నారదా! ఇక మంగళచండీ వృత్తాంతం విను. కల్యాణాలూ మంగళాలూ కలిగించడంలో అత్యంత సమర్థ. కనక మంగళచండి అనేపేరు ఏర్పడిందిట. మంగళుడు అర్చించి అభీష్టాలు పాందాడు. అప్పటినుంచీ ఈపేరు వచ్చిందని మరికొందరు. మనువంశంలో పుట్టిన మంగళమహారాజు ఆరాధించి సప్తద్వీపధరాధిపతి అయ్యాడనీ అందుచేత మంగళచండి అయ్యిందనీ ఇంకొందరి కథనం. ఎవరు ఏమి చెప్పినా ఒకటిమాత్ర నిజం - ఆవిడ దుర్గ, మూలప్రకృతి. మూర్తిభేదంతో ఇలా వెలిసింది. కృపారూపిణీ. స్త్రీలకు ఇష్టదేవత.
ఆదిలో శంకరుడు ఈమెను ఉపాసించాడు. త్రిపురాసుర సంహారం చెయ్యబోతూ బ్రహ్మదేవుడి ఉపదేశం మేరకు మంగళచండీపూజ నిర్వర్తించాడు. రణరంగంలో ఆ రాక్షసుడు వేసిన శస్త్రాస్త్రాల ధాటికి నిలబడలేక శివుడి రథం ఆకాశంనుంచి నేలకు కూలిపోబోతోంటే - మంగళచండి ప్రత్యక్షమై అభయమిచ్చింది. నువ్వు వృషవాహనుడివి. సర్వేశుడవు. నేను యుద్ధ శక్తి స్వరూపను. నీవెంట ఊన్నాను. అధైర్యపడకు, శత్రువును సంహరించు - అని ప్రోత్సహించి అంతర్థానం చెందింది. శంకరుడు పుంజుకున్నాడు. విష్ణుమూర్తి అందించిన బాణంతో త్రిపురాసుర సంహారం దిగ్విజయంగా నిర్వహించాడు. దేవతలు పుష్పవృష్టి కురిపించారు. మనువులూ మానవులూ ఋషులూ మునులూ స్తుతించారు. శంకరుడు భక్తినమ్రుడయ్యాడు. బ్రహ్మవిష్ణువులు ఆశీర్వదించి వెళ్ళారు. అప్పుడు వెంటనే శంభుడు సుస్నాతుడై ధౌతవస్త్రాలు ధరించి వచ్చి మంగళచండీ పూజను శ్రద్ధాభక్తులతో నిర్వహించాడు. మంగళకలశం పెట్టి అమ్మవారిని ఆవాహన చేశాడు. వివిధ పూజాద్రవ్యాలతో నైవేద్యాలతో జంతుబలులతో షోడశోపచారాలతో నృత్యగీతాదులతో మంత్ర ధ్యాన స్తోత్రాలతో మహోత్సవంగా మహోన్నతంగా మహోద్దృతంగా పూజలు చేశాడు.
“ఓం హ్రీం శ్రీం క్లీం సర్వపూజ్యే దేవి మంగళచండికే హూం హూం ఫట్ స్వాహా” అనేది ఏకవింశాక్షర మహామూలమంత్రం. ఇది భక్త కల్పద్రుమం. పదిలక్షలు జపిస్తే మంత్రసిద్ధి అవుతుంది. ఇక ధ్యానశ్లోకాలు-
దేవీం షోడశవర్షీయాం శశ్వత్ సుస్థిరయౌవనామ్ ।
బింబోష్ఠీం సుదతీం శుద్దాం శరత్పద్మనిభాననామ్ ॥
శ్వేతచంపకవర్ణాభాం సునిలోత్పలలోచనామ్ ।
జగద్దాత్రీం చ దాత్రీం చ సర్వేభ్యస్సర్వసంపదామ్ ॥
సంసారసాగరే ఘోరే జ్యోతీరూపాం సదా భజే ॥
ఇవి పఠించి మూలమంత్రంతో పూజచెయ్యాలి. శంకరుడు చేసిన స్తోత్రం - సర్వవేద సమ్మతం. యథాతథంగా గ్రహించు.
రక్ష రక్ష జగన్మాతర్ధేవి మంగళచండికే ।
హారికే విపదాం రాశేః హర్షమంగళకారికే ॥
హర్షమంగళదక్షే చ హర్షమంగళదాయికే ।
శుభే మంగళదక్షే చ శుభే మంగళచండికే ॥
మంగళే మంగళార్హే చ సర్వమంగళమంగళే ।
సతాం మంగళే దేవి సర్వేషాం మంగళాలయే ॥
పూజ్యే మంగళవారే చ మంగళాభీష్టదేవతే ।
పూజ్యే మంగళభూపస్య మనువంశస్య సంతతమ్ ॥
మంగళాధిష్ఠాతృదేవి మంగళానాం చ మంగళే ।
సంసార మంగళాధారే మోక్షమంగళదాయిని ॥
సారే చ మంగళాధారే సారే చ సర్వకర్మణామ్ ।
ప్రతిమంగళవారే చ పూజ్యే మంగళసుఖప్రదే ॥
అటుపైని ప్రతి మంగళవారంనాడూ ఈ మంగళచండికా పూజ చేస్తూ శంకరుడు తన భక్తి ప్రపత్తులను చాటుకుంటున్నాడు. మొదటిపూజ శివుడు చేశాడు. రెండవపూజ మంగళుడు (అంగారకగ్రహం). మూడవపూజ మంగళమహారాజు. నాల్గవ పూజ ప్రతిమంగళవారమూ దేవతాస్త్రీలు ఆందిస్తున్నారు. అటుపైని మానవకాంతలందరూ చేస్తున్నారు.
ఈ మంగళచండికా స్తోత్రాన్ని విన్నా చదివినా సకల శుభాలూ కలుగుతాయి. పుత్రపౌత్రాభివృద్దిగా కుటుంబం మంగళప్రదంగా కళకళలాడుతుంది.
No comments:
Post a Comment