుముకోవాలి. అదే క్రమంలో భస్మంతో సముద్దూళనం చేసుకోవాలి. ప్రణవాన్నో శివనామాన్నో జపిన్తూ ఈ పని చెయ్యాలి. ఆ తరవాత త్రియాయుషమంత్రంతో త్రిపుండ్రాలు ధరించాలి. శివభావాన్ని పాంది శివభావాన్ని ఆచరించాలి. అనునిత్యమూ ముప్పాద్దులా ఇలా చేస్తే అది పాశుపతవ్రతమవుతుంది. ఇది పశుత్వాన్ని తొలగించడంతో పాటు భుక్తిముక్తి ప్రదమవుతుంది. ఇలా పాశుపతవ్రతంచేసి పశుత్వాన్ని తొలగించుకున్న మహానుభావుడు సాక్షాత్తూ మహాదేవుడూ లింగమూర్తీ సదాశివుడుగా పూజనీయుడు అవుతాడు.

నారదా! భస్మస్నానంవల్ల కలిగే మహాపుణ్యం సర్వసౌఖ్యకరం. ఆయురారోగ్యభోగభాగ్యబల పుష్టివర్ధనం. రక్షణకోసం మంగళార్థం సర్వసంపత్పమృద్ధికోసం మృత్యుభయ మహామారీభయ నివారణకోనం మనుష్యులు ఈ భస్మస్నానం చెయ్యాలి.

భస్మ భేదాలు




Bhuthasuddi - Purification of the elements - భూతశుద్ది

శ్రీ దేవీ భాగవతం ఏకాదశ స్కంధము - భూతశుద్ది

నారదా! సదాచారంలో భాగంగా ఇప్పుడు భూతశుద్ది గురించి చెబుతున్నాను. శ్రద్దగా ఆలకించు. మూలాధారచక్రం నుంచి మేల్కొని సుషుమ్నామార్గంద్వారా బ్రహ్మరంధ్రానికి చేరుకునే కుండలినీ పరదేవతను ఒక్కసారి స్మరించు. సాధకుడు హంసమంత్రంతో జీవుణ్ణి బ్రహ్మలో అనుసంధిస్తాడు. శరీరంలో పాదాది జానుపర్యంతం - భూమండలం. అది చతుష్కోణం. సవజ్రకం. లం బీజాఢ్యం. స్వర్ణవర్ణం. జాన్వాది నాభిపర్యంతం - జలమండలం. అది చంద్రార్దనిభం. పద్మద్వయాంకితం, వం బీజయుక్తం. శ్వేతవర్ణం. నాభిమొదలు హృదయపర్యంతం - అగ్నిమండలం. అది త్రికోణం. స్వస్తికాన్వితం. రం బీజయుక్తం. రక్తవర్ణం. హృదయం నుంచి భ్రూమధ్యపర్యంతం - వాయు మండలం. అది వృత్తాకారం. షడ్బీందులాంఛితం. యం బీజయుతం. ధూమ్రువర్ణం. భూమధ్యనుంచి బ్రహ్మరంధ్రపర్యంతం - ఆకాశమండలం. అదీ వృత్తాకారం. స్వచ్చం. మనోహరం. హం బీజయుక్తం. ఇలా ఒక్కొక్కమండలాన్నీ ప్రత్యేకంగా భావించి ఒకదానిలో ఒకటి నింపాలి. భూమిలో జలం, జలంలో అగ్ని, అగ్నిలో వాయువు, వాయువులో ఆకాశం నింపి, ఆకాశాన్ని అహంకారంలో, అహంకృతిని మహత్తత్త్వంలో, మహత్తత్త్వాన్ని ప్రకృతిలో, ప్రకృతిని మాయలో, మాయను ఆత్మలో అంతర్భవింపజెయ్యాలి. అప్పుడు సాధకుడు శుద్ధ సంవిన్మయుడవుతాడు. అయ్యాక - వామకుక్షిలో ఉండే పాపపురుషుణ్ణి స్మరించాలి. నల్లగా ఆంగుష్ఠపరిమాణంలో ఉంటాడు. బ్రహ్మహత్య శిరస్సుగా, సువర్ణస్తేయం బాహువులుగా, మదిరాపానమే హృదయంగా, గురుపత్నీ సంగమమే కటి ప్రదేశంగా, పాతకి స్నేహాలు పాదద్వయంగా, ఉపపాతకాలు మస్తకంగా ఖడ్గచర్మధరుడై అధోముఖుడై దుస్సహంగా ఉంటాడు పాపపురుషుడు. వాయుబీజ స్మరణతో మహావాయువును సృష్టించి ఈ పాపవురుషుణ్ణి ఎండగట్టాలి. వహ్నిబీజాన్ని స్మరించి మంటల్లో దహించివెయ్యాలి. ఆ బూడిదను కుంభకం ద్వారా స్వశరీరంనుంచి వెలుపలికి నెట్టి, వాయుబీజ రేచనతో పోగుపెట్టి, సుధాబీజ స్మరణతో తడిపి భూబీజస్మరణతో ముద్దచేసి, ఆకాశబీజస్మరణతో ఆ బంగారుముద్దను అద్దంలా విశుద్దిపరచి మూర్ధాదిపాదపర్యంతం అన్ని అవయవాలకూ పులుముకోవాలి.

అటుపైని ఆ భస్మం నుంచి ఆకాశాది పంచభూతాలనూ పునరుత్పాదన చేసి సో హం మంత్రోచ్చారణతో ఆత్మను హృదయాంబుజంలోకి తీసుకురావాలి. పరసంగంనుంచి సుధామయమైన కుండలినీ జీవాన్ని తెచ్చి హృదయాంభోజంలో సంస్థాపించి, మూలాధారంలో ఉండే శక్తిని ధ్యానించాలి. ఎర్రసముద్రంలో తెప్పలాగా(తెప్పమిద) ఉన్న అరుణ సరోజంమీద కూర్చుని, హస్తపద్మాలలో శూలమూ, తుమ్మెదలే ఆల్లెత్రాడుగాగల చెరకువిల్లూ, ఆంకుశమూ అయిదుబాణాలూ ఒక రక్తకపాలమూ ధరించినదీ, మూడు కన్నులుకలదీ, బలిష్ఠమైన వక్షోజాలు కలదీ, ఉదయిస్తున్న సూర్యబింబపు రంగులో ప్రకాశించేదీ ఆ మహాదేవి ఆ పరాంబిక ఆ ప్రాణశక్తి మాకు సుఖప్రద అగుగాక!

పరమాత్మ స్వరూపిణి ఆ ప్రాణశక్తిని ఇలా ధ్యానించి విభూతిని ధరించాలి. విభూతిని ధరిస్తేనే వైదిక సత్కర్మాచరణకు అర్హత అధికారం సిద్ధిస్తుంది. శ్రుతి స్మృతి పురాణాలు చెప్పిన ప్రకారం విభూతిని ఎలా ధరించాలో ఏ మహాఫలాలు లభిస్తాయో అదికూడా తెలియజేస్తాను. తెలుసుకో.

భస్మధారణ - శిరోవ్రతం




Rudrakshalu - Adhidevathalu - రుద్రాక్షలు - అధిదేవతలు

శ్రీ దేవీ భాగవతం ఏకాదశ స్కంధము - రుద్రాక్షలు - అధిదేవతలు

నారదా! ఈ రుద్రాక్షల్లోకూడా చాలా భేదాలున్నాయి. ధాత్రీఫలమంత(ఉసిరిక) ఉండేవి ఉత్తమోత్తమాలు. వీటిని భద్రాక్షలు అంటారు. రేగుపండంత ఉండేవి మధ్యమాలు. సెనగగింజల్లాగా ఉండేవి అధమాలు. రుద్రాక్షల్లో బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర జాతులున్నాయి. శ్వేతవర్ణంలో ఉండేవి బ్రాహ్మణజాతివి. రక్తవర్ణంలో ఉండేవి క్షత్రియజాతివి. పీతవర్ణంలోఉండేవి వైశ్యజాతివి. కృష్ణవర్ణంలో ఉండేవి శూద్రజాతివి. ఏజాతివాటిని ఆ జాతివారే ధరించాలి. ఆకారంలో సమానంగా ఉండి కంటకాలతో దృఢంగా నిగనిగలాడేవి శుభప్రదాలు. పురుగులు కొరికినవీ పగిలినవీ(ముళ్ళులేనివీ) కంటకాలు లేనివీ కుదపలు కట్టినవీ బాగా తెరుచుకున్నవీ పనికిరావు. స్వయంగా రంధ్రసహితమైన రుద్రాక్ష ఉత్తమం. మానవులు రంధ్రం చేసినది మధ్యమం. నికషంమిద రాస్తే బంగారుగీటు పడేది ఉత్తమోత్తమం. దీన్ని శివపూజా దురంధరులు ధరించాలి.

రుద్రాక్షలను రెండు పేటలుగాగానీ మూడు పేటలుగాగానీ ధరించవచ్చు. కుండలాలలో కిరీటాలలో కర్ణాభరణాలలో హారాలలో కేయూరాలలో కటకాలలో - ఇలా ఏ ఆభరణంలోనైనా పాదిగి ధరించవచ్చు. నిద్రపోతున్నా తింటున్నా తాగుతున్నా రుద్రాక్షమాలను తీసివెయ్యవలసిన అవసరంలేదు. శుచిగా ఉన్న అన్నివేళలా ధరించవచ్చు. మూడు వందలైతే అథమమనీ అయిదు వందలైతే మథ్యమమని వెయ్యి రుద్రాక్షలు ధరిస్తే ఉత్తమమనీ కొందరు చెప్పారు. ఎన్ని ఎక్కువ ధరించగలిగితే అంత మంచిది. కనీసం ఒక్కటైనా ధరించడం అవసరం.

శిరస్సున ధరించేటప్పుడు ఈశానమంత్రం, చెవులకు తత్పురుషమంత్రం, నొసటా గుండెలమీదా ధరించేటప్పుడు అఘోరమంత్రం, చేతులకు అఘోరబీజమంత్రం పఠించాలి. ఉదరాన ధరించేటప్పుడు వామదేవ మంత్రం జపించాలి. మూలమంత్రంతో సంప్రోక్షించిన రుద్రాక్షలనే ధరించాలి.

ఏకముఖీ రుద్రాక్షలు పరతత్త్వప్రకాశకాలు. ద్విముఖిని అర్ధనారీశ్వరమంటారు. త్రిముఖం అగ్నిదేవుడు. సర్వపాపవిదాహకం. ఇదే అగ్నిత్రయస్వరూపం. చతుర్ముఖరుద్రాక్షమంటే బ్రహ్మదేవుడే. దీన్ని ధరించిన వారికి ఆయురారోగ్యభోగభాగ్యాలూ జ్ఞానసంపత్తీ కలుగుతాయి. పంచముఖి రుద్రాక్ష సాక్షాత్తుగా పంచబ్రహ్మాత్మకం. దీన్ని ధరిస్తే శివప్రీతికరం. షడ్వక్త్ర రుద్రాక్షలో కార్తికేయుడే ఉంటాడు. వినాయకుడుంటాడని మరి కొందరన్నారు. సప్తముఖీరుద్రాక్షకు సప్తమాతృకలు అధిదేవతలు. ఇది సప్తాశ్వ - సప్తముని రూపకం. ఆరోగ్య - ఐశ్వర్యవర్థకం. జ్ఞానప్రదం. అష్టముఖీరుద్రాక్షకు అష్టమాతృకలు అధిదేవతలు. దీన్ని ధరించినవారిని ఆష్టవసువులూ గంగాదేవి ఆశీర్వదిస్తారు. నవముఖీరుద్రాక్షమంటే యమధర్మరాజు. దీన్ని ధరిస్తే యమభయం ఉండదు. దశముఖరుద్రాక్షకు దశదిశలూ అధిదేవతలు. దశదిశా ప్రీతికరం. ఏకాదశముఖీ రుద్రాక్షకు ఏకాదశరుద్రులూ అధిదేవతలు. దీనినే ఇంద్రదైవతమని కూడా అంటారు. అత్యంత సౌఖ్యప్రదం. ద్వాదశముఖ రుద్రాక్ష సాక్షాత్తూ మహావిష్ణుస్వరూపం. దీనికి ద్వాదశాదిత్యులు అధిదేవతలు. సర్వరోగనివారిణి. ఆరోగ్యప్రదాయిని. త్రయోదశముఖీ రుద్రాక్షకు మన్మథుడు అధిదేవత. దీన్ని ధరిస్తే తీరని కోరికలే ఉండవు. కామదేవుడు సర్వాత్మనా అనుగ్రహిస్తాడు. చతుర్దశముఖీ రుద్రాక్ష సాక్షాత్తూ రుద్రనేత్రంనుంచి ఆవిర్భవిస్తుంది. దీన్ని ధరిస్తే ఆధివ్యాధులు దరిచేరవు.

నారదా! రుద్రాక్షలు ధరించినవారు మద్య మాంస లశున(వెల్లుల్లి) పలాండు(నీరుల్లి) శిగ్ను(మునగ) శ్లేష్మాతక(విరిగి) విడ్వరాహ భక్షణం చెయ్యకూడదు. గ్రహణకాలంలో, విషువత్తున(రేయింబవళ్ళు సమంగా ఉండేరోజు) సంక్రమణ సమయంలో అయనకాలంలో అమావాన్య(దర్శ) పౌర్ణిమలలో ఇంకా ఇలాంటి పుణ్యదినాలలో పర్వాలలో రుద్రాక్షలను ధరిస్తేవిశేషవలితం ఉంటుంది. వెంటనే పాపవిమోచనం కలుగుతుంది.

భూతశుద్ది




The Story of Gunanidhi - గుణనిధికథ

శ్రీ దేవీ భాగవతం ఏకాదశ స్కంధము - గుణనిధికథ

రుద్రాక్షమాలతో మంత్రజపం చేస్తే కోటిరెట్లు అధికంగా వేగంగా ఫలం సిద్ధిస్తుంది. శరీరంమీద ఒక్కరుద్రాక్ష అయినా లేని నరుడి జన్మ వ్యర్థమంటే వ్యర్థం. రుద్రాక్షను శిరస్సున పెట్టుకుని స్నానం చేస్తే గంగాస్నానఫలం దక్కితీరుతుంది. ఎకముఖ - పంచముఖ - ఏకాదశముఖ - చతుర్దశముఖ రుద్రాక్షలు లోకపూజితాలు. రుద్రాక్షను నిత్యమూ భక్తితో పూజిస్తే శంకరుణ్ణి పూజించినబ్దే. రుద్రుడికీ రుద్రాక్షకూ రుద్రాక్షధారికీ భేదంలేదు. దరిద్రుణ్ణి ధనవంతుణ్ణి చేసే శక్తి ఒక్క రుద్రాక్షకే ఉంది. దీనికి నిదర్శనంగా ఒక పురాణకథ చెబుతాను - విను,

కోసలదేశంలో గిరినాథుడు అనే బ్రాహ్మణుడు ఉన్నాడు. వేదవేదాంగపారంగతుడు. మహాధనవంతుడు. ధర్మాత్ముడు. యజ్ఞయాగాలు అన్నీ చేసినవాడు. అతనికి గుణనిధి అని ఒక పుత్రుడున్నాడు. మన్మథుడిలా బహుసుందరుడు. సుధిషణుడు అనే గురువు దగ్గర చదువుకుంటున్నాడు. కోడెవయసు కూతలు పెట్టింది. గురుపత్ని ముక్తావళికి వలవిసిరాడు. రూపయౌవనాలకు సమ్మోహితురాలయ్యింది. కొంతకాలం కథ రహస్యంగా సాగింది. ఎప్పటికయినా గురువుగారికి తెలియకమానదు. శపిస్తాడు అని భయపడ్డాడు గుణనిధి. దానితో గురువుకి విషంపెట్టి అడ్డు తొలగించుకొన్నాడు. ఇక స్వేచ్చగా నిర్భయంగా ముక్తావళితో కాపురం సాగించాడు. ఆనోటా ఆనోటా వ్యాపించి గిరినాథునికి తెలిసింది. ఎంతగానో నొచ్చుకున్నాడు. గుణనిధిని పిలిపించి తల్లిడండ్రులిద్దరూ గట్టిగా మందలించారు. దానితో ఆ దుష్టుడు అలిగి వారికే విషంపెట్టాడు. తండ్రికూడబెట్టిన ధనసంపదలతో ముక్తావళిని భోగభాగ్యాలలో ముంచితేల్చాడు. సురాపాన మాంసభక్షణలకు అలవాటు పడ్డాడు. కాలం గడిచింది. సంపదలు తరిగిపోయాయి. ఆస్తులు కరిగిపోయాయి. ధనంకోసం దొంగతనాలకు దిగాడు. గ్రామస్థులంతా మేల్కొన్నారు. సంఘ బహిష్కారం విధించారు. ఇక చేసేది లేక ముక్తావళీ గుణనిధులు అడవులకు పోయారు. దారిదోపిడీలు చేశాడు. అడవిగుండా వెళ్ళే ప్రతిమనిషినీ చంపి సామ్ములు దోచుకున్నాడు. ముక్తావళితో మురిపాలు తీర్చుకున్నాడు. చాలాకాలం సాగింది.

ఒకనాడు హఠాత్తుగా గుణనిధి మరణించాడు. యమదూతలు వేలసంఖ్యలో వచ్చిపడ్డారు. శివలోకంనుంచి శివగణాలూ వచ్చాయి. రెండు వర్గాలకూ వాదం జరిగింది. ఇతడు చేసిన పుణ్యకార్యం ఒక్కటయినా ఉందా? అని యమదూతలు ప్రశ్నించారు. ఇతడిని తీసుకువెళ్ళటానికి శివదూతలుగదా మీరు రావడమేమిటని పరిహసించారు. దానికి శివదూతలు చెప్పిన సమాధానం ఎమిటంటే -

యమదూతలారా! ఈ గుణనిధి మరణించినచోట నేలలో పదిమూరల లోతున రుద్రాక్ష ఉంది. దాని ప్రభావంవల్ల ఇతడి పాపాలన్నీ అంతరించాయి. శివసన్నిధికి యోగ్యుడయ్యాడు. అందుకని తీసుకువెళ్ళడానికి వచ్చాం - అన్నారు. యమదూతలు కిమ్మనకుండా తిరుగుముఖం పట్టారు.

గుణనిధి దివ్యవిమానం అధిరోహించాడు. దివ్యరూపధరుడు అయ్యాడు. శివదూతలతో కలిసి శంకరుడి సన్నిధికి చేరుకున్నాడు.

రుద్రాక్ష మహిమ ఇంతటిది. వర్ణనాతీతం - అని శివుడు షణ్ముఖుడికి వివరించాడు. షణ్ముఖుడు కృతార్థుడనయ్యానని సంబరపడ్డాడు. నారదా! సదాచార ప్రసంగంలో రుద్రాక్షను గురించి నేనింత గొప్పగా చెప్పడానికి ఇదే కారణం. అది సర్వపావక్షయకరం, సర్వపుణ్యప్రదం.

రుద్రాక్షలు - అధిదేవతలు




Rudrakshamahimalu - Gaardhabhagaadha - రుద్రాక్షమహిమలు - గార్ధభగాథ

శ్రీ దేవీ భాగవతం ఏకాదశ స్కంధము - రుద్రాక్షమహిమలు - గార్ధభగాథ

నారదా! శివుడు కుమారస్వామికి చెప్పిన రుద్రాక్షమహిమలు ఇంకా ఏమిటంటే - అంటూ నారాయణమహర్షి కొనసాగించాడు.

దేవతలుసైతం రుద్రాక్షమహిమలో పదహారవకళకయినా సాటిరారు. పురుషులలో విష్ణుమూర్తి, గ్రహాలలో సూర్యుడు, నదులలో గంగ, మునులలో కశ్యపుడు, గుర్రాలలో ఉచ్చైః శ్రవమూ, దేవుళ్ళలో ఈశ్వరుడు, దేవీమూర్తులలో గౌరి ఎలాంటివారో సమస్తవస్తువుల్లోనూ రుద్రాక్ష అటువంటిది. రుద్రాక్షధారణను మించిన తపస్సు లేదు. స్తోత్రం లేదు. వ్రతం లేదు. అక్షయ్యదానాలలో రుద్రాక్షదానం బహువిధాల విశిష్టం. శాంతచిత్తుడైన శివభక్తుడికి రుద్రాక్షను దానం చేస్తే లభించే పుణ్యఫలం ఎంతటిదో ఈశ్వరుడు కూడా చెప్పలేకపోయాడు. రుద్రాక్షధారికి అన్నదానం చేసినవారు ఇటూ అటూ ఏడేసి తరాలు తరించి శివలోకం చేరుకుంటారు. నొసట విభూతి, తనువున రుద్రాక్ష, శివాలయంలో పూజ - విటికి నోచుకోని విప్రుడు శ్వపచుడితో సమానం. మద్యపాన - మాంసభక్షణ - వేశ్యాసంగమాది మహాపాతకాలు రుద్రాక్ష శిరోధారణతో పటాపంచలవుతాయి. యజ్ఞయాగాలు చెయ్యకపోయినా వేదాలు చదవకపోయినా ఏ దానాలూ చెయ్యకపోయినా అన్నీ చేసిన ఫలం లభిస్తుంది. పురాణపఠన తీర్ధసేవన శాస్త్రాభ్యసన పుణ్యఫలాలు దీనికి సాటిరావు. రుద్రాక్షను ధరించి ప్రయాణమధ్యంలో దిక్కులేని చావు చచ్చినా అతడు శివత్వం పొందుతాడు. అతడి వంశంలో ఇరవైయొక్క తరాలు తరిస్తాయి. రుద్రలోకంలో నివసిస్తాయి. ఏ కులంలో పుట్టినా ఎలాంటి దురభ్యాసాలకు లోనైనా నిర్గుణుడైనా సగుణుడైనా రుద్రాక్షధారి రుద్రుడితో సమానుడే. శిరస్సున ధరిస్తే కోటిరెట్లు, చెవులకు ధరిస్తే దశకోట్లు, మెడలో ధరిస్తే శతకోట్లు, మూర్ధమున ధరిస్తే సహస్రకోట్లు, జంధ్యానికి ధరిస్తే అయుతకోట్లు, బుజాలకో మణికట్టుకో దాలిస్తే లక్షకోట్లు అధికంగా ఫలాన్ని ఇస్తుంది. రుద్రాక్షను మించిన మోక్షసాధనం మరొకటి లేదంటే అతిశయోక్తి కాదు. రుద్రాక్షను ధరిస్తే చాలు భక్తి ఉన్నా లేకపోయినా వైదికకర్మలను చేసినా చెయ్యకపోయినా ముక్తి లభించడం తథ్యం. రుద్రాక్షను ధరించాలి అనే కోరిక గాఢంగా ఉంటే చాలు, ఒకవేళ ధరించలేకపోయినా శివలింగంలాగా వందనీయుడే, అవిద్యుడా సవిద్యుడా అనే విచారణతో పనిలేదు. రుద్రాక్షధారి రుద్రత్వం పాంది తీరుతాడు. రుద్రలోకం చేరి తీరుతాడు. వెనకటికి ఒక గాడిద ఇలాగే రుద్రత్వం పొందింది.

నారదా! షణ్ముఖుడు వెంటనే ఆ గాడిద కథ చెప్పమన్నాడు. శివుడు చెప్పాడు. అదేమిటంటే - వింధ్యారణ్యంలో ఒక గాడిద ఉండేది. ఒకనాడు ఒక పథికుడు దానిమీద ఆది మొయ్యలేనన్ని రుద్రాక్షలు బస్తాలు కట్టి వేశాడు. ఓపిక తెచ్చుకుని చాలాదూరం మోసింది. ఇక మొయ్యలేక నేలకు ఒరిగిపోయింది. ప్రాణాలు విడిచింది. శివుడి అనుగ్రహానికి పాత్రమై శివలోకం చేరుకుంది. మోసిన రుద్రాక్షలు ఎన్నో ఒక్కొక్క దానికీ ఎన్ని ముఖాలున్నాయో అన్ని వేల సంవత్సరాలు శివలోకంలో
నివసించింది.

బ్రహ్మనందనా! ఈ రుద్రాక్ష మహిమను ఎవరికిబడితే వారికి చెప్పకూడదు. అశిష్యులకూ అభక్తులకూ మూర్ఖులకూ అస్సలు చెప్పకూడదు. అయితే - రుద్రాక్షను ధరించాలి అనుకునేవాడికి ఎవడికైనాసరే చెప్పవచ్చు.

రుద్రాక్ష మహిమలను వర్ణించిచెప్పడం, రుద్రాక్షలను ధరింపజెయ్యడం - ఇదొక వ్రతంగా ఆచరించినవారు సమకూర్చుకునే పుణ్యరాశికి కొలతలేదు. వెయ్యి రుద్రాక్షలను ధరింపజేస్తే అతడికి దేవతలు కూడా నమస్కరిస్తారు. వెయ్యి సాధ్యం కాకపోతే బుజానికి పదహారు, శిఖకు ఒకటి, చేతికి పన్నెండు, మెడలో ముప్ఫయిరెండు, శిరస్సున ఇరవైనాలుగు, చెవికి ఒకటి, మరోపన్నెండు వక్షఃస్థలాన - ఇలాగ నూటయెనిమిది ధరింపజేసినా అతడు రుద్రుడిలా దేవమానవ పూజ్యుడవుతాడు. ముత్యాలతో పగడాలతో స్పటికాలతో వైడూర్యాలతో కలిపి రుద్రాక్షలను వెండితీగకుగానీ బంగారుతీగకుగానీ చుట్టి ధరిస్తే అతడు సాక్షాత్కరించిన శివుడే. రుద్రాక్షలకు వెండి లేదా బంగారు తొడుగులను చేయించి ధరించినా అధికపుణ్యప్రదమే. ఏ కోరికా లేకపోయినా, ఏ భక్తీ లేకపోయినా యథాలాపంగా ధరించినా అతడిని ఏ పాపాలు సోకవు. సూర్యుడికి చీకట్లు సోకుతాయా!

గుణనిధికథ




Rudrakshajapamaala - రుద్రాక్షజపమాల

శ్రీ దేవీ భాగవతం ఏకాదశ స్కంధము - రుద్రాక్షజపమాల

నారదా! జపమాలికాలక్షణం చెబుతాను. గ్రహించు. ప్రతిరుద్రాక్షలోనూ ముఖభాగం బ్రహ్మదేవుడు. బిందుభాగం (ముళ్ళు) రుద్రుడు. పుచ్చభాగం శ్రీమహావిష్ణువు. పంచముఖీ రుద్రాక్షలు పాతికతో జపమాల చేసుకోవడం మంచిది. అవ్వి కంటకాలతో గరుకుగా ఉండాలి. ఎరుపు - తెలుపు - లేదా మిశ్రవర్ణంలో ఉండాలి. రంధ్రాలు చెయ్యాలి. ముఖభాగం ముఖభాగంతో పుచ్చభాగం పుచ్చభాగంతో కలిసేట్టు రుద్రాక్షలు గ్రుచ్చాలి. ఆవుతోకను చుట్టినట్టుండాలి. మేరువును అన్నింటికీ పైని గ్రుచ్చాలి. ఇలాంటి అక్షమాలను నాగపాశమంటారు. ఇది మంత్రసిద్ధిప్రదాయిని. దీన్ని ముందుగా సుగంధజలాలలో శుభ్రంగా కడగాలి. అటుపైని పంచగవ్యాలు జల్లాలి. మళ్ళీ పవిత్రోదకస్నానం చేయించాలి. అప్పుడు మంత్రాలను న్యాసం చెయ్యాలి. శివాస్త్రమంత్రం జపిస్తూ ప్రతిరుద్రాక్షనూ స్పృశించాలి. కవచంతో అవకుంఠన చెయ్యాలి. మూలమంత్రాన్ని న్యసించి మళ్ళీ శుద్దోదకసాన్ననాదులు చేయించాలి. సద్యోజాతాది సంప్రోక్షణలతో నూటయెనిమిది పర్యాయాలు మూలమంత్రాన్ని పఠించి రుద్రాక్షమాలను పరిశుభ్ర పీఠంమీద ఉంచాలి. అప్పుడు పార్వతీపరమేశ్వరులను ఆవాహన చెయ్యాలి. అప్పటికి అది ప్రతిష్ఠితమాల అవుతుంది. సర్వవాంఛా ప్రదమవుతుంది. ఈ జపమాలతో ఏ దేవతామంత్రాన్నయినా జపించుకోవచ్చు.

శిరస్సునగాని మెడలోగానీ కర్ణాభరణంగా గానీ ధరించవచ్చు. జపం ఏదైనా ఎప్పుడూ రుద్రాక్ష్రమాలతోనే చెయ్యాలి. జపం కాగానే కన్నులకద్దుకుని యథావిధిగా ధరించాలి. స్నాన - దాన - జప - హోమ - వైశ్వదేవ - సురార్చనా - ప్రాయశ్చిత్త - శ్రాద్ధ - దీక్షాకాలాలలో రుద్రాక్షధారణ విశేషఫలితాలను ఇస్తుంది. ఇది లేకుండా వైదికకర్మలు చేసిన విప్రుడు నరకానికి పోతాడు. మరొకరు ధరించిన రుద్రాక్షమాలను తానెప్పుడూ ధరించకూడదు. అశౌచసమయాలలో ధరించకూడదు.

రుద్రాక్షతరువునుంచి వచ్చిన గాలిసోకితే చాలు గడ్డి పరకలు సైతం పుణ్యలోకాలకు చేరుకుంటాయి. మానవులకు ఇది సర్వపాపవిమోచకమనడంలో సందేహం లేదు. రుద్రాక్షను ధరిస్తే పశువులుకూడా రుద్రత్వం పొందుతాయి. ఇక మానవుల మాట చెప్పాలా - అంటోంది జాబాలశ్రుతి. అందుచేత కనీసం ఒక్క రుద్రాక్షనైనా ధరించడం అవసరం. దీన్ని ధరించి శివనామాలను జపించేవారే నిజమైన భాగవతోత్తములు. శ్రేయస్కాములు తప్పక ధరిస్తారు. జపిస్తారు. తరిస్తారు. బ్రహ్మవిష్ణు మహేశ్వరులూ వారి అంశావతారాలూ సకలదేవతలూ రుద్రాక్షధారులే. ఋషులూ మునులూ యోగులూ సరేసరి. మహాతపస్వులకు ఎన్నో జన్మలకుగానీ లభించని ముక్తి, రుద్రాక్షధారులకు చటుక్కున లభిస్తుంది. రుద్రాక్షలు ధరిస్తే శ్రద్ధపెరుగుతుంది. మోక్షమునందిచ్చ పొడముతుంది. శివుడి అనుగ్రహం ఉంటేనే రుద్రాక్షధారణం మీద కోరిక కలుగుతుంది. ధరించాడూ అంటే శివానుగ్రహానికి పాత్రుడు అయ్యాడన్నమాటే. అందుకే దీని మాహాత్మ్యాన్ని జాబాలేయులూ మునులూ నిరంతరం పఠిస్తూ ఉంటారు. రుద్రాక్షలను కంటితో చూస్తే చాలు పుణ్యం వస్తుంది. స్పృశిస్తే కోటిరెట్టూ ధరిస్తే నూరుకోట్ల రెట్లూ పుణ్యం దక్కుతుంది.

రుద్రాక్షమాలతో జపం చేస్తే లక్షకోటిశతాలూ లక్షకోటిసహస్రాలుగా పుణ్యం లభిస్తుంది అనడంలో ఏ సందేహమూ లేదు. చేతులకూ గుండెలకూ మెడకూ చెవులకూ శిరస్సుకూ రుద్రాక్షలను ధరించినవాడు సాక్షాత్తూ రుద్రుడవుతాడనడమూ నిశ్చయమే. రుద్రుడిలా అవధ్యుడై శివుడిలా సురాసురులకు సైతం వందనీయుడవుతాడు. రుద్రాక్షధారికి నమస్కరిస్తే శివుడికి నమస్కరించినట్టే. సర్వపాపవిముక్తి ఉభయులకూ దక్కేఫలం. రుద్రాక్షను ధరించి మరణిస్తే కుక్కసైతం ముక్తిపొందుతుందంటే ఇక నరులమాట చెప్పాలా! జపధ్యాన విహీమడైనానరే రుద్రాక్షను ధరిస్తేచాలు. సర్వపాపాలనుంచీ విముక్తి పొందుతాడు. సద్గతులకు అర్హుడవుతాడు. అందుచేత విశ్వప్రయత్నం చేసయినాసరే కనీసం ఒక్కరుద్రాక్షను సంపాదించి ధరించాలి. ఇరవైయొక్కటి సంపాదించి ధరించగలిగితే చాలు శివలోకం ఖాయం.

రుద్రాక్షమహిమలు - గార్ధభగాథ




Rudrakshas - Varieties - రుద్రాక్షలు - భేదాలు

శ్రీ దేవీ భాగవతం ఏకాదశ స్కంధము - రుద్రాక్షలు - భేదాలు

నారాయణమహర్షీ! రుద్రాక్ష మహిమ గురించి చాలా గొప్పగా చెబుతున్నావు. కారణం తెలుసుకోవచ్చా?

నారదా! ఒకప్పుడు కుమారస్వామి ఇలాగేఅడిగితే శంకరుడు చెప్పింది నీకు తెలియపరుస్తున్నాను. విను. వెనకటికి త్రిపురుడు అని ఒక దైత్యుడున్నాడు. సర్వదుర్జయుడు. బ్రహ్మాదిదేవతల నందరినీ పీడించుకుతినేవాడు. అందరూ వెళ్ళి శంకరుడితో మొరపెట్టుకున్నారు. అప్పుడు శంకరుడు అఘోరము అనే మహాశస్త్రాన్ని ధ్యానించాడు. అది సర్వదేవమయమూ ఘోరాతిఘోరమూను. ఒక వెయ్యి దివ్య సంవత్సరాలు దాన్ని ధ్యానించి కన్నులు మూడూ తెరిచాడు. బాష్పజలబిందువులు రాలిపడ్డాయి. ఆ నీటి బిందువులనుంచి మహారుద్రాక్షలు అనే వృక్షాలు ఆవిర్భవించాయి. సూర్యనేత్రంనుంచి రాలిపడిన జలబిందువులతో కపిలవర్ణంలో పన్నెండూ, సోమనేత్రం నుంచి శ్వేతవర్ణంలో పదహారూ, వహ్నినేత్రంనుంచి కృష్ణవర్ణంలో పదిరకాలూ రుద్రాక్షలు మొలిచాయి. శ్వేత - రక్త - మిశ్ర - కృష్ణ రుద్రాక్షలు నాలుగు వర్గాలకూ ప్రతీకలు.

ఏకముఖ రుద్రాక్ష సాక్షాత్తూ శంకరుడే. బ్రహ్మహత్యాది మహాపాతకాలను సైతం తొలగిస్తుంది. ద్విముఖరుద్రాక్ష పార్వతీపరమేశ్వరులు. సకలపాప విమోచకం. త్రిముఖ రుద్రాక్ష సాక్షాత్తు అగ్నిదేవుడు. స్త్రీహత్యాది పాపాలను సైతం దహించివేస్తుంది. చతుర్ముఖరుద్రాక్ష అంటే బ్రహ్మదేవుడే. నరహత్యాది ఘోరపాపాలనుకూడా తొలగిస్తుంది. పంచముఖీ రుద్రాక్షనే కాలాగ్ని అంటారు. అదే రుద్రుడు. అభక్ష్యభక్షణ అగమ్యాగమనాది దోషాలను అంతరింపజేస్తుంది. షణ్ముఖరుద్రాక్షమంటే కుమారస్వామియే. దీన్ని కుడిచేతికి ధరించాలి. బ్రహ్మహత్యాదిక పాపాలుకూడా పోతాయి. సప్తముఖ రుద్రాక్షను మన్మథుడంటారు. స్వర్ణస్తేయాదిపాతకాలు నశిస్తాయి. ఆష్టవక్ర రుద్రాక్షమంటే వినాయకుడు. దీన్ని ధరిస్తే అన్ని పనులూ నిర్విఘ్నంగా సాగుతాయి. గురుపత్నీగమనాది దోషాలు నశిస్తాయి. నవముఖి రుద్రాక్షమంటే కాలభైరవుడు. దీన్ని ఎడమచేతికే ధరించాలి. భుక్తిముక్తిప్రదం. మహాబలవర్ధకం. భ్రూణహత్యాదిదోష నాశకం. సద్యఃఫలదాయకం. దశముఖీరుద్రాక్ష సాక్షాత్తూ జనార్ధనుడు. దీన్ని ధరిస్తే దుష్టగ్రహ భూతప్రేతపిశాచోరగభయాలు అంతరిస్తాయి. ఏకాదశముఖీ రుద్రాక్షమంటే ఏకాదశరుద్రులతో సమానం. దీన్ని శిఖలో ధరించినవాడు వెయ్యి అశ్వమేధాలూ నూరువాజపేయాలూ పదివేల గోదానాలూ చేసిన పుణ్యఫలం పొందుతాడు. ద్వాదశాస్య రుద్రాక్ష దొరికితే ద్వాదశాదిత్యులూ చేతికి అందినట్టే. దీన్ని చెవికి ధరించాలి. ఆశ్వమేధ గోమేధ యజ్ఞఫలం లభిస్తుంది. క్రూరజంతు క్రూరపురుష భయాలు తొలగిపోతాయి. ఆధివ్యాధులు దరికి చేరవు. పదమూడు ముఖాలున్న రుద్రాక్షను ధరించినవాడు సాక్షాత్తూ కార్తికేయుడే అవుతాడు. ఇది సర్వవాంఛాప్రదం. పట్టిందల్లా బంగారమే అవుతుంది. మాతృహత్యాది పాపాలు సైతం తొలగిపోతాయి. పధ్నాలుగు ముఖాలున్న రుద్రాక్ష లభించిందంటే పుణ్యం ఫలించిందన్నమాటే. దాన్ని శిరస్సున ధరించాలి. శివుడితో సమానుడవుతాడు. నారదా! వెయ్యేల! రుద్రాక్షకు సాటివచ్చే పవిత్రవస్తువు ఈ సృష్టిలో లేదు. దేవతలుకూడా పూజిస్తారు. ధరిస్తారు. ఏదో ఒక రుద్రాక్షను నిత్యమూ ధరిస్తే చాలు ఇహపరాలు శుభాస్పదాలవుతాయి. 

ఇరవైయారు రుద్రాక్షలతో శిరోమాలనూ యాభైతో కంఠమాలనూ పదహారుతో బాహుమాలికనూ పన్నెండుతో మణిబంధమాలికనూ తయారుచేనుకుని ధరించాలి. ఇరవైయేడుగానీ యాభైగానీ నూటెనిమిదిగానీ రుద్రాక్షలతో జపమాలను చేసుకోవాలి. వీటిలో అష్టోత్తర శతరుద్రాక్ష జపమాల ఉత్తమోత్తమం. ఈ జపమాలలను ధరించవచ్చు కూడా. క్షణక్షణమూ అశ్వమేధం చేసినంతటి పుణ్యఫలం చేకూరుతుంది - అని సాక్షాత్తూ శివుడు షణ్ముఖుడికి తెలియజేశాడు.

రుద్రాక్షజపమాల




Wearing Rudraksha - రుద్రాక్షధారణ

శ్రీ దేవీ భాగవతం ఏకాదశ స్కంధము - రుద్రాక్షధారణ

మెడలో ముప్ఫయిరెండు రుద్రాక్షలూ, శిరస్సున నలభై, చెవులకి ఆరు ఆరూ, చేతులకు పదిపదీ, భుజాలకి పదహారు పదహారూ, కన్నులకి ఒక్కొక్కటీ, శిఖమీద ఒకటి, వక్షఃస్థలాన ఎనిమిదీ - ధరించాలి. అలా నూటికి పైగా రుద్రాక్షలు ధరించిన మానవుడు సాక్షాత్తూ రుద్రుడే. బంగారం లేదా వెండి తీగచుట్టించి రుద్రాక్షను శిరస్సునగాని మెడలోగానీ చెవినిగానీ ధరించితే చాలామంచిది. యజ్ఞోపవీతానికి ధరించవచ్చు. చేతులకి కట్టుకోవచ్చు. ఎక్కడ ధరించినా నిర్వ్యాజమైన భక్తితో మాత్రమే ధరించాలి. ఆనందంగా ధరించాలి. రుద్రాక్షధారణం శివజ్ఞానసాధనం. శిఖమీద ధరించేటప్పుడు తారతత్త్వాన్ని స్మరించాలి. చెవులకు తగిలించుకునేటప్పుడు శివపార్వతులను భావించాలి. యజ్ఞోపవీతానికయితే వేదాలను ధ్యానించాలి. చేతులకు కట్టుకునేటప్పుడు దశదిశలనూ భావించాలి. మెడలో వేనుకునేవేళ సరస్వతిని అగ్నినీ స్మరించాలి. అన్ని ఆశ్రమాల వారూ అన్ని వర్ణాలవారూ ఈ రుద్రాక్షల్ని ధరించవచ్చు. విప్రుడుమాత్రం మంత్రపూర్వకంగానే ధరించాలి.

రుద్రాక్షలు ధరించినవాడు సాక్షాత్తూ రుద్రుడే అనడంలో సందేహం లేదు. చూడకూడనివి చూసినా వినకూడనివి విన్నా అనకూడనివి అన్నా చెయ్యకూడనివి చేసినా - అన్నిపాపాలూ రుద్రాక్షధారణతో తొలగిపోతాయి. ఇతడు ఏది తింటే అది దేవుడు తిన్నట్టే. ఏది తాగితే అది శివుడు తాగినట్టే. ఏది వాసనచూస్తే అది శివుడు వాసన చూసినట్టే. ఇంత పవిత్రమైన రుద్రాక్షలు ధరించడానికి సిగ్గుపడితే కోటిజన్మలకైనా మోక్షం కలగదు.

రుద్రాక్షలు ధరించినవారిని చూసి పరిహసించేవాడిది సంకరజన్మ అనడంలో సందేహం లేదు. రుద్రాక్షలు ధరించడంవల్లనే రుద్రుడికి రుద్రత్వం బ్రహ్మకు బ్రహ్మత్వం మునులకు సత్యసంకల్పత్వం సిద్ధిస్తున్నాయి. రుద్రాక్షధారణకన్నా పవిత్రకార్యం మరొకటిలేదు. కనక ఇవి ధరించినవారికి భక్తితో ఏది దానం చేసినా దాత సర్వపాపవిముక్తుడై శివసాయుజ్యం పొందుతాడు. శ్రాద్ధకాలంలో రుద్రాక్షధారిని భోక్తగా పెట్టుకుంటే పితృదేవతలు సంతోషిస్తారు. రుద్రాక్షధారుల కాళ్ళు కడిగి శిరసున జల్లుకున్నా లోపలికి పుచ్చుకున్నా పాపవిముక్తి శివలోకసంప్రాప్తీ ఖాయం. రుద్రాక్షను పొదిగిన ఏ ఆభరణాన్ని ధరించినా చాలు. సిగ్గుపడుతూ పైకి కనిపించనియకుండా ధరించినా ఫరవాలేదు. సమంత్రకంగానో అమంత్రకంగానో ఎలాగో ఒకలాగా ధరిస్తే చాలు. పాపవిముక్తీ జ్ఞానప్రాప్తి నిశ్చయంగా కలుగుతాయి. రుద్రాక్షల మహిమను వర్ణించి చెప్పడం ఎవరివల్లా కాదు. ధరించవలసిందే, అనుభవంతో తెలుసుకోవలసిందే.

రుద్రాక్షలు - భేదాలు




Aachamanaadhikam - ఆచమనాదికం

శ్రీ దేవీ భాగవతం ఏకాదశ స్కంధము - ఆచమనాదికం

నారదా! శుద్ధమూ స్మార్తమూ పౌరాణమూ వైదికమూ తాంత్రికమూ శ్రౌతమూ ఆని ఆచమనం ఆరువిధాలు. మలమూత్రశౌచం తరవాత చెయ్యవలసినది శుద్ధాచమనం. ఆచాంతంలో (వైదికవిధుల్లో) స్మార్త పౌరాణికాచమనాలూ బ్రహ్మయజ్ఞాదుల్లో శ్రౌతవైద్దికాచమనాలూ ఆస్త్రవిద్యాదిసమయాల్లో తాంత్రికాచమనమూ చెయ్యాలి.

ఆచమించిన తరవాత ఓంకార గాయత్రిని జపిస్తూ శిఖను ముడివేసుకోవాలి. పునరాచమనం చేసి గుండెలనూ చేతులనూ బుజాలనూ మార్జించుకోవాలి. తుమ్మడం ఉమ్మడం పళ్ళుకుట్టుకోవడం అసత్యమాడటం పతితులతో సంభాషించడం - ఇలాంటివి చేసినప్పుడు కుడిచెవ్విని స్పృశించుకోవాలి, అగ్ని జల వాయుదేవతలూ సూర్యచంద్రులూ చతుర్వేదాలూ బ్రాహ్మణుడి కుడిచెవిలో ఉంటాయి.

అటుపైని నదికో నూతికో చెరువుకో వెళ్ళి ప్రాతఃస్నానం చెయ్యాలి. శరీరాన్ని పరిశుభ్రపరచుకోవాలి. నవద్యారాల్లోనూ మలినం ఉంటుంది. తోముకుని కడిగి శుభ్రపరచాలి. అగమ్యాగమన - ప్రతిగ్రహ - రహస్యాచరిత పాపాలన్నీ స్నానంతో ప్రక్షాళితమవుతాయి. స్నానం చెయ్యకుండా ఆచరించే సత్కర్మలన్నీ నిష్ఫలమవుతాయి. కనక నిత్యమూ ప్రాతఃస్నానం చెయ్యాలి. అదీ దర్భలు చేతబట్టుకునే చెయ్యాలి. హోమకాలం దాటిపోకుండా ప్రాతఃస్నానం ముగించుకోవాలి. స్నానంకాగానే సంధ్యావందనమాచరించాలి. ఏడురోజులపాటు ప్రాతఃస్నానం చెయ్యకపోయినా, మూడురోజులు సంధ్యవార్చకపోయినా, పన్నెండు రోజులు అగ్నికార్యం ఎగ్గొట్టినా ద్విజుడు కులభ్రష్టుడవుతాడు.

నారదా! గాయత్రికన్నా గొప్పమంత్రం ఇహపరాలలో ఎక్కడా లేదు. గానం చేసేవాడిని (జపించేవాడిని) కాపాడుతుంది. కనక గాయత్రి - అన్నారు.

ముమ్మారు ప్రాణాయామం చేసి ప్రణవాక్షర సహితంగా వ్యాహృతిత్రయ సమన్వితంగా (భూర్భువస్స్వః) గాయత్రీమంత్రాన్ని జపించాలి. స్వధర్మనిరతుడూ శ్రుతిసంపన్నుడూ అయిన బ్రాహ్మణుడు వైదికగాయత్రినే జపించాలి తప్ప లౌకికమంత్రాన్ని (వ్యాహృతిరహితం) జపించకూడదు. మంత్రజపంతో కలిపి ప్రాణాయామంచేస్తే అది సగర్భమవుతుంది. ఆమంత్రకంగా ధ్యానమాత్రంగా చేస్తే అగర్భమంటారు. స్నానాంగంగానే దేవ ఋషి పితృతర్పణాలు పూర్తిచేసి గట్టుకి వచ్చి శుభ్రవస్త్రాలు ధరించాలి. అప్పుడూ - విభూతి ధారణ, రుద్రాక్షధారణ. ఇదే వరసలో చెయ్యాలి.

రుద్రాక్షధారణ




Souchakriya - శౌచక్రియ

శ్రీ దేవీ భాగవతం ఏకాదశ స్కంధము - శౌచక్రియ

నారదా! వేదాలూ వేదాంగాలూ వల్లించినా ఆచారహీనుడైతే అతడిని అవి ఏవీ కాపాడవు. మృత్యుకాలంలో వదిలేస్తాయి. రెక్కలు వచ్చిన పక్షులు గూడును విడిచినట్లు వెళ్ళిపోతాయి. కనక ఎంతటి పండితుడైనా సరే బ్రాహ్మాముహూర్తంలో(రాత్రి చివరిజాములో) లేవాలి. వేదాధ్యయనం చెయ్యాలి. కొంతసేపు ఇష్టదేవతను ధ్యానించాలి. యోగి అయినట్టయితే ప్రాణాయామాదికం నిర్వహించాలి. జీవుబ్రహ్మైకతను సాధించాలి. ఆ క్షణంలోనే జీవన్ముక్తుడవుతాడు.

రాత్రివేళలో చివరి యాభై అయిదు ఘటికలు ఉషఃకాలం. యాభై ఏడు ఘటికలు అరుణోదయం. యాభై ఎనిమిది ఘటికలు ప్రాతఃకాలం, అటుపైని ఆరవై ఘటికలకు సూర్యోదయం. (సూర్యోదయం నుంచి సూర్యోదయానికి అరవై ఘటికలు). ప్రాతఃకాలంలో బ్రాహ్మణుడు కాలకృత్యాలు తీర్చుకోవాలి. అందుకోసం నైఋతిదిశగా అమ్మువేటు దూరం వెళ్ళాలి. (బాణం వేసినంత దూరం). బ్రహ్మచారి అయితే ఆ సమయంలో యజ్ఞోపవీతాన్ని చెవికి తగిలించుకోవాలి. గృహస్థుగానీ వానప్రస్థుడుగానీ అయితే నివీతంగా వెనక్కి వేసుకోవాలి. (వీపుమీద దండలా వేలాడేసుకోవాలి). నేలమీద గడ్డిపరకలు ఒత్తుగా కప్పి నెత్తిమీద అంగవస్త్రం వేసుకుని మౌనం పాటిస్తూ ఉమ్ములు వెయ్యకుండా శ్వాసను నియంత్రించి (ముక్కకుండా) మల మూత్ర విసర్జన చెయ్యాలి. దున్నిననేలమీదగానీ నీళ్ళల్లోగానీ చితిలోగానీ పర్వతాలమీదగానీ పాడుపడిన గుడులలోగానీ పుట్టల మీదగానీ పచ్చికబయళ్ళలోగానీ ఈ విసర్జనలు చెయ్యకూడదు. అలాగే ప్రాణులమిదా గుంటలలోనూ నడదారులలోనూ చెయ్యరాదు. నిలబడి విసర్జించకూడదు.

నారదా! సంధ్యావందన సమయాల్లోనూ భోజన సమయంలోనూ పళ్ళుతోముకుంటున్నప్పుడూ పితృకార్యం చేస్తున్నప్పుడూ దైవకార్యం చేస్తున్నప్పూడూ మలమూత్ర విసర్జనల్లోనూ సంభోగసమయంలోనూ గరుసన్నిధిలోనూ యజ్ఞయాగాదుల్లోనూ దానాలు చేస్తున్నవేళల్లోనూ బ్రాహ్మణుడు మాట్లాడకూడదు. మౌనంగా ఆ పనుల్ని నిర్వహించాలి.

బహిర్భూమికి కూర్చోబోయేముందు - దేవతలారా! ఋషులారా! పిశాచోరగరాక్షసులారా! కంటికి కనిపించని ప్రాణులారా! ఇక్కడనుంచి తొలగిపాండి. నేను మలమూత్రవిసర్జన చేస్తున్నాను - అని ప్రకటించాలి. తొలగిపామ్మని ప్రార్థించాలి.

వాయువు అగ్ని విప్రుడు సూర్యుడు జలాశయం గోవులు - వీటిని చూస్తూగానీ వీటి ఎదుటగానీ విసర్జన చెయ్యకూడదు. పగటి వేళలో అయితే ఉత్తరముఖంగానూ రాత్రివేళలో అయితే దక్షిణముఖంగానూ కూర్చుని విసర్జించాలి. విసర్జించాక వాటిమీద మట్టిగానీ ఎండుటాకులుగానీ గడ్డీగాదమూగానీ కప్పాలి. మూత్రం చుక్కలు దారిపాడుగునా పడకుండా తగిన జాగ్రత్త తీసుకుని (ఎత్తిపట్టుకొని) నీళ్ళ దగ్గరకు వెళ్ళాలి. చెంబుతో నీళ్ళు ముంచి తీసుకుని వేరేచోటుకి వెళ్ళి కడుక్కోవాలి. మట్టిరాసుకుని కడుక్కోవాలి. గట్టున ఉండే శ్వేత - రక్త - కృష్ణ - పీతవర్ణ మృత్తికలు పనికివస్తాయి. బ్రాహ్మణుడు తెల్లమట్టినే ఉపయోగించాలి. మిగతా వారికి ఏదైనా ఫరవాలేదు. తెల్లమన్ను దొరకనప్పుడు దొరికిన మట్టినే బ్రాహ్మణుడూ ఉపయోగించాలి. మట్టితో రుద్దుకోనిదే శుద్దికాదు. అయితే నీళ్ళల్లోనుంచిగానీ గుడినుంచిగావీ పుట్టనుంచి గానీ ఎలకల కలుగుల్నించిగానీ శౌచవిధికోసం మట్టిని తియ్యరాదు. ఒకరు ఉపయోగించగా మిగిలిన మట్టి సుతరామూ పనికిరాదు.

మూత్ర విసర్జనకన్నా రెండురెట్టు మలవిసర్జనకూ, మూడురెట్లు మైథునానికీ మృత్తికా శౌచం చేసుకోవాలి. లింగానికి ఒకటీ చేతికి మూడూ కాళ్ళు రెండింటికీ రెండూ మట్టిముద్దలు పులుముకోవాలి. ఇది మూత్రశౌచం. మలవిసర్జన శౌచానికి రెట్టింపు. లింగదేశంలో రెండూ గుదప్రదేశంలో అయిదూ చేతికి పదీ కాళ్ళు రెండింటికీ కలిపి ఏడూ మట్టిముద్దలు అవసరమవుతాయి. ముందుగా ఎడమపాదానికీ తరవాత కుడిపాదానికీ మృత్తికను పులుముకోవాలి. శౌచక్రమం ఇది. గృహస్థులకన్నా రెట్టింపు బ్రహ్మచారులకూ మూడురెట్లు వానప్రస్థులకూ నాలుగురెట్లు యతీశ్వరులకూ ఈ శౌచం అధికంగా అవసరం. ఒక్కొక్క మట్టిముద్దా కనీసం రాచ ఉసిరికాయంత ఉండాలి. ఎప్పటికప్పుడు ఒక్కొక్క ముద్దగానే తీసుకోవాలి. (ఒకేసారి పెద్దమట్టిముద్దను తీసేసుకుని చిన్నఉండలు చేసి పులుముకోకూడదని)

పగటిపూట అయితే ఇంత శౌచమూ చేసుకోవాలి. రాత్రిపూట ఇందులో సగం, ఆతురుడైతే ఇంతకన్నా సగం, మార్గమధ్యంలో అయితే అంతకన్నా సగమూ శౌచం పాటిస్తే సరిపోతుంది. అశక్తులూ బాలబాలికల విషయంలో మరింత మినహాయింపు ఉంది. మలమూత్రాల దుర్వాసన తొలగిపోయేట్టుగా మట్టి పులుముకుని ప్రక్షాళన చేసుకుంటే చాలు. ఇది అన్ని వర్గాలవారికీ వర్తించే శౌచవిధి అని మనువు చెప్పాడు.

శౌచక్రియ ఎప్పుడూ ఎడమచేతితోనే చెయ్యాలి. కుడిచెయ్యిని ఉపయోగించకూడదు. శరీరంలో బొడ్డుకి క్రిందిభాగాన శుద్దిచెయ్యవలసివచ్చినప్పుడు ఎడమచెేతినీ, బొడ్డుకి పై భాగాన్నయితే కుడిచేతిని ఉపయోగించాలని నియమం.

మలమూత్ర విసర్జన చేసే చోటుకి జలపూర్ణపాత్రను తీసుకువెళ్ళకూడదు. తెలియక అలా తీసుకువెడితే ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. కేవలం నీళ్ళుతాగి మూడురాత్రులు పస్తులుండి తరువాత జపం చెయ్యాలి. ఆలాగని శౌచకర్మకు ఆలస్యం చెయ్యకూడదు. దేశం కాలం ద్రవ్యం శక్తి ఉపపత్తి - వీటిని చూసుకుంటూ శౌచం జరుపుకోవాలి.

మలవిసర్జనకు పన్నెండుసార్లూ మూత్రవిసర్జనకు నాలుగుసార్లూ తగ్గకుండా నీటిని గండూషించాలి. పుక్కిలించిన నీటిని తలవంచి ఎడమవైపుకి ఉమియాలి. అటుపైని ఆచమించి శ్రద్దగా దంతధావనం చేసుకోవాలి. ముళ్ళుండి పాలుగారే చెట్టునుంచి పన్నెండు అంగుళాలు పొడుగుండేట్టు చూసి పుల్లను విరుచుకోవాలి. చిటికెన వేలంత లావుండాలి. ఒక కొసని కుచ్చులాగా నలగగొట్టిగానీ నమిలిగానీ పళ్ళు శుభ్రంగా తోముకోవాలి. కడిమి - బర్రింక - మామిడి - మేడి - బొద్దుగ - వేప - రేగు పుల్లలు ప్రశస్తం. పుల్లను విరుచుకునేటప్పుడు చెట్టును అన్నాద్యాయ మంత్రంతో ఇలా ప్రార్థించాలి - నా అదృష్ట విశేషంవల్ల ఓషధీపతి చంద్రుడు వచ్చాడు. నా ముఖం కడుగుతున్నాడు. ఓ వనస్పతీ! ఆయుర్దాయం బలం యశస్సు వర్చస్సు సంతానం పశుసంపద ధనసంపద బ్రహ్మజ్ఞానం మేధాశక్తి నాకు కలిగించు.

అన్నాద్యాయ వ్యూహధ్వంసే సోమో రాజాయమాగమత్‌ ।
స మే ముఖం ప్రక్షాళ్యతే యశపా చ భగేవ చ ॥

ఆయుర్బలం యశో వర్చః ప్రజాః పశువసూని చ

బ్రహ్మప్రజ్ఞాం చ మేధాం చ త్వం నో దేహి వనస్పతే ॥

దంతకాష్ఠం దొరకనప్పుడుగానీ, దంతధావనం చేసుకోరాని రోజుల్లోగానీ నీటిని పన్నెండుసార్లు గండూషించాలి. బాగా పుక్కిలించి ఉమియాలి. పాడ్యమి అమావాస్య (దర్శ) షష్ఠి నవమి ఏకాదశి రవి వారాల్లో దంతాలకు పుల్ల తగిలించకూడదు. ఏడుతరాలు నశిస్తాయి.

దంతధావనమయ్యాక నోరు పుక్కిలించి కాళ్ళు కడుక్కుని పరిశుభ్రజలాన్ని ముమ్మారు ఆచమించాలి. తడి బొటనవేలూ చూపుడువేళ్ళతో రెండుసార్లు నాసికాపుటాలను తుడుచుకోవాలి. అంగుష్ఠానామికలతో కళ్ళూ చెవులూ తుడుచుకోవాలి. అంగుష్ఠకనిష్ఠికలతో బొడ్డు తుడుచుకోవాలి. తడి అరచేతితో గుండెమీదా తడివేళ్ళతో శిరస్సుమీదా మార్జనం చేసుకోవాలి.

ఆచమనాదికం




Pranayama - ప్రాణాయామం

శ్రీ దేవీ భాగవతం ఏకాదశ స్కంధము - ప్రాణాయామం

ఈ ప్రాణాయామం సధూమ - విధూమ, సగర్భ - అగర్భ, సలక్ష్య - అలక్ష్య భేదాలతో ఆరువిధాలు. ప్రాణాయామంతో సమానమైన యోగం ప్రాణాయామమే తప్ప మరొకటి లేదు. రేచక పూరక కుంభకాలు కలిపి ఒక ప్రాణాయామం.

రేచక పూరక కుంభకాలు వర్ణత్రయాత్మకాలు. ఇవ్వికలిస్తే ప్రణవాక్షరం ఏర్పడుతుంది. (అ + ఉ + మ్‌) కాబట్టి ప్రాణాయామం ప్రణవమయం. ఇడానాడిద్వారా వాయువును పీల్చాలి. ఇది రేచకం. దాన్ని ఉదరంలో(ఊపిరి తిత్తులలో) నిలపాలి. ఇది పూరకం. పింగళానాడి ద్వారా మెల్లగా షోడశమాత్రాకాలంలో నిశ్వసించాలి. ఇది కుంభకం. ఇది సధూమ ప్రాణాయామం.

ఆధారం - లింగం - నాభి - హృదయం - తాలుమూలం - ఫాలభాగం - వీటిలో వరసగా రెండూ పదహారూ ఇరవై పదీ ఆరూ నాలుగూ దళాలున్న పద్మాలను లిఖించాలి. నాసాంతంలోనూ ఫాలమధ్యంలోనూ డ - ఫ - క - ఠ వర్ణాలను రచించాలి. అచ్చులను కంఠప్రదేశంలో పొందుపరచాలి. హం - క్షం అనే తత్త్వార్థయుక్త వర్ణాలను సర్వత్రా ఉంచాలి. ఇలాగ వర్ణమూర్తిని భావించి నమస్కరించాలి. వర్ణస్వరూపిణిని ధ్యానించాలి. ఆ దేవి అరుణకమలవాసిని. పుప్పాడి లాంటి రంగు. హరుడిచే నియమింపబడిన చిహ్నాలు ధరించి ఉంటుంది. ఆవిడ రూపం - బిసతంతు తనీయసి - తామరతూడులోపలి దారంలాగా సన్నగా ఉంటుంది. సూర్యుడా అగ్నిదేవుడా పున్నమిచంద్రుడా అనిపించే ముఖం. ఉన్నతమైన వక్షోజాలు ఈ దేవీరూపం హృదయంలో ఒక్కసారి నిలిస్తే చాలు - అతడు ముక్తుడే.

ఓదేవీ! నా పనులన్నీ నీ అర్చనలే. నా స్థితి - నీ స్థితి. నాగతి - తీర్థయాత్ర. నా మతి - నీ చింతన. నా వాక్కు - నీ స్తుతి. నేను సర్వాత్మకుడను. దేవుడను. నా దినచర్య అంతా నీ సమర్చనమే. దేవీ! నేను నువ్వే. ఇతరుడను కాను. నేనే బ్రహ్మను. శోకవిదూరుడను. సచ్చిదానందరూపుడను - అని ఆత్మానుసంధానం చేసుకోవాలి. (బ్రహ్మైక్యానుసంధానం). ప్రథమ ప్రయాణంలో ప్రకాశమానయై, ప్రతిప్రయాణంలో అమృతాయమానయై అంతఃపదవిలో అనుసంచరించే ఆనందరూపిణి అబలను శరణువేడుతున్నాను - అని ప్రార్థించాలి. అటుపైని బ్రహ్మరంధ్రంలో గురువును ధ్యానించాలి.

సకలోపచారాలతోనూ యథావిధిగా మానసపూజ చెయ్యాలి. నియతాత్ముడై సాధకుడు ప్రాతఃకాలంలో బ్రాహ్మీముహూర్తాన చెయ్యవలసిన ప్రాణాయామ ధ్యాన మానసిక పూజావిధానమిది.

శౌచక్రియ




Sadhaachaara Niruupana - సదాచార నిరూపణ

శ్రీ దేవీ భాగవతం ఏకాదశ స్కంధము - సదాచార నిరూపణ

నారదా! అడగవలసింది అడిగావు. సదాచారాన్ని అనుష్ఠిస్తే చాలు దేవి సంతోషిస్తుంది. తెల్లవారి లేచింది మొదలుకొని పడుకునే వరకూ సజ్జనులు చెయ్యవలసిన దినచర్య ఏమిటో చెబుతాను. విను, సూర్యోదయంనుంచి సూర్యాస్తమయంవరకూ పుట్టింది మొదలు గిట్టేవరకూ సత్కర్మలే ఆచరించాలి. నిత్యకర్మలూ నైమిత్తిక కర్మలూ కామ్యకర్మలూ ఉంటాయి. వీటిని శ్రద్ధగా చెయ్యాలి. నింద్యకర్మల జోలికి పోకూడదు. జీవికి కడదాకా సహాయంగా నిలిచేది ధర్మమొక్కటే. తల్లిదండ్రులుగానీ భార్యాపుత్రులుగానీ జ్ఞాతిమిత్రులుగానీ ఎవ్వరూ నిలవరు. తాను ఆచరించిన ధర్మమే తనకు సహాయకారి.

అందుచేత సాధనాలన్నింటినీ ఉపయోగించుకుని ధర్మాన్ని సమకూర్చుకోవాలి. అదే చీకటినుంచి వెలుగులోకి నడిపిస్తుంది. ఆచారమే ఉత్తమోత్తమ ధర్మం. ఆది ఆయుర్వర్ధకం, వంశవర్ధకం, సంపద్వర్థకం, పాపనాశకం, శుభప్రదం. ఆచారాన్ని మించిన ధర్మం లేదు. ఇహపరాలలో సుఖప్రదం. ఆజ్ఞానులై సంసారసాగరంలో కొట్టుమిట్టాడేవారికి ఇది ధర్మద్వీపం. ముక్తిమార్గప్రదర్శకం. ఆచారంవల్ల శ్రేష్ఠత లభిస్తుంది. ఆచారంవల్ల కర్మఫలిస్తుంది. దానివల్ల జ్ఞానం లభిస్తుంది. ఇది మనువు చెప్పిన వాక్యం. ఆచారమంటే ధర్మాలలోకెల్లా ఉత్తమోత్తమం. పరమతపస్సు. జ్ఞానాదిసర్వవిషయాలకూ అదే సాధకం.

శాస్త్రీయమనీ లౌకికమనీ ఈ ఆచారం రెండు విధాలు. రెండూ అనుష్టింపదగినవే, దేనినీ పరిత్యజించడానికి వీలులేదు. గ్రామ జాతి దేశ కులధర్మాలుంటాయి. వాటిని పాటించాలి ఉల్లంఘించకూడదు. దురాచారుణ్ణి లోకం నిందిస్తుంది. వాడు దుఃఖభాజనుడవుతాడు. వ్యాధి పీడితుడవుతాడు. ధర్మవిరుద్ధమైన అర్థకామాలను పరిత్యజించాలి. అలాగే లోకవిరుద్ధమైన ధర్మాన్నీ పరిత్యజించాలి. అది సుఖప్రదం కాదు కనక.

నారాయణమహర్షీ! మనకు శాస్త్రాలు అనేకం ఉన్నాయి. ధర్మమార్గాన్ని నిర్ణయించడంలో దేన్ని ప్రమాణంగా తీసుకోవాలి అనేది పెద్ద సందేహం.

నారదా! సందేహం ఏమీ లేదు. శ్రుతి స్మృతులు రెండూ రెండు కళ్ళు. పురాణమే హృదయం. ఇవి మూడూ చెప్పినదే ధర్మం. మరోటి కాదు. ఈ మూడింటిలోనూ పరస్పరవిరోధం కనిపిస్తే అక్కడ వేదానిదే తుది తీర్పు. స్మృతి పురాణాలకన్నా వేదం చెప్పినదే ప్రమాణం. వేదంలోనే ద్వైధీభావం కనిపిస్తే అప్పుడు అవి రెండూ ధర్మాలుగానే పరిగణించాలి. స్మృతులలో 
ద్వైధీభావం కనిపించినా ఇంతే. వేదంతో సరిచూసుకోవాలి. కొన్నిచోట్ల పురాణాలలోనూ తంత్ర గ్రంథాలలోనూ కనిపించేవాటి నికూడా యథాతథంగా ధర్మాలుగా స్వీకరించాలని కొందరు అంటున్నారు. కానీ అది సరికాదు. వేదవిరుద్ధం కానంతవరకే పురాణాలుగాని తంత్రగ్రంథాలుగానీ ప్రామాణికాలు. ప్రత్యక్షంగా శ్రుతివిరుద్ధమైన ధర్మం ఎవరు చెప్పినా అప్రామాణికమే. ధర్మమార్గ నిర్ణయంలో సర్వదా సర్వథా వేదమొక్కటే పరమప్రమాణం. దానికి అవిరుద్ధంగా ఉంటే స్మృతులూ పురాణాలూ తంత్ర గ్రంథాలూ చెప్పినవికూడా కొండొకచో ప్రామాణికాలు అవుతాయి. మరింకేదీ ప్రామాణికం కానేకాదు.

వేదధర్మాన్ని కాదని ఇతర ప్రమాణాలను పట్టుకుని ఆ మార్గాల్లో నడిచేవారికోసం యమలోకంలో నరకకుండాలు సిద్ధంగా ఉన్నాయి. అందుచేత వేదోక్తమే ధర్మం. దానినే ప్రయత్నపూర్వకంగా ఆచరించాలి. స్మృతులూ పురాణాలూ తంత్రాలూ శాస్త్రాలూ ఏది చెప్పినా వేదమూలమైనంతవరకే ప్రామాణికం. కొందరు ఏవేవో కుశాస్త్రాలను ప్రమాణాలుగా చూపించి ప్రజలను తప్పుదారి పట్టిస్తుంటారు. అటువంటివారు నరకానికి పోతారు. అక్కడ తలక్రిందులుగా వేలాడతారు. వేదవిరుద్ధమైన ధర్మాలను ఆచరించే వామాచారులూ పాశుపతులూ లింగధారులూ తప్తముద్రాంకితులైన వైఖానసులూ వగైరా అందరూ నరకలోకానిక పోతారు. అందుచేత వేదం ఒప్పుకున్నదే సద్ధర్మం. దానినే ఆచరించాలి. మరింక దేనిని అనుసరించినా నరకమే.

నారదా! మానవుడు పడుకోబోయేముందు ఆ రోజంతా తాను చేసినదీ చేయించినదీ, అన్నదీ అనిపించినదీ, ఇచ్చినదీ ఇప్పించినదీ ఒక్కసారి సమీక్షించుకోవాలి. ధర్మబద్ధంగా ఉన్నాయా లేదా పరీక్షించుకోవాలి. ధర్మబద్ధం కాని పనుల్ని మరుసటిరోజునుంచే పరిత్యజించాలి. నిద్రఅయ్యాక తెల్లవారు జామునే లేచి బ్రహ్మధ్యానం చెయ్యాలి. తొడల మీదకి కుడిఎడమలుగా అరికాళ్ళు పైకి వచ్చేట్టు బాసింపీట వేసుకుని కొంచెం ఎత్తయినచోట కూర్చోవాలి. నడుం నిటారుగా నిలబెట్టి వక్షస్సును నిగిడించాలి. కన్నులు మూసుకోవాలి. మనస్సును నిర్మలంగా ఉంచుకోవాలి. దంతాలను తాటించకూడదు. నాలుకను ఆడించకూడదు. ఇంద్రియాలను నిరోధించాలి. ఇలా కూర్చుని రెండుమూడుసార్లు ప్రాణాయామం చెయ్యాలి. హృదయంలో దీపంలాగా ఇష్టదైవాన్ని ధ్యానించాలి.

ప్రాణాయామం




Bhramaridevi Vruthantham - భ్రామరీదేవి వృత్తాంతం

శ్రీ దేవీ భాగవతం దశమ స్కంధము - భ్రామరీదేవి వృత్తాంతం

జగజ్జనని చేష్టలు చిత్రవిచిత్రంగా ఉంటాయి. అచింత్య అవ్యక్తరూపకదా! అన్నీ జగత్కల్యాణ కారకాలే. లోకమంటే నిర్వ్యాజమైన ప్రేమ. కన్నతల్లిగదా! బిడ్డలమీద ప్రేమకాక ఏముంటుంది!

యద్యచ్చరితం శ్రీదేవ్యాస్తత్సర్వం లోకహేతవే
 ।
నిర్వ్యాజయా కరుణయా పుత్రే మాతుర్యథా తథా ॥

పూర్వకాలాన పాతాళంలో అరుణుడు అని ఒక మహాదైత్యుడు ఉండేవాడు. దేవద్వేషి మహాబలుడు. మహాఖలుడు, దేవతలను జయించాలనే కోరికతో వాడు హిమవత్పర్వతానికి వెళ్ళి బ్రహ్మదేవుణ్ణి ఉద్దేశించి తీవ్రతపస్సుచేశాడు. గంగాతీరంలో పండుటాకులు తింటూ యోగమార్గాన గాయత్రీ మహామంత్రాన్ని జపిస్తూ తపస్సు చేశాడు. వాడి శరీరంనుంచి బయల్వెడలిన తపోగ్ని జగత్తుని దహించివేయనారంభించింది. అది ఏమిటో తెలియక దేవతలూ మానవులూ గగ్గోలు పెట్టారు. బ్రహ్మను శరణువేడారు. ఆయన గాయత్రీసహితుడై హంసను అధిరోహించి హిమాలయానికి వచ్చాడు. ప్రాణమాత్రావశిష్టుడై రెండవ ఆగ్నిదేవుడిలా వెలిగిపోతున్న అరుణదైత్యుణ్ణి చూశాడు. వత్సా! వరం కోరుకో అన్నాడు. ఈ మాటలు వినపడటంతోనే అమృతం చిలికినట్టయ్యింది. అరుణుడు సాష్టాంగపడ్డాడు. ఇద్దరినీ భక్తిప్రపత్తులతో స్తుతించాడు. మరణం లేకుండా వరం ఇమ్మన్నాడు.

అరుణా! హరిహరాదిదేవనాయకులు సైతం మృత్యూవుకి అతీతులు కారు. నాకూ మరణం ఉంది. ఇక ఇతరులమాట చెప్పాలా! కనక, దానవోత్తమా! యోగ్యమైన వరం కోరుకో ఇస్తాను. ఇవ్వడానికి శక్యమైనది అడుగు. అంతేగానీ అలవిగానివి అడిగి పంతానికి పోకు. అది బుద్దిమంతుల లక్షణం కాదు.

అయితే చతుర్ముఖా! యుద్దంలోగానీ మరొకచోటగానీ శస్త్రాస్త్రాలతోగానీ పురుషులతోగానీ స్త్రీలతోగానీ ద్విపాత్తులతోగానీ చతుష్పాత్తులతోగానీ రెండూ కలిసిన వాటితోగానీ నాకు మృత్యువులేకుండా వరం అనుగ్రహించు. దేవతలను జయించడానికి కావలసిన బలం ఇయ్యి.

బ్రహ్మదేవుడు తథాస్తు అన్నాడు. హంసవాహనం కదిలింది. వెళ్ళిపోయాడు. అరుణుడు పాతాళం చేరుకున్నాడు. దైత్యులనందరినీ సమావేశపరిచాడు. బ్రహ్మదేవుడిచ్చిన వరంగురించి చెప్పాడు. వెంటనే అమరావతిమీదకి దండువెళ్ళాలి అన్నాడు. యుద్ధవార్తను తెలియపరిచిరమ్మని ఇంద్రుడి దగ్గరికి దూతను పంపాడు. దేవేంద్రుడు గడగడలాడాడు. దేవతలను తీసుకుని బ్రహ్మదేవుడి సన్నిధికి పరుగుతీశాడు. విష్ణుమూర్తిని కలుపుకుని అందరూ శివుడి మందిరానికి వెళ్ళారు. అరుణాదిదైత్యులను సంహరించడమెలాగా అని విచారణ చేశారు.

అంతలోనే అరుణుడు స్వర్గలోకాన్ని ఆక్రమించాడు. సూర్యచంద్రులనూ దిక్పాలకులనూ తోసిరాజన్నాడు. తానే అన్ని రూపాలూ ధరించి ఆయా పదవులు అధిష్టించాడు. దిక్కుతోచని దిక్పాలకులు శివుడి సన్నిధికి చేరుకున్నారు. పరిస్థితి విషమించిందని మొరపెట్టుకున్నారు.

దేవనాయకులందరూ తలలు పట్టుకున్నారు. బ్రహ్మదేవుడిచ్చిన వరం ఇంతచేసిందని లోపల లోపల పిసుక్కున్నారు. ఏమి చెయ్యడానికీ తోచలేదు. ఆరుణుడి విజృంభణకు అడ్డుకట్ట చేసితీరాలి. ఎలాగ? ఎలాగ?

సరిగ్గా అదే సమయానికి ఆశరీరవాణి వినిపించింది. జగన్మాతను ఆశ్రయించండి. మీపని నెరవేరుతుంది. అరుణుడు గాయత్రీ జపతత్పరుడు. ఆ మంత్రజపాన్ని వాడు విడిచిపెడితే చాలు మృత్యుయోగ్యుడవుతాడు. ఈ మాటలతో దేవతలకు ఒకదారి దొరికినట్టనిపించింది. వెంటనే ఇంద్రుడు బృహస్పతిని ఆహ్వానించాడు. అరుణుడి దగ్గరికి వెళ్ళమన్నాడు. వాడు గాయత్రిని విడిచిపెట్టేట్టు ఎలాగోలాగా చెయ్యమన్నాడు. ఇది దేవకార్యం. నీకు తప్పదన్నాడు. ఈలోగా మేమందరమూ భువనేశ్వరిని ఉపాసిస్తాం, అనుగ్రహం సంపాదిస్తాం. నీ కర్తవ్యం తేలిక అవుతుంది - అని చెప్పి దేవగురువును పంపించాడు. ఆయన అటువెళ్ళగానే దేవతలందరూ సుస్నాతులై జాంబూనదేశ్వరిని ఉపాసించారు. మాయాబీజాక్షర సహితంగా మహామంత్రాన్ని జపిస్తూ దేవీయజ్ఞాలు నిర్వహించారు.

బృహస్పతి అరుణుడి దగ్గరికి వెళ్ళాడు. అతడు గద్దించి ప్రశ్నించాడు. బృహస్పతీ! ఎక్కడినుంచి రాక! ఇక్కడికి ఎందుకు వచ్చావు? నేను మీవాణ్ణి కాదు. పైగా శత్రువును.

దైత్యనాయకా! ఇదేమిటి ఇలా మాట్లాడుతున్నావ్‌? నువ్వు మావాడివి కాకపోవడమేమిటి? మేము ఉపాసించే దేవినే నువ్వూ నిత్యం ఉపాసిస్తున్నావు. మరి పరాయివాడవెలా అవుతావు? దేవపక్షపాతివే. సందేహం లేదు.

బృహస్పతి మాటలకు అరుణుడు హుంకరించాడు. దేవతలు ఉపాసించే దేవిని నేను ఆరాధించడమేమిటి. దేవద్వేషినికదా! కూడదుగాక కూడదు అనుకున్నాడు. దురభిమానానికి పోయాడు. ఆ క్షణంలోనే గాయత్రీమంత్రాన్ని విడిచి పెట్టేశాడు. అంతే - నిస్తేజస్కుడైపోయాడు. బృహస్పతి గమనించాడు, పని జరిగిపోయిందని సంబరపడుతూ నిర్గమించాడు. ఇంద్రుడికి సమాచారం అందించాడు. దేవతలంతా సంతోషించారు. పరమేశ్వరిని మరింత దీక్షగా ఉపాసించారు. ఎట్టకేలకు జగన్మాత సాక్షాత్కరించింది.

జగన్మంగళకారిణి, కోటిసూర్యప్రతీకాశ, కోటికందర్పసుందర, చిత్రానులేపన, విచిత్రవస్త్రద్వయ విభూషిత, విచిత్ర మాల్యాభరణ, చిత్రభ్రమరముష్టిక, వరాభయకర, శాంత, కరుణామృతసాగర, నానాభ్రమర సంయుక్త పుష్పమాలావిరాజిత. చిత్రవిచిత్రమైన అసంఖ్యాక భ్రమరీగణంతో (ఆడుతుమ్మెదల గుంపు) పరివృత. వాటి ఝంకారాలు హ్రీం బీజాక్షరధ్వనులుగా నిరంతరం వినిపిస్తున్నాయి. కోటానుకోట్లుగా తుమ్మెదలు తిరుగాడుతున్నాయి.

సర్వశృంగారవేషాఢ్య, సర్వవేదప్రశంసిత, సర్వాత్మిక, సర్వమయి, సర్వమంగళరూపిణి, సర్వజ్ఞ, సర్వజనని, సర్వేశ్వరి, శివ ఈ జగదంబికను చూడటంతోనే బ్రహ్మాదిదేవతలు సాష్టాంగదండ ప్రణామాలు చేశారు. అత్యద్భుతంగా స్తుతించారు.

అప్పటివరకూ అమ్మవారి ఒక గుప్పిడ మూసిఉంది. అందులో గండుతుమ్మెదలున్నాయి (విచిత్రభ్రమరముష్టిక). ఇప్పుడు ఆ గుప్పిడ విప్పింది. చుట్టూ గుంపులుగా తిరుగుతున్న చిత్రవిచిత్ర భ్రమరకోటులను కోటానుకోట్ల రెట్టుగా వృద్దిపాందించింది. ముల్లోకాలూ తుమ్మెదలే. ఎక్కడచూసినా తుమ్మెదలే. రంగురంగుల తుమ్మెదలు. రకరకాల తుమ్మెదలు. రాగాల తుమ్మెదలు. నాట్యాల తుమ్మెదలు. తుమ్మెదలు. తుమ్మెదలు. అంతటా తుమ్మెదలు. ఆకాశాన్ని ఆవరించిన తుమ్మెదలు. భూగోళాన్ని చీకట్లలో ముంచిన తుమ్మెదలు. గిరిశిఖరాలమీద చెట్టుకొమ్మలమీద అంతటా తుమ్మెదలే, తుమ్మెదలన్నీ ఒక్కపెట్టున ఎగురుకుంటూ వెళ్ళి దైత్యులను ఏరికోరి పీక్కుతిన్నాయి. తేనెతుట్టను కదిలించినవాడిని తేనెటీగలు ముంచెత్తినట్టు. దైత్యుల శస్త్రాలూ అస్త్రాలూ ఎందుకూ కొరగాలేదు. ఒక యుద్దం లేదు. ఒక వాగ్వాదం లేదు. కేవలం మరణమే. ఎక్కడెక్కడ దాగినా వెంటాడి వెంటాడి కుట్టీ చంపాయి. ఎవరు ఎమయ్యారో ఎవరికీ తెలియకుండా మరణించారు. అరుణిడితో సహా అసురులందరూ ఉసురులు కోల్పోయారు. తుమ్మెదలన్నీ తిరిగి వచ్చి జగదంబికను చేరుకున్నాయి. దేవతలు ఆశ్చర్యం ఆశ్చర్యం అని గుండెలు బాదుకున్నారు. ఆశ్యర్యమేముంది, అమ్మవారి మాయ అన్నారు అందరూ చివరికి.

బ్రహ్మాదిదేవతలు ఆనందించారు. పరమేశ్వరిని పునఃపునః స్తుతించారు. షోడశోపచారాలతో అర్చించారు. విలువైన కానుకలు సమర్పించారు. జయజయధ్వనులు చేశారు. దేవలోకంలో దుందుభులు మ్రోగాయి. మునీశ్వరులు వేదనపఠనం చేశారు. అప్పరసలు నృత్యం చేశారు. గంధర్వులు ఆనందగీతికలు ఆలపించారు. మంగళవాద్యాలు మిన్నుముట్టాయి. దేవతలు శిరస్సులు వంచి అంజలి ఘటించారు. జగదీశ్వరి సంతోషించింది. అందరికీ వరాలు కురిపించింది. దేవీభక్తిని అనుగ్రహించింది. అంతర్థానం చెందింది.

నారదా! ఇదీ భ్రామరీవృత్తాంతం. సర్వపాపవినాశకం. సర్వవాంఛాప్రదం. సంసారార్ణవతారకం 
దేవీసాయుజ్యదాయకం - అని నారాయణమహర్షి ముగించాడు.




SRI DEVI BHAGAVATHAM PART 11 - శ్రీ దేవీ భాగవతం ఏకాదశ స్కంధము

శ్రీ దేవీ భాగవతం ఏకాదశ స్కంధము

నారాయణమహర్షీ! ఆశ్చర్యకరమైన దేవీమాహాత్మ్యాన్ని అత్యద్భుతంగా వర్ణించి చెప్పావు. నన్ను
ధన్యుణ్ణి చేశావు. ఇప్పుడింక దేవిని ఆనందింపజేసే ఆచారం గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నాను. ఏయే సదాచారాలను పాటిస్తే అమ్మవారు సంతోషించి కృపాదృష్టి కురిపిస్తుందో తెలియజెయ్యి.
































శ్రీ దేవీ భాగవతం ద్వాదశ స్కంధము




Vaivaswatamanusantati - వైవస్వతమనుసంతతి

శ్రీ దేవీ భాగవతం దశమ స్కంధము - వైవస్వతమనుసంతతి

నారదా! మిగిలిన మనువుల కథలుకూడా చెబుతాను. శ్రద్ధగా ఆలకించు. వీరిని స్మరిస్తే చాలు దేవీభక్తి కుదురుకొంటుంది. వైవస్వతమనువుకి ఆరుగురు కొడుకులున్నారు. కరూషుడు, వృషద్రథుడు, నాభాగుడు, దిష్టుడు, శర్యాతి, త్రిశంకుడు. ఆరుగురూ మహాబలశాలులే. కాళిందీ తీరంలో నిరాహారులై తీవ్రంగా తపస్సు చేశారు. కొంతకాలానికి అంతశ్శుద్ది లభించింది. జగత్తు అంతా ఆత్మలోనే కనపడింది. ఈ దర్శనానికి వారు ఆశ్చర్యచకితులయ్యారు. మరింత నిష్ఠగా తపస్సు కొనసాగించారు. పన్నెండేళ్ళు గడిచాయి. జగదీశ్వరి సాక్షాత్కరించింది. భక్తివినమ్రులై సాగిలి మ్రోక్కారు.

మహేశ్వరి జయేశాని పరమే కరుణాలయే ।
వాగ్భవారాధనప్రీతే వాగ్భవప్రతిపాదితే ॥

క్లీంకారవహే దేవి 
క్లీంకారప్రీతిదాయిని ।
కామరాజమనోమోదదాయినిశ్వరతోషిణి ॥

మహామాయే మోదపరే మహాసామ్రాజ్యదాయిని 

విష్ణ్వర్కహరశక్రాదిస్వరూపే భోగవర్దిని ॥

ఆరుగురు రాకుమారులూ ముక్తకంఠంతో ఆ మహేశ్వరిని స్తుతించారు.ప్రనన్నురాలయ్యింది. రాజపుత్రులారా! మీరు మహాత్ములు, తపస్సులు, నిష్కల్మషులు, అంతశ్శుద్ధిని సాధించివవారు. నన్ను ఉపాసించారు. మనస్సుల్లో ఉన్న కోరికలన్నీ అడగండి. నేను ప్రసన్ననయ్యాను. తీరుస్తాను - అంది. 

మహాదేవీ! నిష్కంటకరాజ్యాన్ని ఇయ్యి. సత్పుత్రులను ప్రసాదించు. దీర్ఘాయుష్మంతుల్ని చెయ్యి. అవ్యాహతంగా భోగభాగ్యాలు అనుభవించేటట్టు యశస్సూ తేజస్సూ సన్మతీ కలిగేట్టు మా ఆరుగురికీ వరం ప్రసాదించు.

జగన్మాత తథాస్తు అంది. మీరు ఆరుగురూ క్రమంగా ఆరు మన్వంతరాలకు అధిపతులవుతారని అదనంగా వరమిచ్చి ఆశీర్వదించి వెళ్ళింది. అలాగే జరిగింది. ఆరుగురూ మహారాజులై భోగభాగ్యాలు అనుభవించి సత్సంతానాన్ని పొంది జన్మాంతరంలో మనువులయ్యారు. మొదటివాడు దక్షసావర్ణిగా తొమ్మిదవ మనువు అయ్యాడు. రెండవవాడు మెరుసావర్ణిగా పదవ మన్వంతరానికీ, మూడవవాడు సూర్యసావర్ణిగా పదకొండవ మన్వంతరానికీ, నాల్గవవాడు చంద్రసావర్ణిగా పన్నెండవ మన్వంతరానికీ, అయిదవవాడు రుద్రసావర్ణిగా పదమూడవ మన్వంతరానికీ, ఆరవవాడు విష్ణుసావర్ణిగా పధ్నాల్లవ మన్వంతరానికీ అధిపతులయ్యారు.

ఈ పదునల్గురు మనువులూ దేవీపాదచింతకులు. పరమపూజ్యులు. లోకవంద్యులు. మహాప్రతాపశాలులు. భ్రామరీదేవి అనుగ్రహానికి నోచుకున్నవారు.

నారాయణమహర్షి నోటినుంచి బ్రామరీదేవి అనే పదం రావడమేమిటి నారదుడు పట్టుకున్నాడు. మహర్షీ! ఎవరు ఈ భ్రామరీదేవి? అవతారగాథ ఎమిటి? దయచేసి వివరించు. అమృతమైనా మొహం మొత్తుతుందేమోగానీ దేవీకథామృతం ఎంతగ్రోలినా తనివితీరడంలేదు. వినిపించు - అని ప్రార్థించాడు. నారాయణ మహర్షి నారదా అంటూ ప్రారంభించాడు.

భ్రామరీదేవి వృత్తాంతం



Revati Nakshatra - రేవతి నక్షత్రము

రేవతి నక్షత్రము నక్షత్రం - రేవతి అధిపతి - బుధుడు గణము - దేవ జాతి - పురుష వృక్షం - విప్ప జంతువు - ఏనుగు నాడి - అంత్య పక్షి - నెమలి అధిదేవత - ...